ఆర్నెల్లకోసారి రంగులు మార్చే వినాయకుడు.. ఇదొక అద్భుతమైన ఆలయం

ఆర్నెల్లకోసారి రంగులు మార్చే వినాయకుడు.. ఇదొక అద్భుతమైన ఆలయం

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా… ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఆలయ ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది. ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో..ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే గణేశుడి ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని పిలుస్తారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడులో పరిధిలోకి వచ్చింది. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజుల్లో ‘కేరళపురం’ రాజు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ బయలుదేరారు. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం సముద్ర కెరటాల్లో తడుస్తూ కనిపించింది. రాజు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుకి అప్పగించబోతే దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మమని అని భావించి రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు.

అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి ఈ గణపతి మాత్రం మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది నమ్మకం.

Telugu BOX Office:
Related Post
whatsapp
line