రాముడిగా ప్రభాస్‌.. ‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌‌లుక్‌ వచ్చేసింది

రాముడిగా ప్రభాస్‌.. ‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌‌లుక్‌ వచ్చేసింది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. ఇందులో ప్రభాస్‌ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ‘‘మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం.. అయోధ్యలోని సరయు నది ఒడ్డున జరగనున్న ‘ఆదిపురుష్‌’ టీజర్‌ లాంచ్‌లో పాల్గొనండి. అక్టోబర్‌ 2న రాత్రి 7.11 గంటలకు టీజర్‌ విడుదల చేయనున్నాం’’ అని ఔంరౌత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌గా మారింది.

రామాయణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ మెరవనున్నారు. లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ కనిపించనున్నారు. రామాయణంలో ముఖ్యంగా చెప్పుకొనే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.