Category Archives: Spiritual

శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?

ఏకలవ్యుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు, అతనికి గొప్ప చరిత్ర ఉంది. అతని గాథ ఇప్పటికీ చాలా మందికి ఆదర్శం. గాండీవదారి అయ్యి కురుక్షేత్ర యుద్ధాన్ని తన విలువిద్య ప్రభంజనంతో శాసించిన అర్జునుడినే మించిన వాడిగా చరిత్ర పుటల్లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఏకలవ్యుని గురించి చాలా విషయాలు నేటి తరం వారికి తెలియదు. ఇంతకీ అసలు ఏకలవ్యుడు ఎవరు?.. ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి ఎందుకు శిష్యుడుగా తిరస్కరించాడు? అతను అంతటి విలువిద్య ఎలా సాధించాడు? తన బొటనవేలు ద్రోణాచార్యుని కి ఇవ్వడానికి గల అసలైన కారణం ఏమిటి? ఆ తర్వాత ఏకలవ్యుడు ఏమైపోయారు? అతనికి కృష్ణుడికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలుసుకుంటాం..

ఏకలవ్యుడి గురించి తెలియాలి అంటే ఒకసారి మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏకలవ్యుడు నిషాద కులంలో హిరణ్యధన్యుడు, సులేఖ అనే దంపతులకు జన్మించాడు, నిషాద కులస్తులను ఈ కాలంలో ఎరుకల వారిగా, బోయవారిగా పిలుస్తున్నారు. వీరు ప్రధానంగా అడవిలో జీవిస్తూ అక్కడే ఆకులూ, అలములూ, దుంపలను తింటూ వన్యప్రాణులను వేటాడే జీవనం సాగిస్తారు. వీరి ఆహారంలో అధిక భాగం జంతువుల వేట వల్లనే వస్తుంది, అందువల్ల ఈ కులం వారు విలువిద్యలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు.

ఈ నిషాద కులానికి రాజు ఏకలవ్యుడి తండ్రి అయిన హిరణ్యధన్యుడు, తొలుత ఏకలవ్యుడు తన తండ్రి వద్దనే విద్య నేర్చుకున్నాడు అయితే హిరణ్యధన్యుడు జరాసంధుడి వద్ద సామంత రాజుగా ఉండేవాడు దానివల్ల జరాసంధుడు చేసే యుద్దాలలో పాల్గొని ఒక దానిలో వీరమరణం పొందాడు. తండ్రి మరణించడం వల్ల ఏకలవ్యుడు వారి తెగకు చిన్న వయసులోనే రాజయ్యాడు. అయితే తండ్రికి ఉన్న బుద్ధి కుశలం, వేటకి వెళ్ళినప్పుడు అడవి మృగాల నుంచి తన వారిని కాపాడుకునే అంత నేర్పరితనం, విద్య అంత చిన్న వయసులో ఏకలవ్యుడు వద్ద లేకపోవడం వల్ల తనకి సకల విద్యలు నేర్పగల గురువు గురించి వెతుకుతున్న సకల విద్యా పారంగతుడు విలువిద్యలో ఎదురులేని పరాక్రమశీలి అయిన ద్రోణాచార్యులు గురించి తెలుసుకొని అయన వద్దకి వెళ్లి తనకి కూడా సకల శాస్త్ర విద్యలను నేర్పమని అడిగాడు. ఏకలవ్యుడి కోరికను ద్రోణాచార్యుడు తిరస్కరించాడు, ఆ తిరస్కారానికి కారణం అడగగా నేను కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాను, నీవు నిషాధ తెగకు చెందిన వాడవు, కాబట్టి నీకు నేర్పలేను అని బయటకు చెప్పిన ద్రోణుడు, ఏకలవ్యుడి ప్రవర్తనలో ఏదో దోషం కనిపించింది అందువల్లనే ఆ క్షణంలో ద్రోణుడు ఏకలవ్యుడు నేర్పించడానికి సుముఖత చూపించలేదు.

అయితే ద్రోణుడి శాస్త్ర విద్య కౌశలానికి ముగ్ధుడయిన ఏకలవ్యుడు ద్రోణుడినే తన గురువుగా భావించి అడవిలో బంకమట్టితో ఆయన విగ్రహం ఒకటి చేసుకుని ఆ బొమ్మే తనకు విద్య నేర్పుతుందని భావించి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ద్రోణుడు కురు పాండవులను పిలిచి అడవిలోకి వెళ్లి సరదాగా వేటాడమని, వేటనే క్షత్రియులకు ఆటవిడుపు అని చెప్పి పంపాడు. అయితే అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు పరిగెత్తే అడవి జంతువులను బాణంతో గురిచూసి కొట్టడం వల్ల వారి విలువిద్య నైపుణ్యం పెరుగుతుందని అనేది ఇక్కడ ఆయన ఉద్దేశ్యం, ఆయన మాటే పరమావధిగా కురుపాండవులు కొంతమంది సైన్యంతో వేట కుక్కలతో అడవిలోకి వేటకి వెళ్లగా అడవిలోనే ఒకచోట విలువిద్య సాధన చేసుకుంటున్న ఏకలవ్యునిమరియు వింత ఆకారాన్ని చూసి ఒక కుక్క మొరగడం మొదలుపెడుతుంది.

తనను చూసి మొరుగుతుంది కోపంతో ఆ కుక్క తెరిచిన నూరు మూసుకుని లోపు ఏడు బాణాలను ఏకకాలంలో సంధించి దాని నోరు కదపకుండా చేశాడు, దానితో కుక్క మూలుగుతూ కురుపాండవుల వద్దకు రాగా ఆ కుక్కకు పట్టిన గతికి కారణం ఏంటో అన్వేషిస్తూ దానితోపాటు వెళ్ళిన భటుడిని అక్కడ జరిగిన వృత్తాంతాన్ని ద్రోణుని మట్టి బొమ్మ ని గురించి చెప్పాడు. అప్పటివరకు విలువిద్యలో అత్యంత పరాక్రమశాలి అయిన అర్జునుడు ఏక కాలంలో ఐదు బాణాలను మాత్రమే స్పందించగలరు, కానీ ఏకలవ్యుడు ఏడు బాణాలను స్పందించడంతో అక్కడి వారు ఆశ్చర్య పోవడం తో పాటు కౌరవులు అర్జునుడిని హేళన చేశారు. దాంతో అర్జునుడు ద్రోణుడి వద్దకు వెళ్లి అడవిలో జరిగిన వృత్తాంతాన్ని వివరించి అదే సమయంలో ద్రోణుడు ఒక నాడు ప్రపంచంలో నీకంటే సమర్థుడైన విలుకాడు ఉండనంత విధంగా విలువిద్య నేర్పుతానని అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తు చేసాడు. దాంతో ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు తాను ఎవరికీ అంతటి విద్యను నేర్పలేదని, అయినా తన పేరుతో అంత విద్యను నేర్చుకున్నా వ్యక్తిని చూడాలని నిశ్చయించుకొని ద్రోణుడు ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళాడు, తాను వెళ్లేముందు కుక్కకు జరిగిన దుస్థితిని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు సంతోషపడి ద్రోణుడికి సన్మానం చేసి తన భక్తిని చూపెట్టాడు.

అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని తో ‘ఏకలవ్య నీవు నేనే నీ గురువు అని చెబుతున్నావు కదా, మరి నా గురుదక్షిణ ఏది అని అడగగా దానికి ఏకలవ్యుడు తప్పకుండా గురువర్యా నా సంపద కాని నా దేహ ప్రాణాల లో ఏది కావాలన్నా చెప్పండి అంటాడు. అది మీకు వెంటనే సమర్పించుకుంటాను అని పలికాడు, అప్పుడు ద్రోణుడు వెంటనే నీ కుడి చేతి బొటన వేలుని ఇవ్వమని అడగగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బొటన వేలుని కోసి గురుదక్షిణగా ద్రోణాచార్యుని కి ఇచ్చాడు ఏకలవ్యుడు. ద్రోణుడు చేసిన ఈ పనికి భాగవతంలో ఒక వివరణ కూడా ఇచ్చారు. ఏకలవ్యుడు ఎంత గొప్పవాడైనా కాలక్రమంలో అధర్మం వైపు నిలబడి యుద్ధం చేయడం వల్ల ఎంతో అనర్థం జరుగుతుందని భావించిన ద్రోణుడు విలువిద్యకి ఆయువు పట్టు అయిన బొటనవేలును ఇవ్వమని కోరినట్లు భాగవతం చెబుతుంది.

బొటనవేలు పోయినా ఏకలవ్యుడు మిగిలిన నాలుగు వేళ్ళతో బాణాలను సంధించడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు, అయితే ద్రోణుడు అనుకున్నదే నిజమైంది. ఏకలవ్యుడు ధర్మం వైపు మొగ్గు చూపకుండా అధర్మం వైపు మొగ్గుచూపి ఏకలవ్యుడు జరాసంధునికి మద్దతుగా నిలిచాడు. జరాసంధునికి ఏకలవ్యుని శక్తిసామర్థ్యాలు మీద అపార నమ్మకం అయితే జరాసంధునికి శ్రీకృష్ణునికి ఉన్న వైరం వల్ల జరాసంధుడు చాలాసార్లు కృష్ణుని మీదకి సేనలను పంపాడు కానీ ఏనాడు గెలవలేక పోయాడు ఆ సమయంలో సకల శాస్త్ర విద్య పారంగతుడు అయిన ఏకలవ్యుడిని శ్రీకృష్ణుడి సేనలపైకి పంపాడు.

ఏకలవ్యుడి ధనుర్విద్య నైపుణ్యానికి యాదవ సేనలు పిట్టలు రాలినట్టుగా రలి పోతుంటే అది తెలుసుకున్న కృష్ణుడు తానే స్వయంగా కదన రంగం లోకి వచ్చి ఏకలవ్యుడిని మట్టు పెట్టాడు, అంతటితో ఒక మహావీరుని అధ్యాయం ముగిసింది. ద్రోణుడు కాదన్నా పట్టుదలతో గురువు లేకుండా అపార విలువిద్య నేర్చుకొని పట్టుదల గల వ్యక్తిగా ద్రోణుడు అడిగిన వెంటనే క్షనమయిన ఆలోచించకుండా తన బొటన వేలుని కోసి ఇచ్చి గురు భక్తిని చాటి చాటుకున్న వ్యక్తిగా మహా వీరుడిగా పేరుగాంచిన ఏకలవ్యుడు ధర్మ అధర్మ విచక్షణ లేక అధర్మం వైపు మొగ్గు చూపి చూపడం వల్ల ఆఖరికి కృష్ణుడి చేతిలో మరణించక తప్పదు తప్పలేదు.


విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు

సాధారణంగా ఏ గర్భగుడిలో అయినా భక్తులకు ప్రవేశం ఉండదు. కానీ ఈ కనకమహాలక్ష్మి ఆలయంలో మాత్రం భక్తులే నేరుగా అమ్మవారిని పూజించొచ్చు. ఓ వస్తువు లేదా కాసు బంగారం కొన్నా సరే… అమ్మవారికి నివేదించడం, అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని ఈ గుడికి తీసుకురావడం… వంటివన్నీ ఈ ఆలయంలో కనిపిస్తాయి. భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకుంటున్న కనకమహాలక్ష్మి ఆలయం విశాఖపట్నం పాత నగరంలోని బురుజుపేటలో ఉంటుంది. ఈ ఆలయంలోని గర్భగుడికి పైకప్పు ద్వారాలు ఉండవు. ఎవరైనా నేరుగా గర్భగుడిలోకే వెళ్లి అమ్మవారిని పూజించొచ్చు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారికి ఎడమచేయి ఉండదు.

స్థల పురాణం
పూర్వం ఈ రాజ్యాన్ని పాలించిన విశాఖ రాజులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలిచేవారు. ఇక్కడ వారి కోట బురుజు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి బురుజుపేట పేరు వచ్చిందని అంటారు. ఓసారి శత్రువులు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు విశాఖ రాజులు తమ ఇలవేల్పును భద్రపరిచే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో వదిలేశారట. ఇది జరిగిన కొన్నాళ్లకు కాశీకి బయలుదేరిన ఓ బ్రాహ్మణుడు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ ప్రాంతంలో ఆగాడట. స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో అమ్మవారు తన ఉనికిని తెలియజేసి బావి నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించమని చెప్పిందట. అయితే కాశీకి వెళ్లే తొందరలో ఆ బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించి తన ఎడమచేతిలో గల ఫరిఘ అనే ఆయుధంతో అతణ్ని సంహరించేందుకు సిద్ధమవ్వడంతో ఆ బ్రాహ్మణుడు శివుడిని శరణుకోరాడట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించేందుకు దేవి ఎడమ చేతిని మోచేయి వరకు ఖండించాడట. అలా ఆమెలోని ఆగ్రహం మాయమై శాంత స్వరూపిణిగా మారిపోయింది. ఆ తరువాత ఆమె కనకమహాలక్ష్మిగా పూజలు అందుకుంటుందని చెప్పి శివుడు అంతర్థానమయ్యాడట. అలా అమ్మవారు బురుజుపేటలో రోడ్డు మధ్యలో వామహస్తం లేకుండానే వెలసి పూజలు అందుకుంటోందని కథనం.

అయితే1917 ప్రాంతంలో ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఓ మూలకు జరిపారు. ఆ తరువాత ఇక్కడ ప్లేగువ్యాధి ప్రబలి చాలామంది చనిపోవడంతో… ఇందుకు కారణం అమ్మవారి విగ్రహాన్ని జరపడమేనని భావించిన భక్తులు మళ్లీ దేవి విగ్రహాన్ని రోడ్డుమధ్యలోనే ప్రతిష్ఠించారట.ఆ తరువాతే ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని చెబుతారు. కనకమహాలక్ష్మిని సేవించే విషయంలో ఎలాంటి వివక్షా ఉండకూడదనే ఆలోచనతోనే ఆలయానికి వచ్చే భక్తుల్ని గర్భగుడిలోకీ అనుమతిస్తారు. అలా వచ్చే భక్తులు అమ్మవారిని నేరుగా పసుపు-కుంకుమలతో పూజించి, కొబ్బరికాయల్ని కొట్టి నివేదించుకుంటారు. దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక.. గర్భగుడి పై కప్పు, ద్వారాలు నిర్మించేందుకు ప్రయత్నించినా విఫలం కావడం వల్ల ఆ ఆలోచననూ విరమించుకున్నారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. అందుకే గర్భగుడి పైకప్పును కొబ్బరిమట్టలతో కప్పి ఉంచుతారు. తలుపులకు బదులు కర్టెన్లు ఉంటాయి.

కనకమహాలక్ష్మిని చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ ఇలవేల్పుగా భావిస్తారు. అందుకే అప్పుడే పుట్టిన పసిబిడ్డల్నీ, కొత్తగా కొన్న వాహనాలనూ, బంగారాన్నీ మొదట అమ్మవారి వద్దకే తీసుకొస్తారు. దగ్గర్లోని బంగారం దుకాణాల యజమానులు సైతం తాళంచేతుల్ని అమ్మవారికి చూపించి మరీ తీసుకెళ్తుంటారు. దేవికి రోజువారీ చేసే పూజలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లోనూ విశేష పూజా కార్యక్రమాలను జరిపిస్తారు. ముఖ్యంగా మార్గశిరమాసంలోనే విగ్రహం వెలుగు చూడటం వల్ల ఇక్కడ ఏటా మార్గశిరంలో నెలరోజులపాటు అంగరంగవైభవంగా మాసోత్సవాలను నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవచ్చంటే…
ఈ ఆలయం విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా విశాఖపట్నం వరకూ విమానం, రైలు, బస్సుల్లో చేరుకోవచ్చు. విమానాశ్రయం నుంచి ఆలయానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.


మార్గశిర మాసం – ముక్తికి మార్గం

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.
భగవద్గీతలోని విభూతియోగంలో – “మాసానాం మార్గశీర్షం” అంటే మాసాల్లో తాను మార్గశిర మాసానని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు. బ్రహ్మ ముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం, సంధ్యా వందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి.

అందుకే…. మార్గశిర మాసంలో – ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో… “ఓం నమో నారాయణయ” అనే మంత్రాన్ని స్మరించాలి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని, ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.

మార్గశిర శుద్ధ షష్ఠి ‘స్కంద షష్ఠి’.. శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి ‘వైకుంఠ ఏకాదశి’. దీన్నే ‘మోక్ష ఏకాదశి’ అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి… “గీతాజయంతి”. సమస్తమానవాళికి ధర్మ నిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు. ఈ “దత్తాత్రేయ జయంతి”ని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమ నాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు “హనుమద్‌ వ్రతం”, “మత్స్య ద్వాదశి”, “ప్రదోష వ్రతం”* ఆచరించడం పరిపాటి. ఈ మాసంలోనే…. అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రమణ్యషష్టి, పరశురామ జయంతి, సంకటహర చతుర్ధి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫలా ఏకాదశి, కృష్ణ (మల్ల) ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం తదితర పండుగలు వస్తాయి.

పెద్దలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే… మార్గశిరం తరువాత వచ్చే పుష్య మాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం , ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రహ్మ ముహూర్తం లాంటిది అని తెలుస్తుంది. బ్రహ్మ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగిందో , సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రహ్మ మహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో , అదే విధంగా దేవతలకు బ్రహ్మ ముహూర్తమైన ఈ మాసమంతా దేవతలు , ఋషులు , యోగులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం , కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మివారం (గురువారం) , మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి. ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది.


పశుపతినాథ్ దేవాలయం – నేపాల్

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భువ్యతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే..


అని శివుడుని కొలుస్తారు భక్తులు. అసలే బోళా శంకరుడు ఆపైన భక్తుల కోసమే వెలసిన మహాదేవుడు. అలాంటి శివదేవుడి ప్రఖ్యాత క్షేత్రాల్లో.. నేపాల్ దేశంలోని పశుపతి నాథ్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఇంతకీ ఈ నేపాల్ దేవుడి విశిష్టతలేమిటి? ఇక్కడీ శివుడెలా వెలిశాడో తెలుసుకుందాం…

శివుడంటే పిలిస్తే పలికే దైవం…శివుడంటే అభయంకరుడు. భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభోశంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు. ఉండేది లింగాకారం. మహత్యం చూపడంలో అనంతాకారం. శివుడ్ని కొలిస్తే ఆపదలు మటుమాయం. శివుడి గురించి విన్నా.. కొలిచినా.. స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు. శివుడంటే కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే శక్తి స్వరూపుడు.

పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని కాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలవబడుతున్నాడు. యునెస్కో ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా కొనసాగుతున్న ఈ దేవాలయానికి నిత్యం దేశ విదేశాలనుంచీ వేలాది మంది భక్తులు వస్తుంటారు. సుప్రసిద్ధ 275 శైవక్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి. ఇతర మతస్థులు పశుపతిని దర్శించాలంటే భాగమతి నదీ తీరం నుంచి చూసి తరించాల్సిందే. ప్రపంచంలో హైందవ దేశం ఏదైనా వుందంటే అది నేపాల్ అన్న పేరుంది. నేపాళీయులకు పశుపతి అంటే ఎంతో భక్తి.

పరమేశ్వర అంశతో భువిపై జన్మించిన ఆదిశంకరుడు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం.. పశుపతి పూజలు జరుగుతాయి. దక్షిణ భారతదేశానికి చెందిన పూజారులే పశుపతినాథ్‌కు నిత్యం పూజా కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే నేపాల్ సంప్రదాయం ప్రకారం రాజు మరణించినప్పుడు ఇక్కడి ప్రజలకు శివ పూజలు చేసే అర్హత వుండదు. రాజును తండ్రిగా భావించడం ఇక్కడి వారి ఆచారం. దాని ప్రకారం పశుపతి నిత్య పూజలకు ఆటంకం ఏర్పడుతుంది. తమకెంతటి కష్టం కలిగినా.. పరమేశ్వరుడి నిత్యకైంకర్యాలకు లోపం రానివ్వకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు నేపాలీయులు.

ఆదిశంకరుడు కొలిచిన పశుపతినాథ తత్త్వం.. అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి.. దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరా భారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు. పశుపతినాథ్ ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో స్పష్టమైన కాలం తెలీదు. కానీ కొన్ని శాసనాల ప్రాకారం ఆలయనిర్మాణం గురించిన వివరాలు దొరుకుతాయి.

చారిత్రక ఆధారాల ప్రకారం… క్రీస్తు శకం 753వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. శుశూపదేవ మహారాజు అధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11జయదేవ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. 1416వ సంవత్సరంలో.. రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని అంటారు. 1697వ సంవత్సరంలో రాజాభూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నించాడని తెలుస్తోంది. ఖాట్మండులో పశుపతినాథుడు లింగాకారంలో దర్శనమివ్వడానికి కొన్ని ఇతిహాస కథనాలు ప్రచారంలో వున్నాయి.

గో ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి భాగమతీ తీరాన విహరిస్తుండగా దేవతలు ఆ కొమ్ము పట్టుకున్నారు. అప్పుడా కొమ్ము విరిగింది. దాన్నిక్కడ పూడ్చి పెట్టారు. తర్వాతికాలంలో ఆ కొమ్ము లింగాకారంలోకి రూపాంతరం చెందింది. అక్కడి భూమి లోపలున్న లింగాన్ని గుర్తించి ఒక ఆవు తన పాలనక్కడ కురిపించింది. ఆ వింత చూసిన పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా ఒక శివలింగం బయట పడిందట. అదే పశుపతినాథ లింగమని చెబుతారు.


ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక విచిత్రమైన శివలింగం

ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగంపై ఒక చేత్తో పశువును,మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీన్ని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి.

చోళ, పల్లవ, గంగ పల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్‌సైట్‌లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.

గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుంచి 2008 వరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్కియాలజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్దం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు. ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు.

గతంలో ఎప్పుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు ,మరి కొన్ని శిల్ప,కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు.

ప్రపంచంలోని ఏడు వింతలకు పదిమెట్లు పైనుండే ఈ శివలింగం కాల ప్రభావాన్ని సవాలు చేస్తూ అనేక సంవత్సరాలు చెక్కుచెదరకుండా అచంచలంగా నిలిచి ఉంది. ఎపుడో భూమి మీద వశించి గతించి పోయిన ఒకానొక మానవ సమాజపు సామూహిక ధార్మిక అలౌకిక విశ్వరూపం. ఈ క్షేత్రం రేణిగుంట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఏడాదిలో 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వరాలయం

ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం … నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

పురాణ గాథ
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన కుమార్తె, శివుడి భార్య అయిన సతీదేవిని అవమానించడంతో… ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సంగమేశ్వరాలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా… అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.

అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో మునిగివుండడమే దీనికి కారణం. ఏడాదిలో సుమారు 8 నెలలు ఈ ఆలయం నీటిలోనే మునిగి ఉంటుంది. అయినప్పటికీ వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.

ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.

ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది. మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

ఎలా చేరుకోవాలి
కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘మచ్చుమర్రి’ గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపుల్లో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్టీసీ వారు బస్సులు నడుపుతారు. తెలంగాణ ప్రజలు మహబూబ్‌నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.


కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా…

ఈ ఏడాది చిట్టచివరి గ్రహణం నవంబరు 8న గురువారం కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతోంది. ఇది చంద్రగ్రహణం కాగా.. ఈ ఏడాదిలో ఏర్పడుతున్న రెండో చంద్రగ్రహణం. దీపావళి మర్నాడు సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే ఈ గ్రహణం ఏర్పడుతుండటం విశేషం. అంతేకాదు, ఈ ఏడాది ఏర్పడిన నాలుగు గ్రహణాలు రెండు వారాల వ్యవధిలోనే రావడం చెప్పుకోదగ్గ అంశం. రెండో చంద్రగ్రహణం భారత్‌తో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మూడేళ్ల తర్వాత 2025 మార్చి 14న ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

నవంబర్ 8, 2022న చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి ఎరుపు రంగులోకి మారతాడు.. దాదాపు 3 సంవత్సరాల తర్వాతే ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం నవంబరు 8న వివిధ ప్రాంతాల్లో స్థానిక కాలమానం ప్రకారం కనువిందు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30 గంటలకు వరకూ కొనసాగుతోంది. భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకూ 45 నిమిషాల 48 సెకెన్లు దర్శనమివ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

గ్రహణం ప్రారంభమైన దాదాపు గంట తర్వాత 3.46 గంటలకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. సాయంత్రం 4.29 గంటలకు దాని ప్రభావం పూర్తిగా కనపడుతుంది. ఇలా 5.11 గంటల వరకూ సాగుతుంది. అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి కక్ష్య నుంచి భూమి తప్పుకోవడం మొదలై సాయంత్రం 6:19 గంటలకు గ్రహణం ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉంది. భూమి నీడ లోపల చంద్రుని భాగం భూమి వాతావరణం ద్వారా వక్రీభవన సూర్యకాంతి, ఎర్రటి రంగు ద్వారా మాత్రమే ప్రకాశిస్తుంది. ఇంత సుదీర్ఘకాల చంద్ర గ్రహణం ఏర్పడటం 580 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చు. ఎటువంటి పరికరాలు అవసరం లేదని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో ఎర్రగా మారిన చంద్రుడ్ని చూడొచ్చు.


కార్తీక పౌర్ణమి.. జ్వాలాతోరణ మహత్యం

కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ..


‘కార్తికవేళ భీమశంకరుని నగరమందు
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు’’

అంటాడు.

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమ లోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తిక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి.

దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే… -‘‘శివా! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.


కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలో తెలుసా?

కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి గాని ఇంటిలో తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ 365 వత్తులను వెలిగిస్తూ ఉంటాం. ఐతే చాలా మందికి 365 వత్తులను ఎందుకు వెలిగిస్తారో తెలియదు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమిగా పేర్కొనబడింది. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.

కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.

నిత్యం ఇంటిలో ధూప,దీప నైవేద్యాలను పెడితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతుందని నమ్మకం. అయితే మనకు సంవత్సరంలో ప్రతి రోజు దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కొన్ని రోజులు దీపం పెట్టటానికి వీలు కాకపోవచ్చు. అందువలన కార్తీక మాసంలో పౌర్ణమి రోజు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని వత్తులను కలిపి ఆవునేతితో తడిపి ఒక కట్టగా వెలిగిస్తాం. ఇలా పౌర్ణమి రోజు 365 ఒత్తుల కట్టను వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల మన పెద్దలు కార్తీక పౌర్ణమి రోజు తులసి లేదా ఉసిరి చెట్టు కింద లేదా శివాలయంలో 365 వత్తుల కట్టను వెలిగించే సంప్రదాయాన్ని పెట్టారు.

కార్తీక పౌర్ణమి శ్లోకం
‘కార్తిక’ మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది. కార్తీక మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు. అలా వెలిగించిన దీపంలో దామోదరుని ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః

చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. కార్తీక మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా పుణ్య ప్రదమే.

కార్తీక పౌర్ణమి నాడు బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ…


”సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపచ్చుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ”

అనే శ్లోకం పఠించాలి.

దీపం జ్యోతి పరబ్రహ్మ:” దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. ఈ దీపదానం కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది. ఎవరైతే దీప దానం చేస్తారో వారి పాపాలన్నీ నశించిపోతాయని వశిష్ఠ వచనం. ఒక ఒత్తితో దీపదానం సద్భుద్ధిని, తేజస్సుని ఇస్తుంది. నాలుగు వత్తుల దీపదానం రాజ సమానులను చేస్తుంది. పదివత్తుల దీపదానం రాజకీయ సిద్ధినిస్తుంది. 50 వత్తుల దీపదానం దేవత్వాన్నిస్తుంది. వెయ్యి వత్తుల దీపదానం ఈశ్వర కృపకు పాత్రుల్ని చేస్తుంది. వెండి, ప్రమిదలో పైడిపత్తి వత్తులు వేసి, ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని దానం చేయడంవల్ల వచ్చే పుణ్యం అనంతమైనదిగా, వెండి ప్రమిదలో బంగారు వత్తులు వేసి, దానం చేస్తే జన్మరాహిత్యం పొందుతారని మన పురాణాలు తెల్పుతున్నాయి.


కాశీ క్షేత్రం గురించి తెలుసుకోవలసిన అద్బుత విషయాలు

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉండే ఎన్నో విశేషాల సమూహం కాశి. కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. స్వయంగా శివుడు నివాసముండే నగరం. ప్రళయ కాలంలోనూ మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి.

కాశీ భువిపైనున్న సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ ద్వాదశ జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం అతి ముఖ్యమైనవి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమబాధలు, పునర్జన్మ ఉండవని అంటారు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది. డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

కాశీలోని కొన్ని వింతలు…

కాశీలో గ్రద్దలు ఎగరవు.. గోవులు పొడవవు.. బల్లులు అరవవు.. శవాలు వాసన రావు..కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీ లో అనేక పరిశోధనలు చేసి ఆశ్చర్య పోయ్యారు.

కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉంది.

కాశీ ఘాట్లు

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని…..


దశాశ్వమేధ ఘాట్
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతుంది.

ప్రయాగ్ ఘాట్
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా, సరస్వతి నదులు కలుస్తాయి.

సోమేశ్వర్ ఘాట్
చంద్రుని చేత నిర్మితమైనది.

మీర్ ఘాట్…
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

నేపాలీ ఘాట్…

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

మణి కర్ణికా ఘాట్…
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

విష్వేవర్ ఘాట్…
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

పంచ గంగా ఘాట్…
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

గాయ్ ఘాట్…
గోపూజ జరుగుతుంది.

తులసి ఘాట్…
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది ఇక్కడే.

హనుమాన్ ఘాట్

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం ఉంది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

హరిశ్చంద్ర ఘాట్…
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది.

మానస సరోవర్ ఘాట్
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

నారద ఘాట్..
ఇక్కడ నారదుడు లింగం స్థాపించాడు.

చౌతస్సి ఘాట్…
స్కంధ పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేశారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

రానా మహల్ ఘాట్…
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుడిని చేసుకున్నాడు.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.
నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

కాశీ స్మరణం మోక్ష కారకం…