Category Archives: Sliders

బిగ్‌బాస్ సీజన్-5: యాంకర్ రవికి కళ్లుచెదిరే రెమ్యునరేషన్!

బిగ్‏బాస్ – 5 సీజన్ ఇప్పటికి 12వారాలు పూర్తిచేసుకుంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ యాంకర్ రవి హౌస్ నుంచి ఇంటికొచ్చేశాడు. అయితే టాప్ కంటెస్టెంట్స్‏లో ఒకరిగా ఉన్న రవి… అలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ కావడంతో అంతా షాకయ్యారు. సిరి, ప్రియాంక కంటే ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయో చూపించాలంటూ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. మరోవైపు రవి ఎలిమినేట్ కావడానికి గల ఏంటీ అని ఆరాతీస్తున్నారు.

ఇక మరోవైపు రవి రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది. రవిని ఇలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ చేయడానికి తన రెమ్యునరేషన్ కూడా ఒక కారణమంటూ వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో రవి మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట. వారానికి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. అంటే రవి 12 వారాలకు దాదాపు రూ. 80 లక్షల నుంచి రూ. 96 లక్షల వరకు తీసుకుంటున్నట్లుగా టాక్. అంటే బిగ్‏బాస్ విజేతకు అందించే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ కావడం విశేషం..

అలాగే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‏లో టాప్-5లోకి రావడానికి ఎక్కువగా అబ్బాయిలే ఉండడంతో ఈసారి ఒక అమ్మాయిని పంపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రవిని ఎలిమినేట్ చేసారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి యాంకర్ రవి ఎలిమినేషన్ మాత్రం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ వాదిస్తున్నారు. గతంలో ఏ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌కు రాని వ్యతిరేకత రవి విషయంలో రావడం గమనార్హం. ఈ వ్యవహారం ఏకంగా రాజకీయ రంగు కూడా పులుముకోవడం విశేషం. బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని నిషేధించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్‌ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు కొద్దిరోజులకే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి డిసెంబర్‌ మొదటి వారంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో తెలుసుకుందామా…

అఖండ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 2న థియేటర్లలో విడుదలవుతోంది.

స్కైలాబ్‌
సత్యదేవ్‌, నిత్యమీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్‌ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్‌ 4న విడుదలకానుంది.

బ్యాక్‌ డోర్‌
పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బ్యాక్‌ డోర్‌. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 3న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరక్కార్‌: అరేబియన్‌ సముద్ర సింహం
మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్‌: అరేబియన్‌ సముద్ర సింహం. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్‌, కీర్తి సురేశ్‌, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

తడప్‌
తెలుగులో సంచలన విజయం సాధించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ తెలుగులో ‘తడప్’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్‌. మిలాన్‌ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 3వ తేదీన రిలీజ్ అవుతోంది.

ఓటీటీలో వచ్చే చిత్రాలివే

నెట్‌ఫ్లిక్స్‌

  • ద పవర్‌ ఆఫ్ ది డాగ్‌ (హాలీవుడ్‌) – డిసెంబర్‌ 1
  • లాస్‌ ఇన్‌ స్పేస్‌ (వెబ్‌ సిరీస్‌) – డిసెంబర్‌ 1
  • కోబాల్ట్‌ బ్లూ (హాలీవుడ్‌) – డిసెంబర్‌ 3

ఆహా

  • మంచి రోజులు వచ్చాయి (తెలుగు) – డిసెంబర్‌ 3

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ (హిందీ వెబ్‌సిరీస్‌) – డిసెంబర్‌ 3

జీ5

  • బాబ్‌ విశ్వాస్‌(హిందీ) – డిసెంబర్‌ 3


శివశంకర్ మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోయాయి.

డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్‌ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్‌ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు.



సినిమా చూసి రిక్షా ఎక్కిన కనకదుర్గమ్మ.. 1955లో విజయవాడలో యదార్థ సంఘటన

విజయవాడ కనకదుర్గమ్మకు పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా కొలువై ఉండేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుందని చెబుతుంటారు. దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి అమ్మవారి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది. ఈ కోవలోనే 1955లో జరిగిన యదార్థ గాథ ఇది..

1950 కాలంలో విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. కాయ కష్టం చేసుకుంటూ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవాడు. 1955లో ఏఎన్నార్, వహీదా రెహ్మాన్ జంటగా నటించిన ‘రోజులు మారాయి’ సినిమా విడుదలైంది. రిక్షా కార్మికుడైన వెంకన్న రాత్రివేళ మారుతి టాకీస్ వద్ద ఉండేవాడు. చివరి ఆట చూసిన ప్రేక్షకులెవరైనా రిక్షా కావాలని అడిగితే వారిని ఎక్కించుకుని గమ్యస్థానంలో దించేవాడు. ఈ ఏడాది ఓ రోజు అర్ధరాత్రి ఆట ముగిసిన తర్వాత వెంకన్న ఎప్పటిలాగే మారుతి టాకీస్‌ వద్ద నిలబడి ఉన్నాడు.

అప్పుడు ఓ పెద్దావిడ ఎర్రటి చీర ధరించి నుదుటిన పెద్దబొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలని అతడు అడగ్గా ఇంద్రకీలాద్రి వద్ద దించమని చెప్పింది. వెంకన్న రిక్షా తొక్కుతుండగా ఆ పెద్దావిడ అతడితో మాట కలిపింది. ‘రాత్రి వేళ మొత్తం చీకటిగా ఉంది.. దుర్గమ్మ ఈ సమయంలో గ్రామ సంచారానికి వస్తుందని విన్నాను. నీకు భయం వేయడం లేదా?’ అని అడిగింది. దానికి సమాధానంగా.. ఆవిడ మా తల్లి… అమ్మ దగ్గర బిడ్డలకు భయమెందుకు? అని ఢిల్లీ వెంకన్న సమాధానమిచ్చాడు. ఇంద్రకీలాద్రి వద్దకు రాగానే రిక్షా ఆపిన వెంకన్న.. ఏ ఇంటికి వెళ్లాలమ్మా? అని వెనక్కి తిరిగి చూడగా ఆ పెద్దావిడ కనిపించలేదు. దీంతో అతడు మెట్ల వైపు చూడగా ఆవిడ పైకి నడుచుకుంటూ కనిపిస్తుంది. డబ్బులివ్వకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా అని రిక్షావాడు అడగ్గా.. డబ్బులు నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. దీంతో అతడు తలపాగా తీసి చూడగా… అందులో బంగారు గాజు, రూ.10ల నోటు కనిపించాయి. వాటిని తీసుకుని వెంకన్న మెట్లవైపు చూడగా ఆవిడ అదృశ్యమైంది.

దీంతో తన రిక్షా ఎక్కింది.. అమ్మలగన్నఅమ్మ.. కనకదుర్గమ్మే అని నిర్ధారించుకున్న వెంకన్న.. అమ్మా అంటూ వెర్రికేకలు వేయడం ప్రారంభించాడు. దీంతో నిద్రలేచిన చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని ఏం జరిగిందని అడగ్గా.. అసలు సంగతి చెబుతాడు. ఈ విషయం బ్రాహ్మణ వీధిలో ఉండే అమ్మవారి ఉపాసకుల చెవిన పడింది. వారు ధ్యానం చేసి వచ్చింది కనకదుర్గమ్మే అని నిర్ధారించారు. ఈ సంఘటన అప్పటి ‘ఆంధ్రకేసరి’ అనే వార్తాపత్రికలో గాజు ఫోటోతో సహా ప్రచురితమైంది. దుర్గమ్మ రాత్రివేళల్లో నగరంలో సంచరిస్తుటుందని బెజవాడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ వార్త కొంతకాలంగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


రోజూ అరగంట నడిస్తే చాలు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం లేదు. తరుచూ వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారి తీయొచ్చని, దాని కారణంగా అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలామంది టైమ్ లేదంటూ వ్యాయామాన్ని పట్టించుకోరు. అలాంటివారికి నడక చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ కాస్త సమయం నడిస్తే స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఊబకాయం సమస్యతతో బాధపడుతున్న వారు రోజూ ఉదయం, సాయంత్రం 30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. రోజూ నడవడం వల్ల మీ శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఉత్సాహం రెట్టింపవుతుంది. నిత్యం క్రమం తప్పకుండా ఓ అరగంట పాటు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి నుంచి ఉపశమనం
ఈ రోజుల్లో ఒత్తిడి కూడా పెను సమస్యగా మారుతోంది. ఒత్తిడి వల్ల ఊబకాయం, మెదడు సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అయితే క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

హై బీపీ కంట్రోల్
హై బీపీ, కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. హైబీపీ ఉన్నా, శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నట్లు అనిపించినా క్రమం తప్పకుండా నడవడం మంచింది. ఈ ప్రక్రియ వల్ల హైబీపీ కంట్రోల్ కావడమే కాకుండా కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది
ప్రస్తుతం 30 ఏళ్లలోపు యువతలోనూ ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ సమస్య వెంటాడుతోంది. బోలు ఎముకల వ్యాధి సమయంలో పగుళ్లు ప్రమాదం పెరుగుతుంది. దీనితో పాటు, భవిష్యత్తులో మోకాలు, తుంటి దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అయితే క్రమం తప్పకుండా నడిచేవారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ కంట్రోల్..
షుగర్‌ పేషెంట్లకు నడక ఎంతో మేలు చేస్తుంది. మధుమేహానికి దీన్ని సరైన ఔషధంగా చెబుతుంటారు. ఏదైనా వ్యాధి కారణంగా లేదా వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి నడక ఎంతో మేలు చేస్తుంది.


పొద్దు తిరుగుడు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు.. వీటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు

పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మంది ఈ విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటారు. ఈ నలుపు రంగు విత్తనాలు ఈ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

గుండె ఆరోగ్యం కోసం
చలికాలం హృద్రోగులకు కష్టాలను పెంచుతుంది. ఈ పరిస్థితిలో పొద్దుతిరుగుడు విత్తనాలు వారి అన్ని సమస్యలను పరిష్కరిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తనాళాలు విస్తరించి రక్త ప్రసరణ మెరుగపడుతుంది. ఇవి హై బీపీని నియంత్రిస్తాయి. ఈ విత్తనాలలో ఫ్లేవనాయిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒలీక్, లినోలిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ విత్తనాలు ఎల్‌డిఎల్.. అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మధుమేహం కోసం
మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దుతిరుగుడు విత్తనాలను చిరుతిండిగా తినవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ఈ విత్తనాలను తినాలి. పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్, సెలీనియం మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి.

బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ వ్యక్తికైనా చాలా ప్రమాదకరం. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ సందర్భంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది.

బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ
ఈ విత్తనాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. ఈ గింజల్లో పుష్కలంగా కొవ్వులు, మినరల్స్, విటమిన్లు, ప్రొటీన్లు, విటమిన్ ఈ, బి-కాంప్లెక్స్, మెగ్నీషియం వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి ఆస్టియోపోరోసిస్ నుంచి రక్షిస్తాయి.


పూజలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దేనికి సంకేతం..?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏదో అనర్థం జరుగుతుందని భయపడిపోతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా?.. అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?.. ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా పగలకపోయినా, చెడిపోయినా మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. అయితే కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా..చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో ‘పువ్వు’ వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ, కోడలు గానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం.

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే ఆ కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ పక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. అయితే ఇందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభిస్తే దోషం పోయినట్లే. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది.

భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడని పండితులు చెబుతున్నారు.


ఏపీ ప్రభుత్వం వల్ల పవన్ సినిమాకు భారీ నష్టం?.. ఎన్ని రూ.కోట్లంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు.. విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. సాగర్ కె.చంద్ర ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే సమయంలో విడుదల కానుండటంతో ‘భీమ్లా నాయక్’‌ విడుదల తేదీ మార్చాలని పవన్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకు 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఏపీలో టికెట్ రేట్ల తగ్గించడంతో ఆ ఏరియాకు తక్కువ ధరకే హక్కులు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ‘భీమ్మా నాయక్’ నిర్మాతలకు సుమారు రూ.10కోట్ల వరకు ఆదాయం తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


శ్రీదేవి కూతురుతో ఎన్టీఆర్ రొమాన్స్.. వాట్ ఎ కాంబినేషన్!

యంగ్ టైగర్ యన్టీఆర్, కొరటాల శివ కలయికలోని రెండో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. #NTR30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సందేశం అందించేదిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ విషయమై కొంతకాలంగా రూమర్స్ గుప్పుమంటున్నా యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిరోజులుగా కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపించగా… తాజా సమాచారం ప్రకారం ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్‌‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త నందమూరి అభిమానులతో పాటు శ్రీదేవి అభిమానులను ఖుషీ చేస్తోంది. నిజానికి జాన్వీని సౌత్ నుంచే హీరోయిన్‌గా పరిచయం చేయాలని శ్రీదేవి అనుకున్నా సాధ్యం కాలేదు. కొరటాల శివ సినిమాతో అది ఇన్నాళ్ళకు సాధ్యం కానుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ స్ర్కిప్ట్ వర్క్ మీద ఉన్నారని సమాచారం. యన్టీఆర్ సూచించిన స్వల్ప మార్పుల్ని సవరిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. జనతా గ్యారేజ్ యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.