Category Archives: Features

శ్రీలక్ష్మీ నారాయణీ స్వర్ణ దేవాలయం.. వేలూర్

తమిళనాడు అంటేనే దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన వందలాది ఆలయాలు అక్కడ కనిపిస్తుంటాయి. ఇందులో వేటికమే ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ప్రముఖమైనది శ్రీపురంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. దేశంలో బంగారు దేవాలయం అంటే ఒకప్పుడు అమృతసర్‌లోని గురుద్వారానే.. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్థంభాలు బంగారం, వాటిపై శిల్పకళా బంగారం, గోపురం, విమానం, అర్ధ మండపం, శఠగోపం ఇలా అన్నీ బంగారంతో చేసినవే.

శ్రీపురం స్వర్ణ దేవాలయం వేలూరులోని మలైకొడి ప్రదేశంలో నిర్మించారు. దీనినే ‘ది గోల్డెన్ టెంపుల్ అఫ్ వెల్లూర్’ అని పిలుస్తారు. శ్రీ శక్తిఅమ్మ అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈయన అసలు పేరు సతీశ్‌కుమార్‌. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్‌ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్‌. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్‌ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తిఅమ్మగా పేరుమార్చుకున్నారు.

1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానం… ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తిఅమ్మ భక్తులు దేశవిదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే.

ఈ ఆలయం లోపల, బయట రెండు వైపులా బంగారు పూతతో మహాలక్ష్మి ఆలయం ఉంది. ఈ దేవాలయం వ్యయ పరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కంటే చాలా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది. సుమారు 400 మంది (తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వాళ్లూ వీరిలో ఉన్నారు) రేయింబవళ్లు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.

తిరుమల ఆలయానికి మాదిరిగానే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్‌ పూర్తిగా బంగారంతో చేసిందే. ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్‌లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నారు. ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహలతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు. ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో చేసిన బంగారు షీట్ లు 9-15 పొరలుగా ఉన్నాయి. దీనిని 1500 కిలోల బంగారంతో కట్టించారని చెపుతారు. ఆలయంలో ఎలాంటి నామ స్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి బయటికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి. భక్తులు ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. ఈ ఆలయంలో తిరుపతి నుంచి 115 కిలోమీటర్లు, చెన్నై నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఖాద్రీ నరసింహుడు.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న స్వామివారి విగ్రహం

దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి.. కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయాలు ఎంతో ప్రత్యేకత. ఆ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం. ఎంతో మహిమ, విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నారు. కాటమ రాయుడా కదిరి నరసింహుడా అంటూ నిత్యం పూలందుకుంటున్న ఆ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే.. అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. అసలు కదిరి నరసింహునికి ఖాద్రి నరసింహునిగా పేరేందుకు వచ్చింది.. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి హిరణ్య కశిపుడుని వదించిన తర్వాత.. ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాదిదేవతలు.. స్వామివారిని శాంతపరచడం నీవల్లే అవుతుందని ప్రహ్లాదుడితో చెప్పారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ ఖాద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడంకోసం ప్రార్థనలు చేసాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామి వారి ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్లు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లదుని విగ్రహం ఖాద్రి వృక్షం క్రింద కొలువై ఉంటాయి. పదో శతాబ్దంలో పట్నం పాలగాడు అయిన రంగనాయకుల స్వామి వారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

విగ్రహంలో దైవ రహస్యం
ఇక్కడ స్వామి వారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితి. నేటికీ స్వామి వారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు.

కదిరి నరసింహా స్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారంటే… కదిరికి దగ్గరలో ఉన్న గాండ్లపెంట మండలంలోని చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం. స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి అనుకోని కాటం అనే కుగ్రామం ఉండటం వలన కాటమరాయుడుగా స్వామికి పేరు వచ్చింది. సంస్కృతంలో ఖా అనగా విష్ణు పాదం, అద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి ఖాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఖాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడి ప్రజలు చెబుంటారు. అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. దేశంలో నవ నరసింహాలయాలుగా పిలువబడే ఆ తొమ్మిది ఆలయాల్లో శ్రీఖాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం కూడా ఒకటి.

ఆలయ నిర్మాణ విశేషాలు
కదిరి పట్టణంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు రెండు ఉన్నాయి. ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండమీద ఉంది. స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత నాభి నుండి వచ్చే నీటినే ఇక్కడి భక్తులు తీర్ధంగా తీసుకుంటారు. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటగా గాలిగోపురం కనపడుతుంది. దీనిని హరిహర రాయ, బుక్కరాయ, శ్రీకృష్ణదేవరాయలు దశల వారిగా 13-15 శతాబ్దల మధ్య కాలల్లో నిర్మించారు. గాలిగోపురం దాటుకుని లోపలికి వెళ్లిన భక్తులకు కళ్యాణకట్ట కనిపిస్తుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలో బురుగుతీర్థం దర్శనమిస్తుంది. బురుగుతీర్థంలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి వెలుపల గల పూజ సామగ్రి దుకాణాలను చేరుకుంటారు. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రధాను గోపురనికి కుడివైపు వినాయక మరియు కృష్ణుని ఆలయాలు మనకి కనిపిస్తాయి. ఇక ప్రధాన గోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో పునాది లేకుండా బండాపై నిల్చున్న గరుడ స్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు.

ప్రధాన ఆలయ విశాల ప్రాంగణంలో కుడివైపు మనకు శ్రీ కోదండరామలయం దర్శనమిస్తుంది. ఇందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణ మరియు ఆంజనేయ సమేతుడై ఉంటాడు. సీతారాములను దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగుల కట్టకు చేరుకుంటారు. ఇలా ఆలయం ప్రాంగణంలో ప్రతి అడుగుకీ ఒక విశిష్టత ఉంది. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి గర్బాలయంలో స్వామి వారు అమ్మతల్లి, తాయారు మరియు ప్రహ్లాదలుతో మనకు దర్శనమిస్తారు. గర్భాలయనికి కుడివైపున భృగు మహర్షి స్థాపించిన వసంత వల్లభలు మనకు దర్శనమిస్తారు. అలాగే కుడి వైపుగా వెళ్తే అమృతవల్లి అమ్మవారి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇదేవిధంగా ఎడమవైపు వెళ్తే ఆండాళ్ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. గర్బాలయానికి అభిముఖంగా గారుడాళ్వారు స్వామివారి చిన్న మందిరం ఉంటుంది. గర్భాలయ ప్రవేశానికి ఇరువైపులా జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి.

పూజాది కార్యక్రమాలు
ఇక్కడ ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు ఉంటాయి. ప్రతీసంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో బ్రహ్మోత్సవలు చాలా వైభవంగా జరుగుతాయి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రథోత్సం దేశంలో పూరి జగన్నాథ రథోత్సవం తరువాత అత్యంత పెద్దదిగా చెబుతారు. లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొంటారు. రథోత్సవం జరిగే సమయంలో రథం మీదకి భక్తులు మిరియాలు మరియు పండ్లు చల్లుతారు. వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటారు. కుల మతలకు అతీతంగా పూజలు జరిగే దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన దేవాలయం కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం. హిందువులే కాకుండా ముస్లింలు కూడా రావడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం వలన ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వస్తారు.

ఎలా చేరుకోవాలంటే..
కదిరి పట్టణం హైదరాబాద్ నగరానికి 454 కిలోమీటర్లు, అనంతపురానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పలు ప్రాంతాల నుంచి రైలు, బస్సు సౌకర్యం కూడా ఉంది. కలియుగ వైకుంఠం తిరుపతికి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది.


మోకాళ్లపై వంగి శివుడికి దండం పెట్టిన మేక.. నోరెళ్లబెట్టిన భక్తులు

భక్తి. దేవుడి పట్ల ఆరాధన. ఇది కొంతమందికి స్వతహాగా రావచ్చు. మరికొంత మందికి భయం వలన రావచ్చు. ఇంకా కొంతమందికి అవసరం వలన కూడా భక్తి భావన కలగవచ్చు. ఎలా కలిగినా భక్తి అనేది మానవులకు మాత్రమే సొంతమని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పశు పక్ష్యాదులు, జంతువులు కూడా అప్పుడప్పుడూ భక్తి తన్మయత్వంలో తరిస్తుంటాయి. దానికి ఉదాహరణే ఈ మేక.


ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ నగరంలోని బాబా ఆనందేశ్వర్ ఆలయం. శనివారం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక మేక స్వామివారికి వంగి నమస్కరించింది. ఇతర భక్తులతో కలసి శివుడిని ప్రార్థించింది. అచ్చం భక్తుల తరహాలో మోకాళ్లపై పడి ఆ పరమశివుడిని వేడుకుంది ఈ మేక. పాపం ఎన్ని కష్టాలున్నాయో.. ఏమో. మిగతా భక్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా భక్తి తన్మయత్వంతో ఆ శివుడికి తన కష్టాలేవో మొరపెట్టుకున్నట్లుంది. మేక భక్తిని గుళ్లో ఉన్నవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. తర్వాత తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించారు. ఈ మేక చేసిన పని ఇప్పుడు అందరి నోళ్లల్లోనూ నానుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ మేకపై చర్చ జరుగుతోంది.


కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

విద్యా ప్రాప్తికి

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

ఉద్యోగ ప్రాప్తికి

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

కార్య సాధనకు

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

గ్రహదోష నివారణకు

మర్కటేశ మహోత్సాహా సర్వ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

ఆరోగ్యమునకు

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

సంతాన ప్రాప్తికి

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

వ్యాపారాభివృద్ధికి

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

వివాహ ప్రాప్తికి

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.



నవగ్రహ దోష నివారణ: ఎలాంటి పూజలు, హోమాలు చేయాలంటే..

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

అంటూ శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు, హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. వానిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగ పడుతుంది. హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటంవలన ఒక్కో సమిధ వలన ఒక్కో రోగం నివారించబడుతుంది. హోమ పొగ కంటిలోకి పోవడం వలన కంటిలో ఉండే నలత కంటిలో నుండి నీరు రూపంలో వెళ్లిపోతుంది. హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. గ్రహాలకు వేర్వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే పరిశుద్ధమైన ఆరోగ్యవంతులవుతారు.

రవి
తెల్లజిల్లేడు వాత, కఫ వ్యాదులను తగ్గిస్తుంది. తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. కళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి. కోప స్వభావాలు తగ్గుతాయి. తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

చంద్రుడు
మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు. ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు రుతు సంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు, గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు ఉంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

కుజుడు
చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు, ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుంది. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం, కోప స్వభావాలు తగ్గుతాయి.

బుధుడు
ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పూలతో గాని, వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి. ఉత్తరేణి ఆకులు, గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతాయి.

గురువు
రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్క కాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాటా రక్త దోషాలు తగ్గుతాయి. నోటి పూత పోతుంది. రావి చెక్క కషాయాన్ని నిత్యం తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో ఉంది.

శుక్రుడు
మేడి చెట్టు సమిదలతో హోమం చేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంధ సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మ రూపంలో సుప్రతిష్టితులై ఈ వృక్ష మూలమునందు ఉంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహ వ్యాధి నివారించబడుతుంది. దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుంది.

శని
జమ్మి సమిధలతో హోమం చేస్తే అప మృత్యుభయం తొలగిపోతుంది. దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. శమీ వృక్ష గాలి శరీరానికి తగిలిన శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసిన దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి.

రాహువు
గరికలతో హోమం చేస్తే ఇంటిలో నర దృష్టి తొలగిపోయి సర్ప సంబంధ దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి, కురుపులపై రాస్తే నివారించబడతాయి. దెబ్బ తగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.

కేతువు
దర్భాలతో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.

జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి. తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది.


హోమాలు ఎన్ని రకాలు.. వాటి ఫలితాలేంటి?

హోమానికి హిందూమతంలో విశేష ప్రాధాన్యత ఉంది. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతికూల శక్తిని తగ్గించుకోవడానికి గ్రహశాంతితో సహా అనేక పుణ్యాల ప్రాప్తి కోసం హోమాలు నిర్వహిస్తారు. హోమంలో మనం సమర్పించే వస్తువులు, కోరికలు అగ్నిదేవుడు నేరుగా దేవునికి అందజేస్తాడని నమ్మకం. హోమంలో చాలా రకాలు ఉన్నాయి, హోమం చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం.

గణపతి హోమం
విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాం. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది.

రుద్ర హోమం
పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్ర హోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్ర హోమం చేయాలనుకుంటే వారి జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి నిర్వహిస్తుంటారు. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.

చండీ హోమం
హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరిసంపదల కోసం చండి హోమం నిర్వహించడం జరుగుతుంది. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది. చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవమి తిథుల్లో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.

గరుడ హోమం
మానవుని శరీరాకృతి, గరుడి ముఖము కలిగి శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే గరుడ హోమం. సరైన విధివిధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం అలాగే అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం, అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం మొదలగునవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది.

సుదర్శన హోమం
శ్రీ మహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేస్తుంటారు. ముఖ్యంగా గృహ ప్రవేశం, ఇతర శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేస్తారు.

మన్యుసూక్త హోమం
వేదాలను అనుసరించి మాన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థంలో తీవ్రమైన భావావేశము అని చెప్పబడుతుంది. మాన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమం మన్యుసూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తారు. ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.

లక్ష్మీ కుబేర పాశుపత హోమం
హిందూ ధర్మానుసారంగా… సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరుడిని పూజిస్తాం. జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం సూచింపబడేదే లక్ష్మి కుబేర పాశుపతహోమం. జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేస్తారు. ఈ హోమంలో కమలం పువ్వులను వినియోగిస్తారు.

మృత్యుంజయ పాశుపత హోమం
మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం. పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణహాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేస్తారు. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు. ఈ హోమం చేసుకునేవారు ఒక్కో మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావాల్సిన ప్రధాన వస్తువులు. దర్భ, అమృత మూలిక. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు.

నవదుర్గ పాశుపత హోమం

భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది. జట దుర్గ, శాంతి దుర్గ, శూలిని దుర్గ, శబరి దుర్గ, లవణ దుర్గ, అసురి దుర్గ, దీప దుర్గా, వన దుర్గ, మరియు జ్వాలా దుర్గ. దుర్గా మాత యొక్క ఈ తొమ్మిది రూపాలను పూజించడానికి చేసే హోమమే ఈ నవదుర్గ పాశుపత హోమం.ఈ హోమం చేయడం వలన దుష్ట శక్తుల నుంచి విముక్తి, శాంతి, సంపద, ఆరోగ్యం, ఆయుష్యు, సంతానం, విద్య మొదలైనవి లభించి ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన అంశాలను నుండి విముక్తి కలుగుతుంది.


చండీ హోమం ఎందుకు చేస్తారు.. కలిగే ప్రయోజనాలేంటి?

యజ్ఞం, హోమం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలెన యజ్ఞాలు, హోమాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడమే వీటి లక్ష్యం. ఇలాంటి హోమాల్లో చండీ హోమం ముఖ్యమైనది. చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.

చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.

ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు. ఇది చేసిన వారు ఆర్థిక,మానసిక, విద్య ,వైద్య లేక వివాహ సంతాన ఇలాంటి ఎన్నో బాధలకు విముక్తి పొందుతారు.


రాశుల పరంగా దేవుళ్లకి ఎలాంటి తాంబూలం ఇవ్వాలంటే

ఈతి బాధలు తొలగిపోవాలంటే ఎలాంటి ప‌రిహారం చేసుకోవాల‌ని చాలామంది అడుగుతుంటారు. ఆధ్యాత్మికతవేత్తలు, పండితులు, జ్యోతిష్యులు ఇచ్చిన సలహాలతో ఆ విధంగా కార్యాలు చేసి ఫలితం పొందుతుంటారు. అయితే ఒకే పరిహారం అన్ని రాశుల వారికి వర్తించదు. వారు జన్మనక్షత్రం, రాశి తదితరాల ఆధారంగా ఏయే రాశుల ఎలాంటి తాంబూలం ఇవ్వాలన్ని మన పురాణాల్లో పొందుపరిచారు. 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏయే దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకుందాం…

మేష రాశి
తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతి బాధలు తొల‌గిపోతాయి.


వృషభ రాశి
తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు చేకూరుతాయి.


మిథున రాశి
తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

కర్కాటక రాశి
తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.


సింహ రాశి
తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.


కన్యా రాశి
తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే దుఃఖం దూరమవుతుంది.


తులా రాశి
తమలపాకులో లవంగాన్ని ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.


వృశ్చిక రాశి
తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి.


ధనుస్సు రాశి
తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.


మకర రాశి
తమలపాకులో బెల్లం ఉంచి శనివారం కాళిమాతను పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి.


కుంభ రాశి
తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజిస్తే దుఃఖాలు తొలగిపోతాయి.


మీన రాశి
తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.