Category Archives: Spiritual

ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ఎందుకింత విశిష్టత?

హిందూ మతంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా విష్ణువుకు మాత్రమే పరిమితమైన ధనుర్మాసం దాని చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. పుష్య నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసాన్ని శనికి సంబంధించినది కాబట్టి శూన్యమాసం అంటారు. ప్రాపంచిక, ధనుర్మాసం ప్రకారం, ధనుర్మాసాన్ని శూన్యమాసం లేదా కర్మగా పరిగణిస్తారు. ధనుస్సు రాశిని కొన్ని ప్రాంతాలలో అరిష్టంగా పరిగణిస్తారు. మన హిందూ క్యాలెండర్‌ను ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయ పుణ్యకాలంగా విభజించారు. మన వయస్సు ,దేవదూతల కాలక్రమం మధ్య వ్యత్యాసం ఉంది. దేవదూతల ఒక రోజు మనకు ఒక సంవత్సరం. ఈసారి ధనుర్మాసం 2021 డిసెంబర్ 16న ప్రారంభమై 2022 జనవరి 13న ముగుస్తోంది.

సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడము అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్‌ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళ కరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది.

ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యా వందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి.

ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గులతో కనుల విందుగా వుంటాయి.

ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంభారాలతో పల్లెలు “సంక్రాంతి “పండుగ కోసం ఎదురుచూస్తూ వుంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మ హూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వ్రచనం.


భూలోక వైకుంఠం… శ్రీరంగం

కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతికరమైనదో… మార్గశిరం విష్ణుమూర్తికి అంత పవిత్రమైనదని భక్తుల విశ్వసిస్తుంటారు. ‘మార్గశిరం అంటే నేనే’ అని సాక్షాత్తూ విష్ణుమూర్తి భగవద్గీతలో పేర్కొన్నాడట. అందుకే ఈ మాసంలో వైష్ణవ దివ్యదేశాల్లో ప్రధానమైనదిగానూ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగానూ పేరొందిన శ్రీరంగనాథుడి దర్శనం పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు. ఆ సందర్భంగా ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షిస్తే… ఉభయ కావేరీ నదుల మధ్య రూపుదిద్దుకున్న ద్వీపంలో సప్త ప్రాకారాలతో పదిహేను గోపురాలతో విలసిల్లే భూలోక వైకుంఠమే శ్రీరంగం… శ్రీరంగనాథస్వామి ఆలయం. దీన్నే తిరువరంగం అనీ పిలుస్తారు.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది శ్రీరంగం. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా అవతరించిన ఎనిమిది ప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లోనూ, 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ ఇదే ప్రధానమైనది. శ్రీరామ, శ్రీకృష్ణావతారాలకు క్షీరాబ్ధినాథుడు మూలమనీ, అర్చావతారాలకు శ్రీరంగనాథుడే మూలమనీ వైష్ణవుల విశ్వాసం. ఆళ్వారులు కీర్తించిన దివ్యదేశాల్లోనూ ఇదే కీలకమైనది. అందుకే వాళ్ల దివ్య ప్రబంధాలతో పాటు రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతానికీ పట్టుగొమ్మగా నిలిచిందీ శ్రీరంగం. 9వ శతాబ్దంలో తలక్కాడుని పాలించిన గంగ వంశానికి చెందిన తొండమాన్‌ రాజా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడట. ఆ తరవాత 44వ అళంగీయ సింగర్‌ జీయర్‌స్వామి కలలోకి శ్రీమన్నారాయణుడు వచ్చి ఆలయాన్ని కట్టించమని కోరడంతో ఆయన దీన్ని కొంతవరకూ పూర్తిచేసినట్లూ తెలుస్తోంది. ఆపై వరసగా చోళ, పాండ్య, హొయసల, విజయనగర రాజులకు సంబంధించిన శాసనాలెన్నో ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇలా ఎందరో చక్రవర్తులు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నప్పటికీ చోళుల కాలంలోనే దీన్ని కట్టించినట్లు తెలుస్తోంది. ముసల్మానుల, ఆంగ్లేయుల దాడుల్నీ ప్రకృతి విపత్తుల్నీ తట్టుకుని నిలిచిందీ ఆలయ సముదాయం. అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన సమయంలో ప్రధాన ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడి పూజారులు దాచిపెట్టారనీ తరవాతి కాలంలో విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన కుమార కంబుడు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, ఆలయాన్ని పునరుద్ధరించాడట.

ఎన్నెన్నో ప్రత్యేకతలు..
సుమారు 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో నిర్మితమైన ఈ ఆలయం, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా పేరొందింది. 11అంతస్తులతో 237అడుగుల ఎత్తు ఉన్న ఇక్కడి రాజగోపురం ఆసియా ఖండంలోకెల్లా పెద్దది. ఆలయ ప్రాంగణంలో 81 దేవతామూర్తుల గుడుల్నీ విశ్రాంతి గదుల్నీ వాణిజ్య సముదాయాల్నీ కట్టించిన తీరు సందర్శకుల్ని చకితుల్ని చేస్తుంది. అందుకే ఇది టెంపుల్‌ టౌన్‌గా పేరొందింది. ఇక, గర్భాలయంలోని శేష శయన భంగిమలో ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్‌ అని పేరు. ఆయనకు ఎదురుగా ఉన్న బంగారు స్తంభాలను తిరుమణైత్తూణ్‌ అంటారు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రంలో పడి కొట్టుకునిపోకుండా ఉండేందుకే ఈ స్తంభాలని ప్రతీతి. ప్రాంగణంలో 12 నీటికొలనులు ఉంటే వాటిల్లోని సూర్య, చంద్ర పుష్కరిణుల్లో 20 లక్షల లీటర్లకు పైగా నీళ్లు పడతాయట. ఇక్కడ స్వామిని గరుడ వాహన, సింహవాహన, హనుమంత, శేషవాహన రథాల్లో ఉరేగిస్తారు. ఇక్కడున్న గరుడాళ్వార్‌ విగ్రహం ఎత్తు 25 మీటర్లు. ఆయన అలంకరణకు 30 మీటర్ల పొడవాటి వస్త్రాన్ని వాడతారట. గరుడాళ్వార్‌కి ప్రత్యేకంగా మంటపం కూడా ఉంది. క్షీరసాగరమథనంలో పుట్టిన ధన్వంతరికి ఆలయం ఒక్క శ్రీరంగంలోనే ఉంది. చారిత్రక కాలంనాటి మురుగునీటి నిర్వహణ, వర్షపునీటిని నిల్వచేసుకునే విధానంతో ఈ ఆలయం ఐక్యరాజ్యసమితి అవార్డునీ సొంతం చేసుకుంది.

ప్రధాన ద్వారం దాటి వెళ్లగానే వచ్చే మొదటి ప్రాకారంలో చిలుకల మండపం, యాగశాల, విరాజుబావి; రెండో దాంట్లో పవిత్రోత్సవ మండపం, హయగ్రీవ, సరస్వతీ ఆలయాలు; మూడోదాంట్లో గరుత్మంతుని సన్నిధి, వాలీసుగ్రీవుల సన్నిధి, చంద్ర పుష్కరిణి, నాలుగులో గరుడాళ్వార్‌, నాదముని, కూరత్తాళ్వార్‌ సన్నిధుల్ని దర్శించుకోవచ్చు. ఐదోదానికే ఉత్తర వీధి అని పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీధిలోనే స్వామివారిని ఊరేగిస్తారు. ఆరో ప్రాకారానికి చిత్రవీధి అని పేరు. ఇక్కడి వీధుల్లో ఆళ్వార్లను ఊరేగిస్తుంటారు. ఏడో ప్రాకారంలో వామనుని సన్నిధీ, దశావతారాలూ కనిపిస్తాయి. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పై కప్పు విమానం ఆకృతిలో ఉంటుంది. ఇక, గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించిన స్వామిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.

ఇదీ.. స్థల పురాణం!
మనువు కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేయగా బ్రహ్మ తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడి ప్రతిమను ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తాడు. అలా ఆ వంశంలో శ్రీరామచంద్రుడి వరకూ ఆయన్ని ఆరాధించారు. పట్టాభిషేకానంతరం విభీషణుడు శ్రీరామ వియోగాన్ని భరించలేక లంకకు తిరిగి వెళ్లలేకపోతున్న సందర్భంలో- రాముడు తనకు బదులుగా రంగనాథుని విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. అంతట రంగనాథుడితో బయలుదేరిన విభీషణుడు ఉభయ కావేరుల మధ్యకు చేరేసరికి సంధ్యావందన సమయం కావడంతో, స్వామిని కిందపెట్టి నదికి వెళ్ళి, తిరిగి వచ్చేసరికి రంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడట. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే ధర్మచోళుడు అతన్ని ఓదార్చి విగ్రహం ఉన్నచోటే ఆలయాన్ని నిర్మించాడనీ విభీషణుడి కోరిక మేరకు స్వామి దక్షిణ దిక్కుకు తిరిగాడనీ(లంక దక్షిణంగా ఉంది కాబట్టి) పౌరాణిక కథనం.

రంగనాథుడి ఉత్సవాలు!

ఏడాదికి 365 రోజులు ఉంటే ఈ ఆలయంలో 322 రోజులూ ఉత్సవాలు జరగడం విశేషం. ఆలయంలో పేరుకున్న మలినాల్ని తొలగించేందుకు జూన్‌-జులై మాసంలో గర్భగుడిని శుభ్రపరిచి ప్రత్యేకంగా తయారుచేసిన మూలికాతైలాన్ని పెరియ పెరుమాళ్‌కు పూసి మెరుగుపెట్టిన బంగారు తొడుగుని తొడుగుతారు. ఆ సమయంలో బంగారు కలశంతో భక్తులు కావేరి నది నుంచి నీళ్లు తీసుకొస్తారు. అలాగే నిత్యపూజల్లోని లోపాలను సరిదిద్దేందుకు పవిత్రోత్సవాన్ని తమిళ మాసమైన ఆణి(ఆగస్టు-సెప్టెంబరు)లో రెండురోజులపాటు చేస్తారు. ఏడాది పొడవునా ఎన్ని ఉత్సవాలు జరిగినా ధనుశ్శుద్ధ ఏకాదశికి ముందువెనకలుగా జరిగే పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయట. ముఖ్యంగా ధనుర్మాసం (తమిళ నెల మార్గళి)లో వచ్చే వైకుంఠ ఏకాదశికి పదిలక్షలకు పైగా భక్తులు హాజరవుతారట. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ దివ్యక్షేత్రానికున్న ప్రత్యేకతలెన్నో.

అక్కడ 900 ఏళ్లనాటి రామానుజుడు!
మానత్వాన్ని చాటుతూ విశిష్టాద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు. శ్రీపెరంబుదూరులో పుట్టి, కంచిలో వేదవిద్యని అభ్యసించి, శ్రీరంగం వేదికగా శ్రీవైష్ణవాన్ని ప్రభోధించాడాయన. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ మంత్రాన్ని తిరుకొట్టియార్‌ ఆలయగోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. దీన్ని బహిరంగంగా వినిపిస్తే నరకానికి వెళతారనే వాదనను తోసిపుచ్చి, ‘వెళ్లినా పరవాలేదు, మరికొందరికి ముక్తి వస్తే అదే మేలు’ అని భావించిన గొప్ప వ్యక్తి. 1137లో ఆయన మరణానంతరం- తొమ్మిది శతాబ్దాలుగా- పార్థివదేహం శ్రీరంగంలో భద్రంగా ఉన్నట్లు చెబుతారు. నాలుగో ప్రాకారంలో రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినప్పటికీ విగ్రహం వెనక ఉన్నది ఆయన దివ్యశరీరమేననీ, పద్మాసనంలో కూర్చునే పరమపదించడంతో ఆ భంగిమలోనే దేహాన్ని భద్రపరిచారనీ, ఈ రకమైన మమ్మిఫికేషన్‌ మరెక్కడా కనిపించదనీ అంటారు. ఏటా ఆయనకి రెండుసార్లు ఉత్సవాలు నిర్వహించిన సమయంలో మాత్రమే కర్పూరం, కుంకుమపువ్వును ముద్దగా నూరి శరీరానికి పూస్తారట. అందువల్ల ఒకరకమైన ఎరుపురంగులో అది మెరుస్తూ ఉంటుంది. హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లనూ, గోళ్లనూ గుర్తించవచ్చనీ అంటారు.


జైనులు నిర్మించిన శైవక్షేత్రం.. ఇక్కడ వైష్ణవులే అర్చకులు!

పచ్చని ప్రకృతి అందాల మధ్య, సహ్యాద్రి పర్వతాల నడుమ, నేత్రావతీ నదీ తీరంలో… ‘మంజునాథాయ నమః’ అంటూ నినదించే భక్తజనఘోషతో అలరారే క్షేత్రం ధర్మస్థల మంజునాథస్వామి ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు… భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవక్షేత్రమిది.

శైవక్షేత్రం అనగానే… శివలింగం, నంది విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. కానీ మంజునాథ ఆలయంలో ఈ రెండే కాకుండా నలుగురు ధర్మదేవతల్నీ, జైనులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే బాహుబలి విగ్రహాన్నీ దర్శించుకోవచ్చు. కర్ణాటకలోని దక్షిణ కన్నడలో కనిపించే ఈ ధర్మస్థల మంజునాథ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలనూ, కార్తిక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవాన్నీ చూసేందుకు రెండు కళ్లూ చాలవని భక్తులు చెబుతుంటారు. సుమారు 800 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలోని పరమేశ్వరుడిని హెగ్గడే కుటుంబానికి చెందిన జైనులు ప్రతిష్ఠించడంతో పాటు అప్పటినుంచీ వాళ్ల వారసులే ఆలయ బాధ్యతల్ని చూస్తున్నారు. శ్రీ క్షేత్రంగా, ధర్మస్థలగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో వైష్ణవులే అర్చకులుగా ఉండటం విశేషం.

స్థలపురాణం
ధర్మస్థలను ఒకప్పుడు కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నివసించే బీర్మన్న పెర్గడే, అతని భార్య అమ్ము బల్లాల్తీ ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేసేవారు. ఓ రోజు వీళ్ల ఇంటికి ధర్మదేవతలుగా పిలిచే కాలరాహు, కలర్కాయ్‌, కుమారస్వామి, కన్యాకుమారిలు మారువేషంలో రావడంతో ఈ జంట ఎప్పటిలానే ఆదరించింది. ఆ రాత్రి బీర్మన్నకు ఈ ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేసి ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలని అనుకున్నట్లుగా వివరించడంతో మర్నాడే బీర్మన్న తనవాళ్లందరినీ తీసుకుని ఇల్లువదిలి వెళ్లిపోయాడట. కొన్నాళ్లకు మళ్లీ ఆ దేవతలే బీర్మన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలను ప్రతిష్ఠించమని చెప్పడంతో… తన ఇంటికి తిరిగి వచ్చి వాళ్లు చెప్పినట్లుగా చేశాడట.

ఆ సమయంలో పూజాది కార్యక్రమాలను నిర్వహించేందుకు వచ్చిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే మంచిదని సూచించడంతో అన్నప్ప అనే మరో భక్తుడు ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట. కొన్నాళ్లకు భీర్మన్న వంశానికి చెందిన దేవరాజ హెగ్గడే అనే భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయానికి ఆహ్వానించాడట. ఆ స్వామీజీ శివలింగానికి విశేషమైన పూజాకార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ జరుగుతున్న మంచిపనుల్ని చూసి ఈ ప్రాంతానికి ధర్మస్థల అనే పేరు పెట్టాడనీ, అప్పటినుంచీ ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందనీ అంటారు.

ఎన్నో సేవాకార్యక్రమాలు…
ఈ ఆలయాన్ని నిర్మించింది బీర్మన్న కావడంతో అప్పటినుంచీ ఆ వంశస్థులే ఇక్కడ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబ పెద్దను ధర్మాధికారిగా పిలుస్తారు. ఆ ధర్మాధికారి ఆలయ బాధ్యతల్ని చూసుకుంటూనే స్థానికులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించే పెద్దగానూ వ్యవహరిస్తాడు. అదేవిధంగా ఇక్కడకు వచ్చేవారికి లేదనకుండా భోజనం పెట్టడం… చుట్టుపక్కల ప్రాంతాలవారికి అవసరమైన విద్య- వైద్యం-ఉపాధి కల్పనకూ తోడ్పడటం, పేద జంటల పెళ్ళిళ్లు చేయడం, గ్రామాభివృద్ధి వంటి కార్యక్రమాలనూ నిర్వహించడం వంటివన్నీ ధర్మాధికారి బాధ్యతలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరేంద్ర హెగ్గడే ఆ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఇక్కడ కార్తికమాసంలో చేసే శివారాధననూ చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. కార్తిక మాసంలో లక్షదీపోత్సవంతో పాటు అయిదురోజులు స్వామికి చేసే ప్రత్యేక పూజలనూ ఆ తరువాత సర్వధర్మ, సాహిత్య సమ్మేళనాల్నీ చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలి వస్తారు.

ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం బెంగళూరు నుంచి 300, మంగళూరు నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వచ్చే భక్తులు మంగళూరు రైల్వేస్టేషన్‌లో దిగితే.. అక్కడనుంచి ఆలయానికి బస్సులూ, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకునేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగొచ్చు.


హరిహరసుతుడు అయ్యప్ప… శబరిమల యాత్ర విశేషాలు

కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిల‌వ‌డం… ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది.

శబరిమల క్షేత్రం..
కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొనివుంది. అక్కడ వేంచేసి ఉన్న అయ్యప్పస్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మలయాళ వృశ్చికమాసం (నవంబరు-డిసెంబరు)లో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందుకోసం కార్తీకం ముందు నుంచి దీక్ష తీసుకుంటారు. ఆ రోజు నుంచి భక్తుల జీవనశైలి మారిపోతుంది. నల్లని దుస్తులు ధ‌రించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ. వారు సాగించే దీక్షలోని నియమాలు సామాన్యులకు కఠినమే. అలాగే దీక్షా సమయంలో అందరూ ‘స్వామి’గా భావించి వ్యవహరించడం అపురూప అనుభూతిని ఇస్తుంది. మండలకాలం అంటే 41 రోజుల పాటు స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు బయలుదేరుతారు. నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు… తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి మాలధారుల శిరస్సున ఉంచుతారు.

చిన్నపాదం.. పెద్దపాదం
ఇరుముడి తలదాల్చిన భక్త బృందం ఎరుమేలి నుంచి అసలు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ దీక్షకు మతంతో సంబంధం లేదన్న వాస్తవాన్నీ, అసలైన లౌకిక భావన భారతీయుల సొంతమనీ వెల్లడి చేసే వేదిక ఎరుమేలే. హైందవ ధర్మానుసారం దీక్షచేసిన భ‌క్తులు తొలుత ఇక్కడి వావర్‌ మసీదును దర్శించుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్భంలోనే రంగులు జల్లుకొని వాద్య బృందాలు తోడు రాగా ‘పేటతుల్లాల్‌’ను నిర్వహిస్తారు. పిదప ఎరుమేలిలోని ధర్మశాస్తకు పూజలు చేస్తారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరే పెద్దపాదం, చిన్నపాదం అనే మార్గాలు ఉన్నాయి. చిన్నపాదం అంటే ఎరుమేలి నుంచి పంపాతీరం వరకూ వాహనాల్లో ప్రయాణించి అక్కడ స్నానం చేసి నీలిమలను అధిరోహిస్తారు.

పెద్దపాదం అంటే ఎరుమేలి నుంచే నడుస్తూ దాదాపు 80 కిలోమీటర్లు నడిచి కొండకు చేరడం! ఈ వనయాత్ర చేసే భక్తులు మొదట ‘పెరుర్‌తోడు’కు వెళ్లి స్నానాదికాలు ముగించి అక్కడి దేవుణ్ని పూజిస్తారు. తరవాత కాలైకట్టి అనే ప్రాంతానికి వెళ్తారు. పిదప అళుదా నదీ తీరానికి వెళ్లి పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నదీ ప్రవాహానికి కారణమైన గాథను గురుస్వాములు తప్పనిసరిగా చెబుతారు. అయ్యప్ప చంపిన మహిషి కార్చిన కన్నీరే నదిగా మారిందని అంటారు. ఇక్కడ చిన్నరాయిని తీసుకొని అళుదామేడు దాటి ఇంజిపరైకోటై చేరుకొంటారు. కళిడం కుండ్రు అనే ప్రదేశంలో ఈ రాయిని వేస్తారు. కరిమల యాత్రకు శ్రీకారం చుడుతారు. పెరియనపట్టం, చెరియ‌న‌ప‌ట్టం మీదుగా పంపకు (దీనినే పంబ అని వ్యవహరిస్తారు) చేర‌తారు.. ఈ వనయాత్రలోనే కొందరు భక్తులు శక్తిపూజ చేసి అన్నదానం చేస్తుంటారు.

పంపానదిలో స్నానం..
పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరవాత దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కాలి. అనంతరం శరంగుత్తికి వెళ్లాలి. ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు- ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన శరాలను గుచ్చాలి. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలు, కోనలు దాటుకొంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు. ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సిద్ధమవుతారు. ఆలయానికి ద్వారపాలకులైన కడుత్తస్వామి, కరుప్పస్వామిలకు టెంకాయలు కొడుతారు. ఆ మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందికి దిగడంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.

200 ఏళ్ల క్రితమే..
పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం 7రూపాయలు వచ్చిందని పందళరాజు వంశీయుల రికార్డుల్లో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడి వుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి కావడంతో ఆలయాన్ని పునర్నిర్మించారు

ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దేవస్థానం బోర్డువారికి అప్పగించారు. ఆ తర్వాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంతో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలో కూడా తెరవడం ప్రారంభించారు.

స్వామికి నెయ్యాభిషేకం..
చిన్నపాదం, పెద్దపాదం ఏదైనా యాత్ర ఆద్యంతం స్వామి నామసర్మణతో శరణుఘోషతో సాగుతుంది. వేలాదిమంది భక్తులతో కోలాహలంగా వుండే ఈ ప్రాంతం అనునిత్యం స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో.. లాంటి ఆధ్యాత్మిక నినాదాలతో అక్కడి కొండ‌లు ప్రతిధ్వనిస్తాయి. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు చేయించే ఈ అభిషేకాన్ని ఇలా విశ్లేషిస్తారు. ‘ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ఇందులో ఇమిడివుంది. అలాగే నెయ్యిని తీసుకొచ్చిన కొబ్బరి చిప్పల్ని హోమాగ్నిలో వెయ్యాలి. భక్తుడి కర్మఫలాన్ని ఆ ప్రజ్వలనం ధ్వంసం చేస్తుంది’. తరువాత భక్తులు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని , నాగరాజ, నాగాయక్షి ఆలయాలను దర్శించుకొంటారు. మాలికాపురత్తమ్మ ఆలయంలో కొబ్బరికాయను ఆ గుడి చుట్టూ తిప్పి వదిలేస్తారు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టే ఆచారం లేదు.! ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర మకరసంక్రాంతి రోజున తుది ఘ‌ట్టానికి చేరుతుంది. వేనవేల సంఖ్యలో భక్తులు శబరికొండ నుంచి నీలకల్‌ ప్రాంతం వరకు వుంటారు. తిరువాభరణాల వూరేగింపు చూసిన భక్తులు స్వామి శరణాలను వల్లిస్తారు.

ఆంధ్రా నుంచి తాంత్రిలు..
1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపై నుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985లో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభమైంది. బెంగళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి ముందుకురావడంతో 2000లో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది. శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశం అయిన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టురాజుల వంశీయులను తీసుకెళ్ళారని చెబుతారు.

అయ్యప్ప దీక్షా నియమాలు

అయ్యప్ప మాలధారులు నలుపు, హనుమాన్‌ కాషాయం రంగు వస్త్రాలు ధరించాలి.

  • గురుస్వామి, తల్లిదండ్రులు, అర్చకస్వామి ద్వారా మాల ధరించాలి.
  • ముందు రోజు మద్యం, మాంసం తినరాదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు పూర్తి చేయాలి.
  • స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపులు, దిండ్లు పాదరక్షలు వాడకూడదు. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో బ్రాహ్మచారిత్వం పాటించాలి. బయటి తినుబండారాలు తినకూడదు.
  • ఉదయం, సాయంత్రం రెండు పూటల చన్నీటితో స్నానం చేయాలి. పగలు బిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. వేకువజామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్పస్వామికి పూజ చేయాలి.
  • అశుభ కార్యాల్లో పాల్గొనవద్దు. అసవరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయొద్దు.
  • నిదురించేప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్త పడాలి.
  • దీక్షలో ఉండగా రక్తసంబంధీలకులు, దగ్గరి బంధువులు, దాయదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి. నడిచే దారిలో శవం ఎదురైతే, జన సందోహంలో తిరిగినప్పుడు రజస్వల అయితే, బహిష్టు అయిన వారు ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణుఘోష చెప్పాలి.
  • స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే బిక్ష, నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి.
  • బిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు.
  • దీక్షా సమయంలో గడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు. పగలు నిద్రించకూడదు.
  • ఇంట్లో ఒక వేరు గదిలో ఉండాలి.
  • స్వామికి నెయ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిదానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.

శబరిమల ఇలా చేరుకోవచ్చు…

  • రైలులో వెళ్లే భక్తులు చెంగనూర్‌ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి కారు లేదా బస్సుల ద్వారా పంప చేరుకోవచ్చు.
  • దేశంలోని అన్ని ప్రాంతాల‌ నుంచి శబరిమలకు రవాణా సౌకర్యం ఉంది.
  • విమానాల ద్వారా వచ్చేవారు కొచ్చి లేదా తిరువనంతపురం విమానాశ్రయాలకు చేరుకోవాలి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. అక్కడ నుంచి కాలిన‌డ‌క‌న వెళ్లి స్వామిని దర్శించుకోవాలి.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం… లలితాదేవిని సృష్టికి మూలంగా ఎందుకు భావిస్తారు?

ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి. అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహాత్యాన్ని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు. ఈ అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా పేర్కొంటారు. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలలో అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. అక్కడి ‘త్రిపుర’ రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టడం విశేషం.

లలితాసహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ’ అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలూ కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి. చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. ఇందులో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషంగా పండితులు చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.

లలితా సహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుంచి వెలువడినవాడే భండాసురుడు. ముల్లోకాల మీదా యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ స్తోత్రం గుర్తుచేస్తుంది.

లలితాసహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్‌, అంగన్యాసమ్‌, కరన్యాసమ్‌, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ పఠించినా సరిపోతుంది. ఇక హోమంగానూ, అర్చనగానూ, పారాయణగానూ భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత. సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు.

విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. లలిత సహస్రనామం చివరలో ‘శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర’మని పేర్కొంటారు. అంటే ఇది అర్హులైన వారికి చెప్పాలన్న అర్థం వస్తుంది. ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తుంది. సాధకులకు, ఉపాసకులకు జ్ఞానమార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్ట విధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి. ఎంత చెప్పుకొన్నా లలిత సహస్రనామా ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించినా, విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం.. కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



సినిమా చూసి రిక్షా ఎక్కిన కనకదుర్గమ్మ.. 1955లో విజయవాడలో యదార్థ సంఘటన

విజయవాడ కనకదుర్గమ్మకు పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా కొలువై ఉండేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుందని చెబుతుంటారు. దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి అమ్మవారి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది. ఈ కోవలోనే 1955లో జరిగిన యదార్థ గాథ ఇది..

1950 కాలంలో విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. కాయ కష్టం చేసుకుంటూ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవాడు. 1955లో ఏఎన్నార్, వహీదా రెహ్మాన్ జంటగా నటించిన ‘రోజులు మారాయి’ సినిమా విడుదలైంది. రిక్షా కార్మికుడైన వెంకన్న రాత్రివేళ మారుతి టాకీస్ వద్ద ఉండేవాడు. చివరి ఆట చూసిన ప్రేక్షకులెవరైనా రిక్షా కావాలని అడిగితే వారిని ఎక్కించుకుని గమ్యస్థానంలో దించేవాడు. ఈ ఏడాది ఓ రోజు అర్ధరాత్రి ఆట ముగిసిన తర్వాత వెంకన్న ఎప్పటిలాగే మారుతి టాకీస్‌ వద్ద నిలబడి ఉన్నాడు.

అప్పుడు ఓ పెద్దావిడ ఎర్రటి చీర ధరించి నుదుటిన పెద్దబొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలని అతడు అడగ్గా ఇంద్రకీలాద్రి వద్ద దించమని చెప్పింది. వెంకన్న రిక్షా తొక్కుతుండగా ఆ పెద్దావిడ అతడితో మాట కలిపింది. ‘రాత్రి వేళ మొత్తం చీకటిగా ఉంది.. దుర్గమ్మ ఈ సమయంలో గ్రామ సంచారానికి వస్తుందని విన్నాను. నీకు భయం వేయడం లేదా?’ అని అడిగింది. దానికి సమాధానంగా.. ఆవిడ మా తల్లి… అమ్మ దగ్గర బిడ్డలకు భయమెందుకు? అని ఢిల్లీ వెంకన్న సమాధానమిచ్చాడు. ఇంద్రకీలాద్రి వద్దకు రాగానే రిక్షా ఆపిన వెంకన్న.. ఏ ఇంటికి వెళ్లాలమ్మా? అని వెనక్కి తిరిగి చూడగా ఆ పెద్దావిడ కనిపించలేదు. దీంతో అతడు మెట్ల వైపు చూడగా ఆవిడ పైకి నడుచుకుంటూ కనిపిస్తుంది. డబ్బులివ్వకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా అని రిక్షావాడు అడగ్గా.. డబ్బులు నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. దీంతో అతడు తలపాగా తీసి చూడగా… అందులో బంగారు గాజు, రూ.10ల నోటు కనిపించాయి. వాటిని తీసుకుని వెంకన్న మెట్లవైపు చూడగా ఆవిడ అదృశ్యమైంది.

దీంతో తన రిక్షా ఎక్కింది.. అమ్మలగన్నఅమ్మ.. కనకదుర్గమ్మే అని నిర్ధారించుకున్న వెంకన్న.. అమ్మా అంటూ వెర్రికేకలు వేయడం ప్రారంభించాడు. దీంతో నిద్రలేచిన చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని ఏం జరిగిందని అడగ్గా.. అసలు సంగతి చెబుతాడు. ఈ విషయం బ్రాహ్మణ వీధిలో ఉండే అమ్మవారి ఉపాసకుల చెవిన పడింది. వారు ధ్యానం చేసి వచ్చింది కనకదుర్గమ్మే అని నిర్ధారించారు. ఈ సంఘటన అప్పటి ‘ఆంధ్రకేసరి’ అనే వార్తాపత్రికలో గాజు ఫోటోతో సహా ప్రచురితమైంది. దుర్గమ్మ రాత్రివేళల్లో నగరంలో సంచరిస్తుటుందని బెజవాడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ వార్త కొంతకాలంగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


పూజలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దేనికి సంకేతం..?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏదో అనర్థం జరుగుతుందని భయపడిపోతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా?.. అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?.. ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా పగలకపోయినా, చెడిపోయినా మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. అయితే కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా..చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో ‘పువ్వు’ వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ, కోడలు గానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం.

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే ఆ కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ పక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. అయితే ఇందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభిస్తే దోషం పోయినట్లే. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది.

భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడని పండితులు చెబుతున్నారు.


కాలభైరవ అష్టకం..

కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపం. కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది. అదే విధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం. ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు. అతడిని కొలిచేవారి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు. కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి. కాలభైరవ అష్టకం చదవడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కాలభైరవ అష్టకం..

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || ౯ ||

ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |


హనుమాన్ చాలీసా.. ఏ సమయంలో చదివితే మంచిది

గోస్వామి తులసీదాసు అందించిన మేటి రచనల్లో హనుమాన్ చాలీసా ఒకటి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది. హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు. పొద్దున లేదా రాత్రి హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు. శనిప్రభావం ఉన్నవారు రోజూ రాత్రివేళ హనుమాన్ చాలీసాను 8సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

హనుమాన్ చాలీసా

శ్రీ గురు చరణ సరోజ రజ
నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ
జో దాయక ఫలచారి ||

అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.

బుద్ధిహీన తను జానికే
సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి
హరహు కలేశ వికార ||

అర్థం – బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.

చౌపాఈ-
జయ హనుమాన జ్ఞానగుణసాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || ౧ ||

అర్థం – ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా || ౨ ||

అర్థం – నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు.

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ || ౩ ||

అర్థం – నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు,

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || ౪ ||

అర్థం – బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై || ౫ ||

అర్థం – ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.

శంకర సువన కేసరీనందన |
తేజ ప్రతాప మహా జగవందన || ౬ ||

అర్థం – శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.

విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || ౭ ||

అర్థం – విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా || ౮ ||

అర్థం – శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా, రామ, లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
వికటరూప ధరి లంక జరావా || ౯ ||

అర్థం – సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.

భీమరూప ధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || ౧౦ ||

అర్థం – మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీరఘువీర హరషి వుర లాయే || ౧౧ ||

అర్థం – సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ || ౧౨ ||
[** పాఠభేదః – కహా భరత సమ తుమ ప్రియ భాయి **]

అర్థం – అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.

సహస వదన తుమ్హరో యశ గావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || ౧౩ ||

అర్థం – వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || ౧౪ ||

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || ౧౫ ||

అర్థం – సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా || ౧౬ ||

అర్థం – నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రాముని తో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయె సబ జగ జానా || ౧౭ ||

అర్థం – నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || ౧౮ ||

అర్థం – యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధురఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || ౧౯ ||

అర్థం – అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || ౨౦ ||

అర్థం – జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే || ౨౧ ||

అర్థం – శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి.

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డరనా || ౨౨ ||

అర్థం – నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?

ఆపన తేజ సంహారో ఆపై |
తీనోఁ లోక హాంక తేఁ కాంపై || ౨౩ ||

అర్థం – నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.

భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై || ౨౪ ||

అర్థం – భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || ౨౫ ||

అర్థం – రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || ౨౬ ||

అర్థం – మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.

సబ పర రామ తపస్వీ రాజా |
తిన కే కాజ సకల తుమ సాజా || ౨౭ ||

అర్థం – అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై || ౨౮ ||

అర్థం – ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || ౨౯ ||

అర్థం – నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.

సాధుసంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || ౩౦ ||

అర్థం – సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
అసవర దీన్హ జానకీ మాతా || ౩౧ ||

అర్థం – ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.

రామ రసాయన తుమ్హరే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా || ౩౨ ||

అర్థం – నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || ౩౩ ||

అర్థం – నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.

అంతకాల రఘుపతి పుర జాయీ | [** రఘువర **]
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || ౩౪ ||

అర్థం – అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.

ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వసుఖకరయీ || ౩౫ ||

అర్థం – వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.

సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా || ౩౬ ||

అర్థం – కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.

జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరహు గురు దేవ కీ నాయీ || ౩౭ ||

అర్థం – జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ || ౩౮ ||

అర్థం – ఎవరైతే వందసార్లు దీనిని (పై శ్లోకమును) పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.

జో యహ పఢై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా || ౩౯ ||

అర్థం – ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి.

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || ౪౦ ||

అర్థం – తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).

దోహా-
పవనతనయ సంకట హరణ
మంగళ మూరతి రూప ||
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప ||

అర్థం – పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము