Category Archives: Sliders

పిల్లల తలపై భోగి పళ్లు వేయడం వెనుక అంతరార్ధమిదే..


భోగి పండగ రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. నేటి కాలం పిల్లలకు ఇది చూసేందుకు వింతగా అనిపించినా దీనికి వెనుక పెద్దల ఆలోచన, శాస్త్రీయ ఆధారాలున్నాయి. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరుంది. రేగి చెట్లు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది. దీంతో పాటు పిల్లలకి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం

బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను తలపై పోయడం ద్వారా బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. గనుక వీటిని తల మీద పోయడం వల్ల వీటిలోని విద్యుచ్ఛక్తి, శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువల్లే పిల్లలకి భోగి పండ్లు పోసి అశీర్వదిస్తారు. ఇలా మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్ధాలు, అంతరార్ధాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని మసులుకుంటే అవి మనకి మార్గదర్శకం అవుతాయి.


కాఫీ డే: రూ.7 వేల కోట్ల అప్పు.. భర్త సూసైడ్.. ఏడాదిలోనే అద్భుతం చేసిన మాళవిక హెగ్డే

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. ఇంకేంటి అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.

సిద్ధార్థ ఆత్మహత్య

2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. కేఫ్‌ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.

భలే ఆలోచన

మాళవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. నాన్న ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజిక వేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థతో వివాహమైంది. వీళ్లిద్దరూ కలిసి కేఫ్‌ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. రూ.5కి ఎక్కడైనా దొరికే కాఫీని రూ.25 పెట్టి తాగడానికి తమ పార్లర్‌కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ససేమిరా అందట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఈసారి ఆయన ‘కాఫీకి ఉచిత ఇంటర్నెట్‌నూ అందిస్తే?’ అన్నారట. ఆలోచన ఈసారి ఈమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) అవుట్‌లెట్‌ బెంగళూరులో ప్రారంభమైంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సీసీడీ రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు.

రూ.7వేల కోట్ల అప్పులు

అయితే సంస్థ రూ.7000 కోట్ల అప్పుల్లో మునిగిపోవడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిన సిద్ధార్ధ.. భార్య, పిల్లలను అనాథలను చేస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్‌! కాఫీ కింగ్‌గా పేరుగాంచిన ఆయన మరణానికి కారణం.. అప్పు. అదీ రూ. ఏడువేల కోట్లు. సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24 వేలమంది కార్మికులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలూ చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కనపెట్టి మళ్లీ తెరమీదకొచ్చారు మాళవిక. తన పిల్లలతోపాటు ఉద్యోగుల బాధ్యతనూ స్వీకరించారు. ‘సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకుంటా’నంటూ వాళ్లని సమాధానపరిచారు. ఆ అప్పులను తీర్చడం తన బాధ్యతన్నారు. అలా 2020 డిసెంబరులో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మాళవిక

ఇక్కడా ఎన్నో ఎదురుదెబ్బలు. కొవిడ్‌, చెల్లని చెక్కుల వివాదాలు. అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుతూ వచ్చారు. పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎన్నో వెండింగ్‌ మెషిన్‌లను వెనక్కి రప్పించారు. సంస్థ నిరర్థక ఆస్తులనీ అమ్మేశారు. ఏడాది కాలంలో సగం అంటే.. రూ. మూడువేల కోట్లకుపైగా అప్పుల్ని తీర్చేశారు. ఇంకొన్నేళ్లలోనే తిరిగి సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశ ఆమెలోనేకాదు.. సంస్థ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోంది. టాటా వంటి సంస్థలూ పెట్టుబడికి ఆమెతో చర్చలు జరుపుతున్నాయి. గతంలో మాళవిక సంస్థకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యురాలు. రూపాయి జీతం తీసుకోలేదు. సంస్థలో ఆమెకున్న వాటా కూడా నాలుగు శాతమే. అయినా సీసీడీని ముందుకు నడపడం తన బాధ్యతగా భావించారు. కాఫీ ఎస్టేట్‌లో భర్తతో కలిసి మొక్కలు నాటేవారు. ఏ అవుట్‌లెటైనా ఇద్దరూ ప్రారంభించేవారు. సాధారణ ప్రేమికుల్లా కూర్చొని వినియోగదారులను గమనించేవారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పైగా భర్తకు సంస్థపై ఎనలేని ప్రేమ.. ఇవన్నీ ఆమెను మధ్యలో వదిలేయనివ్వలేదు.

