Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
బాహుబలి, బాహుబలి-2, సాహో చిత్రాల పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తదుపరి సినిమాలన్నీ తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటేనే ఆయన స్థాయి ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్‌తో పాటు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.
తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రభాస్ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్‌కు విలాసవంతమైన బంగ్లా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్. దీనికోసం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రూ.120 కోట్లతో రెండు ఎకరాలు కొన్నాడని తెలుస్తోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉంటుందనీ, ట్రాఫిక్ పెద్దగా వుండని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ అక్కడ 80 కోట్ల రూపాయలతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. మొత్తంగా కొత్త విల్లా కోసం ప్రభాస్ 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి.
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రన్ టైమ్ లాక్ చేసినట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. ఇందులో స్పెషల్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్ అలాగే సినిమాకు అనవసరమైన సన్నివేశాలు ఏవీ లేకుండా 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేసినట్లు లేటెస్ట్ న్యూస్. సంక్రాంతి బరిలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రన్ టైమ్ మూడు గంటలకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువే అని సమాచారం. వీటితో పోల్చుకుంటే ‘భీమ్లా నాయక్’ తక్కువని అంటున్నారు. అంతేకాదు ఈ రన్ టైమ్ మూవీకి బాగా ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి మరి.
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలం ఎదురైంది. కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలందరూ ఓటీటీలకే అంకితమైపోయారు. సినిమా థియేటర్ల వైపు ప్రజలు రావడం మానేస్తారని అందరు అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా హాళ్ల వైపు ప్రజలు పోటెత్తడం మొదలుపెట్టారు. దీంతో సినిమాలకు ఏమి కాదని అర్థమైంది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన 10సినిమాల జాబితాను ప్రతి ఏడాది గూగుల్ ఇండియా విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆ జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన చిత్రంగా ‘‘జై భీమ్’’ నిలిచింది. నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దామా..
జై భీమ్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించారు. మంచి కథాంశంతో రూపొందడంతో పాటు వివాదాలు కూడా చుట్టుముట్టడంతో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
షేర్‌షా సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ హీరో, హీరోయిన్లుగా నటించారు. కార్గిల్ యుద్ధంలో అసమాన ప్రతిభ పాటవాలను చూపిన విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది.
రాధే కొరియన్ చిత్రం ‘‘ద అవుట్ లాస్’’ రీమేక్‌గా రాధే తెరకెక్కింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ ప్లెక్స్ వేదికగా విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
బెల్ బాటమ్ అక్షయ్ కుమార్, వాణీకపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించారు. హైజాక్ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. రంజిత్ తివారి దర్శకత్వం వహించారు.
5.ఎటర్నల్స్ మార్వెల్ కామిక్స్‌కు చెందిన అమెరికన్ సూపర్ హీరోలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. మార్వెల్ కామిక్స్‌లో ఇది 26వ చిత్రం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.
మాస్టర్ కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో సందడి చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికి కరోనా కారణంగా వాయిదాపడింది. సంక్రాంతి కానుకగా థియేటర్లల్లో విడుదల అయిన ఈ చిత్రానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
సూర్యవంశీ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికి ఈ చిత్రాన్ని సినిమా హాళ్లల్లోనే విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం విశేషం.
గాడ్జిల్లా vs కాంగ్ ఆడమ్ విన్ గార్డ్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారతీయ భాషల్లోను ఈ చిత్రం సందడి చేసింది. గ్రాఫిక్స్‌తో ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచం మీద విరుచుకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్ పెట్టిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
దృశ్యం-2 మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2013లో విడుదలైన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం-2 తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం విడుదలయింది.
భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా నటించారు. దేశభక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ఈ మూవీ విడుదల అయింది.
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (RamCharan), కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ‘‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్ – తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ నటి ఆలియాభట్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలయ్య బాక్సాఫీస్ దుమ్ముతులుపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ ఎన్నో అంచనాలతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు మించి తొలి షోతోనే మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ తొలి రోజు సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. బొయపాటి మార్క్ ఎలివేషన్స్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడా ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయన్న మాటలు వినిపిస్తున్నా.. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు ఫ్యాన్స్.
