Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా అలరించిన నాగ్ బంగార్రాజు పాత్రకిది ఎక్స్‌టెన్షన్. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉండగా.. చైతూ సరసన కథానాయికగా నటిస్తోన్న కృతిశెట్టి నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. చీరకట్టుతో మెరిసిపోతూ.. మెడలో దండలతో రివీలైన ఆమె మేకోవర్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది.
అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ..’శ్యామ్ సింగ రాయ్’ అంటూ టీజర్‌తో వచ్చేశాడు నాని. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా ఈ సినిమా టీజర్ వచ్చి ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.
డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే మేకర్స్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సినిమాకు హైలెట్‌గా నిలవబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో నానికి సాలీడ్ హిట్ దక్కలేదు. దీంతో ‘శ్యామ్ సింగ రాయ్’ తో నాని హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..
లాక్‌డౌన్ తెలుగు సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. షూటింగులు ఆగిపోవడం, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమాలు థియేటర్లు మూతపడటంతో నెలలపాటు ల్యాబ్‌కే పరిమితమయ్యాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నా టాలీవుడ్‌లో ఇదివరకటి సందడి లేదనే చెప్పాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టాలీవుడ్‌లో వరుసగా పెద్దపెద్ద సినిమాలు తెరకెక్కడం చర్చనీయాశంగా మారింది. సీనియర్, యంగ్ హీరోలు గతంలో కంటే స్పీడుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో రెండు మూడు కథలకు ఓకే చెప్పి, వాటినీ సమాంతరంగా పట్టాలెక్కించేందుకు అగ్ర కథానాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహరాజ్ రవితేజ చేతిలోనే ఏకంగా 16 సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సినిమాల్ని ఒప్పుకోవడంలో ఈ ముగ్గురి రూటే సెపరేటు. ‘ఒకదాని తరవాత మరోటి’ అనే చందాన కథల్ని ఒప్పుకునే ఈ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం, అవి చిత్రీకరణ దశలో ఉండగానే మరిన్ని కథలు సిద్ధం చేసుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్ని ఇస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. 2022 ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కానుంది. ‘ఆచార్య’ పనులు ఇంకా మిగిలి ఉండగానే, ‘గాడ్ ఫాదర్’కి కొబ్బరికాయ కొట్టారు చిరు. ఇటీవలే ‘భోళా శంకర్’ పనులూ మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితమే బాబి సినిమాకి క్లాప్ కొట్టారు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఇవన్నీ సెట్స్‌పై ఉండగానే చిరంజీవికి మారుతి ఓ కథ వినిపించాడని టాక్ నడుస్తోంది. మారుతి కూడా ‘చిరంజీవిగారితో ఓ సినిమా ఉంటుంది. ఇప్పటికే లైన్ వినిపించేశా. పూర్తి స్థాయి కథని సిద్ధం చేయాలి’ అని చెప్పేశారు. మరోవైపు త్రివిక్రమ్ సైతం చిరుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే చిరంజీవి చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి.
మరోవైపు ‘క్రాక్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడు కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన ‘ఖిలాడి’ రిలీజ్ కి రెడీకాగా.. ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’, ‘రామారావు ఆన్ డ్యూటీ’… సినిమాలు లైన్‌లో ఉన్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా… కొత్త సినిమాలు ఒప్పుకోవడమే కాదు, సినిమా సినిమాకీ ఆయన పారితోషికం పెరుగుతూనే ఉందన్నది ట్రేడ్ వర్గాల టాక్.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా బిజీగా మారిపోయారు. ఆయన ఊ అంటే చాలు అడ్వాన్సులు చేతిలో పెట్టడానికి అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత క్రేజీ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో ఈ సంక్రాంతికి రానున్నాడు. ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ పూర్తి చేయనున్నాడు. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’పై కూడా భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్‌కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కొత్త కథలు వినిపించడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నా బిజీ షెడ్యూల్ వల్ల ప్రభాస్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
తమిళ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఓవైపు ఓటీటీలో విజయదుంధుబి మోగిస్తుంటే.. మరోవైపు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. వన్నియర్ సామాజికవర్గ నేతలు, చిత్రబృందం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తమ వర్గాన్ని కించపరుస్తూ వాస్తవానికి విరుద్ధంగా చిత్రాన్ని తీశారని వన్నియర్ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మాత్రమేనని, ఇందులోని పాత్రలు, పేర్లు మార్చామని ఆ బృందం చెబుతోంది. మొత్తానికి రోజురోజుకీ ఈ రెండు వర్గాలు పరస్పర ప్రకటనలతో వాదనలు కొనసాగుతున్నాయి.
ఓవైపు వన్నియర్ సంఘాలు, పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) ప్రశ్నల అస్త్రాలు సంధిస్తుండగా.. మరోవైపు సూర్య వాటికి సమాధానమిస్తూ వస్తున్నారు. ఆయనకు కోలీవుడ్ అండగా నిలుస్తోంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘జై భీమ్’ దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో పోలీసు యంత్రాంగం తీరు వల్ల ఓ గిరిజన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, ఆపై అతని భార్య న్యాయపోరాటం చేయడం.. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించడం.. న్యాయానికి హారతులు పట్టడమే చిత్ర అసలు కథ. అయితే ఇందులో పోలీసు అధికారి పాత్రను ‘వన్నియర్’ సామాజిక వర్గానికి సంబంధించినట్టు చిత్రీకరించడం, అందుకు ఆధారాలు చిత్రంలో అక్కడక్కడ కనిపించాయి. ఈ అంశాలే ప్రస్తుత రచ్చకు కారణాలుగా మారాయి.
అయితే సదరు సామాజిక వర్గం ప్రశ్నించిన తర్వాత ఆ వర్గానికి సంబంధించిన ఆనవాలను చిత్రంలో నుంచి తొలగించి.. మార్పులు చేసింది ‘జై భీమ్’ బృందం. అసలు ప్రశ్న ఏంటంటే?.. అసలు సినిమాలో ఎందుకు తమ సామాజిక వర్గాన్ని ప్రస్తావించాలి? ఆ తర్వాత ఎందుకు తొలగించాలన్నదే. అంతేకాకుండా పోలీసు అధికారి అసలు పేరు ‘ఆంథోని’ పేరును ఎందుకు వాడలేదు’, ‘న్యాయపోరాటం చేసే ఆ మహిళ అసలు పేరు పార్వతి కానీ చిత్రంలో సెంగనిగా’ మతపరంగా మరోరూపం ఇవ్వడం ఎందుకు’.. వంటి ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు. ఇందుకు బహిరంగంగా సూర్య క్షమాపణలు చెప్పాలని కూడా పీఎంకే నేత అన్బుమణి రామదాసు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వన్నియర్ సంఘం సూర్యకు లీగల్ నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ‘జైభీమ్’ చిత్ర నిర్మాత, నటుడు సూర్యకు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. ఈ వార్ ట్విట్టర్‌కు కూడా ఎక్కింది. సామాజిక వర్గ సంఘాలు, పీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు.. సూర్య అభిమానుల మధ్య ట్వీట్ల ఘర్షణ జరుగుతోంది. సూర్యకు మద్దతుగా నిలిచేవారి #westandwithsuriya అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అలాగే చిత్ర పరిశ్రమలోని నిర్మాతల మండలి కూడా సూర్యకు మద్దతుగా అన్బుమణికి ఓ లేఖ రాసింది. సీనియర్ దర్శకుడు భారతిరాజా, నటుడు సత్యరాజ్, నిర్మాత థానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా అన్బుమణికి రాసిన లేఖల ద్వారా సూర్యకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
సూర్యను ఓ సామాజిక వర్గ విరోధిగా మార్చే ప్రయత్నం చేయకండని భారతిరాజా కోరారు. ఎన్నో సమస్యలుండగా సినిమాలోని ఈ విషయంపై గళమెత్తడం బాధాకరమని తెలిపారు. అలాగే సత్యరాజ్ స్పందిస్తూ.. ‘పలు చిత్రాలు అభినందించే రీతిలో ఉంటాయి. వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే కీర్తించదగ్గ చిత్రాలుగా నిలుస్తాయి. ఆ వరుసలో ‘జై భీమ్’ ఉంది. సూర్య ‘ఎదర్కుం తునిందవన్’ (దేనికైనా రెడీ). ఆయన్ను అభినందించాల్సిన తరుణమి’దని పేర్కొన్నారు. అయితే ఈ వివాదాన్ని దీని రాద్ధాంతం చేస్తూ గోడ పత్రికలను చించడం, సూర్యను కొడితే రూ.లక్ష ఇస్తానని పీఎంకే నేత ప్రకటించడం వంటి పనులు అత్యంత దారుణమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.
తెలుగు ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ వినోదాన్ని పంచేందుకు బగ్‌బాస్ ఐదో సీజన్ మొదలైపోయింది. బిగ్‌బాస్ రియాలిటీ షోను రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్‌దే కీలకపాత్ర. అవసరమైన చోట కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేస్తూ, అతి చేసిన చోట చురకలంటించడం, ఆడియన్స్ నాడికి తగ్గట్లుగా కంటెస్టెంట్లతో గేమ్స్ కూడా ఆడిస్తుంటాడు హోస్ట్. ఈ క్రమంలో ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే రీతిలో మాట్లాడుతూ వారిని అలరిస్తుంటాడు.
అందుకే బిగ్‌బాస్ మొదలవుతుందనగానే కంటెస్టెంట్ల కన్నా ముందు హోస్ట్ ఎవరన్నదానిపై ఎక్కువగా చర్చ నడుస్తుంది. తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్టింగ్ చేయగా.. మూడు, నాలుగు సీజన్లను కింగ్ నాగార్జున రసవత్తరంగా నిర్వహించారు. ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్టింగ్ చేస్తున్నారు. అయితే గత సీజన్ల కంటే ఈ సారి ఆయన పారితోషికాన్ని భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
106 రోజులపాటు కొనసాగనున్న ఐదో సీజన్‌కు నాగార్జున రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్ ఈసారి మాత్రం భారీ రేంజ్‌లో డబ్బులు డిమాండ్ చేస్తుండటం షాక్‌కు గురిచేస్తోంది. నాగార్జున హోస్టింగ్‌ను ప్రేక్షకులు ఇష్టపడటంతో ఐదో సీజన్ కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్న షో నిర్వాహకులు ఆయన ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఏకంగా రూ.12కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీలో 21ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బద్రి’ 2000, ఏప్రిల్ 20 విడుదలైంది. పూరీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసినప్పటికీ.. సీసీసీ ద్వారా ఇంకా సరైన ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో అందరికి కాస్త ఉపశమనం కలిగింది.
భారతదేశంలో ఈ టీకా వినియోగం విస్తృతంగా జరుగుతోంది. దశల వారిగా అర్హులైన వారందరికీ టీకాను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం సీసీసీ తరఫున సినీ కార్మికులు అందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని చిరంజీవి ప్రకటించారు. సీసీసీ తరఫున సేకరించిన విరాళాలలో కొంత డబ్బు మిగిలి ఉందని.. ఆ డబ్బుతో సినీ కార్మికులకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే చిరంజీవీ ఆ ఏర్పాట్లు చేశారు. అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా టీకా అందజేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
సోనూ సూద్.. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఆపద్భాందవుడిగా నిలిచిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకుని సోనూసూద్ చేసిన సాయంపై యావత్ భారతావని ప్రశంసలు కురిపించింది.
ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్‌పై వెళ్లారు. సోనూసూద్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే సెట్‌కి వెళ్లాల్సి రావడంతో ఆయన సైక్లింగ్ చేసుకుంటూ సెట్‌కి వెళ్లిపోయారు. భాగ్యనగర రోడ్డలపై ఆయన సైకిల్ తొక్కుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది. మరోవైపు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా రావడంతో పవన్ కళ్యాణ్ కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దిల్‌రాజుకు కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు అందరిలోనే టెన్షన్ మొదలైంది.
2008 నవంబర్‌లో ముంబయి నగరంలో జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సైయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివరిగా ‘మీరు పైకి రాకండి.. వాళ్లని నేను హ్యాండిల్ చేస్తాను’ అంటూ అడివి శేష్ చెప్పిన డైలాగ్ కొసమెరుపు.