Category Archives: Features

మజ్జిగౌరమ్మ ఆలయం!

Category : Sliders Spiritual

పిలిస్తే ప‌లికే గౌర‌మ్మ‌గా, భ‌క్తుల కోరిక‌లు తీర్చే మాత‌గా వాసికెక్కిన త‌ల్లిని ద‌ర్శించ‌డానికి ఉత్త‌రాంధ్ర‌, ఒడిస్సా వాసులు రాయ‌గ‌డ‌కు పోయి అక్క‌డ కొలువైన ఆ త‌ల్లిని ద‌ర్శించి త‌రిస్తుంటారు.

ఆలయ విశేషాలు

పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహరాజ్ రాజా విశ్వనాథ్‌దేవ్ రాయగడలో ఓ కోట నిర్మించుకుని పాల‌న సాగించాడు. ఆయ‌న దుర్గా మాత భ‌క్తుడుగా కూడా ఉండేవాడు. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల ‘మజ్జిగరియాణి'(మధ్య గదిలో వెలసిన తల్లి)గా పేరొచ్చింది. రాయ‌గ‌డ‌లో తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడంవల్ల తెలుగువారి సంప్ర‌దాయాలు అక్క‌డ చాలా వ‌ర‌కు రాణించేవి. అయినా ఒడిస్సా సంప్ర‌దాయాలు అక్క‌డ నెల‌కొని ఉండేవి. అందుకే మ‌జ్జిగరియాణి కాస్తా మజ్జిగౌరమ్మదేవి గా మారిపోయింది అని పూర్వీకుల క‌థ‌నం.

చారిత్రిక కథనం

కళింగ చారిత్రక కథనం ప్రకారం 1538 లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా సేనాధిపతి రుతుఫ్‌ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవ్‌ని హతమార్చ‌డంతో ఆయన వీర మ‌ర‌ణంతో ఆయ‌న 108 మంది రాణులూ అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు. ఆత్మార్ప‌ణ చేసే ప్రదేశం ప్రస్తుత మ‌జ్జిగౌర‌మ్మ‌ మందిరం పక్కనే ఉంది. దీన్నే ‘సతికుండంస‌ అని పిలుస్తారు. రాజు వీర‌ మరణం తరువాత అమ్మవారి ఆలనా పాలనా చూసేవారే కరవయ్యారు. కోట కూడా కూలిపోయింది. దీంతో ఆలయ వైభవం మరుగునపడిపోయింది. 1930లో బ్రిటిష్‌వారు [‘[విజయనగరం]] నుంచి రాయ్‌పూర్ వరకూ రైల్వేలైను వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే, రాయగడ మజ్జిగౌరి గుడి వద్ద జంఝావతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం సగంలో ఉండగానే… మొత్తం కూలిపోయింది. అమ్మవారు ఆంగ్లేయ గుత్తేదారు కలలో కనిపించి, ‘నాకు ఆలయం నిర్మిస్తేనే, వంతెన నిలబడుతుంది’ అని చెప్ప‌డంతో జంఝావతి సమీపంలో ఆలయం నిర్మించారు.

చైత్రోత్సవం

ఏటా చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ అయిదు రోజుల పాటూ చైత్రోత్సవం (చైత్ర పండుగ) జరుగుతుంది. శక్తిహోమం ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది. తొలుత జరిగేది ‘అగ్నిమల్లెలు’ కార్యక్రమం. కణకణలాడే నిప్పుల పైనుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళతాడు. అనంతరం పిల్లల నుంచి వృద్ధులదాకా…వయోభేదం లేకుండా అగ్నిమల్లెల మీద నడవడం ఆనవాయితీ. ఆ తరువాత ‘ముళ్ల ఊయల’ సంబరం! ఊయల మీదున్న మొనతేలిన మేకులపై కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాడు పూజారి. ఆ అయిదు రోజులూ సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు, అదో పెద్ద జాతరలా భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో సాగుతుంది.

ఆచారాలు

ఆలయ సింహ ద్వారం దాటగానే నిగనిగలాడే ఇత్తడి గుర్రం ఉంటుంది. అయిదు క్వింటాళ్ల ఇత్తడితో చేసిన ఈ గుర్రం రంకెలేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అమ్మవారు రాత్రి వేళల్లో ఆ లోహాశ్వంపై సంచరించి, పట్టణ ప్రజలను కాపాడతారని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాల్నీ, గాజుల్నీ ముడుపులు కడతారు. దీన్ని ‘ముడుపుల చెట్టు’ అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోర్కెలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయని విశ్వాసం.

