Category Archives: Daily Updates

దీర్ఘాకాలిక రోగాలను నయం చేసే ‘ధన్వంతరీ మంత్రం’

కొన్ని రోగాలు మందులు వాడితే తగ్గిపోతాయి. మరికొన్ని రోగాలైతే ఎన్ని మందులు వాడినా.. ఎంతకాలం గడిచినా మనిషిని పిప్పిపీల్చి చేస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలామంది ఇలా దీర్ఘకాలిక రోగాల బారిన పడి కాలం వెళ్లదీస్తుంటారు. అయితే ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పాటించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈ మంత్రం పాటించడం వల్ల తొందరగా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

శ్రీ ధన్వంతరీ మహామంత్రం ధ్యానం |
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వన్తరే హరే |
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం
స్వభక్తేభ్యోఽనుగృహ్ణన్తం వందే ధన్వన్తరిం హరిమ్ ||
ధన్వన్తరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే |
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవన్తి తే చిరమ్ ||

మంత్రం:
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ [వజ్రజలౌకహస్తాయ] సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా.

గాయత్రి:
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్.

తారకమంత్రం:
ఓం ధం ధన్వంతరయే నమః

మంత్రః:

ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |

అర్థం:
‘‘సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడూ, అన్ని భయాలనూ పోగొట్టి, సర్వ రోగాలనూ నివారించేవాడూ, ముల్లోకాలకూ పతి, ముల్లోకాలకూ శ్రేయస్సు చేకూర్చేవాడూ, మహా విష్ణువుకు మారురూపమూ అయిన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు’’ అని భావం.

ఆకస్మిక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ, వ్యాధుల వ్యాప్తి కారణంగా కలిగే భయాలన్నీ పోవడానికీ ధన్వంతరిని నిత్యం ప్రార్థించాలి. ‘‘వ్యాధి తొలగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్య వంతుణ్ణి కావాలి’’ అని మనసులో గాఢంగా సంకల్పించుకొని, ఈ ధన్వంతరీ మహా మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినా, మననం చేసుకున్నా అపమృత్యు భయం తొలగిపోతుందనీ, ఆరోగ్యం సిద్ధిస్తుందనీ పెద్దల మాట.


ఆ బాలీవుడ్‌ హీరో సరసన యువరాణిగా సమంత

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది వారికి కూడా చేరువైంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంతకం చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియాలో సామ్‌కు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.

బాలీవుడ్‌లో ‘హిందీ మీడియం’, ‘లూకా చప్పీ’, ‘స్త్రీ’ వంటి సినిమాలను నిర్మించిన ప్రతిష్ఠాత్మక సంస్థ మ్యాడ్‌ డాక్ ఫిలిమ్స్. తాజాగా ఓ హార్రర్ కామెడీ‌ని నిర్మించనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, సమంత హీరో, హీరోయిన్స్‌గా నటించనున్నారట. ఈ సినిమాలో సామ్ మహారాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆయుష్మాన్ రక్త పిశాచి రోల్‌ను పోషించనున్నాడని తెలుస్తోంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నీరెన్ బట్ స్క్రిఫ్ట్‌ను అందించనున్నాడు.

సామ్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టున్నాయి. ‘యశోద’ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా రూపొందింది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ భారీ‌గా ఉన్నాయని తెలుస్తోంది. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం మేకర్స్ అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ లోను హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ‘శాకుంతలం’ ప్రమోషన్స్ ను మొదలుపెడతామని గుణ శేఖర్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. విజయ్ దేవర కొండతో ‘ఖుషి’ (Kushi) చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ‘సిటాడెల్’ (Citadel) లోను నటిస్తుంది.



‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

అన్ని పరిశ్రమల్లోనూ ప్రస్తుతం సీక్వెల్‌ చిత్రాలు విరివిరిగా తెరకెక్కుతున్నాయి. దాంతో, ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు దాని కొనసాగింపుపై సినీ అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అంతా దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలై, హిట్‌ కొట్టిన ‘సీతారామం’ (Sita Ramam) విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ (హిందీ)లో ఓ విలేకరి ఇదే ప్రశ్నను హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ముందు ఉంచగా ఆయన స్పందించారు. ‘‘ఏదైనా సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్‌ చేయకూడదనే విషయాన్ని నేను నటుడినికాకముందే తెలుసుకున్నా. మేం ఈ కథను బాగా నమ్మాం. ‘సీతారామం’ క్లాసిక్‌గా నిలుస్తుందని భావించాం. అనుకున్నట్టుగానే మీరంతా ఈ చిత్రాన్ని మీ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు ఉండదనుకుంటున్నా. రీమేక్‌ విషయంలోనూ అంతే’’ అని దుల్కర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అందమైన ప్రేమకథలో రామ్‌గా దుల్కర్‌, సీతామహాలక్ష్మిగా మృణాల్‌ ఠాకూర్‌ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రాకుమారి(సీత), లెఫ్టినెంట్‌(రామ్‌)ల లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ (తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో) అవుతోంది.


శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్

నటీనటులు: రెజినా, నివేధా థామస్‌, భానుచందర్‌, పృథ్వి, రఘుబాబు, కబీర్‌ సింగ్‌ తదితరులు. సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, సంగీతం: దర్శకుడు: సుధీర్‌ వర్మ, నిర్మాత: , సునీత తాటి, హ్యుంవు థామస్‌ కిమ్‌

Saakini Daakini Review: సురేష్‌ ప్రొడక్షన్‌ లాంటి పెద్ద సంస్థ ఈసారి సునీత తాటితో చేతులు కలిపి కొరియన్‌ సినిమా ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ను తెలుగులో ‘శాకినీ డాకినీ’గా రీమేక్‌ చేశారు. రెజీనా, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషించారు. ఇది లేడీ ఓరియెంటెడ్‌ సినిమా. ఇందులో హీరో లేరు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కొంచెం ఎక్కువ చెయ్యడంతో ఈ సినిమా మీద ఆసక్తి కలిగింది. సుధీర్‌ వర్మ ఈ సినిమాకి దర్శకుడు, కానీ తను ఎక్కడా ఏ సినిమా గురించి మాట్లాడకపోవడం మీద వివాదం వచ్చింది. చివర్లో ఏవో చిన్న చిన్న సీన్స్‌ మిగిలిపోతే ఆనంద్‌ రంగా చేశాడని అని అంటారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

దామిని (రెజీనా కాసాండ్రా ), షాలిని (నివేదా థామస్‌)లను పోలీస్‌ ట్రైనింగ్‌ కోసం అకాడమీలో జాయిన్‌ అవుతారు. మొదట్లో ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటూ ఒకరి మీద ఒకరు ఎప్పుడూ ఫిర్యాదులు చేసుకుంటూ ఒకరు తప్పు చేసి దొరికేటట్లు ఇద్దరూ ప్రయత్నం చేస్తుంటారు. ఇంత వివాదాలున్న ఈ ఇద్దరు ట్రైనింగ్‌ సెషన్‌లో ఒకరికి ఒకరు సాయపడి ఆ తరువాత మంచి ేస్నహితులుగా మారిపోతారు. అలాంటి సమయంలో వారిద్దరు ఒక అర్థరాత్రి సమయంలో సరదాగా బార్‌కి వెళ్లి ఆ తరువాత క్యాంపు కి తిరిగి వస్తున్న సమయంలో ఒక అమ్మాయి కిడ్నాప్‌ అవటం గమనిస్తారు. వెంటనే పోలీసులకు తెలియజేసినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ అకాడమీ బాస్‌ కి చెప్పిన అతనూ పట్టించుకోడు. ఇంకా ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం ఈ ఇద్దరు ట్రైనీ పోలీసులు తమ భుజాన వేసుకుంటారు. వాళ్ళు విచారణ మొదలు పెట్టాక తేలింది ఏంటి అంటే ఆ అమ్మాయి కిడ్నాప్‌ వెనకాల ఒక భయంకర ముఠా ఉందని, ఆ అమ్మాయే కాదు.. అలా చాలామంది వున్నారని తెలుసుకుంటారు. ఆ ఇద్దరు ఎలా అందరిని ఆ ముఠా నుండి విడిపిస్తారు వీరిద్దరూ ఎలా బయట పడతారు తరువాత ఏం జరుగుతుంది అన్నదే మిగతా కథ.

దీనికి దర్శకుడుగా సుధీర్‌వర్మ పేరు వెయ్యడంతో అంతే దర్శకత్వం చేశాడని అనుకుందాం. ఈ సినిమా ఒక సున్నితమైన కథాంశంతో ముడిపడి ఉంది. అనాధలుగా వున్నా అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి వాళ్ళకి సంబందించినవి అన్నీ కూడా మెడికల్‌గా అమ్మి డబ్బులు చేసుకునే ఒక మాఫియా ముఠా వుంది. ఇద్దరు ట్రైనీ ఆడ పోలీసులు ఈ ముఠాని పట్టుకోవడానికి బయలుదేరారు. ఇది మంచి కథే. అయితే దర్శకుడు ఇక్కడ కొంచెం లాజిక్స్‌ని మిస్‌ అయిపోయాడు. అలాగే చాలా సన్నివేశాలు మామూలుగా వున్నాయి, అంటే సినిమాటిక్‌ గా పెట్టేశారు. కథ మీద ఇంకాస్త వర్క్‌ చేసి ఉంటే మంచి యాక్షన్‌ సినిమా అయ్యేది. అక్కడక్కడా కొన్ని మంచి సీన్స్‌ తప్పితే సినిమా మొత్తం సాదాసీదాగా నడుస్తుంది.

ఆ ఇద్దరు అమ్మాయిలు పోలీస్‌ అకాడమీ ఎందుకు ఎలా చేరారు అన్నది చెప్పలేదు. వాళ్ళిద్దరిని డైరెక్ట్‌గా అకాడమీలో చేర్చేశారు. అలాగే చాలా సీన్స్‌ లో నేచురాలిటీ కి తగ్గట్టుగా లేవు. కథ మీద ఇంకా బాగా దృష్టి పెడితే బాగా వచ్చేది. సుధీర్‌ వర్మ కొంచెం, మిగతాది ఆనంద్‌ రంగా అనే దర్శకుడు తీశాడు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఆ ప్రభావం సినిమా మీద పడిందేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్‌ కంటెంట్‌ లేదు. ఇంకా నటీనటుల విషయానికి వస్తే.. రెజీనా, నివేదా ఇద్దరూ బాగా చేశారు. వాళ్లిద్దరే సినిమాని తమ భుజస్కంధాలనూ వేసుకుని ముందుకు తీసుకెళ్లారు అనిపిస్తుంది. పోరాట సన్నివేశాల్లో కూడా ఇద్దరూ బాగా నిరూపించుకున్నారు. నివేత తెలంగాణ భాష బాగా మాట్లాడింది. ఈ సినిమాకి ఈ ఇద్దరే హీరోస్‌. భానుచందర్‌ అకాడమీ డైరెక్టర్‌గా బాగా సూట్‌ అయ్యాడు. అలాగే రఘు బాబు, పృథ్వీ కామెడీ బాగుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మ్యూజిక్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. డైలాగ్స్‌ కూడా అక్కడక్క పరవాలేదు.

ఈ శాకినీ డాకినీ అనే సినిమా ఒక సున్నితమయిన కథాంశం. కానీ ఇందులో ఎమోషనల్‌ సన్నివేశాలు లేవు, అలాగే లాజిక్స్‌ కూడా మిస్‌. దీన్ని ఇంకా బాగా తీయొచ్చు. అలాగే సినిమా క్వాలిటీ కూడా అంత పెద్దగా అనిపించదు. కానీ రెజినా, నివేదా ఇద్దరూ బాగా చేస?రు, వాళ్ళ కోసం, అక్కడక్కడ ఉన్న కామెడీ కోసం ఈ సినిమాని చూడొచ్చు. ఇది ఒక టైం పాస్‌ మూవీ. ఓటీటీ కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది.


పెళ్లి చేసుకోను.. కానీ బిడ్డని కనాలని ఉంది.. సీతారామం నటి

బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలు కనడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన ‘సీతా రామం’ మూవీ ఇటీవల హిందీలో విడుదలవగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆమె తాజాగా ప్రముఖ యూట్యూబ్ చానెల్‌ ‘డేటింగ్ దిస్ నైట్స్’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. 30ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం, ప్రేమలో పడటం, బిడ్డను కనడం వల్ల కలిగే ఒత్తిడి తాను ఎదుర్కొలేనని చెప్పింది. అలాగే పాత సిద్ధాంతాలను బద్దలు కొట్టి ప్రేమలో పడకుండానే బిడ్డను కనాలని ఉందన్న బ్యూటీ.. ఈ తరం అమ్మాయిలు కాలం చెల్లిన ఆలోచనలనుంచి బయటపడాలని సూచించింది.

ఈ మేరకు ‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో.. నా మనసులో ఏముందో గమనించి, చేస్తున్న వృత్తిని అర్థం చేసుకునే భాగస్వామి కావాలి. ప్రస్తుతం మన చుట్టు చాలా అభద్రతాభావం ఉంది. కాబట్టి నాకు కావల్సిందల్లా ప్రొటెక్టెడ్ పర్సన్. ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు. అలాగే నేను బిడ్డను కనాలని భావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అది సెక్స్ ద్వారా కాదు. ఒంటరి తల్లిగా ఉండాలనుకున్నా. దానికి మా అమ్మ సరే అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా అలా ఉండటం అద్భుతమైనది’ అని ముగించింది మృణాల్.


‘గాడ్ ఫాదర్’ సాంగ్ ప్రోమో.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ . మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చ‌ర‌ణ్‌, ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ ఇందులో ఓ కీల‌క పాత్రలో న‌టించ‌టం విశేషం. చిరంజీవి – స‌ల్మాన్ ఖాన్ క‌లిసి చేసిన ‘థార్ మార్..’ అనే సాంగ్‌ను సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆ సాంగ్ ప్రోమోను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రోమో చూస్తుంటే చిరు, స‌ల్మాన్ మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశార‌ని క్లియ‌ర్‌గా అర్థమ‌వుతోంది. అక్టోబ‌ర్ 5న సినిమా థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది.


‘ఆదిపురుష్’ టీజర్ డేట్ ఫిక్స్!

సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ , సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుంది.

చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అభిమానులందరూ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

‘ఆదిపురుష్’ టీజర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. రాముని జన్మస్థలం అయోధ్యలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మైదానంలో అక్టోబర్ 5న జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా నిర్వహకులు ఆహ్వానించారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రావణుడ్ని దహనం చేయాలని నిర్వహకులు కోరారట.

ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడనుండటంతోనే ఈ కార్యక్రమానికి పిలిచారని తెలుస్తోంది. గతంలో రావణ దహన కార్యక్రమానికి అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, జాన్ అబ్రహాం హాజరయ్యారు. కాగా, ‘ఆదిపురుష్’ ను భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 26న విడుదలయ్యే అవకాశం ఉంది.


గురితప్పిన ‘బ్రహ్మాస్తం’.. బాలీవుడ్ ఆశలు మళ్లీ గల్లంతు

బాలీవుడ్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇండస్ట్రీకి పూర్వ వైభవం అన్నమాటే ఇప్పుడు ఉత్తి మాటగా మారిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బీ టౌన్‌ ఎట్ ప్రపజెంట్‌ దిక్కులు చూస్తూ కూర్చింది. ఏం చేయాలో అర్థం కాక.. ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక తల్లడిల్లుతోంది. సౌత్ ముందు చిన్నబోవడం పై మదన పడుతోంది.పాన్ ఇండియన్ సినిమాలంటూ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి సౌత్ సినిమాలు.! అందులోనూ ప్రత్యేకించి టాలీవుడ్ సినిమాలు! ఇక వీటికి ఎదుర్కొనేందుకు.. మునుపటి బాలీవుడ్ను ఆవిష్కరించేందుకు ఓ రేంజ్లో నడుంబింగారు బాలీవుడ్ మేకర్స్. పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్ ను ఎత్తుకుని మరీ.. భారీ బడ్జెట్ తో రాజమౌళి రేంజ్లో బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగ్‌ను కూడా ఈ సినిమాలో నటింపజేసి సౌత్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. మన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళితో ఈ సినిమాను ప్రజెంట్ చేపించే ప్లాన్ చేశారు. ఆయన్ను ఈ సినిమా ప్రమోషన్లకు హెడ్‌ గా మార్చేశారు. సినిమా పై ఎన్నో అంచనాలు పెంచారు.

బాలీవుడ్ ను మునుపటి ట్రాక్ పై ఎక్కించేందుకు బ్రహ్మాస్త్ర నే సరైనా సినిమాని అందరూ అనుకునేలా చేశారు.కాని కట్‌ చేస్తే.. సెప్టెంబర్ 9న రిలీజైన ఈ సినిమా పెద్దగా పాజిటివ్‌ టాక్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయింది. దాదాపు 65 పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా రిలీజ్ ముందు చిన్న వైబ్రేషన్ క్రియటే చేసినా.. రిలీజ్ తరువాత మాత్రం ఆ వైబ్రేషన్ను కంటిన్యూ చేయలేక పోయింది బ్రహ్మాస్త్ర. దీంతో ఈ సినిమా కూడా బాలీవుడ్‌ ఫేట్ మార్చేలా కనిపించడం లేదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు ఫిల్మీ అనలిటిక్స్. రణ్‌బీర్ వల్ల కాలేదు మరే హీరో వల్ల అవుతుందో చూడాలని అంటున్నారు.


హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు.. ఫలితం ఏంటి?

ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడట. హనుమంతుడు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తాడు. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష పరిహారం అవుతుంది.

మరో కథ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతాదేవికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక. అందుకే హనుమంతునికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

ప్రయోజనాలు..!

  1. లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఉన్న వారికి త్వరగా గుణం కనిపడుతుంది.
  2. హనుమంతుని(ఆంజనేయస్వామి)కి తమల పాకుల మాల వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
  3. సంసారంలో ప్రశాంతత లేని వారు తమల పాకుల మాల వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.
  4. చిన్న పిల్లలు కొందరు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. ఇలాంటి వారు తమలపాకుల మాల వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
  5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే తమలపాకుల మాల వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది
  6. శనైశ్చర స్వామి వల్ల ఇబ్బంది ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
  7. సుందర కాండ పారాయణం చేసి తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
  8. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల మాల సమర్పించి, ప్రసాదం తీసుకుంటే విజయం మీదే అవుతుంది.
    9.హస్త, మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
  9. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.