ఓవరాల్‌గా మౌత్ టాక్ బాగుందని రావడంతో జనాలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు ఈ బోర్డులు కనిపించి చాలా రోజులైందనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ జాతర నడిచింది. దీంతో ఊహించిన దానికంటే కలెక్షన్లు కాస్త ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్‌గా ఈ మూవీకి తొలిరోజు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ నైజాం- 4.39 కోట్లు సీడెడ్- 4.02 కోట్లు ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు వెస్ట్ గోదావరి- 96 లక్షలు గుంటూరు- 1.87 కోట్లు కృష్ణా- 81 లక్షలు నెల్లూరు- 93 లక్షలు
మొత్తంగా అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకోవడం, మౌత్ టాక్ బాగుండటం, మరో వారం వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘అఖండ’కు కలిసిరానుంది. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఈ వారాంతం ముగిసేసరికి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
థియేటర్లలో ఫ్యాన్స్ గోలల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అని కొందరు ఫస్ట్ షో సినిమాకి వెళ్లినా.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఆ డైలాగులు వినడానికి మళ్లీ థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చాలామంది అభిమానులు ఒక్క రోజులోనే రెండు సార్లు సినిమా చూసేసారు. దీంతో 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగా ఉంటుంది. కానీ అఖండ అక్కడ కూడా ప్రభంజనాన్ని సృష్టించింది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రికార్డులను సైతం దాటేసి దూసుకుపోతోంది ‘అఖండ’. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య సినిమాకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ సినిమా ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే దాదాపు 2.75 కోట్లు. బాలయ్య కెరీర్‌లోనే ఇది మూడో బెస్ట్ ఓపెనింగ్ ఇది. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు 3.74 లక్షల డాలర్స్, గౌతమీ పుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్స్ వసూలు చేసింది. తాజాగా అఖండ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగులో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు వసూలు చేస్తే, నాగచైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్‌ను అఖండ సినిమా క్రాస్ చేసింది. మాస్ హీరోకి పక్కా అర్థం చెప్పిన బాలయ్య ‘అఖండ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 15 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. కిమ్స్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సీతారామశాస్త్రి సాయంత్రం 4.07 గంటలకు మృతి చెందారు” అని ప్రకటించాయి. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) సినిమాతో సినీ గేయరచయతగా అందరి దృష్టినీ ఆకర్షించిన చేంబోలు సీతారామశాస్త్రి ఆ చిత్రం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అయితే ఆయన సినీ రంగానికి పరిచయమైంది మాత్రం అంతకు రెండేళ్ల ముందు వచ్చిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో. ఆ చిత్రానికి కూడా కె. విశ్వనాథే దర్శకుడు. తొలి సినిమాలో సీహెచ్ సీతారామశాస్త్రి (భరణి) అనే పేరుతో ఆయన ‘తడిసిన అందాలలో…’ అనే పాట రాశారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి 1955 మే 20న జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన కాకినాడలో ఇంటర్, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో బీఏ పూర్తి చేశారు. అనంతరం రాజమహేంద్రవరంలో కొంతకాలం బీఎస్ఎన్ఎల్‌లో పని చేశారు. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌లో దాదాపు 800ల చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెల ఉత్తమ సినీ గేయరచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. సిరివెన్నెల చిత్రంతో 1986లో తెలుగు సినీ పాటల ప్రియులకు పరిచయమైన సీతారామశాస్త్రి అదే ఏడాది వంశీ దర్శకత్వం వహించిన ‘లేడీస్ టైలర్’ చిత్రంతో పాపులర్ ప్రేమ గీతాలు రాయడంలోనూ తన కలానికి అంతే పదను ఉందని నిరూపించుకున్నారు.
‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…, ఆది భిక్షువు వాడినేమి కోరేది, చందమామ రావే…’ వంటి పాటలతో తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్న సీతారామశాస్త్రి క్లాస్, మాస్ పాటలతో సినీ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు. సిరివెన్నెల 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాలని ఎన్నో సందర్భాల్లో చెప్పిన సీతారామశాస్త్రి ఆ దిశగా చెప్పుకోదగిన కృషి చేశారు. కెరీర్ తొలిరోజుల్లో ‘సిరివెన్నెల’ సినిమాకు ఆయన రాసిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘రుద్రవీణ’ చిత్రం సిరివెన్నెల కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని ‘తరలి రాద తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయిని…’ వంటి పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి.
తమ్ముడు గుర్తించిన టాలెంట్
సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు’ అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాసి చివరికి దివికేగారు.
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోయాయి.
డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు.. విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. సాగర్ కె.చంద్ర ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే సమయంలో విడుదల కానుండటంతో ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ మార్చాలని పవన్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకు 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఏపీలో టికెట్ రేట్ల తగ్గించడంతో ఆ ఏరియాకు తక్కువ ధరకే హక్కులు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ‘భీమ్మా నాయక్’ నిర్మాతలకు సుమారు రూ.10కోట్ల వరకు ఆదాయం తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
యంగ్ టైగర్ యన్టీఆర్, కొరటాల శివ కలయికలోని రెండో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. #NTR30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సందేశం అందించేదిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ విషయమై కొంతకాలంగా రూమర్స్ గుప్పుమంటున్నా యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిరోజులుగా కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపించగా… తాజా సమాచారం ప్రకారం ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్త నందమూరి అభిమానులతో పాటు శ్రీదేవి అభిమానులను ఖుషీ చేస్తోంది. నిజానికి జాన్వీని సౌత్ నుంచే హీరోయిన్‌గా పరిచయం చేయాలని శ్రీదేవి అనుకున్నా సాధ్యం కాలేదు. కొరటాల శివ సినిమాతో అది ఇన్నాళ్ళకు సాధ్యం కానుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ స్ర్కిప్ట్ వర్క్ మీద ఉన్నారని సమాచారం. యన్టీఆర్ సూచించిన స్వల్ప మార్పుల్ని సవరిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. జనతా గ్యారేజ్ యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నయనతార హవా కొనసాగుతోంది. వయసు పైబడుతున్నా ఆమె రేంజ్ పెరుగుతోందో గానీ.. ఎక్కడా తగ్గడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. ‘సైరా నరసింహారెడ్డి’ లో చిరుకు భార్యగా నటించిన నయన్.. తాజా సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం.
అయితే ఈ సినిమా కోసం నయనతార ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార నటించడం వల్ల ఇతర భాషల్లో కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే ఈ రోల్‌కి నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం నయన్ తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనున్నారట.
‘గాడ్ ఫాదర్’ సినిమా విషయానికి వస్తే కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ సినిమాలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది.