Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
ఏ ఆలయంలోనైనా భక్తులను గర్భగుడిలోకి అనుమతించరు. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోకి భక్తులు వెళ్లడమే కాదు మూలమూర్తి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఈ ఆలయంలో గర్భగుడికి పై కప్పు ఉండదు. స్వామి విగ్రహం కూడా పడమర వైపు తిరిగి ఉంటుంది. ఇతర ఆలయాలకు భిన్నంగా మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈ ప్రత్యేకతలన్నీ కనిపిస్తాయి.
పడమటి ఆంజనేయుడు శ్రద్ధగా పూజించేవారికి శని దోషాలను పోగొట్టే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలోని మక్తల్ ప్రాంతంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని జాంబవంతుడే స్వయంగా ప్రతిష్ఠించాడని అంటారు. సాధారణంగా హనుమంతుడి ఆలయాల్లో స్వామి విగ్రహాలు తూర్పు, ఉత్తరం, దక్షిణంవైపు తిరిగి భక్తులకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడ స్వామి పశ్చిమ దిక్కును చూస్తూ, ఓ పక్కకు ఒరిగి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. అంతేకాదు, ఈ ప్రాంగణంలోని గర్భగుడికి పైకప్పు ఉండదు.
స్థల పురాణం
గర్భగుడిలో పైకప్పు లేకపోవడానికీ ఓ కథ ఉంది. ఇక్కడ గర్భగుడిలోని పైకప్పును ఉదయం నుంచీ సాయంత్రంలోగా నిర్మించాలనేది నియమమనీ… రెండుసార్లు అలా ప్రయత్నించినా పైకప్పు కూలిపోయిందనీ.. దాంతో దాన్ని అలాగే వదిలేశారనీ చెబుతారు స్థానికులు. గర్భగుడిలో సైతం భక్తులు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉన్న ఆలయం కూడా ఇదొక్కటే కావం విశేషం.
శనిదోషాన్ని పోగొట్టేస్వామి
త్రేతాయుగంలో జాంబవంతుడు ఇక్కడ స్వామి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా సీతాదేవి జాడ వెదుకుతూ వచ్చిన హనుమంతుడు ఈ ప్రాంతంలో సేదతీరాడనీ.. అలా ఇక్కడ స్వామివారి విగ్రహం వెలసిందనీ అంటారు. స్వామి విగ్రహం ఓ పక్కకు ఒరిగి ఉండటానికీ ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు స్వామిని పూజించే అర్చకుడు పొట్టిగా ఉండేవాడట. దాంతో రోజూ స్వామికి సరిగ్గా పూజ చేయలేక ఇబ్బంది పడేవాడట. ఆ అసంతృప్తితో అర్చకుడు ఓ రోజు విగ్రహం తన చేతికి అందితే కానీ పూజ చేయకూడదని నిర్ణయించుకుని అదే విషయాన్ని స్వామికి విన్నవించుకున్నాడట. కాసేపటికి స్వామి విగ్రహం పూజారికి అందేలా కాస్త పక్కకు ఒరిగిందట. అప్పటినుంచీ విగ్రహం ఒకవైపు వాలినట్లుగా ఉండిపోయిందని అంటారు.
