Category Archives: Sliders
- August 1, 2022
-
-
-
-
అలనాటి హాస్యనటుడు సారథి కన్నుమూత
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders
తెలుగు చిత్ర పరిశ్రమలో మరొ విషాదం చోటుచేసుకుంది. తన కామెడీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ కమెడియన్ సారధి సోమవారం(ఆగస్ట్ 1) కన్నుమూయడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న సారథి అంటే తెలియని సినీ ప్రముఖులు ఉండరు. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంక్షేమ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిది అని చాలామంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు.
వయసు రీత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సారథి సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు కడలి జయ సారధి. ఇటీవల 83వ వసంతంలో అడుగుపెట్టిన ఆయన హఠాత్తుగా కన్నుమూయడం అందరిని షాక్ గురి చేసింది. సినిమాలకు స్వస్తి చెప్పిన అనంతరం ఆయన ఎక్కువగా తన సొంత గ్రామంలో వ్యవసాయం చేస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు.
1960లో ‘సీతారామ కళ్యాణం’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన సారథి ఆ తర్వాత అనేక సినిమాల్లో హాస్య పాత్రల్లో కనిపించి ఎంతగానో మెప్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 372 సినిమాల్లో నటించారు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులోనే ఉండేది. సీనియర్ నటీనటులు అందరూ ఎలాగైనా తెలుగు రాష్ట్రంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఉండాలని చేసిన పోరాటంలో సారథి క్రియాశీలకంగా వ్యవహరించారు. మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బలపడడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంస్థకు కూడా ఆయన వ్యవస్థాపక కోశాధికారిగా కూడా పనిచేశారు. నాటక రంగంలో ఎన్నో సేవలు చేశారు. నరసింహరావు, రేలంగి, వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి మహానటులతో కూడా ఆయన నాటక రంగంలో కలిసి నటించారు.
సారధి కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. ధర్మాత్ముడు. అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు అనే చిత్రాలను నిర్మించిన ఆయన మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కృష్ణంరాజుతో సోదర భావంతో కనిపించేవారు. కృష్ణంరాజు నిర్మించిన చాలా సినిమాలకు మ్యూజిక్ సిటింగ్స్‌లో పాల్గొంటూ పనులను దగ్గరుండి చూసుకునేవారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పేద సినీ కార్మికులకు చాలాసార్లు అండగా నిలిచారు. ముఖ్యంగా చిత్రపురి కాలనీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.
- July 29, 2022
-
-
‘రామారావు ఆన్ డ్యూటీ’ రివ్యూ
చిత్రం: రామారావు ఆన్ డ్యూటీ
నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సార్‌పట్ట’ ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
కూర్పు: ప్రవీణ్ కెఎల్
కళ: సాహి సురేష్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థలు: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీమ్‌వర్క్స్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
విడుదల తేదీ: 29-07-2022
మాస్ హీరో సినిమా విడుదలవుతోందంటే చాలు టాలీవుడ్ బోలెడన్ని ఆశలతో బాక్సాఫీస్ వైపు చూస్తోంది. మునుపటిలా థియేటర్ నిండుతుందా?.. ఎప్పట్లా సందడి కనిపించేనా అని. ప్రేక్షకుల్ని ఇదివరకటిలా ఉత్సాహంగా థియేటర్‌కి తీసుకొచ్చే సినిమాల్లేక, రాక కొన్నాళ్లుగా బాక్సాఫీసు కళ తప్పింది! ఈ వారం మాస్ హీరో రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలైంది. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది?. రవితేజ ప్రభుత్వ అధికారిగా ఏం చేశారు? అనేది రివ్యూలో చూద్దాం.
రామారావు (రవితేజ) ఓ డిప్యూటీ కలెక్టర్. నిజాయతీగా విధులు నిర్వర్తిస్తాడని పేరు. అనుకోకుండా తన సొంత ఊరికి బదిలీ అవుతాడు. చిత్తూరు జిల్లాల్లోని ఆ ఊరిని కేంద్రంగా చేసుకుని ఎర్రచందనం మాఫియా అక్రమాలకి పాల్పడుతుంటుంది. చిన్నప్పట్నుంచి తనతో కలిసి చదువుకున్న మాలిని (రజీషా విజయన్) కష్టంలో ఉందని తెలుసుకుని రామారావు ఆమె దగ్గరికి వెళతాడు. ఆమె భర్త మిస్సింగ్ అని, అతన్ని వెతకడం కోసం వెళ్లిన మావయ్య కూడా ప్రమాదంలో మరణించాడని తెలుసుకుంటాడు. ఆమెకి సాయం చేయాలని రంగంలోకి దిగుతాడు రామారావు. ఈ క్రమంలో ఎర్రచందనం మాఫియా వెలుగులోకి వస్తుంది. మాలిని భర్తలాగే, ఆ ఊరికి చెందిన మరో 20 మంది పేదల్ని ఆ మాఫియా బలి తీసుకుందని పసిగడతాడు. మరి ఆ మాఫియాని రామారావు ఎలా బయటికి లాగాడు? ఆ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేదే సినిమా.
రామారావు పాత్రలో రవితేజ తన అనుభవాన్ని చూపిస్తాడు. ఓ ప్రభుత్వ అధికారి తలుచుకుంటే ఏమైనా చేయగలడని నిరూపిస్తాడు. ఓ డిప్యూటీ కలెక్టర్‌కు, ఎమ్మార్వోకు ఇన్ని అధికారులున్నాయా? అని అనిపించేలా ఈ పాత్ర తెరపై దూసుకుపోతుంది. ఇక రామారావుగా రవితేజ మెప్పించేస్తాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లో రవితేజ అభిమానులకు నచ్చేస్తాడు. అయితే కొన్నిచోట్ల మాత్రం రవితేజ వయసు వల్ల వచ్చిన మార్పులు స్పష్టంగా తెరపై కనిపిస్తాయి. చాలా ఏళ్ల తరువాత ఎంట్రీ ఇచ్చిన వేణుకి మాత్రం ఈ పాత్ర, ఈ సినిమా అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇదేమీ అంత గొప్ప పాత్రలా అనిపించదు. కానీ వేణు మాత్రం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్లిద్దరివీ అంత పెద్ద పాత్రలేమీ కాదు. ఓ సీన్, ఓ సాంగ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ రజిష, దివ్యాన్షలు కనిపించినంత సేపు తెరపై ఆకట్టుకుంటారు. నరేష్, పవిత్రలు స్క్రీన్‌పై కనిపిస్తే ఈలలు, గోలలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. వారి పాత్రలకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా.. థియేటర్లో మాత్రం ఇంపాక్ట్ చూపించారు. నాజర్, సమ్మెట గాంంధీ, జాన్ విజయ్, రాహుల్ రామకృష్ణ ఇలా అందరూ కూడా చక్కగా నటించేశారు.
1990 కాలంలో సాగే ఓ పరిశోధనాత్మక కథ ఇది. కాలం ఏదైనా కావొచ్చు కానీ, ఇలాంటి నేర నేపథ్యంతో కూడిన కథల్లో ఓ వేగం కనిపించాలి. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత రేకెత్తాలి. ఈ రెండూ ఈ సినిమాలో మిస్సయ్యాయి. ఇక్కడ హీరో రవితేజ కాబట్టి ఆయన శైలి, మాస్ అంశాలకి సంబంధించిన లెక్కలు చూసుకుంటూ ఈ కథని నడిపినట్టు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి కథల్ని మాస్ హీరోలతో పక్కాగా తీస్తే ఆ ఫలితం, ప్రేక్షకుల్లో కలిగే ఆ అనుభూతి వేరుగా ఉంటాయి. కానీ, దర్శకుడు హీరో ఇమేజ్‌నీ, వాస్తవికతతో కూడిన ఈ కథనీ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. హీరోయిజం ఎపిసోడ్‌తో కథని మొదలుపెట్టాడు దర్శకుడు. ప్రథమార్ధంలో కుటుంబ నేపథ్యం, మాలినితో ప్రేమ, ఆమె పెళ్లి తదితర సన్నివేశాలతో సినిమా అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకుంటుంది.
రాహుల్ రామకృష్ణ ఎపిసోడ్ తర్వాతే కథలో సీరియస్‌నెస్ కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో అసలు నిందితుల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడు? ఆ సన్నివేశాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయన్నదే సినిమాకి కీలకం. ఆ విషయంలో దర్శకుడు అక్కడక్కడా తన ప్రభావం చూపించారు కానీ, అవి సినిమాకి సరిపోలేదు. సినిమాలో సంభాషణలు ఎక్కువగా వినిపిస్తాయే తప్ప, కథ కథనాలు మాత్రం ఎంతకీ ముందుకు సాగుతున్నట్టు అనిపించదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మెప్పిస్తాయి. కథని ముగించిన తీరు దీనికి సీక్వెల్ కూడా ఉందనే సంకేతాల్ని పంపుతుంది. రవితేజ, వేణు తప్ప మిగతా ఎవ్వరికీ ఇందులో బలమైన పాత్రలు లేవు. పక్కా మాస్ కథల్లోలాగా కాకుండా ఇందులో రవితేజ ఒక ప్రభుత్వాధికారి కావడంతో అందుకు తగ్గట్టుగానే కనిపించాల్సి వచ్చింది.
కథానాయిక రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపిస్తారు. నరేశ్, నాజర్, రాహుల్ రామకృష్ణ, పవిత్ర లోకేశ్, పృథ్వీ, శ్రీ, అరవింద్ కృష్ణ… ఇలా పలువురు నటులు కనిపించినా ఏ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉండదు. సత్యన్ సూర్యన్ కెమెరా ప్రభావం చూపించింది. స్వతహాగా రచయిత అయిన దర్శకుడు శరత్ మండవ ఎక్కువ సంభాషణలైతే రాసుకున్నారు కానీ, కథని నడిపిన విధానం మాత్రం మెప్పించదు. నిర్మాణం బాగుంది. శామ్ సీఎస్ సంగీతం, నేపథ్యం సంగీతం ఓకే అనిపిస్తాయి. సంతోష్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. 90వ దశకాన్ని చూస్తున్నట్టుగా ఎక్కడా కూడా అనిపించదు. ఇక క్యాస్టూమ్స్ అయితే నాటి కాలంలోవేనా? అని అనుమానం కలుగుతుంది. ఎడిటింగ్ విభాగం ఎన్నో సీన్లకు కత్తెర వేయాల్సిందనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల పేలినట్టు అనిపిస్తాయి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
-
-
శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఇలా పూజించండి!
Category : Behind the Scenes Features Sliders Spiritual
నేటితో శ్రావణమాసం ప్రారంభమైంది. తొలిరోజే శుక్రవారం రావడాన్ని హిందువులు ఎంతో ప్రాశస్త్యంగా భావిస్తున్నారు. దీంతో లక్ష్మీదేవి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా తలిచి గౌరవిస్తారు.
శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుంది.
అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి. గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, దుర్గాష్టకం లేదా అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళి ప్రాప్తంతో పాటు సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారికి సమర్పించి నేతితో దీపం వెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.
- July 28, 2022
-
-
ఆగస్టు 5న వస్తున్న ‘బింబిసార’.. రన్ టైమ్ ఎంతంటే
Tags : bimbisara pre release eventbimbisara release datenandamuri kalyan ramనందమూరి కళ్యాణ్రామ్బింబిసార మూవీ
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘బింబిసార’ (Bimbisara). ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తోంది. 2020లో వచ్చిన ఎంత మంచివాడవురా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్, ఇప్పుడు బింబిసార సినిమాతో రాబోతున్నాడు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasisht) తొలిసారిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో క్యాథరీన్ థ్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీన హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్స్‌గా నటించారు.
ఆగష్టు 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ నెల 29న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి నందమూరి కళ్యాణ్ రామ్ సోదరుడు పాన్ ఇండియన్ స్టార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను వదిలారు. అయితే, తాజా సమాచారం మేరకు బింబిసార సినిమా రన్ టైం ని మేకర్స్ లాక్ చేశారట. మొత్తం రన్ టైం 2గంటల 26 నిముషాలకు ఫైనల్ చేశారట. సెన్సార్ పూర్తైన తర్వాత ఈ విషయంలో కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. కాగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) పతాకంపై కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. త్రిగర్తల రాజ్య ప్రభువు అయిన బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. చిరంతన్ భట్ మ్యూజిక్, ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
-
-
సినిమాలపై ప్రేక్షకులకు విరక్తి కలిగింది.. అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders
సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం సవాలుగా మారిందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Ashwini Dutt) అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వినీదత్ విలేకరులతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్ బంద్’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ విడుదలపై కూడా అశ్వినీదత్ స్పందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరితో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని, గ్రాఫిక్స్ పనులకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. అవెంజర్స్ మూవీ స్థాయిలో ‘ప్రాజెక్ట్ కె’ ఉంటుందని అశ్వినీదత్ చెప్పారు.
-
-
‘విక్రాంత్ రోణ’ మూవీ రివ్యూ
చిత్రం: విక్రాంత్ రోణ; నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతాఅశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధుసూదనరావు తదితరులు; సంగీతం: అజనీష్ లోకనాథ్; కూర్పు: ఆశిక్ కుసుగొల్లి; ఛాయాగ్రహణం: విలియం డేవిడ్; కళ: శివకుమార్; దర్శకత్వం: అనూప్ భండారి; నిర్మాతలు: జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్; విడుదల తేదీ: 28-07-2022
కేజీయఫ్ తరువాత కన్నడ పరిశ్రమ మీద అందరి దృష్టి పడింది. మళ్లీ పాన్ ఇండియన్ స్థాయిలో కన్నడ సత్తా చాటాలని అక్కడి మేకర్లు, హీరోలు ప్రయత్నిస్తున్నారు. కానీ కేజీయఫ్ మేనియాను బీట్ చేయలేకపోతోన్నాయి. ఇక ఇప్పుడు కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణ అంటూ నేడు (జూలై 28) వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కొమరట్టు అనే ఊరిలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ఓ పాడుబడ్డ ఇల్లు. ఆ ఇంట్లో ఓ బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడన్నది ఊరి ప్రజల నమ్మకం. ఆ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో ఒక శవం దొరుకుతుంది. అది ఆ ఊరి ఇన్‌స్పెక్టర్ శవం. దానికి తల ఉండదు. ఈ హత్యకు పాల్పడిన నేరస్థుల్ని పట్టుకోవడం కోసం కొత్తగా వచ్చిన ఇన్‌స్పెక్టర్ విక్రాంత్ రోణ (Sudeep) ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో అప్పటికే పదుల సంఖ్యలో పిల్లలు హత్యకు గురైనట్లు తెలుసుకుంటాడు. మరి వాళ్ల మరణాలకు.. పోలీస్ హత్యకు ఉన్న లింకేంటి? కొత్తగా ఊరికొచ్చిన సంజు (నిరూప్ భండారి) ఎవరు? ఈ కేసుకు విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న లింకేంటి? అసలు ఆ ఊరిలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే.
విక్రాంత్ రోణ పాత్రలో కిచ్చా సుదీప్ మెప్పించాడు. అడ్వెంచర్లు, యాక్షన్ సీక్వెన్స్‌లో కిచ్చా సుదీప్ అందరినీ మెప్పిస్తాడు. సంజుగా నటించిన నిరూప్ భండారి పాత్ర చివరకు ఊహించినట్టే ముగుస్తుంది. ఆ కారెక్టర్‌లో నిరూప్ బాగానే నటించాడు. అపర్ణగా కనిపించిన నీతా అశోక్ పర్వాలేదనిపిస్తుంది. ఫక్రుగా కార్తీక్ రావు అంతో ఇంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ఇందులో పాత్రలు ఎక్కువగా ఉండటంతో.. అందరికీ సరైన ప్రాధాన్యం కల్పించినట్టు అనిపించదు. కానీ వారంతా కనిపించిన ప్రతీసారి మెప్పించేస్తారు.
ఇదొక యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్. ఈ కథ చెప్పడం కోసం దర్శకుడు సృష్టించుకున్న ఊరు.. దాన్ని అందంగా చూపించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ తల్లి తన కూతురుతో కలిసి కొమరట్టుకు రావడం.. దారిలో ఊహించని ప్రమాదం ఎదురవడం.. ఓ ముసుగు రూపం వారిపై దాడిచేయడం.. ఇలా ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే అసలు ఆ ఊరిలో ఏం జరుగుతోందా అని తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ మొదలవుతుంది. కిచ్చా సుదీప్ పరిచయ సన్నివేశాలు.. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. మధ్యలో సంజు కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మరీ మెలోడ్రామాలా సాగుతున్నట్లు అనిపిస్తాయి. విక్రాంత్ ఇన్‌స్పెక్టర్ హత్య కేసు గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాకే కథలో వేగం పెరుగుతుంది.
అయితే, థ్రిల్లర్ కథల్లో రహస్యాన్ని ఛేదించే క్రమం ఆసక్తికరంగా సాగుతున్నప్పుడే ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవ్వగలుగుతారు. అయితే దీన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. దీనికి తోడు సంజు లవ్ ట్రాక్, జనార్ధన్ గంభీర్ (మధుసూధన్ రావు) స్మగ్లింగ్ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని గందరగోళానికి గురిచేస్తాయి. మధ్య మధ్యలో వచ్చే కొన్ని భయంకరమైన ఎపిసోడ్‌లు ప్రేక్షకుల్లో ఉత్కంఠత రేకెత్తిస్తాయి. విరామానికి ముందొచ్చే ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్ధమంతా రొటీన్ రివెంజ్ డ్రామాలా సాగుతుంది. హత్యలకు పాల్పడుతున్న నేరస్థుడి ప్లాష్‌బ్యాక్‌లో బలమైన సంఘర్షణ కనిపించదు. పతాక సన్నివేశాల్లో కనిపించే విజువల్స్.. సుదీప్ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, సినిమాని ముగించిన తీరు అంతగా మెప్పించదు.
- July 24, 2022
-
-
నాకు డబ్బుంది.. కానీ జీవితంలో ప్రశాంతం లేదు: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders
ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఎన్ని రూ.కోట్లు సంపాదించినా తన జీవితంలో ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ కండక్టర్‌గా మొదలైన రజినీకాంత్ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెలిసిందే. అయితే పేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని ఆయన చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో జరిగిన హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నేను మంచి నటుడని అందరు అంటుంటారు. కానీ దాన్ని ప్రశంసగా తీసుకోవాలో, విమర్శగా పరిగణించాలో అర్థం కావడం లేదు. నా సినిమాల్లో నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిన సినిమాలు బాబా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.. ఈ సినిమాలు చూసి నా అభిమానులు చాలా మంది సన్యాసులుగా మారారు, హిమాలయాలకు వెళ్లారు. కానీ నేను మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాను. మధ్యలో వెళ్లి వస్తున్నా.. ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ దొరికే అమూల్యమైన మూలికలు.. తింటే వారానికి సరిపడా శక్తి వస్తుంది. ఆరోగ్యం చాలా ముఖ్యం.. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనకు ఏదైనా అయితే తట్టుకోలేరు. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ఇవేమి నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు నాకు. నా జీవితంలో నేను చాలా చూశాను.. కానీ 10 శాతం కూడా ప్రశాంతంగా జీవించలేక పోయాను. సంతోషం, ప్రశాంతత అనేవి జీవితాంతం వుండేవి కావు’ అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళ సినీ పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రజనీదే అనడంలో సందేహమే లేదు. ఆయనకు జపాన్, మలేషియా దేశాల్లోనూ అనేక మంది అభిమానులున్నారు. భారతీయ సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. స్టైల్, మ్యానరిజానికి కేరాఫ్‌గా నిలిచే రజనీకాంత్ యాక్షన్ సినిమాలతో కోలీవుడ్‌ని ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్‌తో ‘జైలర్’ మూవీలో నటిస్తున్నారు.
-
-
ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్.. దీని లక్షణాలేంటి? చికిత్స ఎలా..
Category : Behind the Scenes Daily Updates Features Health new Sliders
ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (Monkey pox) మన దేశాన్ని కూడా కలవరపరుస్తోంది. దేశంలో మొదటి కేసు కేరళలో నమోదుకాగా.. తాజాగా బాధితుల సంఖ్య నాలుగుకి చేరింది. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలేంటి? చికిత్స ఎలా? తీసుకోవలసి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
మంకీ పాక్స్ అంటే ఏమిటి..?
మంకీపాక్స్ అనేది వైరల్ డిసీజ్. మంకీపాక్స్ స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 – 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో తొలిసారిగా మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
ఎలా వ్యాపిస్తుంది..
వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, సంపర్కరం, కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులు ఎక్కువ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నవే. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు ఏంటి
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీ పాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే మొహం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు 2 – 3 వారాల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.
చికిత్స ఎలా
మంకీపాక్స్ నివారణకు కచ్చితంగా చికిత్స లేనప్పటికీ దీన్ని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్ మందులను ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ చికిత్సలో 85% సమర్థవంతగా పనిచేస్తుందని నిర్ధారించారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే, నిపుణులు సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్ మరియు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం వంటి కొన్ని సిఫార్సు పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
మంకీపాక్స్ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
రద్దీగా ఉండే ప్రాంతాలకు, కార్యక్రమాలకు వెళ్లడం మంచిది కాదు.
పరిశుభ్రత పాటించండి.
మాస్క్ ధరించండి.
గమనిక: ఈ వివరాలు, సూచనలు ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించబడ్డాయి. ఈ స్టోరీ కేవలం పాఠకుల అవగాహన కోసమే మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచి పద్ధతి.
- July 23, 2022
-
-
గాల్లో విమానం.. ప్రయాణికుడికి అస్వస్థత, డాక్టర్‌గా మారిన గవర్నర్ తమిళిసై
Category : Behind the Scenes Daily Updates News Sliders Telangana
వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? అని అనౌన్స్ చేయడంతో విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. కాసేపటికి కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు సైతం గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని ఫోటోలు తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో రాకముందు ఆమె కొంతకాలం ప్రాక్టీస్ చేశారు.
Search
Latest Updates
- శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?
- రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
- నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట
- విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు
- ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?
- ‘కాంతార’ సర్ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
© Copyright 2020. All Rights Reserved