Category Archives: Daily Updates

గాల్లో విమానం.. ప్రయాణికుడికి అస్వస్థత, డాక్టర్‌గా మారిన గవర్నర్ తమిళిసై

వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? అని అనౌన్స్ చేయడంతో విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. కాసేపటికి కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు సైతం గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని ఫోటోలు తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో రాకముందు ఆమె కొంతకాలం ప్రాక్టీస్ చేశారు.


పెళ్లి తర్వాతా తగ్గని క్రేజ్… రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నయన్

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, తమిళ బాషల్లో స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నయన్.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతారు.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’‌లో కీ రోల్ పోషిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినా ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటుగా హిందీలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ హీరోయిన్ గా నటించింది..ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. అయితే నయనతారకు సంబంధించి ఓ కీలక సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా పెళ్లి తర్వాత క్రేజ్‌తో పాటుగా సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఇందుకు భిన్నంగా నయనతారకి ఇసుమంత కూడా డిమాండ్ తగ్గలేదు. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ షో మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడం నయనతార స్పెషాలిటీ. అందుకే అందరు డైరెక్టర్లు ఆమెతో పని చెయ్యడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. తనకున్న డిమాండ్‌ని బట్టి నయనతార పెళ్లయిన తర్వాత పారితోషికం బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు రూ.4-6కోట్ల పారితోషికం తీసుకునే ఈ బ్యూటీ ఇప్పుడు రూ.10కోట్లు డిమాండ్ చేస్తోందట. అయితే ఆమెకున్న క్రేజ్‌ని బట్టి ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదట.

కేవలం నయనతార కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు తెలుగు, తమిళ భాషల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. నయనతార ఒక సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా ఏదో విశేషం ఉంటుందని బలంగా నమ్ముతుంటారు. అందుకే ఆమె తన బ్రాండ్ కి తగ్గ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నయనతారకి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ కొత్తవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తోంది నయనతార.


శివాలయాన్ని దాచి ఉంచే సముద్రం… ‘నిష్కలంక్ మహదేవ్’ ఆలయం

సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ గుజరాత్‌లోని నిష్కలంక మహదేవ్ ఆలయం వీటన్నింటికీ ఎంతో భిన్నం. భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్ధం. మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణ కధనం. అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక్ మహదేవ్ గా పూజిస్తారు. గుజరాత్ లోని భావనగర్‌కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఉంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహదేవ్ ను స్థాపించారని చెబుతారు.

వెనక్కి వెళ్లే సముద్రం


కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తరువాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లడం ప్రారంభిస్తుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమౌతాయా అని ఎదురుచూస్తుంటారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయానికి వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని, నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు.

ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు ఈ ఆలయం వద్ద సమయం గడపవచ్చు. ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.

ఆలయం వెనుక ఆసక్తికరమైన కధ

మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు. ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని సెలవిస్తాడు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచేవారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయి. అప్పుడు ఐదుగురు అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడు. దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కధనం. పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ / నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందింది.

భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా శర్వణ్ మాసం (ఆగస్టు)లో అమావాస్య రోజున ‘భైదర్వి’ అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలవబడే నీటి గుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరచుకుని పూలు, పాలు, పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు. ఇక్కడ ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని కెరటాలు శాంతించే వరకూ ఎదురుచూస్తుంటారు. మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటివరకూ తుఫాన్ల వలన కానీ, అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు.

దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం తప్పకుండా ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవంతుడి అద్భుత సృష్టికి ఇంతకంటే వేరే నిదర్శనం మరొకటి లేదని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసభరిత యాత్ర చేయాలని కోరుకుంటారు. మార్చి నుంచి జూలై మాసాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మంచి సమయం.

ఎలా వెళ్లాలంటే


విమాన మార్గం ద్వారా వచ్చే వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భావనగర్‌కు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. భావనగర్ ఎక్స్‌ప్రెస్, మహువ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. భావనగర్ నుంచి కొలియాక్ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరం. రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ, ఆటో రిక్షా లేదా బస్సుల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.


పుచ్చకాయలకే ఇళ్లు అమ్మేస్తున్నారు… చైనాలో వింత పరిస్థితి

సాధారణంగా ఊళ్లలో పాత ఇనుప సామాన్లకి మామిడి పండ్లు, బీరు సీసాలకు ఐస్ క్రీములు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ చైనాలో మాత్రం ఏకంగా పుచ్చకాయలు గోధుమలు వెల్లుల్లికి ఇండ్లు అమ్మేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఇది నిజమా కాదా అని తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పుచ్చకాయలకి ఇల్లు అమ్మిందన్న వార్త ఒకటి చైనా పత్రికల్లో కనిపించింది. “నాన్జింగ్లోని ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున లెక్క గట్టి గృహ కొనుగోలు చెల్లింపులుగా అంగీకరిస్తోంది” అంటూ చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇటీవల గొప్పగా ఓ కథనం రాసింది. తూర్పు నగరమైన నాన్‌ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారు. 100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కిస్తున్నారు. మరో చిన్న పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్ పీచెస్ పళ్లను తీసుకుంటున్నట్లు వార్తలు వ‌చ్చాయి. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్‌ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు.

కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్‌మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును కూడా తగ్గించింది. 4.6 శాతం నుంచి 4.4 శాతం వరకు కోత పెట్టింది. ప్రస్తుతం చైనా గృహ రుణాల విలువ 10 ట్రిలియన్లకు డాలర్లకు చేరింది. చైనా ప్ర‌గ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ రంగానిది అత్యంత కీలక పాత్ర అని చెప్పుకోవాల్సిందే.

చైనా జీడీపీలో నాలుగో వంతు రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తోంది. తాజాగా ఆ దేశంలోని టాప్ 100 డెవలపర్ల విక్రయాలు తొలి నాలుగు నెలల్లో సగానికి పడిపోయాయి. ఈ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం కూడా తగ్గింది. 2021లో నిర్మాణాల్లో ఏకంగా 14 శాతం తగ్గుదల నమోదైంది. మిలియన్ల కొద్దీ చదరపు అడుగుల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆరేళ్లలో తొలిసారి గత సెప్టెంబర్ నుంచి ఇళ్ల ధరల్లో పతనం మొదలైంది. ఫలితంగా ముందస్తుగానే నిర్మాణాలకు చెల్లింపులు చేసిన వినియోగదారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కొనుగోలుదారులు ఓ పట్టాన ముందుకు రావడంలేదు. చైనాలోని నగరవాసుల సంపద 70 శాతం గృహాలపై పెట్టుబడుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలను ఆదుకొనేందుకు కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగింది. భవిష్యత్తులో షీజిన్పింగ్ మూడోసారి అధికారం చేపట్టనున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీకి ఇది పెను సవాలుగా మారింది.


తెలుగు సినిమా హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’

తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చంటబ్బాయి. తన సినిమాలతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేసిన హై హై నాయకుడు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి. ఆయనే కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. నవ్వడం ఒక యోగం., నవ్వించడం ఒక భోగం., నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల.

జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో కొన్ని నాటకాలు రచించారు. అలా నాటకాలు రాస్తూనే కళాతపస్వీ కె.విశ్వనాథ్ గారి దృష్టిలో పడ్డారు. రచయితగా జంధ్యాల గారి తొలి చిత్రం ‘సిరిసిరి మువ్వ’. మొదటి చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో పరిశ్రమలో పలువురిని ఆకర్షించారు. ‘శంకరాభరణం’ వంటి క్లాస్ చిత్రాలకు సంభాషణలు అందిస్తునే… ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ వంటి మాస్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించుకున్నారు జంధ్యాల . మాటల రచయతగా ప్రారంభమైన ఆయన సినీ కెరీర్.. ఆ తర్వాత దర్శకుడి అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూసే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారాయన. డైరెక్టర్‌గా తొలి చిత్రం ‘ముద్ద మందారం’తో సక్సెస్ అందుకున్నారు.

ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత జంధ్యాల గారిది. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు గారు , వేలు గారిని ‘నాలుగు స్తంభాలాట’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసారు. ఆ తర్వాత ఈ సుత్తి జంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్‌తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది. తెలుగు వారందరికీ పరిచయమైన బ్రహ్మానందాన్ని ‘అహనా పెళ్లంట’ చిత్రంతో స్టార్ కమెడియన్ చేసిన గొప్ప దర్శకులు జంధ్యాల. ‘ఒరేయ్ అరగుండు వెధవ’ అని కోట గారితో బ్రహ్మానందం గారిని తిట్టించినా అది జంధ్యాలకే మాత్రమే చెల్లింది. బ్రహ్మానందం కామెడీ స్టార్‌గా ఎదగడంలో ఆయన పాత్ర మరిచిపోలేనిది. తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను థియోటర్లకు రప్పించడంలో అయనది అందెవేసిన చేయి. దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా…. పాండు రంగారావును జేమ్స్ పాండ్ చేసినా…హై హై నాయకాలో బూతు బూతు అని వినీ వినిపించని బూతులు తిట్టించినా…శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో శ్రీలక్ష్మీతో సినిమా స్టోరీ చెప్పించినా… ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బాబూ చిట్టి అని శ్రీ లక్ష్మీతో వెరైటీ డైలాగ్స్ పలికించినా అది ఒక్క జంధ్యాల గారికే సొంతం. తెలుగు వారిని తన నవ్వులతో ముంచిన హాస్య బ్రహ్మ 2001 జూన్ 19న హాస్య ప్రియులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణించినా తన చిత్రాలతో నేటికి హాస్యప్రియులను తన సినిమాలతో నవ్విస్తునే ఉన్నారు.


మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?.. రెండింటికీ ఉన్న సంబంధం ఏంటి?

రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసింది. వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె నేటితో మొదలవుతోంది. మృగశిర కార్తెలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. ఈ రోజు ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ప్రై చేసుకుని ఖచ్చితంగా తింటుంటారు.

మృగశిర కార్తె వస్తే చాలు రైతులు ఏరువాకకు సిద్ధమవుతుంటారు. అందుకే ఈ కార్తెను ఏరువాక‌ సాగే కాలం అంటుంటారు. ఏరువాక‌ అంటే నాగటి చాలు. ఈ కాలంలో నైరుతి ప్రవేశంతో తొల‌క‌రి జ‌ల్లులు కురుస్తుంటాయి. దీంతో పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తుంటారు. మృగ‌శిర‌ కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో పండగ జరుపుకుంటారు. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. తొలిరోజు రోజు చేపలకు యమ గిరాకీ ఉంటుంది. ఏ మార్కెట్ చూసినా… రద్దీగా కనిపిస్తుంటాయి. ప్రతి పల్లెలోని చెరువుల వద్ద సందడి కనిపించే దృశ్యాలు దర్శనమిస్తుంటాయి.

చేపలలో ఉండే పోషకాలు:
▶ మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

▶ చేపల్లో బీ12 విటమిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, బయెటిక్‌, థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి.

▶ చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.

▶ చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.

▶ మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది

▶ చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.

▶ ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.

▶ సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ,డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

▶ చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షూగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు

▶ చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

▶ దేశీయ మార్పు చేపల్లో ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

▶ ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతోకలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.


కాఫీ డే: రూ.7 వేల కోట్ల అప్పు.. భర్త సూసైడ్.. ఏడాదిలోనే అద్భుతం చేసిన మాళవిక హెగ్డే

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. ఇంకేంటి అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.

సిద్ధార్థ ఆత్మహత్య

2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. కేఫ్‌ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.

భలే ఆలోచన

మాళవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. నాన్న ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజిక వేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థతో వివాహమైంది. వీళ్లిద్దరూ కలిసి కేఫ్‌ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. రూ.5కి ఎక్కడైనా దొరికే కాఫీని రూ.25 పెట్టి తాగడానికి తమ పార్లర్‌కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ససేమిరా అందట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఈసారి ఆయన ‘కాఫీకి ఉచిత ఇంటర్నెట్‌నూ అందిస్తే?’ అన్నారట. ఆలోచన ఈసారి ఈమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) అవుట్‌లెట్‌ బెంగళూరులో ప్రారంభమైంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సీసీడీ రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు.

రూ.7వేల కోట్ల అప్పులు

అయితే సంస్థ రూ.7000 కోట్ల అప్పుల్లో మునిగిపోవడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిన సిద్ధార్ధ.. భార్య, పిల్లలను అనాథలను చేస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్‌! కాఫీ కింగ్‌గా పేరుగాంచిన ఆయన మరణానికి కారణం.. అప్పు. అదీ రూ. ఏడువేల కోట్లు. సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24 వేలమంది కార్మికులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలూ చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కనపెట్టి మళ్లీ తెరమీదకొచ్చారు మాళవిక. తన పిల్లలతోపాటు ఉద్యోగుల బాధ్యతనూ స్వీకరించారు. ‘సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకుంటా’నంటూ వాళ్లని సమాధానపరిచారు. ఆ అప్పులను తీర్చడం తన బాధ్యతన్నారు. అలా 2020 డిసెంబరులో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మాళవిక

ఇక్కడా ఎన్నో ఎదురుదెబ్బలు. కొవిడ్‌, చెల్లని చెక్కుల వివాదాలు. అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుతూ వచ్చారు. పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎన్నో వెండింగ్‌ మెషిన్‌లను వెనక్కి రప్పించారు. సంస్థ నిరర్థక ఆస్తులనీ అమ్మేశారు. ఏడాది కాలంలో సగం అంటే.. రూ. మూడువేల కోట్లకుపైగా అప్పుల్ని తీర్చేశారు. ఇంకొన్నేళ్లలోనే తిరిగి సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశ ఆమెలోనేకాదు.. సంస్థ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోంది. టాటా వంటి సంస్థలూ పెట్టుబడికి ఆమెతో చర్చలు జరుపుతున్నాయి. గతంలో మాళవిక సంస్థకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యురాలు. రూపాయి జీతం తీసుకోలేదు. సంస్థలో ఆమెకున్న వాటా కూడా నాలుగు శాతమే. అయినా సీసీడీని ముందుకు నడపడం తన బాధ్యతగా భావించారు. కాఫీ ఎస్టేట్‌లో భర్తతో కలిసి మొక్కలు నాటేవారు. ఏ అవుట్‌లెటైనా ఇద్దరూ ప్రారంభించేవారు. సాధారణ ప్రేమికుల్లా కూర్చొని వినియోగదారులను గమనించేవారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పైగా భర్తకు సంస్థపై ఎనలేని ప్రేమ.. ఇవన్నీ ఆమెను మధ్యలో వదిలేయనివ్వలేదు.

‘ఏడాదిలో ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతోపాటు వ్యాపారాన్నీ అభివృద్ధి పథంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకూ భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయం’ అని ఓ సందర్భంలో చెప్పారు. భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోయే ఎంతోమందికి ఆమె జీవితం స్ఫూర్తిమంతమే కదూ!


‘పుష్ప-2’ వచ్చేది అప్పుడే.. ప్లాన్ చేస్తున్న సుక్కూ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘పుష్ప : ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ తన దూకుడు చూపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నూ, ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తూండడం అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక తదుపరి భాగంగా రాబోయే ‘పుష్ప ది రూల్’ పైనే ఉంది అందరి దృష్టి. ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి రెండో భాగంలో మదర్ సెంటిమెంట్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉందట. దాన్ని నిడివి తగ్గించి.. ఫహద్ ఫాజిల్ కు , బన్నీకి మధ్య వచ్చే సీన్స్ లెంత్ పెంచే ఆలోచనలో ఉందట టీమ్. అలాగే బన్నీ, రష్మికల మధ్య రొమాంటిక్ సీన్స్ ను కూడా పెంచుతున్నారట. ‘పుష్ప 2’ చిత్రం షూటింగ్ కోసం సుకుమార్ 100రోజుల టార్గెట్ పెట్టుకున్నారట. అంటే దాదాపు మూడు నెలలు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే.. మే నెల నాటికి టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనేది సుకుమార్ ఆలోచనగా తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ మలయాళంలో చాలా బిజీ ఆర్టిస్ట్.. ఆయన వీలును బట్టి.. సీన్స్ ప్లాన్ చేయాలి. అలాగే… అల్లు అర్జున్, ఇతర ముఖ్య నటుల వీలు కూడా చూసుకోవాలి. వీరి డేట్స్ ను బట్టే.. పుష్ప2 షెడ్యూల్స్ ప్లానింగ్ ఉంటుందట.


Radhe shyam Trailer: ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా చిత్రబృందం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద బజ్‌ను మరో స్థాయిలో పెంచేసింది.

ఇన్నాళ్ళు ఈ సినిమా ఎలా ఉంటుందో అని కొందరికి కొన్ని రకాల సందేహాలున్నాయి. ఆ సందేహాలన్నిటిని ‘రాధే శ్యామ్’ ట్రైలర్ ఇట్టే తీర్చేసింది. ఇక ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటమే తరువాయి అనేట్టుగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


‘పుష్ప’ కలెక్షన్ల జోరు.. బన్నీ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం కొనసాగుతోంది. కరోనాతో కొన్నాళ్లుగా బోసిపోయిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ‘అఖండ’‌తో కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాలకు అల్లు అర్జున్ ‘పుష్ప’తో మరోసారి సందడి నెలకొంది. బన్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ అంచనాలను అనుగుణంగా తొలిరోజు రికార్డుస్థాయి వసూళ్లు సాధించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. బన్నీ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం.. సుకుమార్ కూడా రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ అంచనాలు పుష్ప సినిమాపై బాగా కనిపించాయి.

శుక్రవారం(డిసెంబర్ 17)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అన్ని భాషల్లో కలిపి రూ.71 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. పుష్ప సినిమాను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాత ఎర్నేని నవీన్ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో కూడా పుష్ప సినిమా రికార్డు తిరిగరాస్తోంది. బన్నీ నటనకు ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజే ఇంత కలెక్షన్‌ వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో అదనపు షో పర్మిషన్ ఇవ్వడం మాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకొచ్చారు. వీకెండ్‌కు మంచి కలెక్షన్‌ వస్తుందని భావిస్తున్నాం. బన్నీకి మలయాళంలో మంచి పేరుంది. ఈ సినిమా ఇంతకుముందు సినిమాల కంటే భారీ ఎత్తున వసూలు చేస్తుంది. ప్రపంచంలోనే తెలుగు ఆడియన్స్ లాంటి వాళ్ళు లేరు. ఈ సినిమాను ఇంత ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. అన్ని ఏరియాలకు మించి ‘పుష్ప’ నైజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే 11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు సహాయపడ్డాయి.