ఈ స్వామిని 41 రోజులపాటు భక్తితో పూజిస్తే… కోరికలు తీరుస్తాడనీ, శనిదోషాలనూ నివారిస్తాడనీ అంటారు. ఆంజనేయుడికి సింధూర లేపనం అంటే ఇష్టమనీ.. మనసులో ఏదయినా అనుకుని సింధూరాన్ని స్వామికి అర్పిస్తే సంతానం, యశస్సు, విద్య.. ఇలా ఏది అనుకున్నా ప్రసాదిస్తాడనీ చెబుతారు. మార్గశిర మాసంలో త్రయోదశి నుంచి బహుళ విదియ వరకూ స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి రోజున రథోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులూ వస్తారు. అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, అక్షయ తృతీయ రోజుల్లోనూ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇలా చేరుకోవచ్చు
ఈ ఆలయం హైదరాబాద్‌కు 163 కిలోమీటర్ల దూరంలో… కర్నూలు పట్టణానికి117 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి ఆలయానికి నేరుగా చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రైల్లో వచ్చిన వారు మహబూబ్‌నగర్‌లో దిగి.. అక్కడి నుంచి 65 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
మధుర మీనాక్షి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణం వేగాయి నడి ఒడ్డున ఉంది. తమిళనాడులోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మధురై… దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలకు నిలయంగా ఈ నగరం విలసిల్లుతోంది. మీనాక్షీ, సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. సుందరేశ్వరుడు సాక్షాత్తు శివుడు, .యన భార్య సాక్షాత్తు పార్వతీ దేవి. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు, గాయకులు దివ్యమైనదిగా గానం చేశారు. శక్తి స్వరూపిణి అయిన దేవి, మానవ రూపంలో అవతరించి పాండ్య రాజ పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమ శివుని సతీమణి అయింది.
ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు .భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ ఆలయం (మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.
స్థల పురాణం మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి దేవి చిన్న పాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలు దేరుతాడు. అయితే అనుకున్న సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా ‘చిత్తిరై తిరువళ’గా వేడుకగా నిర్వహిస్తున్నారు.
తమిళ గ్రంథం తిరువవిలై యాతర పురాణంలోని కథనం ప్రకారం.. ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు చాలా కాలం వరకూ సంతానం కలగలేదు. దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలిసి పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. అయితే ఆయనకు పుత్రునికి మారుగా అప్పటికే మూడేళ్ల వయసున్న ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు మూడు రొమ్ములు ఉన్నాయి. ఇదేమిటా అని తల్లి తండ్రులు ఆలోచిస్తున్నంతలో శివుడు ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరి పెంచమని ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం మూడవ రొమ్ము మాయమవుతుందని చెప్పాడు. తల్లితండ్రులు ఆమెకు పుత్రుని మాదిరి యుద్ధ విద్యలు నేర్పించారు. వాటిలో ఆమె ప్రావీణ్యం గడించింది. రాజ్యాలను గెలుచుకుంది. ఒక రోజు ఆమె ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని దర్శించగానే ఆమె మూడవ రొమ్ము మాయమైంది. దానితో ఆయనే తన భర్త అని ఆమె గ్రహించింది. పార్వతీ దేవి మరో రూపమైన ఆమెను శివుడు వివాహమాడాడు. వారిద్ద్దరూ కొంత కాలం మధురై నగరాన్ని పాలించారు. ఆ తర్వాత వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి ఉగ్ర పాండ్యన్ అని పేరు పెట్టారు. ఇతనిని మురుగన్ (కుమారస్వామి ) అపర అవతారంగా పేర్కొంటారు. వారు అతనిని సింహాసనంపై కూర్చోపెట్టి తాము సుందరేశ్వర మీనాక్షిలుగా ఆలయంలో కొలువు తీరారు. పేరెన్నికగన్న మధురై మీనాక్షి ఆలయం ప్రస్తావన 6వ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయం ప్రాచీన గ్రంథాల్లో ఉన్నా, 14వ శతాబ్దం అనంతరమే ప్రస్తుత ఆలయం నిర్మాణం జరిగిందని చెబుతారు.
ఆలయ నిర్మాణం ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారు. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. దాదాపు 33000 శిల్పాలు ఉన్నాయి. 1000 స్థంభాల మండపం ప్రధాన ఆకర్షణ.
దండయాత్రలు శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్‌దార్ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలో పేర్కొన్నాడు. అనంతం ఖిల్జీ సేనాన, మాలిక్ కపూర్ దీన్ని ఈ ఆలయాన్ని కూల్చివేశారు.ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి.
పునర్నిర్మాణం 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు.
