Category Archives: Sliders

13వేల అడుగుల ఎత్తులో.. 1100 సంవత్సరాల బొజ్జ గణపయ్య

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తొస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన దండకారణ్యంలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఎక్కువే. బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం విశేషం.

దేశంలో ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నప్పటికీ దట్టమైన అడవుల్లో ఈ వినాయకుడి విగ్రహం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తుంటుంది. కొండ శిఖరాగ్రంలో డోలు లాంటి ప్రదేశంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ వినాయకుడిని దోల్‌కల్ గణేశ్ అని పిలుస్తుంటారు. ఈ విగ్రహం 1100 ఏళ్ల క్రితం నాటిది కావడం విశేషం. నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ. దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ.. దట్టమైన అడవిలో ఉన్న కారణంగా ఆ విగ్రహం గురించి ఇటీవలి వరకూ బయటి ప్రపంచానికి తెలియలేదు.

2012లో స్థానిక జర్నలిస్టు ఒకు దోల్‌కల్ కొండ ఎక్కగా శిఖరాగ్రాన ఆరు అడుగులు ఎత్తైన వినాయకుడి విగ్రహం దర్శనం ఇచ్చింది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి చేరడం అంత తేలికేం కాదు. ముందుగా దంతెవాడ చేరుకొని అక్కడికి 20 కి.మీ. దూరంలో ఉన్న మిడ్‌కుల్నర్ అనే చిన్న గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి 5-7 కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్తే గానీ ఈ ప్రదేశానికి చేరుకోలేం. ఇప్పుడు మావోయిస్టుల సమస్య కొద్దిగా తగ్గింది గానీ.. గతంలో ఇక్కడ మావోల ప్రాబల్యం ఎక్కవగా ఉండేది. గతంలో ఈ విగ్రహం కొండ మీది నుంచి కిందకు పడి ముక్కలైంది. వినాయకుడి విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో.. ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇవన్నీ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయనే ఉద్దేశంతో మావోయిస్టులే ఈ విగ్రహాన్ని కొండ మీద నుంచి కిందకు తోసేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

కొండ మీద విగ్రహం కనిపించడం లేదని ప్రచారం జరగడంతో ఇది చోరీకి గురైందని భావించారు. కొందరు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి విగ్రహం వెతుకులాట ప్రారంభించారు. కొండ కింది ప్రాంతంలో ఈ విగ్రహం ముక్కలు లభ్యమయ్యాయి. దీంతో దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్, కలెక్టర్ సౌరభ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. తర్వాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.

ఏకదంతుడైంది ఇక్కడేనట..
ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో విరిగిన దంతం. కిందిభాగం కుడిచేతిలో రుద్రాక్ష మాల, మరో చేతిలో మోదకాలతో దర్శనమిస్తాడు డోల్‌కాల్‌ గణేశుడు. ఆయుధధారుడై ఉండడం దోల్‌కాల్‌ గణేశుడి ప్రత్యేకత. అక్కడ గణపయ్య లలితాసనంలో కనిపిస్తారు. బస్తర్‌లో తప్ప మరెక్కడా ఆయన ఆ భంగిమలో ఉండరు. బస్తర్‌ ప్రత్యేక నిపుణులు హేమంత్‌ కశ్యప్‌ ప్రకారం.. ఈ డోల్‌కాల్‌ శిఖరంపైనే వినాయకుడు-పరుశరామ్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే గణేశుడి దంతం విరిగింది. అప్పటి నుంచే ఆయనను ఏకదంతుడిగా పిలుస్తున్నారు. ఆ ఘటనకు గుర్తుగా చిండక్‌ నాగవంశానికి చెందిన రాజు గణేశ్‌ విగ్రహమూర్తిని అక్కడ ప్రతిష్ఠించారట..


హైదరాబాద్‌లో ఈ క్షేత్రాలు తప్పక సందర్శించాల్సిందే..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటంతో ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రార్ధనాలయాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ చారిత్రక నగరంలో అనేక హిందూ దేవాలయాలూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని కొన్ని ముఖ్య దేవాలయాల సమాచారం మీకోసం…

బిర్లా మందిర్
హైదరాబాద్ పర్యాటకంలో ప్రముఖంగా చూడదగ్గ ఆలయాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. పదేళ్ల పాటు కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది.

ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ లో ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయం నిర్మించబడడంతో దీనిని బిర్లా మందిర్ అని పిలుస్తారు. బిర్లా మందిర్ పేరుతో దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో వీరు ఆలయాలను నిర్మించారు.

సంఘీ టెంపుల్
హైదరాబాద్‌లో సందర్శించాల్సిన మరో అద్భుతమైన ఆలయం సంఘీ టెంపుల్. ఇది హైదరాబాద్‌ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఉంది. ఈ దేవాలయ పవిత్ర రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీవెంకటేశ్వర స్వామి. ఇక్కడి వెంకన్న విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతిరూపమని ప్రతీతి. ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అనేక చిన్న ఆలయాలు కొలువై ఉన్నాయి. పరమానందగిరి కొండపై ఉన్న సంఘీ ఆలయాల సమూహం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ ఆలయానికి వెళ్లడానికి కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. సంఘీ టెంపుల్‌‌కు సమీపంలోనే ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ఉంది.

జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి

హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేక పాహిమాం.. అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే ఇప్పటి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం.

చిలుకూరు బాలాజీ ఆలయం

హైదరాబాద్‌కు 23 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం ఉంది. అక్కడే కొలువై ఉన్నాడు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. ఆయన్ని అందరూ చిలుకూరు బాలాజీ అని పిలుస్తుంటారు. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. వారాంతాల్లో అయితే ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. విదేశాలకు వెళ్లేవారు చాలామంది వీసా కోసం చిలుకూరు బాలాజీకి మొక్కులు కడుతుంటారు. అందుకే ఆయన్ని ముద్దుగా వీసా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ముందుగా కోరికను మొక్కు కొని 11 ప్రదిక్షణలు చేస్తారు. ఆ కోరిక తీరిన తరువాత 108 సార్లు ప్రదిక్షణలు చేస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఎక్కడా హుండీ అనేది ఉండదు. అంతేకాకుండా స్వామివారి దర్శనానికి ధనిక, పేద అధికార తారతమ్యాలు ఉండవు. అందరు ఒకేవరుసలో నిలబడి దర్శనం చేసుకోవాలి.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ సమీపంలోని బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం కొలువై ఉంది. ఇక్కడి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే అమ్మగా భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది. మంత్ర శాస్రంలో ప్రధానమైన దశమహావిద్యలలో చిన్న మస్తాదేవి ఒకరు. ఆ చిన్నమస్తదేవియే పరశురాముని తల్లి రేణుకాదేవిగా అవతరించింది. ఆ రేణుకాదేవియే నేడు కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతుంది. ఇలా అమ్మవారి రూపాలలో బాలా త్రిపురసుందరి దేవి ఒకరు. ఆ తల్లిని భక్తులు బాలా, బాలాంబిక, బాలాకాంబిక అని పిలుస్తుండేవారు. ఆ బాలికాంబీయే బల్కమ్మగా, ఆ అమ్మ కొలువై ఉన్న ప్రాంతం బల్కమ్మ పేటగా పిలవబడుతూ అది నేటి బల్కంపేటగా మారిందని పూర్వీకులు చెబుతుంటారు.

ఈ ఎల్లమ్మ దేవత బావిలో భూమి ఉపరితలం నుండి సుమారు 10 అడుగుల దిగువన శయనరూపంలో తూర్పుములాగా చూస్తూ స్వయం భూమూర్తిగా భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. అమ్మవారి స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంది. ఈ బావి నుండి ఉధ్భవించే జల ఊట నిరంతరం ఉధ్భవించడం ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణము, ప్రతి ఆషాడమాసం చివరి ఆదివారం నాడు బోనాలు మరియు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడుతాయి. ఎల్లమ్మను దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆదివారం రోజు ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది.

