Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
బిగ్‌బాస్-5 చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచీ 13వ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ కేవలం తన గేమ్ తోనే అందర్నీ ఆకర్షించిన ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ ప్రయాణం ముగిసింది. ట్రాన్స్ జెండర్‌గా బిగ్‌బాస్ హౌస్ లోకి ఏంటరైన పింకీ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఆటతోనే కాకుండా, అందంతో సైతం ప్రేక్షకులని ఆకర్షించింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ముందుగానే సోషల్ మీడియాలో తెలుస్తున్నా కూడా ఎలిమినేషన్ అయ్యేవరకూ టెన్షన్ గానే ఉంటోంది. ఎందుకంటే రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఐదో సీజన్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో ఇప్పటివరకు హౌస్‌లో మిగిలివున్న వారంతా విజేతలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చాలావారాలు హౌస్ లో సేఫ్ అవుతూ 19మంది కంటెస్టెంట్స్ ని దాటుకుంటూ వాళ్ల గేమ్ ని ప్రూవ్ చేసుకున్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. అందులో ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ప్రియాంక , కాజల్ ఇద్దరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారని గతవారం రోజులుగా టాక్ వినిపిస్తోంది. అన్ అఫీషియల్ సైట్స్ లో ఓటింగ్ ముగిసిన తర్వాత అన్ని చోట్లా ప్రియాంకసింగ్ లీస్ట్ లోనే ఉంది. దీంతో పింకీ ఎలిమినేట్ అవుతుందని ముందుగానే చెప్పేశారు. తాజా వీక్‌లో ఆమె ఎలిమినేట్ అయినట్లు సోషల్‌మీడియాలో కోడైకూస్తోంది.
బాలయ్య బాక్సాఫీస్ దుమ్ముతులుపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ ఎన్నో అంచనాలతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు మించి తొలి షోతోనే మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ తొలి రోజు సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. బొయపాటి మార్క్ ఎలివేషన్స్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడా ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయన్న మాటలు వినిపిస్తున్నా.. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు ఫ్యాన్స్.
ఓవరాల్‌గా మౌత్ టాక్ బాగుందని రావడంతో జనాలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు ఈ బోర్డులు కనిపించి చాలా రోజులైందనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ జాతర నడిచింది. దీంతో ఊహించిన దానికంటే కలెక్షన్లు కాస్త ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్‌గా ఈ మూవీకి తొలిరోజు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ నైజాం- 4.39 కోట్లు సీడెడ్- 4.02 కోట్లు ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు వెస్ట్ గోదావరి- 96 లక్షలు గుంటూరు- 1.87 కోట్లు కృష్ణా- 81 లక్షలు నెల్లూరు- 93 లక్షలు
మొత్తంగా అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకోవడం, మౌత్ టాక్ బాగుండటం, మరో వారం వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘అఖండ’కు కలిసిరానుంది. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఈ వారాంతం ముగిసేసరికి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
థియేటర్లలో ఫ్యాన్స్ గోలల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అని కొందరు ఫస్ట్ షో సినిమాకి వెళ్లినా.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఆ డైలాగులు వినడానికి మళ్లీ థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చాలామంది అభిమానులు ఒక్క రోజులోనే రెండు సార్లు సినిమా చూసేసారు. దీంతో 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగా ఉంటుంది. కానీ అఖండ అక్కడ కూడా ప్రభంజనాన్ని సృష్టించింది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రికార్డులను సైతం దాటేసి దూసుకుపోతోంది ‘అఖండ’. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య సినిమాకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ సినిమా ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే దాదాపు 2.75 కోట్లు. బాలయ్య కెరీర్‌లోనే ఇది మూడో బెస్ట్ ఓపెనింగ్ ఇది. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు 3.74 లక్షల డాలర్స్, గౌతమీ పుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్స్ వసూలు చేసింది. తాజాగా అఖండ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగులో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు వసూలు చేస్తే, నాగచైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్‌ను అఖండ సినిమా క్రాస్ చేసింది. మాస్ హీరోకి పక్కా అర్థం చెప్పిన బాలయ్య ‘అఖండ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 15 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిలవడం… ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది.
శబరిమల క్షేత్రం.. కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొనివుంది. అక్కడ వేంచేసి ఉన్న అయ్యప్పస్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మలయాళ వృశ్చికమాసం (నవంబరు-డిసెంబరు)లో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందుకోసం కార్తీకం ముందు నుంచి దీక్ష తీసుకుంటారు. ఆ రోజు నుంచి భక్తుల జీవనశైలి మారిపోతుంది. నల్లని దుస్తులు ధరించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ. వారు సాగించే దీక్షలోని నియమాలు సామాన్యులకు కఠినమే. అలాగే దీక్షా సమయంలో అందరూ ‘స్వామి’గా భావించి వ్యవహరించడం అపురూప అనుభూతిని ఇస్తుంది. మండలకాలం అంటే 41 రోజుల పాటు స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు బయలుదేరుతారు. నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు… తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి మాలధారుల శిరస్సున ఉంచుతారు.
చిన్నపాదం.. పెద్దపాదం ఇరుముడి తలదాల్చిన భక్త బృందం ఎరుమేలి నుంచి అసలు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ దీక్షకు మతంతో సంబంధం లేదన్న వాస్తవాన్నీ, అసలైన లౌకిక భావన భారతీయుల సొంతమనీ వెల్లడి చేసే వేదిక ఎరుమేలే. హైందవ ధర్మానుసారం దీక్షచేసిన భక్తులు తొలుత ఇక్కడి వావర్ మసీదును దర్శించుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్భంలోనే రంగులు జల్లుకొని వాద్య బృందాలు తోడు రాగా ‘పేటతుల్లాల్’ను నిర్వహిస్తారు. పిదప ఎరుమేలిలోని ధర్మశాస్తకు పూజలు చేస్తారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరే పెద్దపాదం, చిన్నపాదం అనే మార్గాలు ఉన్నాయి. చిన్నపాదం అంటే ఎరుమేలి నుంచి పంపాతీరం వరకూ వాహనాల్లో ప్రయాణించి అక్కడ స్నానం చేసి నీలిమలను అధిరోహిస్తారు.
పెద్దపాదం అంటే ఎరుమేలి నుంచే నడుస్తూ దాదాపు 80 కిలోమీటర్లు నడిచి కొండకు చేరడం! ఈ వనయాత్ర చేసే భక్తులు మొదట ‘పెరుర్‌తోడు’కు వెళ్లి స్నానాదికాలు ముగించి అక్కడి దేవుణ్ని పూజిస్తారు. తరవాత కాలైకట్టి అనే ప్రాంతానికి వెళ్తారు. పిదప అళుదా నదీ తీరానికి వెళ్లి పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నదీ ప్రవాహానికి కారణమైన గాథను గురుస్వాములు తప్పనిసరిగా చెబుతారు. అయ్యప్ప చంపిన మహిషి కార్చిన కన్నీరే నదిగా మారిందని అంటారు. ఇక్కడ చిన్నరాయిని తీసుకొని అళుదామేడు దాటి ఇంజిపరైకోటై చేరుకొంటారు. కళిడం కుండ్రు అనే ప్రదేశంలో ఈ రాయిని వేస్తారు. కరిమల యాత్రకు శ్రీకారం చుడుతారు. పెరియనపట్టం, చెరియనపట్టం మీదుగా పంపకు (దీనినే పంబ అని వ్యవహరిస్తారు) చేరతారు.. ఈ వనయాత్రలోనే కొందరు భక్తులు శక్తిపూజ చేసి అన్నదానం చేస్తుంటారు.
పంపానదిలో స్నానం.. పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరవాత దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కాలి. అనంతరం శరంగుత్తికి వెళ్లాలి. ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు- ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన శరాలను గుచ్చాలి. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలు, కోనలు దాటుకొంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు. ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సిద్ధమవుతారు. ఆలయానికి ద్వారపాలకులైన కడుత్తస్వామి, కరుప్పస్వామిలకు టెంకాయలు కొడుతారు. ఆ మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందికి దిగడంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.
200 ఏళ్ల క్రితమే.. పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం 7రూపాయలు వచ్చిందని పందళరాజు వంశీయుల రికార్డుల్లో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడి వుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి కావడంతో ఆలయాన్ని పునర్నిర్మించారు
ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దేవస్థానం బోర్డువారికి అప్పగించారు. ఆ తర్వాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంతో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలో కూడా తెరవడం ప్రారంభించారు.
స్వామికి నెయ్యాభిషేకం.. చిన్నపాదం, పెద్దపాదం ఏదైనా యాత్ర ఆద్యంతం స్వామి నామసర్మణతో శరణుఘోషతో సాగుతుంది. వేలాదిమంది భక్తులతో కోలాహలంగా వుండే ఈ ప్రాంతం అనునిత్యం స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో.. లాంటి ఆధ్యాత్మిక నినాదాలతో అక్కడి కొండలు ప్రతిధ్వనిస్తాయి. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు చేయించే ఈ అభిషేకాన్ని ఇలా విశ్లేషిస్తారు. ‘ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ఇందులో ఇమిడివుంది. అలాగే నెయ్యిని తీసుకొచ్చిన కొబ్బరి చిప్పల్ని హోమాగ్నిలో వెయ్యాలి. భక్తుడి కర్మఫలాన్ని ఆ ప్రజ్వలనం ధ్వంసం చేస్తుంది’. తరువాత భక్తులు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని , నాగరాజ, నాగాయక్షి ఆలయాలను దర్శించుకొంటారు. మాలికాపురత్తమ్మ ఆలయంలో కొబ్బరికాయను ఆ గుడి చుట్టూ తిప్పి వదిలేస్తారు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టే ఆచారం లేదు.! ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర మకరసంక్రాంతి రోజున తుది ఘట్టానికి చేరుతుంది. వేనవేల సంఖ్యలో భక్తులు శబరికొండ నుంచి నీలకల్ ప్రాంతం వరకు వుంటారు. తిరువాభరణాల వూరేగింపు చూసిన భక్తులు స్వామి శరణాలను వల్లిస్తారు.
ఆంధ్రా నుంచి తాంత్రిలు.. 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపై నుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985లో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభమైంది. బెంగళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి ముందుకురావడంతో 2000లో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది. శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశం అయిన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టురాజుల వంశీయులను తీసుకెళ్ళారని చెబుతారు.
అయ్యప్ప దీక్షా నియమాలు
అయ్యప్ప మాలధారులు నలుపు, హనుమాన్ కాషాయం రంగు వస్త్రాలు ధరించాలి.
గురుస్వామి, తల్లిదండ్రులు, అర్చకస్వామి ద్వారా మాల ధరించాలి.
ముందు రోజు మద్యం, మాంసం తినరాదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు పూర్తి చేయాలి.
ఉదయం, సాయంత్రం రెండు పూటల చన్నీటితో స్నానం చేయాలి. పగలు బిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. వేకువజామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్పస్వామికి పూజ చేయాలి.
అశుభ కార్యాల్లో పాల్గొనవద్దు. అసవరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయొద్దు.
దీక్షలో ఉండగా రక్తసంబంధీలకులు, దగ్గరి బంధువులు, దాయదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి. నడిచే దారిలో శవం ఎదురైతే, జన సందోహంలో తిరిగినప్పుడు రజస్వల అయితే, బహిష్టు అయిన వారు ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణుఘోష చెప్పాలి.
స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే బిక్ష, నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి.
స్వామికి నెయ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిదానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.
శబరిమల ఇలా చేరుకోవచ్చు…
రైలులో వెళ్లే భక్తులు చెంగనూర్ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి కారు లేదా బస్సుల ద్వారా పంప చేరుకోవచ్చు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి శబరిమలకు రవాణా సౌకర్యం ఉంది.
విమానాల ద్వారా వచ్చేవారు కొచ్చి లేదా తిరువనంతపురం విమానాశ్రయాలకు చేరుకోవాలి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. అక్కడ నుంచి కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకోవాలి.
నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్ సిద్ధం కాగా… టీజర్లు, ట్రైలర్లతోనే మరో విజయం భారీ హైప్ సాధించాయి. దాంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బోయపాటికి, బాలకృష్ణకు హ్యాట్రిక్ లభించిందా.. ‘అఖండ’ అవతారంలో బాలకృష్ణ గర్జన ఎలా ఉంది? అని తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం…
గజేంద్ర సాహు అనే పేరు మోసిన టెర్రరిస్ట్ పోలీసుల ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని మహారుద్ర పీఠంను చేరుకుంటాడు. తనను ఇబ్బంది పెట్టిన ఈ వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవాలని పీఠాధిపతిని చంపి తానే పీఠాధిపతిగా మారుతాడు. అదే సమయంలో అనంతపురంలో రామచంద్రరాజు అనే వ్యక్తికి మగ కవలలు పుడతారు. వారిలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంటే, మరో బిడ్డ ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు. అదే సమయంలో వారింటిలోకి అడుగు పెట్టిన అఘోరా (జగపతిబాబు) చనిపోయిన బిడ్డను తీసుకెళ్లిపోతాడు. చనిపోయిన బిడ్డ కాశీ విశ్వనాథుడి సన్నిధానానికి చేరుకుంటాడు. పరమేశ్వరుడి దయతో ఆ బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. కొన్నేళ్ల తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. అనంతపురంలో పెరిగిన బిడ్డ మురళీకృష్ణ (నందమూరి బాలకృష్ణ) ఆ ప్రాంతంలో ఫ్యా్క్షనిజం రూపుమాపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రాంతంలో స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించి ప్రజలకు సేవ చేస్తుంటాడు.
మురళీ కృష్ణ చేసే మంచి పనులు చూసి ఆ జిల్లాకు వచ్చిన కలెక్టర్ శరణ్య (ప్రగ్యా జైశ్వాల్) అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మరో వైపు.. అదే ప్రాంతంలో కాపర్ మైనింగ్ వ్యాపారం చేసే వరదరాజులు (శ్రీకాంత్)కి, తన మైన్‌లో యురేనియం ఉందని తెలియడంతో దాన్ని వెలికి తీసే పనుల్లో బిజీగా ఉంటాడు. అక్కడ వచ్చే వ్యర్థాలను భూమిలోకి పంపేయడంతో చిన్న పిల్లలు చనిపోతారు. విషయం తెలుసుకున్న మురళీ కృష్ణ ..వరదరాజులకి ఎదురెళతాడు. అప్పుడు ఓ ప్లానింగ్ ప్రకారం జరిగిన పరిస్థితుల నడుమ మురళీ కృష్ణ కట్టించిన హాస్పిటల్‌లో బాంబ్ పేలి మినిస్టర్ చనిపోతాడు. దాంతో మురళీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో ఒంటరైన శరణ్యను చంపడానికి వరదరాజులు ప్రయత్నిస్తాడు. అప్పుడే అఖండ రంగ ప్రవేశం చేస్తాడు. అసలు అఖండ ఎవరు? వరదరాజుకి ఎందుకు ఎదురెళతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
బాలకృష్ణ-బోయపాటి కలయిక నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాలన్నీ పక్కాగా కుదిరిన సినిమా ఇది. శివుడు అలియాస్ అఖండగానూ.. మురళీకృష్ణ పాత్రలోనూ బాలకృష్ణ తనదైన శైలిలో ఒదిగిపోయారు. అఖండ పాత్రలోనైతే ఆయన రౌద్ర ప్రదర్శన తీరు విశ్వరూపమే. ఇందులోని ఒక పాత్ర ప్రళయాన్ని గుర్తు చేస్తే, మరో పాత్ర ప్రకృతిలా అందంగా తెరపై కనిపిస్తుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు మొదలుకొని చివరి వరకు ప్రతీ సన్నివేశం కూడా బాలకృష్ణ మాస్ ఇమేజ్, బోయపాటి మార్క్ థీమ్ మేరకు సాగుతుంది. అభిమానులతో ఈలలు కొట్టించే ఎలివేషన్ సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయి.
ప్రథమార్థం మురళీకృష్ణ – శరణ్యల మధ్య ప్రేమాయణం, పీఠాధీశుడిని చంపి శక్తి స్వరూపానంద స్వామిగా అవతరించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. రైతుగా, ఆ ప్రాంత ప్రజల మేలుని కోరే వ్యక్తిగా మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ ఆకట్టుకుంటారు. ప్రకృతి గురించి ఆయన చెప్పే సంభాషణలు అలరిస్తాయి. జై బాలయ్య పాట కిక్కెక్కిస్తే, అడిగా అడిగా.. పాటలో బాలకృష్ణ – ప్రగ్యా జోడీ చూడముచ్చటగా కనిపిస్తుంది. ఒకే పాటలోనే నాయకానాయికలకి పెళ్లి కావడం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్భలంతోనే రెండో పాత్ర అఖండని పరిచయం చేసిన తీరు బాగుంది. ద్వితీయార్థానికి ముందు అఖండ పాత్ర ఆగమనం జరుగుతుంది. సినిమా అక్కడిదాకా ఒకెత్తు.. అఖండ పాత్ర ప్రవేశం తర్వాత మరో ఎత్తు. ప్రకృతి, చిన్నారులు, ముక్కంటి జోలికి వచ్చిన ప్రతినాయకుడిని అఖండ ఎలా అంతం చేశాడనేది ద్వితీయార్థంలో కీలకం. బాలకృష్ణ చేసిన రెండో పాత్రని అఘోరాగా చూపించడం సినిమాకి ప్లస్సయ్యింది. అఖండ శివుడి అంశతోనే పుట్టాడనే సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి ఆ పాత్రలో బాలకృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా నమ్మేలా ఉంటాయి. ఆయన చెప్పే ప్రతీ సంభాషణ ఓ పోరాటంలా, ప్రతీ పోరాటం ఓ క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించేలా ఉంటుంది.
బాలకృష్ణని బోయపాటి శక్తిమంతంగా చూపిస్తారని తెలుసు.. కానీ ఇందులో డోస్ మరింత పెంచారు. ఇందులో కథ కంటే కూడా పాత్రల్ని మలిచిన తీరే ఆకట్టుకుంటుంది. దేవుడు, విజ్ఞానానికీ మధ్య సంబంధం గురించి, హిందుత్వం గురించీ, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని.. శివుడు మామూలు మనిషి కాదంటూ బాలకృష్ణ చెప్పే సంభాషణలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. చిన్నారులు, దేవాలయాలు, దేవుడు, ప్రకృతి తదితర అంశాల నేపథ్యంలో అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. మొత్తంగా మాస్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేటర్లకి రప్పించే పక్కా పైసా వసూల్ చిత్రమిది.
బాలకృష్ణ వన్ మేన్ షోలా ఉంటుందీ చిత్రం. ఆయన డైలాగులు విన్నాక.. చేసే విన్యాసాలు చూశాక బాలకృష్ణ మాత్రమే చేయగల కథ అనిపిస్తుంది. జై బాలయ్య పాటలో ఆడిపాడిన తీరు అభిమానుల్ని అలరిస్తే, ఆయన చేసిన పోరాటాలు మరో స్థాయిలో ఉంటాయి. బాలకృష్ణ రెండు పాత్రల్లో విజృంభించినప్పటికీ.. ఇందులోని మిగతా పాత్రలకి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. కథానాయిక ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా సినిమాలో కీలకమైనవే. ‘లెజెండ్’తో జగపతిబాబుని ప్రతినాయకుడిగా మార్చిన బోయపాటి శ్రీను.. ఈ సినిమాతో శ్రీకాంత్‌ని అలాంటి పాత్రలోనే చూపించారు. వరద రాజులుగా క్రూరమైన పాత్రలో ఆయన కనిపిస్తారు.
బాలకృష్ణతో తొలిసారి ఎదురుపడే సన్నివేశం, అఘోరాతో తలపడే సన్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. జగపతిబాబు, కాలకేయ ప్రభాకర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. శక్తిస్వరూపానంద స్వామిగా కనిపించిన ప్రతినాయకుడు కూడా తనదైన ప్రభావం చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా తమన్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. అఘోరా నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో నేపథ్య సంగీతం కోసం ఆయన పడిన కష్టం తెలుస్తుంది. రామ్‌ప్రసాద్ కెమెరా పనితనం, ఎం.రత్నం మాటలు చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. రామ్‌లక్ష్మణ్, స్టంట్ శివ పోరాట ఘట్టాలు మెప్పిస్తాయి. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయిక ఎందుకు ప్రత్యేకమో ఈ సినిమా మరోసారి స్పష్టం చేస్తుంది. మాస్ నాడి బాగా తెలిసిన బోయపాటి తనదైన మార్క్‌ని ప్రదర్శిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా బలంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బాలయ్య అభిమానులు ఆయన్నుంచి ఏం ఆశిస్తారో అన్నీ ‘అఖండ’లో ఉన్నాయి.
ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి. అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహాత్యాన్ని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు. ఈ అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా పేర్కొంటారు. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలలో అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. అక్కడి ‘త్రిపుర’ రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టడం విశేషం.
లలితాసహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ’ అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలూ కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి. చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. ఇందులో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషంగా పండితులు చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.
లలితా సహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుంచి వెలువడినవాడే భండాసురుడు. ముల్లోకాల మీదా యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ స్తోత్రం గుర్తుచేస్తుంది.
లలితాసహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్, అంగన్యాసమ్, కరన్యాసమ్, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ పఠించినా సరిపోతుంది. ఇక హోమంగానూ, అర్చనగానూ, పారాయణగానూ భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత. సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు.
విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. లలిత సహస్రనామం చివరలో ‘శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర’మని పేర్కొంటారు. అంటే ఇది అర్హులైన వారికి చెప్పాలన్న అర్థం వస్తుంది. ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తుంది. సాధకులకు, ఉపాసకులకు జ్ఞానమార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్ట విధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి. ఎంత చెప్పుకొన్నా లలిత సహస్రనామా ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించినా, విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం.. కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోల్చితే కొత్త వేరియంట్ ఆర్‌వాల్యూ ఎక్కువంటున్న నిపుణులు.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు సైతం లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.. కానీ ఈ వైరస్ గురించి నిజంగా మనకు ఇప్పటివరకు ఏం తెలుసు? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ… కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి మూడవ వేవ్ కు కారణం కావచ్చు. దీని ప్రకారం కొత్త కరోనా వేరియంట్ గురించి ఎక్కువగా భయపడే బదులు, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్(Omicron) అత్యంత అంటువ్యాధి. ఈ కారణంగా, ఇది మూడవ తరంగాన్ని తీసుకురాగలదు. అయితే, ఇది మునుపటి కంటే తక్కువ ప్రాణాంతకంగా ఉంటుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ కంటే సహజ రోగనిరోధక వ్యవస్థ కొత్త వేరియంట్‌ను ఓడించగలదు అని అన్నారు.
‘ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటి పట్ల ఒక నిర్ధిష్ట నిర్ధారణకు రావాలంటే వాటిని శాస్త్రీయ ప్రాతిపదికన పరీక్షించాల్సిన అవసరం ఉంది’ అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. ఒమిక్రాన్‌లో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయి. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఈ మ్యుటేషన్లు ఏర్పడ్డాయి అని తెలిపారు. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ రోగనిరోధక శక్తిని ఎదురించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. టీకాల వల్ల శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి లేదా మరే ఇతర ఇమ్యూనిటీ కూడా ఈ వైరస్‌ను ప్రభావితం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని కోవిడ్ వ్యాక్సీన్లను సమీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాక్సీన్లు, వైరస్ స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. దీని ఆధారంగానే వైరస్ పనిచేస్తుంది’ అని గులేరియా చెప్పారు.
చాలా స్వల్ప లక్షణాలు దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను కనుగొన్నారు. తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారమిచ్చారు. నవంబర్ 24న ఈ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. గత వారం దీన్ని ఆందోళనకర రూపాంతరంగా పేర్కొంటూ ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఈ వేరియంట్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో WHO పేర్కొంది. ఒమిక్రాన్‌తో రిస్క్ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తొలుత ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు. ఇప్పటివరకు ఈ వేరియంట్ బారిన పడిన ప్రజల్లో చాలా స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలు కనబడ్డాయని తెలిపారు. చాలా మంది రోగులు ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసటతో బాధపడుతున్నారని, ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా నుంచి చాలా దేశాలకు వ్యాపించింది. అమెరికా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చిన కొందరికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు. ఒమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయని, ఇందులో 30 మ్యుటేషన్లు స్పైక్ ప్రోటీన్‌లో సంభవించాయని ఆయన తెలిపారు.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. కిమ్స్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సీతారామశాస్త్రి సాయంత్రం 4.07 గంటలకు మృతి చెందారు” అని ప్రకటించాయి. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) సినిమాతో సినీ గేయరచయతగా అందరి దృష్టినీ ఆకర్షించిన చేంబోలు సీతారామశాస్త్రి ఆ చిత్రం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అయితే ఆయన సినీ రంగానికి పరిచయమైంది మాత్రం అంతకు రెండేళ్ల ముందు వచ్చిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో. ఆ చిత్రానికి కూడా కె. విశ్వనాథే దర్శకుడు. తొలి సినిమాలో సీహెచ్ సీతారామశాస్త్రి (భరణి) అనే పేరుతో ఆయన ‘తడిసిన అందాలలో…’ అనే పాట రాశారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి 1955 మే 20న జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన కాకినాడలో ఇంటర్, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో బీఏ పూర్తి చేశారు. అనంతరం రాజమహేంద్రవరంలో కొంతకాలం బీఎస్ఎన్ఎల్‌లో పని చేశారు. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌లో దాదాపు 800ల చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెల ఉత్తమ సినీ గేయరచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. సిరివెన్నెల చిత్రంతో 1986లో తెలుగు సినీ పాటల ప్రియులకు పరిచయమైన సీతారామశాస్త్రి అదే ఏడాది వంశీ దర్శకత్వం వహించిన ‘లేడీస్ టైలర్’ చిత్రంతో పాపులర్ ప్రేమ గీతాలు రాయడంలోనూ తన కలానికి అంతే పదను ఉందని నిరూపించుకున్నారు.
‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…, ఆది భిక్షువు వాడినేమి కోరేది, చందమామ రావే…’ వంటి పాటలతో తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్న సీతారామశాస్త్రి క్లాస్, మాస్ పాటలతో సినీ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు. సిరివెన్నెల 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాలని ఎన్నో సందర్భాల్లో చెప్పిన సీతారామశాస్త్రి ఆ దిశగా చెప్పుకోదగిన కృషి చేశారు. కెరీర్ తొలిరోజుల్లో ‘సిరివెన్నెల’ సినిమాకు ఆయన రాసిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘రుద్రవీణ’ చిత్రం సిరివెన్నెల కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని ‘తరలి రాద తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయిని…’ వంటి పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి.
తమ్ముడు గుర్తించిన టాలెంట్
సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు’ అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాసి చివరికి దివికేగారు.
బిగ్‌బాస్ – 5 సీజన్ ఇప్పటికి 12వారాలు పూర్తిచేసుకుంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ యాంకర్ రవి హౌస్ నుంచి ఇంటికొచ్చేశాడు. అయితే టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఉన్న రవి… అలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ కావడంతో అంతా షాకయ్యారు. సిరి, ప్రియాంక కంటే ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయో చూపించాలంటూ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. మరోవైపు రవి ఎలిమినేట్ కావడానికి గల ఏంటీ అని ఆరాతీస్తున్నారు.
ఇక మరోవైపు రవి రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రవిని ఇలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ చేయడానికి తన రెమ్యునరేషన్ కూడా ఒక కారణమంటూ వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో రవి మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట. వారానికి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. అంటే రవి 12 వారాలకు దాదాపు రూ. 80 లక్షల నుంచి రూ. 96 లక్షల వరకు తీసుకుంటున్నట్లుగా టాక్. అంటే బిగ్‌బాస్ విజేతకు అందించే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ కావడం విశేషం..
అలాగే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో టాప్-5లోకి రావడానికి ఎక్కువగా అబ్బాయిలే ఉండడంతో ఈసారి ఒక అమ్మాయిని పంపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రవిని ఎలిమినేట్ చేసారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి యాంకర్ రవి ఎలిమినేషన్ మాత్రం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ వాదిస్తున్నారు. గతంలో ఏ కంటెస్టెంట్ ఎలిమినేషన్‌కు రాని వ్యతిరేకత రవి విషయంలో రావడం గమనార్హం. ఈ వ్యవహారం ఏకంగా రాజకీయ రంగు కూడా పులుముకోవడం విశేషం. బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు కొద్దిరోజులకే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి డిసెంబర్ మొదటి వారంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో తెలుసుకుందామా…
అఖండ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలవుతోంది.
స్కైలాబ్ సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలకానుంది.
బ్యాక్ డోర్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బ్యాక్ డోర్. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 3న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరక్కార్: అరేబియన్ సముద్ర సింహం మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్: అరేబియన్ సముద్ర సింహం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్, కీర్తి సురేశ్, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
తడప్ తెలుగులో సంచలన విజయం సాధించిన ‘ఆర్‌ఎక్స్ 100’ తెలుగులో ‘తడప్’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్. మిలాన్ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ అవుతోంది.
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోయాయి.
డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.