Category Archives: Spiritual

అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాలు

పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అని పిలుస్తారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని కొందరు కాదు 51 అని మరికొందరు.. 52 అని, 108 అని ఎవరి లెక్కలు వారు చెబుతుంటారు. అయితే ప్రధానంగా హిందువులు 18 క్షేత్రాలను శక్తి పీఠాలుగా విశ్వసిస్తుంటారు. వీటినే అష్టాదశ శక్తిపీఠాలని పిలుస్తారు. పరమశివుడి భార్యయైన సతీదేవి శరీరం 18 ముక్కలై వివిధ ప్రదేశాల్లో పడిందని.. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. పురాణ కథ శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక ఓ విషాధ గాథ ఉంది. అదేంటంటే…

బ్రహ్మ దేవుడి కుమారుల్లో దక్షప్రజాపతి ఒకరు. అతనికి 53 మంది కుమార్తెలుండేవారు. వారిలో చంద్రునికి ఇరవై ఏడుగురిని, కశ్యప మహర్షికి 13 మంది, దుర్ముణకు 10 మందిని, పితురులకు ఒకరిని, అగ్నికి ఒకరిని ఇచ్చి వివాహం చేసారు. మిగిలిన సతీదేవికి మాత్రం చిన్నతనం నుంచి శివుడంటే అపారమైన భక్తి. అయితే శివుడంటే దక్షుడికి మాత్రం చిన్నచూపు. సతీదేవి శివుడిని ఇష్టపడుతోందని తెలిసి దక్షుడు అడ్డు చెప్పాడు. అతడిని పూజించడానికి వీల్లేదని.. కన్నెత్తి కూడా చూడొద్దని హెచ్చరించాడు. అయితే తండ్రి మాట పెడచెవిన పెట్టిన సతీదేవి శివుడిని పెళ్లాడింది. దీంతో దక్ష ప్రజాపతి శివుడిపై మరింత కోపం పెంచుకున్నాడు.

ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేసాడు. ఆ కార్యక్రమానికి దేవతలందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు. అయితే సతీదేవి పిలవని పేరంటానికి బయలుదేరగా.. వద్దని శివుడు వారించాడు. పుట్టింట్లో జరిగే శుభకార్యానికి పిలుపు అవసరం లేదని శివుడి మాట జవదాటి సతీదేవి వెళ్లింది. అక్కడ జరగబోయే అవమానాన్ని ఊహించిన శివుడు ఆమెకు తోడుగా తన వాహనమైన నందిని పంపించాడు. శివుడు ఊహించినట్లే సతీదేవికి పుట్టింట్లో ఘోర అవమానం ఎదురైంది. శివ నింద సహించలేక ఆత్మాహుతి చేసుకుంది. ఆగ్రహించిన శివుడు వీరభద్రుడిని పంపించి యాగశాలను ధ్వంసం చేయించాడు. సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 18 ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అష్టాదశ శక్తిపీఠాలివే…

శాంకరి – శ్రీలంక


ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పు తీరంలో ట్రిన్‌కోమలీలో ఉండొచ్చు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందని చెబుతుంటా. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

కామాక్షి – కాంచీపురం

తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. శివ కంచిలో ఎన్నో వేల ఆలయాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అమ్మవారి ఆలయం అనేది లేదు. కేవలం కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మనకు శివకంచిలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు కనిపించవు.పురాణాల ప్రకారం అమ్మవారు వివిధ శక్తి రూపాల్లోని శక్తి నంతటిని గ్రహించి మన్మధునిలో ఆవహింప చేసింది అని పురాణాలు చెబుతున్నాయి.

సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కాని ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనం ఇవ్వగా, అమ్మవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏకామ్రేశ్వరస్వామి ఆలయం ఉండటం విశేషం.అదేవిధంగా ఏ ఆలయంలోనైనా ఆ స్వామి వారికి సంబంధించిన బీజాక్షరాలను ఒక యంత్రం పై రాసి ఆ యంత్రాన్ని పీఠం కింద ఉంచి పైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మ వారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రం మాత్రం అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉండటమే కాకుండా, యంత్రానికి పూజలను నిర్వహిస్తుంటారు. ఈ శక్తిపీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శృంఖల దేవి – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్

ఈ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ మందిరానికి సంబంధించిన ఎలాంటి గుర్తులు కనబడవు. అయితే కోల్‌కతాకు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాసాగర్ కూడా శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

శ్రీ చాముండేశ్వరి ఆలయం – మైసూరు, కర్ణాటక

అష్టాదశ శక్తి పీఠాల్లో నాలుగవదిగా చెప్పబడింది కర్ణాటకలోని మైసూర్‌లో శ్రీ చాముండేశ్వరి ఆలయం. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడి శక్తిపీఠంగా వెలిసినట్లు చెబుతారు. ఈ క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కొండపై ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఎదురుగా మహిషాసురుడి విగ్రహం ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని మహిషపురం అని పిలిచేవారి.. క్రమంగా ఇది మైసూరుగా మారిందని స్థల పురాణం.

జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణ

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ మహిమాన్విత క్షేత్రం ఉంది. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణ సిగలో మణిముకటమై వెలసింది జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణా కఠాక్షాలను చూపుతున్నారు.


భ్రమరాంబిక దేవి – శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం కొలువై ఉంది. ఇక్కడ ఆది దంపతులు భ్రమరాంబ, మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తుంటారు. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. గంగానదిలో రెండు వేల సార్లు మునిగినా, కాశీ పుణ్యక్షేత్రంలో లక్షల సంవత్సరాలు జీవించినా వచ్చే పుణ్యఫలం కేవలం శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే అంత పుణ్యఫలం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని భూమిపై వెలసిన కైలాసంగా భావిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు నుంచి 180కి.మీ, హైదరాబాద్ నుంచి 215 కి.మీ, గుంటూరు నుంచి 225 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Mahalakshmi temple in Kolhapur

మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో వెలసిన శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతుంటారు. పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడిపైఅలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని అంటుంటారు. ఇక్కడ సతీదేవి నయనాలు(కళ్లు) పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మహాలక్ష్మీ దేవి మూల విరాట్టుపై ఫిబ్రవరి, నవంబర్ మాసాల్లో సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తుంటారు. దీనినే కిరణోత్సవం అంటారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

ఏకవీరిక దేవి – నాందేడ్, మహారాష్ట్ర

ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీకి వెళ్లే భక్తులు ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు.

మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్

ఉజ్జయినిని ఒకప్పుడు అవంతీ నగరంగా పిలిచేవారు. ఇది క్షిప్రా నదీతీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించింది ఈ మహాకాళి అమ్మవారే.

పురుహూతిక దేవీ – పిఠాపురం, ఆంధ్రప్రదేశ్

పురుహూతికా అమ్మవారిని మొదటగా ఇంద్రుడు పూజించినట్లు పూరాణాలు చెబుతున్నాయి. గౌతమమహర్షి శాపం వల్ల బీజాలు కోల్పోయిన ఇంద్రుడు వాటిని తిరిగి పొందేందుకు ఈ క్షేత్రంలో జగన్మాత కోసం తపస్సు చేశాడట. ఇంద్రుడి తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఇంద్రుడి బీజాలను, సంపదను ప్రసాదిస్తుంది. అందుకే ఇంద్రుడిచే పూజింపబడటం వల్ల ఇక్కడ కొలువైన అమ్మవారిని పురుహూతికా అని పిలుస్తారని పూజారులు చెబుతున్నారు. అగస్త్య మహాముని కూడా సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ అమ్మవారికి జ‌రిగే కుంకుమార్చన‌లు ఎంతో ప్రసిద్ధి. పురుహూతికా శ‌క్తి పీఠంలో చెప్పుకోద‌గ్గ మ‌రో విశేష‌మేటింటే శ్రీ చ‌క్రం. అమ్మవారి విగ్రహం కింద భాగంలో శ్రీ చ‌క్రం భ‌క్తల‌కు ద‌ర్శన‌మిస్తోంది. ఎప్పుడు కుంకుమ‌తో క‌ప్పబ‌డి ఉండే ఈ శ్రీ చ‌క్రాన్ని ద‌ర్శించుకుంటే స‌క‌ల పాపాలు పోతాయ‌నేది భ‌క్తుల న‌మ్మకం.

గిరిజా దేవి – ఓఢ్య, ఒడిశా

అష్టాదశ శక్తి పీఠాల్లో 11వ శక్తి పీఠంగా చెప్పుకునేది శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం. ఓఢ్య పట్టణంలో వెలిసిన ఈ శక్తిపీఠం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కి 113 కిలోమీటర్ల దూరంలో వైతరిణీ నదీ తీరంలో ఉంది. ఇక్కడి ప్రజలు అమ్మవారిని బిరిజాదేవి, గిరిజాదేవి, విరజాదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిన స్థలంగా చెప్తుంటారు. ఏటా ఇక్కడ జరిగే రథయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.

మాణిక్యాంబ – ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్

ఆ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమిస్తుంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన నాటి ప్రదేశమే నేటి ద్రాక్షారామం. పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని, కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా గుర్తింపు ఉంది.

కామాఖ్య దేవి – హరిక్షేత్రం, అస్సాం

అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఈ శక్తిపీఠం అస్సాం రాజధాని గౌహతికి 8 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచలం పర్వతం మీద ఉంది. ఈ ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు, మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో, తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. ఆలయంలో మూలవిరాట్టుకు విగ్రహం ఉండదు. శిలారూపంలో యోనిముద్రగా పూజలందుకుంటున్నది. ఇరుకైన గుహలో, జలధార నడుమ ఉందీ శక్తిపీఠం. ఆషాడ మాసంలో ఐదు రోజులపాటు జరిగే అంబుబాచి మేళా ఉత్సవానికి వేలాదిగా భక్తులు వస్తారు. మిగతా రోజులలో భక్తులు తక్కువ. కొండ కోనల్లో సాధన చేసుకునే సాధుసంతులు, అఘోరాలు, తాంత్రికులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు.

అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూలకారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్

ప్రయాగలోని మాధవేశ్వరి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 14వది. ఇక్కడ దాక్షాయణి వేలు పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాధవేశ్వరీ పేరుతో కొలుస్తారు. అలోపి మాత, అలోపి శాంకరీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ విగ్రహారాధన లేదు. గర్భగుడిలో మీద కేవలం ఒక ఊయల మాత్రం ఉంటుంది. భక్తులు దానికే ప్రజలు పూజలు చేస్తారు. శక్తి పీఠాల్లో విగ్రహారాధన లేని ఏకైక క్షేత్రం ఇదే. పురాణాలను అనుసరించి శ్రీరామచంద్రుడు ఈ మాతను ఆరాధించినట్లు చెబుతారు. శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు, భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు ఉన్నాడు. ఆ సమయంలోనే ఈ మాతను కొలిచాడని చెబుతారు.

వైష్ణవి – జ్వాలాక్షేత్రం, హిమాచల్ ప్రదేశ్


ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

మంగళ గౌరి – గయ, బీహార్

బీహార్‌లోని గయలో ఉన్న మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 16వది ఈ ఆలయం కొండపైన తూర్పు ముఖంగా నిర్మించబడింది. ఈ ఆలయం లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద భక్తులు వెలిగించే దీపాలు అఖండ దీపంలా భక్తులు ప్రకాశిస్తూ వుంటాయి. ఆలయం గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంటుంది. దీన్నే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. ఆ ఆలయంలో ఎలక్ట్రిక్ దీపాలు వుండక పోవటంతో చీకటిగా ఉంటుంది. సతీదేవి తొడ భాగం ఇక్కడ పడటంతోనే శక్తిపీఠంగా వెలిసినట్లు చెబుతారు. ఈ క్షేత్రం బీహార్ రాజధాని పాట్నాకు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విశాలాక్షి – వారాణాసి, ఉత్తర ప్రదేశ్

అష్టాదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠం కాశీ విశాలాక్షి దేవి ఆలయం. ఇక్కడ అమ్మవారు గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంటుంది. ఒక రూపం స్వయంభువు, మరొక రూపం అర్చనామూర్తి. ఆలయంలోకి ప్రవేశించగానే మొదట అర్చామూర్తిని, తర్వాత స్వయంభువును దర్శించుకోవాలి. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలది అని అర్థం. విశాలాక్షి దేవి కొలువుదీరిన అత్యంత పుణ్యప్రదమైన క్షేత్రం వారణాసి. కాశీ పట్టణాన్నే వారణాసి అని పిలుస్తారు. వరుణ మరియు అసి అను నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి. వారణాసి భారతీయులందరికీ ఆరాధ్య పుణ్యక్షేత్రం. సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా ఈ క్షేత్రం పేరుపొందింది.

సరస్వతి – జమ్మూకాశ్మీర్

అష్టాదశ శక్తిపీఠాల్లో చివరిది శ్రీసరస్వతీ దేవి శక్తిపీఠం. కాశ్మీర్‌ ప్రజలు అమ్మవారిని కీర్ భవాని అని పిలుస్తారు. ఈ ఆలయం శ్రీనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరస్వతి అమ్మవారు పరమశాంతమూర్తి, శ్రీహరిప్రియ, నాలుగు చేతులతో వీణా, పుస్తక జపమాల ధరించి అభయ ముద్రతో ప్రకాశిస్తుంది. సతీదేవి కుడి చెంప భాగం కాశ్మీర్ ప్రాంతంలో పడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ అమ్మవారిని శారికాదేవి అమ్మవారుగా స్థానికులు కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు మౌన శిలలో ఒక మూలన గల గుంటలో నీరు ఉద్బవిస్తుంది. ఆ గుంటలో ఎంత నీరు తీసుకుంటే అంత నీరు మళ్ళీ పుడుతుంది. భక్తులు ఈ నీటిని అమ్మవారి తీర్థంగా తీసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలకి ఈ ఆలయం శిధిలం కావడంతో ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ అమ్మవారి శక్తినీ సువర్ణ శారదాదేవి రూపంలో మరియు యంత్రంలో ఆవాహన చేసి కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి తరలించారని పురాణాలు చెబుతున్నాయి.


