Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. పసుపులో కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనల్ని అనేక రకాల వైరస్‌ల నుంచి కాపాడుతాయి. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపు అతిగా తీసుకుంటే శరీరానికి హాని కూడా చేస్తుంది. పసుపును ఎలాంటి వ్యక్తులు తినకూడదో, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం…
చర్మ సమస్యలు
పరిమితికి మించి పసుపును తీసుకుంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతాయి. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. పసుపు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పరిమిత పరిమాణంలో ఉపయోగించడమే ఉత్తమం. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి.
ఉదర సమస్యలు
వాస్తవానికి పసుపుని వేడిగా పరిగణిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఇది కడుపులో మంటతో పాటు విరేచనాలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు కడుపులో వాపు లేదా తిమ్మిరి సంభవిస్తుంది. కాబట్టి పసుపును ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలి. అలాగే కామెర్లు వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు పొరపాటున కూడా పసుపు తినకూడదు. ఒకవేళ తింటే కామెర్లు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
కిడ్నీ సమస్యలున్న వారు కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి పసుపు వాడకం మంచిది కాదు. పసుపులో ఉండే మూలకాలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా పసుపు తీసుకోవడం మంచిది కాదు.
ముక్కు నుంచి రక్తం వచ్చేవారికి
ముక్కు నుంచి రక్తం కారడం సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కావడాన్ని అధికంగా చేస్తుంది. అందుకే పరిమిత పరిమాణంలో పసుపును ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించండి. అతి వాడకం అన్నింట్లోనూ ప్రమాదకరమే.
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’గా గర్జించిన బాలయ్య…. అల్లు ఫ్యామిలీకి చెందిన ప్రముఖ ఓటీటీ సంస్థ aha కోసం హోస్ట్‌గా మారి ‘అన్ స్టాపబుల్’ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. గెస్ట్‌లుగా వచ్చిన స్టార్స్‌తో బాలయ్య తనదైన స్టైల్‌లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది.
ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్న హాజరుకాగా.. ఆ తర్వాత నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, సుకుమార్- రష్మిక మందన్న- అల్లు అర్జున్, రవితేజ- గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరై ఆకట్టుకున్నారు.
అసలు విషయానికొస్తే ‘అన్ స్టాపబుల్’ షో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో 9.7 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ 7.8 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తానికి 2021లో ‘అఖండ’తో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన నందమూరి నటసింహం.. ఓటీటీలో తన సత్తా చాటాడు.
తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకొని, ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇక శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పౌరాణిక పాత్రల పోషణతో ఆయన్ని నిజంగా దైవంగా భావించేవారు ఎందరో. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత రెండు షిఫ్టులు మాత్రమే వర్క్ చేసేవారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక సినిమాకి, రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మరో సినిమాకు ఆయన పనిచేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకూ ఒకే సినిమాకు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. అవసరం అనుకుంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా వర్క్ చేసేవారు.
అయితే భోజన ప్రియుడైన ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి వింటుంటే తమాషాగా అనిపిస్తుంది. నిత్యం తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేచే ఆయన యోగాసనాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, బ్రేక్ ఫాస్ట్ చేసే వారు. రోజూ 24 ఇడ్లీలు అవలీలగా తినేవారట. అలాగని అవేమీ చిన్న సైటు ఇడ్లీలు కావు. అరచేతి మందాన ఉండేవట. కొంత కాలం తర్వాత ఇడ్లీలు తినడం మానేసి పొద్దునే భోజనం చేసేవారు. అయితే రోజూ నాన్ వెజ్ ఐటెం ఏదొకటి ఆయన భోజనంలో ఉండాల్సిందే. ఆరు గంటల కల్లా మేకప్ వేసుకుని రెడీగా ఉండేవారు. నిర్మాత వచ్చి ఆయన్ని షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లేవారు. చెన్నైలో ఉంటే తప్పనిసరిగా భోజనానికి ఇంటికే వెళ్లేవారు. అరగంటలో లంచ్ పూర్తి చేసుకుని, రెండు గంటలకు మరో షూటింగ్‌కు అటెండ్ అయ్యేవారు. షాట్ గ్యాప్‌లో ఆపిల్ జ్యూస్ తాగడం ఎన్టీఆర్‌కు అలవాటు. రోజుకు నాలుగైదు బాటిల్స్ తాగేవారు. ఇక ఈవెనింగ్ స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్స్ కానీ, మిరపకాయ బజ్జీలు కానీ ఉండాల్సిందే. ఆయన ఒక్కసారే 30-40 బజ్జీలు తింటుంటే మిగిలిన వాళ్లంతా అలా నోళ్లు తెరుచుకుని చూస్తుండేవారట.
మద్రాసు మౌంట్ రోడ్‌లో బాంబే హల్వా హౌస్ అనే షాప్ ఉండేది. అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకురమ్మనేవారు ఎన్టీఆర్. దాంతో పాటు రెండు లీటర్ల బాదం పాలు కూడా తెమ్మనేవారు. ఇంత పెద్ద డబ్బాలో తీసుకువస్తే వాటిని తినేసి 2 లీటర్ల బాదం పాలు తాగేవారటర. ఎంత తిన్నా హరాయించుకునే శరీరం కావడంతో ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎదుటివారికి వింతగా అనిపించేవి. ఇక సమ్మర్ వస్తే చాలు మధ్యాహ్నం లంచ్‌కు వెళ్లేవారు కాదు ఎన్టీఆర్. మామిడి పళ్ల జ్యూస్ మాత్రం తాగి సరిపెట్టుకునేవారు. టీ నగర్‌లో మామిడి పళ్లు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆయనే చెప్పేవారు. రెండు డజన్ల మామిడి పళ్లు తెప్పించేవారట నిర్మాత. తన అసిస్టెంట్‌తో ఆ మామిడి పళ్లు రసం తీయించి, అందులో గ్లూకోజు పౌడర్ కలుపుకొని జ్యూస్ మొత్తం తాగేసేవారు. వేసవిలో ఇదే ఆయనకు లంచ్. మధ్యలో కొంత కాలం కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం, వెల్లుల్లి కలిపి బాగా దంచి, ముద్దగా చేసి వెండి బాక్స్‌లో ఇంటి నుంచి ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పంపేవారు. షాట్ గ్యాప్‌లో ఆ ముద్ద తినేవారు ఎన్టీఆర్. ఇలా తన సినిమాలతోనే కాదు తన ఆహారపు అలవాట్లతోనూ ఎదుటివారిని ఆకట్టుకునేవారట నందమూరి తారక రామారావు.
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ‘స్కైలాబ్’. 1979లో అంతరిక్ష పరిశోధనా శాల నుంచి ‘స్కైలాబ్’ భూమిపై పడనుందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ కామెడీ సినిమా తెరకెక్కింది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ సొంత నిర్మాణ సంస్థ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇప్పుడీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయింది. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా ‘స్కైలాబ్’ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆ మేరకు సోనీ లివ్ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించారు. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్‌లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా భక్తులే. అయితే ఓ దేశం లో.. కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. ఈ దేవాలయం ఎక్కడ ఉందొ.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
యూరప్ ఖండంలోని ఐర్లాండ్ దేశంలో ఈ శివాలయం ఉంది. అయితే.. ఈ శివాలయం ఇక్కడకు ఎప్పుడు.. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ లింగోద్భవం ఇప్పటికీ అంతు తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. ఓ కొండపై ఈ శివలింగం ఉంది. చుట్టూ ఇటుకలు గుండ్రని ఆకారంలో పేర్చబడి ఉన్నాయి. లియా ఫాయిల్‌గా పిలవబడే లింగాన్ని అక్కడి వారు పరమ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతి పురాతన లింగంగా వెలుగొందుతున్న ఈ విగ్రహాన్ని క్రైస్తవులు పునరుత్పత్తికి చిహ్నంగా భావిస్తూ కొలుస్తున్నారు.
ఈ లింగం గురించి ” మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్” అనే గ్రంధం లో కూడా చెప్పబడి ఉంది. అక్కడి చారిత్రాత్మక కధనం ప్రకారం.. క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య కాలం లో త్వాతా డి డానన్ అను వ్యక్తి తీసుకొచ్చాడని ప్రతీతి. త్వాతా డి డానన్ అనే వ్యక్తిని డాను అనే దేవత యొక్క కొడుకుగా అక్కడివారు చెప్పుకుంటారు. ఈ దేవత గురించిన ప్రస్తావన మన గ్రంధాలలో కూడా ఉంటుంది. కశ్యప ముని, అతని భార్య దక్షలకు జన్మించిన కూతురే డాను అని చెప్తుంటారు. డాను అంటే జలానికి అధిపతి అని అర్ధమట. అలా లియో ఫాయిల్స్ లోని శివలింగానికి , భారతీయ వేద సంస్కృతిలో వర్ణించబడ్డ శివుడికి సంబంధం ఉన్నదని అక్కడి కధనం. వారి భాషలో లియా ఫెల్ అంటే అదృష్ట శిల అని అర్ధమట. ఈ రాయిని నాశనం చేయాలనీ ఎన్నోసార్లు ప్రయత్నించినా ఎవరితరం కాలేదట. 2012, 2014 లోను కూడా ఈ లింగంపై దాడి జరిగిందట. ఈ లింగాన్ని కాపాడాలంటూ స్థానికులు ఐర్లాండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయయాన్ని నమోదు చేసుకుంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం అన్ని భాషల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ వరుస పెట్టి వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేసిన కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను మౌనిక యాదవ్ అనే ఫోక్ సింగర్ అద్భుతంగా ఆలపించారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. బాలయ్య కెరీర్‌లోనూ 100కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
అయితే ముందు ఈ సినిమాను జనవరి 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని జనవరి 21న విడుదల చేయనున్నట్లు తెలిపింది డిస్నీ హాట్‌స్టార్. అఖండ తెలుగు సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందంటూ బాలయ్య అభిమాని ఒకరు ట్వీట్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లై ఇస్తూ అసలు విషయం చెప్పింది. 21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా నిర్థారించారు. ‘‘నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి నాతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి’’ అని మహేష్ బాబు పేర్కొన్నారు.
చివరిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే RRR సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కోసం రాజమౌళి… మహేష్ బాబు సహా సినిమా టీం మొత్తాన్ని సంప్రదించడంతో ఈ సినిమాని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. దీంతో కాస్త సమయం దొరకడంతో మహేష్ బాబు చాలా కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న క్రమంలో దానికి సర్జరీ చేయించుకున్నారు. కాలు నొప్పి తో బాధపడుతున్న ఆయన స్పెయిన్లో సర్జరీ చేయించుకుని దుబాయ్ లో తన వదిన ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కోసం కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. కొంత కాలం పాటు దుబాయ్ లోనే ఉండి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అక్కడే జరుపుకున్న మహేష్ బాబు కుటుంబం తాజాగా హైదరాబాద్ కు వచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తొస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన దండకారణ్యంలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఎక్కువే. బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం విశేషం.
దేశంలో ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నప్పటికీ దట్టమైన అడవుల్లో ఈ వినాయకుడి విగ్రహం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తుంటుంది. కొండ శిఖరాగ్రంలో డోలు లాంటి ప్రదేశంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ వినాయకుడిని దోల్‌కల్ గణేశ్ అని పిలుస్తుంటారు. ఈ విగ్రహం 1100 ఏళ్ల క్రితం నాటిది కావడం విశేషం. నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ. దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ.. దట్టమైన అడవిలో ఉన్న కారణంగా ఆ విగ్రహం గురించి ఇటీవలి వరకూ బయటి ప్రపంచానికి తెలియలేదు.
2012లో స్థానిక జర్నలిస్టు ఒకు దోల్‌కల్ కొండ ఎక్కగా శిఖరాగ్రాన ఆరు అడుగులు ఎత్తైన వినాయకుడి విగ్రహం దర్శనం ఇచ్చింది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి చేరడం అంత తేలికేం కాదు. ముందుగా దంతెవాడ చేరుకొని అక్కడికి 20 కి.మీ. దూరంలో ఉన్న మిడ్‌కుల్నర్ అనే చిన్న గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి 5-7 కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్తే గానీ ఈ ప్రదేశానికి చేరుకోలేం. ఇప్పుడు మావోయిస్టుల సమస్య కొద్దిగా తగ్గింది గానీ.. గతంలో ఇక్కడ మావోల ప్రాబల్యం ఎక్కవగా ఉండేది. గతంలో ఈ విగ్రహం కొండ మీది నుంచి కిందకు పడి ముక్కలైంది. వినాయకుడి విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో.. ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇవన్నీ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయనే ఉద్దేశంతో మావోయిస్టులే ఈ విగ్రహాన్ని కొండ మీద నుంచి కిందకు తోసేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.
కొండ మీద విగ్రహం కనిపించడం లేదని ప్రచారం జరగడంతో ఇది చోరీకి గురైందని భావించారు. కొందరు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి విగ్రహం వెతుకులాట ప్రారంభించారు. కొండ కింది ప్రాంతంలో ఈ విగ్రహం ముక్కలు లభ్యమయ్యాయి. దీంతో దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్, కలెక్టర్ సౌరభ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. తర్వాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.
ఏకదంతుడైంది ఇక్కడేనట.. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో విరిగిన దంతం. కిందిభాగం కుడిచేతిలో రుద్రాక్ష మాల, మరో చేతిలో మోదకాలతో దర్శనమిస్తాడు డోల్‌కాల్ గణేశుడు. ఆయుధధారుడై ఉండడం దోల్‌కాల్ గణేశుడి ప్రత్యేకత. అక్కడ గణపయ్య లలితాసనంలో కనిపిస్తారు. బస్తర్‌లో తప్ప మరెక్కడా ఆయన ఆ భంగిమలో ఉండరు. బస్తర్ ప్రత్యేక నిపుణులు హేమంత్ కశ్యప్ ప్రకారం.. ఈ డోల్‌కాల్ శిఖరంపైనే వినాయకుడు-పరుశరామ్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే గణేశుడి దంతం విరిగింది. అప్పటి నుంచే ఆయనను ఏకదంతుడిగా పిలుస్తున్నారు. ఆ ఘటనకు గుర్తుగా చిండక్ నాగవంశానికి చెందిన రాజు గణేశ్ విగ్రహమూర్తిని అక్కడ ప్రతిష్ఠించారట..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటంతో ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రార్ధనాలయాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ చారిత్రక నగరంలో అనేక హిందూ దేవాలయాలూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని కొన్ని ముఖ్య దేవాలయాల సమాచారం మీకోసం…
బిర్లా మందిర్ హైదరాబాద్ పర్యాటకంలో ప్రముఖంగా చూడదగ్గ ఆలయాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. పదేళ్ల పాటు కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది.
ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ లో ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయం నిర్మించబడడంతో దీనిని బిర్లా మందిర్ అని పిలుస్తారు. బిర్లా మందిర్ పేరుతో దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో వీరు ఆలయాలను నిర్మించారు.
సంఘీ టెంపుల్ హైదరాబాద్‌లో సందర్శించాల్సిన మరో అద్భుతమైన ఆలయం సంఘీ టెంపుల్. ఇది హైదరాబాద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఉంది. ఈ దేవాలయ పవిత్ర రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీవెంకటేశ్వర స్వామి. ఇక్కడి వెంకన్న విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతిరూపమని ప్రతీతి. ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అనేక చిన్న ఆలయాలు కొలువై ఉన్నాయి. పరమానందగిరి కొండపై ఉన్న సంఘీ ఆలయాల సమూహం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ ఆలయానికి వెళ్లడానికి కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. సంఘీ టెంపుల్‌కు సమీపంలోనే ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ఉంది.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేక పాహిమాం.. అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే ఇప్పటి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం.
చిలుకూరు బాలాజీ ఆలయం
హైదరాబాద్‌కు 23 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం ఉంది. అక్కడే కొలువై ఉన్నాడు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. ఆయన్ని అందరూ చిలుకూరు బాలాజీ అని పిలుస్తుంటారు. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. వారాంతాల్లో అయితే ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. విదేశాలకు వెళ్లేవారు చాలామంది వీసా కోసం చిలుకూరు బాలాజీకి మొక్కులు కడుతుంటారు. అందుకే ఆయన్ని ముద్దుగా వీసా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ముందుగా కోరికను మొక్కు కొని 11 ప్రదిక్షణలు చేస్తారు. ఆ కోరిక తీరిన తరువాత 108 సార్లు ప్రదిక్షణలు చేస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఎక్కడా హుండీ అనేది ఉండదు. అంతేకాకుండా స్వామివారి దర్శనానికి ధనిక, పేద అధికార తారతమ్యాలు ఉండవు. అందరు ఒకేవరుసలో నిలబడి దర్శనం చేసుకోవాలి.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ సమీపంలోని బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం కొలువై ఉంది. ఇక్కడి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే అమ్మగా భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది. మంత్ర శాస్రంలో ప్రధానమైన దశమహావిద్యలలో చిన్న మస్తాదేవి ఒకరు. ఆ చిన్నమస్తదేవియే పరశురాముని తల్లి రేణుకాదేవిగా అవతరించింది. ఆ రేణుకాదేవియే నేడు కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతుంది. ఇలా అమ్మవారి రూపాలలో బాలా త్రిపురసుందరి దేవి ఒకరు. ఆ తల్లిని భక్తులు బాలా, బాలాంబిక, బాలాకాంబిక అని పిలుస్తుండేవారు. ఆ బాలికాంబీయే బల్కమ్మగా, ఆ అమ్మ కొలువై ఉన్న ప్రాంతం బల్కమ్మ పేటగా పిలవబడుతూ అది నేటి బల్కంపేటగా మారిందని పూర్వీకులు చెబుతుంటారు.
ఈ ఎల్లమ్మ దేవత బావిలో భూమి ఉపరితలం నుండి సుమారు 10 అడుగుల దిగువన శయనరూపంలో తూర్పుములాగా చూస్తూ స్వయం భూమూర్తిగా భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. అమ్మవారి స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంది. ఈ బావి నుండి ఉధ్భవించే జల ఊట నిరంతరం ఉధ్భవించడం ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణము, ప్రతి ఆషాడమాసం చివరి ఆదివారం నాడు బోనాలు మరియు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడుతాయి. ఎల్లమ్మను దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆదివారం రోజు ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది.
కీసరగుట్ట ఆలయం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలో కీసరగుట్ట అనే కొండపై నెలకొని ఉంది శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది అతిపురాతనమై శైవక్షేత్రం. ఆలయంలోనే కాకుండా వెలుపల కొండపై అనేక శివలింగాలు దర్శనమీయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. కీసరగుట్టపై ప్రతిష్ఠించేందుకు శివలింగాన్ని తీసుకురావాలని శ్రీరాముడు తన భక్తుడైన హనుమంతుడికి చెబుతాడు. అయితే ఆంజనేయుడు ముహూర్త సమయానికి రాకపోవడంతో రాముడు మరొక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు. అయితే తాను తెచ్చిన లింగాన్ని కాకుండా వేరేది ప్రతిష్ఠించడంతో హనుమంతుడు అలుగుతాడు. దీంతో రాముడు.. హనుమంతుడిని బుజ్జగిస్తూ ఈ క్షేత్రం భవిష్యత్తులో కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదిస్తాడు. అనంతరం హనుమంతుడు తెచ్చిన లింగాల్లో ఒక దాన్ని స్వామివారి వామ భాగంలో ప్రతిష్ఠించాడు. అదే శ్రీ మారుతీ కాశీ విశ్వేశ్వర లింగమని భక్తులు చెబుతుంటారు. ఈ శైవక్షేత్రం హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కీసరగుట్టకు బస్సు సౌకర్యం కలదు.
అష్టలక్షి ఆలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో కొత్తపేటలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఈ ఆలయం కోఠి నుంచి 8 కి.మీ, సికింద్రాబాద్ నుంచి 14కి.మీ.ల దూరంలో ఉంది. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దాని చుట్టూ మరో ఏడు గర్భాలయాలు ఉన్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ, వరద ముద్రలో దివ్యాలంకార శోభితులై భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంకా మిగతా ఏడు గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధ్యానలక్ష్మి, శ్రీవిజయలక్ష్మి, శ్రీవీరలక్ష్మి, శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వలన స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని, అష్టైశ్వర్యాలు సిద్డస్తాయని శాస్త్ర వచనం.
పూరీ జగన్నాథ్ ఆలయం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పూరీ జగన్నాథ ఆలయం ఉంది. ఈ దేవాలయం దేశంలోని ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయాన్ని పోలి ఉండటం విశేషం. అక్కడికి వెళ్తే నిజంగానే పూరీకి వచ్చామా అన్న భావన కలుగుతుంది. ఈ ఆలయంలో బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. నగర ప్రజలతో పాటు పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శించే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.
దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న సాయిబాబా ఆలయం భక్తులను ఆకర్షిస్తుంటుంది. షిర్డీలోని బాబా ఆలయాన్ని పోలి ఉండేలా ఇక్కడ నిర్మించడం విశేషం. అందుకే దీన్ని దక్షిణ షిర్డీగా పిలుస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నప్పటికీ ఈ గుడిని భక్తులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం వరకు చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు వేలాది మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా మారిపోయింది.