Category Archives: Sliders

భర్త మరణం తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్న మీనా

తెలుగు తమిళ భాషలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29వ తేదీ ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విద్యాసాగర్ మృతి చెందడంతో మీనా ఎంతగానో కృంగిపోయింది. మీనా భర్త మరణం అనంతరం పలువురు సెలబ్రిటీలు తన ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిస్తూ తనకు మనోధైర్యం చెప్పారు. అయితే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి మెల్లిగా బయటపడి తిరిగి మామూలు మనిషి అవుతున్నట్టు తెలుస్తుంది. భర్త మరణం తర్వాత మీనా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 13 అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం కావడంతో ఈమె ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అవయవాలు దానం చేసేవారు లేక మృతి చెందారని, తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని అందుకే తన మరణాంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు మీనా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా మీనా ఒక పోస్ట్ చేస్తూ తాను అవయవాలను దానం చేస్తున్నానని ఒక మనిషి ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పని ఏదీ లేదంటూ చెప్పుకొచ్చారు.ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడువచ్చని వెల్లడించారు. ఇలా అవయవాలు దానం చేసేవారు లేకే తన భర్తను కోల్పోయానని లేకపోతే తన భర్త తనతో పాటే ఉండేవారని మీనా ఆవేదనకు గురయ్యారు.


కాకులు ఎగరని ప్రాంతం.. రంకె వేసే బసవన్న.. ఎన్నో విశేషాల ‘యాగంటి’ పుణ్యక్షేత్రం

శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఈ గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది. సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి.

యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి “యాగంటి బసవన్న” అని పేరు. ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యే నాటికి ఇక్కడి బసవన్న లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.

యాగంటి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారట. అయితే విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వరస్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

అగస్త్య పుష్కరిణి
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరిణి లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది.ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని రాశారు.

యాగంటి గుహాలయ దృశ్యం

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనే ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించి శిష్యులకు ఙ్ఞానోపదేశం చేసారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.ః

యాగంటి బసవన్న
ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

కాకులకు శాపం
యాగంటిలో కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

ఆలయ దర్శన వేళలు
ఉదయం 6:00 నుండి 11:00 వరకు, సాయంత్రం 3:00 నుండి 8:00 వరకు

ఎలా వెళ్లాలి…
ఈ క్షేత్రం కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగానపల్లిలో వసతులున్నాయి.


అగ్నిని స్నానంగా స్వీకరించే ‘ఇడాణ మాత’.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాణ మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొనివున్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని, ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన, ఈ ఆలయం, చతురాస్రాకరంలో ఉంది. ఇడాణ ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరుమీద ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది.

ఇక్కడ ఉన్న ఇడాణమాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతుంటారు. మంట, దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతీ వస్తువు, అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు, భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. ఎంతోమంది ఎన్నో రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఎవరూ ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు.

ఆలయంలో మంట మండుతున్నప్పుడు, అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనంకాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతుంటారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా, ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఈ మంటలను ప్రత్యక్షంగా చూసినవారికి సకల పాపాలు హరించి, అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం. ఈ ఆలయానికి ఉన్న, ప్రత్యేక గుర్తింపువల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తికోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంతకాలం ఇక్కడకు భక్తులు భారీసంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలా దేవి రూపాన్ని ఆవహించిందని ఇడాణ దేవాలయంలో పుజారులు చెబుతున్నారు.

ఈ ఆలయంలో వచ్చేమంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట. ఇక్కడకు వచ్చే భక్తులు, అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేకపూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం.


రివ్యూ: కార్తికేయ-2

నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మేన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష, వెంక‌ట్‌ తదితరులు
మ్యూజిక్: కాలభైరవ
ఛాయాగ్రహ‌ణం: కార్తీక్ ఘట్టమనేని
క‌ళ‌: సాహి సురేష్
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత‌లు: టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: చందు మెుండేటి
విడుద‌ల తేదీ‌: 13-08-2022

హ్యాపీడేస్ చిత్రంలో నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ తర్వాత యువత సినిమాతో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాలతో వరుస సక్సెస్‌ల‌ను సొంతం చేసుకున్నాడు. అప్ప‌టి నుంచి రొటీన్‌కి భిన్నంగా సినిమాలు చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. సినిమాలు హిట్స్ అవుతున్నాయి. కానీ.. సాలిడ్ హిట్ కావాల‌ని చాన్నాళ్లుగా నిఖిల్ వెయిట్ చేస్తున్నాడు. మ‌రో వైపు ద‌ర్శ‌కుడు చందు మొండేటికి సైతం మ‌రో హిట్ అవ‌స‌రం అయ్యింది. దీంతో వీరిద్దరూ చేతులు కలిపారు.

2014లో నిఖిల్, చందు మొండేటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కార్తికేయ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. దానికి కొన‌సాగింపుగా చేసిన చిత్ర‌మే కార్తికేయ 2. స‌ముద్ర గ‌ర్బంలో దాగిన ద్వార‌కా న‌గ‌రం.. దాన్ని పాలిచించిన శ్రీకృష్ణుడు ఉన్నాడా..లేడా అనే విష‌యాల‌ను కార్తికేయ 2లో చెప్ప‌బోతున్న‌ట్లు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో చిన్న ట‌చ్ ఇచ్చింది చిత్ర యూనిట్. దీంతో సినిమాపై ఆస‌క్తి క‌లిగింది. కార్తికేయ సాధించినట్లుగానే కార్తికేయ 2 కూడా భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుందా.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా! అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…

కార్తికేయ (నిఖిల్‌) (Nikhil) ఓ వైద్యుడు. ప్రశ్నల‌కు స‌మాధానం వెత‌క‌డం అంటే ఇష్టం. ప్రతి స‌మ‌స్యకీ ఓ స‌మాధానం ఉంటుంద‌ని, త‌న ద‌గ్గరికి రానంత‌ వ‌ర‌కే ఏదైనా స‌మ‌స్య అనీ.. వ‌స్తే మాత్రం దానికి స‌మాధానం దొర‌కాల్సిందేనని అంటాడు. అందుకోసం ఎంత‌దూర‌మైనా ప్రయాణించే వ్యక్తిత్వం అతడిది. మొక్కు తీర్చడం కోస‌మ‌ని అమ్మతో క‌లిసి ద్వార‌క వెళ‌తాడు. అనుకోకుండా అక్కడ ఓ ఆర్కియాల‌జిస్ట్ హ‌త్యకు గురికావ‌డం, దాని వెన‌క కార‌ణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహ‌సోపేత‌మైన ప్రయాణ‌మే అస‌లు క‌థ‌. ముగ్ధ (అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్‌) ఎవ‌రు? కార్తికేయ ప్రయాణానికీ, శ్రీకృష్ణత‌త్వానికీ సంబంధ‌మేమిట‌నేది తెర‌పైనే చూడాలి.

విజ‌య‌వంత‌మైన ‘కార్తికేయ’కు కొన‌సాగింపుగా రూపొందిన చిత్రమిది. అయితే క‌థానాయ‌కుడి పాత్ర, అత‌డి వ్యక్తిత్వం మిన‌హా.. తొలి భాగం క‌థ‌కీ, దీనికీ సంబంధ‌మేమీ ఉండ‌దు. ఈసారి శ్రీకృష్ణుడి చ‌రిత్ర చుట్టూ క‌థ‌ను అల్లాడు ద‌ర్శకుడు. దైవం, మాన‌వత్వం వంటి విష‌యాలను చెబుతూనే క‌థానాయ‌కుడి సాహ‌స ప్రయాణాన్ని ఆస‌క్తిక‌రంగా ఆవిష్కరించ‌డంలో చిత్రబృందం స‌ఫ‌ల‌మైంది. క‌థానాయ‌కుడు ద్వార‌క వెళ్లిన‌ప్పట్నుంచీ క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. అప్పటివ‌ర‌కు భిన్న పాత్రల్ని, క‌థ‌లో పార్శ్వాల్ని పరిచ‌యం చేశాడు ద‌ర్శకుడు. హ‌త్యకు గురైన ఆర్కియాలజిస్ట్, ఆయ‌న చేసిన ప‌రిశోధ‌న‌ల ఆధారంగా సమాధానాల్ని వెతుక్కుంటూ క‌థానాయ‌కుడు వెళ్లే క్రమం ఆక‌ట్టుకుంటుంది. ఆ క్రమంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, చోటు చేసుకునే అనూహ్య మ‌లుపులు ర‌క్తి క‌ట్టిస్తాయి. ద్వితీయార్ధం నుంచి క‌థ మ‌రింత బిగితో సాగుతుంది. మ‌ధుర గోవ‌ర్ధన‌గిరిలో గుహ, అక్కడ ల‌భించిన ఆధారంతో ఆ ప్రయాణం మ‌రో చోటుకి కొన‌సాగ‌డం, అభీరా తెగ‌తో క‌లిసి ప్రయాణం చేయడం, ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాలు.. ఇలా ద్వితీయార్ధం అంతా కూడా ప్రేక్షకుల్ని క‌థ‌లో లీనం చేస్తుంది. అక్కడ‌క్కడా సినిమాటిక్ స్వేచ్ఛతో క‌థ‌నాన్ని న‌డిపించినా.. వాణిజ్యాంశాల పేరుతో పాట‌లు, కామెడీ వంటి హంగుల్ని జోడించ‌కుండా తెలివిగా చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ కొన‌సాగేలా చేశాడు ద‌ర్శకుడు. కొన‌సాగింపు చిత్రం కాబ‌ట్టి తొలి భాగానికి దీటుగా ఉండేలా.. ఆ అంచనాల‌కు త‌గ్గట్టుగా ఉండేలా విస్తృతమైన ప‌రిధి ఉన్న క‌థ‌ని ఎంచుకోవ‌డం క‌లిసొచ్చింది. క‌థా నేప‌థ్యం, దానికి త‌గ్గ సాంకేతిక హంగులు కూడా చ‌క్కగా జోడించడం వల్ల క‌థ ఓ కొత్తద‌నాన్ని పంచుతుంది. ప‌తాక స‌న్నివేశాలు మ‌రో క‌థకి ఆరంభాన్ని సూచిస్తాయి.

