విలీనం తర్వాత నిజాం ఏమయ్యారు? ఎలా చనిపోయారు?
Category : Behind the Scenes Daily Updates News Sliders Telangana
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతం కావడంతో హైదరాబాద్ సంస్థానంపై ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పట్టు చేజారిపోయింది. 1948, సెప్టెంబర్ 17న తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత ప్రభుత్వం ఆయన్ని రాజ్‌ప్రముఖ్‌గా గుర్తించింది. ఇక్కడివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత ఏడో నిజాం ఏం చేశారు?.. ఎక్కడున్నారు?.. ఎలా చనిపోయారు?.. చివరి రోజుల ఎలా గడిపారు?.. అన్న సమాచారం చాలాకొద్ది మందికే తెలుసు.. స్వతంత్య్ర భారతదేశంలో ఆయన జీవితం ఎలా కొనసాగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
1948, సెప్టెంబర్ 17న నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయినా 1950, జనవరి 25 వరకు సాంకేతికంగా ఆయనే హైదరాబాద్ పరిపాలకుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఫర్మానాలన్నీ ఆయన పేరుమీదే జారీ అయ్యేవి. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించడంతో హైదరాబాద్ అందులో ఓ రాష్ట్రమైంది . నిజాం హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ (గవర్నర్) గా ప్రమాణ స్వీకారం చేశారు . 1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వరకు ఆయన రాజ్‌ప్రముఖ్ పదవిలో కొనసాగారు
1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 1952 మార్చి 8న నిజాం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు . అయితే తన రాచరికం ముగిసి పోయిందని, తన ఫర్మానాలేవీ చెల్లవనే విషయం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెలుసుకోలేకపోయారు. రాజ్ ప్రముఖ్ పదవిని కూడా కోల్పోయిన తర్వాత తర్వాత నిజాం… మాసాబ్ ట్యాంకుకు మూడు కిలో మీటర్ల దూరంలోని కింగ్‌కోఠిలో ఉన్న తన నివాసానికే పరిమితమయ్యారు తన భార్యలు , పిల్లలు , మనవలు , మునిమనవలు , సేవకులతో ఆ భవనంలోనే కాలం గడిపేవారు. తనను ఇంకా రాజుగానే భావిస్తూ ఫర్నానాలు జారీ చేస్తుండేవారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కింగ్ కోఠీలో ఉండేవారి స్థాయికి తగినట్టుగా వారి భోజనంలో ఉండాల్సిన పదార్థాల జాబితా తయారుచేయడం, ఎవరికైనా రోగం వస్తే వారికి తన పరిజ్ఞానాన్నంతా ఉప యోగించి యునానీ వైద్యం చేయడం… ఇవే ఆయన వ్యాపకాలు. అయితే మందులు తీసుకున్నవారంతా వాటిని వేసుకోకుండా అల్లోపతి మందులే వాడేవారు. రోగం నయం కాగానే నిజాం దగ్గరికి వచ్చి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తేవారు.
ఆస్తి కరిగిపోతుంటే ..
కూర్చుని తింంటే కొండైనా కరుగుతుందన్న సామెత నిజాం ఆస్తుల విషయంలో నిజమైంది. నిజాం రాజులు కూడబెట్టిన ఆస్తులన్నీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుల హయాం వచ్చే సరికి వేగంగా కరిగిపోవడం మొదలైంది. దీంతో ఆయన కొడుకులను గట్టిగా హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. దీంతో తన ఆర్థిక సలహాదారుల సలహా మేరకు వివిధ ట్రస్టులు ఏర్పాటు చేసి కుటుంబసభ్యుల ఖర్చులకు ట్రస్టుల ద్వారానే డబ్బు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 47 ట్రస్టులు ఆయన ఏర్పాటు చేశారు. నిజాం కుటుంబంలో ఆడపిల్లకు పెళ్లయితే వారికి ఓ ఇల్లు, జీవితాంతం నెలకు రూ .4 వేల చొప్పున నజరానా వచ్చేలా ఓ ట్రస్టుు ద్వారా ఏర్పాటు చేశారు. ఆయన పాకెట్ మనీకోసం ఓ ట్రస్టు, కొడుకుల ఖర్చులకు మరో ట్రస్టు ఏర్పాటుచేశారు.
1967 ఫిబ్రవరిలో నిజాం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆయన అల్లోపతి వైద్యం చేయించుకునేందుకు నిరాకరించడంతో యునానీ వైద్యం అందించేవారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కీర్తిపొందిన నిజాం రాజు తన జీవితంలో ఎప్పుడూ అల్లోపతి వైద్యం చేయించుకోకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 18న ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో అల్లోపతీ వైద్యులు పరీక్షించేందుకు రాగా ఆయన కుమార్తె షహజాదీ పాషా వారిని అనుమతించలేదు. అదేరోజు మధ్యాహ్నం.. నిజాం భార్యల్లో ముగ్గురు హజ్ యాత్రకు బయల్దేరి వెళ్లారు. ‘ఇదే చివరిచూపు. మీరు వచ్చేసరికి నేను బతికుండను’ అని నిజాం వారితో చెప్పడంతో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది.
20వ తేదీ నాటికి ఆయన స్పృహలో లేని పరిస్థితుల్లో నిజాం వైద్య సలహాదారు డాక్టర్ వాఘ్రే.. బంకత్ చందర్, జీపీ రామయ్య, సయ్యద్ అలీ అనే ముగ్గురు అల్లోపతి వైద్యులను రప్పించారు. డాక్టర్ రామయ్య నిజాం నాడి పట్టి చూశారు. ఆయనకు జ్వరంగా ఉందని ఇంజెక్షన్ చేయాలని చెప్పగా షహజాదీ పాషా మళ్లీ నిరాకరించారు. ఆయనకు కనీసం రక్తపరీక్ష చేయడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఆయన పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పడంతో లండన్‌లో ఉంటున్న మనవలు ముకరం జా, ముఫకం జాకు కబురు పంపారు.
1967 ఫిబ్రవరి 24న మధ్యాహ్నం వేళ నిజాం కన్నుమూశారు. డాక్టర్ రామయ్య స్టెతస్కో్‌ప్‌తో ఆయన గుండెను పరీక్షించి నిజాం మరణించినట్లుగా ప్రకటించారు. నిజాం రాజు ఒంటిని తాకిన మొట్టమొదటి ఆధునిక వైద్య పరికరం అది. నిజాం కార్డియాక్ ఫెయిల్యూర్‌తో మరణించినట్లు రామయ్య తెలిపారు. అయితే ఆయన మరణాన్ని బయటి ప్రపంచానికి వెంటనే తెలియజేయడానికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. తమ ఆనవాయితీ ప్రకారం రాజు మరణించిన మూడు రోజుల తర్వాతే భీష్మించుకోగా అధికారులు వారికి నచ్చజెప్పారు. అప్పట్లో వారసులు ఎవరో తేల్చుకునే సమయం కోసమే అలా చేసేవారని.. ఇప్పుడా సమస్య లేదు కాబట్టి వెంటనే ప్రకటించాలని చెప్పి ఒప్పించారు.
ఫిబ్రవరి 25న ఉదయాన్నే నిజాం అంతిమసంస్కారాలు ప్రారంభించారు. నిజాం పార్థివదేహాన్ని హైదరాబాద్ నగరంలో ఊరేగింపుగా తీసుకెళ్తుంటే సుమారు 2 లక్షల మంది అక్కడికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. గతంలో భాగ్యనగరం ఎన్నడూ అలాంటి జనసంద్రాని చూసింది లేదు. భారీ ఊరేగింపు అనంతరం ఉదయం 11 గంటల సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ భౌతికకాయాన్ని ఖననం చేశారు. వేలాది ఎకరాల ఆస్తి, వందలాది మంది సైన్యంతో ఓ వెలుగు వెలిగిన నిజాం రాజును అలా చూసేసరికి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మరణంతో తెలంగాణలో చరిత్రలో ఓ శకం ముగిసినట్లయింది.