పండుగలు మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి స్వామివారికి చక్కెర పొంగలి, పెరుగన్నం లాంటి ప్రసాదాలూ సమర్పిస్తారని తెలుసు. అయితే కమ్మని దోసెలు, ఘాటైన మిరియాల అన్నం కూడా ఏడుకొండల వాడికి వడ్డిస్తారని మీకు తెలుసా?. తిరుమలేశుడికి పూటపూటకూ ఓ పలహారం. రుతువులను బట్టి ఆహారం. సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి.. ఏం పెట్టాలి, ఏయే పదార్థాలు ఏయే కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదం వండేవారు వంట సమయంలోనూ, తర్వాత వాసన సోకకుండా ముక్కుకు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. స్వామికి సమర్పించేదాకా బయటి వారెవరూ దాన్ని చూడరాదు.
నైవేద్యం పెట్టేది ఇలా…
ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.
గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.
ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే సమయంలో అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. ఆ వేళలో గర్భాలయం తలుపులు మూసేస్తారు.
విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి దళాలను అభికరిస్తారు.
కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడిచేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు.
చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే. *ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధ గుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని సమర్పిస్తారు. *నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.
రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.
ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం
పది, పదకొండు గంటల మధ్య రాజభోగం
రాత్రి ఏడు – ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.
తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తుకు అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.
నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.
ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు.
అల్పాహారాలు లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి పలహారాల జాబితా ఇదీ…
ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని ఆవు పాలు సమర్పిస్తారు
తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు
ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది *అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది
సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి… స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు.
అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!
అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గుడాన్నం) పెడతారు.
ఇక పవళించే సమయం దగ్గర పడుతుంది.
ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆరాధన ఎక్కువ. శివపార్వతుల ముద్దుల తనయుడైన ఆయన్ని… కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. సుబ్రమణ్యేశ్వరుడికి మంగళవారం ప్రీతికరం. వివిధ సమస్యలతో బాధపడేవారు ఆయన్ని భక్తితో పూజిస్తే పరిష్కారం చూపిస్తాడని భక్తుల నమ్మకం
విజయాల కోసం.. కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే. రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ ‘శరం’ అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే… ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట!
సంతానానికి ఈ సృష్టిలో పార్వతీపరమేశ్వరులని ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.
జ్ఞానానికి సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి వచ్చిందని చెబుతారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయన్ని వేలాయుధన్ అని కూడా పిలుస్తారు. ఈ శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తుంటారు.
ఆధ్మాత్మిక ఉన్నతికి శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందనీ, అది ఆరుభాగాలుగా మారిందనీ.. కుమారస్వామి జననం గురించి చెబుతుంటారు. ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలనే అక్కచెళ్లెళ్లు పెంచారట. అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని పేర్కొంటారు. అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతుంటారు. ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచన. పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు కనిపిస్తాయి. ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తుంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చు.
యోగ సాధనకు కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగ శాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు.
జాతక దోష నివారణకు వివాహం, సంసారం, సంతానం… వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట. ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహ జీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. సుబ్రమ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే ఎటువంటి కుజ దోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మకం.
దసరాకు నెల రోజుల ముందు నుంచే మొదలయ్యే సంబరాలు.. దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే పర్యాటకులు.. ఏటా అధికారికంగా నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం… 1610 సంవత్సరం నుంచి నిరంతరాయంగా జరుగుతున్న ఉత్సవాలు.. ఇప్పటికీ రాజకుటుంబం చేతుల మీదుగా జరిపించే దసరా వేడుకలు.. గజరాజు మీద స్వర్ణ అంబారీపై చాముండేశ్వరీ దేవి ఊరేగింపు… విద్యుత్ దీపాల వెలుగులతో అలరారే మైసూర్ ప్యాలెస్..
తింటే గారెలే తినాలు.. వింటే భారతమే వినాలి అన్నట్టుగా చూస్తే మైసూరులో జరిగే దసరా వేడుకలనే చూడాలి. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా మైసూరులో దసరా వేడుకలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత వైభవంగా జరువుతారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
మైసూరులో దసరా ఉత్సవాల సందడి నెల రోజుల ముందే ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా… ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్ళు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆటల, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు…. ఒక్కటేమిటి… దసరా సందర్భంగా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు. మైసూరుకు చెందిన రాజకుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు నేటికీ అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉండటం విశేషం.
మైసూరులో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరువుతున్నారని చరిత్ర చెబుతోంది. వడయార్ రాజ వంశం ఈ వేడుకలను ప్రారంభించింది. అంతకుముందు శ్రీరంగ పట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అప్పటి నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి. దసరా ముందు జరిగే వేడుకల సంగతి అలా వుంచితే, దసరా రోజున జరిగే కీలకమైన వేడుక కన్నులకు విందు చేస్తుంది.. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి, దానిలో చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగిస్తారు. ఒక చెట్టు కలపతో, 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ రాజసం ఉట్టి పడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మెసూర్ ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మరికొన్ని ఏనుగులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొంటాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మైసూరుకు తరలి వస్తుంటారు.
దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతో పాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ రోజున అన్ని వృత్తుల వారు తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు జరపడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్‌ని లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మెసూర్ మహారాజుల నివాసమైన ఈ ప్యాలెస్‌లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్‌లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే 10 రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు. అంబారీ ప్రదర్శనకు ఒక రోజు ముందు దసరా దివిటీల ప్రదర్శన నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దసరా సందర్భంగా మైసూరులో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో వివిధ జిల్లాలు, శాఖల అభివృద్ధిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మైసూర్ ప్రజలు తమ వారసత్వంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో జరువుకుంటారు.
దసరా సందర్భంగా ప్రతి ఇల్లూ దసరా శోభతో కళకళలాడుతూ వుంటుంది. ప్రతి ఇంట్లోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైసూరు దసరా వేడుకల గురించి మాటల్లో చెప్పలేం. రెండు కళ్లతో ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. ఈ పండుగ సందర్భంగా మైసూర్‌లోని అమ్మవారు చాముండేశ్వరీ దేవిని పూజించటం ఆనవాయితీ. విజయనగర రాజుల కాలంలో 15వ శతాబ్దంలో ఈ ఉత్సవాలు మొదలైనట్లు చారిత్రక ఆధా రాల ద్వారా తెలుస్తోంది. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుల్ రజాక్ తన వుస్తకంలో విజయనగర రాజులు నిర్వహి స్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ .. 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టగా.. 1805లో కృష్ణరాజు ఉడయార్ కాలం నుంచి దసరా నాడు మైసూరు ప్యాలస్‌లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పండుగ శరదృతువు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతుంది. శరదృతువులో జరుపుకునే ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు.
తెలుగు వారు పదిరోజులపాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలు, పూజల గురించి ప్రస్తావన వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ దేవాలయమే. ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. తిరుపతి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రెండో పెద్ద దేవాలయంగా కనకదుర్గ గుడి ఖ్యాతి గాంచింది. మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేద వ్యాసుని సలహామేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. శివలీలలు, శక్తి మహిమలు ఆలయంలో అక్కడక్కడ కనిపిస్తాయి.
చరిత్ర కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మ వారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మ వారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మ వారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన త్రైలోక్య మాత మహిషాసుర మర్దిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది.
ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలలో అమ్మవారిని దర్శించి ఉగ్రస్వరూపిణిగా వున్న అమ్మవారిని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని పురాణ కథనం. 12వ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఉపాలయాలు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను కూడా దర్శించుకుని పూజలు చేస్తారు. దసరా రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు. అనంతరం అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అన్నదానంతో పాటు ఉచితంగా పులిహోర, కదంబం, అప్పం ప్రసాదం ఉచితంగా అందిస్తారు. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ఆమె నామాలు, అవతారాలు, రూపాలు అనేకం. ఏ రూపంలో కొలిచినా ఆమ్మకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడితే పూజకి మరింత ఫలితం దక్కుతుందని అంటారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనం ఇస్తారో తెలుసుకుందాం.
తొలి రోజు నవరాత్రుల్లో తొలిరోజు కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు.
రెండో రోజు రెండో రోజు జగన్మాత కనకదుర్గమ్మ.. బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
మూడో రోజు దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీ మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.
నాలుగో రోజు అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన నాలుగో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం.
ఐదో రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజున అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాధనలు ముమ్మరమవుతాయి.
ఆరో రోజు ఆరో రోజున శ్రీలలితా త్రిపుర సుందరీదేవి రూపంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచ దశాక్షరీ మంత్రాధి దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరు మందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఏడో రోజు ఏడో రోజున అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఎనిమిదో రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమిస్తారు. అమ్మవారు దుర్గాదేవి రూపంలో, మహిషాసుర మర్ధినిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు… సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే… భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి.
తొమ్మిదో రోజు దసరా నవరాత్రి వేడుకల ముగింపు విజయదశమి నాడు ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకు గడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీ చక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.
ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చేయు అలంకారాలు.. ఇతర వివరాలు
26-09-22 సోమవారం – పాఢ్యమి – స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి – బంగారు రంగు చీర – కట్టెపొంగలి , చలిమిడి , వడపప్పు , పాయసం
27-09-22 మంగళవారం – విదియ – శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి – లేత గులాబీ రంగు చీర – పులిహార
28-09-22 బుధవారం – తదియ – శ్రీ గాయత్రీ దేవి – కాషాయ లేదా నారింజ రంగు చీర – కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం
29-09-22 గురువారం – చవితి – శ్రీ అన్నపూర్ణ దేవి – గంధపురంగు లేదా పసుపు రంగు చీర – దద్దోజనం , క్షీరాన్నం , అల్లం గారెలు
30-09-22 శుక్రవారం – పంచమి – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి – కుంకుమ ఎరుపు రంగు చీర – దద్దోజనం , క్షీరాన్నం
01-10-22 శనివారం – షష్ఠి – శ్రీ మహాలక్ష్మీ దేవి – గులాబీ రంగు చీర – చక్కెర పొంగలి , క్షీరాన్నం
02-10-22 ఆదివారం – సప్తమి – శ్రీ సరస్వతు దేవి – తెలుపు రంగు చీర – దద్దోజనం , కేసరి , పరమాన్నం
03-10-22 సోమవారం – అష్టమి – శ్రీ దుర్గా దేవి – ఎరుపు రంగు చీర – కదంబం , శాకాన్నం
04-10-22 మంగళవారం – నవమి – శ్రీ మహిషాసురమర్ధిని దేవి – ముదురు ఎరుపు రంగు చీర – చక్కెర పొంగలి
05-10-22 బుధవారం – దశమి – శ్రీ రాజరాజేశ్వరి దేవి – ఆకుపచ్చ రంగు చీర – లడ్డూలు , పులిహోర , బూరెలు , గారెలు , అన్నం
నటీనటులు: కోటి, అభిలాస్ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు నిర్మాత : సత్య నారాయణ సుంకర దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్ సంగీతం : కోటి సినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లా ఎడిటర్ : పాపారావు విడుదల తేది: సెప్టెంబర్ 22,2022
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘పగ పగ పగ’. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకులందరికీ ఉచితంగా చూపిస్తామని నిర్మాతలు ప్రకటన చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కంటెంట్‌పై నమ్మకంతో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం సినిమాపై ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథేంటంటే.. ‘పగపగపగ’ సినిమా కథ అంతా 1985, 1990, 2006వ సంవత్సరాల కాలంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్ కిల్లర్స్. ఒక్కసారి డీల్ కుదుర్చుకుంటే ప్రాణాలు పోయినా పూర్తి చేయడం వీరి స్పెషాలిటీ. అయితే కృష్ట పోలీసు హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్‌కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్ ప్రసాద్‌గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్తగా మారతాడు.
మరోవైపు కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. అతని కొడుకు అభి(అభిలాష్)ని చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటారు. జగదీష్ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్‌ని వద్దనుకుంటాడు. ఇంతలోపే ఆ డీల్ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే.. ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. ఆయన ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించేందుకు 100శాతం కష్టపడ్డాడు. కొన్ని సీన్లలో ఆయన టేకింగ్ మెస్మరైజ్ చేస్తుంది. పాత్రలకు తగినట్లుగా నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. వారి నుంచి నటన కూడా బాగానే రాబట్టుకున్నాడు.
అభి, సిరిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. జగ్గూభాయ్ కాస్త జగదీష్ ప్రసాద్‌గా మారడం.. వ్యాపారంలో రాణించడం.. అదేసమయంలో కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. కాంట్రాక్ట్ కిల్లర్‌ని పట్టుకునేందుకు జగ్గుభాయ్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఉహకు భిన్నంగా, టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే.. కెరీర్లో మొదటిసారి విలన్ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్ జగదీష్ ప్రసాద్ పాత్రకు తగిన న్యాయం చేశాడు. విలన్‌గా, హీరోయిన్‌కి తండ్రిగా నటనలో అదరగొట్టేశాడు. హీరో అభిలాష్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడు. సీరియస్, కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్ ఎడిసోడ్స్‌లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. కోటి సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ఆకట్టుకున్న దర్శకుడు
శ్రీ రవి దుర్గా ప్రసాద్ కొత్త దర్శకుడు అయినప్పటికీ ఈ సినిమాను కథనం పరంగా బాగానే డీల్ చేశాడనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన వారిలా చాలామంది కొత్తవారే. సంగీత దర్శకుడిగా కోటి మాత్రమే ప్రేక్షకులకు పరిచయస్తుడు. అయితే నటుడిగా కోటిని ప్రేక్షకులు ఊహించని కోణంలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ఆయన క్యారెక్టరే హైలెట్ అయింది. హీరో హీరోయిన్లు కొత్తవారు అయినప్పటికీ వారి నుంచి హావభావాలు రాబట్టడంలో కృతకృత్యులయ్యారు. సినిమా ఫస్టాఫ్ కామెడీ, అదిరిపోయే డైలాగులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందోనన్న ఆతృతను ప్రేక్షకుడిలో కలిగించారు. చాలా సీన్లు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసినా.. ఓవరాల్ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పించేలా ఉంది. ఇంత మంచి కంటెంట్‌తో తెరకెక్కించిన ‘పగపగపగ’ చిత్రాన్ని అదేస్థాయిలో ప్రమోట్ చేయలేదనిపిస్తోంది. నిర్మాతలు పబ్లిసిటీ మీద కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. కాస్త పరిచయం ఉన్న హీరోహీరోయిన్ల పెట్టుకుంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ కొత్త నటులతో ఆయన తెరకెక్కించిన విధానాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.
ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే మౌత్ టాక్ సరిగ్గా లేకపోతే మొదటి ఆట తరువాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. మొదటి ఆట ముగిసే సమయానికి సినిమా జాతకం అంతా బయటకు వచ్చేస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తేనే ఆ తరువాత నిలబడుతోంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమా అయినా ప్లాప్‌ల లిస్టులో చేరిపోతోంది.
టాలీవుడ్ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ టైమ్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులను ఉచితంగా చూపించాలంటే నిర్మాతలకు ఎంత ధైర్యం కావాలి. అలాంటి సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు ‘పగ పగ పగ’ చిత్ర నిర్మాతలు. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తొలిసారిగా విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. వినోదంతో కూడిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ సత్య నారాయణ సుంకర ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకంతో నిర్మాతలు టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పగ పగ పగ’ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ డేరింగ్ స్టెప్‌తో ఇండస్ట్రీలోని వర్గాలు అవాక్కవుతున్నాయి. అయినప్పటికీ సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు. నిర్మాతలు తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ సక్సెస్ అయి టాలీవుడ్‌కి మరో మంచి హిట్ దక్కాలని కోరుకుందాం..
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతం కావడంతో హైదరాబాద్ సంస్థానంపై ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పట్టు చేజారిపోయింది. 1948, సెప్టెంబర్ 17న తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత ప్రభుత్వం ఆయన్ని రాజ్‌ప్రముఖ్‌గా గుర్తించింది. ఇక్కడివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత ఏడో నిజాం ఏం చేశారు?.. ఎక్కడున్నారు?.. ఎలా చనిపోయారు?.. చివరి రోజుల ఎలా గడిపారు?.. అన్న సమాచారం చాలాకొద్ది మందికే తెలుసు.. స్వతంత్య్ర భారతదేశంలో ఆయన జీవితం ఎలా కొనసాగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
1948, సెప్టెంబర్ 17న నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయినా 1950, జనవరి 25 వరకు సాంకేతికంగా ఆయనే హైదరాబాద్ పరిపాలకుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఫర్మానాలన్నీ ఆయన పేరుమీదే జారీ అయ్యేవి. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించడంతో హైదరాబాద్ అందులో ఓ రాష్ట్రమైంది . నిజాం హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ (గవర్నర్) గా ప్రమాణ స్వీకారం చేశారు . 1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వరకు ఆయన రాజ్‌ప్రముఖ్ పదవిలో కొనసాగారు
1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 1952 మార్చి 8న నిజాం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు . అయితే తన రాచరికం ముగిసి పోయిందని, తన ఫర్మానాలేవీ చెల్లవనే విషయం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెలుసుకోలేకపోయారు. రాజ్ ప్రముఖ్ పదవిని కూడా కోల్పోయిన తర్వాత తర్వాత నిజాం… మాసాబ్ ట్యాంకుకు మూడు కిలో మీటర్ల దూరంలోని కింగ్‌కోఠిలో ఉన్న తన నివాసానికే పరిమితమయ్యారు తన భార్యలు , పిల్లలు , మనవలు , మునిమనవలు , సేవకులతో ఆ భవనంలోనే కాలం గడిపేవారు. తనను ఇంకా రాజుగానే భావిస్తూ ఫర్నానాలు జారీ చేస్తుండేవారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కింగ్ కోఠీలో ఉండేవారి స్థాయికి తగినట్టుగా వారి భోజనంలో ఉండాల్సిన పదార్థాల జాబితా తయారుచేయడం, ఎవరికైనా రోగం వస్తే వారికి తన పరిజ్ఞానాన్నంతా ఉప యోగించి యునానీ వైద్యం చేయడం… ఇవే ఆయన వ్యాపకాలు. అయితే మందులు తీసుకున్నవారంతా వాటిని వేసుకోకుండా అల్లోపతి మందులే వాడేవారు. రోగం నయం కాగానే నిజాం దగ్గరికి వచ్చి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తేవారు.
ఆస్తి కరిగిపోతుంటే .. కూర్చుని తింంటే కొండైనా కరుగుతుందన్న సామెత నిజాం ఆస్తుల విషయంలో నిజమైంది. నిజాం రాజులు కూడబెట్టిన ఆస్తులన్నీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుల హయాం వచ్చే సరికి వేగంగా కరిగిపోవడం మొదలైంది. దీంతో ఆయన కొడుకులను గట్టిగా హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. దీంతో తన ఆర్థిక సలహాదారుల సలహా మేరకు వివిధ ట్రస్టులు ఏర్పాటు చేసి కుటుంబసభ్యుల ఖర్చులకు ట్రస్టుల ద్వారానే డబ్బు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 47 ట్రస్టులు ఆయన ఏర్పాటు చేశారు. నిజాం కుటుంబంలో ఆడపిల్లకు పెళ్లయితే వారికి ఓ ఇల్లు, జీవితాంతం నెలకు రూ .4 వేల చొప్పున నజరానా వచ్చేలా ఓ ట్రస్టుు ద్వారా ఏర్పాటు చేశారు. ఆయన పాకెట్ మనీకోసం ఓ ట్రస్టు, కొడుకుల ఖర్చులకు మరో ట్రస్టు ఏర్పాటుచేశారు.
