Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ అపార్ట్మెంట్ భవనం ఎక్కాడు. 26వ అంతస్తు నుండి దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతిరోజు రిస్కే. అతడే అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేవుడు జీవితం ఇచ్చింది జీవించడానికే అని గ్రహించి తన ఎదుగుదలకు కృషి చేశాడు. ఎన్నో స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. ఇది వినడానికి సినిమా స్టోరీలా అనిపించొచ్చు. కానీ సినిమాను తలదన్నే ఎన్నో ఎత్తుపల్లాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయనెవరో కాదు.. విఠల్ వెంకటేష్ కామత్. దేశవిదేశాల్లో ప్రఖ్యాతి చెందిన కామత్ హోటళ్లకు ఆయనే అధినేత.
భారతీయ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కామత్ ఇపుడు ప్రపంచం గర్వించదగిన హోటల్స్ యజమానిగా చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు డబ్బుల కోసం నానా ఇబ్బందులు పడిన కామత్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపిస్తోంది. హోటల్స్ ద్వారా రోజూ కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఒకప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామత్ హోటల్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి తన బ్రాండ్‌ను కాపాడుకుంటూ వస్తోంది.
డాక్టర్ విఠల్ కామత్ కు 68 ఏళ్లు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా..మేనేజింగ్ డైరెక్టర్‌గా కామత్ హోటల్స్ గ్రూపునకు వ్యవహరిస్తున్నారు. ఇండియాలో ఎన్నో హోటల్స్ తమకు పోటీగా ఉన్నా ..కామత్ మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదు. ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చేశారు కామత్. 169 కోట్ల ఆదాయం కేవలం ఈ హోటల్స్ ద్వారా సమకూరుతోంది. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితిలో భార్య పుస్తెలతాడును అమ్మి హోటల్ వ్యాపారం ప్రారంభించిన కామత్.. ఇవాళ గ్రూపును ప్రపంచంలోనే టాప్-10లో నిలబెట్టారు.
ఎందరో భారతీయులు ..ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. కానీ విఠల్ కామత్ కథ మాత్రం ప్రత్యేకమైనది. ఇది మనకళ్ల ముందే జరిగిన కథ. విఠల్ కామత్ హోటల్స్ యజమానే కాకుండా మెంటార్, ఎంట్రప్రెన్యూర్, ట్రైనర్, సక్సెస్ ఫుల్ బిజినెస్‌మెన్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. తొలినాళ్లలో ఒక్క గదిలోనే సర్దుకుపోయి కష్టాలు పడి కామత్ ఇప్పుడు వేల కోట్ల విలువ కలిగే ఎన్నో భవనాలు కలిగి ఉన్నారు. ఎంత పైకెదిగినా ఆయన తన మూలాలు మరిచిపోలేదు. కామత్ కుటుంబంలో ఎనిమిది మంది ఉండేవారు. తల్లిదండ్రులు, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీళ్లంతా ఒకే గదిలో నివసంచేవారు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తనను హెచ్చరిస్తూనే ఉంటాయని చెబుతుంటారు కామత్.
‘సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. లేకపోతే లావైపోతాం’ అనే టైప్ కామత్. అందుకే ఆయన తన గ్రూపు ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 60లక్షల మొక్కలు నాటించారు. అటవీ సంరక్షణ కోసం 100 ఎకరాల కొండను ఔషధ మొక్కలుగా, చెట్లుగా మార్చారు. ముంబైలో మొట్టమొదటి సీతాకోకచిలుక ఉద్యానవనం, నవీ ముంబై అంతటా తోటలను నిర్మించిన ఘనత కూడా ఆయనదే. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన విఠల్ కామత్ తన విజయాలను కోట్లాది మంది భారతీయులకే కాదు ప్రపంచానికి కూడా ఒక పాఠంగా చూపించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి.
హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సందర్శకులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మారేడుమిల్లి సందర్శనకు వెళ్లేవారు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు.
జలతరంగిణి జలపాతాలు మారేడుమిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. మారేడుమిల్లి ప్రాంతం పరిధిలో అనేక చిన్న జలపాతాలతో పాటు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతాలు ఉన్నాయి. ప్రధాన రహదారికి ఈ ప్రదేశం కాస్త దగ్గరగా ఉంటుంది. బైక్‌లపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
రాజమండ్రి నుండి గోకవరం దాటిన తరువాత ఫోక్స్ పేట నుండి రక్షిత అటవీ ప్రాంతం మెుదలవుతుంది. దారి మద్యలో సీతపల్లి వద్ద వనదేవతగా కోలిచే బాపనమ్మ తల్లి దేవస్దానం వస్తుంది. ఆ చల్లని తల్లిని ప్రతి ఒక్కరూ దర్శిస్తారు. సీతపల్లి దాటి 5 కిలోమీటర్లు వెళ్తే సీతపల్లి వాగు, పాలవాగు కనిపిస్తాయి. అక్కడినుండి ముందుకు వెళితే రంపచోడవరం దగ్గరలో రంప జలపాతం వస్తుంది. వేసవిలో జలధార తక్కువగా ఉంటుంది.. కాబట్టి జులై, ఆగస్టు నెలలో వెళ్తే ఆ జలపాతం అందాలు ఆస్వాదించొచ్చు.
ఈ ప్రకృతి అందాల నడుమ సేద తీరడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. రంపచోడవరంకి 4 కి.మీ.ల దూరంలో శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం పురాతన శివాలయం ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారు ఈ ఆలయంలో పూజలు చేసేవారని చెబుతారు.
స్వర్ణధార – రంప జలపాతాలు జలతరంగిణి జలపాతాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మర్రిచెట్ల మాదిరిగా పెద్దగా ఉంటాయి. దట్టమైన, లోతైన అటవీ మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవచ్చు. మార్గమధ్యంలో నెమళ్లను, ఇతర పక్షులను కూడా చూసే అవకాశం ఉంటుంది.
అలాగే మారేడుమిల్లి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి. రంప చోడవరం నుండి రంప జలపాతం వరకూ జీప్‌లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం. 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ జలపాతం వద్ద నీరు తియ్యని రుచితో ఉంటుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
కార్తీక వనం కార్తీక వనం ప్రాంతం అరుదైన మొక్కలు, వృక్ష జాతులకు ప్రధాన ఆవాసం. సహజసిద్ధ ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఉసిరి, మారేడు, గూస్ బెర్రీ, బేల్ వంటి అనేక రకాల మొక్కల జాతులు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు ఇది ఒక బహిరంగ ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. దాదాపు 203 జాతుల ఔషధ మొక్కలను ఇక్కడ చూడవచ్చు. స్వచ్చమైన గాలి, వాతావరణం మధ్య ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు.
జంగల్ స్టార్ క్యాంప్ సైట్ ఈ ప్రదేశానికి రామాయణానికి సంబంధం ఉందంటారు. ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు చెప్తారు. ఇక్కడ వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు , అడవులు ఇలా చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది.
మదనికుంజ్ విహార స్థల్ మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరో అద్భుతమైన విహార ప్రదేశం మదనికుంజ్-విహార స్థల్. ప్రకృతి ఒడిలో సేద తీరే పిక్నిక్ స్పాట్‌గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. పులులు, అడవి కోళ్లు, అడవి దున్నలు, నల్ల చిరుతలు, నెమళ్లతో పాటు విభిన్న రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి.
ఈ మజిలీలో మారేడుమిల్లిలో అక్కడి గిరిజనులు సహజసిద్ధంగా అడవిలో పెరిగిన కోళ్లతో చేసే బొంగు చికెన్ రుచి చూడండి. ఆ చికెన్ ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టాలని అనిపించదు. అక్కడ బస చేయడానికి ఏపీ టూరిజం హరితా రిసార్ట్స్, ప్రైవేట్ వ్యక్తులు నడిపే లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. దారిలో ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటక శాఖ వారు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుండి ప్రకృతి రమణీయతను తిలకించవచ్చు, రెండవ వ్యూ పాయింట్ చెరుకుంటే ఘాట్ రోడ్ ప్రయాణం పూర్తి అయినట్టే. అక్కడే సోకులేరు వాగు అద్బుతంగా ఉంటుంది.
ముఖ్య గమనిక: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనుకునేవారు ముందుగా మీ వాహనం కండీషన్ చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏదైనా రిపేరు వస్తే దగ్గర్లో మెకానిక్ దొరకని పరిస్దితి ఉంటుంది. ఈ మార్గంలో రాత్రి ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు. చీకటి పడేలోపు ఏదైనా ప్రదేశానికి చేరుకునేలా చూసుకోండి..
హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ప్రత్యేకత గత నగరం. తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం.. హస్తకళలకు, పర్యాటకానికి ప్రసిద్ధి. నిజాం రాజుల రాచరికానికి ప్రతీకగా భాసిల్లిన భాగ్యనగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోనూ దూసుకుపోతోంది. పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో లేనిదంటూ ఏదీ లేదు.
దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌ను ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. అప్పట్లో భాగ్యనగరాన్ని ఏలిన 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తించబడ్డాడు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరొందిన కోహినూర్ వజ్రం కూడా హైదరాబాదులో బయటపడిందే. కొల్లూరు గనుల్లో లభ్యమైన ఈ డైమండ్ అప్పట్లో గోల్కొండ కోటకు తరలినట్లు చెబుతుంటారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచే ఈ నగరంలో ప్రఖ్యాతి కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…
చార్మినార్: హైదరాబాద్ యొక్క అతి ముఖ్యమైన సూచిక ‘చార్మినార్’. నాలుగు మినార్లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్ అని పిలుస్తారు. అయితే ఈ నిర్మాణంలో అడుగడుగునా చార్ దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ప్రసిద్ధి పొందింది. ఆర్కియాలజీ పరిశోధనల్లో చార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న నాలుగు మినార్ల ఎత్తులను నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా నాలుగుతో భాగించబడడం విశేషం.
1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు ఛార్మినార్ ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్‌ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ఈ చారిత్రక కట్టడం ఖ్యాతి కారణంగా దీని చుట్టు పక్కల ప్రదేశాలు చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు పొందాయి. వాహనాల కాలుష్యం కారణంగా ఈ కట్టడం రంగు మారుతుండడంతో దీని పరిరక్షణలో భాగంగా దీనికి 300 మీటర్ల వరకూ దూరం వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. ఈ ప్రదేశంలో కేవలం పాదాచారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కట్టడం హైదరాబాద్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గోల్కొండ కోట: గోల్కొండ రాజ్యానికి 14-16 శతాబ్దాల మధ్య గోల్కొండ కోట రాజధానిగా ఉండేది. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోటను భారతదేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. ఈ కోట ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది చప్పట్ల ప్రదేశం. కోట ముఖద్వారం వద్ద ఉండే గోపురం కింద చప్పట్లు కొడితే ఆ శబ్ధం కోట పై భాగంలో కిలోమీటరు దూరం వరకూ వినిపిస్తుంది. ఆకస్మిక దాడుల నుంచి అప్రమత్తం కావడానికి పూర్వం దీనిని ఉపయోగించే వారు. ఈ కోటలోని వాతావరణం పర్యాటకులకు 12వ శతాబ్ధం నాటి కాలాన్ని పరిచయం చేస్తుంది. హైదరాబాద్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే గోల్కొండ కోట పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది.
చౌమహల్లా ప్యాలెస్: 18వ శతాబ్దం నాటికి చెందిన అద్భుతమైన చారిత్రక కట్టడం ‘చౌమహల్లా ప్యాలెస్’. హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేసిన ఐదో నిజాం పాలకుడు ఆసఫ్ జాహ్ వంశం యొక్క నివాస స్థలం ఇది. ఉన్నత స్థాయి సమావేశాలు, రాచరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి. పర్షియన్ భాషలో ‘చాహర్’ అంటే నాలుగు, అరబ్ భాషలో ‘మహాలత్’ అంటే సౌధం అని అర్ధం వస్తుంది. ఈ రెండు పదాల ద్వారా ఈ భవనానికి అప్పటి పాలకులు చౌమహల్లాగా నామకరణం చేసినట్లు తెలుస్తుంది. 14 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ లో చూపు తిప్పుకోనివ్వని ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. 2010లో యునెస్కో ఈ ప్యాలెస్‌ను సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. హైదరాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ ఉంది.
బిర్లా మందిర్: హైదరాబాద్ పర్యాటకంలో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలో ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. 10 ఏళ్ల పాటూ కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయాన్ని నిర్మించడంతో దీన్ని బిర్లా మందిర్ అని పిలుస్తారు.
సాలార్ జంగ్ మ్యూజియం: దేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియాల్లో ‘సాలార్ జంగ్ మ్యూజియం’ ఒకటి. ఈ మ్యూజియంలోని పురాతన వస్తువులు నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ III చేత సేకరించబడ్డాయి. పాలరాతి శిల్పాలు, ఏనుగు దంతాల కళాకృతులతో పాటు పర్షియా, ఈజిప్ట్, ఉత్తర అమెరికా, ఐరోపా, చైనా, బర్మా, నేపాల్, జపాన్ వంటి దేశాలకు సంబంధించిన లోహ కళాఖండాలు, తివాచీలు, సెరామిక్స్, బొమ్మలు, శిల్పాలు ఇక్కడ ప్రదర్శితమవుతాయి. దీంతో పాటు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన చిత్రాలు, మొఘలుల కాలం నాటి కత్తులు, బాకులు కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇటాలియన్ కళాకారుడు బెంజొని రూపొందించిన వీల్డ్ రెబెక్కా శిల్పం మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. మ్యూజియంలో అడుగుపెట్టిన పర్యాటకులు అక్కడి చారిత్రక సంపదను చూసి గొప్ప అనుభవానికి లోనవుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సందర్శకులకు అనుమతి ఇస్తారు.
ఫలక్‌నుమా ప్యాలెస్: రాజదర్పం ఉట్టిపడే.. ఫలక్‌నుమా ప్యాలస్‌ను నిజాం నవాబులు నిర్మించలేదు. సర్ వికారుల్ ఉమ్రా దీనికి అసలు నిర్మాత.. ఇతను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు స్వయానా బావ. ఆయన సంస్థానానికి ప్రధానమంత్రి కూడా. 1884 మార్చి 3న ఫలక్‌నూమా ప్యాలెస్‌కు శంకుస్థాపన చేశారు. ఇండో-అరేబియన్ నిర్మాణ శైలిలో దీన్ని డిజైన్ చేశారు. ఈ ప్యాలస్ నిర్మాణం కోసం ఇటలీ నుంచి పాలరాయిని, ఇంగ్లాండ్ నుంచి చెక్కను తెప్పించడం గమనార్హం. అయితే వికారుల్ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడంతో ఆరో నిజాం 1897లో ఆయనకు రూ.60వేలు చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నారని చెబుతుంటారు. ఆ తర్వాత అది ఏడో నిజాం మనవడు బర్కత్ అలీఖాన్ ముకరంజాకు దక్కింది. 2000వ సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా ఫలక్‌నూమా ప్యాలెస్‌ను 30 ఏళ్లపాటు తాజ్ గ్రూప్‌కి అప్పగించారు. దీన్ని హోటల్‌గా మార్పులు చేసి 2010 నుంచి తాజ్ ఫలక్‌నుమాగా మార్చారు.
హుస్సేన్ సాగర్: హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఉన్న మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించారు. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ సరస్సు అప్పట్లో నగరానికి మంచినీటి అవసరాన్ని తీర్చేది. కాలక్రమేణా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు దీనిలో చేరడంతో ఇప్పుడు మురికికూపంగా మారింది. అయినప్పటికీ హుస్సేన్‌సాగర్ పరిసరాలు పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటాయి. హుస్సేన్‌సాగర్‌లో మధ్యలో స్థాపించిన బుద్ధ విగ్రహం ఆ ప్రాంతానికి మరింత ఆకర్షణ తీసుకొస్తుంది. దీనికి అనుబంధంగా నిర్మించిన నెక్లెస్ రోడ్ నగర అందాన్ని మరింత పెంచింది.
హైటెక్ సిటీ: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం హైటెక్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు కొనసాగుతున్న సమయంలో 1998 నవంబర్ 22న సైబర్ టవర్స్‌ను అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి చేతుల మీదుగా ప్రారంభించారు. కేవలం 14 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న సైబర్ టవర్స్‌లో దేశ, విదేశాలకు చెందిన ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కొలువుదీరాయి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఎదగడంతో హైటెక్ సిటీ పాత్ర ఎంతో ఉంది. దీని కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటై సైబరాబాద్ అనే మరో ప్రాంతం ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సాప్ట్వేర్ రంగంలో బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ ఎదగడానికి హైటెక్ సిటీయే కారణం.
ఉస్మానియా యూనివర్శిటీ: నాటి హైదరాబాద్ సంస్థానం, బ్రిటిష్ ఇండియాలో అతిపెద్ద సంస్థానం. 1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటిగా చెబుతారు. ఎందరికో చదువులను ప్రసాదించి.. ఉన్నత స్థానాల్లో నిలబెడుతున్న ఉస్మానియా యూనివర్శిటీని ఏడో నిజాం 1917లో స్థాపించారు.
కాచిగూడ రైల్వేస్టేషన్: కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో నిజాం ప్రభువులే నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌కు స్థానిక కాచి కులస్తుల జ్ఞాపకార్థంగా ‘కాచిగూడ’గా నామకరణం చేశారు. నిజాం కుటుంబీకులంతా ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేసేవారు. శిల్పశైలి పరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అందమైన స్టేషన్లలో ఒకటిగా కాచిగూడ స్టేషన్ నిలుస్తుంది. బయటి నుంచి చూస్తే రాజా ప్రసాదంలా కనిపించే కాచిగూడ రైల్వేస్టేషన్ భాగ్యనగర ప్రధాన చిహ్నాలలో ఒకటి.
‘పగడాల’ రాజ్యం:
దేశంలో పగడాల వ్యాపారానికి పెట్టింది పేరు హైదరాబాద్. ఇక్కడ విక్రయించే పగడాలను శ్రీలంక, ఇరాక్, చైనాల నుంచి దిగుమతి చేసుకుంటారు. చార్మినార్ వద్ద పత్తర్‌గట్టీ, మెడివల్ బజార్లు నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే, వీటిని కొనుగోలు చేసే ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ప్లాస్టిక్ పగడాలు కూడా అమ్మేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి.
అత్తర్లకు అడ్డా: ఆల్కహాల్ కలవని ‘అత్తర్ల’కు భాగ్యనగరం ప్రసిద్ధి. అవి కూడా పాతబస్తీలోనే కొనుగోలు చేయాలి. ముస్లింలు వినియోగించే ఈ అత్తర్లకు భలే డిమాండు ఉంటుంది. ఇక్కడి డిమాండును దృష్టిలో పెట్టుకునే 19వ శతాబ్దంలో చాలామంది ‘అత్తర్వాలా’లు గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు వీరు ఏర్పాటు చేసినవే.
బిర్యానీ గుమగుమలు: హైదరాబాద్ పేరు వింటే ఠక్కున గుర్తుకొచ్చేది.. బిర్యాని. ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఏలిన నిజాములు ఆహార ప్రియులు. ఈ నేపథ్యంలో స్పేసీగా, టెస్టీగా.. అనేక రకాల వంటకాలను వారు రుచి చూసేవారు. ఇవన్నీ మొగళుల కాలంలో ఉనికిలోకి వచ్చినవే. ఇక హలీమ్.. గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. ఇక్కడి హలీమ్‌కు భారీగా డిమాండు ఉంటుంది. హైదరాబాదులోని ప్యారడైజ్, బావర్చి, షాదాబ్, పిస్తా హౌజ్ తదితర హోటళ్లు బిర్యానీ ఫేమస్.
కేబుల్ బ్రిడ్జి ఇటీవలే దుర్గం చెరువు మీద నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగరానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ కనెక్టివిటీలో భాగంగా దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ రెండేళ్లు పాటు శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశంలోనే కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జిగా ఈ నిర్మాణం రికార్డు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డుల కెక్కింది.
వినోదానికి అడ్డా: హైదరాబాద్ నగరం వినోదానికి పెట్టింది పేరు. షాపింగ్ మాల్స్ నుంచి మల్టిప్లెక్స్‌ల వరకు రోజూ ఎక్కడ చూసినా రద్దీగానే ఉంటుంది. నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, పబ్లిక్ గార్డెన్స్, పంజాగుట్ట సెంట్రల్, ప్రసాద్ ఐమ్యాక్స్. సుజనా ఫోరం మాల్, ఇనార్బిట్ మాల్, దుర్గమ్మ చెరువు, శిల్పారామం, … ఒకటేమిటీ నగరంలో అనేక ప్రాంతాలు పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. అటు చరిత్ర.. ఇటు ఆధునికతను ప్రతిబింబిచేలా హైదరాబాద్ నగరం దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే ఆకర్షిస్తోంది.
హైదరాబాద్‌లో చుట్టుపక్కల తప్పక సందర్శించాల్సిన మరిన్ని ప్రదేశాలు నెహ్రూ జూపార్క్ ఎన్టీఆర్ పార్క్ కుతుబ్‌షాహీ టూంబ్స్ దుర్గం చెరువు రామోజీ ఫిల్మ్ సిటీ జల విహార్ వండర్ లా మౌంట్ ఒపెరా స్నో వరల్డ్ శిల్పారామం కేబీఆర్ పార్క్ మక్కా మసీద్ సంఘీ టెంపుల్ పెద్దమ్మ గుడి చిలుకూరు బాలాజీ ఆలయం
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. ‘క‘ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్ర నామ జపం జరపడమే అనువైన మార్గం.
స్థల పురాణం.. అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదట. అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చొనట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
కంచి కామాక్షి అమ్మవారు పూర్వం ఉగ్రరూపంలో ఉండి బలి కోరేదట. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది.
ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీకామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షీ దేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనకాపు పూజ (చందనాలంకారం), రోజూ మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు.
కంచిలో నవరాత్రులను మూడు విభాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి మూడు రోజులు దుర్గాదేవిని, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సయమంలో కన్య(బాలిక), సుహాసిని(వివాహిత)పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
దర్శన వేళలు ప్రతీరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ.. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8.30వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు.
ఎలా వెళ్లాలి.. కాంచీపురానికి దేశంలో ఎక్కడి నుంచైనా రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. రోడ్డు మార్గమైతే.. కాంచీపురానికి వెళ్లేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకుని అక్కడ్నుంచి వెళ్లవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అయితే ముందుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి కోయంబేడ్ బస్‌స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు.
