Category Archives: OTT Latest Movies

‘కాంతార’ సర్‌ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై దేశాన్ని ఓ ఊపు ఊపేసింది ‘కాంతార’. రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. విడుదలై నెలన్నర రోజులు దాటినా థియేటర్లకు జనాలు వస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సినా.. థియేటర్లలో వస్తున్న ఆదరణ కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే చివరికి ‘కాంతార’ గురువారం(నవంబర్ 24) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

‘కాంతార’ లోని వరహరూపం పాటపై కోర్టులో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అందువల్ల యూట్యూబ్ నుంచి ఆ పాటను నిర్మాణసంస్థ హోంబలే ఫిలిమ్స్ తొలగించింది. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేం. కోర్టులో కేసు నడుస్తుండటంతో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా లేదా అని అభిమానులందరు ఎదురుచూశారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ‘‘ఎదురు చూపులకు తెరపడింది. ‘కాంతార’ రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది’’ అని ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

‘కాంతార’ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. దర్శకుడు కూడా ఆయనే. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకుంది. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీకి సంబంధించి కన్నడ నాట కోటి టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. ఐఏమ్‌డీబీలోను అత్యధిక రేటింగ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఐఏమ్‌డీబీ రేటింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్ 2’ లను బీట్ చేసింది. ఈ చిత్రంపై అనేక మంది సెలబ్రిటీలు ప్రశసంల వర్షం కురిపించారు. రజినీకాంత్, రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్, పూజా హెగ్డే, శిల్పా శెట్టి తదితరులు ఈ మూవీని పొగిడారు. ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న కాంతార ఓటీటీలో ఎంతటి సంచలనం రేపుతుందో చూడాలి.


తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Nenu Meeku Baaga Kavalsina Vaadini, Vendhu Thanindhathu Kaadu, Amazon Prime, Aha, Netflix,

కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

నేను మీకు బాగా కావాల్సినవాడిని
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని ’. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీధర్ గాధే దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరమే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. 16 సెప్టెంబర్ 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

వెందు తానింధతు కాదు
తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన కోలీవుడ్ నటుడు శింబు నటించిన చిత్రం ‘వెందు తానింధతు కాదు పార్ట్ I: ది కిండ్లింగ్’. తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. సిద్ధి ఇద్నాని, రాధిక శరత్‌కుమార్, నీరజ్ మాధవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 15 సెప్టెంబర్ 2022న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రివ్యూలను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్

Ariyippu – మలయాళం, హిందీ
Sue Perkins: Perfectly Legal – ఇంగ్లిష్
The Watcher – ఇంగ్లిష్
Dead End: Paranormal Park Season 2 – ఇంగ్లిష్The Playlist – నార్వేజియన్, స్విడిష్

అమెజాన్ ప్రైమ్‌

Exception – జపనీస్, ఇంగ్లిష్
Copa del Rey 2021-2022: Everybody’s Cup – స్పానిష్
సోనీ లివ్
Good Bad Girl – తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ
షామారో మీ (Shemaroo Me)Dard – గుజరాతీ


‘విక్రాంత్‌ రోణ’ తెలుగు వెర్షన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్

కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం విక్రాంత్‌ రోణ. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌() సుదీప్‌ సరసన ఆడిపాడింది. జులై 28న కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో మంగ్లీ పాడిన రక్కమ్మ సాంగ్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. సిల్వర్‌స్ర్కీన్‌పై అలరించిన ఈ ఇంటెన్సివ్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌ ఇప్పుడు డిజిటల్‌ మీడియంలోనూ ప్రసారం కానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈరోజు (సెప్టెంబర్‌ 2న) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే కేవలం కన్నడ వెర్షన్‌ మాత్రమే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే విక్రాంత్‌ రోణ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌ తాజాగా బయటకు వచ్చింది. సెప్టెంబర్‌ 16 నుంచి తెలుగు వెర్షన్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యం అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.

అనూప్‌ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంజునాథ్‌ గౌడ్‌ నిర్మాతగా వ్యవహరించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హీరో హీరోయిన్లతో పాటు నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, రవిశంకర్‌ గౌడ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి బిగ్‌ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు, ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆస్వాదించండి.


OTTలోనూ ‘అఖండ’ ప్రభంజనం.. తొలిరోజే రికార్డులు గల్లంతు

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హైట్రిక్‌ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఓటీటీలో విడుదలైన ‘అఖండ’.. అక్కడ కూడా రికార్డు క్రియేట్‌ చేసింది. జనవరి 21 నుంచి  ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హార్ట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ మూవీ.. తొలి 24 గంటల్లోనే 10 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఇది ఓటీటీ చరిత్రలో ఓ రికార్డు అని చెప్పొచ్చు. ఓటీటీలో భారీ ఓపెనింగ్స్‌ రావడంతో పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ‘థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘అఖండ’.. ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఈ వేదిక ద్వారా మరింత మంది సినీ అభిమానులకు మా చిత్రం వీక్షించడం పట్ల సంతోషంగా ఉంది ’ అన్నారు బాలకృష్ణ. కోవిడ్‌ కారణంగా థియేటర్స్‌లో చూడలేకపోయిన వారంతా.. ఓటీటీలో ‘అఖండ’ చిత్రం వీక్షించి ఆస్వాదించండి’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. 