కీసరగుట్ట ఆలయం
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలో కీసరగుట్ట అనే కొండపై నెలకొని ఉంది శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది అతిపురాతనమై శైవక్షేత్రం. ఆలయంలోనే కాకుండా వెలుపల కొండపై అనేక శివలింగాలు దర్శనమీయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. కీసరగుట్టపై ప్రతిష్ఠించేందుకు శివలింగాన్ని తీసుకురావాలని శ్రీరాముడు తన భక్తుడైన హనుమంతుడికి చెబుతాడు. అయితే ఆంజనేయుడు ముహూర్త సమయానికి రాకపోవడంతో రాముడు మరొక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు. అయితే తాను తెచ్చిన లింగాన్ని కాకుండా వేరేది ప్రతిష్ఠించడంతో హనుమంతుడు అలుగుతాడు. దీంతో రాముడు.. హనుమంతుడిని బుజ్జగిస్తూ ఈ క్షేత్రం భవిష్యత్తులో కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదిస్తాడు. అనంతరం హనుమంతుడు తెచ్చిన లింగాల్లో ఒక దాన్ని స్వామివారి వామ భాగంలో ప్రతిష్ఠించాడు. అదే శ్రీ మారుతీ కాశీ విశ్వేశ్వర లింగమని భక్తులు చెబుతుంటారు. ఈ శైవక్షేత్రం హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కీసరగుట్టకు బస్సు సౌకర్యం కలదు.

అష్టలక్షి ఆలయం
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో కొత్తపేటలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఈ ఆలయం కోఠి నుంచి 8 కి.మీ, సికింద్రాబాద్ నుంచి 14కి.మీ.ల దూరంలో ఉంది. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దాని చుట్టూ మరో ఏడు గర్భాలయాలు ఉన్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ, వరద ముద్రలో దివ్యాలంకార శోభితులై భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంకా మిగతా ఏడు గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధ్యానలక్ష్మి, శ్రీవిజయలక్ష్మి, శ్రీవీరలక్ష్మి, శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వలన స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని, అష్టైశ్వర్యాలు సిద్డస్తాయని శాస్త్ర వచనం.

పూరీ జగన్నాథ్ ఆలయం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పూరీ జగన్నాథ ఆలయం ఉంది. ఈ దేవాలయం దేశంలోని ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయాన్ని పోలి ఉండటం విశేషం. అక్కడికి వెళ్తే నిజంగానే పూరీకి వచ్చామా అన్న భావన కలుగుతుంది. ఈ ఆలయంలో బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. నగర ప్రజలతో పాటు పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శించే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.

దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న సాయిబాబా ఆలయం భక్తులను ఆకర్షిస్తుంటుంది. షిర్డీలోని బాబా ఆలయాన్ని పోలి ఉండేలా ఇక్కడ నిర్మించడం విశేషం. అందుకే దీన్ని దక్షిణ షిర్డీగా పిలుస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నప్పటికీ ఈ గుడిని భక్తులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం వరకు చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు వేలాది మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా మారిపోయింది.


గోదాదేవి ఎవరు.. భోగి రోజున కళ్యాణం ఎందుకు చేస్తారు?

దివ్యస్వరూపం సాధారణమైనది కాదు. ఎన్ని అవతారాల్లో చూసినా, ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదు. శాశ్వతంగా అయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతముండదు. అదే సాధించిన ఓ భక్తురాలు. మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాథునిగా చేసుకుంది. ఆవిడే గోదాదేవి. ఏటా మకర సంక్రాంతి నాడు గోదాదేవి కళ్యాణం జరుపుతుంటారు. అసలు ఎవరీ గోదాదేవి?

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే – పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే – పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజున జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.


ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ఎందుకింత విశిష్టత?

హిందూ మతంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా విష్ణువుకు మాత్రమే పరిమితమైన ధనుర్మాసం దాని చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. పుష్య నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసాన్ని శనికి సంబంధించినది కాబట్టి శూన్యమాసం అంటారు. ప్రాపంచిక, ధనుర్మాసం ప్రకారం, ధనుర్మాసాన్ని శూన్యమాసం లేదా కర్మగా పరిగణిస్తారు. ధనుస్సు రాశిని కొన్ని ప్రాంతాలలో అరిష్టంగా పరిగణిస్తారు. మన హిందూ క్యాలెండర్‌ను ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయ పుణ్యకాలంగా విభజించారు. మన వయస్సు ,దేవదూతల కాలక్రమం మధ్య వ్యత్యాసం ఉంది. దేవదూతల ఒక రోజు మనకు ఒక సంవత్సరం. ఈసారి ధనుర్మాసం 2021 డిసెంబర్ 16న ప్రారంభమై 2022 జనవరి 13న ముగుస్తోంది.

సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడము అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్‌ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళ కరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది.

ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యా వందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి.

ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గులతో కనుల విందుగా వుంటాయి.

ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంభారాలతో పల్లెలు “సంక్రాంతి “పండుగ కోసం ఎదురుచూస్తూ వుంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మ హూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వ్రచనం.


‘బంగార్రాజు’ టీజర్ అదరహో.. సంక్రాంతికి వచ్చేస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సోగ్గాడే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఘనవిజయంతో సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు దాన్ని సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేసాడు నాగార్జున. అంటే ముందు జరిగే కథ అన్నమాట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అప్పుడే చేసినా అది పట్టాలెక్కడానికి ఐదేళ్ళు పట్టింది. మూడేళ్లుగా ఇప్పుడు అప్పుడూ అంటూ వాయిదా పడుతున్న బంగార్రాజు సంక్రాంతికి వచ్చేస్తున్నాడు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా జంటగా నటిస్తున్నారు.

న్యూ ఇయర్ కానుకగా చిత్ర యూనిట్ శనివారం టీజర్ విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ను మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలే కాక యాక్షన్, డివోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య కూడా తండ్రి లాంటి క్యారెక్టర్‌తో అదరగొట్టేశాడు. ఇక కృతి శెట్టి చాలా క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో కృతిశెట్టి గ్రామ సర్పంచ్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నాగార్జునకి, నాగ చైతన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో మాత్రం టీజర్ లో రివీల్ చేయలేదు.


ఫ్యాన్స్‌కి మంచి కిక్… భీమ్లానాయక్ డీజే సాంగ్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 31కి ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే డీజే సాంగ్ ను వదిలింది. ఇటీవల రిలీజైన “లా లా భీమ్లా” పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో శుక్రవారం డీజే వెర్షన్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటను రాయగా..అరుణ్ కౌండిన్య పాడగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న భీమ్లానాయక్ ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.


కిన్నెరసాని ట్రైలర్: ఆకట్టుకుంటున్న మెగా అల్లుడు

‘విజేత’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్.. ‘కిన్నెరసాని’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన కిన్నెరసాని ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్రవిజయ్‌ కీలకపాత్ర పోషించారు. ‘నీ ముందు ఉన్న సముద్రపు అలల్ని చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్‌. కానీ, సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా అంతే’ అంటూ కథానాయిక అన్‌ షీతల్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కల్యాణ్‌దేవ్‌, రవీంద్ర విజయ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘ఒకే ఒక జీవితం’ టీజర్… శర్వానంద్ హిట్ కొట్టేలా ఉన్నాడు

టాలెంటెడ్ హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీ కార్తీక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా టైమ్‌ మెషీన్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. స్నేహితులైన శర్వానంద్‌, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌ భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి రావటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తల్లీకొడుకుల అనుబంధం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది….

ఈ చిత్రాన్ని ఎస్‌. ఆర్‌. ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదలకానుంది. ఈ సినిమాకి జేక్స్‌ బిజోయ్‌ స్వరాలందిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శిల నటన మరోసారి హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఈ టీజర్ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని శర్వానంద్.. ఈ చిత్రంతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడనే భరోసా ఇస్తుంది ఈ టీజర్. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..


Pushpa: ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ రిలీజ్

అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప చిత్రంలోని తొలి సాంగ్‌ ‘దాక్కో దాక్కో మేక’ ఫుల్ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఫుల్‌సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలను చంద్రబోస్‌ రాయడం విశేషం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా ‘పుష్ప’ నిలిచింది.


‘యశోద’లో సమంత రోల్‌పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. కెరీర్‌లో తొలిసారి అలా…

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. లేటెస్ట్ గా ‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో సైతం సమంత కథానాయికగా నటిస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సామ్ తాజాగా కమిట్ అయిన తెలుగు సినిమా ‘యశోద’. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కథ వినగానే బాగా ఎగ్జైట్ అయిన సమంత ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా కథలో భాగంగా వస్తాయి. అయితే ఇందులో సమంత పోషించే పాత్ర ఏంటనే విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం యశోద చిత్రంలో సమంత నర్స్‌గా నటిస్తోందని టాక్. హీరోయిన్ సెంట్రిక్ స్టోరీ కాబట్టి.. ఆమె పాత్రకి సినిమాలో చాలా ప్రధాన్యత ఉంటుందని అర్ధమవుతోంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు రూపొందిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్నిముకుందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, కల్పిక గణేశ్ , సంపత్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.