Category Archives: Movies

ఫస్ట్‌ డే కలెక్షన్స్… ఫర్వాలేదనిపించిన ‘సీతారామం’

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన, దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. శుక్రవారం(ఆగస్టు 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలిరోజు ఫర్వాలేదనింపిచే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. టాక్‌కు తగ్గ కలెక్షన్లు అయితే కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

‘సీతారామం’ ఫస్ట్ డే కలెక్షన్లు ఏరియాల వారీగా…

నైజాం – రూ. 54 ల‌క్షలు

సీడెడ్ – రూ. 16 ల‌క్షలు

ఉత్త‌రాంధ్ర – రూ. 23 ల‌క్షలు

ఈస్ట్ – రూ. 15 ల‌క్షలు

వెస్ట్ – రూ. 8 ల‌క్షలు

గుంటూరు – రూ. 15 ల‌క్షలు

కృష్ణ – రూ. 13 ల‌క్షలు

నెల్లూరు – రూ. 5 ల‌క్షలు

‘సీతారామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 13.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్లు ప్రకారం చూస్తే రూ. 5.60 కోట్లు అని సినీ వ‌ర్గాలంటున్నాయి. అయితే శని, ఆదివారాల్లో కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.


ఫస్ట్ డే దుమ్మరేపిన ‘బింబిసార’… కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే రికార్డు

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని కలిగించాయి. అందుకు తగ్గట్టే శుక్రవారం(ఆగస్టు 5న) విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…

ఏరియాల వారీగా ‘బింబిసార’కు వ‌చ్చిన వ‌సూళ్లు

నైజాం – రూ. 2.15 కోట్లు

సీడెడ్ – రూ. 1.29 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 90 ల‌క్షలు

ఈస్ట్ – రూ. 43 ల‌క్షలు

వెస్ట్ – రూ. 36 ల‌క్షలు

గుంటూరు – రూ. 57 ల‌క్షలు

కృష్ణా – రూ. 34 ల‌క్షలు

నెల్లూరు – రూ. 26 లక్షలు

‘బింబిసార’కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ. 6.3 కోట్లు రూపాయ‌లు వ‌చ్చాయి. అమెరికాలో రూ. 48 ల‌క్షలు, క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా రూ. 40 ల‌క్షలు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.08 కోట్లు షేర్ క‌లెక్షన్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్ల ప్రకారం రూ. 11.5 కోట్లు వ‌చ్చాయి. ‘బింబిసార’ సినిమాకు రూ. 16.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమాకు రూ. 17 కోట్లు రావాలి. తొలిరోజునే సినిమాకు రూ. 7.08 కోట్లు షేర్ రావ‌టంపై నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.


‘విరాట‌ప‌ర్వం’ చూడ‌డానికి 10 కార‌ణాలివే!

ద‌గ్గుబాటి రానా, సాయిప‌ల్లవి ప్రధాన పాత్రలో న‌క్సల్ బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కిన తాజా చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. న‌క్సల్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ సినిమా చూడ‌డానికి 10 కార‌ణాలున్నాయి అవేంటో తెలుసుకుందాం.

  1. విరాట ప‌ర్వం ద‌ర్శకుడు వేణు ఊడుగుల సొంత ఊరు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా. ఈయన‌కు సాహిత్యమంటే ఎంతో ఇష్టం. సామాజిక అంశాలు, చ‌రిత్రలోని దాగిన క‌థ‌ల‌ను వెలికి తీసి సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాల‌నేదే ఆయ‌న కోరిక‌. అందులో భాగంగా ఈయ‌న తొలుత‌ శ్రీ‌విష్ణుతో నీది నాది ఒక‌టే ప్రేమ క‌థ సినిమాను తెర‌కెక్కించాడు. అత్యంత అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రం విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకుంది. ప్రధానంగా ఈ చిత్రంలో చ‌దువే జీవితం కాదు అనేది ఇతివృత్తం.
  2. అలాంటి సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించిన ఈయ‌న రెండో ప్రయ‌త్నంగా విరాట‌ప‌ర్వం సినిమాను తెర‌కెక్కించాడు. ఎన్నో వాయిదాల త‌రువాత ఈ చిత్రం మ‌రికొద్ది గంటల్లో థియేట‌ర్లలో విడుద‌ల‌ కానుంది.
  3. విరాట‌ప‌ర్వం సినిమా వరంగ‌ల్ గ‌డ్డపై 1990 ద‌శాబ్దంలో జ‌రిగిన క‌థ‌ను ద‌ర్శకుడు వేణు ఊడుగుల తెర‌కెక్కించాడు. ఒక వ్యక్తి మ‌ర‌ణం వెనుక పొలిటిక‌ల్ హ‌స్తం ఉంద‌ని తెలుసుకున్న ఆయన అప్పట్లో జ‌రిగిన ఘ‌ట‌న‌లను వెండితెర‌పై చిత్రీక‌రించారు. ఇందులో చ‌క్కటి ప్రేమ‌క‌థ‌ను కూడా అల్లాడు.
  4. ఈ కథ 1990 దశకంలో జరుగుతుంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ సినిమాలో పార్టీల‌ను చూపిస్తారా..? లేదా అనేది చూడాలి. ఇందులో రానా పాత్రను నిజామాబాద్‌కు చెందిన శంక‌ర‌న్న అనే వ్యక్తి స్ఫూర్తితో తీసుకున్నారు. సాయిప‌ల్లవి పాత్రను వ‌రంగ‌ల్‌కు చెందిన స‌ర‌ళ అనే మ‌హిళ‌ను తీసుకొని సినిమా రూపొందించారు.
  5. ఈ చిత్రంలో రానా కామ్రెడ్ ర‌వ‌న్నగా.. సాయిప‌ల్లవి వెన్నెలగా, కామ్రేడ్ భార‌త‌క్కగా ప్రియ‌మ‌ణి న‌టించారు. వెన్నెల పాత్ర కోసం సాయిప‌ల్లవి సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే ద‌శ‌లో రోజు అంతా ఆహారం తీసుకోలేద‌ట‌. నందితా దాస్‌, జ‌రీనా వాహెబ్‌, ఈశ్వరీరావు, న‌వీన్ చంద్ర, సాయిచంద్ వంటి న‌టీన‌టులు కీల‌క పాత్రలు పోషించారు.
  6. ద‌ర్శకుడు వేణు ఈ సినిమా ముందు వ‌ర‌కు సాయిప‌ల్లవిని క‌ల‌వ‌లేదట‌. విరాట‌ప‌ర్వం క‌థ‌ను వినిపించేందుకు ఆమెను మొద‌టిసారి క‌లిశార‌ట‌. క‌థ విన్న వెంట‌నే ఆమె ఈ చిత్రంలో న‌టించేందుకు ఓకే చెప్పార‌ట‌. ఈ చిత్రంలో మావోయిస్టులు, రాజ‌కీయ నాయ‌కులు ఓ అంద‌మైన ల‌వ్‌స్టోరీని తెర‌పై ఆవిష్కరించ‌డంతో ఈ సినిమా ప్రత్యేక‌త‌ను సంత‌రించుకుంది.
  7. ఈ చిత్రానికి ప‌ని చేసిన టెక్నిషియ‌న్ల విష‌యానికొస్తే.. దివాక‌ర్ మ‌ణితో క‌లిసి స్పెయిన్‌కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ బాధ్యత‌లు నిర్వహించారు. ఈ చిత్రానికి పీట‌ర్ హెయిన్ తో క‌లిసి జ‌ర్మనీకి చెందిన స్టీఫెన్ యాక్షన్ కొరియోగ్రాఫ‌ర్ గా పని చేశారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బలి సంగీతం అందించారు.
  8. విరాట‌ప‌ర్వం అనేది మ‌హాభార‌తంలో నాలుగ‌వ ప‌ర్వం. అందులో కుట్రలు కుతంత్రాలు ఉన్నట్టే ఈ సినిమాలో కూడా కుట్రలు, రాజ‌కీయాలు, ఫిలాస‌ఫీ వంటి అంశాల‌ను జోడించారు. ఈ సినిమాకు అందుకే విరాట‌ప‌ర్వం అనే టైటిల్‌ పెట్టారు.
  9. విరాట‌ప‌ర్వం సినిమా షూటింగ్ 2019, జూన్ 15న ప్రారంమైంది. తొలుత 2021 ఏప్రిల్ 30న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక‌, నిర్మాత‌లు భావించారు. ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఓటీటీ సంస్థల నుంచి ఆఫ‌ర్లు కూడా వ‌చ్చాయి. ఎట్టకేల‌కు ఈ చిత్రాన్ని 2022 జులై 01న విడుద‌ల చేయ‌నున్నట్టు ప్ర‌క‌టించారు. అయితే దానికి రెండు వారాల ముందుగానే జూన్ 17న విడుద‌ల చేస్తున్నారు.
  10. విరాట‌ప‌ర్వం సినిమాలో 1990 నాటి ప‌రిస్థితులు క‌ళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించారు. దీనికోసం వైడ్ స్క్రీన్ ఫార్మాట్ ఉప‌యోగించారు.

‘పుష్ప’ కలెక్షన్ల జోరు.. బన్నీ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం కొనసాగుతోంది. కరోనాతో కొన్నాళ్లుగా బోసిపోయిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ‘అఖండ’‌తో కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాలకు అల్లు అర్జున్ ‘పుష్ప’తో మరోసారి సందడి నెలకొంది. బన్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ అంచనాలను అనుగుణంగా తొలిరోజు రికార్డుస్థాయి వసూళ్లు సాధించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. బన్నీ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం.. సుకుమార్ కూడా రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ అంచనాలు పుష్ప సినిమాపై బాగా కనిపించాయి.

శుక్రవారం(డిసెంబర్ 17)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అన్ని భాషల్లో కలిపి రూ.71 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. పుష్ప సినిమాను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాత ఎర్నేని నవీన్ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో కూడా పుష్ప సినిమా రికార్డు తిరిగరాస్తోంది. బన్నీ నటనకు ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజే ఇంత కలెక్షన్‌ వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో అదనపు షో పర్మిషన్ ఇవ్వడం మాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకొచ్చారు. వీకెండ్‌కు మంచి కలెక్షన్‌ వస్తుందని భావిస్తున్నాం. బన్నీకి మలయాళంలో మంచి పేరుంది. ఈ సినిమా ఇంతకుముందు సినిమాల కంటే భారీ ఎత్తున వసూలు చేస్తుంది. ప్రపంచంలోనే తెలుగు ఆడియన్స్ లాంటి వాళ్ళు లేరు. ఈ సినిమాను ఇంత ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. అన్ని ఏరియాలకు మించి ‘పుష్ప’ నైజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే 11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు సహాయపడ్డాయి.


బాలయ్య బాక్సాఫీస్ ఊచకోత.. ‘అఖండ’ కలెక్షన్ల ప్రభంజనం, తొలిరోజే రికార్డుల మోత

బాలయ్య బాక్సాఫీస్ దుమ్ముతులుపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ ఎన్నో అంచనాలతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు మించి తొలి షోతోనే మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ తొలి రోజు సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. బొయపాటి మార్క్ ఎలివేషన్స్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడా ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయన్న మాటలు వినిపిస్తున్నా.. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు ఫ్యాన్స్.

ఓవరాల్‌గా మౌత్ టాక్ బాగుందని రావడంతో జనాలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు ఈ బోర్డులు కనిపించి చాలా రోజులైందనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ జాతర నడిచింది. దీంతో ఊహించిన దానికంటే కలెక్షన్లు కాస్త ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్‌గా ఈ మూవీకి తొలిరోజు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్
నైజాం- 4.39 కోట్లు
సీడెడ్- 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు
ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు
వెస్ట్ గోదావరి- 96 లక్షలు
గుంటూరు- 1.87 కోట్లు
కృష్ణా- 81 లక్షలు
నెల్లూరు- 93 లక్షలు

మొత్తంగా అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకోవడం, మౌత్ టాక్ బాగుండటం, మరో వారం వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘అఖండ’కు కలిసిరానుంది. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఈ వారాంతం ముగిసేసరికి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

థియేటర్లలో ఫ్యాన్స్ గోలల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అని కొందరు ఫస్ట్ షో సినిమాకి వెళ్లినా.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఆ డైలాగులు వినడానికి మళ్లీ థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చాలామంది అభిమానులు ఒక్క రోజులోనే రెండు సార్లు సినిమా చూసేసారు. దీంతో 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగా ఉంటుంది. కానీ అఖండ అక్కడ కూడా ప్రభంజనాన్ని సృష్టించింది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రికార్డులను సైతం దాటేసి దూసుకుపోతోంది ‘అఖండ’. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య సినిమాకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ సినిమా ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే దాదాపు 2.75 కోట్లు. బాలయ్య కెరీర్‌లోనే ఇది మూడో బెస్ట్ ఓపెనింగ్ ఇది. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు 3.74 లక్షల డాలర్స్, గౌతమీ పుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్స్ వసూలు చేసింది. తాజాగా అఖండ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగులో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు వసూలు చేస్తే, నాగచైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్‌ను అఖండ సినిమా క్రాస్ చేసింది. మాస్ హీరోకి పక్కా అర్థం చెప్పిన బాలయ్య ‘అఖండ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 15 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


పూరి జగన్నాథ్.. 21 ఇయర్స్ ఇండస్ట్రీ

స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఇండస్ట్రీలో 21ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బద్రి’ 2000, ఏప్రిల్ 20 విడుదలైంది. పూరీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.


సినీ కార్మికులకు ఫ్రీ వ్యాక్సిన్.. మాట నిలబెట్టుకున్న చిరంజీవి

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసినప్పటికీ.. సీసీసీ ద్వారా ఇంకా సరైన ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో అందరికి కాస్త ఉపశమనం కలిగింది.

భారతదేశంలో ఈ టీకా వినియోగం విస్తృతంగా జరుగుతోంది. దశల వారిగా అర్హులైన వారందరికీ టీకాను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం సీసీసీ తరఫున సినీ కార్మికులు అందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని చిరంజీవి ప్రకటించారు. సీసీసీ తరఫున సేకరించిన విరాళాలలో కొంత డబ్బు మిగిలి ఉందని.. ఆ డబ్బుతో సినీ కార్మికులకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే చిరంజీవీ ఆ ఏర్పాట్లు చేశారు. అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా టీకా అందజేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.


‘ఆచార్య’ సెట్స్‌కి సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్.. వీడియో వైరల్

సోనూ సూద్.. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఆపద్భాందవుడిగా నిలిచిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకుని సోనూసూద్ చేసిన సాయంపై యావత్ భారతావని ప్రశంసలు కురిపించింది.

ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్‌పై వెళ్లారు. సోనూసూద్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఉద‌యాన్నే సెట్‌కి వెళ్లాల్సి రావడంతో ఆయన సైక్లింగ్ చేసుకుంటూ సెట్‌కి వెళ్లిపోయారు. భాగ్యనగర రోడ్డలపై ఆయన సైకిల్‌ తొక్కుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.


దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో ‘వకీల్ సాబ్’ టీమ్

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది. మరోవైపు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా రావడంతో పవన్‌ కళ్యాణ్‌ కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దిల్‌రాజుకు కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు అందరిలోనే టెన్షన్ మొదలైంది.


రవితేజ ‘ఖిలాడి’ టీజర్.. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహరాజ్

‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్.

ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ‘ఖిలాడి’ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహారాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్, యాక్షన్ కలయికలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఖిలాడి’ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తూనే తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.