ఓటీటీలోకి సత్యదేవ్ ‘స్కైలాబ్’.. ఎప్పటి నుంచి అంటే…

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ‘స్కైలాబ్’. 1979లో అంతరిక్ష పరిశోధనా శాల నుంచి ‘స్కైలాబ్’ భూమిపై పడనుందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ కామెడీ సినిమా తెరకెక్కింది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ సొంత నిర్మాణ సంస్థ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇప్పుడీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయింది. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా ‘స్కైలాబ్’ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆ మేరకు సోనీ లివ్ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించారు. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.


ఓటీటీలో ‘అఖండ’… డేట్ ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. బాలయ్య కెరీర్‌లోనూ 100కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

అయితే ముందు ఈ సినిమాను జనవరి 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని జనవరి 21న విడుదల చేయనున్నట్లు తెలిపింది డిస్నీ హాట్‌స్టార్. అఖండ తెలుగు సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందంటూ బాలయ్య అభిమాని ఒకరు ట్వీట్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లై ఇస్తూ అసలు విషయం చెప్పింది. 21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.


అమెజాన్‌లో ప్రైమ్‌లో ‘కొండపొలం’ స్ట్రీమింగ్.. ఓ లుక్కేయండి

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇంజనీరింగ్‌ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్‌ఎస్‌కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. నిరుద్యోగ యువకుడి పాత్రలో వైష్ణవ్‌ తేజ్‌ నటన ఆకట్టుకుంది. దసరాకు థియేటర్లలో సందడి చేసిన ‘కొండపొలం’ సినిమా ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల్లో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి థియేటర్లలో ‘కొండపొలం’ మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసేయండి మరి.


డిసెంబర్‌లో కొత్త చిత్రాలతో ‘ఆహా’ సందడి..

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రేక్షకులకు వినోదాల విందు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నెలలో ఆడియన్స్‌కు మరిచిపోలేని వినోదాలను పంచనుంది. ఇందులో భాగంగా సినిమాలతో పాటు ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని వెబ్‌సిరీస్‌లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆహాకు మాత్రమే ప్రత్యేకంగా నిలిచే టాక్‌ షోలు, చెఫ్‌ షోలతో ఆకట్టుకుంటోన్న ఈ ఓటీటీ యాప్ తాజాగా కొత్త చిత్రాలతో రానుంది. డిసెంబర్‌లో ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానున్న సినిమాలు ఏంటంటే..

మంచి రోజులు వచ్చాయి
‘ఏక్‌ మినీ కథ’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంతోష్‌ శోభన్‌ హీరోగా, మెహరీన్‌ హీరోయిన్‌గా తెరెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి’ థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 3న ఆహా యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. మారుతి ఈ సినిమాకు దర్శకుడు.

పుష్పక విమానం..
డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయనున్న మరో చిత్రం ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్ఫక విమానం’. ఈ సినిమాకు విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమాకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఆనంద్‌ దేవరకొండ అద్భుత నటన, వినూత్నమైన కథాంశం, కామెడితో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇక ఈ సినిమా ఆహాలో డిసెంబర్‌ 10 నంచి స్ట్రీమింగ్ కానుంది.

అనుభవించు రాజా..
రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నవంబర్‌ 26న విడుదలైన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇట్స్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ..
ఆహా ఒరిజినల్‌ ఫిలిమ్‌ అయిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ప్రిన్స్‌, నేహా క్రిష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రానుంది. అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు అమెరికాలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు… అనుకోకుండా ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కోవడంతో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సేనాపతి..
రాజేంద్ర ప్రసాద్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న ఈ ఒరిజినల్‌ను ఆహా వేదికగా డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నారు. థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌గా ఉండనున్నట్లు సమాచారం. వీటితో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రిస్మస్‌ తాతా అనే సినిమాను కూడా ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా దీనిని విడుదల చేయనున్నారు. మొత్తానికి డిసెంబర్‌లో ఆహా ప్రేక్షకులను మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.


ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్‌ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు కొద్దిరోజులకే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి డిసెంబర్‌ మొదటి వారంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో తెలుసుకుందామా…

అఖండ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 2న థియేటర్లలో విడుదలవుతోంది.

స్కైలాబ్‌
సత్యదేవ్‌, నిత్యమీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్‌ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్‌ 4న విడుదలకానుంది.

బ్యాక్‌ డోర్‌
పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బ్యాక్‌ డోర్‌. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 3న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరక్కార్‌: అరేబియన్‌ సముద్ర సింహం
మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్‌: అరేబియన్‌ సముద్ర సింహం. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్‌, కీర్తి సురేశ్‌, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

తడప్‌
తెలుగులో సంచలన విజయం సాధించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ తెలుగులో ‘తడప్’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్‌. మిలాన్‌ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 3వ తేదీన రిలీజ్ అవుతోంది.

ఓటీటీలో వచ్చే చిత్రాలివే

నెట్‌ఫ్లిక్స్‌

  • ద పవర్‌ ఆఫ్ ది డాగ్‌ (హాలీవుడ్‌) – డిసెంబర్‌ 1
  • లాస్‌ ఇన్‌ స్పేస్‌ (వెబ్‌ సిరీస్‌) – డిసెంబర్‌ 1
  • కోబాల్ట్‌ బ్లూ (హాలీవుడ్‌) – డిసెంబర్‌ 3

ఆహా

  • మంచి రోజులు వచ్చాయి (తెలుగు) – డిసెంబర్‌ 3

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ (హిందీ వెబ్‌సిరీస్‌) – డిసెంబర్‌ 3

జీ5

  • బాబ్‌ విశ్వాస్‌(హిందీ) – డిసెంబర్‌ 3


Don’t miss: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. అయితే కరోనాపై జనాల్లో ఇంకా భయం ఉండటంతో థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ప్రభావం కలెక్షన్లపై బాగా పడుతోంది. కొన్ని సినిమాలు ధైర్యంగా థియేటర్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటే, మరికొన్ని ఇప్పటికీ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే గత నెల రోజులతో పోలిస్తే ఈ వారం అటు థియేటర్‌తో ఓటీటీలోనూ సందడి రెట్టింపు కానుంది. వినాయకచవితిని పురస్కరించుకుని ఓటీటీ ద్వారా రీజల్ అవుతున్న సినిమాల వివరాలు మీకోసం..

10న నాని ‘టక్‌ జగదీష్‌’
నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్య పరిణామాల కారణంగా ఓటీటీ బాటపట్టింది. భూ కక్షలు లేని భూదేవిపురం కోసం ‘టక్‌ జగదీష్‌’ యువకుడు ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు.

ఆ ‘నెట్‌’లో పడితే ఇక అంతేనా?

రాహుల్‌ రామకృష్ణ, అవికా గోర్‌తో కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నెట్‌’. భార్గవ్‌ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో లక్ష్మణ్‌ అనే పాత్రలో రాహుల్‌ రామకృష్ణ కనిపించనున్నారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్‌’ చూడాల్సిందే.

మెడికల్‌ థ్రిల్లర్‌ ముంబై డైరీస్‌ 26/11
అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా మరో కొత్త సిరీస్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘ముంబై డైరీస్‌ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్‌ థ్రిల్లర్‌ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మోహిత్‌ రైనా, కొంకణ సేన్‌ శర్మ, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్‌ అడ్వాణీ, నిఖిల్‌ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది భాగాల్లో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్‌ ఫోర్స్‌ ఏవిధంగా పనిచేసిందన్న ఆసక్తికర అంశాలను థ్రిల్‌ కలిగించేలా సిరీస్‌ను తీర్చిదిద్దారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘తుగ్లక్‌ దర్బార్‌’

సెప్టెంబరు 9న ‘లాభం’ చిత్రంతో థియేటర్‌లో సందడి చేయనున్న విజయ్‌ సేతుపతి ఆ మరుసటి రోజే వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో అలరించనున్నారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ పొలిటికల్‌ మూవీ ‘తుగ్లక్‌ దర్బార్‌’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌ కథానాయికలు. దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్‌ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌ చేయనుంది. ఓ రాజకీయ నాయకుడ్ని అమితంగా ఇష్టపడే సింగారవేలన్‌ (విజయ్‌ సేతుపతి) అనే యువకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి అలరించనున్నారు.

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు

Amazon Prime Video

  • లూలా రిచ్‌ (సెప్టెంబర్‌ 10)

Aha

  • ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ ( సెప్టెంబర్‌ 10)
  • మహాగణేశా ( సెప్టెంబర్‌ 10)

Disney Plus Hotstar

  • అమెరికన్‌ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్‌ 08)

Netflix

  • అన్‌టోల్డ్‌: బ్రేకింగ్‌ పాయింట్‌ (సెప్టెంబర్‌ 07)
  • ఇన్‌ టు ది నైట్‌ (సెప్టెంబర్‌ 08)
  • బ్లడ్‌ బ్రదర్స్‌ (సెప్టెంబర్‌ 09)
  • మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌ (సెప్టెంబర్‌ 10)
  • లూసిఫర్‌ (సెప్టెంబర్‌ 10)
  • కేట్‌ (సెప్టెంబర్‌ 10)

ZEE 5

  • డిక్కీ లూనా (సెప్టెంబర్‌ 10)
  • క్యా మేరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్‌ 10)

Voot

  • క్యాండీ (సెప్టెంబర్‌ 08)