రాఘవేంద్రుడు బృందావనస్థులైన క్షేత్రం.. మంత్రాలయం

రాఘవేంద్రుడు బృందావనస్థులైన క్షేత్రం.. మంత్రాలయం

భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు.

స్థల పురాణం..
మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచే ప్రాంతం ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉండిపోవాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు.

అప్పటి నుంచి రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు నిత్యం మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని… అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొనడం ఆనవాయితీగా వస్తోంది.

వెంటకనాథుడే.. రాఘవేంద్రుడయ్యాడు

తమిళనాడులోని భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు 1595లో వెంకటనాథుడు(రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు) జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సంసారం జీవితం వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.

అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.

దర్శన వేళలు
రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.

భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.