Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు… భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతమే పాలకొండ్రాయుడి క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిశాడని చెబుతారు. వేంకటేశ్వరస్వామే పాలకొండ్రాయుడిగా ఇక్కడ వెలిశాడని అంటారు. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు… తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు.
స్థల పురాణం ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ-సరస్వతి దగ్గరకు వెళ్తే ఆ ఇద్దరూ మహర్షిని పట్టించుకోలేదు. ఆ తరువాత కైలాసానికి వెళ్లినా అదే అవమానం ఎదురుకావడంతో ఆగ్రహానికి గురైన భృగు చివరకు వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పంపైన విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపైన తన్నాడు. దాంతో నారాయణుడు భృగుని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ రుషి పాదాలను నొక్కడం ప్రారంభించాడట. ఆ రుషి అరిపాదంలో మూడో కన్ను ఉండటం వల్లే భృగుకి అహంకారం ఎక్కువని అంటారు. అందుకే అతని అరి పాదంలోని మూడోకంటిని చిదిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి, తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్లిపోయాడట.
ఆ తరువాత లక్ష్మీదేవి… తాను నివసించే వక్షస్థలంపైన ఓ మహర్షి తన్నడాన్ని సహించలేక వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది. దాంతో శ్రీహరి దేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరాడు. అలా స్వామి మొదటిసారి ఈ ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని కథనం. తన దేవేరిని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఓ లోయలో పడిపోవడంతో మహావిష్ణువు కోసం బ్రహ్మ, శివుడు ఆవు-దూడ రూపాల్లో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీర్చారనీ… అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చిందనీ అంటారు. అప్పటినుంచీ నారాయణుడిని పాలకొండ్రాయుడిగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మథనం సమయంలో కొన్ని పాల చుక్కలు ఈ కొండపైన పడటం వల్ల ఈ ప్రాంతానికి క్షీరశైలమనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. ఈ ఆలయానికి సమీపంలో భృగుమహర్షి నదిలా ఏర్పడి భృగువంకగా మారాడని అంటారు. క్రమంగా అదే బుగ్గవంకగా మారిందనీ.. ఆ నది నీళ్లే అటు దేవుని కడపలో రాయుడినీ, ఇటు పాలకొండ్రాయుడినీ అభిషేకిస్తున్నాయనీ చెబుతారు.
ఇక్కడ పాలకొండ్రాయుడి మూర్తితో పాటు పద్మావతీదేవినీ, నవగ్రహాలనూ, ఉగ్ర నారసింహుడినీ దర్శించుకోవచ్చు. సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానం చేసి తడి వస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. అలా పుట్టిన పిల్లలకు పాలకొండ్రాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ, కొండమ్మ అనే పేర్లు పెడుతుంటారనీ చెబుతారు.
ఇలా చేరుకోవచ్చు కడప వరకూ రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి. ఈ పట్టణం నుంచి ఆలయం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప పట్టణం నుంచి రాజంపేటకు వెళ్లే బైపాస్ రహదారి మీదుగా పాలకొండలకు చేరుకోవచ్చు. కొండపాదం వరకూ వాహనాల్లో అక్కడి నుంచి నడకమార్గాన ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఉత్తర, పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ కాలం పిల్లలు ఆ దిక్కున ఎందుకు నిద్రపోకూడదని ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. ఈ విషయానికి పురాణాల ఆధారంగా సంపూర్ణ వివరణ తెలుసుకుందాం…
రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పు దిశగా ఉంచాలి. లేనిచో దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు. ఇదే విషయం మన పురాణాల్లోనూ ప్రస్తావించబడింది. తూర్పు దిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణంలో చెప్పబడింది.
భూమి ఒక పెద్ద అయస్కాంతం. మామూలు అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వాన్న అండాండమని.. మన శరీరాన్ని పిండాండమని పిలుస్తారు. విశ్వంలోని అన్నింటి ప్రభావం, శక్తి మన శరీరంలో కూడా ఉంది.. అందుకనే ఈ రెండింటి మధ్య “లయ” తప్పకుండా కాపాడగలిగే శక్తి ఉంటే చాలా మానసిక రుగ్మతులకు పరిష్కారం దొరుకును. ఉత్తర దిక్కుకు ఆకర్షణ (అయస్కాంత) శక్తి ఉంది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినా దాని ముల్లు ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన ప్రభావం చూపిస్తుంది. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేయగల శక్తి ఉందని, దక్షిణ ధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో పేర్కొనబడింది.
మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం. శరీరానికి కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జిస్తూ ఉంటుంది. వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం.. బ్రహ్మాండం. అనగా శిరస్సు నందలి పైభాగం, దీనినే పుణికి అని, బ్రహ్మ కపాలం అని అంటారు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు విసర్జనకు కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడుతుంది. దాదాపు 1300 గ్రాముల బరువుగల మానవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని ” వెక్టార్ ” ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయువృద్ధిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస, నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.
ఉత్తర దిక్కునందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరంలోని విద్యుత్ శక్తి కొంత కోల్పోవును. ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని, వర్ఛస్సును కోల్పోతుంది. విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును, వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం, బాధ, అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీర భాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం, తిమ్మిరి, నడుమునొప్పి మొదలగు వ్యాధులు వస్తాయి. నరాలకు సంబంధించిన వ్యాధులు సైతం దాడి చేసే అవకాశముంది.
‘అవతార్’ సినిమాతో ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లారు జేమ్స్ కామెరూన్. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్‌నే క్రియేట్ చేసేందుకు అవతార్2 (ది వే ఆఫ్ వాటర్)తో సిద్ధమయ్యారు మేకర్స్. ప్రపంచ సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ హాలీవుడ్ చిత్రం 160 భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న విడుదలకు సిద్ధమైంది.
భారీ బడ్జెట్‌తో హై ఎండ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఈ సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. అందుకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు టాక్. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో వేచి చూడాలి. అయితే ఇన్నాళ్లుగా అవతార్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు టిక్కెట్ ధర ఎంత పెట్టయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎన్ని కోట్లకు సినిమా కొన్నా వారం రోజుల్లోనే రికవరీ కావడం ఖాయం.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్‌లో కొలువుదీరింది. రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ‘విశ్వాస్ స్వరూపం’గా పేర్కొనే ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొనే ఈ విగ్రహం విశేషాలేంటో చూద్దామా..!
ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45కి.మీల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. శివుడి విగ్రహాన్ని నిర్మించేందుకు మూడు వేల టన్నుల స్టీల్ వినియోగించారు. అలాగే, 2.5లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను వాడారు.
ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు పదేళ్ల సమయం పట్టింది. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ సీఎంగా ఉన్న అశోక్ గహ్లోత్, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు. ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించారు. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో రాత్రి పూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుందని మాలి పేర్కొన్నారు. 250కి.మీల వేగంతో వీచిన గాలినైనా తట్టుకొగలిగే సామర్థ్యంతో నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు.
ఈ పర్యాటక ప్రాంతానికి విచ్చేసిన పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగీ జంపింగ్, జిప్ లైన్, గో కార్ట్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ వంటివి ఉన్నాయి. శనివారం శివుడి విగ్రహం ఆవిష్కరణ తర్వాత తొమ్మిది రోజులు (అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు) పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విశాలమైన ప్రాంగణంలో అష్టలక్ష్ములూ కొలువుదీరి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న క్షేత్రం.నిత్య పూజలూ… ప్రత్యేక ఉత్సవాలతో ఏడాది మొత్తం కళకళలాడే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలూ కలుగుతాయని ప్రతీతి. ఈ అష్టలక్ష్మీ ఆలయం హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉంది. శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి సమేతంగా మూలవిరాట్టుగా కొలువుదీరితే ఆ విగ్రహమూర్తుల చుట్టూ సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మహాలక్ష్మి ఆశీనులై దర్శనమిచ్చే క్షేత్రమే అష్టలక్ష్మి దేవాలయం.
కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న ముప్ఫై ఎకరాలను వాసవీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అమ్మడంతో 300 పైగా కుటుంబాలు ఇక్కడ సొంత ఇళ్లు నిర్మించుకున్నాయి. క్రమంగా ఈ ప్రాంతం వాసవీ కాలనీగా మారింది. ఆ ఇళ్ల మధ్యలో ఖాళీగా ఉన్న కొండభాగాన్ని వదిలేయకుండా అక్కడ ఏదో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న కాలనీ వాసులు ప్రముఖ శిల్పి గణపతి స్తపతి సలహాతో… అష్టలక్ష్మి దేవాలయాన్ని కట్టించాలనుకున్నారు. చివరకు కంచికామ కోటి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతీ, విజయేంద్ర సరస్వతులు శంకుస్థాపన చేయడమే కాకుండా… వాళ్ల సలహాలూ సూచనలతో నిర్మాణం మొదలైందనీ ఇరవై ఆరేళ్లక్రితం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనీ చెబుతారు ఆలయ నిర్వాహకులు.
రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో మొదటి అంతస్తులో అష్టలక్ష్ములను దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే నిత్య ప్రవచన మండపం, యాగశాల, చక్రతీర్థం, రథశాల, భోజనశాల… ఇలా అన్నీ ఉంటాయి. ఇవి కాకుండా సనాతన ధర్మాన్ని బోధించేందుకు శారదా శిశు విద్యాలయం పేరుతో ప్రత్యేక పాఠశాలనూ నిర్వహిస్తోందీ ఆలయం. ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుడూ అష్టలక్ష్ములూ కాకుండా… అభయ గణపతి, కృష్ణుడు, గోదాదేవి, గరుడస్వామి, సుదర్శన లక్ష్మీనరసింహస్వామి…. తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయాన్ని సందర్శిస్తే కీర్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం, ఆనందం… వంటివన్నీ పొందవచ్చని భక్తుల నమ్మకం. ఇక్కడ రోజువారీ పూజా కార్యక్రమాలూ, రెండుపూటలా నిత్యహోమాలూ జరుగుతాయి. ఇవి కాకుండా వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మి వ్రతాలు… దీపావళి నాడు అష్టలక్ష్ములకు విశేష పూజలు… కార్తికంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ఆకాశ దీపోత్సవం… ధనుర్మాసంలో గోదారంగనాథస్వామి కల్యాణం… ఇలా ఏడాది మొత్తం జరిగే విశేష పూజల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు… తదితర ప్రాంతాల నుంచీ భక్తులు వస్తారు. ప్రతిరోజూ ఆలయంలో పూజా కార్యక్రమాలను చేశాక అర్చకులు గోమాతనూ పూజిస్తారు. తరవాత ఆ గోమాతను ఆలయ ప్రాంగణం చుట్టూ తిప్పాకే… భక్తులను అనుమతిస్తారు.
ఎలా చేరుకోవచ్చు
అష్టలక్ష్మి దేవాలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు దగ్గర్లో కొత్తపేటలో ఉంటుంది. కొత్తపేట వరకూ వచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులూ ఆటోలూ అందుబాటులో ఉంటాయి. మెట్రో రైలులో వెళ్లేవారు విక్టోరియా మెమోరియల్ స్టేషన్‌లో దిగి నడుచుకుంటూ వెళ్లొచ్చు.
‘కాంతార’ కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఏ సినీ ప్రేక్షకుడి నోట విన్నా ఇదే మాట. కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇతర రాష్ట్రాల్లో క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమా ఏకంగ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. హీరోగా, దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేసిన రిషబ్‌శెట్టి ఇప్పుడు ఆలిండియా స్టార్ అయిపోయాడు. ఈ స్టార్‌డమ్ ఆయనకు ఒక్కరోజులో వచ్చిందేమీ కాదు.. కెరీర్ ప్రారంభంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. జీవితం అతణ్ణి వాటర్ క్యాన్ బాయ్‌గా చేస్తే… తనదైన పట్టుదలతో హీరోగా, దర్శకుడిగా తన సత్తా చాటాడు రిషబ్ శెట్టి. నటనా, వ్యాపారమూ అంటూ రెండు పడవలపైన చేసిన తన ప్రయాణం ఒకేసారి ముంచేసింది. అలా మునిగిన వాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ తాజా సంచలనం ‘కాంతార’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత గమనాన్ని వివరించాడు..
మాది కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కుందాపురలోని కెరాడి అనే చిన్న ఊరు. మా నాన్న భాస్కర శెట్టి జ్యోతిష్కుడు. పెద్ద ఆస్తులేమీ లేకపోయినా నాన్న ఆదాయం మా అవసరాలకు సరిపడా ఉండేది. అమ్మ రత్నావతి. నాకో అక్క, అన్న. అందరిలో నేనే చిన్నవాడిని కావడంతో నన్ను గారాబంగా పెంచారు. ఇంట్లోనే కాదు… స్కూల్లోనూ నేను అల్లరి పిల్లాడినే. పదోతరగతి వరకూ మా ఊళ్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత కుందాపురలో ఇంటర్‌లో చేరాను. నా స్నేహితులూ అదే కాలేజీలో చేరడంతో ఇక అక్కడా మా అల్లరి కొనసాగేది. చదువు కన్నా అల్లరీ, ఆటల్లోనే ఫస్ట్ ఉండేవాణ్ణి. కుస్తీ, జూడో పోటీల్లో ఎన్నో పతకాలూ సాధించాను. అయితే ఇదంతా మా నాన్నగారికి అస్సలు నచ్చేది కాదు. ఇక్కడే ఉంటే జులాయిగా మారతానన్న భయంతో బెంగళూరుకు పంపేశారు. నాన్న ఆ పని కోపంతో చేసినా… నేను మాత్రం ఎగిరి గంతేశాను.
ఉపేంద్రను చూసి సినిమాల్లోకి నా చిన్నప్పుడు మా ఊరు మొత్తంలో కరెంటూ, టీవీ ఉన్న ఇల్లు మాదే. దూరదర్శన్‌లో వచ్చే కన్నడ పాటల కోసం ఎదురుచూస్తుండేవాణ్ణి. అందులోనూ హీరో రాజ్‌కుమార్ పాటలంటే మరీ ఇష్టం. నేనూ ఆయనలా హీరో కావాలనేది నా ఆశ. దాంతో నన్ను నేను నిరూపించుకోవడానికి ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టేవాడిని కాదు. దట్టమైన అడవుల మధ్యలో ఉండే మా ఊళ్లో… గ్రామ దేవతలూ, వాళ్లకి చెందిన రకరకాల ఆచారాలూ ఉండేవి. ఏటా యక్షగానం కార్యక్రమాల్లాంటివి నిర్వహిస్తుంటారు. నేనూ ఓ సారి మా ఊరి కళాకారులతో కలిసి ‘మీనాక్షి కల్యాణ’ అనే యక్షగాన ప్రదర్శనలో షణ్ముగ పాత్ర చేశాను. నా నటన చూసి ఊళ్లో వాళ్లందరూ బాగా మెచ్చుకున్నారు. ఆ కళాకారుల ద్వారానే నాకు మా ప్రాంతం వాడైన ఉపేంద్ర… ఓం, ష్- లాంటి సినిమాలతో కన్నడ తెరపైన సంచలనం సృష్టిస్తున్నాడని తెలిసింది. నేనూ అతనిలా కావాలనుకున్నాను. అప్పుడే నటనపైన మాత్రమే కాకుండా దర్శకత్వంపైనా నాకు ఆసక్తి కలిగింది. అటువైపు వెళ్లాలంటే నేను బెంగళూరులోనే శిక్షణ తీసుకోవాలి. సరిగ్గా అప్పుడే నాన్న నన్ను బెంగళూరుకి తీసుకెళ్లారు.
