Category Archives: Sliders

గురుపౌర్ణమి.. ఈ రోజున చేయాల్సిన, చేయకూడని పనులు ఏమిటంటే


హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆషాడ మాసం నాల్గవ మాసం. సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన, ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి మాసంలో పండగలు, పూజలు, ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేక ఉంది. ఈ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాస మహర్షి కూడా ఈ రోజునే జన్మించారని నమ్ముతారు. ఈ సందర్భంగా, ఈ రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటారు. పూర్తి ఆచార, నియమాలతో వ్యాస భగవానుడిని పూజిస్తారు.

భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే.


సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం సశాస్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నటరాజ స్వామి. శివుడు ఎప్పుడూ తాండం చేస్తూనే ఉంటాడు నటరాజు రూపంలో. ఆయన తాండవం ఆగదు. పరమశివుడి తాండవ సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం (శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. సృష్టికి మొదట నాదం రూపంలో పరబ్రహ్మ వ్యక్తమయ్యాడు కనుక నాదబ్రహ్మం అని అంటాం. నాదం నుంచి ప్రణవం (ఓంకారం), వేదం వచ్చాయి. ఈ వేదాన్ని సర్వవ్యాపకుడైన శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). కనుక శ్రీ మహావిష్ణువును గురుపరంపరలో మొదటివాడిగా చెప్పుకుంటున్నాం. అందుకే అద్వైత గురు పరంపర స్తోత్రం ‘నారయణ సమారంభాం’ అంటూ ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. అందుకే వేదోఖిలం జగన్మూలం అన్నారు అంటే వేదమే జగత్తునకు మూలమై ఉన్నది అని అర్దం. దేవతలను, మానవులను, దానవులను సృష్టించాడు. వేదం ఆధారంగా ధర్మాన్ని ఏర్పరిచాడు.

బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలో నుంచి పుట్టాడు, కనుక బ్రహ్మదేవుడిని పద్మభువుడు అన్నారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కుమారుడు. విష్ణువుమూర్తి తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను, వేదాన్ని బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, వశిష్టుడు తన పుత్రుడైన శక్తి మహర్షికి, శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, కోట్ల సంవత్సరాలు కాలంలో వెళ్ళిపోయాయి, ఎందరో మహానుభావులు పుట్టారు, ఎందరో ముక్తిని పొందారు. అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. వశిష్టమహర్షి 24 వ త్రేతాయుగంలో శ్రీ రామచంద్రునికి, లక్ష్మణునికి గురువుగా యోగవిద్యను బోధించారు. ఆ మహాయుగం గడిచిపోయింది, ఇంకా 3 మహాయుగాలు గడిచి 28 వ మహాయుగం ప్రారంభమైంది. సత్యం యుగం దాటింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం ఆఖరికి చేరుకుంది. ఇంతలో మహాభారత యుద్ధం జరిగింది. ఇంతకాలం గడిచినా వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి ‘శ్రుతి’ అని పేరు వచ్చింది.

ఈ వేదాన్ని సమాధి స్థితిలో ఉన్న ఋషీశ్వరులు దర్శించారు. పరమాత్మ వారికిచ్చిన వేదం ఒకటిగానే ఉండేది. అంతా కలిసిపోయి ఉండేది. దానికి తోడు, మధ్యకాలంలో అనేకమంది తమ అనుభూతులు ద్వారా, సమాధి స్థితి ద్వారా అనేకానేక విషయాలను వేదం నుంచి వెలికితీశారు. ఇదంతా పెద్ద జ్ఞానరాశి. ఒక వ్యక్తి వీటిని సక్రమంగా అర్దం చేసుకోవడం దుర్లభంగా ఉండేది. ఈ విషయాన్ని వ్యాసమహర్షి గుర్తించారు. రాబోయేది కలియుగం. కలియుగ జనంలో భక్తి తక్కువగా ఉంటుంది, ఆయుషు తక్కువ (100-120 ఏళ్ళు), అధికశాతం ప్రజలు మందబుద్ధులుగా ఉంటారు. జ్ఞాపకశక్తి గొప్పగా ఉండదు. మహాభారత యుద్ధం కారణంగా వేదపండితుల అనేకమంది మరణించారు. వైదిక సంస్కృతి దెబ్బతింది. ఇలా సాగితే, కలియుగ జనం ఎట్లా తరిస్తారు? ఆ సందేహం వ్యాసమహర్షికి కలిగింది. ఋషి భవిష్యత్తును దర్శనం చేయగలడు. కనుక అన్ని విషయాలను గమనించి కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా ఋగ్, యజుర్, సామ, అథర్వ వేదాలుగా విభజించారు. ప్రపంచ నలుమూలల ఉండే 88,000 మహర్షులను భారతదేశానికి ఆహ్వానించి వేదసభ ఒకటి నిర్వహించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.

ఈ రోజున ఎలా పూజించాలంటే..
గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి, తెల్లవారుజామున పూజలు చేయడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజాసామాగ్రి, పూలు, మాలలు, తాంబూలం, వంటి ఇతర పూజా వస్తువులను ఒక రోజు ముందుగానే ఏర్పాటు చేసుకోండి. అనంతరం మీ గురువుగారి దగ్గరకు వెళ్లి, ఆయన పాదాలు కడిగిన తర్వాత ఆయనకు పూజ చేసి.. మీ శక్తి కొలది పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, డబ్బు మొదలైన వాటిని సమర్పించండి.

ఈ రోజున చేయాల్సిన పనులు

  1. పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
  2. సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
  3. పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన దేశం నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది.

చేయకూడని పనులు

  1. పౌర్ణమి నాడు దానం చేయడం చాలా శ్రేయస్కరం అని అంటారు. అయితే ఈరోజున ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను కూడా కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదని అంటారు. హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది గ్రంధాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయడం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా దానం చేయండి.
  2. పౌర్ణమి రోజున, వృద్ధులను లేదా స్త్రీని పొరపాటున కూడా అవమానించకూడదు. వాస్తవానికి, గురు పూర్ణిమ మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది, అయితే ఈ రోజున, పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే.. సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలుగజేస్తాయి.

తొలి ఏకాదశి… నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభం

హిందువుల తొలి పండగ ఏకాదశి. ఏ మంచి పని ప్రారంభించినా హిందువులు దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తుంటారు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పాటిస్తారు. పూర్వకాలం ఇదే రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశి తర్వాతి రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు. అయితే ఈ నాలుగు మాసాలలో మీరు శ్రీమహావిష్ణువును పూజించవచ్చు ,ఉపవాసం చేయవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. చాతుర్మాసం ప్రారంభంతో వివాహం, క్షవరం , గృహ ప్రవేశం వంటి మొదలైన పనులు నిలిచిపోతాయి.

తొలి ఏకాదశి పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తారు. మరుసటి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదం స్వీకరించాక భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయనేది నమ్మకం. ఏకాదశి అంటే పదకొండు. జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, మనసు ఒకటి. వీటిని మానవుడు తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటన్నింటిని ఏకం చేసి దేవుడికి నివేదన చేయాలి. ఇలా చేయడం వల్ల మనిషిలోని బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరి చేరవు. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. అందుకే తొలి ఏకాదశి ఆరోగ్యానికి తోడు ఆనందం సొంతం చేస్తుంది.

జాగారం సందర్భంగా సినిమాలు లాంటివి కాకుండా భాగవత పారాయణం, విష్ణుసహస్రనామం వంటివి పారాయణం చేస్తే మంచి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్లు ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్లి ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశి పండగ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పండ్లు, చందనం, అక్షింతలు, తమలపాకులు, తులసి ఆకులు, పంచామృతం వంటి వాటిని దేవుడికి సమర్పించాలి. కాగా తొలి ఏకాదశి నాడు జొన్నలతో తయారుచేసిన పేలాల పిండిని తినాలి. ఎందుకంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. తొలి ఏకాదశి వ్రతం చేసేవాళ్లు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసిన పదార్ధాలు భుజించకూడదు. అలాగే మంచంపై పడుకోరాదు.


12ఏళ్లకోసారి పిడుగుల వర్షం.. ముక్కలై తిరిగి అతుక్కునే శివలింగం

ఈ భూమిపై సైన్స్‌కి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఒకటి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు లోయలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి గల ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జీవితంలో ఒక్కసారైనా ఆ ఆలయాన్ని సందర్శించి శివలింగాన్ని దర్శించుకోవాలని తపించిపోతారు. కులు లోయ పవిత్రమైన ఒడిలో శివుడికి సంబంధించిన శాశ్వతమైన ఉనికి ఉందని చాలా మందికి తెలియదు. స్వర్గధామమైన ఈ లోయలో సుమారు 2,460 మీటర్ల ఎత్తులో కొన్ని యుగాలుగా బిజ్లీ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ పుణ్య క్షేత్రానికి కులు నుండి 22 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్ల పొడవైన ట్రెక్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ శివాలయంపై పిడుగుల వర్షం కురుస్తుంది. ఆ సమయంలో శివలింగం ముక్కలు ముక్కలుగా ధ్వంసమవుతుంది. అప్పుడు ఆలయ పూజారులు ఆచారంలో భాగంగా వెన్నతో పాటు తృణధాన్యాలు, కాయ ధాన్యాల పిండిని ఉపయోగించి ఆ ముక్కలను అతికిస్తారు. కొన్ని నెలల తర్వాత శివలింగం సాధారణ ఆకృతిలోకి వస్తుంది. ఇది ఎంతో విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇది క్రమం తప్పకుండా జరగడం విశేషం. ఈ శివలింగాన్ని స్థానికులు వెన్న మహాదేవ్, బిజ్లి మహదేవ్ అని పిలుస్తారు. ఈ పిడుగులు శివలింగంతో పాటు ఆ ప్రాంతానికి ప్రత్యేక శక్తులు ఇస్తాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ గాథ కూడా ఉంది. కులుంత అనే రాక్షసుడు కులు లోయలో నివసించేవాడు. అతడు ఒక సర్ప రూపాన్ని ధరించి లాహౌల్ – స్పితిలోని మాథన్ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ బియాస్ నదికి గండి పెట్టి ప్రజలు వరదలతో చనిపోయేలా చేయాలని అనుకుంటాడు. దీంతో ఆగ్రహించిన పరమ శివుడు ఆ రాక్షసున్ని అడ్డుకునేందుకు వెళతాడు. కులంతతో భీకర యుద్ధం చేసిన తరువాత పాము రూపంలో ఉన్న రాక్షసున్ని సంహరిస్తాడు. మరణించిన తరువాత కులంత దేహం మొత్తం భారీ పర్వతంగా మారుతుంది. అప్పుడు శివుడు ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి ఇక్కడ మెరుపు విసరాలని ఇంద్రుడిని ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని కూడా సూచిస్తాడు. కులుంత అనే రాక్షసుడు ఇక్కడ చనిపోవడం వలన ఈ ప్రాంతానికి తరువాతి కాలంలో కులు లోయ అని పేరు స్థిరపడినట్లు చెబుతారు.

ఈ పవిత్రమైన పురాతన శివ మందిరాన్ని సందర్శించాలంటే 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చుట్టుపక్కల పొడవైన దేవదార్ వృక్షాలు, కులు లోయ యొక్క అందమైన దృశ్యాలు సందర్శకుల అలసటను మాయం చేస్తాయి. పర్వతం పైన సందర్శకులకు కులు, పార్వతీ లోయ అద్భుతమైన దృశ్యాలను వీక్షించే అవకాశం దొరుకుతుంది. శివరాత్రితో పాటు శ్రావణ మాసంలో ఈ మందిరం భారీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం చూసేందుకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల యాత్రికులు తరలివస్తుంటారు.


వెయ్యేళ్లైనా చెక్కు చెదరని శ్రీరామానుజుల శరీరం.. శ్రీరంగం వెళ్తే తప్పకచూడండి

వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీరామానుజాచార్యుడు. మోక్షం ఒక వర్గానికే చెందినదికాదని సర్వులకు దానిని పొందే అర్హత ఉందని చెప్పిన సమతామూర్తి. తిరుమలలో నేడు జరుగుతున్న శ్రీవారి నిత్య కైంకర్యాలను, సేవలను నిర్ధారించింది కూడా ఆయనే. మంత్రం, మోక్షం అందరిదీ అంటూ తిరుకొట్టియూర్ ఆలయ గోపురం పైకి ఎక్కి ద్వయ మంత్రాన్ని ప్రకటించిన మహనీయుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ వెళితే కొందరికే పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు తన జీవితాంతం కృషి చేశారు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్కర్త, మానవతావాది అయిన శ్రీరామానుజాచార్యులు శరీరాన్ని విడిచి పెట్టి సుమారు 1000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన శరీరం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా భద్రపరచబడింది. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు.

సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకు కుళ్లిపోయి నశిస్తుంది. కానీ శ్రీరామానుజాచార్యుల శరీరం మాత్రం జ్ఞాన కాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూ కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగానికి వెళ్లాల్సిందే. అవును పరమ పవిత్రమైన శ్రీరంగం క్షేత్రంలోనే రామానుజాచార్యుల శరీరం ఉంది. సాధారణంగా ఈ ఆలయానికి వెళ్లే చాలా మందికి అక్కడ భగవత్ రామానుజుల శరీరం ఉందని తెలియదు. శ్రీరంగంలో ఉన్న రామానుజుల శరీరాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపడకమానరు. ఎందుకంటే ఆయన శరీరం ఇప్పటికీ పద్మాసనంలో కూర్చుని ఉన్న ఒక విగ్రహంలా కనిపిస్తుంది. 1017 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరులో జన్మించిన ఆయన దాదాపు 123 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. పద్మాసన స్థితిలోనే ప్రాణం విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలను అద్ది భద్రపరిచారు. ప్రతి ఏటా ఆయన దివ్య దేహానికి ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు. ఈ ప్రక్రియ కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది. అందుకే రామానుచార్యుల శరీరం ఎర్రని వర్ణంలో ఒక విగ్రహంలా మెరిసిపోతుటుంది.

​రామానుజుల ఆలయం
శ్రీరంగం ఆలయాన్ని సందర్శించే వారు ఏడు ప్రాకారాల గుండా వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటారు. అయితే ఆ మార్గంలో నాలుగవ ప్రాకారంలోకి ప్రవేశించగానే కుడి చేతి వైపు రామానుజుల ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు దర్శించి వెళుతుంటారు. కానీ అక్కడ భద్రపరిచిన ఆయన శరీరాన్ని ఎవరూ గుర్తించలేరు. ఒకవేళ చూసినా అది విగ్రహం అనుకుని నమస్కరించి వెళిపోతారు. కానీ తెలిసిన వారు మాత్రం అర్చకులను అభ్యర్ధించి హారతి వెలుగులలో రామానుజుల శరీరాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతారు. హారతి ఇచ్చే సమయంలో భక్తులు సరిగ్గా గమనిస్తే ఆయన ప్రకాశవంతమైన కళ్లు, గోర్లు కనిపిస్తాయి.

​ఎలా చేరుకోవాలి?
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరం నుండి శ్రీరంగం 324 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరంగానికి తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఉంది. అక్కడి నుంచి శ్రీరంగానికి 15 కిలోమీటర్ల దూరం. క్యాబ్ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయానికి చెన్నై, సింగపూర్, దుబాయ్, షార్జా, కొలంబో, ముంబై, కౌలాలంపూర్ వంటి అనేక ప్రాంతాల నుండి విమాన రాకపోకలు జరుగుతుంటాయి.

రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారు దేశంలోని అన్ని నగరాల నుండి చెన్నై రైల్వే స్టేషన్‌కు సులభంగా చేరుకోవచ్చు. చెన్నై నుండి కన్యాకుమారి ట్రాక్‌పై వెళ్లే రైళ్ల ద్వారా మీరు శ్రీరంగం వెళ్లవచ్చు. 320 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి 5 గంటల సమయం పడుతుంది. శ్రీరంగంలో కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. మిగతా రైళ్లు తిరుచిరాపల్లి జంక్షన్ లో ఆగుతాయి. తిరుచిరాపల్లి జంక్షన్ నుండి శ్రీరంగంకు ప్రతి ఐదు నిమిషాలకు బస్సులు నడుస్తుంటాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే ప్రయాణికులు చెన్నై నగరానికి చేరుకుని అక్కడి నుండి శ్రీరంగం వెళ్లే బస్సులను అందుకోవచ్చు.


ఆషాఢం బోనాలు.. ఈ సంప్రదాయం వెనుక పెద్దకథే ఉంది

ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే బోనాల విశిష్టత అంతాఇంతా కాదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నాలుగు ఆదివారాలూ అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బోనాల వేడుకల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఈ వేడుకలు గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమై.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళీ ఆలయంలో జరిగి… లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ముగుస్తాయి. అసలు ఈ మూడు ఆలయాల విశిష్టత ఏంటంటే…

గోల్కొండ జగదాంబికా దేవి

గోల్కొండ కోటలోని ఓ రాతి గుహలో భక్తులకు దర్శనమిస్తుంది జగదాంబ మహంకాళి దేవి. ఆషాఢమాసంలో బోనాల పండుగ ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే కావడం విశేషం. కోరిన కోర్కెలు తీర్చే శక్తిస్వరూపిణిగా పూజలు అందుకునే ఈ దేవిని దర్శించుకుని బోనం సమర్పిస్తే ఆ సంవత్సరమంతా తాము సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఇక్కడ పశువులు కాసే రామ్‌దేవ్‌ రావ్‌ అనే వ్యక్తికి ఈ ప్రదేశంలో దేవి విగ్రహం కనిపించిందట. అది తెలిసి కాకతీయులు ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించారనీ.. అలా ఈ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు వచ్చిందనీ అంటారు. నవాబులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. సాధారణంగా ఆషాఢ మాసంలో వచ్చే 4 – 5 ఆదివారాల్లోనే పలు ఆలయాల్లో దేవికి బోనాలను అర్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆషాఢంలో వచ్చే ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించడాన్ని సంప్రదాయంగా పాటిస్తారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి
తన చల్లని చూపులతో భక్తుల కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటోంది సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి. ఢమరుకం, కత్తి, శూలం, అమృత పాత్ర ధరించి చతుర్భుజిగా దర్శనమిచ్చే ఈ దేవిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఏడాది మొత్తం విశేష పూజలు జరిగే ఈ ఆలయాన్ని జంటనగరాల నలుమూలల నుంచీ లక్షలాది మంది దర్శించుకుంటారు. 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళి పేరు పెట్డడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

ఒకప్పుడు పాత బోయగూడలో సురిటి అప్పయ్య అనే అమ్మవారి భక్తుడు ఉండేవాడట. మిలటరీలో పనిచేసే అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడట. ఆ సమయంలో అంతటా కలరావ్యాధి విపరీతంగా ప్రబలి చాలామంది చనిపోయారట. ఇది తెలిసిన అప్పయ్య మహాకాళి ఆలయానికి వెళ్లి దేవిని దర్శించుకుని కలరా వ్యాధిని తగ్గిస్తే తన స్వస్థలంలోనూ అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తానంటూ మొక్కుకున్నాడట. క్రమంగా ఆ సమస్య అదుపులోకి వచ్చిన కొన్నాళ్లకు స్వస్థలానికి వచ్చేసిన అప్పయ్య సికింద్రాబాద్‌లోనే చిన్న ఆలయాన్ని నిర్మించి చెక్క విగ్రహాన్ని ఏర్పాటుచేశాడట. ఆ సమయంలో జరిపిన తవ్వకాల్లో మాణిక్యాలమ్మ దేవి విగ్రహం కూడా బయటపడటంతో ఆ రెండు విగ్రహాలనూ కలిపి ప్రతిష్ఠించాడట.

లాల్‌దర్వాజాలో కొలువైన సింహవాహిని మహంకాళి
భక్తుల కష్టాలను పోగొట్టే ఆదిపరాశక్తిగా, భాగ్యనగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే పరమేశ్వరిగా పూజలు అందుకుంటోంది హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజాలో కొలువైన సింహవాహిని మహంకాళి. నిజాం నవాబులు నగరానికి రాకపోకలు సాగించేందుకు వీలుగా 13 దర్వాజాలను నిర్మించారనీ అందులో లాల్‌దర్వాజా ఒకటనీ అంటారు. ఆ తరువాత ఇక్కడ స్థానికులు ఆలయాన్ని కట్టించి, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అది జరిగిన కొన్నాళ్లకు మూసీ నది ఉప్పొంగడంతో నిజాం రాజు ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజించి.. నీటిలో పట్టువస్త్రాలూ, కానుకలూ వదిలాకే మూసీ ఉధృతి తగ్గిందనీ.. అప్పటినుంచీ బోనాలు సమర్పించే సంప్రదాయం మొదలైందనీ అంటారు. కన్నుల పండుగ్గా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఏటా దాదాపు 10లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు.


పుచ్చకాయలకే ఇళ్లు అమ్మేస్తున్నారు… చైనాలో వింత పరిస్థితి

సాధారణంగా ఊళ్లలో పాత ఇనుప సామాన్లకి మామిడి పండ్లు, బీరు సీసాలకు ఐస్ క్రీములు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ చైనాలో మాత్రం ఏకంగా పుచ్చకాయలు గోధుమలు వెల్లుల్లికి ఇండ్లు అమ్మేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఇది నిజమా కాదా అని తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పుచ్చకాయలకి ఇల్లు అమ్మిందన్న వార్త ఒకటి చైనా పత్రికల్లో కనిపించింది. “నాన్జింగ్లోని ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున లెక్క గట్టి గృహ కొనుగోలు చెల్లింపులుగా అంగీకరిస్తోంది” అంటూ చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇటీవల గొప్పగా ఓ కథనం రాసింది. తూర్పు నగరమైన నాన్‌ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారు. 100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కిస్తున్నారు. మరో చిన్న పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్ పీచెస్ పళ్లను తీసుకుంటున్నట్లు వార్తలు వ‌చ్చాయి. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్‌ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు.

కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్‌మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును కూడా తగ్గించింది. 4.6 శాతం నుంచి 4.4 శాతం వరకు కోత పెట్టింది. ప్రస్తుతం చైనా గృహ రుణాల విలువ 10 ట్రిలియన్లకు డాలర్లకు చేరింది. చైనా ప్ర‌గ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ రంగానిది అత్యంత కీలక పాత్ర అని చెప్పుకోవాల్సిందే.

చైనా జీడీపీలో నాలుగో వంతు రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తోంది. తాజాగా ఆ దేశంలోని టాప్ 100 డెవలపర్ల విక్రయాలు తొలి నాలుగు నెలల్లో సగానికి పడిపోయాయి. ఈ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం కూడా తగ్గింది. 2021లో నిర్మాణాల్లో ఏకంగా 14 శాతం తగ్గుదల నమోదైంది. మిలియన్ల కొద్దీ చదరపు అడుగుల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆరేళ్లలో తొలిసారి గత సెప్టెంబర్ నుంచి ఇళ్ల ధరల్లో పతనం మొదలైంది. ఫలితంగా ముందస్తుగానే నిర్మాణాలకు చెల్లింపులు చేసిన వినియోగదారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కొనుగోలుదారులు ఓ పట్టాన ముందుకు రావడంలేదు. చైనాలోని నగరవాసుల సంపద 70 శాతం గృహాలపై పెట్టుబడుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలను ఆదుకొనేందుకు కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగింది. భవిష్యత్తులో షీజిన్పింగ్ మూడోసారి అధికారం చేపట్టనున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీకి ఇది పెను సవాలుగా మారింది.


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది.

స్థల పురాణం
శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకుంటోంది. బ్రహ్మదేవుని చేత పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం ఏటికేడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ (సాలెపురుగు), కాళం(పాము), హస్తి(ఏనుగు)ల పేరిట ఏర్పడ్డ ఈ క్షేత్రం… ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ మూడు జీవులు ఇక్కడి శివయ్యను ఆరాధించి.. చివరకు ఆయనలోనే ఐక్యమయ్యాయి. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. కుజదోష నివారణ పూజలు.. నాగదోష నివారణ పూజలు.. నవగ్రహ దోష నివారణ పూజలు ఈ క్షేత్రంలో ప్రత్యే ప్రభావం కనబరుస్తాయన్నది భక్తుల విశ్వాసం. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఆలయ దర్శన వేళలు
ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది! రూ. 50 ప్రత్యేక దర్శన టికెట్టుకూ ఇదే వర్తిస్తుంది! గ్రహణ కాలాల్లోనూ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది.

భక్తులకు ఇచ్చే బహుమానాలు..

  • ఆలయంలో జరిగే అభిషేక సేవలకు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. రుద్రాభిషేకానికి పులిహోర, లడ్డూ, కండువా, జాకెట్టు గుడ్డ, స్వామి అమ్మవార్ల చిత్రపటం, పంచామృతం, పచ్చకర్పూర తీర్థజలం, విభూది ఆలయం తరఫున అందజేస్తారు.
  • నిత్య కల్యాణోత్సవం చేయించిన వారికి లడ్డూ, వడ… చండీ, రుద్రహోమాలు చేయించిన వారిని ఉప్పు పొంగలి ప్రసాదంగా అందజేస్తారు.
  • పచ్చకర్పూర అభిషేకం చేయించిన భక్తులకు తీర్థంగా పచ్చకర్పూర జలాన్ని, పంచామృత అభిషేకం చేయించిన భక్తులకు అభిషేకం చేసిన పంచామృతాన్ని కానుకగా అందజేస్తారు.

వసతి, రవాణా సౌకర్యం
విజయవాడ – రేణిగుంట మార్గంలో శ్రీకాళహస్తి క్షేత్రం వుంది. రైలు, రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు. ప్రతి 15 నిమిషాల‌కో సర్వీసు చొప్పున బస్సులు ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీకాళహస్తికి నేరుగా బస్సు సౌకర్యముంది. రేణిగుంటలో తిరుపతి విమానాశ్రయముంది. శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఆలయం తరఫున పలు అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. పట్టణంలోనూ పలు ప్రభుత్వ / ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు.. అద్దెగదులు లభిస్తాయి. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు… ముందస్తు బుకింగ్‌ల కోసం… 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.




పూరీ జగన్నాథ్ ఆలయం రహస్యాలు.. సైన్స్‌ కూడా కనిపెట్టలేని నిజాలు

పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రధయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహరాజు పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాధ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

​ఆలయ నిర్మాణం
పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజినీరింగ్ అద్భుతమా లేక దైవ శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతుచిక్కని విషయం.

​ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.

​సింఘద్వారం రహస్యం
జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.

​ఆలయంపై జెండా
పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.

​సుదర్శన చక్రం
20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

​సముద్రం రహస్యం
సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కు కూడా అంతుచిక్కని మిస్టరీ.

​ప్రసాదం రహస్యం
పూరీ జగన్నాధ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతి రోజూ 2000 నుంచి 20,000 వరకూ భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటుచేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.

​1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.