Category Archives: Daily Updates

శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?

ఏకలవ్యుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు, అతనికి గొప్ప చరిత్ర ఉంది. అతని గాథ ఇప్పటికీ చాలా మందికి ఆదర్శం. గాండీవదారి అయ్యి కురుక్షేత్ర యుద్ధాన్ని తన విలువిద్య ప్రభంజనంతో శాసించిన అర్జునుడినే మించిన వాడిగా చరిత్ర పుటల్లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఏకలవ్యుని గురించి చాలా విషయాలు నేటి తరం వారికి తెలియదు. ఇంతకీ అసలు ఏకలవ్యుడు ఎవరు?.. ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి ఎందుకు శిష్యుడుగా తిరస్కరించాడు? అతను అంతటి విలువిద్య ఎలా సాధించాడు? తన బొటనవేలు ద్రోణాచార్యుని కి ఇవ్వడానికి గల అసలైన కారణం ఏమిటి? ఆ తర్వాత ఏకలవ్యుడు ఏమైపోయారు? అతనికి కృష్ణుడికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలుసుకుంటాం..

ఏకలవ్యుడి గురించి తెలియాలి అంటే ఒకసారి మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏకలవ్యుడు నిషాద కులంలో హిరణ్యధన్యుడు, సులేఖ అనే దంపతులకు జన్మించాడు, నిషాద కులస్తులను ఈ కాలంలో ఎరుకల వారిగా, బోయవారిగా పిలుస్తున్నారు. వీరు ప్రధానంగా అడవిలో జీవిస్తూ అక్కడే ఆకులూ, అలములూ, దుంపలను తింటూ వన్యప్రాణులను వేటాడే జీవనం సాగిస్తారు. వీరి ఆహారంలో అధిక భాగం జంతువుల వేట వల్లనే వస్తుంది, అందువల్ల ఈ కులం వారు విలువిద్యలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు.

ఈ నిషాద కులానికి రాజు ఏకలవ్యుడి తండ్రి అయిన హిరణ్యధన్యుడు, తొలుత ఏకలవ్యుడు తన తండ్రి వద్దనే విద్య నేర్చుకున్నాడు అయితే హిరణ్యధన్యుడు జరాసంధుడి వద్ద సామంత రాజుగా ఉండేవాడు దానివల్ల జరాసంధుడు చేసే యుద్దాలలో పాల్గొని ఒక దానిలో వీరమరణం పొందాడు. తండ్రి మరణించడం వల్ల ఏకలవ్యుడు వారి తెగకు చిన్న వయసులోనే రాజయ్యాడు. అయితే తండ్రికి ఉన్న బుద్ధి కుశలం, వేటకి వెళ్ళినప్పుడు అడవి మృగాల నుంచి తన వారిని కాపాడుకునే అంత నేర్పరితనం, విద్య అంత చిన్న వయసులో ఏకలవ్యుడు వద్ద లేకపోవడం వల్ల తనకి సకల విద్యలు నేర్పగల గురువు గురించి వెతుకుతున్న సకల విద్యా పారంగతుడు విలువిద్యలో ఎదురులేని పరాక్రమశీలి అయిన ద్రోణాచార్యులు గురించి తెలుసుకొని అయన వద్దకి వెళ్లి తనకి కూడా సకల శాస్త్ర విద్యలను నేర్పమని అడిగాడు. ఏకలవ్యుడి కోరికను ద్రోణాచార్యుడు తిరస్కరించాడు, ఆ తిరస్కారానికి కారణం అడగగా నేను కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాను, నీవు నిషాధ తెగకు చెందిన వాడవు, కాబట్టి నీకు నేర్పలేను అని బయటకు చెప్పిన ద్రోణుడు, ఏకలవ్యుడి ప్రవర్తనలో ఏదో దోషం కనిపించింది అందువల్లనే ఆ క్షణంలో ద్రోణుడు ఏకలవ్యుడు నేర్పించడానికి సుముఖత చూపించలేదు.

అయితే ద్రోణుడి శాస్త్ర విద్య కౌశలానికి ముగ్ధుడయిన ఏకలవ్యుడు ద్రోణుడినే తన గురువుగా భావించి అడవిలో బంకమట్టితో ఆయన విగ్రహం ఒకటి చేసుకుని ఆ బొమ్మే తనకు విద్య నేర్పుతుందని భావించి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ద్రోణుడు కురు పాండవులను పిలిచి అడవిలోకి వెళ్లి సరదాగా వేటాడమని, వేటనే క్షత్రియులకు ఆటవిడుపు అని చెప్పి పంపాడు. అయితే అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు పరిగెత్తే అడవి జంతువులను బాణంతో గురిచూసి కొట్టడం వల్ల వారి విలువిద్య నైపుణ్యం పెరుగుతుందని అనేది ఇక్కడ ఆయన ఉద్దేశ్యం, ఆయన మాటే పరమావధిగా కురుపాండవులు కొంతమంది సైన్యంతో వేట కుక్కలతో అడవిలోకి వేటకి వెళ్లగా అడవిలోనే ఒకచోట విలువిద్య సాధన చేసుకుంటున్న ఏకలవ్యునిమరియు వింత ఆకారాన్ని చూసి ఒక కుక్క మొరగడం మొదలుపెడుతుంది.

తనను చూసి మొరుగుతుంది కోపంతో ఆ కుక్క తెరిచిన నూరు మూసుకుని లోపు ఏడు బాణాలను ఏకకాలంలో సంధించి దాని నోరు కదపకుండా చేశాడు, దానితో కుక్క మూలుగుతూ కురుపాండవుల వద్దకు రాగా ఆ కుక్కకు పట్టిన గతికి కారణం ఏంటో అన్వేషిస్తూ దానితోపాటు వెళ్ళిన భటుడిని అక్కడ జరిగిన వృత్తాంతాన్ని ద్రోణుని మట్టి బొమ్మ ని గురించి చెప్పాడు. అప్పటివరకు విలువిద్యలో అత్యంత పరాక్రమశాలి అయిన అర్జునుడు ఏక కాలంలో ఐదు బాణాలను మాత్రమే స్పందించగలరు, కానీ ఏకలవ్యుడు ఏడు బాణాలను స్పందించడంతో అక్కడి వారు ఆశ్చర్య పోవడం తో పాటు కౌరవులు అర్జునుడిని హేళన చేశారు. దాంతో అర్జునుడు ద్రోణుడి వద్దకు వెళ్లి అడవిలో జరిగిన వృత్తాంతాన్ని వివరించి అదే సమయంలో ద్రోణుడు ఒక నాడు ప్రపంచంలో నీకంటే సమర్థుడైన విలుకాడు ఉండనంత విధంగా విలువిద్య నేర్పుతానని అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తు చేసాడు. దాంతో ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు తాను ఎవరికీ అంతటి విద్యను నేర్పలేదని, అయినా తన పేరుతో అంత విద్యను నేర్చుకున్నా వ్యక్తిని చూడాలని నిశ్చయించుకొని ద్రోణుడు ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళాడు, తాను వెళ్లేముందు కుక్కకు జరిగిన దుస్థితిని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు సంతోషపడి ద్రోణుడికి సన్మానం చేసి తన భక్తిని చూపెట్టాడు.

అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని తో ‘ఏకలవ్య నీవు నేనే నీ గురువు అని చెబుతున్నావు కదా, మరి నా గురుదక్షిణ ఏది అని అడగగా దానికి ఏకలవ్యుడు తప్పకుండా గురువర్యా నా సంపద కాని నా దేహ ప్రాణాల లో ఏది కావాలన్నా చెప్పండి అంటాడు. అది మీకు వెంటనే సమర్పించుకుంటాను అని పలికాడు, అప్పుడు ద్రోణుడు వెంటనే నీ కుడి చేతి బొటన వేలుని ఇవ్వమని అడగగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బొటన వేలుని కోసి గురుదక్షిణగా ద్రోణాచార్యుని కి ఇచ్చాడు ఏకలవ్యుడు. ద్రోణుడు చేసిన ఈ పనికి భాగవతంలో ఒక వివరణ కూడా ఇచ్చారు. ఏకలవ్యుడు ఎంత గొప్పవాడైనా కాలక్రమంలో అధర్మం వైపు నిలబడి యుద్ధం చేయడం వల్ల ఎంతో అనర్థం జరుగుతుందని భావించిన ద్రోణుడు విలువిద్యకి ఆయువు పట్టు అయిన బొటనవేలును ఇవ్వమని కోరినట్లు భాగవతం చెబుతుంది.

బొటనవేలు పోయినా ఏకలవ్యుడు మిగిలిన నాలుగు వేళ్ళతో బాణాలను సంధించడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు, అయితే ద్రోణుడు అనుకున్నదే నిజమైంది. ఏకలవ్యుడు ధర్మం వైపు మొగ్గు చూపకుండా అధర్మం వైపు మొగ్గుచూపి ఏకలవ్యుడు జరాసంధునికి మద్దతుగా నిలిచాడు. జరాసంధునికి ఏకలవ్యుని శక్తిసామర్థ్యాలు మీద అపార నమ్మకం అయితే జరాసంధునికి శ్రీకృష్ణునికి ఉన్న వైరం వల్ల జరాసంధుడు చాలాసార్లు కృష్ణుని మీదకి సేనలను పంపాడు కానీ ఏనాడు గెలవలేక పోయాడు ఆ సమయంలో సకల శాస్త్ర విద్య పారంగతుడు అయిన ఏకలవ్యుడిని శ్రీకృష్ణుడి సేనలపైకి పంపాడు.

ఏకలవ్యుడి ధనుర్విద్య నైపుణ్యానికి యాదవ సేనలు పిట్టలు రాలినట్టుగా రలి పోతుంటే అది తెలుసుకున్న కృష్ణుడు తానే స్వయంగా కదన రంగం లోకి వచ్చి ఏకలవ్యుడిని మట్టు పెట్టాడు, అంతటితో ఒక మహావీరుని అధ్యాయం ముగిసింది. ద్రోణుడు కాదన్నా పట్టుదలతో గురువు లేకుండా అపార విలువిద్య నేర్చుకొని పట్టుదల గల వ్యక్తిగా ద్రోణుడు అడిగిన వెంటనే క్షనమయిన ఆలోచించకుండా తన బొటన వేలుని కోసి ఇచ్చి గురు భక్తిని చాటి చాటుకున్న వ్యక్తిగా మహా వీరుడిగా పేరుగాంచిన ఏకలవ్యుడు ధర్మ అధర్మ విచక్షణ లేక అధర్మం వైపు మొగ్గు చూపి చూపడం వల్ల ఆఖరికి కృష్ణుడి చేతిలో మరణించక తప్పదు తప్పలేదు.


రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే

రూ. వంద కోట్ల బడ్జెట్‌ అంటే మనకు చాలా పెద్ద విషయం, రూ. వెయ్యి కోట్ల వసూళ్లు ఇంకా పెద్ద విషయం. అందుకే ఇలాంటి సినిమా మన దగ్గర వస్తే అదో పెద్ద విశేషంగా చెప్పుకుంటాం. ఎప్పటికప్పుడు ఆ సినిమా కలెక్షన్ల గురించి ఘనంగా చెప్పుకుంటాం. అయితే హాలీవుడ్‌ దగ్గర ఈ లెక్క బిలియన్ల డాలర్లలో లెక్కేస్తున్నారు. రీసెంట్‌గా బిలియన్‌ డాలర్ల వసూళ్లు అనేది చాలా కామన్‌ అయిపోయింది. అయితే ‘అవతార్‌ 2’ వస్తోంది కదా.. దాని సంగతేంటో చూద్దాం అని అనుకుంటే.. ఆ నెంబరు రెండు బిలియన్‌ డాలర్లు అని తేలింది.

