Category Archives: Success Stories

కాఫీ డే: రూ.7 వేల కోట్ల అప్పు.. భర్త సూసైడ్.. ఏడాదిలోనే అద్భుతం చేసిన మాళవిక హెగ్డే

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. ఇంకేంటి అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.

సిద్ధార్థ ఆత్మహత్య

2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. కేఫ్‌ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.

భలే ఆలోచన

మాళవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. నాన్న ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజిక వేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థతో వివాహమైంది. వీళ్లిద్దరూ కలిసి కేఫ్‌ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. రూ.5కి ఎక్కడైనా దొరికే కాఫీని రూ.25 పెట్టి తాగడానికి తమ పార్లర్‌కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ససేమిరా అందట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఈసారి ఆయన ‘కాఫీకి ఉచిత ఇంటర్నెట్‌నూ అందిస్తే?’ అన్నారట. ఆలోచన ఈసారి ఈమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) అవుట్‌లెట్‌ బెంగళూరులో ప్రారంభమైంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సీసీడీ రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు.

రూ.7వేల కోట్ల అప్పులు

అయితే సంస్థ రూ.7000 కోట్ల అప్పుల్లో మునిగిపోవడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిన సిద్ధార్ధ.. భార్య, పిల్లలను అనాథలను చేస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్‌! కాఫీ కింగ్‌గా పేరుగాంచిన ఆయన మరణానికి కారణం.. అప్పు. అదీ రూ. ఏడువేల కోట్లు. సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24 వేలమంది కార్మికులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలూ చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కనపెట్టి మళ్లీ తెరమీదకొచ్చారు మాళవిక. తన పిల్లలతోపాటు ఉద్యోగుల బాధ్యతనూ స్వీకరించారు. ‘సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకుంటా’నంటూ వాళ్లని సమాధానపరిచారు. ఆ అప్పులను తీర్చడం తన బాధ్యతన్నారు. అలా 2020 డిసెంబరులో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మాళవిక

ఇక్కడా ఎన్నో ఎదురుదెబ్బలు. కొవిడ్‌, చెల్లని చెక్కుల వివాదాలు. అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుతూ వచ్చారు. పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎన్నో వెండింగ్‌ మెషిన్‌లను వెనక్కి రప్పించారు. సంస్థ నిరర్థక ఆస్తులనీ అమ్మేశారు. ఏడాది కాలంలో సగం అంటే.. రూ. మూడువేల కోట్లకుపైగా అప్పుల్ని తీర్చేశారు. ఇంకొన్నేళ్లలోనే తిరిగి సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశ ఆమెలోనేకాదు.. సంస్థ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోంది. టాటా వంటి సంస్థలూ పెట్టుబడికి ఆమెతో చర్చలు జరుపుతున్నాయి. గతంలో మాళవిక సంస్థకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యురాలు. రూపాయి జీతం తీసుకోలేదు. సంస్థలో ఆమెకున్న వాటా కూడా నాలుగు శాతమే. అయినా సీసీడీని ముందుకు నడపడం తన బాధ్యతగా భావించారు. కాఫీ ఎస్టేట్‌లో భర్తతో కలిసి మొక్కలు నాటేవారు. ఏ అవుట్‌లెటైనా ఇద్దరూ ప్రారంభించేవారు. సాధారణ ప్రేమికుల్లా కూర్చొని వినియోగదారులను గమనించేవారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పైగా భర్తకు సంస్థపై ఎనలేని ప్రేమ.. ఇవన్నీ ఆమెను మధ్యలో వదిలేయనివ్వలేదు.

‘ఏడాదిలో ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతోపాటు వ్యాపారాన్నీ అభివృద్ధి పథంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకూ భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయం’ అని ఓ సందర్భంలో చెప్పారు. భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోయే ఎంతోమందికి ఆమె జీవితం స్ఫూర్తిమంతమే కదూ!


ఆత్మహత్య చేసుకుందామనుకుని.. కోటీశ్వరుడయ్యాడు

జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ అపార్ట్‌మెంట్ భవనం ఎక్కాడు. 26వ అంతస్తు నుండి దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతిరోజు రిస్కే. అతడే అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేవుడు జీవితం ఇచ్చింది జీవించడానికే అని గ్రహించి తన ఎదుగుదలకు కృషి చేశాడు. ఎన్నో స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. ఇది వినడానికి సినిమా స్టోరీలా అనిపించొచ్చు. కానీ సినిమాను తలదన్నే ఎన్నో ఎత్తుపల్లాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయనెవరో కాదు.. విఠల్ వెంకటేష్ కామత్. దేశవిదేశాల్లో ప్రఖ్యాతి చెందిన కామత్ హోటళ్లకు ఆయనే అధినేత.

భార‌తీయ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన కామ‌త్ ఇపుడు ప్రపంచం గ‌ర్వించ‌ద‌గిన హోట‌ల్స్ య‌జ‌మానిగా చిర‌స్మర‌ణీయ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు డ‌బ్బుల కోసం నానా ఇబ్బందులు ప‌డిన కామ‌త్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపిస్తోంది. హోటల్స్ ద్వారా రోజూ కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఒక‌ప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామ‌త్ హోట‌ల్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి త‌న బ్రాండ్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది.

డాక్ట‌ర్ విఠ‌ల్ కామ‌త్ కు 68 ఏళ్లు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ గా..మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా కామ‌త్ హోట‌ల్స్ గ్రూపున‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇండియాలో ఎన్నో హోట‌ల్స్ త‌మ‌కు పోటీగా ఉన్నా ..కామ‌త్ మాత్రం త‌న స్థానాన్ని కోల్పోలేదు. ముంబై కేంద్రంగా న‌డుస్తున్న ఈ సంస్థను ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించేలా చేశారు కామ‌త్. 169 కోట్ల ఆదాయం కేవ‌లం ఈ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతోంది. చేతిలో చిల్లి గ‌వ్వ లేని పరిస్థితిలో భార్య పుస్తెల‌తాడును అమ్మి హోటల్ వ్యాపారం ప్రారంభించిన కామ‌త్.. ఇవాళ గ్రూపును ప్రపంచంలోనే టాప్-10లో నిలబెట్టారు.

ఎంద‌రో భార‌తీయులు ..ఎన్నో విజ‌యాలు సొంతం చేసుకున్నారు. కానీ విఠ‌ల్ కామ‌త్‌‌ కథ మాత్రం ప్రత్యేక‌మైనది. ఇది మ‌న‌క‌ళ్ల ముందే జ‌రిగిన కథ‌. విఠ‌ల్ కామ‌త్ హోట‌ల్స్ య‌జ‌మానే కాకుండా మెంటార్‌, ఎంట్రప్రెన్యూర్‌, ట్రైన‌ర్, స‌క్సెస్ ఫుల్ బిజినెస్‌మెన్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. తొలినాళ్లలో ఒక్క గ‌దిలోనే సర్దుకుపోయి కష్టాలు పడి కామత్ ఇప్పుడు వేల కోట్ల విలువ కలిగే ఎన్నో భవనాలు కలిగి ఉన్నారు. ఎంత పైకెదిగినా ఆయన తన మూలాలు మరిచిపోలేదు. కామ‌త్ కుటుంబంలో ఎనిమిది మంది ఉండేవారు. తల్లిదండ్రులు, ముగ్గురు అన్నద‌మ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీళ్లంతా ఒకే గదిలో నివసంచేవారు. ఆ జ్ఞాప‌కాలు ఇప్పటికీ త‌న‌ను హెచ్చరిస్తూనే ఉంటాయని చెబుతుంటారు కామ‌త్.

‘సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. లేకపోతే లావైపోతాం’ అనే టైప్ కామత్. అందుకే ఆయన తన గ్రూపు ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 60లక్షల మొక్కలు నాటించారు. అటవీ సంరక్షణ కోసం 100 ఎకరాల కొండను ఔషధ మొక్కలుగా, చెట్లుగా మార్చారు. ముంబైలో మొట్టమొదటి సీతాకోకచిలుక ఉద్యానవనం, నవీ ముంబై అంతటా తోటలను నిర్మించిన ఘనత కూడా ఆయనదే. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన విఠ‌ల్ కామ‌త్ తన విజయాలను కోట్లాది మంది భార‌తీయుల‌కే కాదు ప్రపంచానికి కూడా ఒక పాఠంగా చూపించారు.