Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఒక వివాహ బంధాన్ని ఖాయపరుచుకునే సమయంలో వరుడి డిమాండ్‌పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది. పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్‌ల సంగతి తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు. వరుడి డిమాండ్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అందరిలోనూ ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు, కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు అసందర్భ సంప్రదాయాల గురించి మాత్రమే కావడం విశేషం..
వరుడి ఇవే డిమాండ్లు
1)ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. 2)పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరిస్తుంది. 3)అసభ్యకరమైన చెవి-బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడుతుంది. 4)దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉంటారు. 5)వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారు వివాహం నుండి బహిష్కరించబడతారు. 6)పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపలేరు. 7)కెమెరామేన్ దూరం నుండి ఛాయాచిత్రాలు తీస్తాడు. అవసరం మేరకు, ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీస్తాడు. పురోహితుడి ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు. ఇది తమ సాక్ష్యంలో దేవుళ్ళను పిలిపించి జరిపే కళ్యాణం, సినిమా షూటింగ్ కాదు. 8)వధూవరుల ద్వారా కెమెరామేన్ ఆదేశానుసారం, నేరుగా రివర్స్‌లో పోజులు పెట్టి చిత్రాలు తీయబడవు. 9)పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి. తద్వారా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా, అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. 10)తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోవాలని అడిగితే, అట్టి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరిస్తారు.
ఈ అబ్బాయి డిమాండ్లన్నీ అమ్మాయిలు ఆనందంగా అంగీకరించదగినవే. ఇటీవల కాలంలో వివాహ కార్యాల్లో మొదలైన వికృత చర్యలను ఇలాంటి చర్యలతో రూపుమాపొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివాహం అనేది ఒక పవిత్ర కార్యక్రమం.. దానిని గౌరవిద్దాం.. మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ప్రభాస్ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ‘‘మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం.. అయోధ్యలోని సరయు నది ఒడ్డున జరగనున్న ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్‌లో పాల్గొనండి. అక్టోబర్ 2న రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల చేయనున్నాం’’ అని ఔంరౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
రామాయణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతిసనన్ మెరవనున్నారు. లక్ష్మణుడిగా సన్నీసింగ్ కనిపించనున్నారు. రామాయణంలో ముఖ్యంగా చెప్పుకొనే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
విజయా సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఆఖరి విజయవంతమైన చిత్రం ‘గుండమ్మ కథ’. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్. కాని “గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి. జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.
కథలో చిన్న చిన్న మార్పులు చేసి డి.వి.నరసరాజుతో మాటలు రాయించేశారు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని అనుకున్నారు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపారు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది. ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన చక్రపాణికి ఇచ్చారు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డారు. విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశారు.
సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నారు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించారు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందారు. కానీ చక్రపాణి స్క్రిప్ట్ రచయితగా కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో “పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం” అంటూ తేల్చి, పాత్రను తొలగించేశారు. అయితే మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.
సినిమా కథని చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు, దర్శకుడు కామేశ్వరరావు, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథాచర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది. ఆ చర్చల్లోనే వెంటనే ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అయితేనే సరిపోతారని భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, “ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది” అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు.
సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు. గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహినీ స్టూడియోస్ లో నిర్మించారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా మార్కస్ బార్ట్లే వ్యవహరించారు. చిత్రీకరణలో అవసరమైన సెట్ లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం వేశారు.
సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన వాహినీ స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవారు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కునేవారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవారు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించేవారు. వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవారు. సినిమాలో “కోలో కోలోయన్న” పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్‌లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు. గుండమ్మకథను జి.కళ్యాణసుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డి.జి.జయరాం వ్యవహరించారు. సినిమా రీల్ ని విజయా లేబొరేటరీస్ లో ప్రాసెస్ చేశారు. సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు. దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు. గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.
సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ “అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా” అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన విజయమని స్థిరపడిపోయాకా కూడా ఆయన సమాధాన పడలేదు, ఏంటోనండి. జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ ప్రస్తావన వచ్చినపపుడల్లా అనేవారు. . సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే “ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్” అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.
ఆర్య, ఆర్య-2 చిత్రాలతో టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్‌గా ముద్రపడ్డారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కింది ‘పుష్ప’. 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్ ‘పుష్ప – ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
అల్లు అర్జున్ – సుకుమార్ తొలిసారి 2004లో ‘ఆర్య’తో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో ‘ఆర్య 2’తో అలరించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘పుష్ప’.
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘పుష్ప’రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. చిత్తూరు యాస నేర్చుకున్నారు.
‘పుష్ప’ సినిమాకు ₹160 కోట్ల నుంచి ₹180 కోట్లు ఖర్చు చేశారని భోగట్టా. రెండో భాగం చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారట.
అల్లు అర్జున్ ‘పుష్ప’ గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదట. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే ఓపిగ్గా కూర్చొనేవారట. షూట్ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదని బన్నీ చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ‘పుష్ప’అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం మారేడుమిల్లి అడవులను ఎంచుకుంది.
కొన్ని రోజులు కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిగింది. కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం అక్కడకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడి పోలీసులు పట్టుకున్నారట. ఇది ఎర్రచందనం కాదన్నా, తాము సినిమా వాళ్లమని చెప్పినా వాళ్లు వినలేదట. అవి సినిమా కోసం తయారు చేసినవని నిరూపించాక గానీ వదిలిపెట్టలేదట.
యూనిట్ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు.
తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్, ఫైబర్ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు. ఎర్రచందనం దుంగలు, యూనిట్ సామాగ్రిని అడవుల్లోకి తీసుకెళ్లడానికి కష్టమయ్యేది. ఇందుకోసం అడవుల్లో కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది.
‘పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు.
సునీల్ ఇందులో మంగళం శ్రీను అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ కమెడియన్‌గా పేరు తెచ్చుకోవటం గమనార్హం. అయితే పాన్ ఇండియాలో విలన్‌గా చేస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు.
ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఫహద్ ఫాజిల్ పాత్ర మొదటి విజయ్ సేతుపతిని అడిగారు. కానీ డేట్స్ కుదరక ఆయన చేయలేకపోయారు.
సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కలిసి వరుసగా చేస్తున్న ఎనిమిదో చిత్రం ‘పుష్ప’. ఇప్పటివరకూ విడుదలైన సాంగ్స్ అన్నీ కలిసి మొత్తంగా 250 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించాయి.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.
మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మికకు ఇది రెండో చిత్రం మొదటి చిత్రం ‘డియర్ కామ్రేడ్ చేశారు.’ అలాగే దర్శకుడు సుకుమార్‌కు మైత్రీ వారితో ఇది రెండో చిత్రమే మొదటిది ‘రంగస్థలం’.
‘పుష్ప’ను మొదట ఒక చిత్రంగా తీయాలనుకున్నారు. కానీ, కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేశారు. ‘పుష్ప: ది రైజ్’ ఇప్పుడు విడుదలవుతోంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటలా 59 నిమిషాలు.
తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె రెండో పార్టులో విశ్వరూపం చూపిస్తుందట. ఫహద్ ఫాజిల్ కూడా సినిమా ఆఖరులోనే వస్తారని టాక్.
ఈ సినిమాలో సమంత ‘ఉ అంటావా… ఊఊ అంటావా’ అనే ఐటెమ్ సాంగ్ చేసింది. ఆమె కెరీర్‌లో తొలిసారి ఇలా కనిపిస్తోంది. సమంత ఐటెమ్ సాంగ్ కోసం పెద్ద మొత్తంలోనే పారితోషికం అందుకుందని టాక్. పాట కోసం ఆమెకు కోటిన్నర రూపాయలు ఇచ్చారట. మొత్తంగా ఈ పాటకు చిత్రబృందం రూ. ఐదు కోట్లు బడ్జెట్ పెట్టిందని టాక్.
ఈ సినిమాలో పాటలకు చాలామంచి పేరు వస్తోంది. అన్నింటినీ చంద్రబోసే రాశారు. ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా..’ పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహాన్… ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు.
2008 నవంబర్‌లో ముంబయి నగరంలో జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సైయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివరిగా ‘మీరు పైకి రాకండి.. వాళ్లని నేను హ్యాండిల్ చేస్తాను’ అంటూ అడివి శేష్ చెప్పిన డైలాగ్ కొసమెరుపు.
‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్.
ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ‘ఖిలాడి’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహారాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్, యాక్షన్ కలయికలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఖిలాడి’ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తూనే తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిందిన ‘ఆచార్య’ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాను సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోని మొదటి లిరికల్ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.
‘లాహే లాహే’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో సీనియర్ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్ అగర్వాల్ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. మణిశర్మ స్వరాలు సమకుర్చారు. సింగర్స్ హరిక నారాయణ్, సాహితి చాగంటిలు ఆలపించిన ఈ పాటకు దినేష్ కొరియోగ్రఫీ అందించాడు.