Category Archives: Spiritual

శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన సమాచారం

  1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
  2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)
  3. మాసం : శ్రావణం
  4. తిథి: అష్టమి
    5 . నక్షత్రం : రోహిణి
  5. వారం : బుధవారం
  6. సమయం : రాత్రి గం.00.00 ని.
    8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
  7. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)
  8. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
    11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం
  9. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
  10. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
  11. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాధ్, మహారాష్ట్ర లో విఠల (విఠోబ), రాజస్తాన్ లో శ్రీనాధుడు, గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్, ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
  12. జన్మనిచ్చిన తండ్రి – వసుదేవుడు
  13. జన్మనిచ్చిన తల్లి – దేవకీ
  14. పెంచిన తండ్రి – నందుడు
  15. పెంచిన తల్లి – యశోద
  16. సోదరుడు – బలరాముడు
  17. సోదరి – సుభద్ర
  18. జన్మ స్థలం – మధుర
  19. భార్యలు: రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
  20. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు చాణుర – కుస్తీదారు, కంసుడు – మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్ర – అత్త కొడుకులు
  21. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
  22. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీ కృష్ణుడిని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
  23. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారాల్సి వచ్చింది.
  24. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
  25. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
  26. కాలయవన అను సింధురాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
  27. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
  28. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
  29. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్లాడు.
  30. గుజరాత్‌‌లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడాు.
  31. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాడు.
  32. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యాన్ని స్థాపించేందుకు సహాయపడ్డాడు.
  33. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు.
  34. రాజ్యము నుండి వెళ్లిపోయినప్పడు పాండవులకు తోడుగా నిలిచాడు.
  35. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో మద్దతు తెలిపి విజయం వరించేటట్లు చేశాడు.
    39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూశాడు.
  36. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
  37. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
  38. జీవితములో ప్రతి వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికీ అంకితమవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
  39. శ్రీకృష్ణుడి జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

ఈ గుడిలో కృష్ణుడికి ఆకలెక్కువ.. రోజుకు 10సార్లు నైవేద్యం పెట్టాల్సిందే

హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణం వేళ దేవాలయాలన్నీ మూసివేస్తారు. కానీ అక్కడ మాత్రం గ్రహణం సమయంలోనూ ఆ గుడి తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ఆ ఆలయంలో కన్నయ్యకు పూజలు జరుపుతూనే ఉంటారు. అంతేకాదు ఆ గుడిలోని వేణు మాధవుడికి ఎడతెగని ఆకలి ఉంటుదట. రోజుకు కనీసం 10 సార్లు నైవేద్యం సమర్పిస్తే స్వామి వారు సంతృప్తి చెందరని అక్కడి పండితులు చెబుతారు. ఏ ఒక్కరోజు కన్నయ్యకు నైవేద్యం తక్కువైనా స్వామి వారి విగ్రహం సైజు తగ్గిపోతుందట. ఈ ఆలయంలో ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని రహస్యాలు అలాగే మిగిలిపోయాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఆలయం ఎక్కడుంది.. గోపాలుని గుడిలో ఇక్కడ ఏమేమీ వింతలు.. విశేషాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంలో అందరూ కృష్ణాష్టమి వేడుకలను ఉట్టిని పగులగొట్టి.. గ్రామోత్సవాలు, చిన్ని కృష్ణుడిని అందంగా అలంకరించి వేడుకలను జరుపుకుంటారు. కానీ అక్కడ మాత్రం చాలా విభిన్నంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. కన్నయ్య కొలువైన ఉన్న ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరపులో ఉంది. కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఆంధ్రా, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా కొచ్చి లేదా కొట్టాయానికి చేరుకుంటే ఆలయానికి వెళ్లేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి.

ఇక్కడ కొలువైన కన్నయ్యకు ఎడతెగని ఆకలి ఉంటుందట. ఈ గుడిలోని గోపాలుని విగ్రహానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. ఈ గుడిలోని కన్నయ్య విగ్రహానికి ప్రతిరోజూ కనీసం 10సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ ఓ పాత్రలో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గిపోతుందని భక్తులు కూడా చెబుతారు. అందుకే ఇది అనేక రహస్యాలున్న ఆలయంగా పరిగణించబడుతుంది.

​గ్రహణం వేళ..

ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే.. గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచుతారు. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. సాధారణంగా గ్రహణం వేళ అన్ని గుళ్లను మూసివేస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు.

​విగ్రహం సైజు తగ్గుదల..

పురాణాల ప్రకారం, కృష్ణుని మేనమామ కంసుడిని వధించిన తర్వాత ఎడతెగని ఆకలితో ఉన్నాడని.. అందుకే ఇక్కడి విగ్రహం ఆకలితో బాధపడుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఇక్కడి గుడిలో స్వామివారికి నైవేద్యం సమర్పించడంలో కొంచెం లేటైనా కూడా విగ్రహం సైజు తగ్గిపోవడం ప్రారంభమవుతుందట.

ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజూ కేవలం రెండు నిమిషాల పాటే ఆలయం తలుపులను మూసివేస్తారు. అంటే 11:58 గంటలకు మూసేసి.. సరిగ్గా 12 గంటలకు తెరుస్తారు. ఇక్కడి శ్రీ కృష్ణుని విగ్రహం కేవలం రెండు నిమిషాలు మాత్రమే కునుకు తీస్తుందని చెబుతారు. మరోవైపు గుడికి సంబంధించిన తాళాలతో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ తాళాలతో తలుపులు తెరచుకోకపోతే గొడ్డలిని ఉపయోగించి తలుపులను పగులగొట్టి గుడిని తెరవొచ్చు. ఇలా చేయడానికి పూజారికి అనుమతి కూడా ఉంది. ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుండి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు.


శ్రీకృష్ణ జన్మాష్టమి… శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి, హిందూ ఇతిహాసాలలో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు.. వసుదేవుడి భార్య అయిన దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదేరోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ౹
బంగారు మొలతాడు పట్టుదట్టి౹
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు౹
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు౹౹

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, స్వామికి నైవేద్యం పెడతారు. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి, పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినమనికూడా వివరించింది.

దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్ధేశం చేశారు శ్రీ కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం, కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింప జేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమ శివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని “నమశ్శివాయ” అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు. ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. కృష్ణుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు. అప్పుడు కృష్ణుడు 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు. తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.

ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి. తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి. తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి. వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.

“నమశ్శివాయ” మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి. అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది. లోక కళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు…


కాకులు ఎగరని ప్రాంతం.. రంకె వేసే బసవన్న.. ఎన్నో విశేషాల ‘యాగంటి’ పుణ్యక్షేత్రం

శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఈ గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది. సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి.

యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి “యాగంటి బసవన్న” అని పేరు. ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యే నాటికి ఇక్కడి బసవన్న లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.

యాగంటి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారట. అయితే విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వరస్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

అగస్త్య పుష్కరిణి
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరిణి లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది.ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని రాశారు.

యాగంటి గుహాలయ దృశ్యం

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనే ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించి శిష్యులకు ఙ్ఞానోపదేశం చేసారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.ః

యాగంటి బసవన్న
ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

కాకులకు శాపం
యాగంటిలో కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

ఆలయ దర్శన వేళలు
ఉదయం 6:00 నుండి 11:00 వరకు, సాయంత్రం 3:00 నుండి 8:00 వరకు

ఎలా వెళ్లాలి…
ఈ క్షేత్రం కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగానపల్లిలో వసతులున్నాయి.


అగ్నిని స్నానంగా స్వీకరించే ‘ఇడాణ మాత’.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాణ మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొనివున్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని, ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన, ఈ ఆలయం, చతురాస్రాకరంలో ఉంది. ఇడాణ ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరుమీద ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది.

ఇక్కడ ఉన్న ఇడాణమాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతుంటారు. మంట, దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతీ వస్తువు, అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు, భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. ఎంతోమంది ఎన్నో రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఎవరూ ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు.

ఆలయంలో మంట మండుతున్నప్పుడు, అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనంకాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతుంటారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా, ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఈ మంటలను ప్రత్యక్షంగా చూసినవారికి సకల పాపాలు హరించి, అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం. ఈ ఆలయానికి ఉన్న, ప్రత్యేక గుర్తింపువల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తికోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంతకాలం ఇక్కడకు భక్తులు భారీసంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలా దేవి రూపాన్ని ఆవహించిందని ఇడాణ దేవాలయంలో పుజారులు చెబుతున్నారు.

ఈ ఆలయంలో వచ్చేమంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట. ఇక్కడకు వచ్చే భక్తులు, అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేకపూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం.


తిరుమల శ్రీవారిని నిత్యం ఎన్ని రకాల దండలతో అలంకరిస్తారో తెలుసా?

తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. అది వేదపండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని కరాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే స్వామివారిని చూడడమే చాలా తక్కువ సమయం. అలాంటిది ఆయన ఎన్ని పూల దండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని. శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

శిఖామణి
శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.

సాలిగ్రామాలు
శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది.

కంఠసరి
మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి. ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది.

వక్ష స్థల లక్ష్మి
శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది.

శంఖుచక్రం
శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.

కఠారి సరం
శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు.

తావళములు
రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడ దీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటుంది. రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.

తిరువడి దండలు
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు.

ఇవేకాకుండా శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు కరాల పూలమాలలతో అలంకరిస్తారు.

భోగ శ్రీనివాసమూర్తికి – ఒక దండ
కొలువు శ్రీనివాసమూర్తికి – ఒక దండ
శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి – 3 దండలు
శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి – 3 దండలు
శ్రీ సీతారామలక్ష్మణులకు – 3 దండలు
శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులకు – 2 దండలు
చక్రతాళ్వారుకు – ఒక దండ
అనంత గరుడ విష్వక్షేనులకు – మూడు దండలు
సుగ్రీవ అంగద హనుమంతులకు – 3 దండలు

ఇతర విగ్రహమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండలు


బంగారు వాకిలి ద్వారపాలకులు – రెండు దండలు
గరుడాళ్వారు – ఒక దండ
వరదరాజస్వామి – ఒక దండ
వకుళమాలిక – ఒక దండ
భగవద్రామానుజులు – రెండు దండలు
యోగనరసింహస్వామి – ఒక దండ
విష్వక్షేనుల వారికి – ఒక దండ
పోటు తాయారు – ఒక దండ
బేడి ఆంజనేయస్వామికి – ఒక దండ
శ్రీ వరాహస్వామి ఆలయానికి – 3దండలు
కోనేటి గట్టు ఆంజనేయస్వామికి – ఒక దండ
అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్యకళ్యాణోత్సవం, వసంతోత్సవం, వూరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలలో కూర్చబడతాయి.

అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మల్లెలు, మొల్లలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగులు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపుచెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామివారికి జరిగే తోమాల సేవకు గాను ఈ పుష్ప అర నుంచి సిద్థం చేయడిన పూలమాలలను, జీయంగారులు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఛత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్థంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు.


‘రక్షాబంధన్’ వెనుక పురాణ గాథ తెలుసా…

ఓసారి దేవతలపై రాక్షసులు దండెత్తారు. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడాడు. ఈ పోరులో రాక్షసులదే పైచేయిగా మారింది. ఇంద్రుని బలం క్షీణించి అలసి సొలసి స్పృహతప్పి నేలపైకి ఒరిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపి, రాక్షసులకు లొంగిపోవటం శ్రేయస్కరమని దేవగురువు బృహస్పతి హితవు పలికాడు. మహేంద్రుని భార్య శచీదేవి యుద్ధంలో విజయం సాధించడానికి తన పతికి తగిన బలం ప్రసాదించవలసిందని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ఒక రక్షాబంధనాన్ని భర్త చేతికి కట్టి, ఆయనను ఉత్సాహపరుస్తూ, తిరిగి యుద్ధానికి పురికొల్పింది. రక్షాబంధన ధారణతో నూతనోత్తేజం పుంజుకున్న ఇంద్రుడు ఈసారి యుద్ధంలో అవలీలగా రాక్షసులను జయించాడు.

రక్షాబంధన ప్రాశస్త్యాన్ని గుర్తించిన దేవతలు ఆనాడు శ్రావణ పూర్ణిమ కావడంతో నాటినుంచి ప్రతి శ్రావణ పూర్ణిమనాడూ ఎవరి శ్రేయస్సునైతే తాము కాంక్షిస్తున్నామో వారికి బలాన్ని, శక్తిని ప్రసాదించి, రక్షణ ఇవ్వాలసిందిగా కోరుతూ వారి ముంజేతికి రక్షా కంకణాన్ని కట్టడం ఆచారంగా మారింది. దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా మీకు రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించే ఆచారంగా రూపుదిద్దుకుంది.

రాఖీ ఇలా కట్టాలి


శ్రావణ పూర్ణిమ నాడు సూర్యోదయ కాలంలోనే స్నాన విధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా దైవశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. ఈ రక్షికని ఒక సంవత్సర కాలం పాటు మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి బహిరంగ ప్రదేశంలో కడుతూ ‘తప్పక అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నా’నంటూ – బంధుస్నేహితుల మధ్య ప్రకటించి ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణ సమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. ఈ విధానాన్ని గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలం పాటూ ఆమెకి అండగా నిలవాలి.

మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు. అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే ఎవరు ఎవరికైనా రాఖీ కట్టొచ్చు.

రక్షాబంధనం కట్టే సమయంలో ఈ కింది శ్లోకం చదవాలి.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!

రాక్షసులకి రాజు, మహాబలవంతుడైనబలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో.. ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడా ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రాజుల కాలంలో తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన రక్షికని కుల పురోహితుడు (ఇంటి పురోహితుడు) ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. చక్కని సూచనలనిస్తూ ఉపాయాలు చెప్తూ రక్షిస్తూ ఉంటానని భావం. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో మాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది.


రక్షాబంధన్.. ఆ సమయంలోనే రాఖీ కట్టాలి.. ఈ పొరపాటును అస్సలు చేయొద్దు

శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ (Rakhi pournami 2022) అంటారు. ఇది శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11, అంటే గురువారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం అనే రెండు శుభ యోగాలు ఉంటాయి. అయితే ఈ రోజున భద్ర పూర్ణిమ తిథితో పాటు భద్ర కూడా జరుగుతోంది. శ్రావణ పూర్ణిమ తిథి, యోగ ,శ్రావణ పండుగ గురించి తెలుసుకుందాం.

శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 07:05 వరకు చెల్లుతుంది. ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి రాఖీ పూర్ణిమను ఆగష్టు 11నే జరుపుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ , సౌభాగ్య యోగాల అందమైన కలయిక ఏర్పడుతుంది. ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం 03.32 వరకు ఆయుష్మాన్ యోగం ఉంది. ఆ తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 03.32 నుండి మరుసటి రోజు ఉదయం 11.34 వరకు.

శ్రావణ పూర్ణిమ నాడు సాయంత్రం 08:51భద్ర సమయం ముగుస్తుంది. ఈ సమయంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు. ఆ ఘడియలు ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టండి. అంటే ఆగస్టు 11వ తేదీ రాత్రి 08: 51 గంటల నుంచి ఆగస్టు 12 ఉదయం 7: 05 వరకు కట్టొచ్చు. కొన్ని నిబంధనల మినహా సాయంత్రం 06:08 నుండి 08:00 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు చెబుతున్నారు.

భద్ర కాలంలో రాఖీ కట్టిన శూర్పణఖ.. లంక నాశనం

రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశుడికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తరువాత లంక చెడు దశ ప్రారంభమైంది. రావణుడిరి దురదృష్టం మొదలైందని చెబుతారు.


ఈ అమ్మవారికి బంగారం, డబ్బే ప్రసాదం

ఏ ఆలయంలో అయినా దేవుడికి రకరకాల తినుబండారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకు భిన్నంగా ఓ ఆలయంలో డబ్బు, బంగారం, విలువైన రాళ్ల నగల్ని అమ్మవారికి నివేదిస్తారు భక్తులు. పండుగలూ ప్రత్యేక సందర్భాల్లో వాటినే ప్రసాదంగానూ పంచుతారు. మధ్యప్రదేశ్‌లోని రాత్లాంలో ఏకంగా వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటోంది మహాలక్ష్మి అమ్మవారు. వందల ఏళ్లక్రితం నిర్మించిన ఆలయమిది. అప్పట్లో రాజులు తాము సంపాదించుకున్న సంపదను ఈ అమ్మవారికి నివేదించేవారట. అలా చేయడం వల్ల ఆ ధనం రెట్టింపవుతుందని వారు నమ్మేవారట. అందుకే అప్పటి నుంచి అక్కడ భక్తులు అమ్మవారికి పాయసం, చక్రపొంగలి, రవ్వకేసరి, పులిహోర వంటి వాటికి బదులుగా డబ్బునీ, బంగారాన్నీ నైవేద్యంగా సమర్పిస్తున్నారట.

భక్తులకు నిత్యం దర్శనమిస్తూ, ఏడాది పొడవునా పూజలందుకునే రాత్లాం మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు మొక్కుల కింద కోట్లాది రూపాయల నగదు, బంగారం- వెండి నాణేలు, నగలు సమర్పించుకుంటారు. అందుకే ఆ దేవాలయం కుబేరనిధిగానూ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండుగలూ, ప్రత్యేక దినాలూ, దీపావళి సమయంలో అమ్మవారినీ, ప్రాంగణాన్నీ పూలతో కాకుండా డబ్బు, బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో అలంకరిస్తారు. అందుకోసం అమ్మవారికి కానుకలుగా అందినవాటితో పాటు భక్తుల వద్ద నుంచి కూడా డబ్బూ, నగలూ స్వీకరిస్తారు. ఆ సమయంలో ఆలయం ట్రస్టు సభ్యులు డబ్బూ, నగలూ ఇచ్చిన వారి వివరాలను నమోదు చేసుకుని ఎంత ఇచ్చారో రాసి వారి చేత సంతకం పెట్టించుకుని టోకెన్‌ ఇస్తారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలన్నీ అయ్యాక టోకెన్ల ఆధారంగా ఎవరివి వారికి అందజేస్తారు.

దీపావళి, ధనత్రయోదశి సమయంలో అమ్మవారికి డబ్బూ, బంగారం సమర్పించిన భక్తులు అక్కడికి దర్శనానికి వచ్చిన వారికి బంగారం, వెండి నాణేలను ప్రసాదంగా పంచుతుంటారు. అలా పంచడం వల్ల తాము కూడా సిరి సంపదలతో వర్థిల్లుతామని నమ్ముతుంటారు. అందుకే అక్కడ బంగారు నాణేలు గ్రాము కంటే తక్కువ బరువులో వివిధ పరిమాణాల్లో దొరుకుతాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు వాటిని కొనుగోలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తరవాత పంచుతారన్నమాట.

ఎలా చేరుకోవాలంటే..

విమానంలో వెళ్లాలనుకునేవారు ఇండోర్‌ ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడికి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాత్లాం వరకూ బస్సులో వెళ్లాలి. బస్టాండ్‌ నుంచి స్థానిక వాహనాల్లో ఆలయాన్ని చేరుకోవచ్చు. రైలు మార్గంలో వెళ్లేవారు ఉజ్జయిని స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి ఆలయానికి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది.


శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం – తిరుచానూరు

తిరుచానూరు పుణ్యక్షేత్రం తిరుపతి జిల్లా(ఉమ్మడి చిత్తూరు) తిరుపతి పట్టణం సమీపంలో ఉంది. దీన్ని అలమేలు మంగాపురమని కూడా పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది.

పురాణ గాథ..


త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లాడాడు.

అలమేలు మంగ ఆలయ సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు… శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది “తిరువెంగడ కూటం”గా ఉంది. ఇంతకు ముందు కాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. తరువాత ఆ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి. అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.

ప్రతి సోమవారం “అష్టదళ పదపద్మారాధన” జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది. అమ్మవారి ఆలయం వెనకాల ఉన్న కోనేరు, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం, పద్మావతి గార్డెన్, శ్రీరామ ఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, శేష తీర్థం, ఆంజనేయస్వామి ఆలయం మొదలగునవి చూడదగ్గవి.

సందర్శించు వేళలు : ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు

అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి ?

తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, జీపులు రెగ్యులర్‌గా తిరుగుతుంటాయి. లోకల్ గా తిరిగే షేర్ ఆటోల్లో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు.