Category Archives: Sliders
- November 18, 2021
-
-
-
-
‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చేశాడు.. అదరగొడుతున్న టీజర్
Category : Behind the Scenes Movie News Sliders Trailers
అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ..’శ్యామ్ సింగ రాయ్’ అంటూ టీజర్‌తో వచ్చేశాడు నాని. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా ఈ సినిమా టీజర్ వచ్చి ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.
డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే మేకర్స్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సినిమాకు హైలెట్‌గా నిలవబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో నానికి సాలీడ్ హిట్ దక్కలేదు. దీంతో ‘శ్యామ్ సింగ రాయ్’ తో నాని హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..
-
-
కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం.. ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి
Category : Behind the Scenes Pic of the day Sliders Spiritual Top Trending
అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కావడంతో హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ నెలలో కార్తీక పౌర్ణమికి ఎంతో ‘ప్రాశస్త్యం’ ఉంది. ఇక కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. కార్తీక మాసంలో నెలరోజులు పూజ చేయడం ఒకెత్తయితే.. పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు, పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణం విశిష్టమైన అంశం. ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనబడదు. పౌర్ణమి రోజు రాత్రి శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు. దీనిని యమద్వారం అని అంటారు. అనంతరం..ఈ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.
జ్వాలా తోరణము పదం పురాణ ప్రసిద్ధమైంది. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలం ఉద్భవించగా.. దాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషాన్ని కంఠ మధ్యలో నిక్షేపించాడు. అప్పుడు పార్వతీ దేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుందట. ఈ పురాణ కథ నేపథ్యంలోనే ఏటా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండు గడ్డితో చేసిన చేసిన తోరణాన్ని జ్వాలగా వెలుగిస్తుంటారు. ఆ జ్వాల క్రింది నుంచి శివపార్వతుల పల్లకీని మూడు సార్లు తీసుకొని వెడతారు.
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.
-
-
అగ్ని లింగేశ్వరుడి నిలయం… అరుణాచలం, అబ్బురపరిచే గిరి ప్రదక్షిణ
Category : Behind the Scenes Sliders Spiritual
ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్‌మాండ్‌లో యజమాన లింగం.
తమిళనాడులోని అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనని చెబుతారు.
పురాణ గాథ..
పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం పెరిగి కలహానికి దారితీసిందట. ‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట. వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట.
బ్రహ్మకు శివుడి శాపం
ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట. ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట.
‘మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూ లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ. ఆ తర్వాత అగ్ని రూపం పర్వతంగా మారింది. అదే అణ్ణామలై. శివుడికి వున్న అనేక నామాల్లో అణ్ణాల్ అనే పేరుకూడా ఒకటి. అణ్ణాల్ అంటే అగ్ని, ప్రకాశం తదితర అర్ధాలున్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండూకలిసి అణ్ణాల్ మలై, కాలక్రమేణా అణ్ణామలై అయింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవసూచకం. సాక్షాత్తూ శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవచిహ్నం తిరు ముందు చేరి తిరువణ్ణామలైగా ప్రసిధ్ధిపొందింది.
శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరివల్ల సాధ్యం కాదని, పర్వత పాదంలో అర్చా స్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా, శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మిచవలసినదిగా బ్రహ్మ, విష్ణులు దేవ శిల్పి మయుణ్ణి కోరారు. మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్య తీర్ధాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. ఇది అప్పటి సంగతి. తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం వున్న ఆలయం భక్తులను తరింపచేస్తోంది.
పరమ సత్యమైన క్షేత్రం
అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి.. ఏ ఆలయాలు ఉండాలి.. ఏ పూజలు చేయాలి.. అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాల భైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అబిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పాతాళ లింగ కూడా ఉంటాయి. అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుతిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారని చెబుతారు.
అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది. అందుకు సంబంధించి కొన్ని కథలూ ప్రచారంలో ఉన్నాయి. తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని అమ్మణి అమ్మన్ అనే మహిళ కట్టించారట. పరమశివుడి అనుగ్రహం వల్ల యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతీ ఇంటికి వెళ్లి ‘గోపురం కడుతున్నాం దానం చేయండి’ అని అర్థించేవారట. డబ్బులు లేవు అని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి.. అందులో ఎంత సొమ్ము ఉన్నదీ చెప్పేసేవారట. దీంతో భయపడి విరాళం ఇచ్చేవారని వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతుంటారు.
