Category Archives: Health new

శీతాకాలంలో తినాల్సిన అద్భుతమైన ఐదు ఆహారాలివే

శీతాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ సమయంలో చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నిస్తే.. ఉన్ని దుస్తులు ధరించండి.. ప్రతి గంటకు కాఫీ త్రాగండి లేదా రోజంతా హీటర్ ముందు కూర్చోండి.. శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి పలు ద్రవ పదార్థాలు తీసుకోండి అంటూ సలహా ఇస్తుంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గుదల, చల్లని గాలి మీ సాధారణ దినచర్యకు భంగం కలిగించవచ్చు.

ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఒక సాధారణ మార్గం ఉంది. అదే శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే ఆహారాన్ని తినడం. సాధారణంగా కొవ్వు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు ఉన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. ఈ ఆహారం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

దుంప కూరగాయలు
శీతాకాలంలో దుంప కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియకు చాలా శక్తి అవసరం. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ కాలంలో బంగాళాదుంపలు, బీట్‌రూట్, క్యారెట్లు వంటి రూట్ వెజిటేబుల్స్ తినండి. ఇవి చలితో పోరాడటానికి మీకు సహాయపడతాయి. ఉల్లిపాయలు వంటి కొన్ని ఘాటైన ఆహారాలు కూడా మీ ఆహారంలో భాగం కావచ్చు.

తృణధాన్యాలు, గింజలు
వేరుశెనగ, బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి కొన్ని గింజలు కూడా శీతాకాలంలో మేలు చేస్తాయి. ఈ గింజలు మీ జీవక్రియను వేగవంతం చేస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి, చివరికి శరీరాన్ని వేడిగా అనిపించేలా చేస్తాయి.

ఫ్రూట్స్
కొబ్బరి, ఆపిల్ వంటి పండ్లు శీతాకాలంలో మంచి ఎంపిక. ఈ పండ్లు ఫైబర్‌తో నిండి ఉంటాయి. మన కడుపు వాటిని జీర్ణం చేయడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఇది వేడిని ఉత్పత్తి చేసి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.

కోడిగుడ్లు, చికెన్:
గుడ్లు, చికెన్ రెండింటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇది త్వరగా జీర్ణం కావడం కష్టం. అందువల్ల ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.

సుగంధ ద్రవ్యాలు
వెల్లుల్లి, నల్ల మిరియాలు, అల్లం వంటి సాధారణ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూడా శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తాయి. ఈ మసాలాలు జీర్ణమైనప్పుడు మీ శరీరం వేడిని పెంచే సమ్మేళనంతో వెచ్చగా ఉంచుతుంది.


సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా.. ఆయుష్షు తగ్గిపోతుంది జాగ్రత్త!

ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? త్వరగా వృద్ధులు కావొద్దని అనుకుంటున్నారా? అయితే స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ల వంటి పరికరాల అతి వాడకాన్ని మానెయ్యండి. వీటి నుంచి పెద్దమొత్తంలో వెలువడే నీలి కాంతి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తోందని ఓరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరిస్తోంది.

చర్మం దగ్గర్నుంచి కొవ్వు కణాలు, నాడుల వరకూ నీలి కాంతి వివిధ రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కాంతి ప్రభావంతో కణాలు సవ్యంగా పనిచేయటానికి అత్యవసరమైన ఆయా రసాయనాలు (మెటబాలైట్స్‌) అస్తవ్యస్తమవుతున్నట్టు.. ముఖ్యంగా సక్సినేట్‌ మోతాదులు పెరుగుతున్నట్టు, గ్లుటమేట్‌ మోతాదులు తగ్గుతున్నట్టు ఈగలపై నిర్వహించిన అధ్యయనంలో తొలిసారిగా నిరూపితమైందని వివరిస్తున్నారు. ప్రతీ కణం వృద్ధి చెందటానికి, పనిచేయటానికి అవసరమైన శక్తి ఉత్పత్తి కావటానికి సక్సినేట్‌ అనే మెటబాలైట్‌ అత్యవసరం. అలాగని దీని మోతాదులు మరీ ఎక్కువగా పెరిగినా ఇబ్బందే. కణాలు దీన్ని వాడుకోలేవు. ఇక గ్లుటమేటేమో నాడీ కణాల మద్య సమాచారం ప్రసారం కావటంలో పాలు పంచుకుంటుంది. దీని మోతాదులు తగ్గితే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇలాంటి మార్పుల మూలంగా కణాలు అంత సమర్థంగా పనిచేయటం లేదని, ఫలితంగా అవి ముందే మరణించే అవకాశముందని పరిశోధకులు వివరిస్తున్నారు.

ఇలాంటి మెటబాలైట్లు ఈగల్లోనూ, మనుషుల్లోనూ ఒకేలా ఉంటాయని, అందువల్ల మన మీదా నీలి కాంతి దుష్ప్రభావం ఇలాగే ఉండే అవకాశముందని సూచిస్తున్నారు. డిజిటల్‌ పరికరాల అతి వాడకానికీ ఊబకాయం, మానసిక సమస్యలకూ సంబంధం ఉంటోందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీటి విషయంలో మరింత జాగ్రత్త అవసరమని తాజా అధ్యయనం చెబుతోంది.


‘తులసి’ వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు… దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందా…

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అని చెప్పారంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణ మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మొక్క మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ విడిచిపెడుతుందని పరిశోధనల్లో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధాల గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి మొక్క ఉన్న ఇంటి సమీపంలో పిడుగులు పడవని పరిశోధనల్లో తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసి మొక్కకి నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా ఆరికాళ్ళలోకి చేరి నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు. ప్రపంచాన్ని హడలెత్తించిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు
.
తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం. తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు. దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంట్లో తులసి చెట్టు తప్పక పెంచుతారు.


ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్.. దీని లక్షణాలేంటి? చికిత్స ఎలా..

ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ (Monkey pox) మన దేశాన్ని కూడా కలవరపరుస్తోంది. దేశంలో మొదటి కేసు కేరళలో నమోదుకాగా.. తాజాగా బాధితుల సంఖ్య నాలుగుకి చేరింది. మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్‌ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలేంటి? చికిత్స ఎలా? తీసుకోవలసి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

మంకీ పాక్స్‌ అంటే ఏమిటి..?

మంకీపాక్స్ అనేది వైరల్‌ డిసీజ్‌. మంకీపాక్స్‌‌ స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్‌ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 – 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో తొలిసారిగా మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

ఎలా వ్యాపిస్తుంది..

వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, సంపర్కరం, కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులు ఎక్కువ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నవే. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

లక్షణాలు ఏంటి

జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీ పాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే మొహం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు 2 – 3 వారాల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.

చికిత్స ఎలా

మంకీపాక్స్‌ నివారణకు కచ్చితంగా చికిత్స లేనప్పటికీ దీన్ని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్‌ మందులను ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్‌‌ వ్యాక్సిన్‌‌‌‌ మంకీపాక్స్‌ చికిత్సలో 85% సమర్థవంతగా పనిచేస్తుందని నిర్ధారించారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే, నిపుణులు సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్ మరియు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం వంటి కొన్ని సిఫార్సు పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

మంకీపాక్స్‌ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
రద్దీగా ఉండే ప్రాంతాలకు, కార్యక్రమాలకు వెళ్లడం మంచిది కాదు.
పరిశుభ్రత పాటించండి.
మాస్క్‌ ధరించండి.

గమనిక: ఈ వివరాలు, సూచనలు ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించబడ్డాయి. ఈ స్టోరీ కేవలం పాఠకుల అవగాహన కోసమే మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచి పద్ధతి.


పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

పిల్లలు తరచుగా జ్ఞాపక శక్తి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులే గమనిస్తూ ఉండాలి. వ్యాధి తీవ్రత పెరిగితే చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా మతిమరుపు అనేది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మారిన జీవనశైలి కారణంగా ఇప్పుడు పిల్లల్లో కూడా సర్వసాధారణమైపోయింది. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. దాంతోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలని ఈ సమస్య నుంచి బయటపడేసేలా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

పచ్చని ఆకుకూరలు

ఆకుకూరలలో జ్ఞాపకశక్తిని పెంచే అనేక విటమిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి కోల్పోకుండా నివారించవచ్చు. మెదడుకు పదును పెట్టడానికి వాల్‌నట్ వినియోగం కూడా ఉత్తమమైనది. ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది మెదడుకు చాలా ముఖ్యమైనది. ఇందులో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

చేపలు

మంచి కొవ్వు కలిగిన చేపలని ఆహారంగా తీసుకుంటే అందులో కొవ్వు కారణంగా మెదడు పనితీరు మెరుగవుతుంది. అందులో ఉండే పోషకాలు మెదడు కణాలకి చురుకుదనం ఇచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫిష్‌ ఆయిల్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కణాల నిర్మాణానికి చాలా అవసరం. సాల్మన్, మాకేరెల్, తాజా జీవరాశి, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

రేగు పండ్లు

రేగు పండ్లలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వయస్సుతో వచ్చే మతిమరుపుని నిరోధించవచ్చు. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్ ఈ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 8 – 10 రేగుపండ్లు తీసుకోవడం ఉత్తమం.

పాలు పెరుగు

పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్, B విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైమ్‌ల అభివృద్ధికి అవసరం. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.

గుమ్మడి గింజలు

గుమ్మడిని అహారంగా తీసుకోవడం చాలా తక్కువే. ఎప్పుడో ఏదో ఒక పండక్కి తప్ప వీటిని ఆహారంగా తీసుకోరు. గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఉత్తేజంగా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

గుడ్లు

గుడ్డులో ఉండే విటమిన్ బీ6 వంటివి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అంతే కాదు గుడ్డులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో గుడ్డుని ఆహారంగా తీసుకోవచ్చు.

నారింజ

నారింజలో ఉండే విటమిన్ సి, మెదడుని చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు దానిలోకి అన్నింటినీ సరిగ్గా చేర్చుకుంటుంది. మెదడులో కణాఅలు ఉత్తేజితమై జ్ఞాపకసక్తి పెరుగుతుంది.

బ్లూ బెర్రీ

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల బ్లూ బెర్రీలని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బాదం, జీడిపప్పు

బాదం, కాజు వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. రోజూ పొద్దున్నపూట బాదం గింజలని ఆహారంగా తీసుకోవాలి. ఐతే వీటిని రాత్రి నానబెట్టి, ఉదయం లేవగానే పొట్టు తీసేసి ఆహారంగా తీసుకోవాలి. దీనివల్ల మెదడు చురుగ్గా తయారవుతుంది.


పసుపు అధికంగా వాడుతున్నారా.. జాగ్రత్త!

పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. పసుపులో కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనల్ని అనేక రకాల వైరస్‌ల నుంచి కాపాడుతాయి. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపు అతిగా తీసుకుంటే శరీరానికి హాని కూడా చేస్తుంది. పసుపును ఎలాంటి వ్యక్తులు తినకూడదో, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం…

చర్మ సమస్యలు

పరిమితికి మించి పసుపును తీసుకుంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతాయి. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. పసుపు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పరిమిత పరిమాణంలో ఉపయోగించడమే ఉత్తమం. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి.

ఉదర సమస్యలు

వాస్తవానికి పసుపుని వేడిగా పరిగణిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఇది కడుపులో మంటతో పాటు విరేచనాలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు కడుపులో వాపు లేదా తిమ్మిరి సంభవిస్తుంది. కాబట్టి పసుపును ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలి. అలాగే కామెర్లు వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు పొరపాటున కూడా పసుపు తినకూడదు. ఒకవేళ తింటే కామెర్లు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

కిడ్నీ సమస్యలున్న వారు
కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి పసుపు వాడకం మంచిది కాదు. పసుపులో ఉండే మూలకాలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా పసుపు తీసుకోవడం మంచిది కాదు.

ముక్కు నుంచి రక్తం వచ్చేవారికి

ముక్కు నుంచి రక్తం కారడం సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కావడాన్ని అధికంగా చేస్తుంది. అందుకే పరిమిత పరిమాణంలో పసుపును ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించండి. అతి వాడకం అన్నింట్లోనూ ప్రమాదకరమే.


Red Rice: ఎర్ర బియ్యంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

బియ్యం అనగానే తెల్ల రంగు, బ్రౌన్ రైస్ ముందుగా గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల మార్కెట్లో ఎర్రబియ్యం, నల్ల బియ్యం అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆంథోసయనిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. తమిళనాడులో ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం. పోషకాలు నిండుగా ఉండే ఈ బియ్యాన్ని అల్లుడి కోసం ప్రత్యేకంగా వండిపెడతారు.

