Category Archives: Features

దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారంటే..

దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ. త్రేతాయుగం కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఆ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామచంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీ పూజ చేశారు. నాటి నుండి అశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులను పదో రోజున విజయదశమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏంటంటే రోజురోజుకీ స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో పర స్త్రీని తల్లిలా పూజించాలని, లేనిచో రావణుడిలాగా ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారని.. అందువల్ల మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని రావణ దహనం సందేశం ఇస్తుంది.

రావణుడికి పూజలు
మనదేశంలో సీతారాములను ఆరాధ్య దైవాలుగా భావించినట్లే మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రావణుడిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రావణుడికి ఒక మందిరం ఉంది. అక్కడి వాళ్లంతా దసరా రోజున రావణాసురుడిని పూజిస్తారు. ఆ రోజున ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ఆలయం తలుపులు మూసి వేస్తారు. మళ్లీ దసరాకి మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరవడం విశేషం.

రావణుడి పేరుతో గ్రామం
మధ్యప్రదేశ్ లోని ‘విదిశా’ ప్రాంతంలో రావణుడి పేరున ఓ గ్రామం వుంది. ఈ గ్రామంలో రావణుడికి ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో రావణుడు శయనిస్తున్నట్లుగా ఉంటాడు. ఆయన విగ్రహం 10 అడుగుల పొడవు ఉండటం ఆశ్చర్యం. ఇక్కడ రావణుడికి అనునిత్యం పూజలు చేస్తారు. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. అక్కడి వాళ్లంతా రావణుడిని ‘రావణ బాబా’ అని పిలుస్తూ తమ కష్టనష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా అక్కడి ప్రాంతం వారి కష్టాలను ఆ రావణ బాబా తెరుస్తాడు అనే నమ్మకం కూడ ఉంది. ఏది ఏమైనా దసరా సంస్కృతిలో రావణ దహన సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది.


దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి.. దీని వెనక ఉన్న ప్రాశస్త్యం ఏంటంటే..

విజయానికి ప్రతీక విజయ దశమి. చెడుపై మంచి సాధించిన చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా దసరా పండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. విజయ దశమి తమ జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటారు. దసరా అనగానే ఠక్కున గుర్తొచ్చేది జమ్మి చెట్టు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. దసరా రోజు కచ్చితంగా పాలపిట్టను చూడాలని భావిస్తుంటారు. ఇంతకీ పాలపిట్టను చూడాలనే ఆచారం ఎందుకు వచ్చింది.? దీనికి వెనక ఉన్న అసలు కారణమేంటి.? లాంటి విషయాలు మీకోసం..

మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు చాలా ఎక్కువ. పల్లెటూరి వాతావరణంలో దసరా పండుగ పూట పాలపిట్ట తళుక్కున మెరిసి అందరికీ ఆనందాన్ని పంచుతుంది. విజయాలకు ప్రతీకగా చెప్పుకునే విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే కచ్చితంగా శుభాలు జరుగుతాయని, ఏ పని ప్రారంభించినా కచ్చితంగా విజయం సాధిస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే విజయదశమి(దసరా) రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు.

పురాణాల ప్రకారం పాండవులు అరణ్య వాసాన్ని ముగించుకుని తమ రాజ్యానికి తిరిగొస్తుండగా పాలపిట్టను చూశారట. అదే రోజు విజయదశమి ఉండటం వల్ల అప్పటి నుంచి పాండవులకు తిరుగనేదే లేకుండా ప్రతి ఒక్క విషయంలో విజయాలు వరించాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అప్పటినుంచి దసరా పండుగ రోజున మగాళ్లు అడవికి వెళ్లి మరీ పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అప్పటినుంచి ఈ సంప్రదాయం ప్రతి ఏటా కొనసాగుతూ వస్తోందని పెద్దలు చెబుతారు.

త్రేతా యుగంలో రావణాసురుడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు బయలుదేరి వెళ్లే సమయంలో విజయ దశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి.. సీతమ్మను రావణ చెరనుంచి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఆయోధ్యకు రాజుగా మారుతాడు. పాలపిట్టను విజయానికి సూచికగా భావించడానికి ఇదొక కారణం.

సాధారణంగా జనావాసాలకు దూరంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఈ పాలపిట్టలు కనిపిస్తుంటాయి. అందుకే జమ్మి ఆకుల కోసం వెళ్లిన సమయంలో ఈ పక్షిని చూస్తుంటారు. నీలం, పసుపు రంగులో ఉండే ఈ పక్షి రూపం కూడా ఎంతో బాగుంటుంది. పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా రోజు ఈ పక్షిని చూస్తే ఏడాదంతా విజయలు అందుతాయని విశ్వాసం.

అయితే.. ప్రస్తుతం అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట జాడ కూడా కనుమరుగవుతోంది. పల్లెటూళ్లలో అక్కడక్కడా ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనిపించడం లేదు. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంత మంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూపిస్తున్నారు.


కుక్కె సుబ్రహ్మణ్యస్వామి… ఆ గుడి నిండా పాములే

సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుల్య తాలూకాలోని సుబ్రమణ్య అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్ప దేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి, ఇతర సర్పాలు సుబ్రమణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి.

పురాణ చరిత్ర
సుబ్రమణ్వస్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్ఠాపిత క్షేత్రాల్లో కుక్కె సుబ్రమణ్య ఒకటి కావడం విశేషం. శంకర భగవత్‌పాదులు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో కుక్కెలింగ అని ప్రస్తావించారు.

నాగులకు రక్షకుడు
నాగుల్లో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి. ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన ఉండి పూజలు అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి… తదితర పూజలను నిర్వహిస్తారు.

కుమారధారలో పవిత్రస్నానం
శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇలా చేరుకోవాలి
మంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఉంది. విమాన మార్గంలో వెళ్లే భక్తులు మంగళూరు ఎయిర్‌పోర్టులో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మంగళూరు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వైపు ప్రయాణించే రైళ్లు కుక్కె రైల్వేస్టేషన్‌లో ఆగుతాయి.


పళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.. విషాలతో తయారుచేసిన విగ్రహం

ఆది దంపతులైన శివపార్వతుల ముద్దుల తనయుడు కుమారస్వామి. ఆయనకు స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయనకు తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి. వాటిలో పళని ఒకటి. ఇక్కడ కొలువైన స్వామిని అరుల్‌ ముగు శ్రీ దండాయుధపాణి స్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది. ఇది మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఎతైన కొండలపై ఉంటుంది.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల్లో ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము.

పురాణ గాథ
ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారిద్దరి కుమారుల్లో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని, నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు. కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ­ఊరడిస్తాడు.

అప్పుడు శివుడు కుమారా.. సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ ఈ రెండు కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి తొడ భాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు. అలా చేస్తూ ఉండటంవల్ల స్వామి వారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది. దీంతో కొద్దికాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపేశారు. మొదటగా స్వామి వారి ఆలయాన్ని ఏడో శతాబ్దంలో కేరళ రాజు చీమన్‌ పెరుమాళ్‌ నిర్మించారు. తర్వాత పాండ్యులు పునరుద్ధరించారు.

స్వామి వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో(తొమ్మిది రకాల విష పదార్థాలు) మహర్షి సిద్ధ భోగార్‌ ముని తయారు చేశారు. ప్రపంచంలో ఇలాంటి స్వరూపం మరెక్కడా లేదు. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠ రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కాని భక్తులకు ఆ అవకాశం కుదరదు. ఇక్కడ స్వామి వారిని.. కులందైవళం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమనలన్, దేవయానైమనలన్, పళనిఆండవార్, కురింజిఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కోడియోన్, వెట్రి వేల్ మురుగా వంటి పేర్లతో పిలుస్తారు.

ఎలా వెళ్లాలి

పళని క్షేత్రం దిండుగల్‌ జిల్లాలో మదురైకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విమాన మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి మదురైకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి చెన్నై సెంట్రల్‌, లేదా మదురై చేరుకోవాలి. మదురై నుంచి కోయంబత్తూర్‌ వెళ్లే రైళ్లు పొల్లాచ్చి మీదుగా, పళని రైల్వేస్టేషన్‌ నుంచే వెళ్తాయి. చెన్నై సెంట్రల్‌- పళని ఎక్స్‌ప్రెస్‌ తిరుచెందూర్‌ నుంచి మదురై మీదుగా పళని చేరుతుంది. అక్కడి నుంచి ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వేస్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో, బస్సు సౌకర్యం ఉంది.


పడమటి ఆంజనేయుడి ఆలయం.. ఇక్కడ గర్భగుడికి పైకప్పు ఉండదు

ఏ ఆలయంలోనైనా భక్తులను గర్భగుడిలోకి అనుమతించరు. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోకి భక్తులు వెళ్లడమే కాదు మూలమూర్తి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఈ ఆలయంలో గర్భగుడికి పై కప్పు ఉండదు. స్వామి విగ్రహం కూడా పడమర వైపు తిరిగి ఉంటుంది. ఇతర ఆలయాలకు భిన్నంగా మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈ ప్రత్యేకతలన్నీ కనిపిస్తాయి.

పడమటి ఆంజనేయుడు
శ్రద్ధగా పూజించేవారికి శని దోషాలను పోగొట్టే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలోని మక్తల్‌ ప్రాంతంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని జాంబవంతుడే స్వయంగా ప్రతిష్ఠించాడని అంటారు. సాధారణంగా హనుమంతుడి ఆలయాల్లో స్వామి విగ్రహాలు తూర్పు, ఉత్తరం, దక్షిణంవైపు తిరిగి భక్తులకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడ స్వామి పశ్చిమ దిక్కును చూస్తూ, ఓ పక్కకు ఒరిగి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. అంతేకాదు, ఈ ప్రాంగణంలోని గర్భగుడికి పైకప్పు ఉండదు.

స్థల పురాణం

గర్భగుడిలో పైకప్పు లేకపోవడానికీ ఓ కథ ఉంది. ఇక్కడ గర్భగుడిలోని పైకప్పును ఉదయం నుంచీ సాయంత్రంలోగా నిర్మించాలనేది నియమమనీ… రెండుసార్లు అలా ప్రయత్నించినా పైకప్పు కూలిపోయిందనీ.. దాంతో దాన్ని అలాగే వదిలేశారనీ చెబుతారు స్థానికులు. గర్భగుడిలో సైతం భక్తులు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉన్న ఆలయం కూడా ఇదొక్కటే కావం విశేషం.

శనిదోషాన్ని పోగొట్టేస్వామి

త్రేతాయుగంలో జాంబవంతుడు ఇక్కడ స్వామి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా సీతాదేవి జాడ వెదుకుతూ వచ్చిన హనుమంతుడు ఈ ప్రాంతంలో సేదతీరాడనీ.. అలా ఇక్కడ స్వామివారి విగ్రహం వెలసిందనీ అంటారు. స్వామి విగ్రహం ఓ పక్కకు ఒరిగి ఉండటానికీ ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు స్వామిని పూజించే అర్చకుడు పొట్టిగా ఉండేవాడట. దాంతో రోజూ స్వామికి సరిగ్గా పూజ చేయలేక ఇబ్బంది పడేవాడట. ఆ అసంతృప్తితో అర్చకుడు ఓ రోజు విగ్రహం తన చేతికి అందితే కానీ పూజ చేయకూడదని నిర్ణయించుకుని అదే విషయాన్ని స్వామికి విన్నవించుకున్నాడట. కాసేపటికి స్వామి విగ్రహం పూజారికి అందేలా కాస్త పక్కకు ఒరిగిందట. అప్పటినుంచీ విగ్రహం ఒకవైపు వాలినట్లుగా ఉండిపోయిందని అంటారు.

ఈ స్వామిని 41 రోజులపాటు భక్తితో పూజిస్తే… కోరికలు తీరుస్తాడనీ, శనిదోషాలనూ నివారిస్తాడనీ అంటారు. ఆంజనేయుడికి సింధూర లేపనం అంటే ఇష్టమనీ.. మనసులో ఏదయినా అనుకుని సింధూరాన్ని స్వామికి అర్పిస్తే సంతానం, యశస్సు, విద్య.. ఇలా ఏది అనుకున్నా ప్రసాదిస్తాడనీ చెబుతారు. మార్గశిర మాసంలో త్రయోదశి నుంచి బహుళ విదియ వరకూ స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి రోజున రథోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులూ వస్తారు. అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, అక్షయ తృతీయ రోజుల్లోనూ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవచ్చు

ఈ ఆలయం హైదరాబాద్‌కు 163 కిలోమీటర్ల దూరంలో… కర్నూలు పట్టణానికి117 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి ఆలయానికి నేరుగా చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి రైల్లో వచ్చిన వారు మహబూబ్‌నగర్‌లో దిగి.. అక్కడి నుంచి 65 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.


మధుర మీనాక్షి ఆలయం

మధుర మీనాక్షి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణం వేగాయి నడి ఒడ్డున ఉంది. తమిళనాడులోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మధురై… దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలకు నిలయంగా ఈ నగరం విలసిల్లుతోంది. మీనాక్షీ, సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. సుందరేశ్వరుడు సాక్షాత్తు శివుడు, .యన భార్య సాక్షాత్తు పార్వతీ దేవి. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు, గాయకులు దివ్యమైనదిగా గానం చేశారు. శక్తి స్వరూపిణి అయిన దేవి, మానవ రూపంలో అవతరించి పాండ్య రాజ పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమ శివుని సతీమణి అయింది.

ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు .భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం (మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.

స్థల పురాణం
మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి దేవి చిన్న పాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలు దేరుతాడు. అయితే అనుకున్న సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనైవాల్‌ పెరుమాళ్‌ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా ‘చిత్తిరై తిరువళ’గా వేడుకగా నిర్వహిస్తున్నారు.

తమిళ గ్రంథం తిరువవిలై యాతర పురాణంలోని కథనం ప్రకారం.. ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు చాలా కాలం వరకూ సంతానం కలగలేదు. దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలిసి పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. అయితే ఆయనకు పుత్రునికి మారుగా అప్పటికే మూడేళ్ల వయసున్న ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు మూడు రొమ్ములు ఉన్నాయి. ఇదేమిటా అని తల్లి తండ్రులు ఆలోచిస్తున్నంతలో శివుడు ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరి పెంచమని ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం మూడవ రొమ్ము మాయమవుతుందని చెప్పాడు. తల్లితండ్రులు ఆమెకు పుత్రుని మాదిరి యుద్ధ విద్యలు నేర్పించారు. వాటిలో ఆమె ప్రావీణ్యం గడించింది. రాజ్యాలను గెలుచుకుంది. ఒక రోజు ఆమె ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని దర్శించగానే ఆమె మూడవ రొమ్ము మాయమైంది. దానితో ఆయనే తన భర్త అని ఆమె గ్రహించింది. పార్వతీ దేవి మరో రూపమైన ఆమెను శివుడు వివాహమాడాడు. వారిద్ద్దరూ కొంత కాలం మధురై నగరాన్ని పాలించారు. ఆ తర్వాత వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి ఉగ్ర పాండ్యన్‌ అని పేరు పెట్టారు. ఇతనిని మురుగన్‌ (కుమారస్వామి ) అపర అవతారంగా పేర్కొంటారు. వారు అతనిని సింహాసనంపై కూర్చోపెట్టి తాము సుందరేశ్వర మీనాక్షిలుగా ఆలయంలో కొలువు తీరారు. పేరెన్నికగన్న మధురై మీనాక్షి ఆలయం ప్రస్తావన 6వ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయం ప్రాచీన గ్రంథాల్లో ఉన్నా, 14వ శతాబ్దం అనంతరమే ప్రస్తుత ఆలయం నిర్మాణం జరిగిందని చెబుతారు.

ఆలయ నిర్మాణం
ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. సుందరపాండ్యన్‌, పరాక్రమ పాండ్యన్‌లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్‌ దక్షిణ గోపురాన్ని కట్టించారు. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. దాదాపు 33000 శిల్పాలు ఉన్నాయి. 1000 స్థంభాల మండపం ప్రధాన ఆకర్షణ.

దండయాత్రలు
శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్‌దార్‌ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలో పేర్కొన్నాడు. అనంతం ఖిల్జీ సేనాన, మాలిక్‌ కపూర్‌ దీన్ని ఈ ఆలయాన్ని కూల్చివేశారు.ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి.

పునర్నిర్మాణం
16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు.


పండుగలు
మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.


ఏడుకొండలవాడికి ఏ నైవేద్యం… ఎప్పుడు? ఎలా సమర్పిస్తారు?

తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి స్వామివారికి చక్కెర పొంగలి, పెరుగన్నం లాంటి ప్రసాదాలూ సమర్పిస్తారని తెలుసు. అయితే కమ్మని దోసెలు, ఘాటైన మిరియాల అన్నం కూడా ఏడుకొండల వాడికి వడ్డిస్తారని మీకు తెలుసా?. తిరుమలేశుడికి పూటపూటకూ ఓ పలహారం. రుతువులను బట్టి ఆహారం. సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి.. ఏం పెట్టాలి, ఏయే పదార్థాలు ఏయే కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదం వండేవారు వంట సమయంలోనూ, తర్వాత వాసన సోకకుండా ముక్కుకు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. స్వామికి సమర్పించేదాకా బయటి వారెవరూ దాన్ని చూడరాదు.

నైవేద్యం పెట్టేది ఇలా…

  • ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.
  • గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.
  • ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే సమయంలో అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. ఆ వేళలో గర్భాలయం తలుపులు మూసేస్తారు.
  • విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి దళాలను అభికరిస్తారు.
  • కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడిచేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు.
  • చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే.
    *ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధ గుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని సమర్పిస్తారు.
    *నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.
  • రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.
  • ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం
  • పది, పదకొండు గంటల మధ్య రాజభోగం
  • రాత్రి ఏడు – ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.
  • తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తుకు అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.
  • నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.
  • ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు.

ఉదయం – బాలభోగం

  • మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, రవ్వ కేసరి
    మధ్యాహ్నం – రాజభోగం
  • శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం
    రాత్రి – శయనభోగం
  • మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం (వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

  • అల్పాహారాలు
    లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి పలహారాల జాబితా ఇదీ…
  • ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని ఆవు పాలు సమర్పిస్తారు
  • తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు
  • ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది
    *అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది
  • సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి… స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు.
  • అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!
  • అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గుడాన్నం) పెడతారు.
  • ఇక పవళించే సమయం దగ్గర పడుతుంది.
  • ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు

ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆరాధన ఎక్కువ. శివపార్వతుల ముద్దుల తనయుడైన ఆయన్ని… కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. సుబ్రమణ్యేశ్వరుడికి మంగళవారం ప్రీతికరం. వివిధ సమస్యలతో బాధపడేవారు ఆయన్ని భక్తితో పూజిస్తే పరిష్కారం చూపిస్తాడని భక్తుల నమ్మకం

విజయాల కోసం..
కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే. రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ ‘శరం’ అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే… ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట!

సంతానానికి
ఈ సృష్టిలో పార్వతీపరమేశ్వరులని ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.

జ్ఞానానికి
సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి వచ్చిందని చెబుతారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయన్ని వేలాయుధన్ అని కూడా పిలుస్తారు. ఈ శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తుంటారు.

ఆధ్మాత్మిక ఉన్నతికి
శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందనీ, అది ఆరుభాగాలుగా మారిందనీ.. కుమారస్వామి జననం గురించి చెబుతుంటారు. ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలనే అక్కచెళ్లెళ్లు పెంచారట. అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని పేర్కొంటారు. అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతుంటారు. ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచన. పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు కనిపిస్తాయి. ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తుంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చు.

యోగ సాధనకు
కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగ శాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు.

జాతక దోష నివారణకు
వివాహం, సంసారం, సంతానం… వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట. ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహ జీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. సుబ్రమ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే ఎటువంటి కుజ దోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మకం.


నాలుగు శతాబ్దాల చరిత్రకు నీరాజనం.. మైసూర్ దసరా ఉత్సవాలు

దసరాకు నెల రోజుల ముందు నుంచే మొదలయ్యే సంబరాలు.. దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే పర్యాటకులు.. ఏటా అధికారికంగా నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం… 1610 సంవత్సరం నుంచి నిరంతరాయంగా జరుగుతున్న ఉత్సవాలు.. ఇప్పటికీ రాజకుటుంబం చేతుల మీదుగా జరిపించే దసరా వేడుకలు.. గజరాజు మీద స్వర్ణ అంబారీపై చాముండేశ్వరీ దేవి ఊరేగింపు… విద్యుత్ దీపాల వెలుగులతో అలరారే మైసూర్ ప్యాలెస్..

తింటే గారెలే తినాలు.. వింటే భారతమే వినాలి అన్నట్టుగా చూస్తే మైసూరులో జరిగే దసరా వేడుకలనే చూడాలి. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా మైసూరులో దసరా వేడుకలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత వైభవంగా జరువుతారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

మైసూరులో దసరా ఉత్సవాల సందడి నెల రోజుల ముందే ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా… ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్ళు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆటల, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు…. ఒక్కటేమిటి… దసరా సందర్భంగా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు. మైసూరుకు చెందిన రాజకుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు నేటికీ అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉండటం విశేషం.

మైసూరులో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరువుతున్నారని చరిత్ర చెబుతోంది. వడయార్ రాజ వంశం ఈ వేడుకలను ప్రారంభించింది. అంతకుముందు శ్రీరంగ పట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అప్పటి నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి. దసరా ముందు జరిగే వేడుకల సంగతి అలా వుంచితే, దసరా రోజున జరిగే కీలకమైన వేడుక కన్నులకు విందు చేస్తుంది.. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి, దానిలో చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగిస్తారు. ఒక చెట్టు కలపతో, 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ రాజసం ఉట్టి పడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మెసూర్ ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మరికొన్ని ఏనుగులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొంటాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మైసూరుకు తరలి వస్తుంటారు.

దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతో పాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ రోజున అన్ని వృత్తుల వారు తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు జరపడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్‌ని లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మెసూర్ మహారాజుల నివాసమైన ఈ ప్యాలెస్‌లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్‌లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే 10 రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు. అంబారీ ప్రదర్శనకు ఒక రోజు ముందు దసరా దివిటీల ప్రదర్శన నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దసరా సందర్భంగా మైసూరులో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో వివిధ జిల్లాలు, శాఖల అభివృద్ధిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మైసూర్ ప్రజలు తమ వారసత్వంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో జరువుకుంటారు.

దసరా సందర్భంగా ప్రతి ఇల్లూ దసరా శోభతో కళకళలాడుతూ వుంటుంది. ప్రతి ఇంట్లోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైసూరు దసరా వేడుకల గురించి మాటల్లో చెప్పలేం. రెండు కళ్లతో ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. ఈ పండుగ సందర్భంగా మైసూర్లోని అమ్మవారు చాముండేశ్వరీ దేవిని పూజించటం ఆనవాయితీ. విజయనగర రాజుల కాలంలో 15వ శతాబ్దంలో ఈ ఉత్సవాలు మొదలైనట్లు చారిత్రక ఆధా రాల ద్వారా తెలుస్తోంది. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుల్ రజాక్ తన వుస్తకంలో విజయనగర రాజులు నిర్వహి స్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ .. 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టగా.. 1805లో కృష్ణరాజు ఉడయార్ కాలం నుంచి దసరా నాడు మైసూరు ప్యాలస్‌లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.


దసరా ఉత్సవాలు… సర్వశక్తి స్వరూపిణి బెజవాడ కనకదుర్గమ్మ

హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పండుగ శరదృతువు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతుంది. శరదృతువులో జరుపుకునే ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు.

తెలుగు వారు పదిరోజులపాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలు, పూజల గురించి ప్రస్తావన వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ దేవాలయమే. ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. తిరుపతి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రెండో పెద్ద దేవాలయంగా కనకదుర్గ గుడి ఖ్యాతి గాంచింది. మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేద వ్యాసుని సలహామేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. శివలీలలు, శక్తి మహిమలు ఆలయంలో అక్కడక్కడ కనిపిస్తాయి.

చరిత్ర
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మ వారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మ వారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మ వారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన త్రైలోక్య మాత మహిషాసుర మర్దిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది.

ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలలో అమ్మవారిని దర్శించి ఉగ్రస్వరూపిణిగా వున్న అమ్మవారిని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని పురాణ కథనం. 12వ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఉపాలయాలు
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను కూడా దర్శించుకుని పూజలు చేస్తారు. దసరా రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు. అనంతరం అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అన్నదానంతో పాటు ఉచితంగా పులిహోర, కదంబం, అప్పం ప్రసాదం ఉచితంగా అందిస్తారు. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ఆమె నామాలు, అవతారాలు, రూపాలు అనేకం. ఏ రూపంలో కొలిచినా ఆమ్మకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడితే పూజకి మరింత ఫలితం దక్కుతుందని అంటారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనం ఇస్తారో తెలుసుకుందాం.

తొలి రోజు
నవరాత్రుల్లో తొలిరోజు కనకదుర్గమ్మ స్వర్ణక‌వ‌చాలంకృత దుర్గాదేవిగా భక్తులకు ద‌ర్శన‌మిస్తుంది. అష్ట భుజాల‌తో సింహాస‌నం మీద త్రిశూల‌ధారియై.. క‌న‌క‌పు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసిపోయే ఆ త‌ల్లిని ద‌ర్శించుకోవ‌డం నిజంగా భ‌క్తుల‌కు క‌నుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలూ తొల‌గిపోతాయంటారు.

రెండో రోజు
రెండో రోజు జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గమ్మ.. బాలాత్రిపుర సుంద‌రీదేవి రూపంలో దర్శనమిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్రతో ఉండే ఈ త‌ల్లి అనుగ్రహం కోసం ఉపాస‌కులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బ‌ట్టలు పెడ‌తారు. అమ్మవారికి ఆకుప‌చ్చ, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.

మూడో రోజు
దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీ మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.

నాలుగో రోజు
అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన నాలుగో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం.

ఐదో రోజు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజున అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాధనలు ముమ్మరమవుతాయి.

ఆరో రోజు
ఆరో రోజున శ్రీలలితా త్రిపుర సుందరీదేవి రూపంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచ దశాక్షరీ మంత్రాధి దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరు మందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఏడో రోజు
ఏడో రోజున అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఎనిమిదో రోజు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమిస్తారు. అమ్మవారు దుర్గాదేవి రూపంలో, మహిషాసుర మర్ధినిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.

దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు… సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే… భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి.

తొమ్మిదో రోజు
దసరా నవరాత్రి వేడుకల ముగింపు విజయదశమి నాడు ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకు గడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీ చక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చేయు అలంకారాలు.. ఇతర వివరాలు


26-09-22
సోమవారం – పాఢ్యమి – స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి – బంగారు రంగు చీర – కట్టెపొంగలి , చలిమిడి , వడపప్పు , పాయసం

27-09-22
మంగళవారం – విదియ – శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి – లేత గులాబీ రంగు చీర – పులిహార

28-09-22
బుధవారం – తదియ – శ్రీ గాయత్రీ దేవి – కాషాయ లేదా నారింజ రంగు చీర – కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం

29-09-22
గురువారం – చవితి – శ్రీ అన్నపూర్ణ దేవి – గంధపురంగు లేదా పసుపు రంగు చీర – దద్దోజనం , క్షీరాన్నం , అల్లం గారెలు

30-09-22
శుక్రవారం – పంచమి – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి – కుంకుమ ఎరుపు రంగు చీర – దద్దోజనం , క్షీరాన్నం

01-10-22
శనివారం – షష్ఠి – శ్రీ మహాలక్ష్మీ దేవి – గులాబీ రంగు చీర – చక్కెర పొంగలి , క్షీరాన్నం

02-10-22
ఆదివారం – సప్తమి – శ్రీ సరస్వతు దేవి – తెలుపు రంగు చీర – దద్దోజనం , కేసరి , పరమాన్నం

03-10-22
సోమవారం – అష్టమి – శ్రీ దుర్గా దేవి – ఎరుపు రంగు చీర – కదంబం , శాకాన్నం

04-10-22
మంగళవారం – నవమి – శ్రీ మహిషాసురమర్ధిని దేవి – ముదురు ఎరుపు రంగు చీర – చక్కెర పొంగలి

05-10-22
బుధవారం – దశమి – శ్రీ రాజరాజేశ్వరి దేవి – ఆకుపచ్చ రంగు చీర – లడ్డూలు , పులిహోర , బూరెలు , గారెలు , అన్నం