Category Archives: Features

ఎన్నో విశేషతల పుణ్యక్షేత్రం.. ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి)

ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా(గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)కు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది విజయవాడకు 98 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత దేశంలోని అతిపురాతన పుణ్యక్షేత్రాల్లో ద్వారకా తిరుమల ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వయంభూవుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీద ఈ ప్రదేశమునకు ద్వారకా తిరుమల అన్న పేరు వచ్చిందని స్థల పురాణం. ఈ ఆలయంలో అనేక విశేషతలున్నాయి.

మాములు ప్రతి ఆలయంలోని గర్భగుడిలో మూల విరాట్( దేవుని విగ్రహం ) ఒక్కటే ఉంటుంది. కానీ ఇక్కడ గర్భాలయంలో రెండు మూల విరాట్‌లు ఉండి నిత్యం పూజలు అందుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు. ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకోగా… అయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామి వారు ఏ వరం కావాలి అని అడగగా ద్వారకా మహర్షి స్వామి నీ పాద సేవ చాలు అని కోరారట. దీంతో ఆ మహర్షి కోరిక మేరకు స్వామివారు అక్కడ స్వయంభుగా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాలాకాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పైభాగం మాత్రమే దర్శనం ఇచ్చేవారట. దాంతో ఆలయానికి వచ్చే భక్తులు అసంతృప్తిగా వెనుదిరిగేవారట. దీంతో స్వామీ నీకు పాదపూజ చేయడం కుదరడం లేదు.. దీనికి పరిష్కారం చెప్పమని ఋషులు వేడుకోగా.. తిరుమలలో ప్రత్యేక పూజలు చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని సూచించారట. దీంతో అక్కడి నుంచి తీసుకొచ్చిన విగ్రహాన్ని స్వయంభూ వెలిసిన స్వామి వారి విగ్రహం వెనుక భాగంలో పాద సేవ కోసం ప్రతిష్టించారు. అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధృవ మూర్తులుగా స్వామి వారు మనకు దర్శనమిస్తారు.

ద్వారకా మహర్షి తపస్సు వలన ఆవిర్భవించిన విగ్రహం ఒకటి కాగా తిరుమల నుండి తెచ్చిన విగ్రహం మరొకటి ఉండటం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది. రెండు మూల విరాట్ లు ఉండటం వలన ఇక్కడ రెండు సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు. మాములుగా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ ద్వారకా తిరుమలలో స్వామి వారు దక్షిణ ముఖంగా ఉంటారు. అలా ఎందుకు అంటే ద్వారకా మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేయడం వలన ఆయనకు ఎదురుగా స్వామి వారు ప్రత్యక్షం అయ్యారు. దీంతో స్వామి వారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. మాములుగా ప్రతి దేవాలయంలో విగ్రహానికి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు స్వామి వారికీ అభిషేకం చేయరు. స్వామి వారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపస్సు చేసిన పుట్ట ఇప్పటికి ఉందట. అందుకే మూలవిరాట్‌కు అభిషేకం చేయరు. అనుకోకుండా అక్కడ చిన్న నీటి చుక్క పడినా ఎర్ర చీమలు విపరీతంగా బయటకు వచ్చేస్తాయట. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ద్వారకా తిరుమలను మీరూ ఓ సారి సందర్శించండి.


తిరుమలలో ‘తుంబుర తీర్థం’ చూశారా.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే

కలియుగ వైకుంఠం తిరుమలలో మనకు తెలియని తీర్థాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది తుంబురు తీర్థం. ఇది సాక్షాత్తూ తుంబురుడు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణాలు చెబుతున్నాయి. అందమైన ప్రకృతి, అడవి జంతువుల ఆవాస ప్రదేశం. తిరుమల పాపవినాసం నుండి 7.5 కిలోమీటర్లు దట్టమైన శేషాచల కొండల్లో కాలినడకన ప్రయాణం చేస్తే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండలు, గుట్టలు , వాగులు, రెండు కొండల మధ్య ప్రయాణం ఎంతో క్లిష్టంగానూ ఆహ్లాదకరంగానూ ఉంటుంది. సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే అక్కడికి వెళ్లొచ్చు. ప్రతీ సంవత్సరం పాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా మూడు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తారు.

పాపవినాసం నుండి దట్టమైన అడవీ మార్గంలో కొండపైన నుండి దిగువకు సుమారు 5కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ తర్వాత రెండు కిలోమీటర్లు యేటి ప్రయాణం ఉంటుంది. అక్కడి నుంచే అసలుసిసలైన ప్రయాణం మొదలవుతుంది. అరకిలోమీటరు దూరానికి సుమారు గంట సమయం పడుతుంది. పెద్దపెద్ద బండలు ఎక్కుతూ.. దిగుతూ నాలుగు చోట్ల నడుముకు మించి లోతు నీటితో నడవాలి. రెండుగా చీలిన కొండ మధ్యలో నునుపైన కొండబండపై ప్రయాణించాలి. ఏమాత్రం అడుగు తడబడినా లోయలోకి జారిపోతామేమోనన్న భయం వెంటాడుతుంది. ఇవన్నీ దాటుకుని నిదానంగా కొండ చివర ఉన్న గుహలాంటి ప్రదేశానికి చేరుకోగానే పైనుంచి జాలువారుతున్న జలపాతం మనసును ఆహ్లాదపరుస్తుంది. అప్పటివరకు మనం పడ్డ కష్టాన్ని ఆ ప్రకృతి రమణీయ దృశ్యం మైమరపిస్తుంది. తుంబురుడు తపస్సు చేసిన ప్రదేశానికి కొద్దిదూరంలో ఆయన విగ్రహం ఉంటుంది. ఆయనకు పూజలు చేసిన అనంతరం భక్తులు తిరుగు పయనమవుతారు.

తుంబురు తీర్ధం వద్దకు వెళ్ళేటప్పుడు కొండ దిగువకు వెళ్ళాలి కాబట్టి సులభంగానే చేరుకుంటారు. అయితే తిరుగు ప్రయాణం మాత్రం భయంకరంగా ఉంటుంది. ముందుగా రెండున్నర కిలోమీటర్లు ఎలాగోలో వచ్చేయొచ్చు. ఆ తర్వాత 5కిలోమీటర్ల మేర కొండ పైకెక్కాలి. దీంతో ఎక్కుడు మొదలయ్యాక చాలామంది నడకలేక దారి పొడవునా కూలబడిపోతుంటారు. కొంతమందికైతే తిరిగి గమ్యస్థానానికి వెళ్లగలమా? అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ మార్గంలో చీకటి పడితే అడవి జంతువులు సంచరిస్తుంటాయి కాబట్టి సాయంత్రం 7 గంటలకల్లా పాపవినాసం చేరుకోవాలి. తుంబురు తీర్థం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులకు పెద్దగా తెలియదు. కానీ తమిళనాడు, కర్ణాటకకు చెందిన భక్తులు ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటారు. తుంబుర తీర్థ ప్రయాణం చాలా కష్టమైనప్పటికీ.. ఒక్కసారి వెళ్తే మాత్రం జీవితంలో ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవచ్చు.


మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?.. రెండింటికీ ఉన్న సంబంధం ఏంటి?

రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసింది. వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె నేటితో మొదలవుతోంది. మృగశిర కార్తెలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. ఈ రోజు ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ప్రై చేసుకుని ఖచ్చితంగా తింటుంటారు.

మృగశిర కార్తె వస్తే చాలు రైతులు ఏరువాకకు సిద్ధమవుతుంటారు. అందుకే ఈ కార్తెను ఏరువాక‌ సాగే కాలం అంటుంటారు. ఏరువాక‌ అంటే నాగటి చాలు. ఈ కాలంలో నైరుతి ప్రవేశంతో తొల‌క‌రి జ‌ల్లులు కురుస్తుంటాయి. దీంతో పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తుంటారు. మృగ‌శిర‌ కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో పండగ జరుపుకుంటారు. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. తొలిరోజు రోజు చేపలకు యమ గిరాకీ ఉంటుంది. ఏ మార్కెట్ చూసినా… రద్దీగా కనిపిస్తుంటాయి. ప్రతి పల్లెలోని చెరువుల వద్ద సందడి కనిపించే దృశ్యాలు దర్శనమిస్తుంటాయి.

చేపలలో ఉండే పోషకాలు:
▶ మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

▶ చేపల్లో బీ12 విటమిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, బయెటిక్‌, థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి.

▶ చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.

▶ చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.

▶ మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది

▶ చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.

▶ ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.

▶ సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ,డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

▶ చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షూగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు

▶ చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

▶ దేశీయ మార్పు చేపల్లో ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

▶ ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతోకలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.


శని బాధలు తప్పించే… శ్రీ శని స్తోత్రం(దశరథ కృతం)

దశరథుడు రచించిన శని స్తోత్రం గురించి పురాణ గాథ ఇలా ఉంది. దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ”అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను” అని వరమిచ్చాడు. ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించినదే ఈ శని స్తోత్రం.

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ || ౧ ||

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || ౨ ||

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః |
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః || ౩ ||

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే |
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే || ౪ ||

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః |
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే || ౫ ||

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే |
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే || ౬ ||

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ || ౭ ||

జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ || ౮ ||

దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః |
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే || ౯ ||

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః |
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః || ౧౦ ||

త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః |
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః || ౧౧ ||


భోగభాగ్యాలు, భోగి పండ్లు, ఆరోగ్యంతో నిండు నూరేళ్లు.. ఇదే మన భోగి

సనాతన సంప్రదాయాలు, ధర్మాలకు భారతదేశం నెలవు. అందులోనూ హిందూధర్మంలో ఆచారాలు, పండుగలకు పెద్ద పీట వేస్తారు. హిందువులు, ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’గా పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్థగోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలిపెరుగుతుంది.

ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయణంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అని పిలుస్తారు. ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ ఆధారాలు తెలుసుకుందాం.

భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజునే రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తర్వాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాథ.

​శరీరాన్ని శుభ్రపరిచే భోగిమంటలు..

సాధారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషధ సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరం తగ్గి ఐక్యమత్యం పెరుగుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

​పాత వస్తువులు కాదు.. పనికిరాని అలవాట్లు కాల్చాలి..

అయితే ఇటీవల కాలంలో మనం ఆధునికత, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లు, పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని పెంచుకుని మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాలని కొని తెచ్చుకుంటున్నాం. భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని అంటారు. అయితే, పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ ఆ దేశాని ఆక్రమించుకోలేమని భావించిన బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల ఏళ్ల నుంచి వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు… అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి.


పిల్లల తలపై భోగి పళ్లు వేయడం వెనుక అంతరార్ధమిదే..


భోగి పండగ రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. నేటి కాలం పిల్లలకు ఇది చూసేందుకు వింతగా అనిపించినా దీనికి వెనుక పెద్దల ఆలోచన, శాస్త్రీయ ఆధారాలున్నాయి. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరుంది. రేగి చెట్లు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది. దీంతో పాటు పిల్లలకి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం

బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను తలపై పోయడం ద్వారా బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. గనుక వీటిని తల మీద పోయడం వల్ల వీటిలోని విద్యుచ్ఛక్తి, శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువల్లే పిల్లలకి భోగి పండ్లు పోసి అశీర్వదిస్తారు. ఇలా మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్ధాలు, అంతరార్ధాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని మసులుకుంటే అవి మనకి మార్గదర్శకం అవుతాయి.


కాఫీ డే: రూ.7 వేల కోట్ల అప్పు.. భర్త సూసైడ్.. ఏడాదిలోనే అద్భుతం చేసిన మాళవిక హెగ్డే

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. ఇంకేంటి అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.

సిద్ధార్థ ఆత్మహత్య

2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. కేఫ్‌ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.

భలే ఆలోచన

మాళవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. నాన్న ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజిక వేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థతో వివాహమైంది. వీళ్లిద్దరూ కలిసి కేఫ్‌ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. రూ.5కి ఎక్కడైనా దొరికే కాఫీని రూ.25 పెట్టి తాగడానికి తమ పార్లర్‌కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ససేమిరా అందట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఈసారి ఆయన ‘కాఫీకి ఉచిత ఇంటర్నెట్‌నూ అందిస్తే?’ అన్నారట. ఆలోచన ఈసారి ఈమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) అవుట్‌లెట్‌ బెంగళూరులో ప్రారంభమైంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సీసీడీ రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు.

రూ.7వేల కోట్ల అప్పులు

అయితే సంస్థ రూ.7000 కోట్ల అప్పుల్లో మునిగిపోవడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిన సిద్ధార్ధ.. భార్య, పిల్లలను అనాథలను చేస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్‌! కాఫీ కింగ్‌గా పేరుగాంచిన ఆయన మరణానికి కారణం.. అప్పు. అదీ రూ. ఏడువేల కోట్లు. సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24 వేలమంది కార్మికులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలూ చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కనపెట్టి మళ్లీ తెరమీదకొచ్చారు మాళవిక. తన పిల్లలతోపాటు ఉద్యోగుల బాధ్యతనూ స్వీకరించారు. ‘సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకుంటా’నంటూ వాళ్లని సమాధానపరిచారు. ఆ అప్పులను తీర్చడం తన బాధ్యతన్నారు. అలా 2020 డిసెంబరులో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మాళవిక

ఇక్కడా ఎన్నో ఎదురుదెబ్బలు. కొవిడ్‌, చెల్లని చెక్కుల వివాదాలు. అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుతూ వచ్చారు. పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎన్నో వెండింగ్‌ మెషిన్‌లను వెనక్కి రప్పించారు. సంస్థ నిరర్థక ఆస్తులనీ అమ్మేశారు. ఏడాది కాలంలో సగం అంటే.. రూ. మూడువేల కోట్లకుపైగా అప్పుల్ని తీర్చేశారు. ఇంకొన్నేళ్లలోనే తిరిగి సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశ ఆమెలోనేకాదు.. సంస్థ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోంది. టాటా వంటి సంస్థలూ పెట్టుబడికి ఆమెతో చర్చలు జరుపుతున్నాయి. గతంలో మాళవిక సంస్థకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యురాలు. రూపాయి జీతం తీసుకోలేదు. సంస్థలో ఆమెకున్న వాటా కూడా నాలుగు శాతమే. అయినా సీసీడీని ముందుకు నడపడం తన బాధ్యతగా భావించారు. కాఫీ ఎస్టేట్‌లో భర్తతో కలిసి మొక్కలు నాటేవారు. ఏ అవుట్‌లెటైనా ఇద్దరూ ప్రారంభించేవారు. సాధారణ ప్రేమికుల్లా కూర్చొని వినియోగదారులను గమనించేవారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పైగా భర్తకు సంస్థపై ఎనలేని ప్రేమ.. ఇవన్నీ ఆమెను మధ్యలో వదిలేయనివ్వలేదు.

‘ఏడాదిలో ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతోపాటు వ్యాపారాన్నీ అభివృద్ధి పథంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకూ భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయం’ అని ఓ సందర్భంలో చెప్పారు. భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోయే ఎంతోమందికి ఆమె జీవితం స్ఫూర్తిమంతమే కదూ!


పసుపు అధికంగా వాడుతున్నారా.. జాగ్రత్త!

పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. పసుపులో కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనల్ని అనేక రకాల వైరస్‌ల నుంచి కాపాడుతాయి. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపు అతిగా తీసుకుంటే శరీరానికి హాని కూడా చేస్తుంది. పసుపును ఎలాంటి వ్యక్తులు తినకూడదో, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం…

చర్మ సమస్యలు

పరిమితికి మించి పసుపును తీసుకుంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతాయి. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. పసుపు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పరిమిత పరిమాణంలో ఉపయోగించడమే ఉత్తమం. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి.

ఉదర సమస్యలు

వాస్తవానికి పసుపుని వేడిగా పరిగణిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఇది కడుపులో మంటతో పాటు విరేచనాలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు కడుపులో వాపు లేదా తిమ్మిరి సంభవిస్తుంది. కాబట్టి పసుపును ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలి. అలాగే కామెర్లు వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు పొరపాటున కూడా పసుపు తినకూడదు. ఒకవేళ తింటే కామెర్లు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

కిడ్నీ సమస్యలున్న వారు
కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి పసుపు వాడకం మంచిది కాదు. పసుపులో ఉండే మూలకాలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా పసుపు తీసుకోవడం మంచిది కాదు.

ముక్కు నుంచి రక్తం వచ్చేవారికి

ముక్కు నుంచి రక్తం కారడం సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కావడాన్ని అధికంగా చేస్తుంది. అందుకే పరిమిత పరిమాణంలో పసుపును ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించండి. అతి వాడకం అన్నింట్లోనూ ప్రమాదకరమే.


ఆ శివలింగాన్ని క్రైస్తవులూ ఆరాధిస్తారు.. ఎందుకో తెలుసా..? ఎక్కడ ఉందంటే..

భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్‌లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా భక్తులే. అయితే ఓ దేశం లో.. కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. ఈ దేవాలయం ఎక్కడ ఉందొ.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూరప్ ఖండంలోని ఐర్లాండ్ దేశంలో ఈ శివాలయం ఉంది. అయితే.. ఈ శివాలయం ఇక్కడకు ఎప్పుడు.. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ లింగోద్భవం ఇప్పటికీ అంతు తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. ఓ కొండపై ఈ శివలింగం ఉంది. చుట్టూ ఇటుకలు గుండ్రని ఆకారంలో పేర్చబడి ఉన్నాయి. లియా ఫాయిల్‌గా పిలవబడే లింగాన్ని అక్కడి వారు పరమ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతి పురాతన లింగంగా వెలుగొందుతున్న ఈ విగ్రహాన్ని క్రైస్తవులు పునరుత్పత్తికి చిహ్నంగా భావిస్తూ కొలుస్తున్నారు.

ఈ లింగం గురించి ” మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్” అనే గ్రంధం లో కూడా చెప్పబడి ఉంది. అక్కడి చారిత్రాత్మక కధనం ప్రకారం.. క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య కాలం లో త్వాతా డి డానన్ అను వ్యక్తి తీసుకొచ్చాడని ప్రతీతి. త్వాతా డి డానన్ అనే వ్యక్తిని డాను అనే దేవత యొక్క కొడుకుగా అక్కడివారు చెప్పుకుంటారు. ఈ దేవత గురించిన ప్రస్తావన మన గ్రంధాలలో కూడా ఉంటుంది. కశ్యప ముని, అతని భార్య దక్షలకు జన్మించిన కూతురే డాను అని చెప్తుంటారు. డాను అంటే జలానికి అధిపతి అని అర్ధమట. అలా లియో ఫాయిల్స్ లోని శివలింగానికి , భారతీయ వేద సంస్కృతిలో వర్ణించబడ్డ శివుడికి సంబంధం ఉన్నదని అక్కడి కధనం. వారి భాషలో లియా ఫెల్ అంటే అదృష్ట శిల అని అర్ధమట. ఈ రాయిని నాశనం చేయాలనీ ఎన్నోసార్లు ప్రయత్నించినా ఎవరితరం కాలేదట. 2012, 2014 లోను కూడా ఈ లింగంపై దాడి జరిగిందట. ఈ లింగాన్ని కాపాడాలంటూ స్థానికులు ఐర్లాండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


13వేల అడుగుల ఎత్తులో.. 1100 సంవత్సరాల బొజ్జ గణపయ్య

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తొస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన దండకారణ్యంలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఎక్కువే. బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం విశేషం.

దేశంలో ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నప్పటికీ దట్టమైన అడవుల్లో ఈ వినాయకుడి విగ్రహం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తుంటుంది. కొండ శిఖరాగ్రంలో డోలు లాంటి ప్రదేశంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ వినాయకుడిని దోల్‌కల్ గణేశ్ అని పిలుస్తుంటారు. ఈ విగ్రహం 1100 ఏళ్ల క్రితం నాటిది కావడం విశేషం. నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ. దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ.. దట్టమైన అడవిలో ఉన్న కారణంగా ఆ విగ్రహం గురించి ఇటీవలి వరకూ బయటి ప్రపంచానికి తెలియలేదు.

2012లో స్థానిక జర్నలిస్టు ఒకు దోల్‌కల్ కొండ ఎక్కగా శిఖరాగ్రాన ఆరు అడుగులు ఎత్తైన వినాయకుడి విగ్రహం దర్శనం ఇచ్చింది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి చేరడం అంత తేలికేం కాదు. ముందుగా దంతెవాడ చేరుకొని అక్కడికి 20 కి.మీ. దూరంలో ఉన్న మిడ్‌కుల్నర్ అనే చిన్న గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి 5-7 కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్తే గానీ ఈ ప్రదేశానికి చేరుకోలేం. ఇప్పుడు మావోయిస్టుల సమస్య కొద్దిగా తగ్గింది గానీ.. గతంలో ఇక్కడ మావోల ప్రాబల్యం ఎక్కవగా ఉండేది. గతంలో ఈ విగ్రహం కొండ మీది నుంచి కిందకు పడి ముక్కలైంది. వినాయకుడి విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో.. ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇవన్నీ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయనే ఉద్దేశంతో మావోయిస్టులే ఈ విగ్రహాన్ని కొండ మీద నుంచి కిందకు తోసేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

కొండ మీద విగ్రహం కనిపించడం లేదని ప్రచారం జరగడంతో ఇది చోరీకి గురైందని భావించారు. కొందరు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి విగ్రహం వెతుకులాట ప్రారంభించారు. కొండ కింది ప్రాంతంలో ఈ విగ్రహం ముక్కలు లభ్యమయ్యాయి. దీంతో దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్, కలెక్టర్ సౌరభ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. తర్వాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.

ఏకదంతుడైంది ఇక్కడేనట..
ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో విరిగిన దంతం. కిందిభాగం కుడిచేతిలో రుద్రాక్ష మాల, మరో చేతిలో మోదకాలతో దర్శనమిస్తాడు డోల్‌కాల్‌ గణేశుడు. ఆయుధధారుడై ఉండడం దోల్‌కాల్‌ గణేశుడి ప్రత్యేకత. అక్కడ గణపయ్య లలితాసనంలో కనిపిస్తారు. బస్తర్‌లో తప్ప మరెక్కడా ఆయన ఆ భంగిమలో ఉండరు. బస్తర్‌ ప్రత్యేక నిపుణులు హేమంత్‌ కశ్యప్‌ ప్రకారం.. ఈ డోల్‌కాల్‌ శిఖరంపైనే వినాయకుడు-పరుశరామ్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే గణేశుడి దంతం విరిగింది. అప్పటి నుంచే ఆయనను ఏకదంతుడిగా పిలుస్తున్నారు. ఆ ఘటనకు గుర్తుగా చిండక్‌ నాగవంశానికి చెందిన రాజు గణేశ్‌ విగ్రహమూర్తిని అక్కడ ప్రతిష్ఠించారట..