రైలు మార్గంలో వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్, వీక్లీ స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్లొచ్చు. అరక్కోణం స్టేషన్లో దిగి అక్కడ్నుంచి కంచి వెళ్లాలి. లేదా రైలులో చెన్నై చేరుకుని అక్కడ్నుంచి లోకల్ ట్రైన్ ద్వారా కంచికి చేరొచ్చు. మరోమార్గంలో తిరుపతికి నేరుగా ట్రైన్లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లొచ్చు.
భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు.
స్థల పురాణం.. మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచే ప్రాంతం ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉండిపోవాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు.
అప్పటి నుంచి రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు నిత్యం మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని… అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొనడం ఆనవాయితీగా వస్తోంది.
వెంటకనాథుడే.. రాఘవేంద్రుడయ్యాడు
తమిళనాడులోని భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు 1595లో వెంకటనాథుడు(రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు) జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సంసారం జీవితం వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.
అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.
దర్శన వేళలు రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.
భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రూ. 2కు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.
సబ్కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ ప్రసిద్ధ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా షిర్డిలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ప్రపంచంలోనే అతిపెద్ద సాయినాథుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా.. ఇంకెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సమీపంలోని రేపూరు గ్రామంలో నెలకొల్పిన 116 అడుగుల భారీ సాయిబాబా విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.
కాకినాడ నుండి ఇంద్రపాలెం మీదుగా గొల్లలమామిడాడ వెళ్లే మార్గంలో 10 కిలోమీటర్ల దూరంలో ఆ విగ్రహం ఉంది. షిరిడిసాయి మందిరానికి అనుబంధంగా నిర్మించిన ఈ సాయినాథుని విగ్రహం.. కాలుపై కాలు వేసుకుని నిర్మలంగా కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది. చుట్టుప్రక్కల 10 కిలోమీటర్ల దూరం వరకూ స్పష్టంగా కనిపించడం దీని ప్రత్యేకత.
సాయి సేవాశ్రమ్ వ్యవస్థాపకులు, సాయిభక్తులు శ్రీ అమ్ముల సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన విగ్రహం నిర్మాణం 12 సంవత్సరాల పాటు కొనసాగింది. 2012, డిసెంబర్ 12న ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. సుమారు వెయ్యి టన్నులకు పైగా బరువున్న ఈ విగ్రహాన్ని నాలుగు అంతస్తుల భజన మందిరం నిర్మించి దానిపై సాయి కూర్చున్నట్టుగా నిర్మించారు. దీని కోసం సుమారు రూ. 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. సాయి విగ్రహాన్ని దర్శించుకునేందుకు నిత్యం వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
ఆలయంలో ఉదయం 5.15 గంటలకు కాకడ హారతి, 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6.00 గంటలకు సంధ్యాహారతి, రాత్రి 8.00 గంటలకు శయన హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గురువారం ఉదయం 8.30 గంటలకు సాయి పల్లకి సేవ ఉంటుంది. ఈ మందిరానికి చేరుకోవాలంటే ముందుగా కాకినాడ చేరుకుని అక్కడి నుంచి ఆటోలో వెళ్లాలి. సొంత వాహనాలపై వచ్చే మందిరాన్ని సులభంగా చేరుకోవచ్చు.
‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.
కోనసీమ ప్రకృతి పదం.. మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయలున్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమకు అమలాపురం పట్టణం ప్రధాన కేంద్రం కాగా.. రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట ప్రధాన ప్రాంతాలు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రావులపాలెంను కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.
అందాల సీమ మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్ల తోరణాలు, అరటి గెలలు, కొబ్బరి తోటలు, మంచు తెరలు ఇలాంటి మనోహర దృశ్యాలన్నీ కోనసీమ వాసులకు సర్వసాధారణం. పుష్కలమైన ప్రకృతి వనరులు, కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం కోనసీమకే వన్నె తెస్తుంటాయి. కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారు.
కోనసీమ ప్రాంతం పురాతన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా భాసిల్లుతోంది. అతిథులకు మర్యాదలు చేయడంలో కోనసీమ వాసులకు కొట్టేవాళ్లే ఉండరు. అన్నిచోట్ల కొట్టి చంపితే.. కోనసీమ వాళ్ల తిండి పెట్టి చంపేస్తారన్న నానుడి ఉంది. సంక్రాంతి పండుగకు నిర్వహించే ముగ్గుల పోటీలు, కోనసీమలో జరిగే కోడిపందేలు, తీర్థాలు, జాతరలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.
పలకరింపులు భలే ఉంటాయ్ కోనసీమలో పలకరింపులు భలే వింతగా ఉన్నాయి. అక్కడ ఎదుటివారిని ఆయ్, అండి అంటూ ప్రత్యేక శైలిలో మర్యాదగా పిలుస్తుంటారు. ఈ తరహా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మనకు కనిపించదు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం.