దట్టమైన అడవిలో మహిమాన్విత క్షేత్రం .. ‘గుండాల కోన’

ఎటు చూసినా జలం, ఆకాశం కుండ పోతగా వర్షిస్తోంది… చుట్టూ జీవం నింపుకుని ఆకుపచ్చగా కళకళలాడుతున్న భూమి… కుంభవృష్టిలో తడిసి ముద్దవుతున్న నేలని చూస్తుంటే ఆ నేల ఆసాంతం ఒక పెద్ద శివ లింగంలాగా, ఆకాశం పూజారిగా మారి నిండు గా అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుంది. చుట్టూ పచ్చిక బయళ్లు… ఆపై జలజల పారే సెలయేళ్లు… ఇదంతా కడప జిల్లాలోని గుండాలకోన గురించే.

కొట్రాల గుండాలు, చెంచమ్మకోన, వాననీళ్ళ గుట్టలు, మలిట్లకోన, పెద్ద కంజులు, చిన్న కంజులు, ముంతతువ్వ బండలు, జాలకోన, యానాది ఊట్ల, దొంగబండలు, ఊరగాయకుంట, కమ్మపెంట, కుందేలుపెంట, ఈతకాయ బండలు, కోటమారుకుంట, ఏనుగుల బావి, స్వామి వారి పాదాలు(ఆ పాదాలు కొలిచే వీలులేని ఎత్తులో అద్భుతంగా ఉంటాయి) కోతులకుప్ప, నెప్పోడిసెల, కందిరేవులు, మట్లకోన, సలీంద్ర కోన.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. గుండాలకోనలో గుంజన జలపాతం, ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి, పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుంచి దాదాపు 8కిలోమీటర్ల దూరంలో రిజర్వు ఫారెస్టులో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాలకోన ఉంది. వెంకటగిరి కొండలమీదుగా 6 గుండాలను దాటుకుని 7వ గుండంలోనికి సుమారు 30 అడుగుల ఎత్తునుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది. గుండాల కోనలో వర్షాకాలంలో అతి ఉధృతంగాను, వేసవికాలంలో కూడా బాగానే నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న గుండం లోతు చూసిన వారు లేరని స్థానికుల కథనం.

కార్తీక మాసంలోనూ, శివరాత్రి పర్వదినాలలోనూ భక్తులు ఈ క్షేత్రాన్ని విశేషంగా దర్శిస్తారు. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ (పేటు)వుంది. ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. గుహ ద్వారంలో భక్తులు పూజలు, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. సంతానం లేని మహిళలు గుండం సమీపంలోని వృక్షాలకు మొక్కుబడిగా ఊయలలు కడుతారు. ఎత్తైన కొండల మధ్యలో భీకర శద్ధం చేస్తూ నీటి ప్రవాహం, సెలయేళ్ల గలగలలు ఆకాశాన్ని తాకినట్టుండే మహావృక్షాలు, పచ్చదనంతో ఈ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రకృతి అందాలకు నెలవైన ఈ గుండాలకోన దాదాపు 300 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మనుమరాలైన ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు (నగరిపాడు రంగనాయకుల స్వామి) కొంతకాలం ఈ గుండాలకోనలోనే తపస్సు చేశాడట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయరూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడని చెబుతారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి భక్తులు 8కిలోమీటర్లు నడవాల్సిందే. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు. శివరాత్రి పర్వదినాన వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శిస్తారు.


సంతానాన్ని ప్రసాదించే వెంకన్న.. పాలకొండ్రాయుడు

కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు… భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతమే పాలకొండ్రాయుడి క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిశాడని చెబుతారు. వేంకటేశ్వరస్వామే పాలకొండ్రాయుడిగా ఇక్కడ వెలిశాడని అంటారు. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు… తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు.

స్థల పురాణం
ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ-సరస్వతి దగ్గరకు వెళ్తే ఆ ఇద్దరూ మహర్షిని పట్టించుకోలేదు. ఆ తరువాత కైలాసానికి వెళ్లినా అదే అవమానం ఎదురుకావడంతో ఆగ్రహానికి గురైన భృగు చివరకు వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పంపైన విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపైన తన్నాడు. దాంతో నారాయణుడు భృగుని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ రుషి పాదాలను నొక్కడం ప్రారంభించాడట. ఆ రుషి అరిపాదంలో మూడో కన్ను ఉండటం వల్లే భృగుకి అహంకారం ఎక్కువని అంటారు. అందుకే అతని అరి పాదంలోని మూడోకంటిని చిదిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి, తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్లిపోయాడట.

