Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
‘పుష్ప’ చిత్రంలో సమంత ఐటెం సాంగ్ చేస్తుందనే ప్రకటన రాగానే అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. గతంలో సమంత ఐటెం సాంగ్స్ చేయకపోవడం ఆ క్రేజ్‌కు ఓ కారణమైతే.. అదీ బన్నీ పక్కన ప్రత్యేక గీతం అనగానే ఆ క్రేజ్ రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలోనే ‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేశారు.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ఆ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఇంద్రావతి చౌహాన్ మాస్ వాయిస్‌తో ఆలపించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 12న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక భారీగా ప్లాన్ చేశారు. 17న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
బాహుబలి, బాహుబలి-2, సాహో చిత్రాల పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తదుపరి సినిమాలన్నీ తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటేనే ఆయన స్థాయి ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్‌తో పాటు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.
తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రభాస్ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్‌కు విలాసవంతమైన బంగ్లా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్. దీనికోసం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రూ.120 కోట్లతో రెండు ఎకరాలు కొన్నాడని తెలుస్తోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉంటుందనీ, ట్రాఫిక్ పెద్దగా వుండని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ అక్కడ 80 కోట్ల రూపాయలతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. మొత్తంగా కొత్త విల్లా కోసం ప్రభాస్ 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి.
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రన్ టైమ్ లాక్ చేసినట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. ఇందులో స్పెషల్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్ అలాగే సినిమాకు అనవసరమైన సన్నివేశాలు ఏవీ లేకుండా 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేసినట్లు లేటెస్ట్ న్యూస్. సంక్రాంతి బరిలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రన్ టైమ్ మూడు గంటలకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువే అని సమాచారం. వీటితో పోల్చుకుంటే ‘భీమ్లా నాయక్’ తక్కువని అంటున్నారు. అంతేకాదు ఈ రన్ టైమ్ మూవీకి బాగా ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి మరి.
మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్‌ఎస్‌కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. నిరుద్యోగ యువకుడి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటన ఆకట్టుకుంది. దసరాకు థియేటర్లలో సందడి చేసిన ‘కొండపొలం’ సినిమా ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల్లో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో ‘కొండపొలం’ మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసేయండి మరి.
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలం ఎదురైంది. కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలందరూ ఓటీటీలకే అంకితమైపోయారు. సినిమా థియేటర్ల వైపు ప్రజలు రావడం మానేస్తారని అందరు అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా హాళ్ల వైపు ప్రజలు పోటెత్తడం మొదలుపెట్టారు. దీంతో సినిమాలకు ఏమి కాదని అర్థమైంది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన 10సినిమాల జాబితాను ప్రతి ఏడాది గూగుల్ ఇండియా విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆ జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన చిత్రంగా ‘‘జై భీమ్’’ నిలిచింది. నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దామా..
జై భీమ్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించారు. మంచి కథాంశంతో రూపొందడంతో పాటు వివాదాలు కూడా చుట్టుముట్టడంతో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
షేర్‌షా సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ హీరో, హీరోయిన్లుగా నటించారు. కార్గిల్ యుద్ధంలో అసమాన ప్రతిభ పాటవాలను చూపిన విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది.
రాధే కొరియన్ చిత్రం ‘‘ద అవుట్ లాస్’’ రీమేక్‌గా రాధే తెరకెక్కింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ ప్లెక్స్ వేదికగా విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
బెల్ బాటమ్ అక్షయ్ కుమార్, వాణీకపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించారు. హైజాక్ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. రంజిత్ తివారి దర్శకత్వం వహించారు.
5.ఎటర్నల్స్ మార్వెల్ కామిక్స్‌కు చెందిన అమెరికన్ సూపర్ హీరోలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. మార్వెల్ కామిక్స్‌లో ఇది 26వ చిత్రం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.
మాస్టర్ కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో సందడి చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికి కరోనా కారణంగా వాయిదాపడింది. సంక్రాంతి కానుకగా థియేటర్లల్లో విడుదల అయిన ఈ చిత్రానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
సూర్యవంశీ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికి ఈ చిత్రాన్ని సినిమా హాళ్లల్లోనే విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం విశేషం.
గాడ్జిల్లా vs కాంగ్ ఆడమ్ విన్ గార్డ్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారతీయ భాషల్లోను ఈ చిత్రం సందడి చేసింది. గ్రాఫిక్స్‌తో ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచం మీద విరుచుకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్ పెట్టిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
దృశ్యం-2 మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2013లో విడుదలైన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం-2 తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం విడుదలయింది.
భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా నటించారు. దేశభక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ఈ మూవీ విడుదల అయింది.
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (RamCharan), కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ‘‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్ – తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ నటి ఆలియాభట్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుష్ఫలితాలు అంతకు మించి ఉన్నాయన్నది వాస్తవం. అయితే ఇటీవల కాలంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బందీ అవుతుండటం అతిపెద్ద ముప్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలు మొబైల్‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే మొబైల్ కు బానిసగా మారడం. అదొక వ్యసనంలా మారడం. స్క్రీన్ ఎడిక్షన్ అంటే మొబైల్, ట్యాబ్, టీవీ స్క్రీన్లకు బానిసలుగా మారిపోవడం. నెలల వయసు పిల్లలు కూడా ఇప్పుడీ టెక్నాలజీ యుగంలో మొబైల్‌కు బాగా అలవాటు పడిపోతున్నారు. చిన్నపుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలను ఇప్పుడా స్క్రీన్స్ చెబుతున్నాయి. ఆరుబయట ఆడుకునే ఆటలనూ స్క్రీన్స్‌పైనే ఆడేస్తున్నారు. నెలల వయసు పిల్లలు కూడా ఈజీగా మొబైల్‌ను ఆపరేట్ చేస్తుంటే అది చూసి వాళ్ల పేరెంట్స్ మురిసిపోతుంటారు. కానీ క్రమంగా అది మొబైల్ ఎడిక్షన్‌కు దారి తీస్తోందన్న చేదు నిజాన్ని వాళ్లు గ్రహించలేకపోతున్నారు.
అన్నం తినాలన్నా సెల్‌ఫోనే.. ఒకపుడు పిల్లలకు అన్నం తినిపించాలంటే తల్లిదండ్రులు ఆరబయటకు తీసుకువెళ్ళడం, చందమామను చూపించడం వంటివి చేసేవారు. కానీ కాలం మారింది. ఆరుబయళ్ళు లేవు. ఆకాశాన్ని చూపించే తీరికా లేదు. ఇది పిల్లల పెంపకం మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. పిల్లలు మారాం చేస్తుంటే ఓపికగా తినిపించే సమయం ఎవరికీ లేదు. తింటే చాలు అనుకుని తల్లిదండ్రులు పిల్లల చేతిలో సెల్‌ఫోన్ పెడుతున్నారు. వాటికి అలవాటైన పసి పిల్లలు బొమ్మలు చూపితే గానీ అన్నం తినము అనే స్థాయికి చేరుకున్నారు.
పట్టించుకోకపోతే అనర్థాలే.. కరోనా విపత్తు కారణంగా ఈ ఏడాది విద్యార్థులు బడికి వెళ్లే అవకాశం లేకుండా చేసింది. విద్యా సంవత్సరంలో ఎక్కువశాతం ఆన్‌లైన్ తరగతులతోనే గడిచిపోతోంది. పలు ప్రైవేటు పాఠశాలలు చిన్నారులకు ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయి. తరగతులు ముగియగానే స్మార్ట్ ఫోన్‌ను పక్కన పడేయడం లేదు. గేమ్స్, వీడియోస్‌లోకి వెళుతున్నారు. తల్లిదండ్రులకు గమనించే తీరిక ఉండటం లేదు. దీంతో చిన్నారులు ఎక్కువ సమయం సెల్‌ఫోన్లలో గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఈ కారణంగా పిల్లలు ఎదుగదల దెబ్బతినే ప్రమాదముందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్క్రీన్ ఎడిక్షన్ ఎంతవరకూ వెళ్లిందంటే… తమ చేతుల్లోని సెల్‌ఫోన్, ట్యాబ్‌లు లాక్కుంటే చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరైతే ఆవేశంలో ఎదుటివారి ప్రాణాలు సైతం తీస్తున్నారు. డ్రగ్స్, ఆల్కహాల్‌ను మించి డిజిటల్ ఎడిక్షన్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు ఎడిక్ట్ అయ్యారా? అది తెలుసుకోవడం ఎలా? ఆ ఎడిక్షన్ వల్లే కలిగే అనర్థాలు ఏంటి? తల్లిదండ్రులుగా ఈ ఎడిక్షన్ బారి నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?.. ఈ విషయాలు తెలుసుకుందాం…
ఇప్పటి వరకు మనకు ఎడిక్షన్ అంటే డ్రగ్స్ లేదా ఆల్కహాల్‌లాంటి వాటికే పరిమితమైన పదం. కానీ ఇప్పుడది మొబైల్ స్క్రీన్‌కూ పాకింది. చాలా మంది అసలు డిజిటల్ ఎడిక్షన్ అన్న పదమే లేదని కొట్టి పారేస్తారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ఇది నిజమని తేల్చింది. మనుషులు స్క్రీన్స్‌కు ఎడిక్ట్ అవుతారని తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వ్యాధుల జాబితాను 2018లో సవరించినప్పుడు అందులో గేమింగ్ డిజార్డర్‌ను కూడా చేర్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎడిక్షన్ అన్న పదాన్ని ఇక్కడ అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. స్క్రీన్ ఎడిక్షన్ అంటే స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, టీవీ.. ఏదైనా కావచ్చు. వీటిని అతిగా వాడేవాళ్ల ప్రవర్తనలో మార్పులను బట్టి అది అడిక్షనా? కాదా? అన్నది గుర్తించవచ్చు. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే వాళ్లలో కనిపించే మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లలు మొబైల్ వాడుతున్నప్పుడు మార్పులు
పిల్లలు సాధారణంగా ఎక్కువ సమయం ఆడుకోవడానికే ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయి ఇంటింటికీ మొబైల్ ఫోన్స్ వచ్చాయో అప్పటి నుంచి అదే సర్వస్వమైపోయింది. అప్పుడప్పుడూ మొబైల్ చూస్తూ మిగతా టైమ్‌లో చదువుకోవడం, ఆడుకోవడంలాంటివి చేస్తే సమస్య లేదు. కానీ చదువు, ఆటలన్నీ పక్కన పెట్టి మొబైల్‌కే సమయం కేటాయిస్తున్నారంటే అది మెల్లగా వ్యసనంలా మారుతున్నట్లు గుర్తించాలి.
పిల్లలు మొదట్లో కాసేపు మొబైల్ లేదా ట్యాబ్ చూసి పక్కన పెట్టేస్తారు. దాంతోనే సంతృప్తి చెందుతారు. అది ఎప్పుడూ అంత వరకే పరిమితమైతే ఓకే. అలా కాకుండా ప్రతి రోజూ ఈ సమయం పెంచుతూ వెళ్తున్నారంటే జాగ్రత్త పడాలి.
మొదట్లో బలవంతంగా మొబైల్స్ లాక్కున్నా వాళ్లలో పెద్దగా రియాక్షన్ ఉండదు. అదొక వ్యసనంలా మారుతున్న సమయంలో మాత్రం పిల్లల ప్రవర్తన మారుతుంది. వాటిని చేతుల్లో నుంచి లాక్కున్నపుడు గట్టిగా అరవడం, ఏడవడం, వింతగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇది కూడా ఓ ఎడిక్షన్ లక్షణమే అని గుర్తించండి.
మొబైల్ లేదా ట్యాబ్‌లో గేమ్స్ ఆడకపోయినా, తమ ఫేవరెట్ షోను చూడకపోయినా దాని గురించే మాట్లాడుతున్నారంటే అనుమానించాల్సిందే. ఇది కూడా ఫోన్ ఎడిక్షన్ లక్షణమే.
మొబైల్ ఎడిక్షన్‌తో తీవ్ర అనర్థాలు.. మొబైల్ ఎడిక్షన్ చాలా అనర్థాలకే దారి తీస్తోంది. చిన్న వయసులోనే మొబైల్స్, ట్యాబ్స్, టీవీలకు అలవాటు పడటం వల్ల దీర్ఘకాలంలో పిల్లలు వివిధ సమస్యలతో బాధ పడే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒబెసిటీ: మొబైల్స్, ట్యాబ్స్, టీవీల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లలు బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఇది క్రమంగా ఒబెసిటీకి దారి తీస్తుంది. చిన్న వయసులోనే ఒబెసిటీ బారిన పడితే దీర్ఘకాలంలో అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.
నిద్ర లేమి: పిల్లలు పడుకోవడానికి కనీసం గంట ముందైనా టీవీలు, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. వీటి నుంచి వచ్చే వెలుతురు మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తుంది. ఇది క్రమంగా పిల్లలను నిద్రకు దూరం చేస్తుంది. నిద్ర లేమి ఇతర అనర్థాలకూ కారణమవుతుంది.
ప్రవర్తనలో మార్పులు: రోజుకు పరిమితికి మించి మొబైల్ లేదా టీవీ చూసే పిల్లల ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వీళ్లు ఎవరితోనూ అంత సులువుగా కలవరు. కోపం, చిరాకు, ఆందోళన, హింసా ప్రవృత్తి కూడా ఎక్కువగా ఉంటాయి.
ఒంటరితనం, ఆందోళన: స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారిన పిల్లలు చాలా వరకు ఒంటరితనం, ఆందోళనతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. చాలా మంది పిల్లలు మొబైల్, టీవీలతో కాలక్షేపం చేస్తూ తమను తాము మరచిపోతారు. కానీ అది ఓ వ్యసనంలా మారితే మాత్రం డేంజరే. కాసేపు వాటికి దూరంగా ఉన్నా కూడా ఒంటరితనం, ఆందోళన వాళ్లను వేధిస్తుంది.
మొబైల్ వ్యసనంతో ఒత్తిడి: సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనెక్టివిటీ పెరిగిపోయింది. ముఖ్యంగా టీనేజర్లు చాలా వరకు తమ సమయాన్ని చాటింగ్‌లోనే గడుపుతున్నారు. నోటిఫికేషన్స్ వీటికి మరింత బానిసలుగా మారేలా చేస్తున్నాయి. క్షణక్షణం మొబైల్ చెక్ చేస్తూ, వచ్చిన మెసేజ్‌లకు రిప్లైలు ఇస్తూ ఉంటారు. ఇది క్రమంగా వాళ్లలో ఒత్తిడి పెరగడానికి కారణమవుతోంది. ఈ చాటింగ్‌కు అడిక్ట్ కావడం వల్ల స్కూళ్లలో వాళ్లకు ఇచ్చిన టాస్క్‌లను కూడా సరిగా పూర్తి చేయక మరింత ఒత్తిడికి లోనవుతున్నారు.
ఏకాగ్రత కోల్పోవడం: మొబైల్ అడిక్షన్ ఏకాగ్రత కోల్పోవడానికీ కారణమవుతోంది. రోజూ అరగంటలోపు మొబైల్ చూసే వాళ్ల కంటే రెండు గంటలకుపైగా చూసే వాళ్లు ఆరు రెట్లు ఎక్కువ దీని బారిన పదే ప్రమాదం ఉంది. పదే పదే మొబైల్ స్క్రీన్స్ వైపు చూస్తుండటం, డివైస్‌లో ఏదో ఒక దాని కోసం వెతుకుతుండటం మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పిల్లలు ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతుంటారు. ఓ పని మొదలుపెట్టడం, దానిని మధ్యలోనే వదిలేసి మరో పని చేయడంలాంటివి చేస్తుంటారు. పైగా ఏదైనా విషయంపై లోతుగా ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు.
సూసైడల్ టెండన్సీ: మొబైల్ ఎడిక్షన్, స్క్రీన్ ఎడిక్షన్ అనేది సూసైడల్ టెండెన్సీకి కూడా దారి తీస్తోందని అధ్యయనాల్లో తేలింది. అంటే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు. బ్లూవేల్, పబ్‌జీ లాంటి గేమ్స్ వీటిని మరింత పెంచుతున్నాయి. ఆ గేమ్స్‌కు బానిలైన వాళ్లను బలవంతంగా దూరం చేయాలని చూస్తే ఆత్మహత్యలకు ప్రయత్నించడానికి కారణం కూడా ఇదే.
మాటలు ఆలస్యంగా రావడం: రెండేళ్లలోపు పిల్లలు మొబైల్‌కు బానిసలు కావడం వల్ల వాళ్లకు మాటలు రావడం ఆలస్యమవుతుంది. అందువల్ల ఈ వయసు పిల్లలకు అసలు మొబైల్ అలవాటు చేయకపోవడమే మంచిది.
మొబైల్ అడిక్షన్‌తో ఎన్నో రోగాలు.. ఎక్కవ సమయం స్క్రీన్ చూడడం వల్ల కళ్లలో మంట రావడం, కళ్లు పొడిబారడం, కళ్లలో నొప్పి, తలనొప్పి, మెడనొప్పి, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. తలనొప్పికి కారణం చూస్తే.. కళ్లతో స్క్రీన్‌ను ఎక్కువటైం చూడడం వల్ల సిలియరీ అనే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా దగ్గరి చూపుపై ప్రభావం కూడా పడుతుంది. కళ్లు పొడిబారడానికి కారణం కూడా స్క్రీన్ ఎక్కువ టైం చూడడం. దీని వల్ల కంటి పైభాగంలో తేమ తగ్గుతుంది. స్పష్టమైన దృష్టి కలిగి ఉండడానికి తేమ అవసరం. పొడి బారడం వల్ల మంటలు, కళ్లు ఎర్రగా మారడం, కళ్ల దురద (అలెర్జీ) వంటివి వస్తాయి.
దూరదృష్టి లోపం.. డిజిటల్ పరికరాలను ఎక్కువ సమయం వినియోగించడం వల్ల దూరదృష్టి లోపం కూడా వస్తుంది. చాలా మంది పిల్లలు దూరదృష్టి కోసం కళ్ల జోడు వాడడానికి ఇదే ప్రధాన కారణం. నిజానికి ప్రతి పిల్లాడికీ 8 నుంచి 10 ఏళ్ల వయసు అనేది అత్యంత కీలకం. ఈ సమయంలో పిల్లలకు దూరచూపు పెరుగుతుంది. కానీ, ఇదే సమయంలో చాలా మంది పిల్లలు టీవీలకు, సెల్‌ఫోన్లకు అంకితమవుతున్నారు. అవుట్‌డోర్ ఆటలకు దూరమవుతున్నారు. దీని వల్ల దూరపు చూపు ఉండడం లేదు. ఫలితంగా చాలా మంది పిల్లలు దూరపు చూపు కోసం చిన్న తనంలోనే కళ్లద్దాలు వాడాల్సి వస్తున్నది. ఈ మధ్యకాలంలో ఇది చాలా మంది పిల్లల్లో అద్దాలు వాడడం కనిపిస్తున్నది.
స్క్రీన్ టైమ్ పరిమితులు ఇవీ మొబైల్స్, ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లు మన జీవితంలో విడదీయలేని భాగమైపోయాయి. వాటి నుంచి ఎలాగూ మనం తప్పించుకోలేం. అలాంటప్పుడు దానికి కొన్ని పరిమితులు విధించుకోవడం అన్నది ఉత్తమం. ఈ మధ్యే కెనడాకు చెందిన పీడియాట్రిక్ సొసైటీ హెల్తీ స్క్రీన్ యూజ్‌కు కొన్ని గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే చిన్నారులు, టీనేజర్ల కోసం వాళ్లీ స్క్రీన్ టైమ్ పరిమితులు విధించారు. ఏ వయసు పిల్లలకు ఎంత స్క్రీన్ టైమ్ ఉండాలో ఓసారి చూద్దాం.
రెండేళ్లలోపు పిల్లలకు అసలు ఎలాంటి స్క్రీన్ టైమ్ అనేది లేదు. అంటే వాళ్లు మొత్తంగా మొబైల్‌కు దూరంగా ఉండాల్సిందే. మరీ తప్పదనుకుంటే.. వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితం చేయాలి.
2-5 ఏళ్లలోపు పిల్లలకు రోజులో మొత్తంగా ఒక గంటలోపు మాత్రమే స్క్రీన్ టైమ్ కేటాయించాలి.
ఇక స్కూళ్లకు వెళ్లే పిల్లలు, టీనేజర్లు అయితే ఒక రోజులో అది కూడా తప్పనిసరి అనుకుంటేనే నాలుగు గంటలకు మించి స్క్రీన్ టైమ్ ఉండకూడదని కెనడా పీడియాట్రిక్ సొసైటీ స్పష్టం చేసింది.
పిల్లలు పడుకునే కనీసం ఒక గంట ముందు నుంచే మొబైల్, ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి.
బుక్స్ చదివే సమయంలో, ఫ్యామిలీలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో అసలు మొబైల్స్ జోలికి వెళ్లకుండా చూడాలి.
తల్లిదండ్రులు ఏం చేయాలంటే.. తమ పిల్లలు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ లేదా టీవీకి ఇంతలా ఎడిక్ట్ అయిపోవడం తమకు కూడా ఇష్టం లేదని, అయితే తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చాలా మంది పేరెంట్స్ చెబుతుంటారు. కానీ ఈ వ్యసనం నుంచి పిల్లలను బయట పడేయాల్సింది కచ్చితంగా వారే. మరి పిల్లలను స్క్రీన్ అడిక్షన్ నుంచి రక్షించుకోవడానికి పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఆ పని మానుకోండి పిల్లలు సహజంగానే మొబైల్స్ లేదా టీవీలకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. నిజానికి వాళ్లకు కొత్తగా ఏది కనిపించినా వాళ్లు ఆసక్తిగా చూస్తుంటారు. ఇదే అదనుగా చాలా మంది పేరెంట్స్ తమ బిజీ పనులకు పిల్లలు అడ్డు రాకుండా ఉండేందుకు వాళ్లే స్క్రీన్‌ను అలవాటు చేస్తారు. చేతికి ఓ మొబైల్ ఇచ్చో లేదంటే టీవీ ఆన్ చేసో వెళ్లిపోతారు. ఒక రకంగా వీటిని బేబీ సిట్టర్స్‌లాగా వాడుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఇది క్రమంగా స్క్రీన్ అడిక్షన్‌కు దారి తీస్తుంది.
ముందు పేరెంట్స్ మారాలి పిల్లలు ఏం చేసినా పెద్దవాళ్లను అనుసరిస్తారన్న విషయం గుర్తు పెట్టుకోండి. వాళ్లకు తొలి గురువులు తల్లిదండ్రులే. వాళ్లు ఎలా చేస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఈ రోజుల్లో పేరెంట్సే మొబైల్స్‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. చివరికి తినేటప్పుడు కూడా వాటిని వదిలి పెట్టడం లేదు. తమ పేరెంట్స్ ఇంతగా చూస్తున్నారంటే అందులో ముఖ్యమైనది ఏదో ఉందని పిల్లలూ అనుకుంటారు. వాళ్లూ ఫాలో అవుతారు. అందువల్ల కనీసం పిల్లలు మీ పక్కన ఉన్న సమయంలో అయినా మొబైల్ జోలికి వెళ్లకండి. సాధ్యమైనంతగా వాళ్లతో సమయం గడపడానికి ప్రయత్నించండి.
బ్యాలెన్స్ గురించి చెప్పండి మొబైల్‌కు అలవాటు పడిన కొద్దీ పిల్లలు వాటిలోనే పూర్తిగా తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. మొబైల్ తప్ప తమను ఇంకేదీ ఇంతలా ఎంటర్‌టైన్ చేయదన్న ఫీలింగ్ కాస్త పెద్ద పిల్లల్లో కలుగుతుంది. అలా కాకుండా లైఫ్‌లో అన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పండి.
ఉదాహరణకు వాళ్లు తినే ఆహారం గురించే వివరించండి. వాళ్లకు ప్రతి పూటా ఎక్కువ శాతం ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తూ చివర్లో కొంత మొత్తంలో స్వీట్స్, కేక్స్, చాకొలెట్స్‌లాంటివి ఇస్తుంటాం. ఆరోగ్యకరమైన ఫుడ్ కాకుండా డెజర్ట్స్ ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం తరుచూ వాళ్లకు చెబుతూనే ఉంటాం. అలాగే స్క్రీన్ టైమ్‌ను కూడా మిగతా పనుల్లో ఒక భాగంగా చూసేలా చేసే బాధ్యత పేరెంట్స్‌దే. అంటే ఎంతసేపూ మొబైల్‌కే పరిమితం కాకుండా వాళ్లను కాస్త బయటకు తీసుకెళ్లడం, పార్కుల్లో హాయిగా తిప్పడం, ఏవైనా ఆటలు ఆడటంలాంటివి చేయాలి.
సాధ్యమైనంత వరకూ ఎక్కువసేపు పిల్లలు ఒంటరిగా ఉండకుండా చూసుకోండి. వాళ్లతో తరచూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. చేతిలో మొబైల్ ఉంటే తరచూ ఒక గేమ్ నుంచి మరో గేమ్‌కు మారిపోతూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా ఒకేదానికి పరిమితమయ్యేలా స్క్రీన్ లాక్ చేసి ఇవ్వండి.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఐఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. టెక్నాలజీ రంగంలో ఈ ఇద్దరూ రారాజులు. కానీ వీళ్ల పిల్లలు మాత్రం ఎన్నడూ ఆ టెక్నాలజీకి బానిసలు కాలేదంటే దానికి కారణం వీళ్లే. ఈ ఇద్దరూ సృష్టించిన టెక్నాలజీకి ప్రపంచమంతా బానిసలయ్యారేమోగానీ.. వీళ్ల ఇంట్లో పిల్లలు మాత్రం కాదు. ఒకప్పుడు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తమ పిల్లలను టెక్నాలజీకి ఎందుకు దూరంగా ఉంచాల్సి వచ్చిందో వీళ్లు వివరించారు.
ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తమ పిల్లలకు ప్రపంచంలోని అత్యున్నత టెక్నాలజీని క్షణాల్లో అందించగలడు. కానీ తన కూతురికి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఓ గేమ్‌కు బానిసవుతుందని తెలిసి.. స్క్రీన్ టైమ్‌పై పరిమితి విధించారు.
బిల్ గేట్స్ ఏం చేశారంటే..
పిల్లలను ఈ స్క్రీన్లకు దూరం చేయడం మా వల్ల కావడం లేదన్న పేరెంట్స్ ఒక్కసారి ఈ టెక్ జెయింట్స్ గురించి తెలుసుకోండి. వాళ్లు తమ పిల్లలను మొబైల్ స్క్రీన్లకు బానిసలవకుండా ఎలా నియంత్రించారో చూడండి.
డిన్నర్ టేబుల్ దగ్గర నో సెల్‌ఫోన్ రూల్ ఇప్పటికీ పాటిస్తారు. ఇంట్లో అందరూ కలిసి ఓ స్క్రీన్ టైమ్ పెట్టుకున్నామని, ఎవరూ దానిని అతిక్రమించరని కూడా గేట్స్ చెప్పారు.
అలాగని తన కూతురిని ఆయన పూర్తిగా టెక్నాలజీకి దూరం చేయలేదు. కాకపోతే ఆమె వాడే విధానాన్ని నియంత్రించారు. ఇది ప్రతి తల్లిదండ్రులకు ఓ పాఠంలాంటిది.
స్టీవ్ జాబ్స్ ఏం చెప్పారంటే..
ఐఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కూడా ఇంట్లో ఇదే రూల్ పాటించారు. 2012లో ఆయన మరణించక ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన లేటెస్ట్ ఐప్యాడ్ తన పిల్లల దగ్గర లేదని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తమ పిల్లలు టెక్నాలజీని పరిమితికి మించి వాడకుండా చూస్తామని ఆయన చెప్పారు.
పచ్చని ప్రకృతి అందాల మధ్య, సహ్యాద్రి పర్వతాల నడుమ, నేత్రావతీ నదీ తీరంలో… ‘మంజునాథాయ నమః’ అంటూ నినదించే భక్తజనఘోషతో అలరారే క్షేత్రం ధర్మస్థల మంజునాథస్వామి ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు… భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవక్షేత్రమిది.
శైవక్షేత్రం అనగానే… శివలింగం, నంది విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. కానీ మంజునాథ ఆలయంలో ఈ రెండే కాకుండా నలుగురు ధర్మదేవతల్నీ, జైనులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే బాహుబలి విగ్రహాన్నీ దర్శించుకోవచ్చు. కర్ణాటకలోని దక్షిణ కన్నడలో కనిపించే ఈ ధర్మస్థల మంజునాథ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలనూ, కార్తిక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవాన్నీ చూసేందుకు రెండు కళ్లూ చాలవని భక్తులు చెబుతుంటారు. సుమారు 800 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలోని పరమేశ్వరుడిని హెగ్గడే కుటుంబానికి చెందిన జైనులు ప్రతిష్ఠించడంతో పాటు అప్పటినుంచీ వాళ్ల వారసులే ఆలయ బాధ్యతల్ని చూస్తున్నారు. శ్రీ క్షేత్రంగా, ధర్మస్థలగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో వైష్ణవులే అర్చకులుగా ఉండటం విశేషం.
స్థలపురాణం ధర్మస్థలను ఒకప్పుడు కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నివసించే బీర్మన్న పెర్గడే, అతని భార్య అమ్ము బల్లాల్తీ ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేసేవారు. ఓ రోజు వీళ్ల ఇంటికి ధర్మదేవతలుగా పిలిచే కాలరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారిలు మారువేషంలో రావడంతో ఈ జంట ఎప్పటిలానే ఆదరించింది. ఆ రాత్రి బీర్మన్నకు ఈ ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేసి ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలని అనుకున్నట్లుగా వివరించడంతో మర్నాడే బీర్మన్న తనవాళ్లందరినీ తీసుకుని ఇల్లువదిలి వెళ్లిపోయాడట. కొన్నాళ్లకు మళ్లీ ఆ దేవతలే బీర్మన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలను ప్రతిష్ఠించమని చెప్పడంతో… తన ఇంటికి తిరిగి వచ్చి వాళ్లు చెప్పినట్లుగా చేశాడట.
ఆ సమయంలో పూజాది కార్యక్రమాలను నిర్వహించేందుకు వచ్చిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే మంచిదని సూచించడంతో అన్నప్ప అనే మరో భక్తుడు ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట. కొన్నాళ్లకు భీర్మన్న వంశానికి చెందిన దేవరాజ హెగ్గడే అనే భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయానికి ఆహ్వానించాడట. ఆ స్వామీజీ శివలింగానికి విశేషమైన పూజాకార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ జరుగుతున్న మంచిపనుల్ని చూసి ఈ ప్రాంతానికి ధర్మస్థల అనే పేరు పెట్టాడనీ, అప్పటినుంచీ ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందనీ అంటారు.
ఎన్నో సేవాకార్యక్రమాలు… ఈ ఆలయాన్ని నిర్మించింది బీర్మన్న కావడంతో అప్పటినుంచీ ఆ వంశస్థులే ఇక్కడ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబ పెద్దను ధర్మాధికారిగా పిలుస్తారు. ఆ ధర్మాధికారి ఆలయ బాధ్యతల్ని చూసుకుంటూనే స్థానికులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించే పెద్దగానూ వ్యవహరిస్తాడు. అదేవిధంగా ఇక్కడకు వచ్చేవారికి లేదనకుండా భోజనం పెట్టడం… చుట్టుపక్కల ప్రాంతాలవారికి అవసరమైన విద్య- వైద్యం-ఉపాధి కల్పనకూ తోడ్పడటం, పేద జంటల పెళ్ళిళ్లు చేయడం, గ్రామాభివృద్ధి వంటి కార్యక్రమాలనూ నిర్వహించడం వంటివన్నీ ధర్మాధికారి బాధ్యతలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరేంద్ర హెగ్గడే ఆ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఇక్కడ కార్తికమాసంలో చేసే శివారాధననూ చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. కార్తిక మాసంలో లక్షదీపోత్సవంతో పాటు అయిదురోజులు స్వామికి చేసే ప్రత్యేక పూజలనూ ఆ తరువాత సర్వధర్మ, సాహిత్య సమ్మేళనాల్నీ చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలి వస్తారు.
ఎలా చేరుకోవచ్చు ఈ ఆలయం బెంగళూరు నుంచి 300, మంగళూరు నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వచ్చే భక్తులు మంగళూరు రైల్వేస్టేషన్‌లో దిగితే.. అక్కడనుంచి ఆలయానికి బస్సులూ, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకునేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగొచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన రోశయ్య.. ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు. అంతేకాకుండా తమిళనాడుకి గవర్నర్ గా పనిచేసిన ఆయన.. గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ చదివారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.. బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా రోశయ్యకి మంచి పేరుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. ఆ తరవాత రోశయ్య 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఆ తర్వాత గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.