‘అవతార్‌ 2’ సినిమాకు అయిన బడ్జెట్‌, ప్రచారానికి చేస్తున్న ఖర్చు ఇవన్నీ కలిపితే.. సినిమాకు సుమారు రెండు బిలియన్ల డాలర్లు రావాలంట. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 16 వేల కోట్లు అన్నమాట. అయితే సినిమాకు ఇప్పటివరకు వచ్చిన బజ్‌, హైప్‌ ప్రకారం చూస్తే.. ఈ డబ్బులు రావడం పెద్ద కష్టం కాదు అంటున్నారు. అంటే సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి కావాల్సిన అమౌంట్‌ రూ. 16 వేల కోట్లు వచ్చేస్తాయి అంటున్నారు. అయితే అంత ఖర్చు పెట్టి బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తే ఏమొస్తుంది. కాబట్టి ఇంకా చాలానే కావాలి. అందుకే ఈ సినిమా కేవలం హిట్‌ అయితే సరిపోదు. చాలా చాలా పెద్ద హిట్‌ అవ్వాలి అంటున్నారు సినిమా నిపుణులు. మన దేశంలో ఈ సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగులో అయితే రూ. 100 కోట్ల మార్కు లక్ష్యమని చెబుతున్నారు.

అయితే సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆకాశాన్ని తాకుతున్నాయి నెంబర్లు. చిన్న కుటుంబం మొత్తం వెళ్లి సగటు సినిమా చూస్తే అయ్యే ఖర్చుతో ఒకరు సినిమా చూసేలా కొన్ని నగరాల్లో టికెట్‌ ధరలు ఉన్నాయి. వాటి ప్రకారం చూస్తే వసూళ్లు పక్కా. అయితే సినిమా టాక్ బాగుండాలి అనేది మెలిక. ఇక డిసెంబ‌రు 16న ఈ చిత్రం ప్రపంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. ముందు రోజు స్పెషల్‌ షోస్‌ కూడా ఉన్నాయి. అన్నట్లు ఈ సినిమా హిట్ అయ్యి డబ్బులు వస్తేనే ‘అవతార్‌ 3, 4, 5 సీక్వెల్స్ తీస్తానని దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘అవతార్’ కొనసాగుతోంది. 13ఏళ్లయినా ఆ చిత్రం రికార్డులను కొల్లగొట్టే సినిమా మరొకటి రాలేదు. దాని రికార్డును అవతార్ 2 దాటే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయ‌మ‌ని అభిమానులు ముచ్చటించుకుంట‌ున్న స‌మ‌యంలో ఇటీవ‌ల బాల‌కృష్ణ త‌న త‌న‌యుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీనుతో లాంచ్‌ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతా దైవేచ్ఛ’’ అని నవ్వి ఊరుకున్నారు. అయితే క్లాసిక్ మూవీతో త‌న త‌న‌యుడిని బాల‌య్య ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుసీ అయిపోతున్నారు.

ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో, ఎప్పుడు మోక్షజ్ఞను వెండితెర‌పై చూస్తామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో బాల‌య్య మ‌రోసారి స్పందించాడు. ఆదిత్య 369 చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన, ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు.

అలాగేఅఖండ-2 ప్రాజెక్టుపైనా బాలయ్య స్పందించారు. ‘అఖండ-2’ తప్పకుండా ఉంటుందని… సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశామన్నారు. ఈ సినిమాను ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసి ప్రకటిస్తామని బదులిచ్చారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు

సాధారణంగా ఏ గర్భగుడిలో అయినా భక్తులకు ప్రవేశం ఉండదు. కానీ ఈ కనకమహాలక్ష్మి ఆలయంలో మాత్రం భక్తులే నేరుగా అమ్మవారిని పూజించొచ్చు. ఓ వస్తువు లేదా కాసు బంగారం కొన్నా సరే… అమ్మవారికి నివేదించడం, అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని ఈ గుడికి తీసుకురావడం… వంటివన్నీ ఈ ఆలయంలో కనిపిస్తాయి. భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకుంటున్న కనకమహాలక్ష్మి ఆలయం విశాఖపట్నం పాత నగరంలోని బురుజుపేటలో ఉంటుంది. ఈ ఆలయంలోని గర్భగుడికి పైకప్పు ద్వారాలు ఉండవు. ఎవరైనా నేరుగా గర్భగుడిలోకే వెళ్లి అమ్మవారిని పూజించొచ్చు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారికి ఎడమచేయి ఉండదు.

స్థల పురాణం
పూర్వం ఈ రాజ్యాన్ని పాలించిన విశాఖ రాజులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలిచేవారు. ఇక్కడ వారి కోట బురుజు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి బురుజుపేట పేరు వచ్చిందని అంటారు. ఓసారి శత్రువులు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు విశాఖ రాజులు తమ ఇలవేల్పును భద్రపరిచే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో వదిలేశారట. ఇది జరిగిన కొన్నాళ్లకు కాశీకి బయలుదేరిన ఓ బ్రాహ్మణుడు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ ప్రాంతంలో ఆగాడట. స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో అమ్మవారు తన ఉనికిని తెలియజేసి బావి నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించమని చెప్పిందట. అయితే కాశీకి వెళ్లే తొందరలో ఆ బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించి తన ఎడమచేతిలో గల ఫరిఘ అనే ఆయుధంతో అతణ్ని సంహరించేందుకు సిద్ధమవ్వడంతో ఆ బ్రాహ్మణుడు శివుడిని శరణుకోరాడట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించేందుకు దేవి ఎడమ చేతిని మోచేయి వరకు ఖండించాడట. అలా ఆమెలోని ఆగ్రహం మాయమై శాంత స్వరూపిణిగా మారిపోయింది. ఆ తరువాత ఆమె కనకమహాలక్ష్మిగా పూజలు అందుకుంటుందని చెప్పి శివుడు అంతర్థానమయ్యాడట. అలా అమ్మవారు బురుజుపేటలో రోడ్డు మధ్యలో వామహస్తం లేకుండానే వెలసి పూజలు అందుకుంటోందని కథనం.

అయితే1917 ప్రాంతంలో ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఓ మూలకు జరిపారు. ఆ తరువాత ఇక్కడ ప్లేగువ్యాధి ప్రబలి చాలామంది చనిపోవడంతో… ఇందుకు కారణం అమ్మవారి విగ్రహాన్ని జరపడమేనని భావించిన భక్తులు మళ్లీ దేవి విగ్రహాన్ని రోడ్డుమధ్యలోనే ప్రతిష్ఠించారట.ఆ తరువాతే ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని చెబుతారు. కనకమహాలక్ష్మిని సేవించే విషయంలో ఎలాంటి వివక్షా ఉండకూడదనే ఆలోచనతోనే ఆలయానికి వచ్చే భక్తుల్ని గర్భగుడిలోకీ అనుమతిస్తారు. అలా వచ్చే భక్తులు అమ్మవారిని నేరుగా పసుపు-కుంకుమలతో పూజించి, కొబ్బరికాయల్ని కొట్టి నివేదించుకుంటారు. దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక.. గర్భగుడి పై కప్పు, ద్వారాలు నిర్మించేందుకు ప్రయత్నించినా విఫలం కావడం వల్ల ఆ ఆలోచననూ విరమించుకున్నారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. అందుకే గర్భగుడి పైకప్పును కొబ్బరిమట్టలతో కప్పి ఉంచుతారు. తలుపులకు బదులు కర్టెన్లు ఉంటాయి.

కనకమహాలక్ష్మిని చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ ఇలవేల్పుగా భావిస్తారు. అందుకే అప్పుడే పుట్టిన పసిబిడ్డల్నీ, కొత్తగా కొన్న వాహనాలనూ, బంగారాన్నీ మొదట అమ్మవారి వద్దకే తీసుకొస్తారు. దగ్గర్లోని బంగారం దుకాణాల యజమానులు సైతం తాళంచేతుల్ని అమ్మవారికి చూపించి మరీ తీసుకెళ్తుంటారు. దేవికి రోజువారీ చేసే పూజలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లోనూ విశేష పూజా కార్యక్రమాలను జరిపిస్తారు. ముఖ్యంగా మార్గశిరమాసంలోనే విగ్రహం వెలుగు చూడటం వల్ల ఇక్కడ ఏటా మార్గశిరంలో నెలరోజులపాటు అంగరంగవైభవంగా మాసోత్సవాలను నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవచ్చంటే…
ఈ ఆలయం విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా విశాఖపట్నం వరకూ విమానం, రైలు, బస్సుల్లో చేరుకోవచ్చు. విమానాశ్రయం నుంచి ఆలయానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.


ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎంతో నెగిటివిటీ ఉంది. ఈ సినిమా షూటింగ్ వేగంగానే పూర్తైనా ఈ సినిమా టీజర్ విషయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మేకర్స్ చెప్పిన బడ్జెట్‌కు టీజర్ క్వాలిటీకి ఏ మాత్రం పొంతన లేదని అందరూ తిట్టిపోస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు జూన్ సమయానికి కూడా పూర్తి కావని సమాచారం. క్వాలిటీ గ్రాఫిక్స్ లేకపోతే శాటిలైట్, డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశం ఉండదు. ఈ కారణం వల్లే ఆదిపురుష్ మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిపురుష్ జూన్ లో కూడా రిలీజ్ కాదనే వార్త ఫ్యాన్స్ కు షాకిస్తోంది.

ఆదిపురుష్ సినిమాలో నటించి ప్రభాస్ తప్పు చేశాడని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ షూట్ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు పాజిటివ్‌గా ఏదీ జరగలేదు. అన్నీ నెగిటివ్‌గానే జరుగుతుండటంతో ప్రభాస్ సైతం ఈ సినిమా విషయంలో ఒకింత హర్ట్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఆదిపురుష్ మూవీ కంటే సలార్ మూవీనే ముందు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలన్నీ వేర్వేరుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రభాస్ ఒక్కో ప్రాజెక్ట్ కు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.


‘కాంతార’ సర్‌ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై దేశాన్ని ఓ ఊపు ఊపేసింది ‘కాంతార’. రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. విడుదలై నెలన్నర రోజులు దాటినా థియేటర్లకు జనాలు వస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సినా.. థియేటర్లలో వస్తున్న ఆదరణ కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే చివరికి ‘కాంతార’ గురువారం(నవంబర్ 24) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

‘కాంతార’ లోని వరహరూపం పాటపై కోర్టులో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అందువల్ల యూట్యూబ్ నుంచి ఆ పాటను నిర్మాణసంస్థ హోంబలే ఫిలిమ్స్ తొలగించింది. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేం. కోర్టులో కేసు నడుస్తుండటంతో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా లేదా అని అభిమానులందరు ఎదురుచూశారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ‘‘ఎదురు చూపులకు తెరపడింది. ‘కాంతార’ రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది’’ అని ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

‘కాంతార’ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. దర్శకుడు కూడా ఆయనే. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకుంది. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీకి సంబంధించి కన్నడ నాట కోటి టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. ఐఏమ్‌డీబీలోను అత్యధిక రేటింగ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఐఏమ్‌డీబీ రేటింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్ 2’ లను బీట్ చేసింది. ఈ చిత్రంపై అనేక మంది సెలబ్రిటీలు ప్రశసంల వర్షం కురిపించారు. రజినీకాంత్, రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్, పూజా హెగ్డే, శిల్పా శెట్టి తదితరులు ఈ మూవీని పొగిడారు. ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న కాంతార ఓటీటీలో ఎంతటి సంచలనం రేపుతుందో చూడాలి.


మార్గశిర మాసం – ముక్తికి మార్గం

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.
భగవద్గీతలోని విభూతియోగంలో – “మాసానాం మార్గశీర్షం” అంటే మాసాల్లో తాను మార్గశిర మాసానని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు. బ్రహ్మ ముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం, సంధ్యా వందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి.

అందుకే…. మార్గశిర మాసంలో – ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో… “ఓం నమో నారాయణయ” అనే మంత్రాన్ని స్మరించాలి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని, ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.

మార్గశిర శుద్ధ షష్ఠి ‘స్కంద షష్ఠి’.. శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి ‘వైకుంఠ ఏకాదశి’. దీన్నే ‘మోక్ష ఏకాదశి’ అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి… “గీతాజయంతి”. సమస్తమానవాళికి ధర్మ నిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు. ఈ “దత్తాత్రేయ జయంతి”ని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమ నాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు “హనుమద్‌ వ్రతం”, “మత్స్య ద్వాదశి”, “ప్రదోష వ్రతం”* ఆచరించడం పరిపాటి. ఈ మాసంలోనే…. అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రమణ్యషష్టి, పరశురామ జయంతి, సంకటహర చతుర్ధి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫలా ఏకాదశి, కృష్ణ (మల్ల) ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం తదితర పండుగలు వస్తాయి.

పెద్దలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే… మార్గశిరం తరువాత వచ్చే పుష్య మాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం , ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రహ్మ ముహూర్తం లాంటిది అని తెలుస్తుంది. బ్రహ్మ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగిందో , సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రహ్మ మహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో , అదే విధంగా దేవతలకు బ్రహ్మ ముహూర్తమైన ఈ మాసమంతా దేవతలు , ఋషులు , యోగులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం , కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మివారం (గురువారం) , మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి. ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది.


పశుపతినాథ్ దేవాలయం – నేపాల్

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భువ్యతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే..


అని శివుడుని కొలుస్తారు భక్తులు. అసలే బోళా శంకరుడు ఆపైన భక్తుల కోసమే వెలసిన మహాదేవుడు. అలాంటి శివదేవుడి ప్రఖ్యాత క్షేత్రాల్లో.. నేపాల్ దేశంలోని పశుపతి నాథ్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఇంతకీ ఈ నేపాల్ దేవుడి విశిష్టతలేమిటి? ఇక్కడీ శివుడెలా వెలిశాడో తెలుసుకుందాం…

శివుడంటే పిలిస్తే పలికే దైవం…శివుడంటే అభయంకరుడు. భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభోశంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు. ఉండేది లింగాకారం. మహత్యం చూపడంలో అనంతాకారం. శివుడ్ని కొలిస్తే ఆపదలు మటుమాయం. శివుడి గురించి విన్నా.. కొలిచినా.. స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు. శివుడంటే కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే శక్తి స్వరూపుడు.

పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని కాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలవబడుతున్నాడు. యునెస్కో ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా కొనసాగుతున్న ఈ దేవాలయానికి నిత్యం దేశ విదేశాలనుంచీ వేలాది మంది భక్తులు వస్తుంటారు. సుప్రసిద్ధ 275 శైవక్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి. ఇతర మతస్థులు పశుపతిని దర్శించాలంటే భాగమతి నదీ తీరం నుంచి చూసి తరించాల్సిందే. ప్రపంచంలో హైందవ దేశం ఏదైనా వుందంటే అది నేపాల్ అన్న పేరుంది. నేపాళీయులకు పశుపతి అంటే ఎంతో భక్తి.

పరమేశ్వర అంశతో భువిపై జన్మించిన ఆదిశంకరుడు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం.. పశుపతి పూజలు జరుగుతాయి. దక్షిణ భారతదేశానికి చెందిన పూజారులే పశుపతినాథ్‌కు నిత్యం పూజా కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే నేపాల్ సంప్రదాయం ప్రకారం రాజు మరణించినప్పుడు ఇక్కడి ప్రజలకు శివ పూజలు చేసే అర్హత వుండదు. రాజును తండ్రిగా భావించడం ఇక్కడి వారి ఆచారం. దాని ప్రకారం పశుపతి నిత్య పూజలకు ఆటంకం ఏర్పడుతుంది. తమకెంతటి కష్టం కలిగినా.. పరమేశ్వరుడి నిత్యకైంకర్యాలకు లోపం రానివ్వకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు నేపాలీయులు.

ఆదిశంకరుడు కొలిచిన పశుపతినాథ తత్త్వం.. అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి.. దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరా భారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు. పశుపతినాథ్ ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో స్పష్టమైన కాలం తెలీదు. కానీ కొన్ని శాసనాల ప్రాకారం ఆలయనిర్మాణం గురించిన వివరాలు దొరుకుతాయి.

చారిత్రక ఆధారాల ప్రకారం… క్రీస్తు శకం 753వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. శుశూపదేవ మహారాజు అధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11జయదేవ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. 1416వ సంవత్సరంలో.. రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని అంటారు. 1697వ సంవత్సరంలో రాజాభూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నించాడని తెలుస్తోంది. ఖాట్మండులో పశుపతినాథుడు లింగాకారంలో దర్శనమివ్వడానికి కొన్ని ఇతిహాస కథనాలు ప్రచారంలో వున్నాయి.

గో ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి భాగమతీ తీరాన విహరిస్తుండగా దేవతలు ఆ కొమ్ము పట్టుకున్నారు. అప్పుడా కొమ్ము విరిగింది. దాన్నిక్కడ పూడ్చి పెట్టారు. తర్వాతికాలంలో ఆ కొమ్ము లింగాకారంలోకి రూపాంతరం చెందింది. అక్కడి భూమి లోపలున్న లింగాన్ని గుర్తించి ఒక ఆవు తన పాలనక్కడ కురిపించింది. ఆ వింత చూసిన పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా ఒక శివలింగం బయట పడిందట. అదే పశుపతినాథ లింగమని చెబుతారు.


భారతదేశపు చిట్టచివరి గ్రామం ‘మనా’.. ఎన్నో విశేషాల సమాహారం

ఉత్తరాఖండ్ లోని ‘మనా’ గ్రామం.. హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ గ్రామం… వీటిలో ఏది భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పరిగణించబడుతుందనే విషయంలో చాలా మంది గందరగోళపడుతుంటారు. ప్రాధమికంగా చిట్కుల్ అనేది ఇండో – టిబెటన్ సరిహద్దులో ఉన్న జనావాస గ్రామం. అయితే ఉత్తరాఖండ్ లోని ‘మనా’ మాత్రం భారతదేశం యొక్క చిట్టచివరి గ్రామంగా అధికారికంగా గుర్తింపు పొందింది.

ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో సముద్రమట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ‘మనా’ గ్రామం ఉంది. ప్రముఖ హిందూ తీర్ధయాత్ర స్థలం బద్రీనాథ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సరస్వతి నదీ పరివాహిక ప్రాంతంలో ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ అందమైన కుగ్రామం ఇండో – చైనా సరిహద్దు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇది భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పేరుగాంచింది. మీరు ఈ ప్రాంతాన్ని ఎప్పుడైనా సందర్శిస్తే అక్కడ దుకాణదారులను, వారు విక్రయించే సామాగ్రిని జాగ్రత్తగా పరిశీలించండి. వాటిపై ‘చివరి గ్రామం’, ‘ఇండియా చివరి టీ , కాఫీ కార్నర్’ అనే వివిధ ముద్రణలు కనిపిస్తాయి. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ‘మనా’ గ్రామం హిందువులకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

ఈ గ్రామాన్ని మహాభారత కాలానికి సంబంధించినదిగా చెబుతారు. పాండవులు స్వర్గానికి తమ చివరి ప్రయాణం చేసినప్పుడు ‘మనా’ గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు. ఈ ప్రాంతంలో సరస్వతి నదికి సమీపంలో ఓ రాతి వంతెన ఉంటుంది. దీనిని ‘భీమా పుల్’ అని కూడా పిలుస్తారు. పాండవ సోదరుల్లో ఒకరైన భీముడు దీన్ని నిర్మించినట్లు కధనం ప్రచారంలో ఉంది. మనా గ్రామంలో చూడాల్సిన ఆసక్తికర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

నీలకంత్ శిఖరం
సముద్ర మట్టానికి 6597 అడుగుల ఎత్తులో ఉండే నీలకంత్ శిఖరం ఈ ప్రాంతంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. దీనిని ‘క్వీన్ ఆఫ్ గర్హ్వాల్’ అని కూడా పిలుస్తారు. బద్రీనాథ్ ఆలయానికి చేరువలో మంచుతో కప్పబడి ఉండే ఈ అందమైన పర్వత శిఖరం సాహసికులు, పర్వతారోహణ పట్ల ఆసక్తి గల వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.

తప్త్ కుండ్
హిందూ పురాణాల ప్రకారం తప్త్ కుండ్ ను అగ్ని యొక్క పవిత్ర నివాసంగా చెబుతారు. ఇక్కడ ఎంతో విలువైన ఔషధ సంపద ఉన్నట్లు నమ్ముతారు.ఈ కుండ్ నీటిలో మునక వేస్తే చర్మ వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం.

వసుధార
ఈ ప్రాంతంలోని అద్భుతమైన ప్రదేశాల్లో వసుధార ఒకటి. బద్రీనాథ్ ఆలయం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన జలపాతాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కొంతకాలం ఇక్కడ నివసించారట.

వ్యాస గుహ
మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాన్ని రచించిన వేదవ్యాసుడు ఈ గుహ లోపలే ప్రఖ్యాత నాలుగు వేదాలను రచించినట్లు చారిత్రక కధనం. ఈ గుహలో చిన్న మందిరం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వేద వ్యాసునికి అంకితం చేయబడిన ఈ మందిరం దాదాపు 5000 ఏళ్ల క్రితం నాటిదని నమ్ముతారు.

భీమా పుల్
మనా గ్రామంలోని ప్రధాన ఆకర్షణల్లో భీమా పుల్ ఒకటి. పాండవులు స్వర్గానికి ప్రయాణం చేస్తున్న సమయంలో తన భార్య ద్రౌపతి సరస్వతి నదిని దాటెందుకు వీలుగా భీముడు ఈ రాతి వంతెనను నిర్మించినట్లు చెబుతారు. సాహసాల పట్ల ఆసక్తి గల వారికి ఈ గ్రామం ఎన్నో ఆసక్తికరమైన కార్యకలాపాలను అందిస్తుంది. భారతదేశంలో పర్వతారోహణకు అనువైన ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటిగా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తారు. మనా నుంచి వసుంధర, మనా నుంచి మనా పాస్, మనా నుంచి చరణపాదుక వరకూ ఇతరులతో కలిసి నడక సాగించడం ఓ గొప్ప అనుభవంగా చెప్పవచ్చు.

​ఎలా వెళ్లాలి
ఉత్తరాఖండ్‌లోని మనాకు రిషికేష్, హరిద్వార్ నుంచి సులభంగా చేరుకోవచ్చు. బద్రీనాథ్ నుంచి ఇక్కడికి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే. హరిద్వార్ ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి మనా గ్రామానికి 275 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు లేదా ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి మనాకు 315 కిలోమీటర్లు. రైల్వేస్టేషన్ బయట నుంచి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.


నేను సినిమాల్లోక రావడానికి నాన్న ఒప్పుకోలేదు – వరలక్ష్మీ శరత్‌కుమార్

లేడీ విలన్‌ అంటే ఈ మధ్య కాలంలో బాగా గుర్తొచ్చే పేరు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. గంభీరమైన గొంతుతో, కరుకైన మాటలతో, భయపెట్టే హావభావాలతో హీరోలకు ధీటుగా నటిస్తున్న ఈ నటి- ఆఫ్‌స్క్రీన్‌లో అల్లరి అమ్మాయి. సమస్యల్లో ఉన్నవాళ్లకి అండగా నిలబడే అసలైన హీరో. అటు నటనలోనూ, ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్న వరలక్ష్మిని పలకరిస్తే ఆమె మనసులోని జ్ఞాపకాలను ఇలా పంచుకుంది.

తెర మీద నన్ను చూసిన చాలామంది ‘మీరు బయట కూడా సీరియస్‌గానే ఉంటారా…’ అని అడుగుతుంటారు. నిజానికి నేను చాలా సరదా మనిషిని. కానీ, నేను చేసే విలన్‌ పాత్రల వల్ల అందరూ సీరియస్‌ పర్సన్‌ని అనుకుంటున్నారు. ఆన్‌స్క్రీన్‌ వరలక్ష్మి గురించి తెలిసిన మీకు… తెర వెనక వరూ ఎలా ఉంటుందో చెబుతా…

పుట్టి పెరిగింది చెన్నైలోనే. నాకు ఊహ తెలిసేప్పటికే అమ్మానాన్నలు విడిపోయారు. మా అమ్మ ఛాయ అవమానాలూ, ఆర్థిక సమస్యలూ ఎదుర్కొంటూనే నన్నూ, చెల్లినీ పెంచింది. అయినా ఎప్పుడూ భయపడలేదు, బాధపడలేదు. మాకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆశపడేది. కొన్నాళ్లకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థను ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది. పైగా మగవారితో పనిచేయించడం, గంటలు గంటలు తానూ కష్టపడటం నాకు ఎంతో అబ్బురంగా అనిపించేది. అయితే తనకి మేం సినిమాలు చూడటం ఇష్టముండేది కాదు.

పదమూడు, పద్నాలుగేళ్లు వచ్చే వరకూ కార్టూన్‌ షోలకే అనుమతిచ్చేది. నాన్న సినిమాలు కూడా నేను ఓ పదికి మించి చూడలేదు. అయితే సినిమా ప్రపంచానికి దూరంగా పెరిగిన నాకు డాన్స్‌ అంటే పిచ్చి అనే చెప్పాలి. అమ్మ భరతనాట్యం నేర్పించింది. నా ఆసక్తి కొద్దీ బాలే, వాల్ట్‌, సల్సా, హిప్‌హాప్‌ వంటివన్నీ నేర్చుకున్నా. బాలే, సల్సాల్లో గోల్డ్‌ మెడల్‌ కూడా అందుకున్నా. కాలేజీకి వెళ్లాక రంగస్థలం వైపు మనసు మళ్లింది. చదువుకంటే నాటకాలకే ప్రాధాన్యమిచ్చేదాన్ని. అలా డిగ్రీ పూర్తి చేశాక ఎంబీఏ చదవడానికి స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర యూనివర్సిటీకి వెళ్లా. అక్కడ చదువుకుంటున్నప్పుడే ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగమొచ్చింది. ఇక అదే నా భవిష్యత్తు అని ఫిక్సైపోయా. తీరా చదువు పూర్తై ఉద్యోగంలో చేరదామనుకునేటప్పుడు… ‘నువ్వు దూరంగా ఉండటం నాకు నచ్చట్లేదు. చదువు కోసం తప్పలేదు కానీ, నా దగ్గరే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ఇండియాకి వచ్చెయ్‌’ అంది అమ్మ. అయిష్టంగానే ఇంటికొచ్చా. కొన్నాళ్లు అమ్మ నడిపే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థలోనే పనిచేశా. అప్పుడే అనిపించింది ఇలాంటి ఉద్యోగాలు మన వల్ల కాదనీ, అందుకు నేను సెట్‌కాననీ. క్రమంగా నేనేం చేయగలనూ, ఏ రంగం నాకు బాగుంటుందీ అని ఆలోచించడం మొదలుపెట్టా. చివరికి నాకు డాన్స్‌ పట్ల అంతర్లీనంగా ఉన్న ఇష్టం నన్ను సినిమాల వైపు వెళ్లేలా చేసింది. నాకో స్పష్టత తెచ్చి పెట్టింది.

నేను నటించడానికి నాన్న ఒప్పుకోలేదు..
టీనేజీకొచ్చాక అమ్మానాన్నలు ఎందుకు విడిపోయారో అర్థమైంది. వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలని నేనూ, చెల్లీ అనుకున్నాం. అమ్మతోపాటు నాన్ననీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. అందుకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక మొదట నాన్నకే చెప్పా. కానీ, ఆయన వద్దన్నారు. కాదు.. కాదు.. భయపడ్డారు. సినీరంగంలోని ఒడుదొడుకుల్ని తట్టుకునే శక్తి నాకుందో లేదోనని తండ్రిగా ఆయన ఆలోచించారు. అమ్మ నా ఇష్టాన్ని కాదనలేదు. నాన్న ఒప్పుకోవట్లేదని తనతో చెబితే వెంటనే నటి రాధిక ఆంటీకి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. నాన్న రాధిక ఆంటీని పెళ్లి చేసుకున్నాక అమ్మ తనతో మొదటిసారి మాట్లాడటం అప్పుడే. ‘వరూ కోరుకుంటే మనం తనని ప్రోత్సహించాల్సిందే. మీ ఇద్దరూ బయల్దేరి రండి… ఆయనతో మాట్లాడదాం’ అని ఆంటీ అనడంతో షూటింగ్‌లో ఉన్న నాన్న దగ్గరకు ముగ్గురం వెళ్లాం. మా ముగ్గుర్నీ చూసిన నాన్న షాక్‌ అయ్యారు. అమ్మా, ఆంటీ ఒక్కటైపోయి నాన్నని ఒప్పించి ఆయన భయాలన్నీ పోగొట్టారు. ‘ఆడవాళ్లంతా ఒక్కటయ్యాక నేను మాత్రం నో ఎలా చెప్పగలను’ అంటూ నాన్న కూడా నేను సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు. ముంబయి వెళ్లి అనుపమ్‌ఖేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణకు చేరా. కొన్నిరోజుల తరవాత ఆయన మా నాన్నకు ఫోన్‌ చేసి ‘మీ అమ్మాయి అద్భుతంగా నటిస్తుంది. నాకు తన భవిష్యత్తు కనిపిస్తోంది. మీరూ ప్రోత్సహించండి’ అని చెప్పారు. ఆ మాటలకు నాన్నకు సంతోషం కలిగింది. నాలోనేమో ఆత్మవిశ్వాసం పెరిగింది.

ఇదిలా ఉంటే… ఫేస్‌బుక్‌లో నా ఫొటోని ముంబయిలోని ఓ నిర్మాత భార్య చూశారట. వాళ్లకి తెలిసినవాళ్లు తమిళంలో సినిమా తీస్తున్నారని ఆమె నన్ను సంప్రదించారు. అలా నాకు 2012లో ‘పోడా పోడి’ అనే సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. నన్ను నేను తెరపైన చూసుకున్నాక నటిగా నేను పనికొస్తాను అనే ధైర్యం కలిగింది. కథ వినడం, నా పాత్ర ఏంటో తెలుసుకోవడం వంద శాతం అందుకు తగ్గట్టు నటించడం… మొదలుపెట్టా. కానీ, దాదాపు నాలుగేళ్ల పాటు సరైన అవకాశాలు రాలేదు. అలాగని నాన్న రికమండేషన్లు కూడా నాకు నచ్చవు. 2016లో అనుకుంటా, మలయాళంలో ‘కసబా’ అనే సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేశా. ఒకరకంగా అది సాహసమే. హీరోయిన్‌గా చేస్తూ నెగెటివ్‌ పాత్ర ఒప్పుకోవడం వల్ల కెరీర్‌కి నష్టం జరుగుతుందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ, నేను నా నటనని నమ్ముకున్నా. హీరోయిన్‌ అవ్వాలి, స్టార్‌డమ్‌ రావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఛాలెంజింగ్‌గా, నటిగా సంతృప్తి కలిగించే ఏ పాత్ర అయినా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఆ సినిమా విడుదలయ్యాక దాదాపు అటువంటి పాత్రలే వరస కట్టాయి. తెలుగులో ‘పందెం కోడి2’ నా మొదటి సినిమా, ఆ తరవాత ‘సర్కార్‌’లో కోమలవల్లి పాత్ర కూడా బాగా పేరు తెచ్చిపెట్టింది. ‘మారి2’లోనూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ నేను నేరుగా తెలుగులో నటించిన సినిమా. అల్లరి నరేశ్‌ ‘నాంది’లో మాత్రం పాజిటివ్‌ పాత్ర. లాయర్‌ ఆద్యగా నేను చేసిన ఆ పాత్ర ఎప్పటికీ నా ఫేవరెట్‌. నేను చాలా బాగా నటించానని ఫీలైన సినిమా అదే. అంతేకాదు, ఈ సినిమాలో నాకు మరో అనుభవం కూడా ఉంది. సాధారణంగా నా సినిమాలకు నేను డబ్బింగ్‌ చెప్పుకుంటా. నా హావభావాలకు మరొకరి గొంతును జత చేయడం నచ్చదు. పైగా నేను సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లో చాలామంది ‘నీది మగాడి గొంతులా ఉంది’ అన్నారు. మరికొందరేమో అసలు హీరోయిన్‌కి ఉండాల్సిన వాయిస్‌ కాదన్నారు. అందుకే నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకున్నా. ‘పందెం కోడి2’ నుంచి తెలుగు రాకపోయినా యాసగా ఉన్నా నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నా. ‘నాంది’కి మాత్రం నాతో చెప్పించకుండానే వేరే వాళ్లతో చెప్పించి ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. అది చూసి షాక్‌ అయ్యా. పైగా ప్రేక్షకులు కూడా ‘వరూకి తన గొంతే సూట్‌ అవుతుంది’ అంటూ కామెంట్లు పెట్టారు యూట్యూబ్‌లో. దాంతో నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటానన్నా. అందులో లాయర్‌గా కష్టమైన సంభాషణలు ఉంటాయి.. పలకడం కష్టమన్నారు. నేను ఒప్పుకోలేదు. ‘మూడు రోజులు టైమివ్వండి. నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటా. దాన్ని ఓ పదిమందికి వినిపించండి. వాళ్లలో ఏ ఒక్కరు బాలేదన్నా… వేరే వాళ్ల డబ్బింగ్‌తోనే సినిమా విడుదల చేయండి’ అని చెప్పా. ఓపిగ్గా సాధన చేసి నాలుగు రోజులు డబ్బింగ్‌ చెప్పా. అంతా అయ్యాక ‘మీరు చెప్పిందే బాగుంది. చెప్పలేరేమోనని పొరపాటు పడ్డా’ అన్నారు దర్శకుడు. చాలామంది ప్రేక్షకులు నా నటనతోపాటు గంభీరంగా ఉండే నా గొంతునూ ఆదరించారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. అలానే బాలయ్య ‘వీరసింహారెడ్డి’లోనూ ఐదు పేజీల డైలాగు ఉంది ఒక సీన్‌లో. అది పూర్తి చేయడానికి మూడురోజులు పడుతుందని నా కాల్షీట్లు తీసుకున్నారు. నేను ఒక్క పూటలోనే ఆ సీన్‌ చేసేశా. ఒక్కసారి వింటే పక్కాగా గుర్తుపెట్టుకోవడం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ఇప్పుడు అదే నాకు టేకులు తీసుకోకుండా పనికొస్తోంది.

‘క్రాక్‌’ విడుదలయ్యాక చాలామంది నన్ను ‘జయమ్మ’ అనే పిలుస్తున్నారు. కథ వినగానే నచ్చి ఓకే చెప్పా. ఆ గెటప్‌, మాట తీరు భలేగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ఇక ‘పక్కా కమర్షియల్‌’లోనూ చిన్న పాత్ర చేశా. ‘యశోద’ సినిమా కథ విని షాక్‌ అయ్యా. సరోగసీ విషయంలో నాకు తెలియంది చాలా ఉందని కథ విన్నాకే అర్థమైంది. అసలు ఇలాంటి కథ ఎలా రాశారబ్బా అనుకున్నా. ఈ సినిమా సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది అనిపించింది. ఫెర్టిలిటీ సెంటర్‌ హెడ్‌గా నటించిన ఈ సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్స్‌ కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది. ఐదు నెలల్లో దాదాపు పదిహేను కేజీలు తగ్గా. ‘వీరసింహారెడ్డి’లోనూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌ ఉంది. ఈ సినిమా కోసమూ సన్నబడాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ తెర మీద కాస్త బొద్దుగా కనిపించిన నేను ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయా. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఎనిమిది సినిమాల్లో- ‘హనుమాన్‌’, ‘వీరసింహారెడ్డి’, ‘శబరి’ తెలుగు సినిమాలు. నన్ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నామని తెలుగు దర్శకులు చెప్పడం నాకు పెద్ద కాంప్లిమెంట్‌.