ఎన్నో పోషకాలు.. మరెన్నో ప్రయోజనాలు
రెడ్ రైస్‌‌లో పీచు, ఇనుము అధికంగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఈ రైస్ అన్నం నిదానంగా జీర్ణమవుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఈ బియ్యంలో పీచు శాతం ఎక్కువ. విటమిన్‌ బి1, బి2… వంటి విటమిన్లతో బాటు ఐరన్‌, జింక్‌, పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్‌ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు మందులా పనిచేస్తాయి. ఈ రైస్‌ని చైనా సంప్రదాయ వైద్యంలో వీటిని ఎప్పట్నుంచో వాడుతున్నారు. ఆ కారణంతోనే ఖరీదు కాస్త ఎక్కువే. అందుకే బ్రౌన్‌ రైస్‌తో కలిపి ప్రయత్నించొచ్చు. అయితే వీటిని మిగిలిన బియ్యంలా కాకుండా ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, సిమ్‌లో మెత్తగా ఉడికించి తినాలి.

రెడ్ రైస్‌తో ఆరోగ్య ఫలితాలు:

  • రెడ్ రైస్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ బియ్యంలో ఉండే మొనాకొలిన్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.
  • రెడ్ రైస్‌లో క్యాల్షియం, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టం చేస్తాయి. దీంతో ఎముకలు బలాన్ని సంతరించుకుంటాయి.
  • రెడ్ రైస్ షుగర్ పేషెంట్స్, గుండె వ్యాధి ఉన్నవారికి ఏంతో మేలు. ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి.
  • ఈ రైస్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోనీయవు.
  • రెడ్ రైస్‌ని రోజూ తినడంవల్ల అందులోని ఐరన్‌, రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచి కణాలకీ కణజాలాలకీ సరిగ్గా అందేలా చేస్తుంది. దీంతో శరీరం అలసట లేకుండా శక్తిమంతంగా ఉంటుంది. మానసిక ఉత్తేజాన్నీ కలిగిస్తుంది.
  • ఎర్రబియ్యంలోని మాంగనీస్‌ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేయడంతో బాటు ఫ్రీ రాడికల్స్‌నూ తగ్గిస్తుంది.
  • విటమిన్‌-బి6 సెరటోనిన్‌ శాతాన్ని పెంచి ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
  • వీటిని క్రమం తప్పకుండా తింటే ఆస్తమా సమస్యను నివారిస్తుంది.
  • రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్రబియ్యానికి ఉంది. దీంతో ఎర్రబియ్యం రెగ్యులర్ గా తిన్నవారికి బానపొట్ట కూడా తగ్గిపోతుంది.
  • ఎర్రబియ్యంలోని మెగ్నీషియం, బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి తరచూ వచ్చే హృద్రోగ వ్యాధులను ఈ రెడ్ రైస్ నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి?.. దాన్ని కనుగొన్న డాక్టర్ ఏం చెబుతున్నారంటే..

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోల్చితే కొత్త వేరియంట్‌ ఆర్‌వాల్యూ ఎక్కువంటున్న నిపుణులు.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు సైతం లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ కేసులు మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.. కానీ ఈ వైరస్ గురించి నిజంగా మనకు ఇప్పటివరకు ఏం తెలుసు? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

కాన్పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్‌ మాట్లాడుతూ… కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి మూడవ వేవ్ కు కారణం కావచ్చు. దీని ప్రకారం కొత్త కరోనా వేరియంట్ గురించి ఎక్కువగా భయపడే బదులు, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్(Omicron) అత్యంత అంటువ్యాధి. ఈ కారణంగా, ఇది మూడవ తరంగాన్ని తీసుకురాగలదు. అయితే, ఇది మునుపటి కంటే తక్కువ ప్రాణాంతకంగా ఉంటుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ కంటే సహజ రోగనిరోధక వ్యవస్థ కొత్త వేరియంట్‌ను ఓడించగలదు అని అన్నారు.

‘ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటి పట్ల ఒక నిర్ధిష్ట నిర్ధారణకు రావాలంటే వాటిని శాస్త్రీయ ప్రాతిపదికన పరీక్షించాల్సిన అవసరం ఉంది’ అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. ఒమిక్రాన్‌లో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయి. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఈ మ్యుటేషన్లు ఏర్పడ్డాయి అని తెలిపారు. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ రోగనిరోధక శక్తిని ఎదురించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. టీకాల వల్ల శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి లేదా మరే ఇతర ఇమ్యూనిటీ కూడా ఈ వైరస్‌ను ప్రభావితం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని కోవిడ్ వ్యాక్సీన్లను సమీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాక్సీన్లు, వైరస్ స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. దీని ఆధారంగానే వైరస్ పనిచేస్తుంది’ అని గులేరియా చెప్పారు.

చాలా స్వల్ప లక్షణాలు
దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను కనుగొన్నారు. తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారమిచ్చారు. నవంబర్ 24న ఈ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. గత వారం దీన్ని ఆందోళనకర రూపాంతరంగా పేర్కొంటూ ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఈ వేరియంట్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో WHO పేర్కొంది. ఒమిక్రాన్‌తో రిస్క్‌ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తొలుత ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు. ఇప్పటివరకు ఈ వేరియంట్ బారిన పడిన ప్రజల్లో చాలా స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలు కనబడ్డాయని తెలిపారు. చాలా మంది రోగులు ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసటతో బాధపడుతున్నారని, ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికా నుంచి చాలా దేశాలకు వ్యాపించింది. అమెరికా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ వచ్చిన కొందరికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు. ఒమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయని, ఇందులో 30 మ్యుటేషన్లు స్పైక్ ప్రోటీన్‌లో సంభవించాయని ఆయన తెలిపారు.


రోజూ అరగంట నడిస్తే చాలు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం లేదు. తరుచూ వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారి తీయొచ్చని, దాని కారణంగా అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలామంది టైమ్ లేదంటూ వ్యాయామాన్ని పట్టించుకోరు. అలాంటివారికి నడక చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ కాస్త సమయం నడిస్తే స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఊబకాయం సమస్యతతో బాధపడుతున్న వారు రోజూ ఉదయం, సాయంత్రం 30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. రోజూ నడవడం వల్ల మీ శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఉత్సాహం రెట్టింపవుతుంది. నిత్యం క్రమం తప్పకుండా ఓ అరగంట పాటు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి నుంచి ఉపశమనం
ఈ రోజుల్లో ఒత్తిడి కూడా పెను సమస్యగా మారుతోంది. ఒత్తిడి వల్ల ఊబకాయం, మెదడు సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అయితే క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

హై బీపీ కంట్రోల్
హై బీపీ, కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. హైబీపీ ఉన్నా, శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నట్లు అనిపించినా క్రమం తప్పకుండా నడవడం మంచింది. ఈ ప్రక్రియ వల్ల హైబీపీ కంట్రోల్ కావడమే కాకుండా కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది
ప్రస్తుతం 30 ఏళ్లలోపు యువతలోనూ ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ సమస్య వెంటాడుతోంది. బోలు ఎముకల వ్యాధి సమయంలో పగుళ్లు ప్రమాదం పెరుగుతుంది. దీనితో పాటు, భవిష్యత్తులో మోకాలు, తుంటి దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అయితే క్రమం తప్పకుండా నడిచేవారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ కంట్రోల్..
షుగర్‌ పేషెంట్లకు నడక ఎంతో మేలు చేస్తుంది. మధుమేహానికి దీన్ని సరైన ఔషధంగా చెబుతుంటారు. ఏదైనా వ్యాధి కారణంగా లేదా వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి నడక ఎంతో మేలు చేస్తుంది.


పొద్దు తిరుగుడు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు.. వీటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు

పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మంది ఈ విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటారు. ఈ నలుపు రంగు విత్తనాలు ఈ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

గుండె ఆరోగ్యం కోసం
చలికాలం హృద్రోగులకు కష్టాలను పెంచుతుంది. ఈ పరిస్థితిలో పొద్దుతిరుగుడు విత్తనాలు వారి అన్ని సమస్యలను పరిష్కరిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తనాళాలు విస్తరించి రక్త ప్రసరణ మెరుగపడుతుంది. ఇవి హై బీపీని నియంత్రిస్తాయి. ఈ విత్తనాలలో ఫ్లేవనాయిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒలీక్, లినోలిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ విత్తనాలు ఎల్‌డిఎల్.. అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మధుమేహం కోసం
మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దుతిరుగుడు విత్తనాలను చిరుతిండిగా తినవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ఈ విత్తనాలను తినాలి. పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్, సెలీనియం మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి.

బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ వ్యక్తికైనా చాలా ప్రమాదకరం. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ సందర్భంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది.

బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ
ఈ విత్తనాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. ఈ గింజల్లో పుష్కలంగా కొవ్వులు, మినరల్స్, విటమిన్లు, ప్రొటీన్లు, విటమిన్ ఈ, బి-కాంప్లెక్స్, మెగ్నీషియం వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి ఆస్టియోపోరోసిస్ నుంచి రక్షిస్తాయి.