1967 ఫిబ్రవరిలో నిజాం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆయన అల్లోపతి వైద్యం చేయించుకునేందుకు నిరాకరించడంతో యునానీ వైద్యం అందించేవారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కీర్తిపొందిన నిజాం రాజు తన జీవితంలో ఎప్పుడూ అల్లోపతి వైద్యం చేయించుకోకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 18న ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో అల్లోపతీ వైద్యులు పరీక్షించేందుకు రాగా ఆయన కుమార్తె షహజాదీ పాషా వారిని అనుమతించలేదు. అదేరోజు మధ్యాహ్నం.. నిజాం భార్యల్లో ముగ్గురు హజ్ యాత్రకు బయల్దేరి వెళ్లారు. ‘ఇదే చివరిచూపు. మీరు వచ్చేసరికి నేను బతికుండను’ అని నిజాం వారితో చెప్పడంతో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది.
20వ తేదీ నాటికి ఆయన స్పృహలో లేని పరిస్థితుల్లో నిజాం వైద్య సలహాదారు డాక్టర్ వాఘ్రే.. బంకత్ చందర్, జీపీ రామయ్య, సయ్యద్ అలీ అనే ముగ్గురు అల్లోపతి వైద్యులను రప్పించారు. డాక్టర్ రామయ్య నిజాం నాడి పట్టి చూశారు. ఆయనకు జ్వరంగా ఉందని ఇంజెక్షన్ చేయాలని చెప్పగా షహజాదీ పాషా మళ్లీ నిరాకరించారు. ఆయనకు కనీసం రక్తపరీక్ష చేయడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఆయన పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పడంతో లండన్‌లో ఉంటున్న మనవలు ముకరం జా, ముఫకం జాకు కబురు పంపారు.
1967 ఫిబ్రవరి 24న మధ్యాహ్నం వేళ నిజాం కన్నుమూశారు. డాక్టర్ రామయ్య స్టెతస్కో్ప్తో ఆయన గుండెను పరీక్షించి నిజాం మరణించినట్లుగా ప్రకటించారు. నిజాం రాజు ఒంటిని తాకిన మొట్టమొదటి ఆధునిక వైద్య పరికరం అది. నిజాం కార్డియాక్ ఫెయిల్యూర్‌తో మరణించినట్లు రామయ్య తెలిపారు. అయితే ఆయన మరణాన్ని బయటి ప్రపంచానికి వెంటనే తెలియజేయడానికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. తమ ఆనవాయితీ ప్రకారం రాజు మరణించిన మూడు రోజుల తర్వాతే భీష్మించుకోగా అధికారులు వారికి నచ్చజెప్పారు. అప్పట్లో వారసులు ఎవరో తేల్చుకునే సమయం కోసమే అలా చేసేవారని.. ఇప్పుడా సమస్య లేదు కాబట్టి వెంటనే ప్రకటించాలని చెప్పి ఒప్పించారు.
ఫిబ్రవరి 25న ఉదయాన్నే నిజాం అంతిమసంస్కారాలు ప్రారంభించారు. నిజాం పార్థివదేహాన్ని హైదరాబాద్ నగరంలో ఊరేగింపుగా తీసుకెళ్తుంటే సుమారు 2 లక్షల మంది అక్కడికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. గతంలో భాగ్యనగరం ఎన్నడూ అలాంటి జనసంద్రాని చూసింది లేదు. భారీ ఊరేగింపు అనంతరం ఉదయం 11 గంటల సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ భౌతికకాయాన్ని ఖననం చేశారు. వేలాది ఎకరాల ఆస్తి, వందలాది మంది సైన్యంతో ఓ వెలుగు వెలిగిన నిజాం రాజును అలా చూసేసరికి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మరణంతో తెలంగాణలో చరిత్రలో ఓ శకం ముగిసినట్లయింది.