శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం!
తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన పలివెల గ్రామములో శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో పూజలు అందుకుంటోంది. ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం”పలివెల” అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
పౌరాణిక గాథ
పౌరాణిక గాథ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమ్రుతలింగాన్ని రాక్షసులు ఒక ‘పల్వలము’ (గొయ్యి)లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమ్రుతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది అని ఒక గాధ ప్రచారంలో ఉంది.ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన “పల్లవ అనే పదం నుంచి “పలివెల” అయిందని కూడా చారిత్రక ఆధారాలున్నాయి.
స్థ్లల పురాణం
ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములోని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యాణమండపము లో వేదిని అల్లాదరెడ్డి క్రీ.శ 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు మరియు హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణానికి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు.
అగస్త్య మహర్షి తన దివ్యదృష్టితో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రంలో శివుడు లోల అగస్త్య లింగేశ్వరునిగా తరువాత కొప్పులింగేశ్వర స్వామిగా పూజలందుకొంటున్నాడు.
సాహిత్యాధారాలు
శ్రీనాథుడుని కాలంలో అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకొన్నట్లుశ్రీనాథుడు శ్లొకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండము, భీమఖండము మరియు శివరాత్రి మహాత్మ్యములలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ, ఈస్వామే తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు. ఈ కాలానికే చెందిన అజ్జరపు పేరయలింగ కవి కూడా తన “ఒడయనంబి విలాసం”లో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ, ఇప్పటి ఈ చిన్న గ్రామమును ఒక గొప్ప పట్టణముగా చెపుతూ ఇంద్రుడు ఒక్కసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మరిచిపోతాడని అన్నాడు. ఈ సాహిత్యాధారాల వలన క్రీ.శ 14వ శతాబ్దంనాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది.
చారిత్రక ఆధారాలు
ఈ ఆలయములో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లభించిన వానిలో పురాతనమైనది క్రీ.శ 1170 కి చెందింది. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనము. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము, రెడ్డిరాజులకు చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్-ఉల్-ముల్క్ కు చెందిన దానశాసనము ఉండడం విశేషం. ప్రస్తుతము క్రీ.శ 15వ శతాబ్దము వరకూ శాసనాలు లభించాయి.
పిఠాపురం రాజావారి పాలనలో కూడా పలివెల ఒక ప్రత్యేకమైన ఠాణాగా ఉండేది. ఈ ఆధారాల వలన క్రీ.శ.10వ శతాబ్దం నుండి కూడా రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయపోషణలో ఉన్నట్లు, రాణించినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలో ఆలయ జీర్ణొద్దారణ జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ముస్లింల దండయాత్రల సమయంలో నంది తల విరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది.
కొప్పు లింగేశ్వరుడి కథ
ఇక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి స్త్రీలోలత్వం ఉండేది . అందులో భాగంగా ఆయనకు ఒక వేశ్యతో సంబంధం ఉండేది. ఆ పూజారి మీద ఆ రాజ్యపు రాజుకి చాలా పిర్యాదులు అందుతూ ఉండేవి. ఇది గమనించి ఒక రోజు ఆ రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజుకు ఇచ్చాడు. ఆ ప్రసాదంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. రాజు ప్రశ్నించగా మా శివునకు జటాజూటం ఉన్నదని రాజుకి తెలిపుతాడు.
రాజు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామికి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాత రోజు రావడానికి అంగీకరిస్తాడు. కాని శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే ఆ పుజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. రాజును చూసి భయపడి అబద్దం చెప్పాను నన్ను రక్షించండి అని పదేపదే కోరాడు. రాజు దర్శనానికి వేకువనే వచ్చి శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపించింది.
రాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చూసాడు. శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివామహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. రాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లోని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగముకు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలో కొప్పులింగేశ్వరుడుగా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు. ఆంధ్రపదేశ్ పురావస్తుశాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం, స్వామిమందిరం, కొన్ని స్తంభాలు పై ఉన్న శిల్పాలను పరిరక్షిస్తోంది.
ఆలయము గురించిన విశేషాలు
దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉన్నది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండీ ఉండినది కాదు; కాలాంతరంలో పుట్టుకొచ్చినది. ఈ ఆలయమును తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి మరియు పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశములో నిర్మించినట్లు చెబుతారు. ఈనాడు కూడా కౌసికి, వసిష్ఠలతో పాటు గర్భగుడిలో వర్షాకాలములో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును. ఇటీవల గర్భ్గగ్రుహమును గ్రానైటు రాయి పరచి బాగు చేశారు.
ఈ ఆలయము పలివెల మధ్యలో నాలుగెకరాల సువిశాల ప్రాంగణములో, ఒక దానిలో ఒకటిగా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో, చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణములో ప్రధానాలయము, ఎన్నో మండపాలు, పరివార దేవతాలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాళుక్యుల మరియు రెడ్డిరాజుల వాస్తు సంప్రదాయాలను చూడవచ్చును. ఈ ప్రాంగణములోని మండపాలు అందలి శిల్పాలలో క్రీ.శ 10వ శతాబ్దము నుండి క్రీ.శ 17వ శతాబ్దము మధ్యకాల వాస్తు-శిల్ప పరిణామమును చూడవచ్చును.ఈ ఆలయములో వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి.
ఇవి వేంగి (తూర్పు)చాళుక్యుల మరియు రెడ్డిరాజుల కాలం నాటి శిల్ప లక్షణాలు కలిగి ఉన్నాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగములో చతురస్రాకారములో ఒక పొడుచుకువచ్చిన భాగము ఉంది. దీనినే కొప్పు అంటారు. ఇందువలననే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి (ఉమాదేవి) ప్రతిష్ఠించబడి ఉంది. ఈమెకు ఉన్న ప్రభామండలమునకు రెండు వైపులా గణపతి మరియు కుమారస్వామి కూడా ఉన్నారు. సాధారణంగా శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి, అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటుంది, లేక ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది.
ఇంక వినాయకుడు, కుమారస్వాములు వేరేగా పరివారదేవతాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారు ప్రక్క ప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు. అందువలననే ఈ స్వామిని ఉమాకొప్పులింగేశ్వరుడు అంటారు. ఈవిధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేంచేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ప్రాంగణములో వినాయకుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వరస్వామి మరియు పాపవిమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడి భక్తుల పూజలందుకుంటున్నారు.
వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగానూ ఆలోచింపజేసీవిగానూ ఉన్నాయి. ఈ మొత్తము శిల్పసంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును. అవి శైవము, వైష్ణవము, సాంఘీకము మరియు ఇతరములు. శైవములో శివ-పార్వతుల వివిధ రూపాలు-వృషభారూఢమూర్తి, లింగోధ్భవమూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు మొదలైన అనేకరూపాలేకాక పురాణగాథలైన కిరాతార్జునీయం, మృగవ్యధ మొదలగు గాథలు కూడా ఉన్నాయి. వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు, లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాథలు ఉన్నాయి.
ఆలయానికి ఈ మధ్యకాలములో జరిగిన జీర్ణోద్ధరణ కార్యక్రమాల వలన పడిపోవడానికి సిధంగా ఉన్న కట్టడాలను గట్టిపరచడం, కొన్ని కొత్తకట్టడాలు చోటు చేసుకోవడంతో ఆలయము కొత్త శోభలను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఆలయము అపురూపమైన పురాతనాలయము.
పండుగలు,విశేషాలు
గణపతి నవరాత్రులు
దేవీ నవరాత్రులు
కార్తీక మాసం
సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య షష్ఠి
ధనుర్మాసం
కొప్పు లింగేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరుగుతుంది.