Category Archives: Latest Events

కోరిన కోర్కెలు తీర్చే కంచి కామాక్షి

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. ‘క‘ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్ర నామ జపం జరపడమే అనువైన మార్గం.

స్థల పురాణం..
అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదట. అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చొనట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

కంచి కామాక్షి అమ్మవారు పూర్వం ఉగ్రరూపంలో ఉండి బలి కోరేదట. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది.

ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీకామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షీ దేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనకాపు పూజ (చందనాలంకారం), రోజూ మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు.

కంచిలో నవరాత్రులను మూడు విభాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి మూడు రోజులు దుర్గాదేవిని, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ స‌య‌మంలో కన్య(బాలిక), సుహాసిని(వివాహిత)పూజ‌ల‌ను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

దర్శన వేళలు
ప్రతీరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ.. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8.30వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు.

ఎలా వెళ్లాలి..
కాంచీపురానికి దేశంలో ఎక్కడి నుంచైనా రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. రోడ్డు మార్గమైతే.. కాంచీపురానికి వెళ్లేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకుని అక్కడ్నుంచి వెళ్లవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి అయితే ముందుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి కోయంబేడ్‌ బస్‌స్టేషన్‌ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు.

రైలు మార్గంలో వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌, వీక్లీ స్పెషల్‌ ట్రైన్‌ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్‌లో దిగి అక్కడ్నుంచి కంచి వెళ్లాలి. లేదా రైలులో చెన్నై చేరుకుని అక్కడ్నుంచి లోకల్‌ ట్రైన్‌ ద్వారా కంచికి చేరొచ్చు. మరోమార్గంలో తిరుపతికి నేరుగా ట్రైన్‌లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లొచ్చు.


రాఘవేంద్రుడు బృందావనస్థులైన క్షేత్రం.. మంత్రాలయం

భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు.

స్థల పురాణం..
మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచే ప్రాంతం ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉండిపోవాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు.

అప్పటి నుంచి రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు నిత్యం మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని… అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొనడం ఆనవాయితీగా వస్తోంది.

వెంటకనాథుడే.. రాఘవేంద్రుడయ్యాడు

తమిళనాడులోని భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు 1595లో వెంకటనాథుడు(రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు) జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సంసారం జీవితం వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.

అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.

దర్శన వేళలు
రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.

భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.


116 అడుగుల సాయినాథుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద బాబా విగ్రహం

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ ప్రసిద్ధ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ప్రపంచంలోనే అతిపెద్ద సాయినాథుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా.. ఇంకెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సమీపంలోని రేపూరు గ్రామంలో నెలకొల్పిన 116 అడుగుల భారీ సాయిబాబా విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.

కాకినాడ నుండి ఇంద్రపాలెం మీదుగా గొల్లలమామిడాడ వెళ్లే మార్గంలో 10 కిలోమీటర్ల దూరంలో ఆ విగ్రహం ఉంది. షిరిడిసాయి మందిరానికి అనుబంధంగా నిర్మించిన ఈ సాయినాథుని విగ్రహం.. కాలుపై కాలు వేసుకుని నిర్మలంగా కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది. చుట్టుప్రక్కల 10 కిలోమీటర్ల దూరం వరకూ స్పష్టంగా కనిపించడం దీని ప్రత్యేకత.

సాయి సేవాశ్రమ్ వ్యవస్థాపకులు, సాయిభక్తులు శ్రీ అమ్ముల సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన విగ్రహం నిర్మాణం 12 సంవత్సరాల పాటు కొనసాగింది. 2012, డిసెంబర్ 12న ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. సుమారు వెయ్యి టన్నులకు పైగా బరువున్న ఈ విగ్రహాన్ని నాలుగు అంతస్తుల భజన మందిరం నిర్మించి దానిపై సాయి కూర్చున్నట్టుగా నిర్మించారు. దీని కోసం సుమారు రూ. 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. సాయి విగ్రహాన్ని దర్శించుకునేందుకు నిత్యం వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ఆలయంలో ఉదయం 5.15 గంటలకు కాకడ హారతి, 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6.00 గంటలకు సంధ్యాహారతి, రాత్రి 8.00 గంటలకు శయన హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గురువారం ఉదయం 8.30 గంటలకు సాయి పల్లకి సేవ ఉంటుంది. ఈ మందిరానికి చేరుకోవాలంటే ముందుగా కాకినాడ చేరుకుని అక్కడి నుంచి ఆటోలో వెళ్లాలి. సొంత వాహనాలపై వచ్చే మందిరాన్ని సులభంగా చేరుకోవచ్చు.


ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!


‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

కోనసీమ ప్రకృతి పదం.. మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయలున్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమకు అమలాపురం పట్టణం ప్రధాన కేంద్రం కాగా.. రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట ప్రధాన ప్రాంతాలు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రావులపాలెంను కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.

అందాల సీమ
మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్ల తోరణాలు, అరటి గెలలు, కొబ్బరి తోటలు, మంచు తెరలు ఇలాంటి మనోహర దృశ్యాలన్నీ కోనసీమ వాసులకు సర్వసాధారణం. పుష్కలమైన ప్రకృతి వనరులు, కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం కోనసీమకే వన్నె తెస్తుంటాయి. కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారు.

కోనసీమ ప్రాంతం పురాతన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా భాసిల్లుతోంది. అతిథులకు మర్యాదలు చేయడంలో కోనసీమ వాసులకు కొట్టేవాళ్లే ఉండరు. అన్నిచోట్ల కొట్టి చంపితే.. కోనసీమ వాళ్ల తిండి పెట్టి చంపేస్తారన్న నానుడి ఉంది. సంక్రాంతి పండుగకు నిర్వహించే ముగ్గుల పోటీలు, కోనసీమలో జరిగే కోడిపందేలు, తీర్థాలు, జాతరలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.

పలకరింపులు భలే ఉంటాయ్
కోనసీమలో పలకరింపులు భలే వింతగా ఉన్నాయి. అక్కడ ఎదుటివారిని ఆయ్, అండి అంటూ ప్రత్యేక శైలిలో మర్యాదగా పిలుస్తుంటారు. ఈ తరహా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మనకు కనిపించదు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం.

ప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం
కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధ, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం ముఖ్యమైనవి. అవివాహితులు మురముళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటరు ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు.

కోనసీమ వంటలు ఆహా అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్‌కు కోనసీమ పెట్టింది పేరు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. గోదావరి నదిపై వంతెనలు నిర్మించక ముందు ప్రజా రవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే కొనసాగిస్తూనే ఉన్నారు. కోనసీమ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా ప్రసిద్ధి. గతంలో అనేక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి.

కోనసీమ చేరుకోవటం ఎలా ?
వాయు మార్గం: అమలాపురానికి సమీపంలోని ఉన్న అతిపెద్ద నగరం రాజమండ్రి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు అమలాపురానికి బస్సు సౌకర్యం ఉంది.


రైలు మార్గం: కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, గంగవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రైల్వే స్టేషన్‌లు కలవు. రైలు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవచ్చు.
బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుండి కోనసీమలోని ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.


‘ఆచార్య’ సెట్స్‌కి సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్.. వీడియో వైరల్

సోనూ సూద్.. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఆపద్భాందవుడిగా నిలిచిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకుని సోనూసూద్ చేసిన సాయంపై యావత్ భారతావని ప్రశంసలు కురిపించింది.

ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్‌పై వెళ్లారు. సోనూసూద్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఉద‌యాన్నే సెట్‌కి వెళ్లాల్సి రావడంతో ఆయన సైక్లింగ్ చేసుకుంటూ సెట్‌కి వెళ్లిపోయారు. భాగ్యనగర రోడ్డలపై ఆయన సైకిల్‌ తొక్కుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.



‘ప్లవ’ నామ సంవత్సరం.. ఉగాది రోజు ఇలా చేస్తే అన్నీ శుభాలే!

కొత్త సంవత్సరాది అనగానే లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవిత సారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇవే గుర్తొస్తాయి. అయితే తెలుగు ఏడాది ప్రారంభం కేవలం వాటితోనే పూర్తికాదు. ఉగాది రోజున చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. అంటే… యుగ+ఆది అని అర్థం. యుగము అంటే జత అనే అర్థం కూడా వస్తుంది. అలా ఉత్తరాయణం, దక్షిణాయనం జతగా కలిస్తే ఒక సంవత్సరంగా భావిస్తాం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని అంటారు. ఉ అంటే నక్షత్రమనీ, గ అంటే గమనమనీ… దాన్ని ఈ రోజు నుంచే లెక్కిస్తారని కూడా చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే… మొదటి సంవత్సరం, మొదటి రుతువు, మొదటి మాసం, మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాదికి ‘ప్లవ’ నామ సంవత్సరమని పేరు. ప్లవను ప్రతిభ, జ్ఞానానికి సంకేతంగా గుర్తిస్తారు.

అన్ని పండగల్లానే ఉగాది రోజున కూడా ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆ తరువాత ఉగాది పచ్చడి తినడంతోనే పండగ అయిపోదు. ఈ రోజున ప్రత్యేకంగా ఫలానా దేవుడిని పూజించాలని ఏ పురాణాల్లోనూ చెప్పలేదు కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేసి.. ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలి. అయితే సృష్టి ప్రారంభం అయ్యేది కూడా ఈ రోజునే కాబట్టి భూమిని పాలించే ప్రభువును దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అంటే పరమేశ్వరుడిని మించిన ప్రభువు ఉండడు కాబట్టి శివాలయానికి వెళ్లి లోకానికే తల్లదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుంటే మంచిదని చెబుతారు. లేదంటే లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం లభిస్తుందని అంటారు. ఆ తరువాత గో దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి.

సాధారణంగా ఉగాది పచ్చడి తయారీలో ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం, తీపి కలిపి ఆరు రుచులుంటాయి. ఈ షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఃఖాలకూ కష్టనష్టాలకూ సంకేతంగా భావిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే… ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజున మాత్రమే కాక శ్రీరామ నవమి వరకూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటన్నింటితోపాటూ పంచాంగ శ్రవణాన్ని కూడా ఉగాది పర్వదినంలో ఓ భాగంగా పరిగణిస్తారు. పంచాంగాన్ని వినడం వల్ల ఏడాది కాలంలో గ్రహాల కదలికలూ, శుభాశుభ ఫలితాలూ తెలుస్తాయి. వాటన్నింటినీ తెలుసుకోవడం వల్ల రాబోయే పరిస్థితుల్ని ముందే అర్థంచేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చనేది పంచాంగ శ్రవణం ప్రధాన ఉద్దేశం.

వసంత నవరాత్రుల ప్రారంభం
నవరాత్రులు అనగానే మనకు దుర్గమ్మను పూజించే శరన్నవరాత్రులు లేదా గణపతి నవరాత్రులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ రెండింటితో పాటూ చైత్ర మాసంలోనూ ప్రత్యేకంగా నవరాత్రుల్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. అవే వసంత నవరాత్రులు. ఈ సమయంలో శక్తిని కొలిచినా వీటిని విష్ణువుకు సంబంధించిన నవరాత్రులని పేరు. ఈ కాలంలో దుర్గను ఆరాధించడంతో పాటూ రాముడినీ, హనుమంతుడినీ కూడా ఆరాధిస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వసంత నవరాత్రులు ఉగాది నుంచి మొదలై శ్రీరామనవమి వరకూ కొనసాగుతాయి. నవరాత్రి ఆఖరు రోజున రాముడు జన్మించాడనీ దాన్నే శ్రీరామనవమిగా జరుపుకుంటామనీ పురాణాలు చెబుతున్నాయి.

ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎందుకు పూజించాలనే దానికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. సుదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడట. ఆ సమయంలో అమ్మవారు నవరాత్రుల పేరుతో తనకు పూజలు చేయమని కోరిందట. అలా ప్రారంభమైనవే ఈ నవరాత్రులని అంటారు. రామ లక్ష్మణులు కూడా వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, రామనామ జపాన్ని కూడా నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలా సర్వశుభాలనూ కలిగించే కొత్త ఏడాదిని అమ్మవారి అనుగహ్రంతో ఆనందంగా ప్రారంభించి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడమే ఉగాది పండగ ప్రధాన ఉద్దేశం.


ఖమ్మం: మహిళా కానిస్టేబుళ్లు ట్రిపుల్ రైడింగ్… కమిషనర్ సీరియస్, భారీగా ఫైన్


తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే స్కూటీ ఎక్కారు. పైగా హెల్మెట్ ధరించలేదు. రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై ఈ విధంగా వెళ్తుండగా కొందరు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫోటో వైరల్‌ కావడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం సామాన్యులకేనా.. పోలీసులకు వర్తించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఖమ్మం పోలీస్‌ కమిషనర్ విష్ణు ఎస్‌.వారియర్‌ వద్దకు వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రూ.3,300 జరిమానా విధించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


రాగి జావ… ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో రాగుల ఆహారంలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత చాలాకాలం మరుగున పడిపోయాయి. అయితే ఇటీవల కాలంలో ప్రజలను ఆరోగ్యంపై అవగాహక పెరగడంతో పాటు ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ రాగుల వైపు చూపు మళ్లింది. రాగుల వల్ల శరీరానికి ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే ఎవరూ వీటిని వదలిపెట్టరు. రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో రాగిజావ తీసుకుంటే చాలా మంచిది. రాగులను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటే తెలుసుకుందా…

రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉండటం వల్ల చాలా సులభంగా జీర్ణమవుతుంది. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి.

వరితో సమానంగా రాగుల్లోనూ ప్రొటీన్ ఉంటుంది. ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాల్లోనూ లేవు. కాబట్టి, రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకున్నవారికి పోషకాహారలేమి ఉండదు. శాకాహారులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ధాన్యమిది.

ఎముకలకి బలంగా..
రాగుల్లో మినరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉండటంతో కాల్షియం సప్లిమెంటు తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు, ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశం ఉన్నవారూ రాగుల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. వయసు పెరిగిన వారు, చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

వీర్యం వృద్ధి
రాగి అంబ‌లిని రోజూ తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. సెక్స్ సమస్యలను దూరం చేసి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. మెదడు చురుగ్గా పనిచేసి ప్రతిభావంతులుగా మారతారు.

షుగర్ కంట్రోల్‌..
షుగర్ వ్యాధి ఉన్నవారికి రాగులు మంచి ఆహారం. రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలిఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

గుండె జబ్బులు దూరం..
రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా చేసి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్స్ గానీ, స్ట్రోక్స్ గానీ రాకుండా చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇప్పుడు తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. రాగులను కేవలం జావలాగే కాకుండా… రాగి మాల్ట్, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి వంటి పదార్థాలుగానూ తీసుకోవచ్చు. రాగులు అతి తక్కువ నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల దగ్గర్నించీ ఋతుపవనాల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల వరకూ, ఇంకా చెప్పాలంటే హిమాలయాల్లో కూడా పండుతాయి.

జ్వరానికి విరుగుడు
యాంటీ-బాక్టీరియల్ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది జ్వరంగా ఉన్న సమయంలో మందులు వాడుతుంటారు. అలా కాకుండా దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది.

​కాన్సర్ రాకుండా..
రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ జరగకుండా చేసి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. ముందు నుంచే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కాన్సర్ కారక సమస్యలు రాకుండా ఉంటాయి. రాగులు తరుచూ తినడం వల్ల వయసు పెరిగిన ఛాయలు కనపడకుండా చేసుకోవచ్చు.


రవితేజ ‘ఖిలాడి’ టీజర్.. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహరాజ్

‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్.

ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ‘ఖిలాడి’ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహారాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్, యాక్షన్ కలయికలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఖిలాడి’ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తూనే తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.