Category Archives: Sliders

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం – తిరుచానూరు

తిరుచానూరు పుణ్యక్షేత్రం తిరుపతి జిల్లా(ఉమ్మడి చిత్తూరు) తిరుపతి పట్టణం సమీపంలో ఉంది. దీన్ని అలమేలు మంగాపురమని కూడా పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది.

పురాణ గాథ..


త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లాడాడు.

అలమేలు మంగ ఆలయ సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు… శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది “తిరువెంగడ కూటం”గా ఉంది. ఇంతకు ముందు కాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. తరువాత ఆ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి. అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.

ప్రతి సోమవారం “అష్టదళ పదపద్మారాధన” జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది. అమ్మవారి ఆలయం వెనకాల ఉన్న కోనేరు, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం, పద్మావతి గార్డెన్, శ్రీరామ ఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, శేష తీర్థం, ఆంజనేయస్వామి ఆలయం మొదలగునవి చూడదగ్గవి.

సందర్శించు వేళలు : ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు

అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి ?

తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, జీపులు రెగ్యులర్‌గా తిరుగుతుంటాయి. లోకల్ గా తిరిగే షేర్ ఆటోల్లో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు.


మోక్షాన్ని కలిగించే క్షేత్రం – వారణాసి

సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన కాశీ నగరంలో పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన జ్యోతిర్లింగం కాశీవిశ్వేశ్వరుడు. వరణ, అసి అనే రెండు నదుల మధ్య ఉన్న నగరం కాబట్టే దీనికి వారణాశి అనే పేరొచ్చింది. ప్రపంచంలో అందరూ బ్రతకడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే, చాలామంది హిందువులు మాత్రం ఈ వారణాశిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాప్రతాయిపడుతుంటారు. కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకొంటారని ప్రతీతి.

పురాణ గాథ
కాశీ క్షేత్రానికి వారణాసి, మహాస్మశానం, ఆనందకాననం, రుద్రవాసం, ముక్తిభూమి, శివపురి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. వేదాలలో,పురాణాలలో కాశీక్షేత్రం మహిమ గురించి వివరించారు. సనాతనమైనటువంటి బ్రహ్మ సృష్టి మొదట్లో నిర్గుణం నుంచి సగుణమైన శివరూపాన్ని చేశాడు. తిరిగి ఆ శివశక్తితో స్త్రీ ,పురుష భేధంతో ప్రకృతి, పురుషులని సృష్టించాడు. వారిరువురిని ఉత్తమసృష్టి సాధనకై తపస్సు చేయమని ఆనతినిచ్చాడు. తపస్సు కోసం అనువైన స్థలం చెప్పమని వారు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన శివుడు నించున్నచోటు నుండి ఎటుచూసినా అయిదు క్రోసుల దూరం ఉండేట్టు భూమిని సృష్టించి అత్యంత శోభాయమానమైన పంచకాశీ నగరాన్ని నిర్మించాడు.

అక్కడ ప్రకృతి, పురుషులు తపస్సు చేశారు. ఈ చోటనే విష్ణువు శివుని కోసం తపస్సు చేశాడు. ఆ తపము ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఆదృశ్యాన్ని చూసి విష్ణువు తలాడించగా, ఆయన చెవి నుండి ఒక మణి క్రిందపడింది. ఆ స్థానం మణికర్ణిగా గా పేరుగాంచింది. మహేశ్వరుడు ఈ కాశీ నగరమందు జ్యోతిర్లింగరూపంలో విశ్వేశ్వరుడు నామధేయుడై అవతరించాడు. ప్రళయకాలమందున ప్రపంచమంతా మునిగిపోయినా ఈ కాశీపట్టణంను మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకొని రక్షించాడు. ఈ విధంగా కాశి అవినాశి అయ్యింది. ఈ కాశి నగరాన్ని దండపాణి, కాలబైరవుడు సంరక్షకులుగా కాపాడుతుంటారు. ఇక్కడ గంగానదిలో 84 ఘాట్ లున్నాయి. ఎన్నో తీర్ధకుండాలున్నాయి.

