Category Archives: Features

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం

తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది తప్పకుండా దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.

ఆలయ చరిత్ర
చిత్తూరు జిల్లాలో బాహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడైతే, మిగతా ఇద్దరు మూగ, చెవిటివారిగా పుట్టారు. కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు కమ్మేసింది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు. పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పారకమ్‌ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది.

విగ్రహంలోనూ ఎదుగుదల
బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహంలోనూ ఎదుగుదల ఉండడం విశేషం. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు.

సత్యప్రమాణాల దేవుడిగా..
వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్షపడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతోపాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. అసెంబ్లీలో నాయకులు సైతం ఆరోపణలు వచ్చిన సమయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాళ్లు విసురుకోవడం గమనార్హం. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం.”బ్రహ్మహత్యా పాతక నివృత్తి” కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది.

ఆలయంలో సర్పం
ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు.

శ్రీ వరదరాజస్వామి ఆలయం

శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దీన్ని కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది. అద్దాల మేడ వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంది. కాణిపాకం మూడో వంతు వివిధ దేవాలయాలతో నిండి వుంది.


శ్రీనివాసుడికి వ‌డ్డీ కాసుల వాడ‌నే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా మ‌తాల‌కు చెందిన ఆల‌యాలు, ప్రార్థనా మందిరాల్లో కెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం గల పుణ్య క్షేత్రం తిరుమ‌ల. అయితే తిరుమ‌ల‌కు, ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టత‌ను గూర్చి అంద‌రికీ తెలుసు. అక్కడ ఏడుకొండ‌ల్లో కొలువై ఉన్న శ్రీ‌వెంక‌టేశ్వర స్వామిని ప్రార్థిస్తే అన్ని స‌మ‌స్యలు పోయి, క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతామ‌ని భ‌క్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటారు.

అయితే వెంక‌టేశ్వర స్వామికి అంత‌టి ఆదాయం వ‌స్తుండ‌డాన్ని ప‌క్కన పెడితే ఆయ‌న‌ను భ‌క్తులు రెండు పేర్లతో పిలుచుకుంటారు. అది ఒక‌టి ఆప‌ద‌మొక్కుల వాడ‌ని, ఇంకోటి వ‌డ్డీ కాసుల వాడ‌ని. కోరిన కోర్కెలు తీర్చి, ఆప‌ద‌ల నుంచి గ‌ట్టెక్కించి అంతా శుభ‌మే క‌లిగించేవాడు కావ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు ఆప‌ద మొక్కుల వాడ‌ని పేరు వ‌చ్చింది. అయితే వడ్డీ కాసుల వాడ‌నే పేరు రావ‌డం వెనుక గ‌ల కార‌ణం ఈ విధంగా చెబుతారు.

ఒకానొక స‌మ‌యంలో వెంక‌టేశ్వర స్వామి ప‌ద్మావ‌తీ దేవిని పెళ్లి చేసుకోవ‌డానికి భూలోకం వ‌చ్చాడ‌ట‌. అయితే ల‌క్ష్మీ దేవిని వైకుంఠంలోనే వ‌దిలి రావ‌డంతో ఆయన ద‌గ్గర డ‌బ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డ‌బ్బు పుట్టలేదు. ఈ క్రమంలో కుబేరుడు వెంక‌టేశ్వర స్వామికి పెళ్లిక‌య్యే ధ‌నం మొత్తం ఇచ్చాడ‌ట‌. ఒక సంవ‌త్సరంలోగా ఆ అప్పు తీర్చేస్తాన‌ని వెంక‌టేశ్వర స్వామి చెప్పాడ‌ట‌. అయితే తీరా సంవ‌త్సరం దాటేసరికి వెంక‌టేశ్వర స్వామి ఆ ధ‌నం అప్పు తీర్చకుండా వ‌డ్డీ క‌డ‌తాడ‌ట‌. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వ‌డ్డీ అలాగే పెరిగీ పెరిగీ చాలా పెద్ద మొత్తమే అవుతూ వ‌స్తుంద‌ట‌. అయితే ఇన్ని యుగాలైనా స్వామి మాత్రం వ‌డ్డీనే క‌డుతూ వ‌స్తున్నాడ‌ట‌. అందుకే ఆయ‌న‌కు వ‌డ్డీ కాసుల వాడ‌ని పేరు వచ్చిందని చెబుతుంటారు.


అమావాస్య నాడు హనుమంతుని ప్రార్థన అమోఘం

అమావాస్య నాడు హనుమంతుని ప్రార్థన అమోఘం అంటున్నారు పండితులు. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.

“అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వదః
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో “


అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం..
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।
అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోస్తు తే ॥ ౧॥
సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।
తాపత్రయస్య సంహారిన్నాఞ్జనేయ నమోస్తు తే ॥ ౨॥
ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే ।
ప్రాణాపహన్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ ౩॥
సంసారసాగరావర్తాగతసమ్భ్రాన్తచేతసామ్ ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తు తే ॥ ౪॥
రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూతసఙ్కులే ।
గజసింహమహావ్యాఘ్రచోరభీషణకాననే ॥ ౫॥
మహాభయేఽగ్నిసంస్థానే శత్రుసఙ్గసమాశ్రితే ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమో నమః ॥ ౬॥
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరన్త్యఞ్జనాసుతమ్ ।
అర్థసిద్ధియశఃకామాన్ ప్రాప్నువన్తి న సంశయః ॥ ౭॥
కారాగృహే ప్రయాణే చ సఙ్గ్రామే దేశవిప్లవే ।
యే స్మరన్తి హనూమన్తం తేషాం నాస్తి విపత్తయః ॥ ౮॥
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే ।
నమః ప్లవగసైన్యానాం ప్రాణభూతాత్మనే నమః ॥ ౯॥
దుష్టదైత్యమహాదర్పదలనాయ మహాత్మనే ।
బ్రహ్మాస్త్రస్తమ్భనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే ॥ ౧౦॥
జప్త్వా స్తోత్రమిదం పుణ్యం వసువారం పఠేన్నరః ।
రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జపేద్ధ్రువమ్ ॥ ౧౧॥
విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।
సర్వాపద్భ్యో విముచ్యేత నాత్ర కార్యా విచారణా ॥ ౧౨॥


మంత్రం


మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక |
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే ||
ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం ||


సుబ్రమణ్యుడే సుబ్బారాయుడిగా వెలిసిన క్షేత్రం.. 500 ఏళ్ళ క్రితం జరిగిన యదార్థ ఘటన

నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.

ఏమిటా కథ..
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు. కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని (సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు.

ఇందుకోసం స్వామివారిని వేడుకోగా ‘రాత్రి రోకలిపోటు తరువాత మొదలుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తాడు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.

ఆదివారం సెలవెందుకు
సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 – 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.

ఆ మూడు మాసాల్లోనూ అంతే..
ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.

అంత్యక్రియలకూ సెలవే…
కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.

ఎలా చేరుకోవచ్చు…
బనగానపల్లె మండలం నందివర్గం నుండి సుబ్బారాయుడు కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ నుండి ఆటో సదుపాయం ఉంటుంది.


దక్షిణాదిలో ప్రముఖ శ్రీకృష్ణుడి ఆలయాలివే

శ్రీ కృష్ణుని ఆరాధన కేవలం హిందూమతం, భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు.. విదేశాల్లో శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు, అంగరంగ వైభవంగా వేడుకలు కూడా నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమి రోజున భారతదేశంలోని ప్రముఖ కృష్ణ దేవాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే శ్రీకృష్ణుని జన్మభూమి అంటే మాత్రం చాలా మధుర, గోకుల బృందావన ఆలయాలనే భావిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో కూడా ప్రముఖ వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణుడి, వేణు గోపాల స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చారిత్రక ప్రాధాన్యం ఉండే గుళ్లు ఎన్నో ఉన్నాయి. వీలైతే వీటిని ఓసారి సందర్శిచేయండి.

శ్రీకృష్ణ మఠం, ఉడిపి

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శ్రీ కృష్ణుని ఆలయాల్లో ఉడుపి శ్రీకృష్ణ మఠం ఒకటి. ఇది కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కేంద్రంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న వేణు మాధవుడిని నవ రంధ్రాల కిటికీ నుండి మాత్రమే పూజిస్తారు. భక్తులకు కిటికీ నుండి మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఈ ఆలయం చెక్క మరియు రాతితో నిర్మించబడిందది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనులోని నీటిలో గుడి గోపురానికి సంబంధించిన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

​గురువాయుర్ దేవాలయం, కేరళ

దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనూ అనేక ప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గురువాయుర్ దేవాలయం. దీన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇది విష్ణువు యొక్క పవిత్ర నివాసంగా భావిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో వరదలు వచ్చినప్పుడు కృష్ణుడి విగ్రహం కొట్టుకుపోయిందని, దాన్ని గురువు రక్షించాడని చాలా మంది నమ్ముతారు. ఈ విగ్రహాన్ని కేరళలో గురు దేవుడు వాయు దేవుని సహాయంతో ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే కేరళలోని శ్రీ కృష్ణ దేవాలయం గురువు, వాయు దేవుని పేరు మీదుగా గురువాయుర్ ఆలయంగా మారిపోయింది.

తిరుపతిలో

కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని సన్నిధానంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉట్ల ఉత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తిరుపతికి తరలివస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున కన్నయ్య కోవెలల్లో ఘనంగా జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి కొట్టడం, గ్రామోత్సవం వంటి సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

​నాంపల్లి ఇస్కాన్ టెంపుల్

భాగ్యనగరం నడిబొడ్డున ప్రముఖ శ్రీ కృష్ణుని దేవాలయం ఉంది. నాంపల్లిలో ఉన్న ఈ దేవాలయం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు చేరువలో కూడా కృష్ణుడి పురాతన దేవాలయం ఉంది. ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్మించినది. ఈ గుడితో పాటు భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

​మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో హంసలదీవి, మొవ్వలోని వేణుగోపాల స్వామి ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హంసలదీవిలోని కృష్ణుని గుడికి వేయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యభామలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కూచిపూడి సమీపంలోని మొవ్వ క్షేత్రంలోనూ శ్రీకృష్ణుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ కన్నయ్య చేతిలోని వేణువులో గాలి ఊదే రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు స్వామి వారికి సంబంధించిన మకరతోరణంలో దశావతరాలు కనిపిస్తాయి. క్షేత్రయ్య రాసిన పదాలన్నీ శ్రీకృష్ణుడిపైనే. ఈ పుణ్యక్షేత్రం విజయవాడకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

​పార్థసారథి ఆలయం, చెన్నై

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పార్థసారథి ఆలయంలో విష్ణువుకు సంబంధించిన నాలుగు అవతారాలను పూజిస్తారు. ఇందులో కృష్ణుడు, రాముడు, నరసింహుడు, వరాహావతారాలను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయంలో అనేక మిస్టరీలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించినదిగా తెలుస్తోంది.


శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన సమాచారం

  1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
  2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)
  3. మాసం : శ్రావణం
  4. తిథి: అష్టమి
    5 . నక్షత్రం : రోహిణి
  5. వారం : బుధవారం
  6. సమయం : రాత్రి గం.00.00 ని.
    8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
  7. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)
  8. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
    11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం
  9. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
  10. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
  11. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాధ్, మహారాష్ట్ర లో విఠల (విఠోబ), రాజస్తాన్ లో శ్రీనాధుడు, గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్, ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
  12. జన్మనిచ్చిన తండ్రి – వసుదేవుడు
  13. జన్మనిచ్చిన తల్లి – దేవకీ
  14. పెంచిన తండ్రి – నందుడు
  15. పెంచిన తల్లి – యశోద
  16. సోదరుడు – బలరాముడు
  17. సోదరి – సుభద్ర
  18. జన్మ స్థలం – మధుర
  19. భార్యలు: రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
  20. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు చాణుర – కుస్తీదారు, కంసుడు – మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్ర – అత్త కొడుకులు
  21. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
  22. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీ కృష్ణుడిని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
  23. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారాల్సి వచ్చింది.
  24. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
  25. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
  26. కాలయవన అను సింధురాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
  27. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
  28. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
  29. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్లాడు.
  30. గుజరాత్‌‌లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడాు.
  31. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాడు.
  32. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యాన్ని స్థాపించేందుకు సహాయపడ్డాడు.
  33. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు.
  34. రాజ్యము నుండి వెళ్లిపోయినప్పడు పాండవులకు తోడుగా నిలిచాడు.
  35. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో మద్దతు తెలిపి విజయం వరించేటట్లు చేశాడు.
    39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూశాడు.
  36. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
  37. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
  38. జీవితములో ప్రతి వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికీ అంకితమవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
  39. శ్రీకృష్ణుడి జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

ఈ గుడిలో కృష్ణుడికి ఆకలెక్కువ.. రోజుకు 10సార్లు నైవేద్యం పెట్టాల్సిందే

హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణం వేళ దేవాలయాలన్నీ మూసివేస్తారు. కానీ అక్కడ మాత్రం గ్రహణం సమయంలోనూ ఆ గుడి తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ఆ ఆలయంలో కన్నయ్యకు పూజలు జరుపుతూనే ఉంటారు. అంతేకాదు ఆ గుడిలోని వేణు మాధవుడికి ఎడతెగని ఆకలి ఉంటుదట. రోజుకు కనీసం 10 సార్లు నైవేద్యం సమర్పిస్తే స్వామి వారు సంతృప్తి చెందరని అక్కడి పండితులు చెబుతారు. ఏ ఒక్కరోజు కన్నయ్యకు నైవేద్యం తక్కువైనా స్వామి వారి విగ్రహం సైజు తగ్గిపోతుందట. ఈ ఆలయంలో ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని రహస్యాలు అలాగే మిగిలిపోయాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఆలయం ఎక్కడుంది.. గోపాలుని గుడిలో ఇక్కడ ఏమేమీ వింతలు.. విశేషాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంలో అందరూ కృష్ణాష్టమి వేడుకలను ఉట్టిని పగులగొట్టి.. గ్రామోత్సవాలు, చిన్ని కృష్ణుడిని అందంగా అలంకరించి వేడుకలను జరుపుకుంటారు. కానీ అక్కడ మాత్రం చాలా విభిన్నంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. కన్నయ్య కొలువైన ఉన్న ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరపులో ఉంది. కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఆంధ్రా, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా కొచ్చి లేదా కొట్టాయానికి చేరుకుంటే ఆలయానికి వెళ్లేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి.

ఇక్కడ కొలువైన కన్నయ్యకు ఎడతెగని ఆకలి ఉంటుందట. ఈ గుడిలోని గోపాలుని విగ్రహానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. ఈ గుడిలోని కన్నయ్య విగ్రహానికి ప్రతిరోజూ కనీసం 10సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ ఓ పాత్రలో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గిపోతుందని భక్తులు కూడా చెబుతారు. అందుకే ఇది అనేక రహస్యాలున్న ఆలయంగా పరిగణించబడుతుంది.

​గ్రహణం వేళ..

ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే.. గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచుతారు. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. సాధారణంగా గ్రహణం వేళ అన్ని గుళ్లను మూసివేస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు.

​విగ్రహం సైజు తగ్గుదల..

పురాణాల ప్రకారం, కృష్ణుని మేనమామ కంసుడిని వధించిన తర్వాత ఎడతెగని ఆకలితో ఉన్నాడని.. అందుకే ఇక్కడి విగ్రహం ఆకలితో బాధపడుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఇక్కడి గుడిలో స్వామివారికి నైవేద్యం సమర్పించడంలో కొంచెం లేటైనా కూడా విగ్రహం సైజు తగ్గిపోవడం ప్రారంభమవుతుందట.

ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజూ కేవలం రెండు నిమిషాల పాటే ఆలయం తలుపులను మూసివేస్తారు. అంటే 11:58 గంటలకు మూసేసి.. సరిగ్గా 12 గంటలకు తెరుస్తారు. ఇక్కడి శ్రీ కృష్ణుని విగ్రహం కేవలం రెండు నిమిషాలు మాత్రమే కునుకు తీస్తుందని చెబుతారు. మరోవైపు గుడికి సంబంధించిన తాళాలతో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ తాళాలతో తలుపులు తెరచుకోకపోతే గొడ్డలిని ఉపయోగించి తలుపులను పగులగొట్టి గుడిని తెరవొచ్చు. ఇలా చేయడానికి పూజారికి అనుమతి కూడా ఉంది. ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుండి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు.


శ్రీకృష్ణ జన్మాష్టమి… శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి, హిందూ ఇతిహాసాలలో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు.. వసుదేవుడి భార్య అయిన దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదేరోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ౹
బంగారు మొలతాడు పట్టుదట్టి౹
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు౹
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు౹౹

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, స్వామికి నైవేద్యం పెడతారు. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి, పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినమనికూడా వివరించింది.

దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్ధేశం చేశారు శ్రీ కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం, కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింప జేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమ శివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని “నమశ్శివాయ” అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు. ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. కృష్ణుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు. అప్పుడు కృష్ణుడు 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు. తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.

ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి. తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి. తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి. వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.

“నమశ్శివాయ” మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి. అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది. లోక కళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు…


కాకులు ఎగరని ప్రాంతం.. రంకె వేసే బసవన్న.. ఎన్నో విశేషాల ‘యాగంటి’ పుణ్యక్షేత్రం

శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఈ గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది. సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి.

యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి “యాగంటి బసవన్న” అని పేరు. ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యే నాటికి ఇక్కడి బసవన్న లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.

యాగంటి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారట. అయితే విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వరస్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

అగస్త్య పుష్కరిణి
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరిణి లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది.ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని రాశారు.

యాగంటి గుహాలయ దృశ్యం

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనే ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించి శిష్యులకు ఙ్ఞానోపదేశం చేసారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.ః

యాగంటి బసవన్న
ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

కాకులకు శాపం
యాగంటిలో కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

ఆలయ దర్శన వేళలు
ఉదయం 6:00 నుండి 11:00 వరకు, సాయంత్రం 3:00 నుండి 8:00 వరకు

ఎలా వెళ్లాలి…
ఈ క్షేత్రం కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగానపల్లిలో వసతులున్నాయి.


అగ్నిని స్నానంగా స్వీకరించే ‘ఇడాణ మాత’.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాణ మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొనివున్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని, ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన, ఈ ఆలయం, చతురాస్రాకరంలో ఉంది. ఇడాణ ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరుమీద ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది.

ఇక్కడ ఉన్న ఇడాణమాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతుంటారు. మంట, దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతీ వస్తువు, అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు, భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. ఎంతోమంది ఎన్నో రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఎవరూ ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు.

ఆలయంలో మంట మండుతున్నప్పుడు, అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనంకాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతుంటారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా, ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఈ మంటలను ప్రత్యక్షంగా చూసినవారికి సకల పాపాలు హరించి, అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం. ఈ ఆలయానికి ఉన్న, ప్రత్యేక గుర్తింపువల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తికోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంతకాలం ఇక్కడకు భక్తులు భారీసంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలా దేవి రూపాన్ని ఆవహించిందని ఇడాణ దేవాలయంలో పుజారులు చెబుతున్నారు.

ఈ ఆలయంలో వచ్చేమంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట. ఇక్కడకు వచ్చే భక్తులు, అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేకపూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం.