Category Archives: Technology

పిల్లలకి ఫోన్ ఇస్తున్నారా?.. డ్రగ్స్ కంటే డేంజర్.. పేరెంట్స్‌ ఇలా చేస్తే మేలు!

సోషల్‌ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుష్ఫలితాలు అంతకు మించి ఉన్నాయన్నది వాస్తవం. అయితే ఇటీవల కాలంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బందీ అవుతుండటం అతిపెద్ద ముప్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలు మొబైల్‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే మొబైల్ కు బానిసగా మారడం. అదొక వ్యసనంలా మారడం. స్క్రీన్‌ ఎడిక్షన్‌ అంటే మొబైల్, ట్యాబ్‌, టీవీ స్క్రీన్లకు బానిసలుగా మారిపోవడం. నెలల వయసు పిల్లలు కూడా ఇప్పుడీ టెక్నాలజీ యుగంలో మొబైల్‌కు బాగా అలవాటు పడిపోతున్నారు. చిన్నపుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలను ఇప్పుడా స్క్రీన్స్‌ చెబుతున్నాయి. ఆరుబయట ఆడుకునే ఆటలనూ స్క్రీన్స్‌పైనే ఆడేస్తున్నారు. నెలల వయసు పిల్లలు కూడా ఈజీగా మొబైల్‌ను ఆపరేట్‌ చేస్తుంటే అది చూసి వాళ్ల పేరెంట్స్‌ మురిసిపోతుంటారు. కానీ క్రమంగా అది మొబైల్ ఎడిక్షన్‌కు దారి తీస్తోందన్న చేదు నిజాన్ని వాళ్లు గ్రహించలేకపోతున్నారు.

అన్నం తినాలన్నా సెల్‌ఫోనే..
ఒకపుడు పిల్లలకు అన్నం తినిపించాలంటే తల్లిదండ్రులు ఆరబయటకు తీసుకువెళ్ళడం, చందమామను చూపించడం వంటివి చేసేవారు. కానీ కాలం మారింది. ఆరుబయళ్ళు లేవు. ఆకాశాన్ని చూపించే తీరికా లేదు. ఇది పిల్లల పెంపకం మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. పిల్లలు మారాం చేస్తుంటే ఓపికగా తినిపించే సమయం ఎవరికీ లేదు. తింటే చాలు అనుకుని తల్లిదండ్రులు పిల్లల చేతిలో సెల్‌ఫోన్‌ పెడుతున్నారు. వాటికి అలవాటైన పసి పిల్లలు బొమ్మలు చూపితే గానీ అన్నం తినము అనే స్థాయికి చేరుకున్నారు.

పట్టించుకోకపోతే అనర్థాలే..
కరోనా విపత్తు కారణంగా ఈ ఏడాది విద్యార్థులు బడికి వెళ్లే అవకాశం లేకుండా చేసింది. విద్యా సంవత్సరంలో ఎక్కువశాతం ఆన్‌లైన్‌ తరగతులతోనే గడిచిపోతోంది. పలు ప్రైవేటు పాఠశాలలు చిన్నారులకు ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నాయి. తరగతులు ముగియగానే స్మార్ట్‌ ఫోన్‌ను పక్కన పడేయడం లేదు. గేమ్స్‌, వీడియోస్‌లోకి వెళుతున్నారు. తల్లిదండ్రులకు గమనించే తీరిక ఉండటం లేదు. దీంతో చిన్నారులు ఎక్కువ సమయం సెల్‌ఫోన్లలో గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఈ కారణంగా పిల్లలు ఎదుగదల దెబ్బతినే ప్రమాదముందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్క్రీన్ ఎడిక్షన్ ఎంతవరకూ వెళ్లిందంటే… తమ చేతుల్లోని సెల్‌ఫోన్, ట్యాబ్‌లు లాక్కుంటే చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరైతే ఆవేశంలో ఎదుటివారి ప్రాణాలు సైతం తీస్తున్నారు. డ్రగ్స్‌, ఆల్కహాల్‌ను మించి డిజిటల్‌ ఎడిక్షన్‌ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు ఎడిక్ట్ అయ్యారా? అది తెలుసుకోవడం ఎలా? ఆ ఎడిక్షన్‌ వల్లే కలిగే అనర్థాలు ఏంటి? తల్లిదండ్రులుగా ఈ ఎడిక్షన్‌ బారి నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?.. ఈ విషయాలు తెలుసుకుందాం…

ఇప్పటి వరకు మనకు ఎడిక్షన్‌ అంటే డ్రగ్స్‌ లేదా ఆల్కహాల్‌లాంటి వాటికే పరిమితమైన పదం. కానీ ఇప్పుడది మొబైల్‌ స్క్రీన్‌కూ పాకింది. చాలా మంది అసలు డిజిటల్‌ ఎడిక్షన్‌ అన్న పదమే లేదని కొట్టి పారేస్తారు. కానీ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషనే ఇది నిజమని తేల్చింది. మనుషులు స్క్రీన్స్‌కు ఎడిక్ట్‌ అవుతారని తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వ్యాధుల జాబితాను 2018లో సవరించినప్పుడు అందులో గేమింగ్‌ డిజార్డర్‌ను కూడా చేర్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎడిక్షన్‌ అన్న పదాన్ని ఇక్కడ అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. స్క్రీన్‌ ఎడిక్షన్‌ అంటే స్మార్ట్‌ ఫోన్‌, టాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌, టీవీ.. ఏదైనా కావచ్చు. వీటిని అతిగా వాడేవాళ్ల ప్రవర్తనలో మార్పులను బట్టి అది అడిక్షనా? కాదా? అన్నది గుర్తించవచ్చు. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే వాళ్లలో కనిపించే మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.

పిల్లలు మొబైల్ వాడుతున్నప్పుడు మార్పులు

  • పిల్లలు సాధారణంగా ఎక్కువ సమయం ఆడుకోవడానికే ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయి ఇంటింటికీ మొబైల్‌ ఫోన్స్‌ వచ్చాయో అప్పటి నుంచి అదే సర్వస్వమైపోయింది. అప్పుడప్పుడూ మొబైల్‌ చూస్తూ మిగతా టైమ్‌లో చదువుకోవడం, ఆడుకోవడంలాంటివి చేస్తే సమస్య లేదు. కానీ చదువు, ఆటలన్నీ పక్కన పెట్టి మొబైల్‌కే సమయం కేటాయిస్తున్నారంటే అది మెల్లగా వ్యసనంలా మారుతున్నట్లు గుర్తించాలి.
  • పిల్లలు మొదట్లో కాసేపు మొబైల్‌ లేదా ట్యాబ్‌ చూసి పక్కన పెట్టేస్తారు. దాంతోనే సంతృప్తి చెందుతారు. అది ఎప్పుడూ అంత వరకే పరిమితమైతే ఓకే. అలా కాకుండా ప్రతి రోజూ ఈ సమయం పెంచుతూ వెళ్తున్నారంటే జాగ్రత్త పడాలి.
  • మొదట్లో బలవంతంగా మొబైల్స్‌ లాక్కున్నా వాళ్లలో పెద్దగా రియాక్షన్‌ ఉండదు. అదొక వ్యసనంలా మారుతున్న సమయంలో మాత్రం పిల్లల ప్రవర్తన మారుతుంది. వాటిని చేతుల్లో నుంచి లాక్కున్నపుడు గట్టిగా అరవడం, ఏడవడం, వింతగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇది కూడా ఓ ఎడిక్షన్‌ లక్షణమే అని గుర్తించండి.
  • మొబైల్‌ లేదా ట్యాబ్‌లో గేమ్స్‌ ఆడకపోయినా, తమ ఫేవరెట్‌ షోను చూడకపోయినా దాని గురించే మాట్లాడుతున్నారంటే అనుమానించాల్సిందే. ఇది కూడా ఫోన్ ఎడిక్షన్‌ లక్షణమే.

మొబైల్ ఎడిక్షన్‌తో తీవ్ర అనర్థాలు..
మొబైల్ ఎడిక్షన్ చాలా అనర్థాలకే దారి తీస్తోంది. చిన్న వయసులోనే మొబైల్స్‌, ట్యాబ్స్‌, టీవీలకు అలవాటు పడటం వల్ల దీర్ఘకాలంలో పిల్లలు వివిధ సమస్యలతో బాధ పడే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒబెసిటీ:
మొబైల్స్‌, ట్యాబ్స్‌, టీవీల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లలు బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఇది క్రమంగా ఒబెసిటీకి దారి తీస్తుంది. చిన్న వయసులోనే ఒబెసిటీ బారిన పడితే దీర్ఘకాలంలో అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.

నిద్ర లేమి:
పిల్లలు పడుకోవడానికి కనీసం గంట ముందైనా టీవీలు, మొబైల్‌ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. వీటి నుంచి వచ్చే వెలుతురు మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తుంది. ఇది క్రమంగా పిల్లలను నిద్రకు దూరం చేస్తుంది. నిద్ర లేమి ఇతర అనర్థాలకూ కారణమవుతుంది.

ప్రవర్తనలో మార్పులు:
రోజుకు పరిమితికి మించి మొబైల్‌ లేదా టీవీ చూసే పిల్లల ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వీళ్లు ఎవరితోనూ అంత సులువుగా కలవరు. కోపం, చిరాకు, ఆందోళన, హింసా ప్రవృత్తి కూడా ఎక్కువగా ఉంటాయి.

ఒంటరితనం, ఆందోళన:
స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారిన పిల్లలు చాలా వరకు ఒంటరితనం, ఆందోళనతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. చాలా మంది పిల్లలు మొబైల్‌, టీవీలతో కాలక్షేపం చేస్తూ తమను తాము మరచిపోతారు. కానీ అది ఓ వ్యసనంలా మారితే మాత్రం డేంజరే. కాసేపు వాటికి దూరంగా ఉన్నా కూడా ఒంటరితనం, ఆందోళన వాళ్లను వేధిస్తుంది.

మొబైల్ వ్యసనంతో ఒత్తిడి:
సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనెక్టివిటీ పెరిగిపోయింది. ముఖ్యంగా టీనేజర్లు చాలా వరకు తమ సమయాన్ని చాటింగ్‌లోనే గడుపుతున్నారు. నోటిఫికేషన్స్‌ వీటికి మరింత బానిసలుగా మారేలా చేస్తున్నాయి. క్షణక్షణం మొబైల్‌ చెక్‌ చేస్తూ, వచ్చిన మెసేజ్‌లకు రిప్లైలు ఇస్తూ ఉంటారు. ఇది క్రమంగా వాళ్లలో ఒత్తిడి పెరగడానికి కారణమవుతోంది. ఈ చాటింగ్‌కు అడిక్ట్‌ కావడం వల్ల స్కూళ్లలో వాళ్లకు ఇచ్చిన టాస్క్‌లను కూడా సరిగా పూర్తి చేయక మరింత ఒత్తిడికి లోనవుతున్నారు.

ఏకాగ్రత కోల్పోవడం:
మొబైల్‌ అడిక్షన్‌ ఏకాగ్రత కోల్పోవడానికీ కారణమవుతోంది. రోజూ అరగంటలోపు మొబైల్‌ చూసే వాళ్ల కంటే రెండు గంటలకుపైగా చూసే వాళ్లు ఆరు రెట్లు ఎక్కువ దీని బారిన పదే ప్రమాదం ఉంది. పదే పదే మొబైల్‌ స్క్రీన్స్‌ వైపు చూస్తుండటం, డివైస్‌లో ఏదో ఒక దాని కోసం వెతుకుతుండటం మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పిల్లలు ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతుంటారు. ఓ పని మొదలుపెట్టడం, దానిని మధ్యలోనే వదిలేసి మరో పని చేయడంలాంటివి చేస్తుంటారు. పైగా ఏదైనా విషయంపై లోతుగా ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు.

సూసైడల్‌ టెండన్సీ:
మొబైల్ ఎడిక్షన్, స్క్రీన్‌ ఎడిక్షన్‌ అనేది సూసైడల్‌ టెండెన్సీకి కూడా దారి తీస్తోందని అధ్యయనాల్లో తేలింది. అంటే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు. బ్లూవేల్‌, పబ్‌జీ లాంటి గేమ్స్‌ వీటిని మరింత పెంచుతున్నాయి. ఆ గేమ్స్‌కు బానిలైన వాళ్లను బలవంతంగా దూరం చేయాలని చూస్తే ఆత్మహత్యలకు ప్రయత్నించడానికి కారణం కూడా ఇదే.

మాటలు ఆలస్యంగా రావడం:
రెండేళ్లలోపు పిల్లలు మొబైల్‌కు బానిసలు కావడం వల్ల వాళ్లకు మాటలు రావడం ఆలస్యమవుతుంది. అందువల్ల ఈ వయసు పిల్లలకు అసలు మొబైల్‌ అలవాటు చేయకపోవడమే మంచిది.

మొబైల్ అడిక్షన్‌తో ఎన్నో రోగాలు..
ఎక్కవ సమయం స్క్రీన్‌ చూడడం వల్ల కళ్లలో మంట రావడం, కళ్లు పొడిబారడం, కళ్లలో నొప్పి, తలనొప్పి, మెడనొప్పి, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. తలనొప్పికి కారణం చూస్తే.. కళ్లతో స్క్రీన్‌ను ఎక్కువటైం చూడడం వల్ల సిలియరీ అనే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా దగ్గరి చూపుపై ప్రభావం కూడా పడుతుంది. కళ్లు పొడిబారడానికి కారణం కూడా స్క్రీన్‌ ఎక్కువ టైం చూడడం. దీని వల్ల కంటి పైభాగంలో తేమ తగ్గుతుంది. స్పష్టమైన దృష్టి కలిగి ఉండడానికి తేమ అవసరం. పొడి బారడం వల్ల మంటలు, కళ్లు ఎర్రగా మారడం, కళ్ల దురద (అలెర్జీ) వంటివి వస్తాయి.

దూరదృష్టి లోపం..
డిజిటల్‌ పరికరాలను ఎక్కువ సమయం వినియోగించడం వల్ల దూరదృష్టి లోపం కూడా వస్తుంది. చాలా మంది పిల్లలు దూరదృష్టి కోసం కళ్ల జోడు వాడడానికి ఇదే ప్రధాన కారణం. నిజానికి ప్రతి పిల్లాడికీ 8 నుంచి 10 ఏళ్ల వయసు అనేది అత్యంత కీలకం. ఈ సమయంలో పిల్లలకు దూరచూపు పెరుగుతుంది. కానీ, ఇదే సమయంలో చాలా మంది పిల్లలు టీవీలకు, సెల్‌ఫోన్లకు అంకితమవుతున్నారు. అవుట్‌డోర్‌ ఆటలకు దూరమవుతున్నారు. దీని వల్ల దూరపు చూపు ఉండడం లేదు. ఫలితంగా చాలా మంది పిల్లలు దూరపు చూపు కోసం చిన్న తనంలోనే కళ్లద్దాలు వాడాల్సి వస్తున్నది. ఈ మధ్యకాలంలో ఇది చాలా మంది పిల్లల్లో అద్దాలు వాడడం కనిపిస్తున్నది.

స్క్రీన్‌ టైమ్‌ పరిమితులు ఇవీ
మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లు మన జీవితంలో విడదీయలేని భాగమైపోయాయి. వాటి నుంచి ఎలాగూ మనం తప్పించుకోలేం. అలాంటప్పుడు దానికి కొన్ని పరిమితులు విధించుకోవడం అన్నది ఉత్తమం. ఈ మధ్యే కెనడాకు చెందిన పీడియాట్రిక్‌ సొసైటీ హెల్తీ స్క్రీన్‌ యూజ్‌కు కొన్ని గైడ్‌లైన్స్‌ను రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే చిన్నారులు, టీనేజర్ల కోసం వాళ్లీ స్క్రీన్‌ టైమ్‌ పరిమితులు విధించారు. ఏ వయసు పిల్లలకు ఎంత స్క్రీన్‌ టైమ్‌ ఉండాలో ఓసారి చూద్దాం.

  • రెండేళ్లలోపు పిల్లలకు అసలు ఎలాంటి స్క్రీన్‌ టైమ్‌ అనేది లేదు. అంటే వాళ్లు మొత్తంగా మొబైల్‌కు దూరంగా ఉండాల్సిందే. మరీ తప్పదనుకుంటే.. వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితం చేయాలి.
  • 2-5 ఏళ్లలోపు పిల్లలకు రోజులో మొత్తంగా ఒక గంటలోపు మాత్రమే స్క్రీన్‌ టైమ్‌ కేటాయించాలి.
  • ఇక స్కూళ్లకు వెళ్లే పిల్లలు, టీనేజర్లు అయితే ఒక రోజులో అది కూడా తప్పనిసరి అనుకుంటేనే నాలుగు గంటలకు మించి స్క్రీన్‌ టైమ్‌ ఉండకూడదని కెనడా పీడియాట్రిక్‌ సొసైటీ స్పష్టం చేసింది.
  • పిల్లలు పడుకునే కనీసం ఒక గంట ముందు నుంచే మొబైల్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి.
  • బుక్స్‌ చదివే సమయంలో, ఫ్యామిలీలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో అసలు మొబైల్స్‌ జోలికి వెళ్లకుండా చూడాలి.
  • డైనింగ్‌ టేబుల్‌, బెడ్‌రూమ్స్‌లో మొబైల్‌ ఫోన్స్‌ ఉంచకపోవడం వల్ల స్క్రీన్‌ టైమ్‌ను పేరెంట్స్‌ తగ్గించవచ్చు.

తల్లిదండ్రులు ఏం చేయాలంటే..
తమ పిల్లలు మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌ లేదా టీవీకి ఇంతలా ఎడిక్ట్‌ అయిపోవడం తమకు కూడా ఇష్టం లేదని, అయితే తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చాలా మంది పేరెంట్స్‌ చెబుతుంటారు. కానీ ఈ వ్యసనం నుంచి పిల్లలను బయట పడేయాల్సింది కచ్చితంగా వారే. మరి పిల్లలను స్క్రీన్‌ అడిక్షన్‌ నుంచి రక్షించుకోవడానికి పేరెంట్స్‌ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆ పని మానుకోండి
పిల్లలు సహజంగానే మొబైల్స్‌ లేదా టీవీలకు ఈజీగా అట్రాక్ట్‌ అవుతారు. నిజానికి వాళ్లకు కొత్తగా ఏది కనిపించినా వాళ్లు ఆసక్తిగా చూస్తుంటారు. ఇదే అదనుగా చాలా మంది పేరెంట్స్‌ తమ బిజీ పనులకు పిల్లలు అడ్డు రాకుండా ఉండేందుకు వాళ్లే స్క్రీన్‌ను అలవాటు చేస్తారు. చేతికి ఓ మొబైల్‌ ఇచ్చో లేదంటే టీవీ ఆన్‌ చేసో వెళ్లిపోతారు. ఒక రకంగా వీటిని బేబీ సిట్టర్స్‌లాగా వాడుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఇది క్రమంగా స్క్రీన్‌ అడిక్షన్‌కు దారి తీస్తుంది.

ముందు పేరెంట్స్ మారాలి
పిల్లలు ఏం చేసినా పెద్దవాళ్లను అనుసరిస్తారన్న విషయం గుర్తు పెట్టుకోండి. వాళ్లకు తొలి గురువులు తల్లిదండ్రులే. వాళ్లు ఎలా చేస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఈ రోజుల్లో పేరెంట్సే మొబైల్స్‌కు ఎడిక్ట్‌ అయిపోతున్నారు. చివరికి తినేటప్పుడు కూడా వాటిని వదిలి పెట్టడం లేదు. తమ పేరెంట్స్‌ ఇంతగా చూస్తున్నారంటే అందులో ముఖ్యమైనది ఏదో ఉందని పిల్లలూ అనుకుంటారు. వాళ్లూ ఫాలో అవుతారు. అందువల్ల కనీసం పిల్లలు మీ పక్కన ఉన్న సమయంలో అయినా మొబైల్‌ జోలికి వెళ్లకండి. సాధ్యమైనంతగా వాళ్లతో సమయం గడపడానికి ప్రయత్నించండి.

S

బ్యాలెన్స్‌ గురించి చెప్పండి
మొబైల్‌కు అలవాటు పడిన కొద్దీ పిల్లలు వాటిలోనే పూర్తిగా తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. మొబైల్‌ తప్ప తమను ఇంకేదీ ఇంతలా ఎంటర్‌టైన్‌ చేయదన్న ఫీలింగ్‌ కాస్త పెద్ద పిల్లల్లో కలుగుతుంది. అలా కాకుండా లైఫ్‌లో అన్నింటినీ ఎలా బ్యాలెన్స్‌ చేయాలో చెప్పండి.

ఉదాహరణకు వాళ్లు తినే ఆహారం గురించే వివరించండి. వాళ్లకు ప్రతి పూటా ఎక్కువ శాతం ఆరోగ్యకరమైన ఫుడ్‌ ఇస్తూ చివర్లో కొంత మొత్తంలో స్వీట్స్‌, కేక్స్‌, చాకొలెట్స్‌లాంటివి ఇస్తుంటాం. ఆరోగ్యకరమైన ఫుడ్‌ కాకుండా డెజర్ట్స్‌ ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం తరుచూ వాళ్లకు చెబుతూనే ఉంటాం. అలాగే స్క్రీన్‌ టైమ్‌ను కూడా మిగతా పనుల్లో ఒక భాగంగా చూసేలా చేసే బాధ్యత పేరెంట్స్‌దే. అంటే ఎంతసేపూ మొబైల్‌కే పరిమితం కాకుండా వాళ్లను కాస్త బయటకు తీసుకెళ్లడం, పార్కుల్లో హాయిగా తిప్పడం, ఏవైనా ఆటలు ఆడటంలాంటివి చేయాలి.

  • సాధ్యమైనంత వరకూ ఎక్కువసేపు పిల్లలు ఒంటరిగా ఉండకుండా చూసుకోండి. వాళ్లతో తరచూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. చేతిలో మొబైల్‌ ఉంటే తరచూ ఒక గేమ్‌ నుంచి మరో గేమ్‌కు మారిపోతూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా ఒకేదానికి పరిమితమయ్యేలా స్క్రీన్‌ లాక్ చేసి ఇవ్వండి.

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌, ఐఫోన్‌ సృష్టికర్త స్టీవ్‌ జాబ్స్‌ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. టెక్నాలజీ రంగంలో ఈ ఇద్దరూ రారాజులు. కానీ వీళ్ల పిల్లలు మాత్రం ఎన్నడూ ఆ టెక్నాలజీకి బానిసలు కాలేదంటే దానికి కారణం వీళ్లే. ఈ ఇద్దరూ సృష్టించిన టెక్నాలజీకి ప్రపంచమంతా బానిసలయ్యారేమోగానీ.. వీళ్ల ఇంట్లో పిల్లలు మాత్రం కాదు. ఒకప్పుడు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తమ పిల్లలను టెక్నాలజీకి ఎందుకు దూరంగా ఉంచాల్సి వచ్చిందో వీళ్లు వివరించారు.

ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స్‌ తమ పిల్లలకు ప్రపంచంలోని అత్యున్నత టెక్నాలజీని క్షణాల్లో అందించగలడు. కానీ తన కూతురికి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఓ గేమ్‌కు బానిసవుతుందని తెలిసి.. స్క్రీన్‌ టైమ్‌పై పరిమితి విధించారు.

బిల్ గేట్స్ ఏం చేశారంటే..

పిల్లలను ఈ స్క్రీన్లకు దూరం చేయడం మా వల్ల కావడం లేదన్న పేరెంట్స్‌ ఒక్కసారి ఈ టెక్‌ జెయింట్స్‌ గురించి తెలుసుకోండి. వాళ్లు తమ పిల్లలను మొబైల్‌ స్క్రీన్లకు బానిసలవకుండా ఎలా నియంత్రించారో చూడండి.

  • డిన్నర్‌ టేబుల్‌ దగ్గర నో సెల్‌ఫోన్‌ రూల్‌ ఇప్పటికీ పాటిస్తారు. ఇంట్లో అందరూ కలిసి ఓ స్క్రీన్‌ టైమ్‌ పెట్టుకున్నామని, ఎవరూ దానిని అతిక్రమించరని కూడా గేట్స్‌ చెప్పారు.
  • అలాగని తన కూతురిని ఆయన పూర్తిగా టెక్నాలజీకి దూరం చేయలేదు. కాకపోతే ఆమె వాడే విధానాన్ని నియంత్రించారు. ఇది ప్రతి తల్లిదండ్రులకు ఓ పాఠంలాంటిది.

స్టీవ్ జాబ్స్ ఏం చెప్పారంటే..

  • ఐఫోన్‌ సృష్టికర్త స్టీవ్‌ జాబ్స్‌ కూడా ఇంట్లో ఇదే రూల్‌ పాటించారు. 2012లో ఆయన మరణించక ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన లేటెస్ట్‌ ఐప్యాడ్‌ తన పిల్లల దగ్గర లేదని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తమ పిల్లలు టెక్నాలజీని పరిమితికి మించి వాడకుండా చూస్తామని ఆయన చెప్పారు.