అనుష్క శర్మకు అరుదైన గౌరవం మాట్లాడే విగ్రహం ఉన్న ఏకైక సెలబ్రిటీ…
Category : Movie News Sliders
ముంబయి: బాలీవుడ్ నటి అనుష్క శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో అనుష్క మైనవు విగ్రహం రాబోతోంది. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీల మైనపు విగ్రహాలు వచ్చాయి. కానీ అనుష్క విగ్రహాన్ని మాత్రం ప్రత్యేకంగా రూపొందించబోతున్నారు. సాధారణంగా సెలబ్రిటీల మైనపు విగ్రహాలు రూపొందించి వాటిని మ్యూజియంలో ఒక చోట పెడతారు. ఆ విగ్రహాలతో వీక్షకులు కేవలం వాటి పక్కన నిలబడి సెల్ఫీలు మాత్రమే తీసుకోగలుగుతారు.
కానీ అనుష్క మైనపు విగ్రహంతో అభిమానులు మాట్లాడొచ్చు కూడా. ఇంటరాక్టివ్ ఫిగరిన్ పేరిట ఈ మైనపు విగ్రహాన్ని రూపొందించనున్నారు. సింగపూర్ మ్యూజియంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు ఓప్రా విన్ఫ్రే, క్రిస్టియానో రొనాల్డో, లెవిస్ హామిల్టన్‌ల మైనపు విగ్రహాలు ఉన్నాయి. కానీ అనుష్క మైనపు విగ్రహానికి ఓ ఫోను కూడా ఏర్పాటుచేస్తారు. వీక్షకులు సెల్ఫీ తీసుకోవడంతో పాటు దానికి ఏర్పాటుచేసి ఉన్న ఫోన్‌ను పట్టుకుంటే.. అనుష్క మైనపు బొమ్మ వారిని పలకరిస్తుంది. సింగపూర్ మ్యూజియంలో ఇలాంటి విభిన్నమైన మైనపు బొమ్మను సొంతం చేసుకోబోతున్న ఏకైక సెల్రబిటీ అనుష్క శర్మనే కావడం విశేషం.
మ్యూజియంకు వస్తున్న పర్యటకులలో చాలా మంది తమ అభిమాన తార అనుష్క శర్మ మైనపు బొమ్మ కావాలని అడుగుతున్నట్లు మ్యూజియం మేనేజర్ అలెక్స్ వార్డ్ వెల్లడించారు. మైనపు బొమ్మ కోసం అనుష్కతో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల అనుష్క భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని దిల్లీ మ్యూజియం రూపొందించింది. కానీ ప్రదర్శనలో ఉంచిన రెండో రోజే విగ్రహం స్వల్పంగా విరిగిపోయింది. ఆ తర్వాత మళ్లీ దానిని బాగుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.