‘అమ్మా.. నా కోరిక తీరితే మరలా నీ దర్శనానికి వస్తాను’ అని మొక్కుకుంటే చాలు, తానే రంగంలో దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పారవశ్యంగా చెబుతారు. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్లాలంటే పూలు, పండ్లు, పత్రి సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ మాత్రం ఓ వింత ఆచారం ఉంది. రాయగడ జిల్లా ఆదివాసీ ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం. ఇదీ ఆ ప్రభావమే కావచ్చు. ఆలయం బయట ఉన్న రాయజానీ మందిరం వద్ద భక్తులు రాళ్ళపూజ చేస్తారు. అమ్మవారిని దర్శించుకుని వచ్చాక, విధిగా రాయజానీ మందిరంలో ఒక రాయి వేస్తారు. ఏటా విజయదశమి తరువాత, ఇలా పోగైన రాళ్లను సమీపంలోని లోయలో పడేస్తారు.

రాయ‌గ‌డ‌కు వెళ్లేందుకు దారులు

రాయ‌గ‌డకు వెళ్లి మ‌జ్టి గౌర‌మ్మ‌ను ద‌ర్శించుకునేవారికి విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం , బొబ్బిలి నుంచి ట్ర‌యిన్ లేదా బ‌స్సులలో వెళ్ల‌డానికి స‌దుపాయాలున్నాయి.ఒక‌సారి వెళ్లేవారు మ‌ళ్లీ మళ్లీ వెడుతునే ఉంటారు. అది అమ్మ‌వారి యాత్రలో మ‌ర్మం అని చెబుతారు.


శ్రీశ్రీశ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారి దేవస్థానం!

భస్మాంగలేప సమలంకృత దివ్యదేహం
భక్తార్తి రోగ భవభంజన శక్తి యుక్తం
కోటేశనాధమనిశాం శరణం ప్రపద్యే. ”

శ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ కోటేశ్వరస్వామి (శివుడు) చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ ఆలయం బలరాముడు నిర్మించ‌బ‌డిన‌ది అని చెప్ప‌బ‌డుతున్న ఈ ఆలయం అయినందున ప్రాముఖ్యాన్నిమ‌రింత సంతరించుకుంది. శ్రీకాకుళం పట్టణంలో భాగమైన గుడివీధిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం లోని కోటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తజనకోటికి అభయప్రదాతగా విలసిల్లుతున్నారు. ఈ దేవాలయం కూర్మనాథస్వామి దేవస్థానం, శ్రీకూర్మం నకు 12 కి.మీ దూరంలో ఉన్నది

విశిష్టత

శ్లో. ఉత్తిష్ట రుద్రకోటేశ శ్రీకాకుళిష్ట శంకర!
లోకకళ్యాణ సిధ్యర్థం ! కర్తవ్యం ధర్మపాలనం!

ఈ దేవాలయం శ్రీకాకుళం పట్టణమున, నాగావళి నది ఒడ్డున గుడివీధిలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి పంచాయతన “దేవాలయం”. ద్వాపర యుగాంతమున శ్రీ బలరామునిచే ప్రతిష్ఠించార‌ని పౌరాణిక గాధ ఒక‌టి చెప్ప‌బ‌డుతోంది.
కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థ యాత్రలకు బయలు దేరెను. వింధ్య పర్వతములు దాటి దండకారణ్యం అధిగమింఛి మాధవ వనములో పద్మనాభ పర్వత ప్రాంతములో నివసించుచున్నాడు.

కరువు కాటకములతోను బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా అతను తన ఆయుధమైన హలము (నాగలి) ని భూమిపై నాటి జలధారలు కురిపించెను . అలా వ‌చ్చిన జ‌ల‌ధార‌లతో క‌రువు కాట‌క‌ములు తిరోగ‌మ‌నం చెందాయి.. బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించినది కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని పిలివబడుచున్నది. ఈఆల‌యానికి స‌మీపంలోగ‌ల‌గ‌ల‌పారుతూ ఆహ్లాద‌క‌రంగా గోచ‌రిస్తుంది. మ‌రి ఐదు ప్ర‌ముఖ శైవాల‌యాల‌ను తాకుతూ ఈ న‌ది ప్ర‌వ‌హించ‌డం గిప్ప విశేషం.

ఇది త్రివేణీ తుల్యంగా సంగాం దగ్గర వెలసింది. నాగావళి (గంగ) సువర్ణముఖి (యమున), వేగవతి (అంతర్వాహిని సరస్వతి) నదుల సంగమమే త్రివేణీ సంగమంగా స్థానికంగా ప్రసిద్ధి చెందింది. బలరాముడు నాగావళి నది ఒడ్డున ఐదు శివ క్షేత్రాలను ప్రతిష్ఠ చేయించాడు అవి.

బలరాముడు ప్రతిష్ఠించిన క్షేత్రాలు

నాగావళి నదీ తీరమందు ఒరిస్సాలో రాయఘడ దగ్గర పాకపాడు అను గ్రామంలో పాయకేశ్వర స్వామి దేవాలయం పార్వతీపురం నకు 3 కి.మీ దూరంలో గుంప గ్రామం వద్ద సోమేశ్వర దేవాలయం,పాలకొండ దరి సంగాం గ్రామంలో సంగమేశ్వరుని దేవాలయం. శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము. కళ్లేపల్లి గ్రామంలో మణినాగేశ్వరస్వామి దేవాలయం మహాశివరాత్రి పర్వదినమున ఈ పంచలింగములను దర్శించిన వారికి జన్మరాహిత్యం పాప ప్రక్షాళనము జరుగునని ప్రతీతి. శ్రీకాకుళం పట్టణంలో వెలసియున్న శివునిలో రుద్రకోటి గుణములు గోచరించుట వలన ఈ మహాలింగమును రుద్రకోటేశ్వరుడు అని నామకరణం చేసి బలరాముడు ప్రతిష్ఠించెను.

చరిత్ర

శ్రీ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళ్లిరి. అదే విధంగా ఈ మహాలింగమును దర్శించుటకు ఇంద్రుడు వచ్చెను. అప్పటికే కాలాతీతమైనది. పిదప నందీశ్వరుడు,శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగు సమయం కాదు అని వారించిరి. పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగెను. అపుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ములతొ ఒక విసురు విశిరి కొట్టెను. ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడెను. ఇంద్రుడు పడిన ఆ స్థలమునే ఇంద్ర పుష్కరిణి అంటారు.

అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై “నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో త్రవ్వమని” చెప్పను. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికెను. అచ్చట ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించెను అదే ఈ నాటి అరసవెల్లి క్షేత్రము. అనంతరం శ్రీఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకొనెను.ఈ ఆలయం క్రీ.శ్ర 1774 సంవత్సరంలో కోనాడ వాస్తవ్యులు శ్రీ మగటపల్లి కామయ్యశెట్టి గారిచే నిర్మించబడింది. దీనిని 2003 డిసెంబరు 3 వతేదీన అష్టబంధన సహిత శిలాకవచం శ్రీ సద్గురు కృష్ణయాజి గారి అధ్వర్యంలో పునఃప్రతిష్ఠ జరిగింది.

నిర్మాణ శైలి

ఆలయ నిర్మాణంలో ప్రాచీన వైఖరి, పవిత్ర శిల్ప విన్యాసములో మెలకువలు శాస్త్రీయ నిర్మాణ పద్ధతి గోచరిస్తున్నాయి. ఆలయం చూడటానికి వెళ్ళిన తోడనే ఎదురుగా నాగావళి న‌ది రుద్రకోటేశ్వరుని పాద ప్రక్షాళనమునకు చాచిన చేతుల వలే ఉత్తుంగ తరంగాలతో దర్శనం ఇస్తుంది. ఆలయం గోపురం ప్రాకారములు మనోజ్ఞములుగా ఉంటాయి. ఈ ప్రాంతం చేరే సరికి ఆ దేవుని గుడిగంటలు వీనులవిందుగా వినిపిస్తాయి. లోన ప్రవేశించునప్పటికీ సిద్ధి గణపతి దర్శనం ఇస్తాడు. తరువాత ధ్వజస్తంభం, కనబడుతుంది.

శ్రీ ప్రసన్న సీతాసమేత రాముని ఎడమ తొడపై సీతమ్మవారు కూర్చున్నట్లు ఏకశిలతో దర్శనం ఇచ్చుచున్నారు. శ్రీరాముడు తన భక్తులకు ఆంజనేయస్వామిగా ఆంజనేయస్వామి భక్తులకు దర్శనం ఇచ్చుచున్నారు. ఆలయ ముఖ మంటపం చేరగానే పర్వతాకారంలో నందీశ్వరుడు మోకరిల్లుట చూస్తాం. నందిని చూసిన వెంటనే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చును. శ్రీ స్వామివారికి ఎడమ కుడి ప్రక్కల గల శృంగేశ్వరుడు, బృంగేశ్వరులను భక్తులు దర్శించుకుని లోన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర మహాలింగ మూర్తిని నిత్యాభిషేకములతో, ధూప దీప నైవేద్యములతో దర్శనం చేసుకొందురు.

ఉత్సవాలు

ఈ దేవాలయానికి శివరాత్రి రోజున ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి కార్తిక‌మాసమున ఈ ఆల‌యం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటుంది.జిల్లావాసుల‌కు శ్రీ ఉమారుద్ర‌కోటేశ్వ‌రుని కోల‌వ‌డంలో ఎన‌లేని ఆనందాన్ని వెతుక్కుంటారు. ఉత్త‌రాంధ్ర ఓడిస్సా వాసులు ఇక్క‌డిక వ‌చ్చి స్వామిని ద‌ర్శించుకుంటారు.


రాధాకృష్ణుల‌ ప్రేమమందిరం!

Category : Sliders Spiritual

ప్రధాన దైవం: సీత రాముడు మరియు రాధ కృష్ణ ఇందు దైవాలుగా కొలువ‌బ‌డుతున్నారు. వాస్తు శిల్ప శైలి రాజస్థానీ నిర్మాణశైలి,సోమనాథ్ నిర్మాణశైలిలో అత్యంత వైభ‌వంగా నిర్మిత‌మైన‌ది. ప్రేమమందిరం ప్రసిద్ధ హిందూపుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మధుర లోని బృందావనంకు సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయాలలో నవీనమైనది. ఈ దేవాలయ నిర్మాణం ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు అయిన “క్రిపాలు మహారాజ్” చే స్థాపించబడింది.
ఆల‌య‌విశేషాలు
ఈ దేవాలయ ప్రధాన నిర్మాణం చలువరాతితో తయారై అందంగా కనిపిస్తుంది. ఈ కట్టడం సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం నలువైపులా శ్రీకృష్ణుడు మరియు అతని అనుయాయులతో కూడిన ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. ఈ దేవాలయ శంకుస్థాపన జనవరి 2001 లో “క్రిపాలు మహరాజ్” అనే ఆధ్యాత్మిక గురువుచే చేయబడింది. ఈ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఫిబ్రవరి 17 2012 న జరిగినవి. ఈ దేవాలయం ప్రజల దర్శనార్థం ఫిబ్రవరి 17 నుండి ప్రారంభించబడింది. ఈ దేవాలయ నిర్మాణ ఖర్చు 150 కోట్లు ($23 మిలియన్లు) అయినది. ఈ దేవాలయ ప్రధాన దైవం రాధా గోవింద (రాధా కృష్ణ) మరియు శ్రీ సీతారాములు కొల‌బ‌డుతున్నారు. 73,000 చదవపు అడుగులు, చిన్న పిల్లరు, గోపురం ఆకారంలో గల సత్సంగ భవనం కూడా ప్రేమమందిరం నిర్మాణం తరువాత నిర్మింపబడుతున్నది. ఈ సత్సంగ భవనంలో ఒకేసారి 25,000 మంది ప్రజలు ప్రార్థనలు చేసుకొనే వీలుండే కైవారంతో నిర్మిత‌మైన‌ది.
నిర్మాణం
ఈ బృందావన ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన “కృపాలు మహారాజ్” చే అభివృద్ధి చేయబడింది. ఈయన ప్రధాన ఆశ్రమం కూడా బృందావనం లోనే ఉంది. ఈ దేవాలయ నిర్మాణ పనులు 14 జనవరి 2001 మొదలుపెట్టడం జరిగింది. దీని నిర్మాణంలో 800 మంది కళాకారులు,నైపుణ్యముగల పనివారు మరియు నిపుణులు పాలుపంచుకున్నారు. వీరు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి,పగలు నిరంతరం కృషి చేసి అసలైన సోమనాథ్ దేవాలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్స్ తో నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. దీనికయ్యే ఖర్చు 150 కోట్లు.
దీని నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బుల్స్ వాడిరి. దీని నిర్మాణం కోసం మార్బుల్స్ చెక్కుటకు ప్రత్యేకంగా కూకా రోబోటిక్ యంత్రాలను వాడారు. ఈ దేవాలయం పొడవు 122 అడుగులు మరియు వెడల్పు 115 అడుగులు. దక్షిణ భారతదేశ సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయ ప్లాను మరియు డిసైనింగ్ పనులు గుజరాత్ కు చెందిన సుమన్ మరియు మనోజ్ భాయి సోంపురా లచే చేయబడింది. ఇది మందమైన గోడలు, స్వచ్ఛమైన మార్బుల్స్ కలిగిన భారీ మార్బుల్ నిర్మాణం. ఈ దేవాలయ ప్రధాన దేవతలు రాధాకృష్ణులు.
ఆలయంలో జ‌రిగే నిత్య‌పూజ‌లు
ఉ. 6.30 : భోగం మరియు ప్రధాన మందిరం తలుపుల మూసివేత.
ఉ. 8.30 : దర్శనం మరియు ఆర్తి
ఉ. 11.30 : భోగం.
మ. 12.00 : శయన ఆర్తి గూర్చి తలుపుల మూసివేత.
సా.4.30 : ఆర్తి మరియు దర్శనం
రా. 8.00 : శయన ఆర్తి
రా. 8.30 : తలుపుల మూసివేత.
అక్క‌డ ప్ర‌శాంత‌త‌కు పెట్టింది పేరు . జీవితంలో ఒక్క‌సారి ఈ బృందావ‌నాన్ని వీక్షించిన‌వారిదే జ‌న్మధ‌న్యం. …..


శంభులింగేశ్వర స్వామి దేవాలయం!

Category : Sliders Spiritual

కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం అనేకానేక‌మైన విశిష్ట‌త‌లు క‌లిగిన ప్రత్యేకమైన ఆల‌యంగా భ‌క్తులు చెబుతుంటారు.కాక‌తీయులు శిల్ప‌క‌ళ‌ల‌ను ప్య‌త్యేకంగా తాము నిర్మించే ఆల‌యాల‌లో ఆప‌ని త‌నాన్ని శిల్పుల‌తో చూపించేలా గుడులు గోపురాలు నిర్మాణాలు సాగించారు. వారితో ఏగుడి నిర్మాణం జ‌రిగిన పెక్కు విశిష్ట‌త‌ల‌తో గొప్ప‌గా రాణించేవి.

ఆలయ విశేషాలు

ఇక్కడి స్వయంభూ శివలింగం(1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలో మేళ్ళచెరువులో ఉంది. జాతీయరహదారి నుండి కేవలం పది కి.మీ. లోపు ఉండే ఈదేవాల‌యాన్ని చేరుకోవచ్చు. 11వ శతాబ్ధంలో యాదవరాజులు దేవాలయాన్ని నిర్మించారని చారిత్ర‌క ఆధారాలున్నాయి. నిత్యం స్వయం అభిషేకం జరుగుతుంటుంది…శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం ఏర్పడుతూ ఉంటుంది.. ఆ విధంగా చూస్తే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత వలయాల సంఖ్యలో పెరుగుదల మనకు స్పష్టంగా కనపడుతుంది.

మొదట్లో కేవలం మూడు నామములు పెట్టే స్థలమే ఉండేదట. ప్రస్తుతం ఆరు నామములు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. ఈప్రాంతం పూర్వీకులు చెపుతుంటారు. ఇంకొక విచిత్రమేమిటంటే ఈ శివలింగం పై భాగంలో చిన్న ఖాళీ ప్రదేశముంది.. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది.. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ ఉబుకుతుంది… అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా… అందుకే ఇది స్వయం అభిషేక లింగంగా చెబుతుంటారు. ఇది ఈ క్షేత్రంలో చాలా ప్రత్యేకం.. ఈ నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది…

ఇక్కడ శాస్త్రీయమైన ఏ ఆధారాలు లేవు… కానీ ఇది ఒక అద్భుతం… శివుని ఝటాఝూటంలో గంగా దేవి లాగా శివుని అభిషేకం చేయటం అద్భుతమే కదా… మన భారతదేశంలో కేవలం వారణాసి లో మాత్రమే ఇలా ఉందట.. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు…కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట… ఆ యాదవ కాపరి ఆ రాయిని శివలింగం అని తెలియక పదకుండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పారవేస్తాడట…

కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ ఈ లింగం ప్రత్యక్షమై కనిపించిందట… అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగం గా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు…ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి.. శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు…


శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం!

Category : Sliders Spiritual

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన పలివెల గ్రామములో శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం భ‌క్తుల‌తో పూజ‌లు అందుకుంటోంది. ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం”పలివెల” అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పౌరాణిక గాథ

పౌరాణిక గాథ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమ్రుతలింగాన్ని రాక్షసులు ఒక ‘పల్వలము’ (గొయ్యి)లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమ్రుతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది అని ఒక గాధ ప్ర‌చారంలో ఉంది.ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన “పల్లవ అనే ప‌దం నుంచి “పలివెల” అయిందని కూడా చారిత్ర‌క ఆధారాలున్నాయి.

స్థ్లల పురాణం

ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములోని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యాణమండపము లో వేదిని అల్లాదరెడ్డి క్రీ.శ 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు మరియు హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణానికి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు.

అగస్త్య మహర్షి తన దివ్యదృష్టితో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రంలో శివుడు లోల అగస్త్య లింగేశ్వరునిగా తరువాత కొప్పులింగేశ్వర స్వామిగా పూజలందుకొంటున్నాడు.

సాహిత్యాధారాలు

శ్రీనాథుడుని కాలంలో అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకొన్నట్లుశ్రీనాథుడు శ్లొకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండము, భీమఖండము మరియు శివరాత్రి మహాత్మ్యములలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ, ఈస్వామే తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు. ఈ కాలానికే చెందిన అజ్జరపు పేరయలింగ కవి కూడా తన “ఒడయనంబి విలాసం”లో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ, ఇప్పటి ఈ చిన్న గ్రామమును ఒక గొప్ప పట్టణముగా చెపుతూ ఇంద్రుడు ఒక్కసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మరిచిపోతాడని అన్నాడు. ఈ సాహిత్యాధారాల వలన క్రీ.శ 14వ శతాబ్దంనాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది.

చారిత్రక ఆధారాలు

ఈ ఆలయములో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లభించిన వానిలో పురాతనమైనది క్రీ.శ 1170 కి చెందింది. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనము. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము, రెడ్డిరాజులకు చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్-ఉల్-ముల్క్ కు చెందిన దానశాసనము ఉండడం విశేషం. ప్రస్తుతము క్రీ.శ 15వ శతాబ్దము వరకూ శాసనాలు లభించాయి.

పిఠాపురం రాజావారి పాలనలో కూడా పలివెల ఒక ప్రత్యేకమైన ఠాణాగా ఉండేది. ఈ ఆధారాల వలన క్రీ.శ.10వ శతాబ్దం నుండి కూడా రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయపోషణలో ఉన్న‌ట్లు, రాణించిన‌ట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలో ఆలయ జీర్ణొద్దారణ జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ముస్లింల దండయాత్రల సమయంలో నంది తల విరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది.

కొప్పు లింగేశ్వరుడి క‌థ‌

ఇక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి స్త్రీలోల‌త్వం ఉండేది . అందులో భాగంగా ఆయనకు ఒక వేశ్యతో సంబంధం ఉండేది. ఆ పూజారి మీద ఆ రాజ్యపు రాజుకి చాలా పిర్యాదులు అందుతూ ఉండేవి. ఇది గమనించి ఒక రోజు ఆ రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజుకు ఇచ్చాడు. ఆ ప్రసాదంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. రాజు ప్రశ్నించగా మా శివునకు జటాజూటం ఉన్నదని రాజుకి తెలిపుతాడు.

రాజు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామికి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాత రోజు రావడానికి అంగీకరిస్తాడు. కాని శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే ఆ పుజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. రాజును చూసి భ‌య‌ప‌డి అబ‌ద్దం చెప్పాను న‌న్ను ర‌క్షించండి అని ప‌దేప‌దే కోరాడు. రాజు దర్శనానికి వేకువ‌నే వచ్చి శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపించింది.

రాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చూసాడు. శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివామహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. రాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లోని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగముకు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలో కొప్పులింగేశ్వరుడుగా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు. ఆంధ్రపదేశ్ పురావస్తుశాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం, స్వామిమందిరం, కొన్ని స్తంభాలు పై ఉన్న శిల్పాలను పరిరక్షిస్తోంది.

ఆలయము గురించిన విశేషాలు

దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉన్నది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండీ ఉండినది కాదు; కాలాంతరంలో పుట్టుకొచ్చినది. ఈ ఆలయమును తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి మరియు పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశములో నిర్మించినట్లు చెబుతారు. ఈనాడు కూడా కౌసికి, వసిష్ఠలతో పాటు గర్భగుడిలో వర్షాకాలములో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును. ఇటీవల గర్భ్గగ్రుహమును గ్రానైటు రాయి పరచి బాగు చేశారు.

ఈ ఆలయము పలివెల మధ్యలో నాలుగెకరాల సువిశాల ప్రాంగణములో, ఒక దానిలో ఒకటిగా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో, చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణములో ప్రధానాలయము, ఎన్నో మండపాలు, పరివార దేవతాలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాళుక్యుల మరియు రెడ్డిరాజుల వాస్తు సంప్రదాయాలను చూడవచ్చును. ఈ ప్రాంగణములోని మండపాలు అందలి శిల్పాలలో క్రీ.శ 10వ శతాబ్దము నుండి క్రీ.శ 17వ శతాబ్దము మధ్యకాల వాస్తు-శిల్ప పరిణామమును చూడవచ్చును.ఈ ఆలయములో వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి.

ఇవి వేంగి (తూర్పు)చాళుక్యుల మరియు రెడ్డిరాజుల కాలం నాటి శిల్ప లక్షణాలు కలిగి ఉన్నాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగములో చతురస్రాకారములో ఒక పొడుచుకువచ్చిన భాగము ఉంది. దీనినే కొప్పు అంటారు. ఇందువలననే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి (ఉమాదేవి) ప్రతిష్ఠించబడి ఉంది. ఈమెకు ఉన్న ప్రభామండలమునకు రెండు వైపులా గణపతి మరియు కుమారస్వామి కూడా ఉన్నారు. సాధారణంగా శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి, అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటుంది, లేక ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది.

ఇంక వినాయకుడు, కుమారస్వాములు వేరేగా పరివారదేవతాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారు ప్రక్క ప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు. అందువలననే ఈ స్వామిని ఉమాకొప్పులింగేశ్వరుడు అంటారు. ఈవిధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేంచేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ప్రాంగణములో వినాయకుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వరస్వామి మరియు పాపవిమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడి భక్తుల పూజలందుకుంటున్నారు.

వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగానూ ఆలోచింపజేసీవిగానూ ఉన్నాయి. ఈ మొత్తము శిల్పసంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును. అవి శైవము, వైష్ణవము, సాంఘీకము మరియు ఇతరములు. శైవములో శివ-పార్వతుల వివిధ రూపాలు-వృషభారూఢమూర్తి, లింగోధ్భవమూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు మొదలైన అనేకరూపాలేకాక పురాణగాథలైన కిరాతార్జునీయం, మృగవ్యధ మొదలగు గాథలు కూడా ఉన్నాయి. వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు, లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాథలు ఉన్నాయి.

ఆలయానికి ఈ మధ్యకాలములో జరిగిన జీర్ణోద్ధరణ కార్యక్రమాల వలన పడిపోవడానికి సిధంగా ఉన్న కట్టడాలను గట్టిపరచడం, కొన్ని కొత్తకట్టడాలు చోటు చేసుకోవడంతో ఆలయము కొత్త శోభలను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఆలయము అపురూపమైన పురాతనాలయము.

పండుగలు,విశేషాలు
గణపతి నవరాత్రులు
దేవీ నవరాత్రులు
కార్తీక మాసం
సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య షష్ఠి
ధనుర్మాసం
కొప్పు లింగేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జ‌రుగుతుంది.