బెంగళూరులో బీహెచ్‌ఎస్ కాలేజీలో డిగ్రీలో చేరిపోయాను. అక్కడా నాకు మంచి స్నేహితులు దొరికారు. కాకపోతే ఈసారి అల్లరివైపు కాకుండా రంగస్థలం వైపు దృష్టిపెట్టాం. అలా మా కళాశాలలో ‘రంగసౌరభం’ అనే బృందంగా ఏర్పడి నాటకాలు వేసేవాళ్లం. ఆ పిచ్చి బాగా పెరిగి డిగ్రీ పూర్తవ్వకుండానే… ‘ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’లో శిక్షణ కోసం డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరిపోయాను. ఆ పని చేసినందుకు నాన్న నాపైన మండిపడ్డారు.ఆ సమయంలో నాకు మా అక్క ప్రతిభా శెట్టి అండగా నిలిచింది. నాన్నను అడిగే అవసరం రాకుండా నా ఖర్చులకు తనే డబ్బులు ఇస్తుండేది. కానీ ఇలా అక్కపైన ఆధారపడటం నచ్చక మినరల్ వాటర్ వ్యాపారం మొదలు పెట్టాను. ఉదయం అక్కని ఆఫీసులో దింపేసి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడిని. తరగతులు పూర్తయ్యాక మళ్లీ అక్కను ఇంట్లో దింపేసి మినరల్ వాటర్ సప్లై చేసేందుకు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లేవాడిని. రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయి ఉదయాన్నే అక్క ఇంటికి చేరుకునేవాడిని. ఆ వ్యాపారంతో కాస్త కూడబెట్టాను, కానీ ఆ డబ్బూ ఎక్కువ కాలం నిలవలేదు…
రోజుకు 50 రూపాయలు ఓ రోజు నేను వాటర్ సప్లై చేస్తున్న క్లబ్‌కు కన్నడ నిర్మాత ఎం.డి ప్రకాశ్ వస్తే… ఏదైనా అవకాశం ఇప్పించమని అడిగాను. వాటర్ సప్లై చేస్తున్న నేను అలా అడిగేసరికి… ఆయన వింతగా చూస్తుంటే నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థినని చెప్పాను. దాంతో ‘సైనైడ్’ అన్న చిత్రంలో సహాయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారు. అక్కడ నాకు రోజుకు యాభై రూపాయలు ఇచ్చేవారు. ఆ చిత్రం స్పాట్‌కు వెళ్లేందుకే నాకు వంద రూపాయలు ఖర్చయ్యేది. అయితేనేం… అక్కడ ఎడిటర్, లైట్‌బాయ్, టచప్ మ్యాన్ ఇలా ఎవరు రాకపోయినా ఆ పని నేను చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. దురదృష్టం వెన్నాడుతోందో ఏమో ఆ షూటింగ్ ఆగిపోయింది. చేసేదేమీ లేక మళ్లీ వాటర్ క్యాన్ వ్యాపారంలోకి దిగాను. ఒక్కసారి సినిమా ప్రపంచాన్ని రుచి చూశాక… ఆ వ్యాపారం చేయలేకపోయాను. ప్రముఖ దర్శకుడు రవి శ్రీవత్స తీస్తున్న చిత్రం ‘గండ హెండతి’ యూనిట్‌లో క్లాప్ బాయ్‌గా చేరాను. ఆ దర్శకుడికి కోపం చాలా ఎక్కువ. ఓ రోజు కెమెరామెన్ ఇచ్చిన సూచనతో ఓచోట నిలబడ్డాను. ఉన్నట్టుండి నా తలపైన ఎవరో గట్టిగా కొట్టారు. ఎవరా అని చూస్తే…దర్శకుడు. ‘ఇక్కడెవరు నిల్చోమన్నారు’ అని కోపంతో ఊగిపోతున్నాడు. కెమెరామెన్ చెప్పింది వినాలా…డైరెక్టర్ చెప్పినట్లు చేయాలా…అర్థం కాలేదు. చిరాకొచ్చి చెప్పా పెట్టకుండా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేశాను. ఏడాది పాటు ఆ షూటింగ్‌లో పని చేస్తే వచ్చింది రూ.1,500. ఆ డైరెక్టర్ దెబ్బకి సినిమాలవైపే వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
మారువేషాల్లో తిరిగాను… అప్పటి వరకూ సినిమాలపైన ఉన్న ఆసక్తి కాస్తా విరక్తిగా మారిపోయింది. ఇక మినరల్ వాటర్ వ్యాపారాన్ని మానేసి ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనుకున్నాను. అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో పాటు కొంత అప్పు చేసి 2009లో హోటల్ వ్యాపారం పెట్టాను. కానీ అది కేవలం అయిదు నెలల్లోనే నష్టాలు చూపించింది. పెట్టుబడి అంతాపోయి 25 లక్షల రూపాయల అప్పు మిగిల్చింది. ఆ అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చింది. అలా 2012 వరకూ ఈ అప్పులు కడుతూనే ఉన్నాను. మనసు మళ్లీ సినిమాల వైపు వెళ్లింది. వేషాల కోసం గాంధీనగర్‌లో తిరిగాను. చిన్న చిన్న చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ఆ సమయంలో అప్పులోళ్ల నుంచి తప్పించుకునేందుకు సినిమాల్లోని వేషాలతోనే బయటా తిరిగేవాణ్ణి. ఒక రోజు బేకరీకి వెళ్లాను. అక్కడ బిల్లు రూ.18లు అయితే నా జేబులో 17రూపాయలే ఉన్నాయి. ఇదివరకు మినరల్ వాటర్ వ్యాపారంలో లక్షల రూపాయల ఆదాయం చూసిన నేను ఒక్క రూపాయి లేక ఇబ్బంది పడటం నన్నెంతో కుమిలిపోయేలా చేసింది. అలా కాదనుకుని…సీరియల్లో అవకాశాలు వచ్చినా చేయడానికి సిద్ధమయ్యాను. ఓ సీరియల్‌లో రోజుకు రూ.500ల చొప్పున అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను.
అసలు పేరు రిషబ్ కాదు! ఇటు సినిమాలూ లేవూ, అటు వ్యాపారమూ కలిసిరాలేదు. ఏ ప్రయత్నమూ ఫలించక అయోమయంలో పడిపోయాను. అప్పుడే దర్శకుడు అరవింద్ కౌశిక్‌తో పరిచయమైంది. ఆ సమయంలో ఆయన రక్షిత్ శెట్టితో ‘తుగ్లక్’ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో నటించేటప్పుడే ప్రశాంత్ శెట్టి అన్న నా పేరుని రిషబ్ శెట్టిగా మార్చుకున్నాను. ఆ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాన్నేను. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ ఉండిపోయాను.
అలా దర్శకుణ్ణయ్యాను… రక్షిత్ శెట్టి చేసిన తొలి సినిమా పరాజయం పాలైంది. దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడు కుంగిపోయాడు. ‘తుగ్లక్’తో నాకు మంచి స్నేహితుడైన అతణ్ణి కుంగుబాటు నుంచి బయటపడేయాలనే ఇదివరకు నేను సిద్ధం చేసుకున్న ‘రిక్కీ’ కథను చెప్పాను. తనకి నచ్చడంతో నన్నే దర్శకత్వం కూడా చేయమన్నాడు. అనూహ్యంగా వచ్చిన అవకాశం అది. రూ.2 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది. హిట్ సాధించాం..ఇక ఓ కళాత్మకమైన సినిమా తీద్దామని ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ కథ రాశాను. బడులు మూసివేస్తారన్న పత్రికల కథనాలు దానికి మూలం. కానీ నిర్మాతల చుట్టూ ఎంతగా కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ ముందుకు రాలేదు. నాకు ఉక్రోషం వచ్చి నేనే నిర్మాతని కావాలనుకున్నాను. మరి డబ్బులు? మరో కమర్షియల్ సినిమాతో సంపాదిద్దామని ప్లాన్ చేశాను. అలా నా మిత్రులతో కలిసి 2016లో ‘కిరిక్ పార్టీ’ సినిమా తీస్తే అది పెద్ద హిట్టయింది. ఆ డబ్బుతోనే ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ అన్న నా కలల ప్రాజెక్టుని ముగించాను. ఆ సినిమాకు జాతీయ అవార్డొచ్చింది. ఇక ‘బెల్‌బాటమ్’తో హీరో అవ్వాలన్న కోరికా తీరింది.
సొంత ఊరి కథే ‘కాంతార’… ఉడుపి జిల్లాలోని మా కుందాపుర ప్రాంతం అన్ని రకాలా ప్రత్యేకమైంది. మాది ఒట్టి కన్నడ యాస కాదు… ఓ కొత్త భాషలాగే ఉంటుంది. ‘కాంతార’ సినిమాలో… ప్రేక్షకులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న భూతకోల దైవారాధన మా ప్రాంతంలో నిత్యం అనుసరించే సంప్రదాయమే. ఇక్కడున్న మా ప్రత్యేక జీవన శైలీ, సంస్కృతుల్ని ప్రతిబింబించే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో, ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగానూ ఉండాలనుకున్నాను. ఆ స్థాయిలో చేయాలంటే అందుకు తగ్గ నిర్మాణ సంస్థ కావాలి కదా. కేజీఎఫ్‌తో ఘన విజయం అందుకున్న ‘హోంబలే’ సంస్థని ఇందుకోసం ఒప్పించాను. ఈ చిత్రాన్ని ముందు పునీత్ రాజ్‌కుమార్‌తో తీయాలనే అనుకున్నాను. ఆయనతో చెబితే… సినిమాలో ఆ మట్టిపరిమళం చక్కగా రావాలంటే ‘నువ్వే నటించాలి’ అని సలహా ఇచ్చాడు. దాంతో నేనే అటు హీరోగానూ ఇటు దర్శకుడిగానూ అవతారమెత్తాను. ఈ చిత్రాన్ని పూర్తిగా మా ఊరిలోనే సెట్ వేసి తీశాం. అడవి కూడా ఊరి పక్కన ఉన్నదే. ఇందులోని నటుల్లో 80 శాతం మంది మా ఊరివాళ్లే. భాష ఏదైనా, సంస్కృతి వేరైనా ప్రకృతికీ, మానవుడికీ మధ్య సంఘర్షణ ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటే కాబట్టి… ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని దీన్ని దేశవ్యాప్తంగా విడుదలచేశాం. నా ఊహ నిజమై చిత్రం అందరికీ దగ్గరవడంతో పాటు… నేను ఊహించని స్థాయిలో కలెక్షన్‌లు రాబడుతోంది. 16 కోట్ల రూపాయలతో నేను నిర్మించిన ఈ చిత్రం… వారంలోనే వందకోట్లు దాటి పోవడం ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి.
సెల్ఫీతో మొదలైన ప్రేమ…
‘రిక్కీ’ విజయోత్సవ కార్యక్రమం జరుగుతున్న సమయం అది. అప్పుడు నేనూ హీరో రక్షిత్ బెంగళూరులో ఓ మాల్‌కు వెళ్లాం. రక్షిత్‌ని చూసి అభిమానులంతా సెల్ఫీలు దిగుతుంటే… ఓ మూలన నిల్చున్న నన్ను ఒకమ్మాయి దగ్గరకొచ్చి పలకరించింది. ‘ఈయనే దర్శకుడు’ అంటూ తన స్నేహితురాళ్లకి పరిచయం చేసింది. తనని ఎక్కడో చూసినట్టు అనిపించింది… ఎవరా ఎవరా అని ఆలోచిస్తుంటే… మా ఊరమ్మాయని గుర్తొచ్చింది. తను నా ఫేస్‌బుక్‌లోనూ ఉన్న విషయం ఆ తర్వాత తెలిసింది. అలా మొదలైన మా పరిచయం పెద్దల సమక్షంలో పెళ్లిబంధంగా మారింది. ‘కాంతార’ షూటింగ్ సమయంలో ప్రగతి గర్భిణి. ప్రసవ సమయంలో ఆమెతో గడపలేకపోయాను. ఆ షూటింగ్ ముగించుకునే సమయానికి పాప పుట్టింది. అన్నట్టు…ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తనే!
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఒక వివాహ బంధాన్ని ఖాయపరుచుకునే సమయంలో వరుడి డిమాండ్‌పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది. పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్‌ల సంగతి తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు. వరుడి డిమాండ్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అందరిలోనూ ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు, కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు అసందర్భ సంప్రదాయాల గురించి మాత్రమే కావడం విశేషం..
