Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
సాధారణంగా ఎవరు గుడికి వెళ్లినా ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. చాలామందికి అసలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నామో అసలు తెలియనే తెలీదు. ప్రదక్షిణలను రెండు రకాలుగా చెబుతుంటారు. మొదటిది ఆత్మ ప్రదక్షిణ, రెండోది ఆలయ ప్రదక్షిణ. అసలు ఈ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో ఇప్పుడు చెప్పుకుందాం. మనసులో ఉండే కోరికలు నెరవేరాలని దేవుడికి నమస్కారం పెడతాం. మన శక్తికొలది నైవేద్యం, కొబ్బరికాయ, అరటిపళ్లు, పూలు సమర్పిస్తుంటాం. అయితే దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు.
మనకి కనిపించే ‘సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఆగిపోతే ఏం జరుగుతుందన్నది ఊహించలేం. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది.
అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం ‘చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.
ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి ?
దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే, అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి అనే సందేహం తలెత్తుతుంది. ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, కొందరైతే 5, 9, 11సార్లు ప్రదక్షిణ చేయాలని చెబుతుంటారు. మరికొందరైతే దేవుడికి మొక్కు పేరుతో 108 సార్లు కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా ఎందుకు నిర్ణయించారనేది జవాబు దొరకని ప్రశ్న. ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. ఎవరకి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడమే ముఖ్యం. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేసినా.. రోడ్డు మీద నడిచినా ఒకటేనని గుర్తించుకోవాలి. అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకోగలం. అంతే కాదు అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణలోని ప్రధానోద్దేశ్యం. శ్రీ రమణ మహర్షి ‘ప్రదక్షిణం’ అన్న పదాన్ని విశ్లేషించారు. ‘ప్ర’ అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. ‘ద’ అంటే కోరికలన్నీ తీరడమని భావం. ‘క్షి’ అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. ‘న’ అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు.
పురాణ కథ ‘విశ్వమంతా తిరిగి త్వరగా ప్రదక్షిణ చేసి వచ్చిన వారికే గణాధిపత్యం” అని పార్వతీ పరమేశ్వరులు షరతు విధించినపుడు కుమారస్వామి మయూర వాహనంపైనెక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలు దేరాడు. మూషిక వాహనుడైన మహాగణపతి అలా వెళ్ళలేకపోయాడు. కానీ, తెలివిగా తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చిత్రంగా సుబ్రహ్మణ్యుడు వెళ్ళిన ప్రతి చోటా అంతకు మునుపే గణపతి వచ్చి వెళ్ళిన జాడలు కనిపించాయి. ముందుగా విశ్వాన్ని చుట్టి వచ్చిన వాడు వినాయకుడేనని నిర్ణయించి శివపార్వతులు, ఇతర దేవతలు ఆయనకే గణాధిపత్యాన్ని ఇచ్చారు. ఈ కథలో కుమారస్వామి, గణపతిలలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిష్కరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించాలన్నది సుబ్రహ్మణ్యుని బోధ. దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటే ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటే ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము, సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధి ప్రథమని చెప్పబడింది.
శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం యొక్క వివరణ బ్రహ్మ పురాణంలో కనిపిస్తుంది. శ్రీ లలిత సహస్రనామ లలిత దేవికి అంకితం చేయబడిన దైవిక శ్లోకం. లలిత దేవి ఆదిశక్తి యొక్క ఒక రూపం. ఆమెను “షోడాషి” మరియు “త్రిపుర సుందరి” దేవత పేరుతో పూజిస్తారు. దుర్గాదేవి, కాళి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మరియు భగవతి దేవి ప్రార్థనలను లలిత సహస్రనామ ఫలశృతి మరియు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో కూడా ఉపయోగిస్తారు. లలిత సహస్రనామ కర్మ చేయడం ద్వారా, ఆ వ్యక్తికి మాత ప్రత్యేక దయ లభిస్తుంది. అన్ని రకాల విపత్తులను నాశనం చేస్తుంది. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పఠనం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
విష్ణు సహస్రనామాలను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. కురుక్షేత మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడి హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు.
దీనికి కృష్ణుడు ‘మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః’కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ము నన్ను స్మరించుకుంటున్నాడు.. అందుకే నామనస్సు అక్కడికి మళ్లింది. పాండవులారా బయలుదేరండి అక్కడకు మనం వెళ్దాం.. భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు అని చెప్పి వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుని భీష్ముడు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలను ఉపదేశం చేశాడు.
ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం ‘ధర్మార్థులకు ధర్మం, అర్థార్థులకు అర్థం, కామార్థులకు కామం, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును’ అని పేర్కొన్నారు.
దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభాలు ఉండవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు, క్షత్రియులకు విజయం, వైశ్యులకు ధనం, శూద్రులకు సుఖం లభిస్తుంది. ధర్మం కోరుకువారికి ధర్మం, ధనం కోరుకున్నవారికి ధనం లభిస్తుంది. భక్తితో వాసుదేవుని నామాలను కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు దక్కి వారి రోగాలను హరిస్తుంది.
నామం అందరూ చెప్పవచ్చు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు పదకొండుసార్లు శివనామం స్మరించాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ పదకొండుసార్లు స్మరించాలని పండితులు ఉవాచ.
శాస్త్రంలో మంచం మీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు.
‘దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!’ బుధ గ్రహం బలహీనంగా ఉండి నీచ క్షేత్రం ఉంటే సమస్యలు ఎదురైనప్పుడు విష్ణు సహస్రనామాలు పటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్ర వచనం.
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పురాతన శైవ క్షేత్రాలను పంచారామాలుగా పిలుస్తుంటారు. పురాణాల పరంగా, భౌగోళికంగా ఈ పుణ్యక్షేత్రాలకు ఎంతో విశిష్ఠత ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల సందర్శన ఎంతో గొప్పగా ఉంటుంది. మహాశివరాత్రితో పాటు అనేక పర్వదినాల్లో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివున్ని పూజిస్తుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివ లింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలు ప్రముఖమైనవి. పేరుకు తగినట్లుగానే పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలు ఇవి. దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకమైనది. ఈ ఐదు దేవాలయాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం మరో విశేషం. ఇంతకీ ఈ క్షేత్రాల విశిష్టతలు ఏమిటి? ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పంచారామాల చరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాల పుట్టుకకు సంబంధించి అనేక పురాణ గాధలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాధుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం.. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహా విష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంపిణీ చేశాడు. అయితే త్రిపురాసురులు మాత్రం (రాక్షసులు) ఈ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కోసం ఘోర తప్పసును ఆచరిస్తారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వివిధ వరములను అనుగ్రహిస్తాడు. ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్లి తమను రాక్షసుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటారు. దేవతల మొర ఆలకించిన మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ శివలింగాన్నే దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు.
అయితే స్కాంధ పురాణంలోని తారకాసుర వధ ఘట్టం ప్రకారం పంచారామాల పుట్టుక మరో విధంగా ఉంది. హిరణ్య కశ్యపుడి మనుమడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. బాలలు ఎవ్వరూ తనను ఏమీ చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరుకుంటాడు. పరమేశ్వరుడు తధాస్తు అనడంతో ఆ వరగర్వంతో దేవతలను ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీంతో తారకాసురున్ని నిలువరించేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి దిగుతాడు. ఆ భీకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు. ఆ సమయంలో ఐదు భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని ఐదు చోట్ల ప్రతిష్ట చేశారు. అవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలు.
ద్రాక్షారామము: దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు. రెండు అంతస్తులలో 60 అడుగుల ఎత్తులో స్వామి వారి శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. రెండో అంతస్తు పై భాగం నుంచి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామి వారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామి వారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భారతదేశంలోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని చెబుతుంటారు.
అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రతి ఒక్కరికీ ఓ మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. క్రీస్తు శకం 892-922 మధ్య చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32కి.మీ, రాజమండ్రి నుంచి 51కి.మీ, అమలాపురానికి 27కి.మీల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది.
అమరారామము: పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. రెండు అంతస్తులలో 16 అడుగుల ఎత్తుతో ఈ స్పటిక శివలింగం ఉంటుంది. రెండవ అంతస్తుపై నుంచి స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అమ్మవారు బాలచాముండి, క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. తారకాసురుడి సంహారం తరువాత చెల్లాచెదురైన ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం మొత్తం మూడు ప్రాకారాలతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రాకారాల్లో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను ఇవి రెట్టింపు చేస్తాయి. గుంటూకు 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో ఉన్న అమరావతిలో ఈ ఆలయం ఉంది.
క్షీరారామము: పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో క్షీరారామం ఉంది. శివుడు భూమిపై తన బాణాన్ని వదిలినప్పుడు అది ఈ ప్రదేశంలో పడి భూమి నుంచి క్షీరదార వచ్చినట్లు కధనం. దీని కారణంగానే ఈ ప్రాంతం క్షీరపురిగా, కాలక్రమంలో పాలకొల్లుగా మార్పు చెందినట్లు చెబుతారు. క్షీరారామం ఆలయాన్ని 11వ శతాబ్ధంలో చాళుక్యులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెల్లని రంగులో రెండున్నర అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడి శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతా యుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. మొత్తం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో ఎంతో సుందరంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడింది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయాన పెద్ద గోపురం నుంచి సూర్య కిరణాలు శివలింగంపై పడే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది.
సోమారామము: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో గునిపూడిలో ఈ క్షేత్రం ఉంది. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 3వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించిన కారణంగా దీనికి సోమారామము అని పేరు వచ్చింది. స్వామివారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటారు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుగు, నలుపు రంగులో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణమి నాటికి తిరిగి యధారూపంలోకి వస్తుంది. ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి కింది అంతస్తులోనూ, అన్నపూర్ణా దేవి అమ్మవారు పై అంతస్తులో ఉంటారు.
కుమార భీమారామము: తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటకు సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. సున్నపురాయి రంగులో 60 అడుగుల ఎత్తైన రెండస్తుల మండపంలో ఇక్కడి శివలింగం ఉంటుంది. ద్రాక్షారామం క్షేత్రాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీమునిచే ఈ ఆలయం నిర్మించబడింది. అందుకే ఈ రెండు క్షేత్రాల నిర్మాణ శైలి ఒకే విధంగా అనిపిస్తుంది. ఆలయ ద్వారాల నుంచి కొలను వరకూ ప్రతి నిర్మాణంలోనూ పోలిక కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి 922 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఈ ఆలయం అతి సమీపంలోనే ఉంది.
అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కావడంతో హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ నెలలో కార్తీక పౌర్ణమికి ఎంతో ‘ప్రాశస్త్యం’ ఉంది. ఇక కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. కార్తీక మాసంలో నెలరోజులు పూజ చేయడం ఒకెత్తయితే.. పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు, పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణం విశిష్టమైన అంశం. ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనబడదు. పౌర్ణమి రోజు రాత్రి శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు. దీనిని యమద్వారం అని అంటారు. అనంతరం..ఈ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.
జ్వాలా తోరణము పదం పురాణ ప్రసిద్ధమైంది. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలం ఉద్భవించగా.. దాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషాన్ని కంఠ మధ్యలో నిక్షేపించాడు. అప్పుడు పార్వతీ దేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుందట. ఈ పురాణ కథ నేపథ్యంలోనే ఏటా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండు గడ్డితో చేసిన చేసిన తోరణాన్ని జ్వాలగా వెలుగిస్తుంటారు. ఆ జ్వాల క్రింది నుంచి శివపార్వతుల పల్లకీని మూడు సార్లు తీసుకొని వెడతారు.
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.
ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్‌మాండ్‌లో యజమాన లింగం.
తమిళనాడులోని అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనని చెబుతారు.
పురాణ గాథ.. పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం పెరిగి కలహానికి దారితీసిందట. ‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట. వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట.
బ్రహ్మకు శివుడి శాపం
ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట. ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట.
‘మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూ లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ. ఆ తర్వాత అగ్ని రూపం పర్వతంగా మారింది. అదే అణ్ణామలై. శివుడికి వున్న అనేక నామాల్లో అణ్ణాల్ అనే పేరుకూడా ఒకటి. అణ్ణాల్ అంటే అగ్ని, ప్రకాశం తదితర అర్ధాలున్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండూకలిసి అణ్ణాల్ మలై, కాలక్రమేణా అణ్ణామలై అయింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవసూచకం. సాక్షాత్తూ శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవచిహ్నం తిరు ముందు చేరి తిరువణ్ణామలైగా ప్రసిధ్ధిపొందింది.
శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరివల్ల సాధ్యం కాదని, పర్వత పాదంలో అర్చా స్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా, శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మిచవలసినదిగా బ్రహ్మ, విష్ణులు దేవ శిల్పి మయుణ్ణి కోరారు. మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్య తీర్ధాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. ఇది అప్పటి సంగతి. తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం వున్న ఆలయం భక్తులను తరింపచేస్తోంది.
పరమ సత్యమైన క్షేత్రం
అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి.. ఏ ఆలయాలు ఉండాలి.. ఏ పూజలు చేయాలి.. అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాల భైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అబిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పాతాళ లింగ కూడా ఉంటాయి. అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుతిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారని చెబుతారు.
అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది. అందుకు సంబంధించి కొన్ని కథలూ ప్రచారంలో ఉన్నాయి. తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని అమ్మణి అమ్మన్ అనే మహిళ కట్టించారట. పరమశివుడి అనుగ్రహం వల్ల యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతీ ఇంటికి వెళ్లి ‘గోపురం కడుతున్నాం దానం చేయండి’ అని అర్థించేవారట. డబ్బులు లేవు అని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి.. అందులో ఎంత సొమ్ము ఉన్నదీ చెప్పేసేవారట. దీంతో భయపడి విరాళం ఇచ్చేవారని వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతుంటారు.
గిరి ప్రదక్షిణ అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది, చేయాల్సినది గిరి ప్రదక్షిణ. ప్ర- పాప సంహారం, ద- కామ్య సిద్ధి, క్షి-జన్మ రాహిత్యం, ణ-జ్ఞాన మార్గంలో ముక్తి. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కి.మీ. దీనిని చెప్పులు లేకుండా చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునేవారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కనుక దీనిని సుదర్శనగిరి అని కూడా అంటారు. అరుణాచలం ఒక బ్రహ్మానందనిలయం. కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు. కొండ అంతా నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు, సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం వుండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా వుంటుంది.
గిరి ప్రదక్షిణను శ్రీ రమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గణేశ ఆలయం, అగస్త్యతీర్థం, ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగ, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరుతి లింగ, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్ర మఠం, ప్రతిధ్వనిమండపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం, ఈశాన్య లింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శోద్రిస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి ఆలయం మీదుగా కొనసాగిస్తారు. వీటితో పాటు కొండపై ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాదతీర్థం, గురు నమశ్శివాయ సమాధి, రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమాలను దర్శించుకోవచ్చు.
అరుణాచలం ఇలా చేరుకోవచ్చు.. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తిరువణ్ణామలైకి 4-5 గంటల ప్రయాణం. తిరుపతి నుంచి రైలు సర్వీసులు ఉన్నాయి. తిరువణ్ణామలై రైల్వేస్టేషన్ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు, ఆటోలు ఉంటాయి. బస్టాండ్‌కు దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది. అరుణాచలేశ్వరాలయం నుంచి రమణాశ్రమం 2 కి.మీ. దూరం ఉంటుంది.
ఆలయ దర్శన వేళలు తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం.కు వరకూ ఆలయ ప్రవేశం ఉంటుంది. తిరిగి సాయంత్రం 4గం.కు తెరుస్తారు. రాత్రి 9గం.కు మూసివేస్తారు. పౌర్ణమిరోజున రాత్రివేళ అందరికీ దర్శనమయ్యే వరకూ ఆలయం తెరిచే ఉంచుతారు.
భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి నాడు పూజతో పాటు వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చవితి రోజున వ్రతకథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.
కథా ప్రారంభం… తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది.
అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు.. గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.
శమంతకోపాఖ్యానం ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.
శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి.. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా.. అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. పార్వతీ తనయుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.
స్థల పురాణం కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
క్షేత్ర ప్రత్యేకత అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. దీంతో గ్రామంలో దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.
ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష పెన్నులు సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.
ఇలా చేరుకోవచ్చు: అయినవిల్లి రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12కిలోమీటర్లు దూరం ఉంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చేవారు రావులపాలెం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అమలాపురం నుంచి వచ్చేవారు ముక్తేశ్వరం చేరుకుని అక్కడి నుంచి ఆటోలో అయినవిల్లి చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాల ద్వారా వచ్చేవారు రాజమహేంద్రవరంలో దిగి అక్కడికి నుంచి రోడ్డుమార్గంలో అయినవిల్లి చేరుకోవచ్చు.
రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ మన దేశంలోనూ ఉండరంటారు. ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమివ్వడం సాధారణమే. కానీ హనుమంతుడి విగ్రహమే ఉండని రామాలయం మన దగ్గరే ఉందని మీకు తెలుసా.. అలాంటి అరుదైన రామాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. సీతారామలక్ష్మణ విగ్రహాలు ఏకశిలపై దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఆంధ్రా అయోధ్యగా గుర్తింపు పొందిన ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడికి విడిగా ఆలయం ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
స్థలపురాణం ఒకప్పుడు ఒంటిమిట్ట కీకారణ్యంలా ఉండేదట. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేది. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ… అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవారైప వీళ్లు ఈ అటవీ ప్రాంతానికి రక్షణగా ఉండేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట. రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు.
ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. అలాగే ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు. ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా… ఆంధ్రా వాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆయన కొబ్బరి చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.
విశేష పూజలు మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతో పాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు. చతుర్దశి నాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా నవమి రోజున పోతన జయంతి పేరుతో కవిపండితులను సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది.
తిరుపతికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఆలయానికి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. విమానంలో వచ్చేవారు రేణిగుంట విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గంలో ఒంటిమిట్ట చేరుకోవచ్చు. రైల్లో వచ్చిన వారు కడపలో దిగితే అక్కడి నుంచి బస్సులు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.