విశ్వేశ్వరుని మందిరం చుట్టుప్రక్కల వందలాది శివలింగాలు, ఆలయాలు, ఆలయం వెలుపుల విశాలాక్షి అమ్మవారి మందిరం, కాశీ అన్నపూర్ణేశ్వరి మాత మందిరం, వారాహి మాత మందిరం ఉన్నాయి. ఒకటేమిటి కాశీక్షేత్రమంతా పరమేశ్వరుని దివ్యధామం. ఉదయం గంగాస్నానాంతరం కేధార్ ఘాట్ లో పెద్దలకు నివాళి, కేధార్నాధుని మందిరంలో స్వామిని దర్శించడం, మిట్ట మధ్యాహ్నం సమంత్రయుక్తంగా మణికర్ణికఘాట్ లో స్నానం, తదుపరి కాశీ విశ్వేరుని, అమ్మవార్లను దర్శించడం, సాయంత్రం దశాశ్వమేధఘాట్ లో గంగాహరతిని చూడటం అనీర్వచనీయమైన దివ్యానుభూతి.



ఫస్ట్‌ డే కలెక్షన్స్… ఫర్వాలేదనిపించిన ‘సీతారామం’

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన, దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. శుక్రవారం(ఆగస్టు 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలిరోజు ఫర్వాలేదనింపిచే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. టాక్‌కు తగ్గ కలెక్షన్లు అయితే కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

‘సీతారామం’ ఫస్ట్ డే కలెక్షన్లు ఏరియాల వారీగా…

నైజాం – రూ. 54 ల‌క్షలు

సీడెడ్ – రూ. 16 ల‌క్షలు

ఉత్త‌రాంధ్ర – రూ. 23 ల‌క్షలు

ఈస్ట్ – రూ. 15 ల‌క్షలు

వెస్ట్ – రూ. 8 ల‌క్షలు

గుంటూరు – రూ. 15 ల‌క్షలు

కృష్ణ – రూ. 13 ల‌క్షలు

నెల్లూరు – రూ. 5 ల‌క్షలు

‘సీతారామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 13.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్లు ప్రకారం చూస్తే రూ. 5.60 కోట్లు అని సినీ వ‌ర్గాలంటున్నాయి. అయితే శని, ఆదివారాల్లో కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.


ఫస్ట్ డే దుమ్మరేపిన ‘బింబిసార’… కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే రికార్డు

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని కలిగించాయి. అందుకు తగ్గట్టే శుక్రవారం(ఆగస్టు 5న) విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…

ఏరియాల వారీగా ‘బింబిసార’కు వ‌చ్చిన వ‌సూళ్లు

నైజాం – రూ. 2.15 కోట్లు

సీడెడ్ – రూ. 1.29 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 90 ల‌క్షలు

ఈస్ట్ – రూ. 43 ల‌క్షలు

వెస్ట్ – రూ. 36 ల‌క్షలు

గుంటూరు – రూ. 57 ల‌క్షలు

కృష్ణా – రూ. 34 ల‌క్షలు

నెల్లూరు – రూ. 26 లక్షలు

‘బింబిసార’కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ. 6.3 కోట్లు రూపాయ‌లు వ‌చ్చాయి. అమెరికాలో రూ. 48 ల‌క్షలు, క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా రూ. 40 ల‌క్షలు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.08 కోట్లు షేర్ క‌లెక్షన్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్ల ప్రకారం రూ. 11.5 కోట్లు వ‌చ్చాయి. ‘బింబిసార’ సినిమాకు రూ. 16.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమాకు రూ. 17 కోట్లు రావాలి. తొలిరోజునే సినిమాకు రూ. 7.08 కోట్లు షేర్ రావ‌టంపై నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.


రివ్యూ: బింబిసార

చిత్రం: బింబిసార‌
న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, కేథ‌రిన్‌, సంయుక్తా మేన‌న్‌, వివాన్ భ‌టేనా, ప్రకాష్ రాజ్, త‌నికెళ్ల భ‌ర‌ణి, అయ్యప్ప శ‌ర్మ, శ్రీనివాస్ రెడ్డి, వ‌రీనా హుస్సేన్ త‌దిత‌రులు
మ్యూజిక్: చిరంత‌న్ భ‌ట్‌, ఎం.ఎం.కీర‌వాణి
మాట‌లు: వాసుదేవ మునేప్పగారి
ఛాయాగ్రహ‌ణం: ఛోటా కె.నాయుడు
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: వ‌శిష్ఠ
నిర్మాణ సంస్థ: ఎన్టీఆర్ ఆర్ట్స్‌
విడుద‌ల తేదీ: 05-08-2022

జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కొత్త క‌థ‌ల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్యభ‌రితంగా ముందుకు తీసుకెళ్తున్నారు క‌థానాయ‌కుడు క‌ల్యాణ్ రామ్‌. ఈ క్రమంలోనే ఇప్పుడాయ‌న‌ ‘బింబిసార’గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. కొత్త ద‌ర్శకుడు వశిష్ఠ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే సోషియో ఫాంట‌సీ సినిమా కావ‌డం.. ఇందుకు త‌గ్గట్లుగానే ప్రచార చిత్రాలు చ‌క్కటి గ్రాఫిక్స్ హంగుల‌తో ఆస‌క్తిరేకెత్తించేలా ఉండటంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది. మ‌రి ఈ బింబిసారుడి క‌థేంటి? ఆయ‌న చేసిన కాల ప్రయాణం ప్రేక్షకుల‌కు ఎలాంటి అనుభూతిని అందించింది?.. తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం…

కథ
త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్‌ రామ్‌). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్‌ ట్రావెల్‌ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిన నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్‌ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ‘బింబిసార’ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో ‘బింబిసార’ను తెరకెక్కించారు డైరెక్టర్‌ వశిష్ఠ. ‘ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు.

న‌టీన‌టుల విషయానికి వ‌స్తే.. అత‌నొక్కడే, త్రీడీ మూవీగా తెరకెక్కిన ఓం వంటి సినిమాల‌ను గ‌మ‌నిస్తే హీరోగా, నిర్మాత‌గా చేసిన క‌ళ్యాణ్ రామ్ స్టైల్‌ను ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న కొత్తదనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవ‌చ్చు. అదే ప్యాష‌న్‌తో బింబిసార సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పటివ‌ర‌కు ఆయ‌న రాజ్యాన్ని పాలించిన చ‌క్రవ‌ర్తి పాత్రను పోషించ‌లేదు. కానీ ఏదో ఒక వెరైటీని అందించాల‌నే ల‌క్ష్యంతో డిఫ‌రెంట్ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ను ఆపాదించుకుని బింబిసారుడు అనే పాత్ర‌ను క్యారీ చేశాడు. ఆ పాత్ర కోసం త‌ను ఎంత క‌ష్ట‌ప‌డ్డాడ‌నేది సినిమాలో తెర‌పై క‌నిపిస్తుంది. లుక్‌తో పాటు డైలాగ్ డెలివ‌రీని ఆయ‌న చేంజ్ చేసుకున్నారు. అంతే కాదండోయ్ నెగిటివ్ ట‌చ్‌లో సాగే పాత్ర అనే చెప్పాలి. ఈ పాత్ర‌లో విల‌నిజాన్ని చూపించ‌డానికి వంద శాతం ట్రై చేశారు. అందులో స‌క్సెస్ అయ్యారు.

మెయిన్ విల‌న్‌గా న‌టించిన వివాన్ త‌న ప‌రిధి మేర‌కు చ‌క్కగా న‌టించారు. హీరోయిన్స్‌గా న‌టించిన క్యాథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్ పాత్రలు ప‌రిమితంగానే ఉన్నాయి. జుబేదా పాత్రలో శ్రీనివాస రెడ్డి కామెడీతో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేశారు. అలాగే చ‌మ్మక్ చంద్ర పాత్ర చిన్నదే అయినా న‌వ్వించారు. ప్ర‌కాష్ రాజ్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు త‌మ‌దైన న‌ట‌న‌తో అల‌రించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.