వరుడి ఇవే డిమాండ్లు
1)ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. 2)పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరిస్తుంది. 3)అసభ్యకరమైన చెవి-బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడుతుంది. 4)దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉంటారు. 5)వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారు వివాహం నుండి బహిష్కరించబడతారు. 6)పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపలేరు. 7)కెమెరామేన్ దూరం నుండి ఛాయాచిత్రాలు తీస్తాడు. అవసరం మేరకు, ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీస్తాడు. పురోహితుడి ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు. ఇది తమ సాక్ష్యంలో దేవుళ్ళను పిలిపించి జరిపే కళ్యాణం, సినిమా షూటింగ్ కాదు. 8)వధూవరుల ద్వారా కెమెరామేన్ ఆదేశానుసారం, నేరుగా రివర్స్‌లో పోజులు పెట్టి చిత్రాలు తీయబడవు. 9)పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి. తద్వారా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా, అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. 10)తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోవాలని అడిగితే, అట్టి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరిస్తారు.
ఈ అబ్బాయి డిమాండ్లన్నీ అమ్మాయిలు ఆనందంగా అంగీకరించదగినవే. ఇటీవల కాలంలో వివాహ కార్యాల్లో మొదలైన వికృత చర్యలను ఇలాంటి చర్యలతో రూపుమాపొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివాహం అనేది ఒక పవిత్ర కార్యక్రమం.. దానిని గౌరవిద్దాం.. మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం.
శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా.. లింగరూపంలో ప్రణమిస్తే మంచి ఫలితాలు కలుగుతాయా? అన్న అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పారు. శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారి కంటే, శివలింగారాధన చేసేవారిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు. మనకు లోకంలో అనేక రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో రెండు లింగాల గురించి చెప్పుకుందాం….
లింగం అంటే గుర్తు, ప్రతిరూపం అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది. కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ….. ఇలా కదలని వాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం. అలాగే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే.
రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమి కీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది. మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ.. అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.
మహానంది.. శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో అయినా కొనేరులో నీరు గోరు వెచ్చగానే ఉంటుంది.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు – కనిగిరి మధ్య) కె. అగ్రహారంలోని కాశీవిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతాడు. ఇది అద్భుతం.
అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.
వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడిలో సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
ద్రాక్షారామంలో శివలింగాన్ని నిత్యం ఉదయం, సాయత్రం సూర్య కిరణాలు తాకుతాయి.
భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతుంది.
కోటప్పకొండలో ఎటుచూసినా మూడు శిఖరాలే కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు.
గుంటూరు జిల్లా చేజర్లలో కపోతేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడి లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లుపోస్తే శవం కుళ్లిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
బైరవకోన: ఇక్కడికి కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.
యాగంటి: ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు
శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు “జుం”తుమ్మెద శబ్దం వినపడేదట
కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు శివలింగంగా మారింది. ఈ ఆలయంలో ఏడాదిలో ఆరు నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది.
శ్రీకాళహస్తిలో వాయు రూపములో శివలింగం ఉంటుంది.
అమర్‌నాథ్‌లో శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.
కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజుల్లో ఒక్క చుక్క కూడా కనిపించదు.
మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
తమిళనాడులోని తిరు నాగేశ్వరములో శివ లింగానికి పాలు పోస్తే నీలం రంగులోకి మారుతాయి.
చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా.. మధ్యాహ్నం పసుపుగా.. సాయంత్రం తెలుపుగా.. రాత్రి నీలంగా మారుతుంది.
దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.
న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః
అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజూ పుణ్యప్రదమే. ఒక్కోరోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం…
కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు. తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. పంచమి : దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి. ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది. త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.
కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీ స్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.
కార్తీక బహుళ పాడ్యమి: ఆకుకూర దానం చేస్తే మంచిది. విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి. పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి. సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి. ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం. త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి. అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.