Category Archives: Movie News

‘లైగర్‌’లో నటుల రెమ్యునరేషన్.. హీరో కంటే ఆయనకే ఎక్కువట


టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లైగర్‌. ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు.

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ క్రియేట్ చేశారు. అయితే ఇదెక్కడా సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు రూ.90కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ బడ్జెట్‌, హీరోహీరోయిన్లు, ఇతర నటుల రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

లైగర్‌ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్‌ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్‌ నటి రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి విజయ్‌ దేవరకొండ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. హీరో తల్లిగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటి రూపాయలు తీసుకోగా.. కోచ్‌గా కనిపించిన రోనిత్‌ రాయ్‌ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్‌గా అందాలు ఆరబోసిన అనన్య పాండే రూ.3 కోట్ల అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్‌గా నిలిచిన మైక్ టైసన్‌గా హీరో కంటే ఎక్కువగా రూ.40కోట్లు అందుకున్నాడట.


‘లైగర్’ డిజాస్టర్.. ఛార్మికి రూ.200 కోట్ల నష్టం!

విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రావడం ప్రేక్షకులని నిరాశపరచడం జరిగిపోయాయి. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌తో మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ.. రెండో రోజు చాలా చోట్ల ఈ సినిమాకి సరిగా థియేటర్స్ ఫిల్ కాలేదు. దీంతో భారీ పరాజయం తప్పదు అనేలా అప్పుడే సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ టామ్ టామ్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందు.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీ కౌర్ ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.

విజయ్, పూరీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమా నిర్మాణం సమయంలో మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సమయంలో మాకు ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చింది. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ డీల్‌ని కాదనుకున్నాం. అందుకు పూరీగారికి ఎన్ని ఘట్స్ కావాలి’’ అంటూ చార్మీ విషయం రివీల్ చేసింది. ఈ విషయం చెబుతూ ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాకి ఓటీటీ డీల్ రూ. 200 కోట్లు (డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసేందుకు) వచ్చిందట. దానిని వారు ఎందుకు కాదని అనుకున్నారో? ఇంతోటి సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందో? అంటూ ఛార్మిని, పూరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ఇప్పుడున్న టాక్ ప్రకారం ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అలాగే, ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో.. చేజేతులా రూ. 200 కోట్లు హుష్ కాకి అనేలా.. సినిమాపై ఉన్న ‘నమ్మకం’తో పూరి, ఛార్మీ అండ్ టీమ్ పోగోట్టుకున్నట్లేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్రాండ్‌ సీన్‌ మేకింగ్.. అదిరిపోయే వీడియో

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ‘వావ్‌’ అనిపించేలా గ్రాండ్ లెవల్‌లో ఉంటాయి. హీరోలిద్దరి పరిచయ సన్నివేశాలు.. అందులోనూ తారక్‌ ఎంట్రీ సీన్‌ అయితే చెప్పడానికి మాటలు సరిపోవు. చిట్టడవిలో పెద్దపులితో భీకర పోరాటం చేస్తూ ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇస్తుంటే.. థియేటర్‌లో ఫుల్‌ సౌండ్‌లో ఆ సీన్‌ చూసిన ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

అయితే ఈ సీన్‌ని ఎలా చిత్రీకరించారో తెలియజేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోలో మొదట సినిమా సీన్‌ని చూపించి.. తర్వాత దాన్ని ఎలా తీర్చిదిద్దారో తెలియజేశారు. తారక్‌పై దాడి చేసేందుకు పులి ఎలా ముందుకు ఉరుకుతుంది? పంజా విసిరేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తుంది? ఇలా ప్రతి విషయాన్ని జక్కన్న క్షుణ్ణంగా తెలియజేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీడియో మూవీ లవర్స్‌ని బాగా ఆకర్షిస్తోంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా మెప్పించారు.


మళ్లీ వస్తున్న ‘అవతార్’… మూడు నెలల ముందే పండగ

అవతార్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఈ విజువల్ వండర్‌గా వచ్చి సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా కోసం పత్యేకంగా ఓ గ్రహాన్నే సృష్టించాడు కామెరూన్. దాంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ సినిమాకి అభిమానులుగా మారిపోయి వేల కోట్లను కట్టబెట్టారు. అంతేకాకుండా.. అప్పట్లో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. అలాగే.. ఈ సినిమాకి పలు సీక్వెల్స్ ఉంటాయనే అప్పట్లోనే కామెరూన్ ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచే ఈ మూవీ సీక్వెల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో అవతార్ సీక్వెల్ అయిన.. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్(Avatar The Way Of Water)’ చిత్రాన్ని గ్రాండ్‌గా డిసెంబర్ 16, 2022న విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్సాన్స్‌ని అందుకుంది. ఈ సినిమా మొదటి పార్ట్ కంటే గ్రాండియర్‌గా ఉంటుందనే భావనని ప్రేక్షకుడి మదిలో కలిగించింది. దీంతో అవతార్ 2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అవతార్‌ 1ని మళ్లీ విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అది కూడా అవతార్ 2 విడుదలకి దాదాపు మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ 23 విడుదల చేసేందుకు సిద్ధమైంది. అది కూడా లిమిటెడ్ థియేటర్స్‌లో మాత్రమే. దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ.. పెద్ద స్ర్కీన్‌లో చూడడం మిస్ అయినా ఎంతోమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.


‘సీతారామం’ భామకి ఆఫర్ల వెల్లువ!

‘సీతారామం’లో సీతగా మైమరపించే నటనతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయా..? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మన తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌కి మొదటి సినిమా గనక భారీ హిట్ సాధిస్తే ఇక అందరూ ఆమె వెనకాలే క్యూ కడుతుంటారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి హీరోయిన్స్‌గా పరిచయమైన వారిని చూస్తే అర్థమవుతుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతిశెట్టి (Krithi Shetty) ఆ సినిమా రిలీజ్ కాకుండానే అరడజను సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ఇలా ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌కి కూడా పెద్ద హీరోల సరసన నటించే ఛాన్సులు వస్తున్నాయట.

సీతా రామం (Sita Ramam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్.. అందంలో మన హీరోలను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. సీతగా నటించి అందరి మెప్పు పొందింది. దాంతో ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మొదలబోతున్న సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు మృణాల్ పేరునే పరిశీలిస్తున్నారట. మరి అఫీషియల్‌గా ఎప్పుడు కన్‌ఫర్మేషన్ వస్తుందో గానీ, ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ కమిటైందని ఇన్‌సైడ్ టాక్. పెళ్లి సందడి సినిమా తర్వాత యంగ్ బ్యూటీ శ్రీలీల, రొమాంటిక్ మూవీతో పరిచయమైన కేతిక శర్మ ఇలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు. ఈ వరుసలో ఇప్పుడు మృణాల్ కూడా చేరిందని చెప్పుకుంటున్నారు.


ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’

గతేడాది నేచురల్ స్టార్ నాని నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానీ బెంగాలీ యువకుడిగానూ, ఒక ఫిల్మ్ మేకర్ గానూ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. కథానాయికగా సాయిపల్లవి అత్యుత్తమ నటనను కనబరిచింది. స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్ లోని ఒక ప్రాంతంలో జరిగే అనాచారాలపై తిరుగుబాటు చేసే యువకుడిగా నానీ చాలా పవర్ ఫుల్ పాత్రను పోషించారు. కృతిశెట్టి మరో కథానాయికగా నటించగా.. రాహుల్ రవీంద్రన్, మడోనా సెబాస్టియన్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, శుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఓటీటీలో కూడా ఈ సినిమా విశేష ప్రజాదరణ పొందింది. అలాంటి ఈ సినిమా మూడు కేటగిరిస్‌లో ఆస్కార్ బరిలో నిలిచింది.

‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని పిరియాడిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారతీయ సాంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో ఆస్కార్ పరిశీలనకు పంపినట్టు సమాచారం. ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలై. అక్కడ కూడా మంచి వసూళ్ళను రాబట్టింది.

వాసుదేవ్ ఒక మంచి దర్శకుడు. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అతడ్ని పూర్వ జన్మ వెంటాడుతుంది. తను క్రిందటి జన్మలో ప్రముఖ బెంగాలి రచయిత శ్యామ్ సింగరాయ్ నని అర్ధమవుతుంది. ఇంతకీ ఎవరా శ్యామ్ సింగరాయ్ ? అతడి కథాకమామిషేంటి? అన్నదే మిగతా కథ. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. ఈ సినిమా కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలోకి దిగడం గొప్ప విషయం.


‘అఖండ’ అలాంటి సినిమా రాదనుకున్నా.. కానీ కార్తికేయ-2 వచ్చింది

‘కార్తికేయ 2’ సినిమా విడుదలకు ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ విడుదల తర్వాత విజయదుందుభి మోగిస్తుంది. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలలో మా సినిమాను కృష్ణుడు నడిపిస్తున్నాడు అని చెబుతూ వస్తున్నారు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది మనకు చేరే వరకు ఈ విశ్వమంతా సహాయపడుతుంది..’ అనేది.. ఈ టీమ్ నమ్మకాన్ని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. రోజురోజుకీ ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్లను రాబడుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. బాలీవుడ్ పరంగా ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్వంటివారు ‘పుష్ప’ సినిమాతో పోల్చుతున్నారంటే.. ఏ స్థాయిలో బాలీవుడ్‌లో ఈ చిత్రం సంచలనాలను క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క అల్లు అరవిందే కాదు.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీ కృష్ణుని లీలలను సైన్స్‌కి, టెక్నాలజీకి ముడిపెట్టడం ప్రేక్షకులను కదిలించిందంటూ.. అలాగే.. ‘‘మనకు కనిపించడం లేదంటే మన కన్ను చూడలేకపోతుందని అర్ధం, మనకు కన్ను లేదని కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మం మతం కాదు మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన శ్రీ కృష్ణుడు కంటే గురువు ఎవరు.?’’ వంటి డైలాగ్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయంటూ.. సినీ విశ్లేషకులు సైతం ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. .

తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో.. ‘‘మాములుగా హిందీలో కేవలం 50 థియేటర్లలో రిలీజైన కార్తికేయ 2 సినిమా, రెండో రోజుకు 200 థియేటర్లు, 3వ రోజుకి 700 థియేటర్లలో ఆడటం.. సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమాలో సత్తా ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. ‘పుష్ప’ కూడా ఇలానే బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. నేను ‘అఖండ’ సినిమా చూసినప్పుడు శైవం మీద, శివతత్వంపై ఎమోషన్స్‌ని పండిస్తూ.. తారా స్థాయికి తీసుకెళ్లారని అనిపించింది. అలాగే.. ఇంకో రెండు మూడు ఏళ్ళల్లో విష్ణువును బేస్‌గా తీసుకుని సినిమా చేస్తారు అని ఉహించి.. చర్చలు కూడా జరిపాను. అటువంటిది ఒక ఏడాది తిరగకముందే విష్ణుతత్వం (కృష్ణతత్వం) మీద సినిమా రావడం, పెద్ద విజయం సాధించడం ఆశ్చర్యపరిచింది. మధ్య మధ్యలో యానిమేషన్‌లో చూపిస్తూ మళ్ళీ పిక్చర్‌లో తీసుకెళ్లడం చాలా బాగుంది. అందుకు దర్శకుడు చందూ మొండేటికి అభినందనలు.

సినిమా అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య రొమాన్స్ మాత్రమే కాకుండా.. ఒక అమ్మాయి, అబ్బాయి ఒక కాజ్ కోసం పరిగెడితే చాలు, మనం కూడా వాళ్ళ వెనుక పరిగెడతాం.. అని ప్రేక్షకుల చేత థియేటర్లకి పరుగులు పెట్టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక అడ్వెంచర్ ఫిల్మ్‌కు పౌరాణిక బేస్ ఇచ్చి.. మళ్ళీ దానిని కలికాలంలోకి తీసుకొచ్చిన విధానం నాకెంతో నచ్చింది’’ అని నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాపై విశ్లేషణ చేశారు.


‘సలార్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. అభిమానుల్లో టెన్షన్

బాహుబలి తర్వాత ప్రభాస్ నుండీ వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె.. వంటి చిత్రాల పై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. వారి చూపంతా కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ పైనే ఉన్నాయి. కే.జి.ఎఫ్ రేంజ్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తాడు అని అంతా ఆశిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంటూ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ముందుగా 2022 లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని ప్రకటించినా రిలీజ్ డేట్ వాయిదా వేసుకోక తప్పలేదు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మాతలు సలార్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రభాస్ రెండు కత్తులు పట్టుకుని శత్రుసంహారం చేస్తున్నట్టు ఈ పోస్టర్ ఉండగా …’ రెబలింగ్.. వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 28th 2023′ అంటూ అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సెప్టెంబర్ 28 ప్రభాస్ అభిమానులను డిజప్పాయింట్ చేసిన డేట్ అనే చెప్పాలి. అదే డేట్ కు 2012 లో రెబల్ అనే చిత్రం రిలీజ్ అయ్యింది. ప్రభాస్ రెండు హిట్లు కొట్టి ఫాంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ డిజాస్టర్‌‌గా నిలిచింది. ఇప్పుడు అదే డేట్‌తో వస్తున్న ‘సలార్‌’పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


భర్త మరణం తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్న మీనా

తెలుగు తమిళ భాషలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29వ తేదీ ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విద్యాసాగర్ మృతి చెందడంతో మీనా ఎంతగానో కృంగిపోయింది. మీనా భర్త మరణం అనంతరం పలువురు సెలబ్రిటీలు తన ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిస్తూ తనకు మనోధైర్యం చెప్పారు. అయితే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి మెల్లిగా బయటపడి తిరిగి మామూలు మనిషి అవుతున్నట్టు తెలుస్తుంది. భర్త మరణం తర్వాత మీనా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 13 అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం కావడంతో ఈమె ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అవయవాలు దానం చేసేవారు లేక మృతి చెందారని, తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని అందుకే తన మరణాంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు మీనా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా మీనా ఒక పోస్ట్ చేస్తూ తాను అవయవాలను దానం చేస్తున్నానని ఒక మనిషి ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పని ఏదీ లేదంటూ చెప్పుకొచ్చారు.ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడువచ్చని వెల్లడించారు. ఇలా అవయవాలు దానం చేసేవారు లేకే తన భర్తను కోల్పోయానని లేకపోతే తన భర్త తనతో పాటే ఉండేవారని మీనా ఆవేదనకు గురయ్యారు.


డైరెక్టర్ కోడి రామకృష్ణ తల‘కట్టు’ వెనుక రహస్యం ఇదేనంట

కోడి రామకృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. వంద సినిమాలు తీసిన అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఆయనొకరు. సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశించి సినిమా తీసి విజయం సాధించారాయన. కేవలం తెలుగే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకూ సైతం దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం ‘నాగాభరణం’ 2016లో విడుదలైంది. ఆయన తీసిన సినిమాలే కాకుండా, ఆహార్యం కూడా ప్రేక్షకులను, అభిమానులను మెప్పించేది. మణికట్టు నిండా రక్షా తాళ్లు, వేళ్లకు ఉంగరాలతో పాటు, ఆయన నుదుటికి ఒక కట్టు కట్టేవారు. ఎక్కువగా తెల్లకట్టుతోనే ఆయన బయట ఫంక్షన్లు, షూటింగ్‌లలో కనిపించేవారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.

ఆయన రెండో చిత్రం ‘తరంగిణి’(1992) షూటింగ్‌లో ఉండగా సీనియర్‌ ఎన్టీయార్‌ మేకప్‌‌మేన్ మోకా రామారావు మీ ‘నుదురు భాగం పెద్దగా ఉంది. ఎండ తాకకుండా నుదుటికి కట్టు కట్టండి’ అని ఆయనే ఒక తెల్ల కర్చీఫ్‌ ఒకటి కట్టారట. ఆ రోజంతా కోడి రామకృష్ణ షూటింగ్‌లో ఉత్సాహంగా పని చేశారట. ఆ మరుసటి రోజు కూడా బ్యాండ్‌ ఒకటి ప్రత్యేకంగా తయారుచేయించి ధరించారట. అది ధరించి ఉన్న సమయంలో ఒక పాజిటివ్‌ ఎనర్జీ వచ్చినట్లు గమనించిన ఆయన దానిని సెంటిమెంట్‌గా కొనసాగించారట.

ఒకసారి దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్‌ కూడా ‘ఇది మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. మీ పూర్వ జన్మ బంధానికి సంకేతం. ఎప్పుడూ తీయకండి’ అని కోడి రామకృష్ణకి సలహా ఇచ్చారట. ఎప్పుడైనా కథ విషయంలో సందిగ్ధం ఏర్పడినపుడు, సమస్యలు వచ్చినపుడు నుదుటికి కట్టు కడితే వెంటనే పరిష్కారం దొరికేదని సన్నిహితులతో కోడి రామకృష్ణ అనేవారట. ఆయన సెంటిమెంటు ఎలా ఉన్న ఆ తల‘కట్టు’ మాత్రం ఆయన ఆహార్యానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలతో ఉండే కోడి రామకృష్ణ అమ్మోరు(1995), దేవి(1999), దేవుళ్లు(2000)లాంటి సినిమాలతోనూ విజయాలను సాధించారు. సీనియర దర్శకుడిగా ‘అరుంధతి’తో ఆయన బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.