ఆ తరువాత లక్ష్మీదేవి… తాను నివసించే వక్షస్థలంపైన ఓ మహర్షి తన్నడాన్ని సహించలేక వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది. దాంతో శ్రీహరి దేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరాడు. అలా స్వామి మొదటిసారి ఈ ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని కథనం. తన దేవేరిని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఓ లోయలో పడిపోవడంతో మహావిష్ణువు కోసం బ్రహ్మ, శివుడు ఆవు-దూడ రూపాల్లో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీర్చారనీ… అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చిందనీ అంటారు. అప్పటినుంచీ నారాయణుడిని పాలకొండ్రాయుడిగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మథనం సమయంలో కొన్ని పాల చుక్కలు ఈ కొండపైన పడటం వల్ల ఈ ప్రాంతానికి క్షీరశైలమనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. ఈ ఆలయానికి సమీపంలో భృగుమహర్షి నదిలా ఏర్పడి భృగువంకగా మారాడని అంటారు. క్రమంగా అదే బుగ్గవంకగా మారిందనీ.. ఆ నది నీళ్లే అటు దేవుని కడపలో రాయుడినీ, ఇటు పాలకొండ్రాయుడినీ అభిషేకిస్తున్నాయనీ చెబుతారు.

ఇక్కడ పాలకొండ్రాయుడి మూర్తితో పాటు పద్మావతీదేవినీ, నవగ్రహాలనూ, ఉగ్ర నారసింహుడినీ దర్శించుకోవచ్చు. సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానం చేసి తడి వస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. అలా పుట్టిన పిల్లలకు పాలకొండ్రాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ, కొండమ్మ అనే పేర్లు పెడుతుంటారనీ చెబుతారు.

ఇలా చేరుకోవచ్చు
కడప వరకూ రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి. ఈ పట్టణం నుంచి ఆలయం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప పట్టణం నుంచి రాజంపేటకు వెళ్లే బైపాస్‌ రహదారి మీదుగా పాలకొండలకు చేరుకోవచ్చు. కొండపాదం వరకూ వాహనాల్లో అక్కడి నుంచి నడకమార్గాన ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం… ఎక్కడో తెలుసా

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్‌లో కొలువుదీరింది. రాజ్‌సమంద్‌ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ‘విశ్వాస్‌ స్వరూపం’గా పేర్కొనే ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొనే ఈ విగ్రహం విశేషాలేంటో చూద్దామా..!

ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45కి.మీల దూరంలో తత్‌ పదమ్‌ సంస్థాన్‌ అనే సంస్థ నిర్మించింది. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. శివుడి విగ్రహాన్ని నిర్మించేందుకు మూడు వేల టన్నుల స్టీల్‌ వినియోగించారు. అలాగే, 2.5లక్షల క్యూబిక్‌ టన్నుల కాంక్రీట్‌, ఇసుకను వాడారు.

ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు పదేళ్ల సమయం పట్టింది. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ సీఎంగా ఉన్న అశోక్‌ గహ్లోత్‌, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు. ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించారు. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్‌ కాంతుల్లో రాత్రి పూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుందని మాలి పేర్కొన్నారు. 250కి.మీల వేగంతో వీచిన గాలినైనా తట్టుకొగలిగే సామర్థ్యంతో నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్‌ టన్నెల్‌ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు.

ఈ పర్యాటక ప్రాంతానికి విచ్చేసిన పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగీ జంపింగ్‌, జిప్‌ లైన్‌, గో కార్ట్‌, ఫుడ్‌ కోర్టులు, అడ్వెంచర్‌ పార్కు, జంగిల్‌ కేఫ్‌ వంటివి ఉన్నాయి. శనివారం శివుడి విగ్రహం ఆవిష్కరణ తర్వాత తొమ్మిది రోజులు (అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 6 వరకు) పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


కొత్తపేట అష్టలక్ష్మీ ఆలయం

విశాలమైన ప్రాంగణంలో అష్టలక్ష్ములూ కొలువుదీరి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న క్షేత్రం.నిత్య పూజలూ… ప్రత్యేక ఉత్సవాలతో ఏడాది మొత్తం కళకళలాడే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలూ కలుగుతాయని ప్రతీతి. ఈ అష్టలక్ష్మీ ఆలయం హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉంది. శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి సమేతంగా మూలవిరాట్టుగా కొలువుదీరితే ఆ విగ్రహమూర్తుల చుట్టూ సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మహాలక్ష్మి ఆశీనులై దర్శనమిచ్చే క్షేత్రమే అష్టలక్ష్మి దేవాలయం.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న ముప్ఫై ఎకరాలను వాసవీ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అమ్మడంతో 300 పైగా కుటుంబాలు ఇక్కడ సొంత ఇళ్లు నిర్మించుకున్నాయి. క్రమంగా ఈ ప్రాంతం వాసవీ కాలనీగా మారింది. ఆ ఇళ్ల మధ్యలో ఖాళీగా ఉన్న కొండభాగాన్ని వదిలేయకుండా అక్కడ ఏదో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న కాలనీ వాసులు ప్రముఖ శిల్పి గణపతి స్తపతి సలహాతో… అష్టలక్ష్మి దేవాలయాన్ని కట్టించాలనుకున్నారు. చివరకు కంచికామ కోటి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతీ, విజయేంద్ర సరస్వతులు శంకుస్థాపన చేయడమే కాకుండా… వాళ్ల సలహాలూ సూచనలతో నిర్మాణం మొదలైందనీ ఇరవై ఆరేళ్లక్రితం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనీ చెబుతారు ఆలయ నిర్వాహకులు.

రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో మొదటి అంతస్తులో అష్టలక్ష్ములను దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే నిత్య ప్రవచన మండపం, యాగశాల, చక్రతీర్థం, రథశాల, భోజనశాల… ఇలా అన్నీ ఉంటాయి. ఇవి కాకుండా సనాతన ధర్మాన్ని బోధించేందుకు శారదా శిశు విద్యాలయం పేరుతో ప్రత్యేక పాఠశాలనూ నిర్వహిస్తోందీ ఆలయం. ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుడూ అష్టలక్ష్ములూ కాకుండా… అభయ గణపతి, కృష్ణుడు, గోదాదేవి, గరుడస్వామి, సుదర్శన లక్ష్మీనరసింహస్వామి…. తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయాన్ని సందర్శిస్తే కీర్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం, ఆనందం… వంటివన్నీ పొందవచ్చని భక్తుల నమ్మకం. ఇక్కడ రోజువారీ పూజా కార్యక్రమాలూ, రెండుపూటలా నిత్యహోమాలూ జరుగుతాయి. ఇవి కాకుండా వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మి వ్రతాలు… దీపావళి నాడు అష్టలక్ష్ములకు విశేష పూజలు… కార్తికంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ఆకాశ దీపోత్సవం… ధనుర్మాసంలో గోదారంగనాథస్వామి కల్యాణం… ఇలా ఏడాది మొత్తం జరిగే విశేష పూజల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు… తదితర ప్రాంతాల నుంచీ భక్తులు వస్తారు. ప్రతిరోజూ ఆలయంలో పూజా కార్యక్రమాలను చేశాక అర్చకులు గోమాతనూ పూజిస్తారు. తరవాత ఆ గోమాతను ఆలయ ప్రాంగణం చుట్టూ తిప్పాకే… భక్తులను అనుమతిస్తారు.

ఎలా చేరుకోవచ్చు

అష్టలక్ష్మి దేవాలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు దగ్గర్లో కొత్తపేటలో ఉంటుంది. కొత్తపేట వరకూ వచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులూ ఆటోలూ అందుబాటులో ఉంటాయి. మెట్రో రైలులో వెళ్లేవారు విక్టోరియా మెమోరియల్ స్టేషన్‌లో దిగి నడుచుకుంటూ వెళ్లొచ్చు.


శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా?… లింగ రూపంలో పూజిస్తే మంచిదా?

శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా.. లింగరూపంలో ప్రణమిస్తే మంచి ఫలితాలు కలుగుతాయా? అన్న అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పారు. శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారి కంటే, శివలింగారాధన చేసేవారిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు. మనకు లోకంలో అనేక రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో రెండు లింగాల గురించి చెప్పుకుందాం….

లింగం అంటే గుర్తు, ప్రతిరూపం అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది. కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ….. ఇలా కదలని వాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం. అలాగే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే.

రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమి కీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది. మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ.. అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.


సైన్స్‌కే అంతుబట్టని శివాలయాలు.. ఎన్నో వింతలు

మహానంది.. శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో అయినా కొనేరులో నీరు గోరు వెచ్చగానే ఉంటుంది.

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు – కనిగిరి మధ్య)
కె. అగ్రహారంలోని కాశీవిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.

కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతాడు. ఇది అద్భుతం.

అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.

వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడిలో సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.

ద్రాక్షారామంలో శివలింగాన్ని నిత్యం ఉదయం, సాయత్రం సూర్య కిరణాలు తాకుతాయి.

భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతుంది.

కోటప్పకొండలో ఎటుచూసినా మూడు శిఖరాలే కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు.

గుంటూరు జిల్లా చేజర్లలో కపోతేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడి లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లుపోస్తే శవం కుళ్లిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.

బైరవకోన: ఇక్కడికి కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.

యాగంటి: ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు

శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు “జుం”తుమ్మెద శబ్దం వినపడేదట

కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు శివలింగంగా మారింది. ఈ ఆలయంలో ఏడాదిలో ఆరు నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది.

శ్రీకాళహస్తిలో వాయు రూపములో శివలింగం ఉంటుంది.

అమర్‌నాథ్‌లో శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.

కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజుల్లో ఒక్క చుక్క కూడా కనిపించదు.

మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.

తమిళనాడులోని తిరు నాగేశ్వరములో శివ లింగానికి పాలు పోస్తే నీలం రంగులోకి మారుతాయి.

చైనాలో కిన్నెర కైలాసము
ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా.. మధ్యాహ్నం పసుపుగా.. సాయంత్రం తెలుపుగా.. రాత్రి నీలంగా మారుతుంది.


కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం
న దేవః కేశవాత్పరః


అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజూ పుణ్యప్రదమే. ఒక్కోరోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం…


కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి : దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీ స్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.


కార్తీక బహుళ పాడ్యమి: ఆకుకూర దానం చేస్తే మంచిది.
విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.


యమవిదియ…భగినీ హస్త భోజనం

భారతీయ సంప్రదాయంలో రక్తసంబంధాలకీ, అనుబంధాలకీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలుపుకొనేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు. అందుకు గొప్ప ఉదాహరణే యమవిదియ. ఇది దీపావళి నుంచి రెండోరోజున వస్తుంది.

చారిత్రక గాథ
ఓసారి యమ ధర్మరాజు సోదరి యమునా నదికి తన అన్నను చూడాలని అనిపించింది. త‌న ఇంటికి వ‌చ్చి చాలా రోజులైంది కాబ‌ట్టి, ఓసారి వ‌చ్చి వెళ్లమ‌ని గంగాన‌ది ద్వారా య‌ముడికి క‌బురుపెట్టింది. ఆ క‌బురు వినగానే యముడు.. య‌మునాదేవి ఇంటికి వెళ్లాడు. తన అన్నను సాద‌రంగా ఆహ్వానించి, క‌డుపునిండా భోజ‌నం పెట్టింది. చెల్లెలి అనురాగానికి సంతోషించిన య‌ముడు, ఏం వ‌రం కావాలో కోరుకోమ‌న్నాడ‌ట‌. అందుకు య‌మున నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు… అదే గొప్ప వ‌రం అని చెప్పింది.

యముడు ఆ వ‌రానికి త‌థాస్తు చెప్పడ‌మే కాకుండా ఎవ‌రైతే ఆ రోజున త‌న సోద‌రి ఇంట్లో భోజ‌నం చేస్తారో వాళ్లు అకాల‌మృత్యువు నుంచి, న‌ర‌క‌ లోకం నుంచీ శాశ్వతంగా త‌ప్పుకుంటార‌ని చెప్పాడ‌ట‌. ఆ రోజున తన సోదరులని సేవించుకున్న సోదరికి వైధవ్యం ప్రాప్తించదని కూడా వరాన్ని అందించాడు. అందుకే ఈ రోజుని యమద్వితీయం అని పిలుస్తారు. నరకాసురుని సంహరించి వచ్చిన శ్రీకృష్ణుని అతని సోదరి సుభద్ర సాదరంగా ఈ రోజునే ఆహ్వానించిందనీ, అందుకు గుర్తుగా భాతృ విదియ మొదలైందని కూడా చెబుతారు.

ఆడపిల్లలకి పెళ్లి అయిపోగానే తమ పుట్టింటి నుంచి దూరం అవుతారు. పురుళ్లూ పుణ్యాలకు హడావిడిగా రావడమే కానీ, తల్చుకున్నప్పుడు ఓసారి తన పుట్టింటివాళ్లను చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇక వాళ్ల సోదరుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. బావమరదులుగా ఎంత బతకకోరినా, వీలైనప్పుడల్లా సోదరి ఇంటికి వెళ్లే స్వాతంత్ర్యం, అవకాశం ఉండకపోవచ్చు. తన సోదరి కాపురం ఒక్కసారి చూడాలని వారికీ, తన సోదరునికి ఒక్కసారి కడుపారా భోజనాన్ని పెట్టాలన్న తపన వీరికీ తీరని కోరికగానే మిగిలిపోతుంది. అందుకే ఈ భాతృ విదియను ఏర్పరిచారు మన పెద్దలు. దక్షిణాదిన ఈ పండుగను కాస్త తక్కువగానే ఆచరిస్తారు కానీ, ఉత్తరాదికి వెళ్లే కొద్దీ ఈ పండుగ ప్రాముఖ్యం మరింతగా కనిపిస్తుంది. నేపాల్‌లో అయితే ఆ దేశ ముఖ్య పండుగలలో దీన్ని కూడా ఒకటిగా ఎంచుతారు. ఉత్తరాదిన ఈ పండుగను భాయిదూజ్‌, భాయిటీకా, భాయితిహార్‌… వంటి భిన్నమైన పేర్లతో పిలుచుకుంటారు. దీపావళి పండుగ వీరికి భాతృ విదియతోనే ముగుస్తుంది.


