రోజుకు 24 ఇడ్లీలు.. 2 లీటర్ల బాదం పాలు, 40 బజ్జీలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకే..
Category : Behind the Scenes Celebrity Movie News Sliders
తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకొని, ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇక శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పౌరాణిక పాత్రల పోషణతో ఆయన్ని నిజంగా దైవంగా భావించేవారు ఎందరో. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత రెండు షిఫ్టులు మాత్రమే వర్క్ చేసేవారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక సినిమాకి, రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మరో సినిమాకు ఆయన పనిచేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకూ ఒకే సినిమాకు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. అవసరం అనుకుంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా వర్క్ చేసేవారు.
అయితే భోజన ప్రియుడైన ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి వింటుంటే తమాషాగా అనిపిస్తుంది. నిత్యం తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేచే ఆయన యోగాసనాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, బ్రేక్ ఫాస్ట్ చేసే వారు. రోజూ 24 ఇడ్లీలు అవలీలగా తినేవారట. అలాగని అవేమీ చిన్న సైటు ఇడ్లీలు కావు. అరచేతి మందాన ఉండేవట. కొంత కాలం తర్వాత ఇడ్లీలు తినడం మానేసి పొద్దునే భోజనం చేసేవారు. అయితే రోజూ నాన్ వెజ్ ఐటెం ఏదొకటి ఆయన భోజనంలో ఉండాల్సిందే. ఆరు గంటల కల్లా మేకప్ వేసుకుని రెడీగా ఉండేవారు. నిర్మాత వచ్చి ఆయన్ని షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లేవారు. చెన్నైలో ఉంటే తప్పనిసరిగా భోజనానికి ఇంటికే వెళ్లేవారు. అరగంటలో లంచ్ పూర్తి చేసుకుని, రెండు గంటలకు మరో షూటింగ్‌కు అటెండ్ అయ్యేవారు. షాట్ గ్యాప్‌లో ఆపిల్ జ్యూస్ తాగడం ఎన్టీఆర్‌కు అలవాటు. రోజుకు నాలుగైదు బాటిల్స్ తాగేవారు. ఇక ఈవెనింగ్ స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్స్ కానీ, మిరపకాయ బజ్జీలు కానీ ఉండాల్సిందే. ఆయన ఒక్కసారే 30-40 బజ్జీలు తింటుంటే మిగిలిన వాళ్లంతా అలా నోళ్లు తెరుచుకుని చూస్తుండేవారట.
మద్రాసు మౌంట్ రోడ్లో బాంబే హల్వా హౌస్ అనే షాప్ ఉండేది. అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకురమ్మనేవారు ఎన్టీఆర్. దాంతో పాటు రెండు లీటర్ల బాదం పాలు కూడా తెమ్మనేవారు. ఇంత పెద్ద డబ్బాలో తీసుకువస్తే వాటిని తినేసి 2 లీటర్ల బాదం పాలు తాగేవారటర. ఎంత తిన్నా హరాయించుకునే శరీరం కావడంతో ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎదుటివారికి వింతగా అనిపించేవి. ఇక సమ్మర్ వస్తే చాలు మధ్యాహ్నం లంచ్‌కు వెళ్లేవారు కాదు ఎన్టీఆర్. మామిడి పళ్ల జ్యూస్ మాత్రం తాగి సరిపెట్టుకునేవారు. టీ నగర్లో మామిడి పళ్లు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆయనే చెప్పేవారు. రెండు డజన్ల మామిడి పళ్లు తెప్పించేవారట నిర్మాత. తన అసిస్టెంట్‌తో ఆ మామిడి పళ్లు రసం తీయించి, అందులో గ్లూకోజు పౌడర్ కలుపుకొని జ్యూస్ మొత్తం తాగేసేవారు. వేసవిలో ఇదే ఆయనకు లంచ్. మధ్యలో కొంత కాలం కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం, వెల్లుల్లి కలిపి బాగా దంచి, ముద్దగా చేసి వెండి బాక్స్‌లో ఇంటి నుంచి ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పంపేవారు. షాట్ గ్యాప్‌లో ఆ ముద్ద తినేవారు ఎన్టీఆర్. ఇలా తన సినిమాలతోనే కాదు తన ఆహారపు అలవాట్లతోనూ ఎదుటివారిని ఆకట్టుకునేవారట నందమూరి తారక రామారావు.