ఫస్టాఫ్ విష‌యానికి వ‌స్తే కృష్ణుడు దాచిన అపూర్వ‌మైన వ‌స్తువు.. దాని కోసం విల‌న్స్ ప్ర‌య‌త్నించ‌టం వంటి స‌న్నివేశాలతో ర‌న్ చేశారు. మ‌రో వైపు నిఖిల్ ద్వార‌క‌కు రావ‌టం అక్క‌డ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌రిచ‌యం, విచిత్రమైన పరిస్థితులు ఎదురవటం జరుగుతాయి. ఆ త‌ర్వాత త‌ను కూడా ఆ వ‌స్తువును వెత‌కాల‌నుకోవ‌టం వంటి సీన్స్‌ను చూపించారు. స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌టం.. దైవం..దైవ‌త్వం.. మాన‌వాళికి మేలు చేయ‌టానికి దేవుడు ఓ ప్ర‌తినిధిని ఎన్నుకోవ‌టం వంటి దృశ్యాలతో ప్ర‌థ‌మార్థం ఆస‌క్తిక‌రంగా అనిపించింది.

సెకండాఫ్‌లో హీరో ఒక్కో మిస్టరీని ఛేదిస్తూ వెళ్లటం అక్కడ తాను చేసే సాహ‌స‌క‌త్యాలు..చివ‌ర‌కు అనుకున్న ప‌నిని పూర్తి చేయటంతో సినిమాను ముగించారు. కార్తికేయ 3 ఉంటుంద‌నే విష‌యాన్ని చివర్లో చెప్ప‌టం కొస మెరుపు. పాత్రల విష‌యానికి వ‌స్తే హీరో నిఖిల్ ఎక్క‌డా ఎక్కువగా హీరోయిజాన్ని చూపించాల‌నే ఉద్దేశంతో కాకుండా ప‌రిధి మేర‌కు న‌టిస్తూ వ‌చ్చాడు. కార్తికేయ‌లో ఎలాంటి ఓ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను చూశామో అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌న‌కు క‌నిపిస్తుంది. పార్ట్ వ‌న్ కంటే పార్ట్ 2లో యాక్ష‌న్ పార్ట్ కాస్త ఎక్కువే. కానీ క‌థానుగుణంగా త‌ప్ప‌లేదు. దానికి త‌న న‌ట‌న‌తో నిఖిల్ న్యాయం చేశారు. ద‌ర్శకుడు చందు మొండేటికి ‘కార్తికేయ’ తొలి సినిమా. దాన్ని ఎంత శ్రద్ధగా, ప్రేమ‌తో తీశారో ఈ సినిమాపై కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టమ‌వుతుంది. నిర్మాణం బాగుంది.


తిరుమల శ్రీవారిని నిత్యం ఎన్ని రకాల దండలతో అలంకరిస్తారో తెలుసా?

తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. అది వేదపండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని కరాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే స్వామివారిని చూడడమే చాలా తక్కువ సమయం. అలాంటిది ఆయన ఎన్ని పూల దండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని. శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

శిఖామణి
శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.

సాలిగ్రామాలు
శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది.

కంఠసరి
మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి. ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది.

వక్ష స్థల లక్ష్మి
శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది.

శంఖుచక్రం
శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.

కఠారి సరం
శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు.

తావళములు
రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడ దీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటుంది. రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.

తిరువడి దండలు
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు.

ఇవేకాకుండా శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు కరాల పూలమాలలతో అలంకరిస్తారు.

భోగ శ్రీనివాసమూర్తికి – ఒక దండ
కొలువు శ్రీనివాసమూర్తికి – ఒక దండ
శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి – 3 దండలు
శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి – 3 దండలు
శ్రీ సీతారామలక్ష్మణులకు – 3 దండలు
శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులకు – 2 దండలు
చక్రతాళ్వారుకు – ఒక దండ
అనంత గరుడ విష్వక్షేనులకు – మూడు దండలు
సుగ్రీవ అంగద హనుమంతులకు – 3 దండలు

ఇతర విగ్రహమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండలు


బంగారు వాకిలి ద్వారపాలకులు – రెండు దండలు
గరుడాళ్వారు – ఒక దండ
వరదరాజస్వామి – ఒక దండ
వకుళమాలిక – ఒక దండ
భగవద్రామానుజులు – రెండు దండలు
యోగనరసింహస్వామి – ఒక దండ
విష్వక్షేనుల వారికి – ఒక దండ
పోటు తాయారు – ఒక దండ
బేడి ఆంజనేయస్వామికి – ఒక దండ
శ్రీ వరాహస్వామి ఆలయానికి – 3దండలు
కోనేటి గట్టు ఆంజనేయస్వామికి – ఒక దండ
అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్యకళ్యాణోత్సవం, వసంతోత్సవం, వూరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలలో కూర్చబడతాయి.

అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మల్లెలు, మొల్లలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగులు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపుచెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామివారికి జరిగే తోమాల సేవకు గాను ఈ పుష్ప అర నుంచి సిద్థం చేయడిన పూలమాలలను, జీయంగారులు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఛత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్థంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు.


‘రక్షాబంధన్’ వెనుక పురాణ గాథ తెలుసా…

ఓసారి దేవతలపై రాక్షసులు దండెత్తారు. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడాడు. ఈ పోరులో రాక్షసులదే పైచేయిగా మారింది. ఇంద్రుని బలం క్షీణించి అలసి సొలసి స్పృహతప్పి నేలపైకి ఒరిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపి, రాక్షసులకు లొంగిపోవటం శ్రేయస్కరమని దేవగురువు బృహస్పతి హితవు పలికాడు. మహేంద్రుని భార్య శచీదేవి యుద్ధంలో విజయం సాధించడానికి తన పతికి తగిన బలం ప్రసాదించవలసిందని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ఒక రక్షాబంధనాన్ని భర్త చేతికి కట్టి, ఆయనను ఉత్సాహపరుస్తూ, తిరిగి యుద్ధానికి పురికొల్పింది. రక్షాబంధన ధారణతో నూతనోత్తేజం పుంజుకున్న ఇంద్రుడు ఈసారి యుద్ధంలో అవలీలగా రాక్షసులను జయించాడు.

రక్షాబంధన ప్రాశస్త్యాన్ని గుర్తించిన దేవతలు ఆనాడు శ్రావణ పూర్ణిమ కావడంతో నాటినుంచి ప్రతి శ్రావణ పూర్ణిమనాడూ ఎవరి శ్రేయస్సునైతే తాము కాంక్షిస్తున్నామో వారికి బలాన్ని, శక్తిని ప్రసాదించి, రక్షణ ఇవ్వాలసిందిగా కోరుతూ వారి ముంజేతికి రక్షా కంకణాన్ని కట్టడం ఆచారంగా మారింది. దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా మీకు రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించే ఆచారంగా రూపుదిద్దుకుంది.

రాఖీ ఇలా కట్టాలి


శ్రావణ పూర్ణిమ నాడు సూర్యోదయ కాలంలోనే స్నాన విధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా దైవశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. ఈ రక్షికని ఒక సంవత్సర కాలం పాటు మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి బహిరంగ ప్రదేశంలో కడుతూ ‘తప్పక అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నా’నంటూ – బంధుస్నేహితుల మధ్య ప్రకటించి ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణ సమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. ఈ విధానాన్ని గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలం పాటూ ఆమెకి అండగా నిలవాలి.

మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు. అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే ఎవరు ఎవరికైనా రాఖీ కట్టొచ్చు.

రక్షాబంధనం కట్టే సమయంలో ఈ కింది శ్లోకం చదవాలి.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!

రాక్షసులకి రాజు, మహాబలవంతుడైనబలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో.. ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడా ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రాజుల కాలంలో తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన రక్షికని కుల పురోహితుడు (ఇంటి పురోహితుడు) ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. చక్కని సూచనలనిస్తూ ఉపాయాలు చెప్తూ రక్షిస్తూ ఉంటానని భావం. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో మాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది.


రక్షాబంధన్.. ఆ సమయంలోనే రాఖీ కట్టాలి.. ఈ పొరపాటును అస్సలు చేయొద్దు

శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ (Rakhi pournami 2022) అంటారు. ఇది శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11, అంటే గురువారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం అనే రెండు శుభ యోగాలు ఉంటాయి. అయితే ఈ రోజున భద్ర పూర్ణిమ తిథితో పాటు భద్ర కూడా జరుగుతోంది. శ్రావణ పూర్ణిమ తిథి, యోగ ,శ్రావణ పండుగ గురించి తెలుసుకుందాం.

శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 07:05 వరకు చెల్లుతుంది. ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి రాఖీ పూర్ణిమను ఆగష్టు 11నే జరుపుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ , సౌభాగ్య యోగాల అందమైన కలయిక ఏర్పడుతుంది. ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం 03.32 వరకు ఆయుష్మాన్ యోగం ఉంది. ఆ తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 03.32 నుండి మరుసటి రోజు ఉదయం 11.34 వరకు.

శ్రావణ పూర్ణిమ నాడు సాయంత్రం 08:51భద్ర సమయం ముగుస్తుంది. ఈ సమయంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు. ఆ ఘడియలు ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టండి. అంటే ఆగస్టు 11వ తేదీ రాత్రి 08: 51 గంటల నుంచి ఆగస్టు 12 ఉదయం 7: 05 వరకు కట్టొచ్చు. కొన్ని నిబంధనల మినహా సాయంత్రం 06:08 నుండి 08:00 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు చెబుతున్నారు.

భద్ర కాలంలో రాఖీ కట్టిన శూర్పణఖ.. లంక నాశనం

రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశుడికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తరువాత లంక చెడు దశ ప్రారంభమైంది. రావణుడిరి దురదృష్టం మొదలైందని చెబుతారు.


ఈ అమ్మవారికి బంగారం, డబ్బే ప్రసాదం

ఏ ఆలయంలో అయినా దేవుడికి రకరకాల తినుబండారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకు భిన్నంగా ఓ ఆలయంలో డబ్బు, బంగారం, విలువైన రాళ్ల నగల్ని అమ్మవారికి నివేదిస్తారు భక్తులు. పండుగలూ ప్రత్యేక సందర్భాల్లో వాటినే ప్రసాదంగానూ పంచుతారు. మధ్యప్రదేశ్‌లోని రాత్లాంలో ఏకంగా వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటోంది మహాలక్ష్మి అమ్మవారు. వందల ఏళ్లక్రితం నిర్మించిన ఆలయమిది. అప్పట్లో రాజులు తాము సంపాదించుకున్న సంపదను ఈ అమ్మవారికి నివేదించేవారట. అలా చేయడం వల్ల ఆ ధనం రెట్టింపవుతుందని వారు నమ్మేవారట. అందుకే అప్పటి నుంచి అక్కడ భక్తులు అమ్మవారికి పాయసం, చక్రపొంగలి, రవ్వకేసరి, పులిహోర వంటి వాటికి బదులుగా డబ్బునీ, బంగారాన్నీ నైవేద్యంగా సమర్పిస్తున్నారట.

భక్తులకు నిత్యం దర్శనమిస్తూ, ఏడాది పొడవునా పూజలందుకునే రాత్లాం మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు మొక్కుల కింద కోట్లాది రూపాయల నగదు, బంగారం- వెండి నాణేలు, నగలు సమర్పించుకుంటారు. అందుకే ఆ దేవాలయం కుబేరనిధిగానూ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండుగలూ, ప్రత్యేక దినాలూ, దీపావళి సమయంలో అమ్మవారినీ, ప్రాంగణాన్నీ పూలతో కాకుండా డబ్బు, బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో అలంకరిస్తారు. అందుకోసం అమ్మవారికి కానుకలుగా అందినవాటితో పాటు భక్తుల వద్ద నుంచి కూడా డబ్బూ, నగలూ స్వీకరిస్తారు. ఆ సమయంలో ఆలయం ట్రస్టు సభ్యులు డబ్బూ, నగలూ ఇచ్చిన వారి వివరాలను నమోదు చేసుకుని ఎంత ఇచ్చారో రాసి వారి చేత సంతకం పెట్టించుకుని టోకెన్‌ ఇస్తారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలన్నీ అయ్యాక టోకెన్ల ఆధారంగా ఎవరివి వారికి అందజేస్తారు.

దీపావళి, ధనత్రయోదశి సమయంలో అమ్మవారికి డబ్బూ, బంగారం సమర్పించిన భక్తులు అక్కడికి దర్శనానికి వచ్చిన వారికి బంగారం, వెండి నాణేలను ప్రసాదంగా పంచుతుంటారు. అలా పంచడం వల్ల తాము కూడా సిరి సంపదలతో వర్థిల్లుతామని నమ్ముతుంటారు. అందుకే అక్కడ బంగారు నాణేలు గ్రాము కంటే తక్కువ బరువులో వివిధ పరిమాణాల్లో దొరుకుతాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు వాటిని కొనుగోలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తరవాత పంచుతారన్నమాట.

ఎలా చేరుకోవాలంటే..

విమానంలో వెళ్లాలనుకునేవారు ఇండోర్‌ ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడికి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాత్లాం వరకూ బస్సులో వెళ్లాలి. బస్టాండ్‌ నుంచి స్థానిక వాహనాల్లో ఆలయాన్ని చేరుకోవచ్చు. రైలు మార్గంలో వెళ్లేవారు ఉజ్జయిని స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి ఆలయానికి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది.


Happy Friendship Day: స్నేహమేరా జీవితం.. ఫ్రెండ్స్ లేని జీవితం వ్యర్థం

‘మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. అలాగే మంచి స్నేహితుడు లైబ్రరీతో సమానం’ అని పెద్దలు చెబుతారు.. “నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వు.. కానీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు, “మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.” ఇలా ఎన్నో సామేతాలు స్నేహం గొప్పతనాన్ని చాటిచెబుతుంటాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బంధువులను దేవుడు నిర్ణయిస్తాడు.. కానీ స్నేహితులని మాత్రం మనమే ఎంపిక చేసుకుంటాం.. అందుకే జీవితంలో ఒక్క మంచి స్నేహితుడు ఉన్నా చాలంటారు. మన పురాణాల్లో శ్రీకృష్ణుడు – కుచేలుడు, దుర్యోధనుడు – కర్ణుడు స్నేహానికి ప్రతీకగా నిలిచారు. నేడు ప్రజలందరూ స్నేహితుల దినోత్సవం(ఆగస్టు నెల తొలి ఆదివారం) జరుపుకుంటున్నారు.. అసలు స్నేహితుల దినోత్సవం ఎందుకు..? ఎక్కడ..? ఎలా? పుట్టింది..? ఏ ఏ దేశంలో ఎప్పుడు సెలబ్రేట్‌ చేసుకుంటారో తెలుసుకుందాం..

సాధారణంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు… స్నేహం విలువతెలిపే కార్డులు, బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.. అయితే, 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి.

నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్‌ వ్యూహాలతో మొదలైంది. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అంతే కాదు హాల్‌మార్క్‌ గ్రీటింగ్‌ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్‌ హాల్‌ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్‌ కార్డులు మార్కెట్లోకి పంపారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇక, 1997 లో యునైటెడ్ నేషన్స్ “స్నేహం” యొక్క ప్రపంచ అంబాసిడర్ “విన్నీ ది పూ”. నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు, వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ 1958లో పరాగ్వేలో జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు దానిని పాటించడం మొదలుపెట్టాయి. 2011లో ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. మరోవైపు, అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20వ తేదీన నిర్వహిస్తుండగా.. భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాలు అయితే, ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి..

ఈ సృష్టిలో.. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న లాంటి బంధాలను ఒక మనిషి సృష్టించుకోలేడు.. కానీ, తనస్నేహితులను మాత్రం తనే ఎంచుకుంటాడు.. ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. తప్పు చేసినప్పుడు మందిలించడమే కాకుండా ఆపదలో రక్షిస్తూ వారికి దారి చూపే వాడే నిజమైన స్నేహితుడు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహమే అంటే అతిశయోక్తి కాదు. స్నేహితులు అనే వారు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకుని ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు.

కొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను, సమస్యలను ఆత్మీయ స్నేహితులతో మోహమాటం లేకుండా షేర్‌ చేసుకుంటారు. అలాంటి స్నేహాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయకూడదు.. కానీ, ఇలాంటి రోజులు.. వారిలో మరింత ఉత్సాహాన్నే నింపుతాయి.. సెలబ్రేట్‌ చేసుకోవడానికి మరో రోజును అదనంగా ఇస్తాయనే చెప్పుకోవాలి.

క‌మ్మనైన ప‌దం స్నేహం

స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు…. ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. కాని ఒక్కోసారి స్నేహం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందరినీ స్నేహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది. ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.

స్నేహితుల దినోత్సవ శుభాంకాక్షలు


డైరెక్టర్ కోడి రామకృష్ణ తల‘కట్టు’ వెనుక రహస్యం ఇదేనంట

కోడి రామకృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. వంద సినిమాలు తీసిన అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఆయనొకరు. సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశించి సినిమా తీసి విజయం సాధించారాయన. కేవలం తెలుగే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకూ సైతం దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం ‘నాగాభరణం’ 2016లో విడుదలైంది. ఆయన తీసిన సినిమాలే కాకుండా, ఆహార్యం కూడా ప్రేక్షకులను, అభిమానులను మెప్పించేది. మణికట్టు నిండా రక్షా తాళ్లు, వేళ్లకు ఉంగరాలతో పాటు, ఆయన నుదుటికి ఒక కట్టు కట్టేవారు. ఎక్కువగా తెల్లకట్టుతోనే ఆయన బయట ఫంక్షన్లు, షూటింగ్‌లలో కనిపించేవారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.

ఆయన రెండో చిత్రం ‘తరంగిణి’(1992) షూటింగ్‌లో ఉండగా సీనియర్‌ ఎన్టీయార్‌ మేకప్‌‌మేన్ మోకా రామారావు మీ ‘నుదురు భాగం పెద్దగా ఉంది. ఎండ తాకకుండా నుదుటికి కట్టు కట్టండి’ అని ఆయనే ఒక తెల్ల కర్చీఫ్‌ ఒకటి కట్టారట. ఆ రోజంతా కోడి రామకృష్ణ షూటింగ్‌లో ఉత్సాహంగా పని చేశారట. ఆ మరుసటి రోజు కూడా బ్యాండ్‌ ఒకటి ప్రత్యేకంగా తయారుచేయించి ధరించారట. అది ధరించి ఉన్న సమయంలో ఒక పాజిటివ్‌ ఎనర్జీ వచ్చినట్లు గమనించిన ఆయన దానిని సెంటిమెంట్‌గా కొనసాగించారట.

ఒకసారి దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్‌ కూడా ‘ఇది మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. మీ పూర్వ జన్మ బంధానికి సంకేతం. ఎప్పుడూ తీయకండి’ అని కోడి రామకృష్ణకి సలహా ఇచ్చారట. ఎప్పుడైనా కథ విషయంలో సందిగ్ధం ఏర్పడినపుడు, సమస్యలు వచ్చినపుడు నుదుటికి కట్టు కడితే వెంటనే పరిష్కారం దొరికేదని సన్నిహితులతో కోడి రామకృష్ణ అనేవారట. ఆయన సెంటిమెంటు ఎలా ఉన్న ఆ తల‘కట్టు’ మాత్రం ఆయన ఆహార్యానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలతో ఉండే కోడి రామకృష్ణ అమ్మోరు(1995), దేవి(1999), దేవుళ్లు(2000)లాంటి సినిమాలతోనూ విజయాలను సాధించారు. సీనియర దర్శకుడిగా ‘అరుంధతి’తో ఆయన బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.