పంచారామ క్షేత్రాలు.. ఆంధ్రాలో మాత్రమే ఉన్న అరుదైన శివాలయాలు

మహాశివరాత్రి, కార్తీక మాసంతో పాటు అనేక పర్వదినాల్లో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివ లింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని

పంచారామాలు ప్రముఖమైనవి. పేరుకు తగినట్లుగానే పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలు ఇవి. దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకం. ఈ ఐదు దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో వివిధ పట్టణాల్లో ఉన్నాయి. ఇంతకీ ఈ క్షేత్రాల విశిష్టతలు ఏమిటి? ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పంచారామాల చరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాల పుట్టుకకు సంబంధించి అనేక పురాణ గాధలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాధుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం.. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహా విష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంపిణీ చేశాడు. అయితే త్రిపురాసురులు మాత్రం (రాక్షసులు) ఈ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కోసం ఘోర తప్పసును ఆచరిస్తారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వివిధ వరములను అనుగ్రహిస్తాడు. ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్లి తమను రాక్షసుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటారు. దేవతల మొర ఆలకించిన మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ శివలింగాన్నే దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు.

అయితే స్కాంధ పురాణంలోని తారకాసుర వధ ఘట్టం ప్రకారం పంచారామాల పుట్టుక ఈ విధంగా ఉంది. హిరణ్య కశిపుడి మనుమడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. బాలలు ఎవ్వరూ తనను ఏమీ చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరుకుంటాడు. పరమేశ్వరుడు తథాస్తు అనడంతో ఆ వరగర్వంతో దేవతలను ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు.

దీంతో తారకాసురున్ని నిలువరించేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి దిగుతాడు. ఆ భీకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు. ఆ సమయంలో ఐదు భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని ఐదు చోట్ల ప్రతిష్ట చేశారు. అవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలు.

  1. ద్రాక్షారామం

దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు. ఈ పంచారామ క్షేత్రం కోనసీమ జిల్లాలో కొలువై ఉంది. రెండు అంతస్తుల్లో 60 అడుగుల ఎత్తులో స్వామి వారి శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. రెండో అంతస్తు పై భాగం నుంచి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామి వారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామి వారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భారతదేశంలోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి.

అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రతి ఒక్కరికీ ఓ మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. క్రీస్తు శకం 892-922 మధ్య చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. కాకినాడ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. అమలాపురం నుంచి వెళ్లేవారు ముక్తేశ్వరం వద్ద గోదావరి నది దాటి కోటిపల్లి నుంచి రోడ్డు మార్గంలో చేరుకుంటారు.

  1. అమరారామం

ఈ క్షేత్రం పల్నాడు జిల్లా అమరావతిలో ఉంది. పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. రెండు అంతస్తుల్లో 16 అడుగుల ఎత్తుతో ఈ స్పటిక శివలింగం ఉంటుంది. రెండవ అంతస్తుపై నుంచి స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అమ్మవారు బాలచాముండి, క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. తారకాసురుడి సంహారం తరువాత చెల్లాచెదురైన ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థల పురాణం. ఈ ఆలయం మొత్తం మూడు ప్రాకారాలతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రాకారాల్లో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను ఇవి రెట్టింపు చేస్తాయి. గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ పంచారామ క్షేత్రం ఉంది.

  1. క్షీరారామం

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో క్షీరారామం ఉంది. శివుడు భూమిపై తన బాణాన్ని వదిలినప్పుడు అది ఈ ప్రదేశంలో పడి భూమి నుంచి క్షీరదార వచ్చినట్లు కధనం. దీని కారణంగానే ఈ ప్రాంతం క్షీరపురిగా, కాలక్రమంలో పాలకొల్లుగా మార్పు చెందినట్లు చెబుతారు. క్షీరారామం ఆలయాన్ని 11వ శతాబ్ధంలో చాళుక్యులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెల్లని రంగులో రెండున్నర అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడి శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతా యుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. మొత్తం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో ఎంతో సుందరంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడింది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయాన పెద్ద గోపురం నుంచి సూర్య కిరణాలు శివలింగంపై పడే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది.

  1. సోమారామం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గునిపూడిలో ఈ క్షేత్రం ఉంది. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 3వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించిన కారణంగా దీనికి సోమారామం అని పేరొచ్చింది. స్వామి వారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటారు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుగు, నలుపు రంగులో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణమి నాటికి తిరిగి యథారూపంలోకి వస్తుంది. ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి కింది అంతస్తులోనూ, అన్నపూర్ణా దేవి అమ్మవారు పైఅంతస్తులో ఉంటారు.

  1. కుమార భీమారామం

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ ఆలయం ఉంది. సున్నపురాయి రంగులో 60 అడుగుల ఎత్తైన రెండస్తుల మండపంలో ఇక్కడి శివలింగం ఉంటుంది. ద్రాక్షారామం క్షేత్రాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీమునిచే ఈ ఆలయం నిర్మించబడింది. అందుకే ఈ రెండు క్షేత్రాల నిర్మాణ శైలి ఒకే విధంగా అనిపిస్తుంది. ఆలయ ద్వారాల నుంచి కొలను వరకూ ప్రతి నిర్మాణంలోనూ పోలిక కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి 922 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.