సిరులు కురిపించే ‘కొల్హాపూర్ మహాలక్ష్మి’

సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెను దర్శించుకొని పునీతులవుతుంటారు. అష్టదశ శక్తిపీఠాలలో ఎంతో విశిష్టత పొందిన శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం. మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతుంటా. పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడిపై అలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది.

వైకుంఠపురి నుంచి..

శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్‌ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో క్షేత్రం అందరికి దర్శనకేంద్రంగా మారింది.

ప్రళయంలోనూ చెక్కుచెదరదు..

ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

అరుదైన శిలపై అమ్మవారి రూపం..
శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. అంబా బాయిగా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. శక్తిపీఠాల్లో కూడా కొల్హాపూర్‌ ఒకటి కావడం విశేషం.

కిరణోత్సవం..

సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో జన్మించిన శ్రీలక్ష్మీదేవిని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా స్వీకరిస్తారు. నారాయణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షం కోసం యావత్‌ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా ఆమె తపస్సు చేసి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకనే ఆ నగరంలో పేదరికం వుండదని సామెత. సహకార ఉద్యమంలో కొల్హాపూర్‌ కీలకమైన భూమిక పోషించింది. చక్కెర మిల్లులు ఎక్కువగా వుండటంతో భారతదేశానికి చక్కెర కేంద్రంగా మారింది. ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సహావాలు వైభవంగా జరుపుతుంటారు. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని అంబబాయి అని కరివీర్ మహాలక్ష్మి అనే పేరులతో పిలుస్తారు. ఈఆలయ ప్రాంగణం అంతా అలనాటి రాజ సంస్కృతుల సాంప్రదాయలతో కనిపిస్తాయి.

చూడదగిన ప్రదేశాలు
లక్ష్మీదేవి ఆలయం గర్భగుడి ముందు 100 అడుగుల పొడవుగల మండపం ఉంటుంది. గర్భగుడిలో ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కుర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో విరోబా ఆలయంఉంది. విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లి అయిన శారదా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే కాళికా అమ్మవారు ,అతిబలేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది.

ఎలా వెళ్లాలి..
దేశంలోని ప్రధాన నగరాలతో కొల్హాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో దూరం 540 కి.మీ.
పుణె, ముంబాయి విమానాశ్రయాల నుంచి కొల్హాపూర్‌కు రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.


వరలక్ష్మీ వ్రతం రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, సకల సంపదలతో తులతూగుతామని, మహిళలు ముత్తయిదువులుగా జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు.

వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. కోరిన వారందరికీ కోరికలను తీర్చి, అందరిని కటాక్షించి లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పింది. శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ధన, కనక, వస్తు, వాహనాలు సమకూరుతాయి అని వరలక్ష్మీదేవి చారుమతికి వివరించింది. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పింది. అప్పటినుండి చారుమతి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా, ఆపై వివాహిత మహిళలు అందరూ ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు.

శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం అందరూ చేసుకుంటారు. రెండో శుక్రవారం ఆచరించడానికి మహిళలకు వీలుకాకపోతే, ఆ తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి పూజ భక్తిభావంతో, అత్యంత నియమ నిష్టలతో చేయాలి. వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. దీంతో వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చెయ్యకూడని పొరపాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చేయకూడని తప్పులివే…

వరలక్ష్మీ వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి ప్లేట్ లో కానీ, రాగి ప్లేట్లలో కానీ కలశాలను ఏర్పాటు చేసుకోవాలి.

వరలక్ష్మీ వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ఏ పూజ చేసినా ముందు పూజించవలసినది ఆది గణపతినే. గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు.

వరలక్ష్మీ వ్రతం నాడు ఇంట్లో అందరి సహకారం లేకపోతే అది దోషం. వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్న ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ పూజలో భాగస్వాములు కావాలి. అందరూ అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇంట్లో మహిళలు చేసుకుంటున్నారు. మాకేం సంబంధం లేదు అన్నట్టు ఏ ఒక్కరు ఉండకూడదని పెద్దలు చెబుతున్నారు.

శక్తి కొలది, భక్తితో అమ్మవారికి పూజ చేసి, నివేదన చేయాలని, మనసులో భక్తి లేకుండా ఫార్మాలిటీగా పూజలు చేయకూడదని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నాను కాబట్టి తప్పదు అన్న చందంగా ఎవరు అమ్మవారిని పూజించకూడదు.


మందేశ్వరస్వామి (శనీశ్వర) ఆలయం.. ఇలా చేస్తే శనిదోషాలన్నీ తొలగిపోతాయి

హిందూ దేవాలయాల్లో అనేక చోట్ల శని గ్రహము నవగ్రహాలలో ఒక భాగంగా ఉంటుంది. అయితే కొన్ని పుణ్యక్షేత్రాల్లో మాత్రం కేవలం శనీశ్వరుడిని మాత్రమే పూజిస్తుంటారు. అలాంటి ఆలయాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటే మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడని భక్తులు విశ్వసిస్తారు. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ విశిష్టమైన దేవాలయానికి సంబంధించిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

మందపల్లి పూర్వం దట్టమైన అరణ్యంగా ఉండేది. ఈ ప్రాంతంలో కైటభుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని కుమారులే అశ్వర్థుడు, పిప్పలుడు. వీరిద్దరు మారు రూపాల్లో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తమస్సు చేయడానికి వచ్చే మునులు, వేదాలను నేర్చుకోవడానికి వచ్చే వారిని చంపి తినేవారు. ఈ నేపథ్యంలోనే అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్రలో భాగంగా మందపల్లి ప్రాంతానికి వస్తారు. అక్కడ ఉన్న మునులు అగస్త్య మహర్షికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పి తమను ఆ రాక్షసుల బారి నుంచి కాపాడాల్సిందిగా వేడుకొంటారు. దీంతో అగస్త్య మహాముని బాగా ఆలోచించి ఇక్కడ గోదావరి తీరంలో శివుడి గురించి తపస్సు చేస్తున్న శనేశ్వరుడి దగ్గరకు మునులను తీసుకువెళుతాడు. ఆ రాక్షసులను సంహరించి తమను కాపాడాల్సిందిగా మునులు శనీశ్వరుడిని వేడుకొంటారు.

వీరి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన శనీశ్వరుడు తాను ప్రస్తుతం శివుడి గురించి తపస్సు చేస్తున్నానని తమస్సు వల్ల వచ్చిన శక్తితోనే ఆ రాక్షసులను సంహరించగలనని చెబుతాడు. దీంతో మునులు బాగా ఆలోచించి తమ తప:శక్తిని శనీశ్వరుడికి ధారపోయడానికి అంగీకరిస్తారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన శనీశ్వరుడు అశ్వర్థుడు, పిప్పలుడులను సంహరించడానికి అంగీకరిస్తాడు. ప్రథకం ప్రకారం మొదట శనీశ్వరుడి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో రావి చెట్టు రూపంలో ఉన్న అశ్వర్థుడి వద్దకు వెళుతాడు. వచ్చినవాడు సాధారణ బ్రాహ్మనుడేననని బ్రమించిన అశ్వర్థుడు శనీశ్వరుడిని అమాంతం మింగేస్తాడు. దీంతో శనీశ్వరుడు ఆ అశ్వర్థుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపేస్తాడు. దీంతో అశ్వర్థుడు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు. ఆ తర్వాత పిప్పలుడి వద్దకు బ్రాహ్మణ యువకుడి రూపంలో వెళ్లి తనకు వేదాలు నేర్పించాల్సిందిగా కోరుతాడు. పిప్పలుడు కూడా వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అని భావించి శనీశ్వరుడిని మింగేస్తాడు. ఇక్కడ కూడా శనీశ్వరుడు పిప్పలుడి కడుపులోకి వెళ్లి అతని ప్రేగులను తెంపి సంహరిస్తాడు.

అనంతరం ఆ ఇద్దరి అసురుల సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో శనీశ్వరుడు ఒక లింగాన్ని ప్రతిష్టించి దానికి సోమేశ్వరుడని పేరు పెడుతాడు. అయితే ఈ శివలింగం శనీశ్వరుడు ప్రతిష్టించడం వల్ల అదే పేరుతో అంటే శనేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడి పూజా విధానాలు కూడా కొంత విభిన్నంగా ఉంటాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వీరిలో జాతక చక్రంలో శని వల్ల సమస్యలున్నవారే ఎక్కువ. అదే విధంగా కోర్టు కేసులు, శత్రు భయం, రోగాలు, రుణాల నుంచి విముక్తి కోసం స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమ కోర్కెలు తీరితే స్వామివారికి ముడుపులు తప్పకుండా చెల్లించేస్తుంటారు. ఈ ఆలయంలోనే సప్తమాత్రుకలు ప్రతిష్టించినట్లు చెప్పే పార్వతీ దేవి విగ్రహం ఉంది. అదే విధంగా అష్టమహా నాగుల్లో ఒకడైన కర్కోటకుడచే ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. అటు పక్కనే గౌతమి మహర్షి ప్రతిష్టించిన శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు.

శనివారం రోజున వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, శనివారం రోజున వచ్చే అమావాస్య రోజున ఈ క్షేత్రంలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆ రోజుల్లో ఇక్కడకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఆ రోజుల్లో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు. ఇందుకు అవసరమైన వస్తువులన్నీ దేవాలయం ప్రాంగణంలోనే దొరుకుతాయి. పూజ తర్వాత నల్లటి వస్త్రాలను దానం చేస్తారు. ఇక పూజలో మిగిలిపోయిన వస్తువులను ఇంటికి తీసుకువెళ్ల కూడదనేది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. అదేవిధంగా ఆలయం నుంచి బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదని పూజారులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందుకు విరుద్ధంగా నడుచుకొంటే శని దోషం మళ్లీ చుట్టుకుంటుందని వారు చెబుతుంటారు. అందువల్లే పూజ తర్వాత ఎవరూ వెనక్కు తిరిగి చూడరు. కోనసీమ జిల్లాలో ముక్తేశ్వరం-కొత్తపేట మార్గంలో ఈ క్షేత్రం ఉంది. రాజమండ్రి నుంచి మందపల్లి ఆలయానికి 38 కిలోమీటర్ల దూరం. దేశంలోని ఎక్కడి నుంచైనా బస్సు, రైలు, విమాన మార్గాల్లో రాజమండ్రి చేరుకుని.. మందపల్లికి రోడ్డుమార్గంలో వెళ్లొచ్చు.


మంగళవారం చేయాల్సిన, చేయకూడని పనులు

మంగళ వారం కొన్ని పనులు చేయాలి, మరికొన్ని చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు.

మంగళవారం చెయకూడని పనులు


➤ మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం లాంటివి చేయకూడదు.
➤ మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం.
➤ అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు, అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి, తీరకపోయే ప్రమాదం ఉంది.
➤ మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు.
➤ అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు.
➤ మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్ధాలు తినకూడదు.
➤ దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు.

మంగళవారం చేయవలసిన పనులు

➤ మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు పూర్తవుతాయి.
➤ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు.
➤ మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది.
➤ మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తే మంచి ఫలితం ఉంటుంది.
➤ జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు.
➤ మంగళవారం అప్పు తీరిస్తే మళ్లీ కొత్త అప్పులు తీసుకునే అవసరం తగ్గుతుంది.
➤ మంగళవారం నాడు బ్యాంకు అకౌంట్ లో ఎంతో కొంత డబ్బు వేస్తే వృద్ది అవుతూ ఉంటుంది.
➤ మంగళవారం రాహుకాలంలో..( మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు) దుర్గాదేవి దర్శనం.. దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.
➤ హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన, సుబ్రమణ్యస్వామికి పదకొండు ప్రదక్షణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది.