Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
ఉత్తరాఖండ్ లోని ‘మనా’ గ్రామం.. హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ గ్రామం… వీటిలో ఏది భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పరిగణించబడుతుందనే విషయంలో చాలా మంది గందరగోళపడుతుంటారు. ప్రాధమికంగా చిట్కుల్ అనేది ఇండో – టిబెటన్ సరిహద్దులో ఉన్న జనావాస గ్రామం. అయితే ఉత్తరాఖండ్ లోని ‘మనా’ మాత్రం భారతదేశం యొక్క చిట్టచివరి గ్రామంగా అధికారికంగా గుర్తింపు పొందింది.
ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో సముద్రమట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ‘మనా’ గ్రామం ఉంది. ప్రముఖ హిందూ తీర్ధయాత్ర స్థలం బద్రీనాథ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సరస్వతి నదీ పరివాహిక ప్రాంతంలో ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ అందమైన కుగ్రామం ఇండో – చైనా సరిహద్దు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇది భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పేరుగాంచింది. మీరు ఈ ప్రాంతాన్ని ఎప్పుడైనా సందర్శిస్తే అక్కడ దుకాణదారులను, వారు విక్రయించే సామాగ్రిని జాగ్రత్తగా పరిశీలించండి. వాటిపై ‘చివరి గ్రామం’, ‘ఇండియా చివరి టీ , కాఫీ కార్నర్’ అనే వివిధ ముద్రణలు కనిపిస్తాయి. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ‘మనా’ గ్రామం హిందువులకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.
ఈ గ్రామాన్ని మహాభారత కాలానికి సంబంధించినదిగా చెబుతారు. పాండవులు స్వర్గానికి తమ చివరి ప్రయాణం చేసినప్పుడు ‘మనా’ గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు. ఈ ప్రాంతంలో సరస్వతి నదికి సమీపంలో ఓ రాతి వంతెన ఉంటుంది. దీనిని ‘భీమా పుల్’ అని కూడా పిలుస్తారు. పాండవ సోదరుల్లో ఒకరైన భీముడు దీన్ని నిర్మించినట్లు కధనం ప్రచారంలో ఉంది. మనా గ్రామంలో చూడాల్సిన ఆసక్తికర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
నీలకంత్ శిఖరం సముద్ర మట్టానికి 6597 అడుగుల ఎత్తులో ఉండే నీలకంత్ శిఖరం ఈ ప్రాంతంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. దీనిని ‘క్వీన్ ఆఫ్ గర్హ్వాల్’ అని కూడా పిలుస్తారు. బద్రీనాథ్ ఆలయానికి చేరువలో మంచుతో కప్పబడి ఉండే ఈ అందమైన పర్వత శిఖరం సాహసికులు, పర్వతారోహణ పట్ల ఆసక్తి గల వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.
తప్త్ కుండ్ హిందూ పురాణాల ప్రకారం తప్త్ కుండ్ ను అగ్ని యొక్క పవిత్ర నివాసంగా చెబుతారు. ఇక్కడ ఎంతో విలువైన ఔషధ సంపద ఉన్నట్లు నమ్ముతారు.ఈ కుండ్ నీటిలో మునక వేస్తే చర్మ వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం.
వసుధార ఈ ప్రాంతంలోని అద్భుతమైన ప్రదేశాల్లో వసుధార ఒకటి. బద్రీనాథ్ ఆలయం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన జలపాతాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కొంతకాలం ఇక్కడ నివసించారట.
వ్యాస గుహ మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాన్ని రచించిన వేదవ్యాసుడు ఈ గుహ లోపలే ప్రఖ్యాత నాలుగు వేదాలను రచించినట్లు చారిత్రక కధనం. ఈ గుహలో చిన్న మందిరం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వేద వ్యాసునికి అంకితం చేయబడిన ఈ మందిరం దాదాపు 5000 ఏళ్ల క్రితం నాటిదని నమ్ముతారు.
భీమా పుల్ మనా గ్రామంలోని ప్రధాన ఆకర్షణల్లో భీమా పుల్ ఒకటి. పాండవులు స్వర్గానికి ప్రయాణం చేస్తున్న సమయంలో తన భార్య ద్రౌపతి సరస్వతి నదిని దాటెందుకు వీలుగా భీముడు ఈ రాతి వంతెనను నిర్మించినట్లు చెబుతారు. సాహసాల పట్ల ఆసక్తి గల వారికి ఈ గ్రామం ఎన్నో ఆసక్తికరమైన కార్యకలాపాలను అందిస్తుంది. భారతదేశంలో పర్వతారోహణకు అనువైన ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటిగా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తారు. మనా నుంచి వసుంధర, మనా నుంచి మనా పాస్, మనా నుంచి చరణపాదుక వరకూ ఇతరులతో కలిసి నడక సాగించడం ఓ గొప్ప అనుభవంగా చెప్పవచ్చు.
ఎలా వెళ్లాలి ఉత్తరాఖండ్‌లోని మనాకు రిషికేష్, హరిద్వార్ నుంచి సులభంగా చేరుకోవచ్చు. బద్రీనాథ్ నుంచి ఇక్కడికి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే. హరిద్వార్ ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి మనా గ్రామానికి 275 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు లేదా ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి మనాకు 315 కిలోమీటర్లు. రైల్వేస్టేషన్ బయట నుంచి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.
శీతాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ సమయంలో చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నిస్తే.. ఉన్ని దుస్తులు ధరించండి.. ప్రతి గంటకు కాఫీ త్రాగండి లేదా రోజంతా హీటర్ ముందు కూర్చోండి.. శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి పలు ద్రవ పదార్థాలు తీసుకోండి అంటూ సలహా ఇస్తుంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గుదల, చల్లని గాలి మీ సాధారణ దినచర్యకు భంగం కలిగించవచ్చు.
ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ఒక సాధారణ మార్గం ఉంది. అదే శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే ఆహారాన్ని తినడం. సాధారణంగా కొవ్వు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు ఉన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. ఈ ఆహారం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
దుంప కూరగాయలు శీతాకాలంలో దుంప కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియకు చాలా శక్తి అవసరం. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ కాలంలో బంగాళాదుంపలు, బీట్‌రూట్, క్యారెట్లు వంటి రూట్ వెజిటేబుల్స్ తినండి. ఇవి చలితో పోరాడటానికి మీకు సహాయపడతాయి. ఉల్లిపాయలు వంటి కొన్ని ఘాటైన ఆహారాలు కూడా మీ ఆహారంలో భాగం కావచ్చు.
తృణధాన్యాలు, గింజలు వేరుశెనగ, బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి కొన్ని గింజలు కూడా శీతాకాలంలో మేలు చేస్తాయి. ఈ గింజలు మీ జీవక్రియను వేగవంతం చేస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి, చివరికి శరీరాన్ని వేడిగా అనిపించేలా చేస్తాయి.
ఫ్రూట్స్ కొబ్బరి, ఆపిల్ వంటి పండ్లు శీతాకాలంలో మంచి ఎంపిక. ఈ పండ్లు ఫైబర్‌తో నిండి ఉంటాయి. మన కడుపు వాటిని జీర్ణం చేయడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఇది వేడిని ఉత్పత్తి చేసి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.
కోడిగుడ్లు, చికెన్: గుడ్లు, చికెన్ రెండింటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇది త్వరగా జీర్ణం కావడం కష్టం. అందువల్ల ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.
సుగంధ ద్రవ్యాలు వెల్లుల్లి, నల్ల మిరియాలు, అల్లం వంటి సాధారణ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూడా శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తాయి. ఈ మసాలాలు జీర్ణమైనప్పుడు మీ శరీరం వేడిని పెంచే సమ్మేళనంతో వెచ్చగా ఉంచుతుంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటంతో ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రార్ధనాలయాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ చారిత్రక నగరంలో అనేక హిందూ దేవాలయాలూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని కొన్ని ముఖ్య దేవాలయాల సమాచారం మీకోసం…
బిర్లా మందిర్ హైదరాబాద్ పర్యాటకంలో ప్రముఖంగా చూడదగ్గ ఆలయాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. పదేళ్ల పాటు కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది.
ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ లో ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయం నిర్మించబడడంతో దీనిని బిర్లా మందిర్ అని పిలుస్తారు. బిర్లా మందిర్ పేరుతో దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో వీరు ఆలయాలను నిర్మించారు.
సంఘీ టెంపుల్ హైదరాబాద్‌లో సందర్శించాల్సిన మరో అద్భుతమైన ఆలయం సంఘీ టెంపుల్. ఇది హైదరాబాద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఉంది. ఈ దేవాలయ పవిత్ర రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీవెంకటేశ్వర స్వామి. ఇక్కడి వెంకన్న విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతిరూపమని ప్రతీతి. ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అనేక చిన్న ఆలయాలు కొలువై ఉన్నాయి. పరమానందగిరి కొండపై ఉన్న సంఘీ ఆలయాల సమూహం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ ఆలయానికి వెళ్లడానికి కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. సంఘీ టెంపుల్‌కు సమీపంలోనే ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ఉంది.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేక పాహిమాం.. అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే ఇప్పటి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం.
చిలుకూరు బాలాజీ ఆలయం
హైదరాబాద్‌కు 23 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం ఉంది. అక్కడే కొలువై ఉన్నాడు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. ఆయన్ని అందరూ చిలుకూరు బాలాజీ అని పిలుస్తుంటారు. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. వారాంతాల్లో అయితే ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. విదేశాలకు వెళ్లేవారు చాలామంది వీసా కోసం చిలుకూరు బాలాజీకి మొక్కులు కడుతుంటారు. అందుకే ఆయన్ని ముద్దుగా వీసా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ముందుగా కోరికను మొక్కు కొని 11 ప్రదిక్షణలు చేస్తారు. ఆ కోరిక తీరిన తరువాత 108 సార్లు ప్రదిక్షణలు చేస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఎక్కడా హుండీ అనేది ఉండదు. అంతేకాకుండా స్వామివారి దర్శనానికి ధనిక, పేద అధికార తారతమ్యాలు ఉండవు. అందరు ఒకేవరుసలో నిలబడి దర్శనం చేసుకోవాలి.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ సమీపంలోని బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం కొలువై ఉంది. ఇక్కడి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే అమ్మగా భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది. మంత్ర శాస్రంలో ప్రధానమైన దశమహావిద్యలలో చిన్న మస్తాదేవి ఒకరు. ఆ చిన్నమస్తదేవియే పరశురాముని తల్లి రేణుకాదేవిగా అవతరించింది. ఆ రేణుకాదేవియే నేడు కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతుంది. ఇలా అమ్మవారి రూపాలలో బాలా త్రిపురసుందరి దేవి ఒకరు. ఆ తల్లిని భక్తులు బాలా, బాలాంబిక, బాలాకాంబిక అని పిలుస్తుండేవారు. ఆ బాలికాంబీయే బల్కమ్మగా, ఆ అమ్మ కొలువై ఉన్న ప్రాంతం బల్కమ్మ పేటగా పిలవబడుతూ అది నేటి బల్కంపేటగా మారిందని పూర్వీకులు చెబుతుంటారు.
ఈ ఎల్లమ్మ దేవత బావిలో భూమి ఉపరితలం నుండి సుమారు 10 అడుగుల దిగువన శయనరూపంలో తూర్పుములాగా చూస్తూ స్వయం భూమూర్తిగా భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. అమ్మవారి స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంది. ఈ బావి నుండి ఉధ్భవించే జల ఊట నిరంతరం ఉధ్భవించడం ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణము, ప్రతి ఆషాడమాసం చివరి ఆదివారం నాడు బోనాలు మరియు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడుతాయి. ఎల్లమ్మను దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆదివారం రోజు ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది.
కీసరగుట్ట ఆలయం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలో కీసరగుట్ట అనే కొండపై నెలకొని ఉంది శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది అతిపురాతనమై శైవక్షేత్రం. ఆలయంలోనే కాకుండా వెలుపల కొండపై అనేక శివలింగాలు దర్శనమీయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. కీసరగుట్టపై ప్రతిష్ఠించేందుకు శివలింగాన్ని తీసుకురావాలని శ్రీరాముడు తన భక్తుడైన హనుమంతుడికి చెబుతాడు. అయితే ఆంజనేయుడు ముహూర్త సమయానికి రాకపోవడంతో రాముడు మరొక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు. అయితే తాను తెచ్చిన లింగాన్ని కాకుండా వేరేది ప్రతిష్ఠించడంతో హనుమంతుడు అలుగుతాడు. దీంతో రాముడు.. హనుమంతుడిని బుజ్జగిస్తూ ఈ క్షేత్రం భవిష్యత్తులో కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదిస్తాడు. అనంతరం హనుమంతుడు తెచ్చిన లింగాల్లో ఒక దాన్ని స్వామివారి వామ భాగంలో ప్రతిష్ఠించాడు. అదే శ్రీ మారుతీ కాశీ విశ్వేశ్వర లింగమని భక్తులు చెబుతుంటారు. ఈ శైవక్షేత్రం హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కీసరగుట్టకు బస్సు సౌకర్యం కలదు.
అష్టలక్షి ఆలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో కొత్తపేటలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఈ ఆలయం కోఠి నుంచి 8 కి.మీ, సికింద్రాబాద్ నుంచి 14కి.మీ.ల దూరంలో ఉంది. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దాని చుట్టూ మరో ఏడు గర్భాలయాలు ఉన్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ, వరద ముద్రలో దివ్యాలంకార శోభితులై భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంకా మిగతా ఏడు గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధ్యానలక్ష్మి, శ్రీవిజయలక్ష్మి, శ్రీవీరలక్ష్మి, శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వలన స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని, అష్టైశ్వర్యాలు సిద్డస్తాయని శాస్త్ర వచనం.
పూరీ జగన్నాథ్ ఆలయం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పూరీ జగన్నాథ ఆలయం ఉంది. ఈ దేవాలయం దేశంలోని ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయాన్ని పోలి ఉండటం విశేషం. అక్కడికి వెళ్తే నిజంగానే పూరీకి వచ్చామా అన్న భావన కలుగుతుంది. ఈ ఆలయంలో బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. నగర ప్రజలతో పాటు పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శించే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.
దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న సాయిబాబా ఆలయం భక్తులను ఆకర్షిస్తుంటుంది. షిర్డీలోని బాబా ఆలయాన్ని పోలి ఉండేలా ఇక్కడ నిర్మించడం విశేషం. అందుకే దీన్ని దక్షిణ షిర్డీగా పిలుస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నప్పటికీ ఈ గుడిని భక్తులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం వరకు చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు వేలాది మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా మారిపోయింది.
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన ప్రదేశాలున్నాయి. కొన్ని చోట్ల జనం కిక్కిరిసిపోయి ఉంటే మరికొన్ని చోట్ల ఒక్క మనిషి కూడా ఉండరు. అయితే 100 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న ఒక ఇల్లును ఇటీవలే ఇటలీలో గుర్తించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ ఇల్లు భారీ డోలమైట్ పర్వతాల మధ్యలో నిర్మించారు. దీనిని ‘ప్రపంచంలోని ఒంటరి ఇల్లు’ అని పిలుస్తారు. ఈ ఇల్లు సముద్ర మట్టానికి దాదాపు 9వేల అడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. ఇంత ఎత్తులో ఇల్లు ఎలా నిర్మించారు.. ఎందుకు నిర్మించారు ఇక్కడ ఎవరు ఉండేవారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ ఇంటిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారని తెలుస్తోంది. ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఇటాలియన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంత ఎత్తులో నిర్మించారని చరిత్ర కారులు చెప్పారు. అప్పట్లో సైనికులు ఈ ఇంటిని స్టోర్ రూమ్‌గా కూడా ఉపయోగించారు. సైనికుల కోసం తీసుకువచ్చిన వస్తువులు ఇప్పటికీ భద్రంగా ఉండటం విశేషం. ఈ ఇల్లు పూర్తిగా భిన్నమైన రీతిలో నిర్మించారు. దీని నిర్మాణంలో చెక్క, తాడు, కేబుల్ ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. పర్వతం మధ్యలో ఈ ఇల్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ ఇంటి చుట్టూ పర్వతాలు తప్ప ఇంకెమీ కనిపించవు. దీంతో ప్రజలెవరూ ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి చేరుకునే మార్గం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక పాత చెక్క వంతెనను దాటితేనే ఇక్కడికి చేరుకోగలం. గొప్పదనం ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరో లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రమాదం కారణంగా ప్రజలు ఇక్కడికి రాకుండా సాధారణంగా నిషేధించినా సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే సొంత పూచీతో అనుమతిస్తున్నారు.
మనం మామూలుగా 3 నిమిషాల్లో ఎన్ని ఇడ్లీలు తినగలం.. మహా అయితే 2-3 మించి తినలేం కదా.. అయితే తమిళనాడులో జరిగిన ఇడ్లీ పోటీలో మాత్రం ఇద్దరు వ్యక్తులు కేవలం 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు చొప్పున ఆరగించి అందరినీ షాక్‌కు గురిచేశారు. తమిళనాడు పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ సాంబార్. అయితే ఇటీవల చాలా మంది ఇడ్లీలను కాదని ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇడ్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా.. ఈరోడ్ జిల్లా కడయంపట్టి ప్రాంతానికి చెందిన ‘పట్టాయ కేటరింగ్’ సంస్థ ఇడ్లీలు తినే పోటీ నిర్వహించింది.
ఈ పోటీలో పాల్గొనేవారికి నిర్వాహకులు కొన్ని నిబంధనలు విధించారు. 10 నిమిషాల గడువులో వీలైనన్ని ఎక్కువ ఇడ్లీలు తినాలి. తిన్న తర్వాత 5 నిమిషాల వరకు వాంతి చేసుకోకూడదు. పోటీలో పాల్గొనేవారిని 19-30 ఏళ్లు, 31-40 ఏళ్లు, 41-50 ఏళ్లు.. ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 25 మంది వరకు పాల్గొని ఇడ్లీలు తిన్నారు. 31-40 ఏళ్ల వయసు గ్రూపులో కుమార పాలయం ప్రాంతానికి చెందిన రవి, 41-50 ఏళ్ల వయసు గ్రూపులో భవానీ ప్రాంతానికి చెందిన రామలింగం.. కేవలం 3 నిమిషాల్లోనే 19 ఇడ్లీల చొప్పున తినేసి విజేతలుగా నిలిచారు. మిగిలిన వారెవరూ 19 ఇడ్లీలు తినలేకపోయారు. అదే సమయంలో ప్రతి గ్రూపులో ఎక్కువ ఇడ్లీలు తిన్నవారికి రూ.5వేలు, రెండో విజేతకు రూ.3,000, మూడో విజేతకు రూ.2,000, నాలుగో విజేతకు రూ.1,000 చొప్పున నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. ఈ ఇడ్లీ పోటీ ఏదో మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది కదా..
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్‌లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి.
హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సందర్శకులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మారేడుమిల్లి సందర్శనకు వెళ్లేవారు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు.
జలతరంగిణి జలపాతాలు మారేడుమిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. మారేడుమిల్లి ప్రాంతం పరిధిలో అనేక చిన్న జలపాతాలతో పాటు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతాలు ఉన్నాయి. ప్రధాన రహదారికి ఈ ప్రదేశం కాస్త దగ్గరగా ఉంటుంది. బైక్‌లపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
రాజమండ్రి నుండి గోకవరం దాటిన తరువాత ఫోక్స్ పేట నుండి రక్షిత అటవీ ప్రాంతం మెుదలవుతుంది. దారి మద్యలో సీతపల్లి వద్ద వనదేవతగా కోలిచే బాపనమ్మ తల్లి దేవస్దానం వస్తుంది. ఆ చల్లని తల్లిని ప్రతి ఒక్కరూ దర్శిస్తారు. సీతపల్లి దాటి 5 కిలోమీటర్లు వెళ్తే సీతపల్లి వాగు, పాలవాగు కనిపిస్తాయి. అక్కడినుండి ముందుకు వెళితే రంపచోడవరం దగ్గరలో రంప జలపాతం వస్తుంది. వేసవిలో జలధార తక్కువగా ఉంటుంది.. కాబట్టి జులై, ఆగస్టు నెలలో వెళ్తే ఆ జలపాతం అందాలు ఆస్వాదించొచ్చు.
ఈ ప్రకృతి అందాల నడుమ సేద తీరడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. రంపచోడవరంకి 4 కి.మీ.ల దూరంలో శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం పురాతన శివాలయం ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారు ఈ ఆలయంలో పూజలు చేసేవారని చెబుతారు.
స్వర్ణధార – రంప జలపాతాలు జలతరంగిణి జలపాతాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మర్రిచెట్ల మాదిరిగా పెద్దగా ఉంటాయి. దట్టమైన, లోతైన అటవీ మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవచ్చు. మార్గమధ్యంలో నెమళ్లను, ఇతర పక్షులను కూడా చూసే అవకాశం ఉంటుంది.
అలాగే మారేడుమిల్లి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి. రంప చోడవరం నుండి రంప జలపాతం వరకూ జీప్‌లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం. 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ జలపాతం వద్ద నీరు తియ్యని రుచితో ఉంటుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
కార్తీక వనం కార్తీక వనం ప్రాంతం అరుదైన మొక్కలు, వృక్ష జాతులకు ప్రధాన ఆవాసం. సహజసిద్ధ ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఉసిరి, మారేడు, గూస్ బెర్రీ, బేల్ వంటి అనేక రకాల మొక్కల జాతులు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు ఇది ఒక బహిరంగ ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. దాదాపు 203 జాతుల ఔషధ మొక్కలను ఇక్కడ చూడవచ్చు. స్వచ్చమైన గాలి, వాతావరణం మధ్య ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు.
జంగల్ స్టార్ క్యాంప్ సైట్ ఈ ప్రదేశానికి రామాయణానికి సంబంధం ఉందంటారు. ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు చెప్తారు. ఇక్కడ వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు , అడవులు ఇలా చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది.
మదనికుంజ్ విహార స్థల్ మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరో అద్భుతమైన విహార ప్రదేశం మదనికుంజ్-విహార స్థల్. ప్రకృతి ఒడిలో సేద తీరే పిక్నిక్ స్పాట్‌గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. పులులు, అడవి కోళ్లు, అడవి దున్నలు, నల్ల చిరుతలు, నెమళ్లతో పాటు విభిన్న రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి.
ఈ మజిలీలో మారేడుమిల్లిలో అక్కడి గిరిజనులు సహజసిద్ధంగా అడవిలో పెరిగిన కోళ్లతో చేసే బొంగు చికెన్ రుచి చూడండి. ఆ చికెన్ ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టాలని అనిపించదు. అక్కడ బస చేయడానికి ఏపీ టూరిజం హరితా రిసార్ట్స్, ప్రైవేట్ వ్యక్తులు నడిపే లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. దారిలో ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటక శాఖ వారు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుండి ప్రకృతి రమణీయతను తిలకించవచ్చు, రెండవ వ్యూ పాయింట్ చెరుకుంటే ఘాట్ రోడ్ ప్రయాణం పూర్తి అయినట్టే. అక్కడే సోకులేరు వాగు అద్బుతంగా ఉంటుంది.
ముఖ్య గమనిక: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనుకునేవారు ముందుగా మీ వాహనం కండీషన్ చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏదైనా రిపేరు వస్తే దగ్గర్లో మెకానిక్ దొరకని పరిస్దితి ఉంటుంది. ఈ మార్గంలో రాత్రి ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు. చీకటి పడేలోపు ఏదైనా ప్రదేశానికి చేరుకునేలా చూసుకోండి..
హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ప్రత్యేకత గత నగరం. తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం.. హస్తకళలకు, పర్యాటకానికి ప్రసిద్ధి. నిజాం రాజుల రాచరికానికి ప్రతీకగా భాసిల్లిన భాగ్యనగరం.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ దూసుకుపోతోంది. పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో లేనిదంటూ ఏదీ లేదు.
దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌ను ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. అప్పట్లో భాగ్యనగరాన్ని ఏలిన 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తించబడ్డాడు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరొందిన కోహినూర్ వజ్రం కూడా హైదరాబాదులో బయటపడిందే. కొల్లూరు గనుల్లో లభ్యమైన ఈ డైమండ్ అప్పట్లో గోల్కొండ కోటకు తరలినట్లు చెబుతుంటారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచే ఈ నగరంలో ప్రఖ్యాతి కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…
చార్మినార్: హైదరాబాద్ యొక్క అతి ముఖ్యమైన సూచిక ‘చార్మినార్’. నాలుగు మినార్‌లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్ అని పిలుస్తారు. అయితే ఈ నిర్మాణంలో అడుగడుగునా చార్ దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ప్రసిద్ధి పొందింది. ఆర్కియాలజీ పరిశోధనల్లో చార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న నాలుగు మినార్‌ల ఎత్తులను నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా నాలుగుతో భాగించబడడం విశేషం.
1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు ఛార్మినార్ ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్‌ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ఈ చారిత్రక కట్టడం ఖ్యాతి కారణంగా దీని చుట్టు పక్కల ప్రదేశాలు చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు పొందాయి. వాహనాల కాలుష్యం కారణంగా ఈ కట్టడం రంగు మారుతుండడంతో దీని పరిరక్షణలో భాగంగా దీనికి 300 మీటర్ల వరకూ దూరం వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. ఈ ప్రదేశంలో కేవలం పాదాచారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కట్టడం హైదరాబాద్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గోల్కొండ కోట: గోల్కొండ రాజ్యానికి 14-16 శతాబ్దాల మధ్య గోల్కొండ కోట రాజధానిగా ఉండేది. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోటను భారతదేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. ఈ కోట ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది చప్పట్ల ప్రదేశం. కోట ముఖద్వారం వద్ద ఉండే గోపురం కింద చప్పట్లు కొడితే ఆ శబ్ధం కోట పై భాగంలో కిలోమీటరు దూరం వరకూ వినిపిస్తుంది. ఆకస్మిక దాడుల నుంచి అప్రమత్తం కావడానికి పూర్వం దీనిని ఉపయోగించే వారు. ఈ కోటలోని వాతావరణం పర్యాటకులకు 12వ శతాబ్ధం నాటి కాలాన్ని పరిచయం చేస్తుంది. హైదరాబాద్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే గోల్కొండ కోట పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది.
చౌమహల్లా ప్యాలెస్: 18వ శతాబ్దం నాటికి చెందిన అద్భుతమైన చారిత్రక కట్టడం ‘చౌమహల్లా ప్యాలెస్’. హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేసిన ఐదో నిజాం పాలకుడు ఆసఫ్ జాహ్ వంశం యొక్క నివాస స్థలం ఇది. ఉన్నత స్థాయి సమావేశాలు, రాచరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి. పర్షియన్ భాషలో ‘చాహర్’ అంటే నాలుగు, అరబ్ భాషలో ‘మహాలత్’ అంటే సౌధం అని అర్ధం వస్తుంది. ఈ రెండు పదాల ద్వారా ఈ భవనానికి అప్పటి పాలకులు చౌమహల్లాగా నామకరణం చేసినట్లు తెలుస్తుంది. 14 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ లో చూపు తిప్పుకోనివ్వని ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. 2010లో యునెస్కో ఈ ప్యాలెస్‌ను సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. హైదరాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ ఉంది.
బిర్లా మందిర్: హైదరాబాద్ పర్యాటకంలో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలో ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. 10 ఏళ్ల పాటూ కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయాన్ని నిర్మించడంతో దీన్ని బిర్లా మందిర్ అని పిలుస్తారు.
సాలార్ జంగ్ మ్యూజియం: దేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియాల్లో ‘సాలార్ జంగ్ మ్యూజియం’ ఒకటి. ఈ మ్యూజియంలోని పురాతన వస్తువులు నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ III చేత సేకరించబడ్డాయి. పాలరాతి శిల్పాలు, ఏనుగు దంతాల కళాకృతులతో పాటు పర్షియా, ఈజిప్ట్, ఉత్తర అమెరికా, ఐరోపా, చైనా, బర్మా, నేపాల్, జపాన్ వంటి దేశాలకు సంబంధించిన లోహ కళాఖండాలు, తివాచీలు, సెరామిక్స్, బొమ్మలు, శిల్పాలు ఇక్కడ ప్రదర్శితమవుతాయి. దీంతో పాటు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన చిత్రాలు, మొఘలుల కాలం నాటి కత్తులు, బాకులు కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇటాలియన్ కళాకారుడు బెంజొని రూపొందించిన వీల్డ్ రెబెక్కా శిల్పం మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. మ్యూజియంలో అడుగుపెట్టిన పర్యాటకులు అక్కడి చారిత్రక సంపదను చూసి గొప్ప అనుభవానికి లోనవుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సందర్శకులకు అనుమతి ఇస్తారు.
ఫలక్‌నుమా ప్యాలెస్: రాజదర్పం ఉట్టిపడే.. ఫలక్‌నుమా ప్యాలస్‌ను నిజాం నవాబులు నిర్మించలేదు. సర్ వికారుల్ ఉమ్రా దీనికి అసలు నిర్మాత.. ఇతను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు స్వయానా బావ. ఆయన సంస్థానానికి ప్రధానమంత్రి కూడా. 1884 మార్చి 3న ఫలక్‌నూమా ప్యాలెస్‌కు శంకుస్థాపన చేశారు. ఇండో-అరేబియన్ నిర్మాణ శైలిలో దీన్ని డిజైన్ చేశారు. ఈ ప్యాలస్ నిర్మాణం కోసం ఇటలీ నుంచి పాలరాయిని, ఇంగ్లాండ్ నుంచి చెక్కను తెప్పించడం గమనార్హం. అయితే వికారుల్ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడంతో ఆరో నిజాం 1897లో ఆయనకు రూ.60వేలు చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నారని చెబుతుంటారు. ఆ తర్వాత అది ఏడో నిజాం మనవడు బర్కత్ అలీఖాన్ ముకరంజాకు దక్కింది. 2000వ సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా ఫలక్‌నూమా ప్యాలెస్‌ను 30 ఏళ్లపాటు తాజ్ గ్రూప్‌కి అప్పగించారు. దీన్ని హోటల్‌గా మార్పులు చేసి 2010 నుంచి తాజ్ ఫలక్‌నుమాగా మార్చారు.
హుస్సేన్ సాగర్: హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఉన్న మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించారు. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ సరస్సు అప్పట్లో నగరానికి మంచినీటి అవసరాన్ని తీర్చేది. కాలక్రమేణా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు దీనిలో చేరడంతో ఇప్పుడు మురికికూపంగా మారింది. అయినప్పటికీ హుస్సేన్‌సాగర్ పరిసరాలు పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటాయి. హుస్సేన్‌సాగర్‌లో మధ్యలో స్థాపించిన బుద్ధ విగ్రహం ఆ ప్రాంతానికి మరింత ఆకర్షణ తీసుకొస్తుంది. దీనికి అనుబంధంగా నిర్మించిన నెక్లెస్ రోడ్ నగర అందాన్ని మరింత పెంచింది.
హైటెక్ సిటీ: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం హైటెక్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు కొనసాగుతున్న సమయంలో 1998 నవంబర్ 22న సైబర్ టవర్స్‌ను అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి చేతుల మీదుగా ప్రారంభించారు. కేవలం 14 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న సైబర్ టవర్స్‌లో దేశ, విదేశాలకు చెందిన ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొలువుదీరాయి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఎదగడంతో హైటెక్ సిటీ పాత్ర ఎంతో ఉంది. దీని కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏర్పాటై సైబరాబాద్ అనే మరో ప్రాంతం ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సాప్ట్‌వేర్ రంగంలో బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ ఎదగడానికి హైటెక్ సిటీయే కారణం.
ఉస్మానియా యూనివర్శిటీ: నాటి హైదరాబాద్ సంస్థానం, బ్రిటిష్ ఇండియాలో అతిపెద్ద సంస్థానం. 1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటిగా చెబుతారు. ఎందరికో చదువులను ప్రసాదించి.. ఉన్నత స్థానాల్లో నిలబెడుతున్న ఉస్మానియా యూనివర్శిటీని ఏడో నిజాం 1917లో స్థాపించారు.
కాచిగూడ రైల్వేస్టేషన్: కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో నిజాం ప్రభువులే నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌కు స్థానిక కాచి కులస్తుల జ్ఞాపకార్థంగా ‘కాచిగూడ’గా నామకరణం చేశారు. నిజాం కుటుంబీకులంతా ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేసేవారు. శిల్పశైలి పరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అందమైన స్టేషన్లలో ఒకటిగా కాచిగూడ స్టేషన్ నిలుస్తుంది. బయటి నుంచి చూస్తే రాజా ప్రసాదంలా కనిపించే కాచిగూడ రైల్వేస్టేషన్ భాగ్యనగర ప్రధాన చిహ్నాలలో ఒకటి.
‘పగడాల’ రాజ్యం:
దేశంలో పగడాల వ్యాపారానికి పెట్టింది పేరు హైదరాబాద్. ఇక్కడ విక్రయించే పగడాలను శ్రీలంక, ఇరాక్, చైనాల నుంచి దిగుమతి చేసుకుంటారు. చార్మినార్ వద్ద పత్తర్‌గట్టీ, మెడివల్ బజార్లు నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే, వీటిని కొనుగోలు చేసే ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ప్లాస్టిక్ పగడాలు కూడా అమ్మేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి.
అత్తర్లకు అడ్డా: ఆల్కహాల్ కలవని ‘అత్తర్ల’కు భాగ్యనగరం ప్రసిద్ధి. అవి కూడా పాతబస్తీలోనే కొనుగోలు చేయాలి. ముస్లింలు వినియోగించే ఈ అత్తర్లకు భలే డిమాండు ఉంటుంది. ఇక్కడి డిమాండును దృష్టిలో పెట్టుకునే 19వ శతాబ్దంలో చాలామంది ‘అత్తర్‌వాలా’లు గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు వీరు ఏర్పాటు చేసినవే.
బిర్యానీ గుమగుమలు: హైదరాబాద్ పేరు వింటే ఠక్కున గుర్తుకొచ్చేది.. బిర్యాని. ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఏలిన నిజాములు ఆహార ప్రియులు. ఈ నేపథ్యంలో స్పేసీగా, టెస్టీగా.. అనేక రకాల వంటకాలను వారు రుచి చూసేవారు. ఇవన్నీ మొగళుల కాలంలో ఉనికిలోకి వచ్చినవే. ఇక హలీమ్.. గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. ఇక్కడి హలీమ్‌కు భారీగా డిమాండు ఉంటుంది. హైదరాబాదులోని ప్యారడైజ్, బావర్చి, షాదాబ్, పిస్తా హౌజ్ తదితర హోటళ్లు బిర్యానీ ఫేమస్.
కేబుల్ బ్రిడ్జి ఇటీవలే దుర్గం చెరువు మీద నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగరానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ కనెక్టివిటీలో భాగంగా దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ రెండేళ్లు పాటు శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశంలోనే కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జిగా ఈ నిర్మాణం రికార్డు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డుల కెక్కింది.
వినోదానికి అడ్డా: హైదరాబాద్ నగరం వినోదానికి పెట్టింది పేరు. షాపింగ్ మాల్స్ నుంచి మల్టిప్లెక్స్‌ల వరకు రోజూ ఎక్కడ చూసినా రద్దీగానే ఉంటుంది. నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, పబ్లిక్ గార్డెన్స్, పంజాగుట్ట సెంట్రల్, ప్రసాద్ ఐమ్యాక్స్. సుజనా ఫోరం మాల్, ఇనార్బిట్ మాల్, దుర్గమ్మ చెరువు, శిల్పారామం, … ఒకటేమిటీ నగరంలో అనేక ప్రాంతాలు పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. అటు చరిత్ర.. ఇటు ఆధునికతను ప్రతిబింబిచేలా హైదరాబాద్ నగరం దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే ఆకర్షిస్తోంది.
హైదరాబాద్‌లో చుట్టుపక్కల తప్పక సందర్శించాల్సిన మరిన్ని ప్రదేశాలు నెహ్రూ జూపార్క్ ఎన్టీఆర్ పార్క్ కుతుబ్‌షాహీ టూంబ్స్ దుర్గం చెరువు రామోజీ ఫిల్మ్ సిటీ జల విహార్ వండర్ లా మౌంట్ ఒపెరా స్నో వరల్డ్ శిల్పారామం కేబీఆర్ పార్క్ మక్కా మసీద్ సంఘీ టెంపుల్ పెద్దమ్మ గుడి చిలుకూరు బాలాజీ ఆలయం
‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.
కోనసీమ ప్రకృతి పదం.. మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయలున్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమకు అమలాపురం పట్టణం ప్రధాన కేంద్రం కాగా.. రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట ప్రధాన ప్రాంతాలు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రావులపాలెంను కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.
అందాల సీమ మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్ల తోరణాలు, అరటి గెలలు, కొబ్బరి తోటలు, మంచు తెరలు ఇలాంటి మనోహర దృశ్యాలన్నీ కోనసీమ వాసులకు సర్వసాధారణం. పుష్కలమైన ప్రకృతి వనరులు, కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం కోనసీమకే వన్నె తెస్తుంటాయి. కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారు.
కోనసీమ ప్రాంతం పురాతన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా భాసిల్లుతోంది. అతిథులకు మర్యాదలు చేయడంలో కోనసీమ వాసులకు కొట్టేవాళ్లే ఉండరు. అన్నిచోట్ల కొట్టి చంపితే.. కోనసీమ వాళ్ల తిండి పెట్టి చంపేస్తారన్న నానుడి ఉంది. సంక్రాంతి పండుగకు నిర్వహించే ముగ్గుల పోటీలు, కోనసీమలో జరిగే కోడిపందేలు, తీర్థాలు, జాతరలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.
పలకరింపులు భలే ఉంటాయ్ కోనసీమలో పలకరింపులు భలే వింతగా ఉన్నాయి. అక్కడ ఎదుటివారిని ఆయ్, అండి అంటూ ప్రత్యేక శైలిలో మర్యాదగా పిలుస్తుంటారు. ఈ తరహా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మనకు కనిపించదు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం.
ప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధ, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం ముఖ్యమైనవి. అవివాహితులు మురముళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటరు ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు.
కోనసీమ వంటలు ఆహా అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్‌కు కోనసీమ పెట్టింది పేరు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. గోదావరి నదిపై వంతెనలు నిర్మించక ముందు ప్రజా రవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే కొనసాగిస్తూనే ఉన్నారు. కోనసీమ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా ప్రసిద్ధి. గతంలో అనేక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి.
కోనసీమ చేరుకోవటం ఎలా ? వాయు మార్గం: అమలాపురానికి సమీపంలోని ఉన్న అతిపెద్ద నగరం రాజమండ్రి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు అమలాపురానికి బస్సు సౌకర్యం ఉంది.
రైలు మార్గం: కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, గంగవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రైల్వే స్టేషన్‌లు కలవు. రైలు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవచ్చు. బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుండి కోనసీమలోని ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.