‘ఏడాదిలో ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతోపాటు వ్యాపారాన్నీ అభివృద్ధి పథంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకూ భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయం’ అని ఓ సందర్భంలో చెప్పారు. భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోయే ఎంతోమందికి ఆమె జీవితం స్ఫూర్తిమంతమే కదూ!


పసుపు అధికంగా వాడుతున్నారా.. జాగ్రత్త!

పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. పసుపులో కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనల్ని అనేక రకాల వైరస్‌ల నుంచి కాపాడుతాయి. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపు అతిగా తీసుకుంటే శరీరానికి హాని కూడా చేస్తుంది. పసుపును ఎలాంటి వ్యక్తులు తినకూడదో, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం…

చర్మ సమస్యలు

పరిమితికి మించి పసుపును తీసుకుంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతాయి. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. పసుపు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పరిమిత పరిమాణంలో ఉపయోగించడమే ఉత్తమం. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి.

ఉదర సమస్యలు

వాస్తవానికి పసుపుని వేడిగా పరిగణిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఇది కడుపులో మంటతో పాటు విరేచనాలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు కడుపులో వాపు లేదా తిమ్మిరి సంభవిస్తుంది. కాబట్టి పసుపును ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలి. అలాగే కామెర్లు వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు పొరపాటున కూడా పసుపు తినకూడదు. ఒకవేళ తింటే కామెర్లు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

కిడ్నీ సమస్యలున్న వారు
కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి పసుపు వాడకం మంచిది కాదు. పసుపులో ఉండే మూలకాలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా పసుపు తీసుకోవడం మంచిది కాదు.

ముక్కు నుంచి రక్తం వచ్చేవారికి

ముక్కు నుంచి రక్తం కారడం సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కావడాన్ని అధికంగా చేస్తుంది. అందుకే పరిమిత పరిమాణంలో పసుపును ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించండి. అతి వాడకం అన్నింట్లోనూ ప్రమాదకరమే.


బాలయ్య అరుదైన ఘనత.. దేశంలోనే నెంబర్ వన్ షోగా ‘అన్ స్టాపబుల్’

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’గా గర్జించిన బాలయ్య…. అల్లు ఫ్యామిలీకి చెందిన ప్రముఖ ఓటీటీ సంస్థ aha కోసం హోస్ట్‌గా మారి ‘అన్ స్టాపబుల్’ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. గెస్ట్‌లుగా వచ్చిన స్టార్స్‌తో బాలయ్య తనదైన స్టైల్‌లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్న ఈ షో నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది.

ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్న హాజరుకాగా.. ఆ తర్వాత నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, సుకుమార్- రష్మిక మందన్న- అల్లు అర్జున్, రవితేజ- గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరై ఆకట్టుకున్నారు.

అసలు విషయానికొస్తే ‘అన్ స్టాపబుల్’ షో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో 9.7 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ 7.8 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తానికి 2021లో ‘అఖండ’తో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన నందమూరి నటసింహం.. ఓటీటీలో తన సత్తా చాటాడు.


రోజుకు 24 ఇడ్లీలు.. 2 లీటర్ల బాదం పాలు, 40 బజ్జీలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకే..

తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకొని, ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇక శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పౌరాణిక పాత్రల పోషణతో ఆయన్ని నిజంగా దైవంగా భావించేవారు ఎందరో. కెరీర్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత రెండు షిఫ్టులు మాత్రమే వర్క్‌ చేసేవారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక సినిమాకి, రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మరో సినిమాకు ఆయన పనిచేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకూ ఒకే సినిమాకు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. అవసరం అనుకుంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా వర్క్‌ చేసేవారు.

అయితే భోజన ప్రియుడైన ఎన్టీఆర్‌ ఆహారపు అలవాట్ల గురించి వింటుంటే తమాషాగా అనిపిస్తుంది. నిత్యం తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేచే ఆయన యోగాసనాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, బ్రేక్‌ ఫాస్ట్‌ చేసే వారు. రోజూ 24 ఇడ్లీలు అవలీలగా తినేవారట. అలాగని అవేమీ చిన్న సైటు ఇడ్లీలు కావు. అరచేతి మందాన ఉండేవట. కొంత కాలం తర్వాత ఇడ్లీలు తినడం మానేసి పొద్దునే భోజనం చేసేవారు. అయితే రోజూ నాన్‌ వెజ్‌ ఐటెం ఏదొకటి ఆయన భోజనంలో ఉండాల్సిందే. ఆరు గంటల కల్లా మేకప్‌ వేసుకుని రెడీగా ఉండేవారు. నిర్మాత వచ్చి ఆయన్ని షూటింగ్‌ స్పాట్‌కు తీసుకెళ్లేవారు. చెన్నైలో ఉంటే తప్పనిసరిగా భోజనానికి ఇంటికే వెళ్లేవారు. అరగంటలో లంచ్‌ పూర్తి చేసుకుని, రెండు గంటలకు మరో షూటింగ్‌కు అటెండ్‌ అయ్యేవారు. షాట్‌ గ్యాప్‌లో ఆపిల్‌ జ్యూస్‌ తాగడం ఎన్టీఆర్‌కు అలవాటు. రోజుకు నాలుగైదు బాటిల్స్‌ తాగేవారు. ఇక ఈవెనింగ్‌ స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్స్‌ కానీ, మిరపకాయ బజ్జీలు కానీ ఉండాల్సిందే. ఆయన ఒక్కసారే 30-40 బజ్జీలు తింటుంటే మిగిలిన వాళ్లంతా అలా నోళ్లు తెరుచుకుని చూస్తుండేవారట.

మద్రాసు మౌంట్‌ రోడ్‌లో బాంబే హల్వా హౌస్‌ అనే షాప్‌ ఉండేది. అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్‌ తీసుకురమ్మనేవారు ఎన్టీఆర్‌. దాంతో పాటు రెండు లీటర్ల బాదం పాలు కూడా తెమ్మనేవారు. ఇంత పెద్ద డబ్బాలో తీసుకువస్తే వాటిని తినేసి 2 లీటర్ల బాదం పాలు తాగేవారటర. ఎంత తిన్నా హరాయించుకునే శరీరం కావడంతో ఎన్టీఆర్‌ ఆహారపు అలవాట్లు ఎదుటివారికి వింతగా అనిపించేవి. ఇక సమ్మర్‌ వస్తే చాలు మధ్యాహ్నం లంచ్‌కు వెళ్లేవారు కాదు ఎన్టీఆర్‌. మామిడి పళ్ల జ్యూస్‌ మాత్రం తాగి సరిపెట్టుకునేవారు. టీ నగర్‌లో మామిడి పళ్లు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆయనే చెప్పేవారు. రెండు డజన్ల మామిడి పళ్లు తెప్పించేవారట నిర్మాత. తన అసిస్టెంట్‌తో ఆ మామిడి పళ్లు రసం తీయించి, అందులో గ్లూకోజు పౌడర్‌ కలుపుకొని జ్యూస్‌ మొత్తం తాగేసేవారు. వేసవిలో ఇదే ఆయనకు లంచ్‌. మధ్యలో కొంత కాలం కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం, వెల్లుల్లి కలిపి బాగా దంచి, ముద్దగా చేసి వెండి బాక్స్‌లో ఇంటి నుంచి ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పంపేవారు. షాట్‌ గ్యాప్‌లో ఆ ముద్ద తినేవారు ఎన్టీఆర్‌. ఇలా తన సినిమాలతోనే కాదు తన ఆహారపు అలవాట్లతోనూ ఎదుటివారిని ఆకట్టుకునేవారట నందమూరి తారక రామారావు.


ఓటీటీలోకి సత్యదేవ్ ‘స్కైలాబ్’.. ఎప్పటి నుంచి అంటే…

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ‘స్కైలాబ్’. 1979లో అంతరిక్ష పరిశోధనా శాల నుంచి ‘స్కైలాబ్’ భూమిపై పడనుందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ కామెడీ సినిమా తెరకెక్కింది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ సొంత నిర్మాణ సంస్థ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇప్పుడీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయింది. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా ‘స్కైలాబ్’ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆ మేరకు సోనీ లివ్ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించారు. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.


ఆ శివలింగాన్ని క్రైస్తవులూ ఆరాధిస్తారు.. ఎందుకో తెలుసా..? ఎక్కడ ఉందంటే..

భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్‌లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా భక్తులే. అయితే ఓ దేశం లో.. కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. ఈ దేవాలయం ఎక్కడ ఉందొ.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూరప్ ఖండంలోని ఐర్లాండ్ దేశంలో ఈ శివాలయం ఉంది. అయితే.. ఈ శివాలయం ఇక్కడకు ఎప్పుడు.. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ లింగోద్భవం ఇప్పటికీ అంతు తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. ఓ కొండపై ఈ శివలింగం ఉంది. చుట్టూ ఇటుకలు గుండ్రని ఆకారంలో పేర్చబడి ఉన్నాయి. లియా ఫాయిల్‌గా పిలవబడే లింగాన్ని అక్కడి వారు పరమ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతి పురాతన లింగంగా వెలుగొందుతున్న ఈ విగ్రహాన్ని క్రైస్తవులు పునరుత్పత్తికి చిహ్నంగా భావిస్తూ కొలుస్తున్నారు.

ఈ లింగం గురించి ” మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్” అనే గ్రంధం లో కూడా చెప్పబడి ఉంది. అక్కడి చారిత్రాత్మక కధనం ప్రకారం.. క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య కాలం లో త్వాతా డి డానన్ అను వ్యక్తి తీసుకొచ్చాడని ప్రతీతి. త్వాతా డి డానన్ అనే వ్యక్తిని డాను అనే దేవత యొక్క కొడుకుగా అక్కడివారు చెప్పుకుంటారు. ఈ దేవత గురించిన ప్రస్తావన మన గ్రంధాలలో కూడా ఉంటుంది. కశ్యప ముని, అతని భార్య దక్షలకు జన్మించిన కూతురే డాను అని చెప్తుంటారు. డాను అంటే జలానికి అధిపతి అని అర్ధమట. అలా లియో ఫాయిల్స్ లోని శివలింగానికి , భారతీయ వేద సంస్కృతిలో వర్ణించబడ్డ శివుడికి సంబంధం ఉన్నదని అక్కడి కధనం. వారి భాషలో లియా ఫెల్ అంటే అదృష్ట శిల అని అర్ధమట. ఈ రాయిని నాశనం చేయాలనీ ఎన్నోసార్లు ప్రయత్నించినా ఎవరితరం కాలేదట. 2012, 2014 లోను కూడా ఈ లింగంపై దాడి జరిగిందట. ఈ లింగాన్ని కాపాడాలంటూ స్థానికులు ఐర్లాండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమా వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయయాన్ని నమోదు చేసుకుంది. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం అన్ని భాషల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్‌ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ వరుస పెట్టి వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేసిన కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను మౌనిక యాదవ్‌ అనే ఫోక్‌ సింగర్‌ అద్భుతంగా ఆలపించారు.


ఓటీటీలో ‘అఖండ’… డేట్ ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. బాలయ్య కెరీర్‌లోనూ 100కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

అయితే ముందు ఈ సినిమాను జనవరి 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని జనవరి 21న విడుదల చేయనున్నట్లు తెలిపింది డిస్నీ హాట్‌స్టార్. అఖండ తెలుగు సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందంటూ బాలయ్య అభిమాని ఒకరు ట్వీట్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లై ఇస్తూ అసలు విషయం చెప్పింది. 21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.


టాలీవుడ్‌లో కలకలం… మహేశ్‌బాబుకు కరోనా

సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా నిర్థారించారు. ‘‘నాకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయింది. కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి నాతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి’’ అని మహేష్ బాబు పేర్కొన్నారు.

చివరిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే RRR సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కోసం రాజమౌళి… మహేష్ బాబు సహా సినిమా టీం మొత్తాన్ని సంప్రదించడంతో ఈ సినిమాని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. దీంతో కాస్త సమయం దొరకడంతో మహేష్ బాబు చాలా కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న క్రమంలో దానికి సర్జరీ చేయించుకున్నారు. కాలు నొప్పి తో బాధపడుతున్న ఆయన స్పెయిన్లో సర్జరీ చేయించుకుని దుబాయ్ లో తన వదిన ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కోసం కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. కొంత కాలం పాటు దుబాయ్ లోనే ఉండి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అక్కడే జరుపుకున్న మహేష్ బాబు కుటుంబం తాజాగా హైదరాబాద్ కు వచ్చింది.