Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
ప్రస్తుతం జనరేషన్ వాళ్ళు మారిన కాలానికి అనుగుణంగా తమ సంస్కృతిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. కాలం ఎంత మారినా ఇప్పటికీ ఎన్నో హైందవ కుటుంబాలలో కొన్ని ఆచారాలు ఇంకా మనుగడలో ఉన్నాయి. పవిత్రమైనటువంటి ప్రత్యేకమైన రోజులలో మాంసం తినకపోవడం అనేది ఇప్పటికీ హిందువుల్లో ఎందరో పాటించే ఒక ముఖ్యమైన ఆచారం.
మామూలుగా చాలా మంది వారంలో కొన్ని రోజుల్లో అలాగే ఏకాదశి, సంక్రాంతి ,దసరా, సంకట చతుర్థి ,అక్షయ తృతీయ ,దీపావళి ఇలాంటి పర్వదినాలలో మాంసాహారాన్ని ముట్టరు. ఇది మూఢనమ్మకము అని కొందరు కొట్టి పారేసిన దీనికి సాంకేతికంగా కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి అవేమిటో తెలుసుకుందాం…
భారత భూమి తపో భూమి, ఇప్పటికీ చాలామంది మన సంస్కృతికి సంప్రదాయాలకు విలువనిస్తారు. మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన ఎన్నో ఆచారాలలో వారంలో కొన్ని రోజులు మాంసాహారం ముట్టకపోవడం కూడా ఒకటి. ఇలా కొన్ని రోజులు మాంసాహారాన్ని కట్టడి చేయడం వెనక అసలు కారణం, వారం అంతా మాంసాహారం తినడం వల్ల శరీరానికి కలిగే దుష్ప్రయోజనాలే. పైగా వారం అంతా మాంసాహారమే తింటే ఈ భూమిపై మిగిలిన జీవరాశులకు మనుగడ లేకుండా పోతుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రోజులలో జంతు హింస పాపము అని చెబుతారు.
మన శరీరానికి అన్ని రకాల పోషక విలువలు అవసరం. అవి కేవలం మాంసాహారంలోనే దొరకవు కాబట్టి మనిషి అన్ని రకాల కూరలు, పండ్లు తమ రోజువారి ఆహారపు అలవాట్లలో ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ తరం మనుషులు రోజు బయట బిర్యాని తింటున్నామని చెప్పడం గొప్పగా భావిస్తున్నారే తప్ప అది వారి ఆరోగ్యం పై ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది మర్చిపోతున్నారు. రోజు మాంసం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. పెద్ద పేగు క్యాన్సర్, పైల్స్ ,రక్తపోటు గుండెపోటు, అల్సర్ ఇలా ఎన్నో సమస్యలతో మనిషి సతమతమయ్యే అవకాశం ఉంది.
మామూలుగా చెప్తే వినరు కాబట్టి మతం అని ,శాస్త్రం అని పెద్దలు మనకు మంచి సూక్తులు చెప్పారు. వాటిని ఆచరించడం వల్ల ఎటువంటి తప్పులేదు. కానీ కొందరు చాందస్సులు మూర్ఖంగా వితండవాదం చేయడానికి వీటన్నిటిని అంద విశ్వాసాల కింద లెక్క కడతారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఆచరించాలి తప్ప మూర్ఖంగా మాట్లాడడం సరికాదు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోరికలు తీర్చే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినది. పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. దానిప్రకారం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి.
ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రం. ఈ ఆలయం చుట్టూ ఉన్న దేవాలయాలను నిర్మించడానికి సుమారు 220 సంవత్సరాల కాలం పట్టింది. ఈ ఆలయ లింగ ప్రతిష్ట వెనుక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
పూర్వం అర్జునుడి మునిమనవడయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ కాలాన్ని గడిపాడు. ఆవిధంగా జపం చేస్తున్న నరేంద్రునికి ఒకరోజు కొలనులో ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని అతను ఇప్పుడున్న వేములవాడ ప్రాంతంలో ప్రతిష్టించి భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరేంద్రుడు తనని బ్రహ్మ హత్యాపాతకం నుండి విమోచనం చేయవలసిందని కోరగా శివుడు అతడికి విముక్తి ప్రసాదిస్తాడు.
ఈ విధంగా ఏర్పడిన ఈ క్షేత్రం ‘లేంబాల వాటిక’గా, ‘భాస్కర క్షేత్రం’, ‘హరిహర క్షేత్రం’గా పిలవబడింది. ఈ రాజేశ్వర ఖండంకు సంబంధించిన కథ భవిష్కోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి వుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది. ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమకం.
ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తూ ఉండేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా… ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఆలయ ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది. ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో..ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే గణేశుడి ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని పిలుస్తారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడులో పరిధిలోకి వచ్చింది. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజుల్లో ‘కేరళపురం’ రాజు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ బయలుదేరారు. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం సముద్ర కెరటాల్లో తడుస్తూ కనిపించింది. రాజు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుకి అప్పగించబోతే దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మమని అని భావించి రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు.
అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి ఈ గణపతి మాత్రం మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది నమ్మకం.
సకల దేవతగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలి పూజ గణనాధునికే. ఆయన అనుగ్రహాం పొందితే అన్ని కార్యం జయమవుతుంది. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు.
తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
పార్వతీ చంద్రుని శపించిన సమయంలోనే సప్తఋషులు తమ భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని త్వజించారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వల్లే ఋషి పత్నులు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవిని శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.
భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడి ఆవు పాలను పితుకుతుండగా పాత్రలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందోనని చింతించాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు అనే రాజు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు తనకు ఆ మణిని ఇవ్వమని సత్రాజిత్తును కోరాడు. దీనికి సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. తనపై ఉన్న నిందను పోగొట్టుకోడానికి మణిని వెదుకుంటూ అడవులకు వెళ్లిన జాంబవంతుడితో యుద్ధం చేసి తిరిగి దానిని సత్రాజిత్తుకు అప్పగించాడు.
శాస్త్రీయ దృక్పథం ఇది.. సాధారణం వినాయక చవితిని చాంద్రమానంలోని ఆరో నెలలో జరుపుకుంటాం. అంటే ఆగస్టు లేదా సెప్టెంబరులో ఈ పండుగ వస్తుంది. అయితే భాద్రపద శుద్ధ చవితి ముందు రోజు, మర్నాడు కూడా చంద్రుని చూడరాదు. నాలుగో రోజైన చవితిని వృద్ది చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు. అదే సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటాయి. ఈ సమయంలో భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రోజున చంద్రుని చూడరాదని పురాతన భారతీయులు పేర్కొన్నారు. దీన్ని ఓ మూఢనమ్మకంగా కొందరు పేర్కొంటున్నా వెనుకున్న శాస్త్రీయ దృక్పథం మాత్రం ఇదే.
వినాయకుడి పుట్టిన రోజైన (Lord Ganesh Birthday) ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ (Vinayaka Chavithi) పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి (Vinayakachavithi Pooja) రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.
పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.
వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.
దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానం ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.
శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి… అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.
తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది తప్పకుండా దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.
ఆలయ చరిత్ర చిత్తూరు జిల్లాలో బాహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడైతే, మిగతా ఇద్దరు మూగ, చెవిటివారిగా పుట్టారు. కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు కమ్మేసింది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు. పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పారకమ్ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది.
విగ్రహంలోనూ ఎదుగుదల బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహంలోనూ ఎదుగుదల ఉండడం విశేషం. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు.
సత్యప్రమాణాల దేవుడిగా.. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్షపడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతోపాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. అసెంబ్లీలో నాయకులు సైతం ఆరోపణలు వచ్చిన సమయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాళ్లు విసురుకోవడం గమనార్హం. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం.”బ్రహ్మహత్యా పాతక నివృత్తి” కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది.
ఆలయంలో సర్పం ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు.
శ్రీ వరదరాజస్వామి ఆలయం
శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దీన్ని కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది. అద్దాల మేడ వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంది. కాణిపాకం మూడో వంతు వివిధ దేవాలయాలతో నిండి వుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా మతాలకు చెందిన ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో కెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం గల పుణ్య క్షేత్రం తిరుమల. అయితే తిరుమలకు, ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గూర్చి అందరికీ తెలుసు. అక్కడ ఏడుకొండల్లో కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే అన్ని సమస్యలు పోయి, కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.
అయితే వెంకటేశ్వర స్వామికి అంతటి ఆదాయం వస్తుండడాన్ని పక్కన పెడితే ఆయనను భక్తులు రెండు పేర్లతో పిలుచుకుంటారు. అది ఒకటి ఆపదమొక్కుల వాడని, ఇంకోటి వడ్డీ కాసుల వాడని. కోరిన కోర్కెలు తీర్చి, ఆపదల నుంచి గట్టెక్కించి అంతా శుభమే కలిగించేవాడు కావడం వల్ల ఆయనకు ఆపద మొక్కుల వాడని పేరు వచ్చింది. అయితే వడ్డీ కాసుల వాడనే పేరు రావడం వెనుక గల కారణం ఈ విధంగా చెబుతారు.
ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట. అయితే లక్ష్మీ దేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఈ క్రమంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లికయ్యే ధనం మొత్తం ఇచ్చాడట. ఒక సంవత్సరంలోగా ఆ అప్పు తీర్చేస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పాడట. అయితే తీరా సంవత్సరం దాటేసరికి వెంకటేశ్వర స్వామి ఆ ధనం అప్పు తీర్చకుండా వడ్డీ కడతాడట. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగీ పెరిగీ చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుందట. అయితే ఇన్ని యుగాలైనా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నాడట. అందుకే ఆయనకు వడ్డీ కాసుల వాడని పేరు వచ్చిందని చెబుతుంటారు.
అమావాస్య నాడు హనుమంతుని ప్రార్థన అమోఘం అంటున్నారు పండితులు. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.
అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.
ఏమిటా కథ.. 500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు. కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని (సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు.
ఇందుకోసం స్వామివారిని వేడుకోగా ‘రాత్రి రోకలిపోటు తరువాత మొదలుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తాడు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.
ఆదివారం సెలవెందుకు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 – 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.
ఆ మూడు మాసాల్లోనూ అంతే.. ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.
అంత్యక్రియలకూ సెలవే… కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.
ఎలా చేరుకోవచ్చు… బనగానపల్లె మండలం నందివర్గం నుండి సుబ్బారాయుడు కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ నుండి ఆటో సదుపాయం ఉంటుంది.
శ్రీ కృష్ణుని ఆరాధన కేవలం హిందూమతం, భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు.. విదేశాల్లో శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు, అంగరంగ వైభవంగా వేడుకలు కూడా నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమి రోజున భారతదేశంలోని ప్రముఖ కృష్ణ దేవాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే శ్రీకృష్ణుని జన్మభూమి అంటే మాత్రం చాలా మధుర, గోకుల బృందావన ఆలయాలనే భావిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో కూడా ప్రముఖ వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణుడి, వేణు గోపాల స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చారిత్రక ప్రాధాన్యం ఉండే గుళ్లు ఎన్నో ఉన్నాయి. వీలైతే వీటిని ఓసారి సందర్శిచేయండి.
శ్రీకృష్ణ మఠం, ఉడిపి
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శ్రీ కృష్ణుని ఆలయాల్లో ఉడుపి శ్రీకృష్ణ మఠం ఒకటి. ఇది కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కేంద్రంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న వేణు మాధవుడిని నవ రంధ్రాల కిటికీ నుండి మాత్రమే పూజిస్తారు. భక్తులకు కిటికీ నుండి మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఈ ఆలయం చెక్క మరియు రాతితో నిర్మించబడిందది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనులోని నీటిలో గుడి గోపురానికి సంబంధించిన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
గురువాయుర్ దేవాలయం, కేరళ
దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనూ అనేక ప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గురువాయుర్ దేవాలయం. దీన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇది విష్ణువు యొక్క పవిత్ర నివాసంగా భావిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో వరదలు వచ్చినప్పుడు కృష్ణుడి విగ్రహం కొట్టుకుపోయిందని, దాన్ని గురువు రక్షించాడని చాలా మంది నమ్ముతారు. ఈ విగ్రహాన్ని కేరళలో గురు దేవుడు వాయు దేవుని సహాయంతో ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే కేరళలోని శ్రీ కృష్ణ దేవాలయం గురువు, వాయు దేవుని పేరు మీదుగా గురువాయుర్ ఆలయంగా మారిపోయింది.
తిరుపతిలో
కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని సన్నిధానంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉట్ల ఉత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తిరుపతికి తరలివస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున కన్నయ్య కోవెలల్లో ఘనంగా జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి కొట్టడం, గ్రామోత్సవం వంటి సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
నాంపల్లి ఇస్కాన్ టెంపుల్
భాగ్యనగరం నడిబొడ్డున ప్రముఖ శ్రీ కృష్ణుని దేవాలయం ఉంది. నాంపల్లిలో ఉన్న ఈ దేవాలయం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు చేరువలో కూడా కృష్ణుడి పురాతన దేవాలయం ఉంది. ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్మించినది. ఈ గుడితో పాటు భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో హంసలదీవి, మొవ్వలోని వేణుగోపాల స్వామి ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హంసలదీవిలోని కృష్ణుని గుడికి వేయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యభామలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కూచిపూడి సమీపంలోని మొవ్వ క్షేత్రంలోనూ శ్రీకృష్ణుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ కన్నయ్య చేతిలోని వేణువులో గాలి ఊదే రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు స్వామి వారికి సంబంధించిన మకరతోరణంలో దశావతరాలు కనిపిస్తాయి. క్షేత్రయ్య రాసిన పదాలన్నీ శ్రీకృష్ణుడిపైనే. ఈ పుణ్యక్షేత్రం విజయవాడకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పార్థసారథి ఆలయం, చెన్నై
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పార్థసారథి ఆలయంలో విష్ణువుకు సంబంధించిన నాలుగు అవతారాలను పూజిస్తారు. ఇందులో కృష్ణుడు, రాముడు, నరసింహుడు, వరాహావతారాలను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయంలో అనేక మిస్టరీలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించినదిగా తెలుస్తోంది.