Category Archives: Behind the Scenes

‘శ్యామ్ సింగరాయ్’ రివ్యూ

టైటిల్‌ : శ్యామ్‌ సింగరాయ్‌
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్ర,జిస్సు సేన్ గుప్తా, అభినవ్‌ గౌతమ్‌,మురళీశర్మ తదితరులు
నిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
రచన : జంగా సత్యదేవ్ 
దర్శకత్వం : రాహుల్‌ సాంకృత్యన్‌
సంగీతం : మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ : సను జాన్ వర్గేసే
ఎడిటర్‌ : నవీన్‌ నూలి
విడుదల తేది : డిసెంబర్‌ 24,2021

సినిమా ఫలితాలను పట్టించుకోకుండా.. ఎప్పటికప్పుడు కొత్త జానర్స్‌ని ట్రై చేస్తుంటాడు నేచురల్‌ స్టార్‌ నాని. ఓటీటీలో విడుదలైన ‘వి’, ‘టక్ జగదీష్’ చిత్రాలు నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైన హిట్‌ కొట్టాలనే కసితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’గా దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్‌ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

ఘంటా వాసుదేవ్ (నానీ) మంచి అభిరుచి కలిగిన ఫిల్మ్ మేకర్. ముందుగా ఓ మంచి షార్ట్ ఫిల్మ్ తీసి.. ఆపై సినిమా ఛాన్సులు అందుకొవాలనే దృఢ నిశ్చయంతో షార్ట్ ఫిల్మ్ కోసం ఆడిషన్స్ మొదలు పెడతాడు. కానీ తన కథకు తగ్గ అమ్మాయి ఎవరూ దొరకరు. అయితే ఒక కాఫీ షాప్ లో చూసిన శ్రుతి (కృతి శెట్టి) అనే అందమైన అమ్మాయిని తన షార్ట్ ఫిల్మ్ కు హీరోయిన్ అని ఫిక్స్ అయిపోతాడు. దీనికి ఎంత మాత్రం అంగీకరించని ఆ అమ్మాయి చేత ఎలాగైతేనేం ఓకే అనిపించుకొని ఆమెతో షార్ట్ ఫిల్మ్ తీస్తాడు. దానికి మంచి పేరు రావడంతో వాసుదేవ్ రాసిన ఆ కథను సినిమాగా తీయడానికి ముందుకొస్తాడు ఒక ప్రొడ్యూసర్. ‘ఊనికి’ పేరుతో విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. దాంతో ఆ సినిమాకు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి వాసుదేవ్ కి ఆఫర్ వస్తుంది. ఆ సినిమా అనౌన్స్ మెంట్ రోజున వాసుదేవ్‌ను పోలీసులు కాపీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు.

వాసుదేవ్ ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం ‘శ్యామ్ సింగరాయ్’ అనే బెంగాలి రచయిత రాసిన కథను మక్కికి మక్కీ కాపీ కొట్టి దాన్నే సినిమాగా తీశాడని ‘శ్యామ్ సింగరాయ్’ వారసులు అతడి మీద కేసు పెడతారు. కానీ వాసుదేవ్ తనకి బెంగాలీ రాదని, ఈ కథను తన సొంత ఆలోచనలతోనే రాసుకున్నానని, లై డిటెక్షన్ టెస్ట్‌కి కూడా తను సిద్ధమని చెబుతాడు. టెస్ట్‌లో వాసుదేవ్ నిజమే చెప్పాడని రుజువవుతుంది. అయినా సరే అది సాక్ష్యంగా చెల్లదంటారు. ఇంతకీ శ్యామ్ సింగరాయ్ ఎవరు? అతడికి, వాసుదేవ్ కి ఉన్న లింకేంటి? చివరికి వాసుదేవ్ ఆ కేస్ లో ఎలా గెలిచాడు? అన్న విషయాలు రివ్యూలో చూద్దాం.

పునర్జన్మలపై గతంలో చాలా సినిమాలొచ్చాయి. ‘మగధీర’ లాంటి సినిమాలు ఈ తరం ప్రేక్షకుల్ని కూడా అలరించాయి. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కూడా ఇదే కథాంశంతో రూపొందింది. అయితే లైన్ అదే అయినా.. తన స్ర్కీన్ ప్లే బ్రిలియన్సీతో ఆసక్తికరమైన ట్రీట్‌మెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్. ఫస్టాఫ్ అంతా వాసుదేవ్ అనే ఫిల్మ్ మేకర్ పాత్రతో వినోదాత్మకమైన సన్నివేశాలతో కథను నడిపించి .. సెకండాఫ్ అంతా ‘శ్యామ్ సింగరాయ్’ పాత్రను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరమైన సన్నివేశాలతో మెప్పించాడు. నిజం చెప్పాలంటే.. సినిమా టైటిల్ కు జెస్టిఫికేషన్ ఈ పాత్రతోనే అద్భుతంగా ఇచ్చాడు. ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. వాసుదేవ్ పాత్రని గతంలోకి తీసుకెళ్తూ.. ‘శ్యామ్ సింగరాయ్’ పాత్ర ఎంట్రీ ఇవ్వడం.. బెంగాల్ వాతావరణంలో ప్రజల హక్కు కోసం పోరాటం, రోసీ (సాయిపల్లవి) అనే పాత్ర పరిచయం, ఆమె చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, విప్లవ రచయితగా మారి గొప్పవాడైన తీరు అద్బుతం అనిపించకమానదు. తను చెప్పాలనుకున్న కథను ఎక్కడా డీవియేషన్స్ లేకుండా.. ప్రేక్షకుల్లో ఆసక్తి సడలకుండా.. సినిమాను ఆద్యంతం రక్తికట్టించాడు. క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ అయితే.. సినిమాకిదే బెస్ట్ ముగింపు అనిపిస్తుంది. బెంగాలీ బ్యాక్ డ్రాప్ లోని కథైనా.. బెంగాల్ డైలాగ్స్ వచ్చిన చోట తెలుగు సబ్ టైటిల్స్ వేస్తూ ఆడియన్స్ అంటెన్షన్ ను సినిమావైపే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. వాసుదేవ్ గా, శ్యామ్ సింగరాయ్ గా రెండు వేరియేషన్స్ చూపిస్తూ నానీ చెలరేగిపోయాడు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ పాత్రలో అయితే నట విశ్వరూపమే చూపించాడు. నానీ కెరీర్ లో ఇదే ది బెస్ట్ కేరక్టర్ అని చెప్పాలి. బెంగాలీ వ్యక్తిగా ఆయన అభినయం, ఆహార్యం, ఆంగికం, వాచకం మెప్పిస్తాయి. ఇక సాయిపల్లవి పోషించిన మైత్రేయ ( రోజీ) పాత్ర గురించి ఏం చెప్పాలి? మామూలు కేరక్టర్ అయితేనే చెలరేగిపోయే ఆమె .. దేవదాసి లాంటి అరుదైన పాత్ర దొరికితే ఇంకెన్ని అద్భుతాలు చేస్తుంది. అలాంటి అవకాశం ఈ సినిమాలో దొరికింది ఆమెకి. అద్భుతమైన నటన తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. సినిమా చూస్తున్నంత సేపు సాయిపల్లవి ఎక్కడా కనిపించదు. మైత్రేయ (రోసీ) పాత్రే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రణవ లయ అనే పాటలో అయితే ఆమె నాట్యం, అభినయం ప్రేక్షకుల్ని మెప్పి్స్తాయి.

అలాగే శ్రుతి పాత్రలో కృతి శెట్టి అందం, అభినయం ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో మంచి పాత్ర రాహుల్ రవీంద్రది. శ్యామ్ సింగరాయ్ చిన్న అన్నయ్యగా గుర్తుండిపోయే పాత్ర పోషించారు. అలాగే.. ఈ సినిమా క్లైమాక్స్ కి అతడి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకి ఏరికోరి అతడ్నే ఎన్నుకొన్నందుకు దర్శకుడ్ని అభినందించాలి. మిక్కీ జె మేయర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. అలాగే. సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ డిపార్ట్ మెంట్. బెంగాలీ నేపథ్యంలోని సెట్స్ ఈ సినిమాకే హైలైట్. కోల్ కత్తాలో కొంత పార్టే చిత్రీకరించినా.. అత్యధిక శాతం హైద్రాబాద్ లో వేసిన సెట్స్ లోనే చిత్రీకరించడం విశేషం. ముఖ్యంగా విజయదశమి రోజున కాళికా మాత విగ్రహం బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్. మొత్తం మీద శ్యామ్ సింగరాయ్ సినిమా నానీ కెరీర్ లో క్లాసిక్ అనదగ్గ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ పాత్రతో ముడిపడి ఉన్న సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. 1969 బ్యాక్‌ డ్రాప్‌ కథని నేటికి ముడిపెట్టి చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌. ఫస్టాఫ్‌ అంతా నానీ శైలీలో సరదాగా సాగేలా పాత్రలను తీర్చిదిద్దిన దర్శకుడు.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించాడు. టైటిల్‌ జస్టిఫికేషన్‌ ప్రకారం చెప్పాలంటే.. సెకండాఫ్‌ నుంచే ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా మొదలవుతుంది. సినిమా కథంతా ‘శ్యామ్‌ సింగరాయ్‌’చుట్టే తిరుగుతుంది. విప్లవ రచయితగా శ్యామ్‌ సింగరాయ్‌ పోరాటం.. దేవదాసి మైత్రితో ప్రేమాయణం, దేవదాసిల వ్యవస్థలోని లోపాలను అద్బుతంగా తెరకెక్కించాడు. జంగా సత్యదేవ్‌ రాసిన కథని ఎక్కడా డీవియేట్‌ కాకుండా తెరపై చక్కగా చూపించాడు. ‘ఒక తూటా ఒక్కరికే …ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది’అనే ఒకే ఒక డైలాగ్‌తో శ్యామ్‌ సింగరాయ్‌ వ్యక్తిత్వం ఏంటి? అతని లక్ష్యం ఏంటో ప్రేక్షకులకు తెలియజేశాడు.

అయితే కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం, ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం సినిమాకి మైనస్‌. ద్విపాత్రాభినయం సినిమాలలో ఫస్టాఫ్‌ అంతా సింపుల్‌గా నడిపించడం.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించడం కామన్‌. ఈ మూవీ కూడా అలాగే సాగుతుంది. ఇంటర్వెల్‌ వరకు శ్యామ్‌ సింగరాయ్‌ పాత్రని చూపించొద్దు కాబట్టి.. కథంతా వాసు, కీర్తిల చుట్టూ తిప్పారు. దర్శకుడిగా అతను పడే కష్టాలు.. కీర్తితో ప్రేమ.. ఇలా సాదా సీదాగా ఫస్టాఫ్‌ని ముగించాడు. ఇక సెకండాఫ్‌లో పూర్తిగా శ్యామ్‌ సింగరాయ్‌ గురించే ఉంటుంది. స్క్రీన్‌ప్లే కూడా అంతంత మాత్రంగా ఉంది. అయితే శ్యామ్‌ సింగరాయ్‌ గురించే తెలుసుకోవాలని సినిమా స్టార్టింగ్‌ నుంచి మనకి అనిపిస్తుంది కాబటి… స్క్రీన్‌ప్లే పెద్దగా ఇబ్బంది అనిపించదు. క్లైమాక్స్‌ కూడా సింపుల్‌గా ఉంటుంది.

జెర్సీ సినిమాలో విజువల్‌తోనే కథని పాత్రల్ని పరిచయం చేయొచ్చని చెప్పిన సానూ వర్గీస్ ఈ చిత్రంలో మరోసారి తన కెమెరా పనితనాన్ని చూపించారు. డిఫరెంట్ టింట్‌తో సినిమాకి స్పెషల్ లుక్ తీసుకుని వచ్చారు. 1970 నేపథ్యాన్ని తన కెమెరా పనితనంతో చూపించారు. మిక్కీజె మేయర్ సాంగ్స్‌తో పాటు.. నేపథ్య సంగీతం బాగుంది.. ముఖ్యంగా సీతారామశాస్త్రి రాసిన ‘సిరివెన్నెల’ సాంగ్ హైలైట్ అయ్యింది. ఆ పాటలోనే సినిమా కథ కనిపిస్తుంది. శ్యామ్ సింగరాయ్ టైటిల్ సాంగ్ బాగా కుదిరింది. వెంకట్ బోయినపల్లి.. కొత్త బ్యానర్‌లో కొత్త నిర్మాత అయినప్పటికీ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడలేదు.


Radhe shyam Trailer: ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా చిత్రబృందం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద బజ్‌ను మరో స్థాయిలో పెంచేసింది.

ఇన్నాళ్ళు ఈ సినిమా ఎలా ఉంటుందో అని కొందరికి కొన్ని రకాల సందేహాలున్నాయి. ఆ సందేహాలన్నిటిని ‘రాధే శ్యామ్’ ట్రైలర్ ఇట్టే తీర్చేసింది. ఇక ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటమే తరువాయి అనేట్టుగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


‘పుష్ప’ కలెక్షన్ల జోరు.. బన్నీ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం కొనసాగుతోంది. కరోనాతో కొన్నాళ్లుగా బోసిపోయిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ‘అఖండ’‌తో కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాలకు అల్లు అర్జున్ ‘పుష్ప’తో మరోసారి సందడి నెలకొంది. బన్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ అంచనాలను అనుగుణంగా తొలిరోజు రికార్డుస్థాయి వసూళ్లు సాధించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. బన్నీ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం.. సుకుమార్ కూడా రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ అంచనాలు పుష్ప సినిమాపై బాగా కనిపించాయి.

శుక్రవారం(డిసెంబర్ 17)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అన్ని భాషల్లో కలిపి రూ.71 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. పుష్ప సినిమాను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాత ఎర్నేని నవీన్ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో కూడా పుష్ప సినిమా రికార్డు తిరిగరాస్తోంది. బన్నీ నటనకు ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజే ఇంత కలెక్షన్‌ వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో అదనపు షో పర్మిషన్ ఇవ్వడం మాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకొచ్చారు. వీకెండ్‌కు మంచి కలెక్షన్‌ వస్తుందని భావిస్తున్నాం. బన్నీకి మలయాళంలో మంచి పేరుంది. ఈ సినిమా ఇంతకుముందు సినిమాల కంటే భారీ ఎత్తున వసూలు చేస్తుంది. ప్రపంచంలోనే తెలుగు ఆడియన్స్ లాంటి వాళ్ళు లేరు. ఈ సినిమాను ఇంత ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. అన్ని ఏరియాలకు మించి ‘పుష్ప’ నైజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే 11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు సహాయపడ్డాయి.


Pushpa Review: ‘పుష్ప’ రివ్యూ… సినిమా ఎలా ఉందంటే..

‘అల వైకుంఠ‌పురంలో’ వంటి క్లాస్ మూవీ త‌ర్వాత ప‌క్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు అల్లు అర్జున్. ఆర్య, ఆర్య-2 వంటి విజయాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. దీంతో కొబ్బరికాయ కొట్టడం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం హాట్‌టాపిక్‌గా మారింది. బన్నీని ఊరమాస్‌ లుక్‌లో ‘పుష్ప’గా పరిచయం చేసిన తర్వాత ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక డీగ్లామర్‌ పాత్ర చేయటం, సునీల్‌, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకులుగా నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. బన్నీ కెరీర్లో తొలి పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే 250 కోట్ల వరకు ప్రీ రిజీజ్ బిజినెస్ చేసి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప’ ఎలా ఉంది? పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి.. తెలుసుకుందామా..

పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) కట్టెల దుకాణంలో కూలీగా పనిచేస్తుంటాడు. అయితే అతడి పుట్టుకకు సంబంధించిన విషయంలో సమాజంలో ఎప్పుడూ అవమానాలే ఎదుర్కొంటూ ఉంటాడు. దీంతో జీవితంలో ఎలాగైనా ఉన్నతస్థాయికి ఎదగాలన్న కాంక్ష అతడిలో రగులుతుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సిండికేట్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు కొండారెడ్డి(అజయ్‌ ఘోష్‌). ఈ విషయం తెలుసుకున్న పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఆ సిండికేట్‌ తరఫున కూలీగా అడవుల్లోకి వెళతాడు. ఒక కూలీగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో అడుగు పెట్టిన పుష్పరాజ్‌ ఆ సిండికేట్‌కు నాయకుడుగా ఎలా ఎదిగాడు? స్మగ్లింగ్‌ చేసే ఎర్రచందనం పోలీసులకు చిక్కకుండా పుష్పరాజ్‌ ఎలా తరలించాడు? ఈ క్రమంలో అడ్డు వచ్చిన మంగళం శ్రీను(సునీల్‌), కొండారెడ్డిలను ఎలా ఎదిరించాడు? పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహద్‌ ఫాజిల్‌) నుంచి పుష్పరాజ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? శ్రీవల్లి(రష్మిక) ప్రేమను ఎలా పొందాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఫస్టాప్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. వాయిస్ ఓవర్‌తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చిత్తూర్ యాసతో సినిమా అసలు కథాంశంలోకి వెళుతుంది. హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ గోవిందప్పగా పరిచయం అవుతాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్ *దాక్కో దాక్కో మేక వచ్చి’ బన్నీ మాస్ స్టెప్పులతో అలరిస్తాడు. పుష్ప కొండారెడ్డితో చేతులు కలుపుతాడు. అప్పుడే శ్రీవల్లిగా రష్మిక పరిచయమవుతుంది. ఈ నేపథ్యంలో బన్నీ – రష్మికల మధ్య శ్రీవల్లి సాంగ్ వచ్చి ఆకట్టుకుంటుంది. ఇక మంగళం శీనుగా సునీల్‌, ద్రాక్షాయణిగా అనసూయ భరద్వాజ్ పాత్రలు పరిచయమవుతాయి. ఆ తర్వాత ఓ ఆసక్తికరమైన స్మగ్లింగ్ సన్నివేశం. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ వచ్చి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఈ సాంగ్ తర్వాత భారీ యాక్షన్ సీన్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్” అంటూ బన్నీ చెప్పిన మాస్ డైలాగ్‌తో ఇంటర్వెల్.

సెకండాఫ్..
కొన్ని పరిస్థితుల్లో పుష్ప మంగళం శీనుకి ఎదురుతిరుగుతాడు. శ్రీవల్లి కోసం కొండారెడ్డి సోదరులకు వ్యతిరేకమవుతాడు. దీంతో కథలో మంచి ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సాలీడ్ మాస్ ఫైట్ బాగా ఆకట్టుకుంది. ఈ ఫైట్ తర్వాత వచ్చిన సామీ సామీ అనే మాస్ సాంగ్‌కి థియేటర్స్‌లో ఈలలు అరుపులతో మోగిపోయాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మొహం కనిపించకుండా అడవిలో పుష్ప చేసే ఫైట్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఫైట్ సెకండాఫ్‌లో హైలెట్ అని చెప్పొచ్చు. దీని తర్వాత వచ్చే ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ అలరిస్తుంది. ఇక షికావత్‌గా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. క్లైమాక్స్‌లో పుష్పకు షికావత్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దీని తర్వాత పుష్పకు పెళ్లి జరుగుతుంది. అనంతరం కథ ఎన్ని మలుపులు తీసుకుంటుందనేది రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ చూడాల్సిందే

ఇప్పటి వరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వందల కథలను దర్శకులు వెండితెరపై చూపించారు. హవాలా, డ్రగ్స్‌, ఆయుధాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్‌ అవుతుంది. ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్‌ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ కొంతవరకూ సఫలమయ్యాడు. మాస్‌ ప్రేక్షకులు మెచ్చేలా పుష్పరాజ్‌ను పరిచయం చేయడం, ఎర్రచందనం రవాణా, సిండికేట్‌ తదితర వ్యవహారాలతో కథను ప్రారంభించిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్‌ లుక్‌తో తెరపై చూపించాడు. ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులకు కనులపండువగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్‌ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్‌ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు.

పుష్పరాజ్‌ కూలీ నుంచి సిండికేట్‌ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది. ఎర్రచందనం సిండికేట్‌ నుంచి వచ్చే పోటీని పుష్పరాజ్‌ ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తితో ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. తెరపై సన్నివేశాలు వస్తున్నా, కథ ముందుకు నడవదు. మధ్యలో శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్‌ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న చిన్న బ్రేక్‌లు వేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ క్రమంలోనే పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్‌- భన్వర్‌ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్‌ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి సంతృప్తి చెందడు. పార్ట్‌-2 కోసం చాలా విషయాలను ప్రశ్నార్థంగానే వదిలేసినట్లు అర్థమవుతుంది.

ఎవరెలా చేశారంటే..
‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అనే చెప్పాలి. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాసలో బన్నీ పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది. కమెడియన్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన సునీల్‌ ఇందులో ప్రతినాయకుడు మంగళం శ్రీను పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం సునీల్‌ మారిన తీరు, ఆయన డిక్షన్‌ బాగున్నాయి. అనసూయ, అజయ్‌ ఘోష్‌, రావు రమేశ్‌, ధనుంజయ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సమంత ఐటమ్‌ సాంగ్‌ మాస్ ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తుంది.

‘పుష్ప’ టెక్నికల్‌గా మరో లెవల్‌లో ఉంది. సినిమాటోగ్రాఫర్‌ కూబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం నిడివి పెరిగిందేమోననిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ఇంకాస్త ఎడిట్ చేస్తే బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు బాగున్నాయి. ‘సామి సామి’, ‘ఊ అంటావా’, ‘ఏ బిడ్డా’ పాటలు తెరపైనా అలరించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓకే. అడవి వాతావరణం చూపించడానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. తనదైన మార్క్‌ కథలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు సుకుమార్‌ ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్‌ కథను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. పుష్పరాజ్‌ పాత్రతో సహా మిగిలిన పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసిన విధానం, అందుకు తగిన సన్నివేశాలు మెప్పిస్తాయి.

చివరిగా..: ‘పుష్ప’ పక్కా మాస్ ఎంటర్‌టైనర్.


సుక్కూ-బన్నీ హ్యాట్రిక్ కాంబో: ‘పుష్ప’ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఆర్య, ఆర్య-2 చిత్రాలతో టాలీవుడ్‌లో హిట్‌ కాంబినేషన్‌గా ముద్రపడ్డారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కింది ‘పుష్ప’. 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప – ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

  • అల్లు అర్జున్‌ – సుకుమార్‌ తొలిసారి 2004లో ‘ఆర్య’తో మంచి హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో ‘ఆర్య 2’తో అలరించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘పుష్ప’.
  • అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇదే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘పుష్ప’రాజ్‌ పాత్ర కోసం అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. చిత్తూరు యాస నేర్చుకున్నారు.
  • ‘పుష్ప’ సినిమాకు ₹160 కోట్ల నుంచి ₹180 కోట్లు ఖర్చు చేశారని భోగట్టా. రెండో భాగం చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారట.
  • అల్లు అర్జున్‌ ‘పుష్ప’ గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్‌ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదట. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే ఓపిగ్గా కూర్చొనేవారట. షూట్‌ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదని బన్నీ చెప్పారు.
  • ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ‘పుష్ప’అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం మారేడుమిల్లి అడవులను ఎంచుకుంది.
  • కొన్ని రోజులు కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిగింది. కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం అక్కడకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడి పోలీసులు పట్టుకున్నారట. ఇది ఎర్రచందనం కాదన్నా, తాము సినిమా వాళ్లమని చెప్పినా వాళ్లు వినలేదట. అవి సినిమా కోసం తయారు చేసినవని నిరూపించాక గానీ వదిలిపెట్టలేదట.
  • యూనిట్‌ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు.
  • తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్‌, ఫైబర్‌ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు. ఎర్రచందనం దుంగలు, యూనిట్‌ సామాగ్రిని అడవుల్లోకి తీసుకెళ్లడానికి కష్టమయ్యేది. ఇందుకోసం అడవుల్లో కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది.
  • ‘పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు.
  • సునీల్‌ ఇందులో మంగళం శ్రీను అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకోవటం గమనార్హం. అయితే పాన్ ఇండియాలో విలన్‌గా చేస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు.
  • ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర మొదటి విజయ్‌ సేతుపతిని అడిగారు. కానీ డేట్స్‌ కుదరక ఆయన చేయలేకపోయారు.
  • సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కలిసి వరుసగా చేస్తున్న ఎనిమిదో చిత్రం ‘పుష్ప’. ఇప్పటివరకూ విడుదలైన సాంగ్స్‌ అన్నీ కలిసి మొత్తంగా 250 మిలియన్‌ వ్యూస్‌కు పైగా సాధించాయి.
  • ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.
  • మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మికకు ఇది రెండో చిత్రం మొదటి చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌ చేశారు.’ అలాగే దర్శకుడు సుకుమార్‌కు మైత్రీ వారితో ఇది రెండో చిత్రమే మొదటిది ‘రంగస్థలం’.
  • ‘పుష్ప’ను మొదట ఒక చిత్రంగా తీయాలనుకున్నారు. కానీ, కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేశారు. ‘పుష్ప: ది రైజ్’ ఇప్పుడు విడుదలవుతోంది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటలా 59 నిమిషాలు.
  • తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె రెండో పార్టులో విశ్వరూపం చూపిస్తుందట. ఫహద్‌ ఫాజిల్‌ కూడా సినిమా ఆఖరులోనే వస్తారని టాక్‌.
  • ఈ సినిమాలో సమంత ‘ఉ అంటావా… ఊఊ అంటావా’ అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఆమె కెరీర్‌లో తొలిసారి ఇలా కనిపిస్తోంది. సమంత ఐటెమ్‌ సాంగ్‌ కోసం పెద్ద మొత్తంలోనే పారితోషికం అందుకుందని టాక్‌. పాట కోసం ఆమెకు కోటిన్నర రూపాయలు ఇచ్చారట. మొత్తంగా ఈ పాటకు చిత్రబృందం రూ. ఐదు కోట్లు బడ్జెట్‌ పెట్టిందని టాక్‌.
  • ఈ సినిమాలో పాటలకు చాలామంచి పేరు వస్తోంది. అన్నింటినీ చంద్రబోసే రాశారు. ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా..’ పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహాన్‌… ప్రముఖ సింగర్‌ మంగ్లీ చెల్లెలు.

Red Rice: ఎర్ర బియ్యంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

బియ్యం అనగానే తెల్ల రంగు, బ్రౌన్ రైస్ ముందుగా గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల మార్కెట్లో ఎర్రబియ్యం, నల్ల బియ్యం అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆంథోసయనిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. తమిళనాడులో ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం. పోషకాలు నిండుగా ఉండే ఈ బియ్యాన్ని అల్లుడి కోసం ప్రత్యేకంగా వండిపెడతారు.

ఎన్నో పోషకాలు.. మరెన్నో ప్రయోజనాలు
రెడ్ రైస్‌‌లో పీచు, ఇనుము అధికంగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఈ రైస్ అన్నం నిదానంగా జీర్ణమవుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఈ బియ్యంలో పీచు శాతం ఎక్కువ. విటమిన్‌ బి1, బి2… వంటి విటమిన్లతో బాటు ఐరన్‌, జింక్‌, పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్‌ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు మందులా పనిచేస్తాయి. ఈ రైస్‌ని చైనా సంప్రదాయ వైద్యంలో వీటిని ఎప్పట్నుంచో వాడుతున్నారు. ఆ కారణంతోనే ఖరీదు కాస్త ఎక్కువే. అందుకే బ్రౌన్‌ రైస్‌తో కలిపి ప్రయత్నించొచ్చు. అయితే వీటిని మిగిలిన బియ్యంలా కాకుండా ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, సిమ్‌లో మెత్తగా ఉడికించి తినాలి.

రెడ్ రైస్‌తో ఆరోగ్య ఫలితాలు:

  • రెడ్ రైస్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ బియ్యంలో ఉండే మొనాకొలిన్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.
  • రెడ్ రైస్‌లో క్యాల్షియం, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టం చేస్తాయి. దీంతో ఎముకలు బలాన్ని సంతరించుకుంటాయి.
  • రెడ్ రైస్ షుగర్ పేషెంట్స్, గుండె వ్యాధి ఉన్నవారికి ఏంతో మేలు. ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి.
  • ఈ రైస్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోనీయవు.
  • రెడ్ రైస్‌ని రోజూ తినడంవల్ల అందులోని ఐరన్‌, రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచి కణాలకీ కణజాలాలకీ సరిగ్గా అందేలా చేస్తుంది. దీంతో శరీరం అలసట లేకుండా శక్తిమంతంగా ఉంటుంది. మానసిక ఉత్తేజాన్నీ కలిగిస్తుంది.
  • ఎర్రబియ్యంలోని మాంగనీస్‌ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేయడంతో బాటు ఫ్రీ రాడికల్స్‌నూ తగ్గిస్తుంది.
  • విటమిన్‌-బి6 సెరటోనిన్‌ శాతాన్ని పెంచి ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
  • వీటిని క్రమం తప్పకుండా తింటే ఆస్తమా సమస్యను నివారిస్తుంది.
  • రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్రబియ్యానికి ఉంది. దీంతో ఎర్రబియ్యం రెగ్యులర్ గా తిన్నవారికి బానపొట్ట కూడా తగ్గిపోతుంది.
  • ఎర్రబియ్యంలోని మెగ్నీషియం, బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి తరచూ వచ్చే హృద్రోగ వ్యాధులను ఈ రెడ్ రైస్ నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

భూలోక వైకుంఠం… శ్రీరంగం

కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతికరమైనదో… మార్గశిరం విష్ణుమూర్తికి అంత పవిత్రమైనదని భక్తుల విశ్వసిస్తుంటారు. ‘మార్గశిరం అంటే నేనే’ అని సాక్షాత్తూ విష్ణుమూర్తి భగవద్గీతలో పేర్కొన్నాడట. అందుకే ఈ మాసంలో వైష్ణవ దివ్యదేశాల్లో ప్రధానమైనదిగానూ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగానూ పేరొందిన శ్రీరంగనాథుడి దర్శనం పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు. ఆ సందర్భంగా ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షిస్తే… ఉభయ కావేరీ నదుల మధ్య రూపుదిద్దుకున్న ద్వీపంలో సప్త ప్రాకారాలతో పదిహేను గోపురాలతో విలసిల్లే భూలోక వైకుంఠమే శ్రీరంగం… శ్రీరంగనాథస్వామి ఆలయం. దీన్నే తిరువరంగం అనీ పిలుస్తారు.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది శ్రీరంగం. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా అవతరించిన ఎనిమిది ప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లోనూ, 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ ఇదే ప్రధానమైనది. శ్రీరామ, శ్రీకృష్ణావతారాలకు క్షీరాబ్ధినాథుడు మూలమనీ, అర్చావతారాలకు శ్రీరంగనాథుడే మూలమనీ వైష్ణవుల విశ్వాసం. ఆళ్వారులు కీర్తించిన దివ్యదేశాల్లోనూ ఇదే కీలకమైనది. అందుకే వాళ్ల దివ్య ప్రబంధాలతో పాటు రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతానికీ పట్టుగొమ్మగా నిలిచిందీ శ్రీరంగం. 9వ శతాబ్దంలో తలక్కాడుని పాలించిన గంగ వంశానికి చెందిన తొండమాన్‌ రాజా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడట. ఆ తరవాత 44వ అళంగీయ సింగర్‌ జీయర్‌స్వామి కలలోకి శ్రీమన్నారాయణుడు వచ్చి ఆలయాన్ని కట్టించమని కోరడంతో ఆయన దీన్ని కొంతవరకూ పూర్తిచేసినట్లూ తెలుస్తోంది. ఆపై వరసగా చోళ, పాండ్య, హొయసల, విజయనగర రాజులకు సంబంధించిన శాసనాలెన్నో ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇలా ఎందరో చక్రవర్తులు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నప్పటికీ చోళుల కాలంలోనే దీన్ని కట్టించినట్లు తెలుస్తోంది. ముసల్మానుల, ఆంగ్లేయుల దాడుల్నీ ప్రకృతి విపత్తుల్నీ తట్టుకుని నిలిచిందీ ఆలయ సముదాయం. అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన సమయంలో ప్రధాన ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడి పూజారులు దాచిపెట్టారనీ తరవాతి కాలంలో విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన కుమార కంబుడు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, ఆలయాన్ని పునరుద్ధరించాడట.

ఎన్నెన్నో ప్రత్యేకతలు..
సుమారు 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో నిర్మితమైన ఈ ఆలయం, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా పేరొందింది. 11అంతస్తులతో 237అడుగుల ఎత్తు ఉన్న ఇక్కడి రాజగోపురం ఆసియా ఖండంలోకెల్లా పెద్దది. ఆలయ ప్రాంగణంలో 81 దేవతామూర్తుల గుడుల్నీ విశ్రాంతి గదుల్నీ వాణిజ్య సముదాయాల్నీ కట్టించిన తీరు సందర్శకుల్ని చకితుల్ని చేస్తుంది. అందుకే ఇది టెంపుల్‌ టౌన్‌గా పేరొందింది. ఇక, గర్భాలయంలోని శేష శయన భంగిమలో ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్‌ అని పేరు. ఆయనకు ఎదురుగా ఉన్న బంగారు స్తంభాలను తిరుమణైత్తూణ్‌ అంటారు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రంలో పడి కొట్టుకునిపోకుండా ఉండేందుకే ఈ స్తంభాలని ప్రతీతి. ప్రాంగణంలో 12 నీటికొలనులు ఉంటే వాటిల్లోని సూర్య, చంద్ర పుష్కరిణుల్లో 20 లక్షల లీటర్లకు పైగా నీళ్లు పడతాయట. ఇక్కడ స్వామిని గరుడ వాహన, సింహవాహన, హనుమంత, శేషవాహన రథాల్లో ఉరేగిస్తారు. ఇక్కడున్న గరుడాళ్వార్‌ విగ్రహం ఎత్తు 25 మీటర్లు. ఆయన అలంకరణకు 30 మీటర్ల పొడవాటి వస్త్రాన్ని వాడతారట. గరుడాళ్వార్‌కి ప్రత్యేకంగా మంటపం కూడా ఉంది. క్షీరసాగరమథనంలో పుట్టిన ధన్వంతరికి ఆలయం ఒక్క శ్రీరంగంలోనే ఉంది. చారిత్రక కాలంనాటి మురుగునీటి నిర్వహణ, వర్షపునీటిని నిల్వచేసుకునే విధానంతో ఈ ఆలయం ఐక్యరాజ్యసమితి అవార్డునీ సొంతం చేసుకుంది.

ప్రధాన ద్వారం దాటి వెళ్లగానే వచ్చే మొదటి ప్రాకారంలో చిలుకల మండపం, యాగశాల, విరాజుబావి; రెండో దాంట్లో పవిత్రోత్సవ మండపం, హయగ్రీవ, సరస్వతీ ఆలయాలు; మూడోదాంట్లో గరుత్మంతుని సన్నిధి, వాలీసుగ్రీవుల సన్నిధి, చంద్ర పుష్కరిణి, నాలుగులో గరుడాళ్వార్‌, నాదముని, కూరత్తాళ్వార్‌ సన్నిధుల్ని దర్శించుకోవచ్చు. ఐదోదానికే ఉత్తర వీధి అని పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీధిలోనే స్వామివారిని ఊరేగిస్తారు. ఆరో ప్రాకారానికి చిత్రవీధి అని పేరు. ఇక్కడి వీధుల్లో ఆళ్వార్లను ఊరేగిస్తుంటారు. ఏడో ప్రాకారంలో వామనుని సన్నిధీ, దశావతారాలూ కనిపిస్తాయి. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పై కప్పు విమానం ఆకృతిలో ఉంటుంది. ఇక, గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించిన స్వామిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.

ఇదీ.. స్థల పురాణం!
మనువు కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేయగా బ్రహ్మ తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడి ప్రతిమను ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తాడు. అలా ఆ వంశంలో శ్రీరామచంద్రుడి వరకూ ఆయన్ని ఆరాధించారు. పట్టాభిషేకానంతరం విభీషణుడు శ్రీరామ వియోగాన్ని భరించలేక లంకకు తిరిగి వెళ్లలేకపోతున్న సందర్భంలో- రాముడు తనకు బదులుగా రంగనాథుని విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. అంతట రంగనాథుడితో బయలుదేరిన విభీషణుడు ఉభయ కావేరుల మధ్యకు చేరేసరికి సంధ్యావందన సమయం కావడంతో, స్వామిని కిందపెట్టి నదికి వెళ్ళి, తిరిగి వచ్చేసరికి రంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడట. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే ధర్మచోళుడు అతన్ని ఓదార్చి విగ్రహం ఉన్నచోటే ఆలయాన్ని నిర్మించాడనీ విభీషణుడి కోరిక మేరకు స్వామి దక్షిణ దిక్కుకు తిరిగాడనీ(లంక దక్షిణంగా ఉంది కాబట్టి) పౌరాణిక కథనం.

రంగనాథుడి ఉత్సవాలు!

ఏడాదికి 365 రోజులు ఉంటే ఈ ఆలయంలో 322 రోజులూ ఉత్సవాలు జరగడం విశేషం. ఆలయంలో పేరుకున్న మలినాల్ని తొలగించేందుకు జూన్‌-జులై మాసంలో గర్భగుడిని శుభ్రపరిచి ప్రత్యేకంగా తయారుచేసిన మూలికాతైలాన్ని పెరియ పెరుమాళ్‌కు పూసి మెరుగుపెట్టిన బంగారు తొడుగుని తొడుగుతారు. ఆ సమయంలో బంగారు కలశంతో భక్తులు కావేరి నది నుంచి నీళ్లు తీసుకొస్తారు. అలాగే నిత్యపూజల్లోని లోపాలను సరిదిద్దేందుకు పవిత్రోత్సవాన్ని తమిళ మాసమైన ఆణి(ఆగస్టు-సెప్టెంబరు)లో రెండురోజులపాటు చేస్తారు. ఏడాది పొడవునా ఎన్ని ఉత్సవాలు జరిగినా ధనుశ్శుద్ధ ఏకాదశికి ముందువెనకలుగా జరిగే పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయట. ముఖ్యంగా ధనుర్మాసం (తమిళ నెల మార్గళి)లో వచ్చే వైకుంఠ ఏకాదశికి పదిలక్షలకు పైగా భక్తులు హాజరవుతారట. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ దివ్యక్షేత్రానికున్న ప్రత్యేకతలెన్నో.

అక్కడ 900 ఏళ్లనాటి రామానుజుడు!
మానత్వాన్ని చాటుతూ విశిష్టాద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు. శ్రీపెరంబుదూరులో పుట్టి, కంచిలో వేదవిద్యని అభ్యసించి, శ్రీరంగం వేదికగా శ్రీవైష్ణవాన్ని ప్రభోధించాడాయన. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ మంత్రాన్ని తిరుకొట్టియార్‌ ఆలయగోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. దీన్ని బహిరంగంగా వినిపిస్తే నరకానికి వెళతారనే వాదనను తోసిపుచ్చి, ‘వెళ్లినా పరవాలేదు, మరికొందరికి ముక్తి వస్తే అదే మేలు’ అని భావించిన గొప్ప వ్యక్తి. 1137లో ఆయన మరణానంతరం- తొమ్మిది శతాబ్దాలుగా- పార్థివదేహం శ్రీరంగంలో భద్రంగా ఉన్నట్లు చెబుతారు. నాలుగో ప్రాకారంలో రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినప్పటికీ విగ్రహం వెనక ఉన్నది ఆయన దివ్యశరీరమేననీ, పద్మాసనంలో కూర్చునే పరమపదించడంతో ఆ భంగిమలోనే దేహాన్ని భద్రపరిచారనీ, ఈ రకమైన మమ్మిఫికేషన్‌ మరెక్కడా కనిపించదనీ అంటారు. ఏటా ఆయనకి రెండుసార్లు ఉత్సవాలు నిర్వహించిన సమయంలో మాత్రమే కర్పూరం, కుంకుమపువ్వును ముద్దగా నూరి శరీరానికి పూస్తారట. అందువల్ల ఒకరకమైన ఎరుపురంగులో అది మెరుస్తూ ఉంటుంది. హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లనూ, గోళ్లనూ గుర్తించవచ్చనీ అంటారు.


‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’…. యూట్యూబ్‌లో రికార్డుల మోత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ సాంగ్ లిరికల్ వీడియో Youtubeలో ట్రెండ్ అవుతూ భారీ వ్యూస్‌ను రాబడుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ ఈ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో సమంత ఆడిపాడగా… యూట్యూబ్‌లో ఇప్పటి వరకు అన్ని బాషల్లో కలిపి 45 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 1.6 మిలియన్స్‌కు పైగా లైక్స్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.


అదరగొట్టిన నాని… శ్యామ్ సింగరాయ్ ట్రైలర్

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‏లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న కుర్రాడికి.. శ్యామ్ సింగరాయ్‏కు గల అనుబంధం ఏంటీ అనేది ట్రైలర్‏లో చూపించారు. పిరికివాళ్లే కర్మ సిద్ధాంతాన్నే మాట్లాడతారు.. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమాం గోప్పది కాదు… తప్పని తెలిసాక.. దేవుడ్ని కూడా ఏదిరించడంలో తప్పు లేదు అని నాని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ప్రపంచంలోనే ఒంటరి ఇల్లు.. 100ఏళ్లుగా ఒక్క మనిషీ అక్కడ లేడు

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన ప్రదేశాలున్నాయి. కొన్ని చోట్ల జనం కిక్కిరిసిపోయి ఉంటే మరికొన్ని చోట్ల ఒక్క మనిషి కూడా ఉండరు. అయితే 100 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న ఒక ఇల్లును ఇటీవలే ఇటలీలో గుర్తించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ ఇల్లు భారీ డోలమైట్ పర్వతాల మధ్యలో నిర్మించారు. దీనిని ‘ప్రపంచంలోని ఒంటరి ఇల్లు’ అని పిలుస్తారు. ఈ ఇల్లు సముద్ర మట్టానికి దాదాపు 9వేల అడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. ఇంత ఎత్తులో ఇల్లు ఎలా నిర్మించారు.. ఎందుకు నిర్మించారు ఇక్కడ ఎవరు ఉండేవారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

ఈ ఇంటిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారని తెలుస్తోంది. ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఇటాలియన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంత ఎత్తులో నిర్మించారని చరిత్ర కారులు చెప్పారు. అప్పట్లో సైనికులు ఈ ఇంటిని స్టోర్ రూమ్‌గా కూడా ఉపయోగించారు. సైనికుల కోసం తీసుకువచ్చిన వస్తువులు ఇప్పటికీ భద్రంగా ఉండటం విశేషం. ఈ ఇల్లు పూర్తిగా భిన్నమైన రీతిలో నిర్మించారు. దీని నిర్మాణంలో చెక్క, తాడు, కేబుల్ ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. పర్వతం మధ్యలో ఈ ఇల్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ ఇంటి చుట్టూ పర్వతాలు తప్ప ఇంకెమీ కనిపించవు. దీంతో ప్రజలెవరూ ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి చేరుకునే మార్గం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక పాత చెక్క వంతెనను దాటితేనే ఇక్కడికి చేరుకోగలం. గొప్పదనం ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరో లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రమాదం కారణంగా ప్రజలు ఇక్కడికి రాకుండా సాధారణంగా నిషేధించినా సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే సొంత పూచీతో అనుమతిస్తున్నారు.