Category Archives: Behind the Scenes

వామ్మో.. 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు లాగించేశారు

మనం మామూలుగా 3 నిమిషాల్లో ఎన్ని ఇడ్లీలు తినగలం.. మహా అయితే 2-3 మించి తినలేం కదా.. అయితే తమిళనాడులో జరిగిన ఇడ్లీ పోటీలో మాత్రం ఇద్దరు వ్యక్తులు కేవలం 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు చొప్పున ఆరగించి అందరినీ షాక్‌కు గురిచేశారు. తమిళనాడు పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ సాంబార్‌. అయితే ఇటీవల చాలా మంది ఇడ్లీలను కాదని ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇడ్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా.. ఈరోడ్‌ జిల్లా కడయంపట్టి ప్రాంతానికి చెందిన ‘పట్టాయ కేటరింగ్‌’ సంస్థ ఇడ్లీలు తినే పోటీ నిర్వహించింది.

ఈ పోటీలో పాల్గొనేవారికి నిర్వాహకులు కొన్ని నిబంధనలు విధించారు. 10 నిమిషాల గడువులో వీలైనన్ని ఎక్కువ ఇడ్లీలు తినాలి. తిన్న తర్వాత 5 నిమిషాల వరకు వాంతి చేసుకోకూడదు. పోటీలో పాల్గొనేవారిని 19-30 ఏళ్లు, 31-40 ఏళ్లు, 41-50 ఏళ్లు.. ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 25 మంది వరకు పాల్గొని ఇడ్లీలు తిన్నారు. 31-40 ఏళ్ల వయసు గ్రూపులో కుమార పాలయం ప్రాంతానికి చెందిన రవి, 41-50 ఏళ్ల వయసు గ్రూపులో భవానీ ప్రాంతానికి చెందిన రామలింగం.. కేవలం 3 నిమిషాల్లోనే 19 ఇడ్లీల చొప్పున తినేసి విజేతలుగా నిలిచారు. మిగిలిన వారెవరూ 19 ఇడ్లీలు తినలేకపోయారు. అదే సమయంలో ప్రతి గ్రూపులో ఎక్కువ ఇడ్లీలు తిన్నవారికి రూ.5వేలు, రెండో విజేతకు రూ.3,000, మూడో విజేతకు రూ.2,000, నాలుగో విజేతకు రూ.1,000 చొప్పున నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. ఈ ఇడ్లీ పోటీ ఏదో మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది కదా..


వన్నియర్‌ vs సూర్య.. వివాదంలో ‘జై భీమ్‌’.. అండగా నిలిచిన కోలీవుడ్

తమిళ హీరో సూర్య నటించిన ‘జై భీమ్‌’ సినిమా ఓవైపు ఓటీటీలో విజయదుంధుబి మోగిస్తుంటే.. మరోవైపు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. వన్నియర్‌ సామాజికవర్గ నేతలు, చిత్రబృందం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తమ వర్గాన్ని కించపరుస్తూ వాస్తవానికి విరుద్ధంగా చిత్రాన్ని తీశారని వన్నియర్ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మాత్రమేనని, ఇందులోని పాత్రలు, పేర్లు మార్చామని ఆ బృందం చెబుతోంది. మొత్తానికి రోజురోజుకీ ఈ రెండు వర్గాలు పరస్పర ప్రకటనలతో వాదనలు కొనసాగుతున్నాయి.

ఓవైపు వన్నియర్‌ సంఘాలు, పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) ప్రశ్నల అస్త్రాలు సంధిస్తుండగా.. మరోవైపు సూర్య వాటికి సమాధానమిస్తూ వస్తున్నారు. ఆయనకు కోలీవుడ్ అండగా నిలుస్తోంది. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య నటించిన ‘జై భీమ్‌’ దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో పోలీసు యంత్రాంగం తీరు వల్ల ఓ గిరిజన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, ఆపై అతని భార్య న్యాయపోరాటం చేయడం.. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించడం.. న్యాయానికి హారతులు పట్టడమే చిత్ర అసలు కథ. అయితే ఇందులో పోలీసు అధికారి పాత్రను ‘వన్నియర్‌’ సామాజిక వర్గానికి సంబంధించినట్టు చిత్రీకరించడం, అందుకు ఆధారాలు చిత్రంలో అక్కడక్కడ కనిపించాయి. ఈ అంశాలే ప్రస్తుత రచ్చకు కారణాలుగా మారాయి.

అయితే సదరు సామాజిక వర్గం ప్రశ్నించిన తర్వాత ఆ వర్గానికి సంబంధించిన ఆనవాలను చిత్రంలో నుంచి తొలగించి.. మార్పులు చేసింది ‘జై భీమ్‌’ బృందం. అసలు ప్రశ్న ఏంటంటే?.. అసలు సినిమాలో ఎందుకు తమ సామాజిక వర్గాన్ని ప్రస్తావించాలి? ఆ తర్వాత ఎందుకు తొలగించాలన్నదే. అంతేకాకుండా పోలీసు అధికారి అసలు పేరు ‘ఆంథోని’ పేరును ఎందుకు వాడలేదు’, ‘న్యాయపోరాటం చేసే ఆ మహిళ అసలు పేరు పార్వతి కానీ చిత్రంలో సెంగనిగా’ మతపరంగా మరోరూపం ఇవ్వడం ఎందుకు’.. వంటి ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు. ఇందుకు బహిరంగంగా సూర్య క్షమాపణలు చెప్పాలని కూడా పీఎంకే నేత అన్బుమణి రామదాసు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు వన్నియర్‌ సంఘం సూర్యకు లీగల్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ‘జైభీమ్‌’ చిత్ర నిర్మాత, నటుడు సూర్యకు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. ఈ వార్‌ ట్విట్టర్‌కు కూడా ఎక్కింది. సామాజిక వర్గ సంఘాలు, పీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు.. సూర్య అభిమానుల మధ్య ట్వీట్ల ఘర్షణ జరుగుతోంది. సూర్యకు మద్దతుగా నిలిచేవారి #westandwithsuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అలాగే చిత్ర పరిశ్రమలోని నిర్మాతల మండలి కూడా సూర్యకు మద్దతుగా అన్బుమణికి ఓ లేఖ రాసింది. సీనియర్‌ దర్శకుడు భారతిరాజా, నటుడు సత్యరాజ్, నిర్మాత థానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా అన్బుమణికి రాసిన లేఖల ద్వారా సూర్యకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

సూర్యను ఓ సామాజిక వర్గ విరోధిగా మార్చే ప్రయత్నం చేయకండని భారతిరాజా కోరారు. ఎన్నో సమస్యలుండగా సినిమాలోని ఈ విషయంపై గళమెత్తడం బాధాకరమని తెలిపారు. అలాగే సత్యరాజ్‌ స్పందిస్తూ.. ‘పలు చిత్రాలు అభినందించే రీతిలో ఉంటాయి. వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే కీర్తించదగ్గ చిత్రాలుగా నిలుస్తాయి. ఆ వరుసలో ‘జై భీమ్‌’ ఉంది. సూర్య ‘ఎదర్కుం తునిందవన్‌’ (దేనికైనా రెడీ). ఆయన్ను అభినందించాల్సిన తరుణమి’దని పేర్కొన్నారు. అయితే ఈ వివాదాన్ని దీని రాద్ధాంతం చేస్తూ గోడ పత్రికలను చించడం, సూర్యను కొడితే రూ.లక్ష ఇస్తానని పీఎంకే నేత ప్రకటించడం వంటి పనులు అత్యంత దారుణమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.


Akhanda Trailer: బాలయ్య ‘అఖండ’ గర్జన.. ద్విపాత్రాభినయంతో విశ్వరూపం

సింహా’, ‘లెజెండ్‌’.. సూపర్‌ హిట్ చిత్రాలతో క్రేజీ కాంబినేషన్‌గా మారారు నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. వీరి కలయిలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘అఖండ’. ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది. పోస్టర్లు, టైటిల్‌ గీతం విశేషంగా ఆకట్టుకోవడంతో ట్రైలర్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం ఆ కానుకను అందించింది. ‘అఖండ రోర్‌’ పేరుతో ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేసింది.

బాలకృష్ణ అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. బాలకృష్ణ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలనిజాన్ని చూపించారు. జగపతి బాబు కూడా కొత్త గెటప్పులో కనిపించాడు. శ్రీకాంత్ నిజంగానే భయపెట్టేశాడు. ట్రైలర్స్‌లో డైలాగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించి మెప్పించారు. తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


సీటీమార్ మూవీ రివ్యూ

చిత్రం: సీటీమార్‌; న‌టీన‌టులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా, అప్సర రాణి (ప్రత్యేక‌గీతం) త‌దిత‌రులు
సంగీతం: మ‌ణిశర్మ
నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌ నంది
బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుద‌ల‌: 10-09-2021

‘మ‌హిళా సాధికార‌త‌కు మ‌నం ఏవో గొప్ప ప‌నులు చేయ‌న‌క్కర్లేదు. మ‌న చుట్టూ ఉన్న ఆడ‌పిల్లల‌కు అండ‌గా నిల‌బ‌డితే చాలు.. మంచి స‌మాజం ఏర్పడుతుంది’ అనే ఓ పాయింట్‌ను తీసుకుని గోపీచంద్ హీరోగా ద‌ర్శకుడు సంప‌త్ నంది తెర‌కెక్కించిన చిత్రం ‘సీటీమార్‌’. అన్ని కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ల్యాబ్‌కే పరిమితమైంది. సెకండ్ వేవ్ త‌ర్వాత ఇప్పుడిప్పుడే థియేట‌ర్స్‌ సందడిగా మారుతుండటంతో వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాను నిర్మాతలు రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘సీటీమార్’ ప్రేక్షకుల‌ను ఏ మేర‌కు ఆట్టుకుంది?.. నిజంగానే ఆడియెన్స్‌తో సీటీలు వేయించుకుంటోందా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

కథేంటంటే:

కార్తీక్ (గోపీచంద్‌) ఆంధ్రా మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. క‌డియంలో త‌న తండ్రి స్థాపించిన రామ‌కృష్ణ మెమోరియ‌ల్ స్కూల్ ద్వారా ఆడపిల్లలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ స్కూల్ మూతపడే పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఎలాగైనా తాను తీర్చిదిద్దిన కబ‌డ్డీ జ‌ట్టుని జాతీయ స్థాయి పోటీల్లో గెలిపించి, ఆ జ‌ట్టు ద్వారా ఊళ్లోని స్కూల్ స‌మస్య వెలుగులోకి తీసుకురావాల‌ని అనుకుంటాడు. ఆ ప్రయ‌త్నంలో ఉన్న కార్తీక్‌కి ఊళ్లోనే ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? దిల్లీలో పోలీస్ అధికారిగా ఉద్యోగం చేస్తూనే మాఫియాని న‌డిపిస్తున్న మాకన్‌సింగ్ (త‌రుణ్ అరోరా)తో కార్తీక్‌కి ఎలా వైరం ఏర్పడింది? త‌న జ‌ట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజేత‌గా నిలిచిందా? కార్తీక్ ఆశ‌యం నెర‌వేరిందా? తెలంగాణ క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్ జ్వాలారెడ్డి (త‌మ‌న్నా), కార్తీక్‌కి మధ్య సంబంధం ఏంటన్నది మిగతా కథ.

తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు రావ‌డం చాలా త‌క్కువ‌. వ‌చ్చినా క‌బ‌డ్డీపై రెండు, మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌ర్శకుడు సంప‌త్ నంది… క‌బ‌డ్డీ అనే స్పోర్ట్స్‌ను బేస్ చేసుకుని ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘సీటీమార్‌’ సినిమాను తెర‌కెక్కించాడు. అమ్మాయిల అన్ని రంగాల్లో ముంద‌డుగు వేయాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ విష‌యంలో అనే విష‌యాన్ని ఒక ప‌క్క ట‌చ్ చేస్తూనే క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించాడు. గోపీచంద్‌కు ఉన్న యాక్షన్ హీరో అనే ఓ ఇమేజ్‌‌కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఫైట్స్‌, పాట‌ల‌ను మిక్స్ చేసి సినిమాను రూపొందించాడు.

ఎలా ఉందంటే..

ప్రథమార్ధమంతా గోదావ‌రి గ‌ట్లు, ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలతోపాటు… ఊళ్లో అమ్మాయిల్ని ఆట‌ల‌వైపు పంపించే విష‌యంలో త‌ల్లిదండ్రుల్లో ఉండే అపోహ‌లు, ప‌ల్లెటూరి రాజ‌కీయాలు కీల‌కం. సెకండాఫ్‌లో పూర్తిగా దిల్లీ, క‌బ‌డ్డీ, మాక‌న్ సింగ్ మాఫియా నేప‌థ్యంలో సాగుతుంది. తొలి స‌గ‌భాగంలో కడియం బ్రదర్‌పాత్రలో రావు ర‌మేష్ చేసే రాజ‌కీయం ఆక‌ట్టుకుంటుంది. గోదావ‌రి యాస మాట్లాడుతూ ఆయ‌న చేసే సంద‌డి న‌వ్విస్తుంది. అమ్మాయిల త‌ల్లిదండ్రుల్ని ఒప్పించి జాతీయ స్థాయి పోటీల కోసం దిల్లీ వెళ్లిన కార్తీక్‌కి అక్కడ ఎదురైన సవాళ్లు సెకండాఫ్‌ను నిలబెట్టాయి. అయితే జాతీయ స్థాయి పోటీల‌కి వెళ్లిన ఓ రాష్ట్ర జ‌ట్టు కిడ్నాప్‌కి గురైతే, అది బ‌య‌టికి పొక్కకుండా ఉండ‌టం, ఆ జ‌ట్టు కోసం కోచ్ ఒక్కడే పోరాడ‌టం అనేది లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. మాక‌న్ సింగ్‌, కార్తీక్‌కి మ‌ధ్య న‌డిచే ఆ ఎపిసోడ్ చప్పగా సాగడంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు.

అయితే హీరో త‌న టీమ్‌ను క‌నుక్కుని విడిపించుకోవ‌డం.. విల‌న్‌ను చంపేయ‌డం.. అదే స‌మ‌యంలో అస‌లు గెలుస్తారో లేదో అనుకున్న టీమ్ గెల‌వ‌డం వంటి స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. సినిమాలో భారీత‌నం క‌న‌ప‌డింది. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ స‌న్నివేశాల‌కు మ‌రింత బ‌లాన్నిచ్చాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన పాట‌ల్లో టైటిల్ ట్రాక్ బావుంది. అప్సర రాణి స్పెష‌ల్ సాంగ్ ఆకట్టుకుంది. అయితే హీరో, హీరోయిన్ మధ్య సరైన లవ్ ట్రాక్ లేకపోవడం నిరాశ పరుస్తుంది.

ఎవరెలా చేశారంటే..

గోపీచంద్ అంతా తానై సినిమాను త‌న భుజాల‌పై మోశాడు. త‌న పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. త‌మ‌న్నా సినిమా ప్రారంభ‌మైన 40 నిమిషాల‌కు ఎంట్రీ ఇస్తుంది. ఆమెది గ్లామ‌ర్ రోల్ కాదు.. కానీ జ్వాలారెడ్డి సాంగ్‌లో కాస్త గ్లామ‌ర్‌గా క‌నిపించి కనువిందు చేసిది. ఆమె పాత్ర చెప్పుకునేంతగా లేదు. ఫ‌స్టాఫ్‌లో రావు ర‌మేశ్ త‌న డైలాగ్స్ విల‌నిజాన్ని పండిస్తే.. సెకండాఫ్‌లో త‌రుణ్ అరోరా విల‌న్‌గా ఆక‌ట్టుకున్నాడు. మిగతా పాత్రల గురించి అంతగా చెప్పుకోనవసరం లేదు. స్పోర్ట్స్‌, యాక్షన్ మిక్స్ అయిన‌ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూడాల‌నుకునే ప్రేక్షకులకు ‘సీటీమార్‌’ తప్పక నచ్చుతుంది.


టక్‌ జగదీష్‌ రివ్యూ

చిత్రం: టక్‌ జగదీష్‌; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్, ప్రవీణ్‌ తదితరులు

సంగీతం: తమన్‌, గోపీ సుందర్‌(నేపథ్య సంగీతం)

బ్యానర్‌: షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌

నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి సినిమా నుంచే వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారాయన. కరోనా కారణంగా గతేడాది ఆయన నటించిన ‘వి’ ఓటీటీలో సందడి చేసింది. పరిస్థితులు ఇంకా మెరుగుపడక పోవడంతో తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘టక్‌ జగదీష్‌’ కూడా అదే బాటలో పయనించింది. ‘నిన్నుకోరి’ వంటి సూపర్‌హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నాని తన నటనతో మరోసారి మెప్పించారా?.. లేదా? తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం..

కథేంటంటే..

భూదేవీపురం గ్రామంలో ఆదికేశ‌వ నాయుడు(నాజ‌ర్‌) పెద్దమ‌నిషి. తన కుటుంబంతో పాటు ఊరిలో అంద‌రూ బావుండాల‌ని కోరుకుంటాడు. అదికేశవ నాయుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసు(జ‌గ‌ప‌తిబాబు).. చిన్న కొడుకు జ‌గ‌దీష్ నాయుడు(నాని). జగదీష్ ఎప్పుడూ టక్ చేసుకునే ఉంటాడు. దీంతో అందరూ అతడికి టక్ జగదీష్ అని పిలుస్తుంటారు. త‌న ట‌క్‌ను ఎవ‌రైనా లాగితే వారితో గొడ‌వ ప‌డుతుంటాడు. బోసు ఊళ్లో వ్యవ‌హారాలు చూసుకుంటుంటే, ట‌క్ జ‌గ‌దీష్ సిటీలో ఉంటూ అప్పుడ‌ప్పుడూ ఊరికి వ‌చ్చి వెళుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వీరేంద్ర నాయుడు(డానియ‌ల్ బాలాజీ) తండ్రి ఊర్లో గొడ‌వ‌లు పెడుతూ ఉంటాడు. ఓసారి అనుకోకుండా వీరేంద్ర నాయుడు తండ్రిని ఓ వ్యక్తి పంచాయ‌తీలోనే చంపేస్తాడు. దాంతో వీరేంద్ర నాయుడు ఆది కేశ‌వులు, అత‌ని కుటుంబంపై ప‌గ పెంచుకుంటాడు. అనుకోకుండా ఓ రోజు ఆది కేశ‌వ‌నాయుడు గుండెపోటుతో చ‌నిపోతాడు. అప్పుడు బోసు త‌న అసలు రంగు చూపిస్తాడు. వీరేంద్రతో చేతులు క‌లిపి.. ఎమ్మార్వో సాయంతో ఆస్థిని త‌న పేరుపై ఉండేలా చూసుకుంటాడు. అంతే కాదు.. త‌న ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు ఆస్థి ఇవ్వన‌ని అంద‌రినీ ఇంటి నుంచి గెంటేస్తాడు. అస‌లు బోసు ఉన్నట్లుండి అలా ఎందుకు మారిపోయాడు? నిజం తెలుసుకున్న జ‌గ‌దీష్ అన్నను ఎలా దారిలోకి తెచ్చుకుంటాడు? వీరేంద్రతో చేతులు క‌లిపిన బోసుకి ఎలాంటి పరిస్థితి ఎదుర‌వుతుంది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

గ్రామంలో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న కొడుకైన హీరో వాటిని ఎలా పరిష్కరించాడన్న కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మంచి పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండినవేళ ఆయా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. విక్టరీ వెంకటేశ్‌ ఇలాంటి సబ్జెక్ట్‌తో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్‌లు అందుకున్నారు. ‘టక్‌ జగదీష్‌’ విషయంలో దర్శకుడు శివ నిర్వాణ కథానాయకుడి పాత్ర మినహా కొత్త కథ జోలికి పోలేదు. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలన్నీ గతంలో మనం చాలా సినిమాల్లో చూశాం. టక్‌ జగదీష్‌ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ ఫక్తు ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది.

ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు పాత్ర.. విల‌న్‌తో చేతులు క‌ల‌ప‌డం.. ఫ్యామిలీలో గొడ‌వ‌లు మొద‌లు ఇలా క‌థ నెక్ట్స్ స్టెప్ తీసుకుంటుంది. ఇక నాని.. పాత్రకు సంబంధించిన ఎమ్మార్వో అనే అస‌లు బ్యాక్ డ్రాప్‌ను బ‌య‌ట‌ పెట్టడంతో ఇంట‌ర్వెల్‌ను పూర్తి చేశారు. ఇక సెకండాఫ్‌లో ఎమ్మార్వోగా ఊల్లోకి రాగానే అన్న‌కు ఎదురు తిర‌గ‌డం.. విల‌న్ భ‌ర‌తం ప‌ట్ట‌డం వంటి స‌న్నివేశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయ‌త్నం చేశారు. ఊరు, కుటుంబం బావుండాల‌నుకున్న తండ్రి మాట‌ను నిల‌బెట్టడానికి అందరితో చెడ్డవాడిన‌నిపించుకున్న హీరో..చివ‌ర‌కు త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డంతో సినిమా ముగుస్తుంది. ఇందులోని చాలా సెంటిమెంట్ సన్నివేశాలు చూస్తుంటే కార్తి నటించిన ‘చినబాబు’ గుర్తుస్తొంటుంది.

ఎవరెలా చేశారంటే..

ఎలాంటి పాత్ర అయినా తనదైన నటన, హావభావాలతో ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలనని ‘టక్‌ జగదీష్‌’తో నాని మరోసారి నిరూపించాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆయనకు తిరుగులేదు. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టాడు. అయితే, నాని నుంచి కోరుకునే చిలిపి కామెడీ ఇందులో లేదు. దర్శకుడు దాన్ని కూడా దృష్టి పెట్టుకుని ఉంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉంటుంది. రీతూవర్మ అందంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేసింది. నాని-రీతూల కెమిస్ట్రీ తెరపై బాగుంది. జగపతిబాబు సీనియార్టీ బోసు పాత్రకు బాగా పనికొచ్చింది. ఆ పాత్రలో ఉన్న రెండు రకాల వేరియేషన్స్‌ చక్కగా పలికించారు. ఐశ్వర్య రాజేశ్‌, డానియల్‌ బాలాజీ, నాజర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


వినాయక వ్రతకథ.. చవితి రోజున చంద్రుడిని చూస్తే ఎందుకు అరిష్టం?

భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి నాడు పూజతో పాటు వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చవితి రోజున వ్రతకథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

కథా ప్రారంభం…
తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది.

అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు.. గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి.. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.


భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..

అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. పార్వతీ తనయుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.

స్థల పురాణం
కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

క్షేత్ర ప్రత్యేకత
అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్‌ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. దీంతో గ్రామంలో దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.

ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్‌ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష పెన్నులు సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.


ఇలా చేరుకోవచ్చు:
అయినవిల్లి రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12కిలోమీటర్లు దూరం ఉంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చేవారు రావులపాలెం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అమలాపురం నుంచి వచ్చేవారు ముక్తేశ్వరం చేరుకుని అక్కడి నుంచి ఆటోలో అయినవిల్లి చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాల ద్వారా వచ్చేవారు రాజమహేంద్రవరంలో దిగి అక్కడికి నుంచి రోడ్డుమార్గంలో అయినవిల్లి చేరుకోవచ్చు.



పూరి జగన్నాథ్.. 21 ఇయర్స్ ఇండస్ట్రీ

స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఇండస్ట్రీలో 21ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బద్రి’ 2000, ఏప్రిల్ 20 విడుదలైంది. పూరీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.


నికితాశర్మ … కేక పుట్టించే ఫొటోలు

ఈమె పేరు నికితాశర్మ. ఇండియాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌లో నికితా ఫేమస్. ‘తనిష్క్ మియా, బ్లూ స్టోన్, పారిస్ డే బొటిక్, పాంటాలూన్స్, డేనియల్ విల్లింగ్‌టన్’ వంటి ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.