ప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధ, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం ముఖ్యమైనవి. అవివాహితులు మురముళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటరు ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు.
కోనసీమ వంటలు ఆహా అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్‌కు కోనసీమ పెట్టింది పేరు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. గోదావరి నదిపై వంతెనలు నిర్మించక ముందు ప్రజా రవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే కొనసాగిస్తూనే ఉన్నారు. కోనసీమ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా ప్రసిద్ధి. గతంలో అనేక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి.
కోనసీమ చేరుకోవటం ఎలా ? వాయు మార్గం: అమలాపురానికి సమీపంలోని ఉన్న అతిపెద్ద నగరం రాజమండ్రి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు అమలాపురానికి బస్సు సౌకర్యం ఉంది.
రైలు మార్గం: కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, గంగవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రైల్వే స్టేషన్లు కలవు. రైలు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవచ్చు. బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుండి కోనసీమలోని ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.
కొత్త సంవత్సరాది అనగానే లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవిత సారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇవే గుర్తొస్తాయి. అయితే తెలుగు ఏడాది ప్రారంభం కేవలం వాటితోనే పూర్తికాదు. ఉగాది రోజున చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.
ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. అంటే… యుగ+ఆది అని అర్థం. యుగము అంటే జత అనే అర్థం కూడా వస్తుంది. అలా ఉత్తరాయణం, దక్షిణాయనం జతగా కలిస్తే ఒక సంవత్సరంగా భావిస్తాం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని అంటారు. ఉ అంటే నక్షత్రమనీ, గ అంటే గమనమనీ… దాన్ని ఈ రోజు నుంచే లెక్కిస్తారని కూడా చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే… మొదటి సంవత్సరం, మొదటి రుతువు, మొదటి మాసం, మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాదికి ‘ప్లవ’ నామ సంవత్సరమని పేరు. ప్లవను ప్రతిభ, జ్ఞానానికి సంకేతంగా గుర్తిస్తారు.
అన్ని పండగల్లానే ఉగాది రోజున కూడా ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆ తరువాత ఉగాది పచ్చడి తినడంతోనే పండగ అయిపోదు. ఈ రోజున ప్రత్యేకంగా ఫలానా దేవుడిని పూజించాలని ఏ పురాణాల్లోనూ చెప్పలేదు కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేసి.. ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలి. అయితే సృష్టి ప్రారంభం అయ్యేది కూడా ఈ రోజునే కాబట్టి భూమిని పాలించే ప్రభువును దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అంటే పరమేశ్వరుడిని మించిన ప్రభువు ఉండడు కాబట్టి శివాలయానికి వెళ్లి లోకానికే తల్లదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుంటే మంచిదని చెబుతారు. లేదంటే లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం లభిస్తుందని అంటారు. ఆ తరువాత గో దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి.
సాధారణంగా ఉగాది పచ్చడి తయారీలో ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం, తీపి కలిపి ఆరు రుచులుంటాయి. ఈ షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఃఖాలకూ కష్టనష్టాలకూ సంకేతంగా భావిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే… ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజున మాత్రమే కాక శ్రీరామ నవమి వరకూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటన్నింటితోపాటూ పంచాంగ శ్రవణాన్ని కూడా ఉగాది పర్వదినంలో ఓ భాగంగా పరిగణిస్తారు. పంచాంగాన్ని వినడం వల్ల ఏడాది కాలంలో గ్రహాల కదలికలూ, శుభాశుభ ఫలితాలూ తెలుస్తాయి. వాటన్నింటినీ తెలుసుకోవడం వల్ల రాబోయే పరిస్థితుల్ని ముందే అర్థంచేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చనేది పంచాంగ శ్రవణం ప్రధాన ఉద్దేశం.
వసంత నవరాత్రుల ప్రారంభం నవరాత్రులు అనగానే మనకు దుర్గమ్మను పూజించే శరన్నవరాత్రులు లేదా గణపతి నవరాత్రులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ రెండింటితో పాటూ చైత్ర మాసంలోనూ ప్రత్యేకంగా నవరాత్రుల్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. అవే వసంత నవరాత్రులు. ఈ సమయంలో శక్తిని కొలిచినా వీటిని విష్ణువుకు సంబంధించిన నవరాత్రులని పేరు. ఈ కాలంలో దుర్గను ఆరాధించడంతో పాటూ రాముడినీ, హనుమంతుడినీ కూడా ఆరాధిస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వసంత నవరాత్రులు ఉగాది నుంచి మొదలై శ్రీరామనవమి వరకూ కొనసాగుతాయి. నవరాత్రి ఆఖరు రోజున రాముడు జన్మించాడనీ దాన్నే శ్రీరామనవమిగా జరుపుకుంటామనీ పురాణాలు చెబుతున్నాయి.
ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎందుకు పూజించాలనే దానికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. సుదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడట. ఆ సమయంలో అమ్మవారు నవరాత్రుల పేరుతో తనకు పూజలు చేయమని కోరిందట. అలా ప్రారంభమైనవే ఈ నవరాత్రులని అంటారు. రామ లక్ష్మణులు కూడా వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, రామనామ జపాన్ని కూడా నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలా సర్వశుభాలనూ కలిగించే కొత్త ఏడాదిని అమ్మవారి అనుగహ్రంతో ఆనందంగా ప్రారంభించి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడమే ఉగాది పండగ ప్రధాన ఉద్దేశం.
ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో రాగుల ఆహారంలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత చాలాకాలం మరుగున పడిపోయాయి. అయితే ఇటీవల కాలంలో ప్రజలను ఆరోగ్యంపై అవగాహక పెరగడంతో పాటు ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ రాగుల వైపు చూపు మళ్లింది. రాగుల వల్ల శరీరానికి ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే ఎవరూ వీటిని వదలిపెట్టరు. రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో రాగిజావ తీసుకుంటే చాలా మంచిది. రాగులను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటే తెలుసుకుందా…
రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉండటం వల్ల చాలా సులభంగా జీర్ణమవుతుంది. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి.
వరితో సమానంగా రాగుల్లోనూ ప్రొటీన్ ఉంటుంది. ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాల్లోనూ లేవు. కాబట్టి, రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకున్నవారికి పోషకాహారలేమి ఉండదు. శాకాహారులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ధాన్యమిది.
ఎముకలకి బలంగా.. రాగుల్లో మినరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉండటంతో కాల్షియం సప్లిమెంటు తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు, ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశం ఉన్నవారూ రాగుల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. వయసు పెరిగిన వారు, చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.
వీర్యం వృద్ధి రాగి అంబలిని రోజూ తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. సెక్స్ సమస్యలను దూరం చేసి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. మెదడు చురుగ్గా పనిచేసి ప్రతిభావంతులుగా మారతారు.
షుగర్ కంట్రోల్.. షుగర్ వ్యాధి ఉన్నవారికి రాగులు మంచి ఆహారం. రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలిఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.
గుండె జబ్బులు దూరం.. రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా చేసి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్స్ గానీ, స్ట్రోక్స్ గానీ రాకుండా చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇప్పుడు తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. రాగులను కేవలం జావలాగే కాకుండా… రాగి మాల్ట్, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి వంటి పదార్థాలుగానూ తీసుకోవచ్చు. రాగులు అతి తక్కువ నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల దగ్గర్నించీ ఋతుపవనాల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల వరకూ, ఇంకా చెప్పాలంటే హిమాలయాల్లో కూడా పండుతాయి.
జ్వరానికి విరుగుడు యాంటీ-బాక్టీరియల్ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది జ్వరంగా ఉన్న సమయంలో మందులు వాడుతుంటారు. అలా కాకుండా దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది.
కాన్సర్ రాకుండా.. రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ జరగకుండా చేసి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. ముందు నుంచే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కాన్సర్ కారక సమస్యలు రాకుండా ఉంటాయి. రాగులు తరుచూ తినడం వల్ల వయసు పెరిగిన ఛాయలు కనపడకుండా చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామికి అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో మొదటిటి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆలయం. అంజన్న అంటూ భక్తులు భక్తితో కొలిచే ఈ ఆంజనేయుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కి.మీ.లు, వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.
స్థల పురాణం
సుమారు 500 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. దాన్ని వెతికి వెతికి విసిగిపోయిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుడి ఆనందానికికి అవధుల్లేకుండా పోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదల్లో వెతగ్గా స్వామివారి విగ్రహం కనిపించింది. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి చిన్న ఆలయం నిర్మించి పూజలు నిర్వహించేవాడని చరిత్రకారులు చెబుతారు.
నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్య భాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారి పక్కన సీతాదేవి రోదించినట్టు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి.
ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి వెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడ్రోజులపాటు హోమం నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు. దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.
కొండగట్టుకు ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి జగిత్యాలకు వెళ్లే బస్సు ఎక్కితే కొండగట్టులో దిగొచ్చు. కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసు ఉంది. కరీంనగర్ నుంచి క్యాబ్‌లు, ఆటో సౌకర్యం కూడా ఉంటుంది.