గిరి ప్రదక్షిణ
అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది, చేయాల్సినది గిరి ప్రదక్షిణ. ప్ర- పాప సంహారం, ద- కామ్య సిద్ధి, క్షి-జన్మ రాహిత్యం, ణ-జ్ఞాన మార్గంలో ముక్తి. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కి.మీ. దీనిని చెప్పులు లేకుండా చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునేవారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కనుక దీనిని సుదర్శనగిరి అని కూడా అంటారు. అరుణాచలం ఒక బ్రహ్మానందనిలయం. కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు. కొండ అంతా నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు, సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం వుండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా వుంటుంది.
గిరి ప్రదక్షిణను శ్రీ రమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గణేశ ఆలయం, అగస్త్యతీర్థం, ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగ, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరుతి లింగ, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్ర మఠం, ప్రతిధ్వనిమండపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం, ఈశాన్య లింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శోద్రిస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి ఆలయం మీదుగా కొనసాగిస్తారు. వీటితో పాటు కొండపై ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాదతీర్థం, గురు నమశ్శివాయ సమాధి, రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమాలను దర్శించుకోవచ్చు.
అరుణాచలం ఇలా చేరుకోవచ్చు..
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తిరువణ్ణామలైకి 4-5 గంటల ప్రయాణం. తిరుపతి నుంచి రైలు సర్వీసులు ఉన్నాయి. తిరువణ్ణామలై రైల్వేస్టేషన్ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు, ఆటోలు ఉంటాయి. బస్టాండ్‌కు దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది. అరుణాచలేశ్వరాలయం నుంచి రమణాశ్రమం 2 కి.మీ. దూరం ఉంటుంది.
ఆలయ దర్శన వేళలు
తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం.కు వరకూ ఆలయ ప్రవేశం ఉంటుంది. తిరిగి సాయంత్రం 4గం.కు తెరుస్తారు. రాత్రి 9గం.కు మూసివేస్తారు. పౌర్ణమిరోజున రాత్రివేళ అందరికీ దర్శనమయ్యే వరకూ ఆలయం తెరిచే ఉంచుతారు.
- November 17, 2021
-
-
ముగ్గురు హీరోల చేతిలో 16 సినిమాలు.. ఇది అరాచకం
లాక్‌డౌన్ తెలుగు సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. షూటింగులు ఆగిపోవడం, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమాలు థియేటర్లు మూతపడటంతో నెలలపాటు ల్యాబ్‌కే పరిమితమయ్యాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నా టాలీవుడ్‌లో ఇదివరకటి సందడి లేదనే చెప్పాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టాలీవుడ్‌లో వరుసగా పెద్దపెద్ద సినిమాలు తెరకెక్కడం చర్చనీయాశంగా మారింది. సీనియర్, యంగ్ హీరోలు గతంలో కంటే స్పీడుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో రెండు మూడు కథలకు ఓకే చెప్పి, వాటినీ సమాంతరంగా పట్టాలెక్కించేందుకు అగ్ర కథానాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహరాజ్ రవితేజ చేతిలోనే ఏకంగా 16 సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సినిమాల్ని ఒప్పుకోవడంలో ఈ ముగ్గురి రూటే సెపరేటు. ‘ఒకదాని తరవాత మరోటి’ అనే చందాన కథల్ని ఒప్పుకునే ఈ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం, అవి చిత్రీకరణ దశలో ఉండగానే మరిన్ని కథలు సిద్ధం చేసుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్ని ఇస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. 2022 ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కానుంది. ‘ఆచార్య’ పనులు ఇంకా మిగిలి ఉండగానే, ‘గాడ్ ఫాదర్’కి కొబ్బరికాయ కొట్టారు చిరు. ఇటీవలే ‘భోళా శంకర్’ పనులూ మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితమే బాబి సినిమాకి క్లాప్ కొట్టారు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఇవన్నీ సెట్స్‌పై ఉండగానే చిరంజీవికి మారుతి ఓ కథ వినిపించాడని టాక్ నడుస్తోంది. మారుతి కూడా ‘చిరంజీవిగారితో ఓ సినిమా ఉంటుంది. ఇప్పటికే లైన్ వినిపించేశా. పూర్తి స్థాయి కథని సిద్ధం చేయాలి’ అని చెప్పేశారు. మరోవైపు త్రివిక్రమ్ సైతం చిరుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే చిరంజీవి చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి.
మరోవైపు ‘క్రాక్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడు కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన ‘ఖిలాడి’ రిలీజ్ కి రెడీకాగా.. ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’, ‘రామారావు ఆన్ డ్యూటీ’… సినిమాలు లైన్‌లో ఉన్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా… కొత్త సినిమాలు ఒప్పుకోవడమే కాదు, సినిమా సినిమాకీ ఆయన పారితోషికం పెరుగుతూనే ఉందన్నది ట్రేడ్ వర్గాల టాక్.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా బిజీగా మారిపోయారు. ఆయన ఊ అంటే చాలు అడ్వాన్సులు చేతిలో పెట్టడానికి అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత క్రేజీ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో ఈ సంక్రాంతికి రానున్నాడు. ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ పూర్తి చేయనున్నాడు. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’పై కూడా భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్‌కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కొత్త కథలు వినిపించడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నా బిజీ షెడ్యూల్ వల్ల ప్రభాస్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
-
-
వామ్మో.. 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు లాగించేశారు
మనం మామూలుగా 3 నిమిషాల్లో ఎన్ని ఇడ్లీలు తినగలం.. మహా అయితే 2-3 మించి తినలేం కదా.. అయితే తమిళనాడులో జరిగిన ఇడ్లీ పోటీలో మాత్రం ఇద్దరు వ్యక్తులు కేవలం 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు చొప్పున ఆరగించి అందరినీ షాక్‌కు గురిచేశారు. తమిళనాడు పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ సాంబార్. అయితే ఇటీవల చాలా మంది ఇడ్లీలను కాదని ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇడ్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా.. ఈరోడ్ జిల్లా కడయంపట్టి ప్రాంతానికి చెందిన ‘పట్టాయ కేటరింగ్’ సంస్థ ఇడ్లీలు తినే పోటీ నిర్వహించింది.
ఈ పోటీలో పాల్గొనేవారికి నిర్వాహకులు కొన్ని నిబంధనలు విధించారు. 10 నిమిషాల గడువులో వీలైనన్ని ఎక్కువ ఇడ్లీలు తినాలి. తిన్న తర్వాత 5 నిమిషాల వరకు వాంతి చేసుకోకూడదు. పోటీలో పాల్గొనేవారిని 19-30 ఏళ్లు, 31-40 ఏళ్లు, 41-50 ఏళ్లు.. ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 25 మంది వరకు పాల్గొని ఇడ్లీలు తిన్నారు. 31-40 ఏళ్ల వయసు గ్రూపులో కుమార పాలయం ప్రాంతానికి చెందిన రవి, 41-50 ఏళ్ల వయసు గ్రూపులో భవానీ ప్రాంతానికి చెందిన రామలింగం.. కేవలం 3 నిమిషాల్లోనే 19 ఇడ్లీల చొప్పున తినేసి విజేతలుగా నిలిచారు. మిగిలిన వారెవరూ 19 ఇడ్లీలు తినలేకపోయారు. అదే సమయంలో ప్రతి గ్రూపులో ఎక్కువ ఇడ్లీలు తిన్నవారికి రూ.5వేలు, రెండో విజేతకు రూ.3,000, మూడో విజేతకు రూ.2,000, నాలుగో విజేతకు రూ.1,000 చొప్పున నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. ఈ ఇడ్లీ పోటీ ఏదో మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది కదా..
-
-
వన్నియర్ vs సూర్య.. వివాదంలో ‘జై భీమ్’.. అండగా నిలిచిన కోలీవుడ్
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders Top Trending
తమిళ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఓవైపు ఓటీటీలో విజయదుంధుబి మోగిస్తుంటే.. మరోవైపు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. వన్నియర్ సామాజికవర్గ నేతలు, చిత్రబృందం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తమ వర్గాన్ని కించపరుస్తూ వాస్తవానికి విరుద్ధంగా చిత్రాన్ని తీశారని వన్నియర్ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మాత్రమేనని, ఇందులోని పాత్రలు, పేర్లు మార్చామని ఆ బృందం చెబుతోంది. మొత్తానికి రోజురోజుకీ ఈ రెండు వర్గాలు పరస్పర ప్రకటనలతో వాదనలు కొనసాగుతున్నాయి.
ఓవైపు వన్నియర్ సంఘాలు, పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) ప్రశ్నల అస్త్రాలు సంధిస్తుండగా.. మరోవైపు సూర్య వాటికి సమాధానమిస్తూ వస్తున్నారు. ఆయనకు కోలీవుడ్ అండగా నిలుస్తోంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘జై భీమ్’ దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో పోలీసు యంత్రాంగం తీరు వల్ల ఓ గిరిజన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, ఆపై అతని భార్య న్యాయపోరాటం చేయడం.. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించడం.. న్యాయానికి హారతులు పట్టడమే చిత్ర అసలు కథ. అయితే ఇందులో పోలీసు అధికారి పాత్రను ‘వన్నియర్’ సామాజిక వర్గానికి సంబంధించినట్టు చిత్రీకరించడం, అందుకు ఆధారాలు చిత్రంలో అక్కడక్కడ కనిపించాయి. ఈ అంశాలే ప్రస్తుత రచ్చకు కారణాలుగా మారాయి.
అయితే సదరు సామాజిక వర్గం ప్రశ్నించిన తర్వాత ఆ వర్గానికి సంబంధించిన ఆనవాలను చిత్రంలో నుంచి తొలగించి.. మార్పులు చేసింది ‘జై భీమ్’ బృందం. అసలు ప్రశ్న ఏంటంటే?.. అసలు సినిమాలో ఎందుకు తమ సామాజిక వర్గాన్ని ప్రస్తావించాలి? ఆ తర్వాత ఎందుకు తొలగించాలన్నదే. అంతేకాకుండా పోలీసు అధికారి అసలు పేరు ‘ఆంథోని’ పేరును ఎందుకు వాడలేదు’, ‘న్యాయపోరాటం చేసే ఆ మహిళ అసలు పేరు పార్వతి కానీ చిత్రంలో సెంగనిగా’ మతపరంగా మరోరూపం ఇవ్వడం ఎందుకు’.. వంటి ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు. ఇందుకు బహిరంగంగా సూర్య క్షమాపణలు చెప్పాలని కూడా పీఎంకే నేత అన్బుమణి రామదాసు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వన్నియర్ సంఘం సూర్యకు లీగల్ నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ‘జైభీమ్’ చిత్ర నిర్మాత, నటుడు సూర్యకు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. ఈ వార్ ట్విట్టర్‌కు కూడా ఎక్కింది. సామాజిక వర్గ సంఘాలు, పీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు.. సూర్య అభిమానుల మధ్య ట్వీట్ల ఘర్షణ జరుగుతోంది. సూర్యకు మద్దతుగా నిలిచేవారి #westandwithsuriya అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అలాగే చిత్ర పరిశ్రమలోని నిర్మాతల మండలి కూడా సూర్యకు మద్దతుగా అన్బుమణికి ఓ లేఖ రాసింది. సీనియర్ దర్శకుడు భారతిరాజా, నటుడు సత్యరాజ్, నిర్మాత థానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా అన్బుమణికి రాసిన లేఖల ద్వారా సూర్యకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
సూర్యను ఓ సామాజిక వర్గ విరోధిగా మార్చే ప్రయత్నం చేయకండని భారతిరాజా కోరారు. ఎన్నో సమస్యలుండగా సినిమాలోని ఈ విషయంపై గళమెత్తడం బాధాకరమని తెలిపారు. అలాగే సత్యరాజ్ స్పందిస్తూ.. ‘పలు చిత్రాలు అభినందించే రీతిలో ఉంటాయి. వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే కీర్తించదగ్గ చిత్రాలుగా నిలుస్తాయి. ఆ వరుసలో ‘జై భీమ్’ ఉంది. సూర్య ‘ఎదర్కుం తునిందవన్’ (దేనికైనా రెడీ). ఆయన్ను అభినందించాల్సిన తరుణమి’దని పేర్కొన్నారు. అయితే ఈ వివాదాన్ని దీని రాద్ధాంతం చేస్తూ గోడ పత్రికలను చించడం, సూర్యను కొడితే రూ.లక్ష ఇస్తానని పీఎంకే నేత ప్రకటించడం వంటి పనులు అత్యంత దారుణమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.
-
-
Akhanda Trailer: బాలయ్య ‘అఖండ’ గర్జన.. ద్విపాత్రాభినయంతో విశ్వరూపం
Category : Behind the Scenes Sliders Top Trending Trailers videos
సింహా’, ‘లెజెండ్’.. సూపర్ హిట్ చిత్రాలతో క్రేజీ కాంబినేషన్‌గా మారారు నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. వీరి కలయిలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘అఖండ’. ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది. పోస్టర్లు, టైటిల్ గీతం విశేషంగా ఆకట్టుకోవడంతో ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం ఆ కానుకను అందించింది. ‘అఖండ రోర్’ పేరుతో ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేసింది.
బాలకృష్ణ అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. బాలకృష్ణ లుక్స్, ఆయన చెప్పిన డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలనిజాన్ని చూపించారు. జగపతి బాబు కూడా కొత్త గెటప్పులో కనిపించాడు. శ్రీకాంత్ నిజంగానే భయపెట్టేశాడు. ట్రైలర్స్‌లో డైలాగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించి మెప్పించారు. తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
- September 10, 2021
-
-
సీటీమార్ మూవీ రివ్యూ
చిత్రం: సీటీమార్; నటీనటులు: గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా, అప్సర రాణి (ప్రత్యేకగీతం) తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల: 10-09-2021
‘మహిళా సాధికారతకు మనం ఏవో గొప్ప పనులు చేయనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడితే చాలు.. మంచి సమాజం ఏర్పడుతుంది’ అనే ఓ పాయింట్‌ను తీసుకుని గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం ‘సీటీమార్’. అన్ని కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ల్యాబ్‌కే పరిమితమైంది. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్స్ సందడిగా మారుతుండటంతో వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాను నిర్మాతలు రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘సీటీమార్’ ప్రేక్షకులను ఏ మేరకు ఆట్టుకుంది?.. నిజంగానే ఆడియెన్స్‌తో సీటీలు వేయించుకుంటోందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథేంటంటే:
కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. కడియంలో తన తండ్రి స్థాపించిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ద్వారా ఆడపిల్లలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ స్కూల్ మూతపడే పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఎలాగైనా తాను తీర్చిదిద్దిన కబడ్డీ జట్టుని జాతీయ స్థాయి పోటీల్లో గెలిపించి, ఆ జట్టు ద్వారా ఊళ్లోని స్కూల్ సమస్య వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉన్న కార్తీక్‌కి ఊళ్లోనే ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? దిల్లీలో పోలీస్ అధికారిగా ఉద్యోగం చేస్తూనే మాఫియాని నడిపిస్తున్న మాకన్‌సింగ్ (తరుణ్ అరోరా)తో కార్తీక్‌కి ఎలా వైరం ఏర్పడింది? తన జట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిందా? కార్తీక్ ఆశయం నెరవేరిందా? తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ జ్వాలారెడ్డి (తమన్నా), కార్తీక్‌కి మధ్య సంబంధం ఏంటన్నది మిగతా కథ.
తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు రావడం చాలా తక్కువ. వచ్చినా కబడ్డీపై రెండు, మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది… కబడ్డీ అనే స్పోర్ట్స్‌ను బేస్ చేసుకుని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘సీటీమార్’ సినిమాను తెరకెక్కించాడు. అమ్మాయిల అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయంలో అనే విషయాన్ని ఒక పక్క టచ్ చేస్తూనే కమర్షియల్ అంశాలను మేళవించాడు. గోపీచంద్‌కు ఉన్న యాక్షన్ హీరో అనే ఓ ఇమేజ్‌కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఫైట్స్, పాటలను మిక్స్ చేసి సినిమాను రూపొందించాడు.
ఎలా ఉందంటే..
ప్రథమార్ధమంతా గోదావరి గట్లు, పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కొన్ని సరదా సన్నివేశాలతోపాటు… ఊళ్లో అమ్మాయిల్ని ఆటలవైపు పంపించే విషయంలో తల్లిదండ్రుల్లో ఉండే అపోహలు, పల్లెటూరి రాజకీయాలు కీలకం. సెకండాఫ్‌లో పూర్తిగా దిల్లీ, కబడ్డీ, మాకన్ సింగ్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది. తొలి సగభాగంలో కడియం బ్రదర్‌పాత్రలో రావు రమేష్ చేసే రాజకీయం ఆకట్టుకుంటుంది. గోదావరి యాస మాట్లాడుతూ ఆయన చేసే సందడి నవ్విస్తుంది. అమ్మాయిల తల్లిదండ్రుల్ని ఒప్పించి జాతీయ స్థాయి పోటీల కోసం దిల్లీ వెళ్లిన కార్తీక్‌కి అక్కడ ఎదురైన సవాళ్లు సెకండాఫ్‌ను నిలబెట్టాయి. అయితే జాతీయ స్థాయి పోటీలకి వెళ్లిన ఓ రాష్ట్ర జట్టు కిడ్నాప్‌కి గురైతే, అది బయటికి పొక్కకుండా ఉండటం, ఆ జట్టు కోసం కోచ్ ఒక్కడే పోరాడటం అనేది లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. మాకన్ సింగ్, కార్తీక్‌కి మధ్య నడిచే ఆ ఎపిసోడ్ చప్పగా సాగడంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు.
అయితే హీరో తన టీమ్‌ను కనుక్కుని విడిపించుకోవడం.. విలన్‌ను చంపేయడం.. అదే సమయంలో అసలు గెలుస్తారో లేదో అనుకున్న టీమ్ గెలవడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమాలో భారీతనం కనపడింది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. మణిశర్మ సంగీతం అందించిన పాటల్లో టైటిల్ ట్రాక్ బావుంది. అప్సర రాణి స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంది. అయితే హీరో, హీరోయిన్ మధ్య సరైన లవ్ ట్రాక్ లేకపోవడం నిరాశ పరుస్తుంది.
ఎవరెలా చేశారంటే..
గోపీచంద్ అంతా తానై సినిమాను తన భుజాలపై మోశాడు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. తమన్నా సినిమా ప్రారంభమైన 40 నిమిషాలకు ఎంట్రీ ఇస్తుంది. ఆమెది గ్లామర్ రోల్ కాదు.. కానీ జ్వాలారెడ్డి సాంగ్‌లో కాస్త గ్లామర్‌గా కనిపించి కనువిందు చేసిది. ఆమె పాత్ర చెప్పుకునేంతగా లేదు. ఫస్టాఫ్‌లో రావు రమేశ్ తన డైలాగ్స్ విలనిజాన్ని పండిస్తే.. సెకండాఫ్‌లో తరుణ్ అరోరా విలన్‌గా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల గురించి అంతగా చెప్పుకోనవసరం లేదు. స్పోర్ట్స్, యాక్షన్ మిక్స్ అయిన కమర్షియల్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ‘సీటీమార్’ తప్పక నచ్చుతుంది.
-
-
టక్ జగదీష్ రివ్యూ
చిత్రం: టక్ జగదీష్; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, డానియల్ బాలాజీ, నరేశ్, రావు రమేశ్, ప్రవీణ్ తదితరులు
సంగీతం: తమన్, గోపీ సుందర్(నేపథ్య సంగీతం)
బ్యానర్: షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి సినిమా నుంచే వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారాయన. కరోనా కారణంగా గతేడాది ఆయన నటించిన ‘వి’ ఓటీటీలో సందడి చేసింది. పరిస్థితులు ఇంకా మెరుగుపడక పోవడంతో తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘టక్ జగదీష్’ కూడా అదే బాటలో పయనించింది. ‘నిన్నుకోరి’ వంటి సూపర్‌హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నాని తన నటనతో మరోసారి మెప్పించారా?.. లేదా? తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం..
కథేంటంటే..
భూదేవీపురం గ్రామంలో ఆదికేశవ నాయుడు(నాజర్) పెద్దమనిషి. తన కుటుంబంతో పాటు ఊరిలో అందరూ బావుండాలని కోరుకుంటాడు. అదికేశవ నాయుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసు(జగపతిబాబు).. చిన్న కొడుకు జగదీష్ నాయుడు(నాని). జగదీష్ ఎప్పుడూ టక్ చేసుకునే ఉంటాడు. దీంతో అందరూ అతడికి టక్ జగదీష్ అని పిలుస్తుంటారు. తన టక్‌ను ఎవరైనా లాగితే వారితో గొడవ పడుతుంటాడు. బోసు ఊళ్లో వ్యవహారాలు చూసుకుంటుంటే, టక్ జగదీష్ సిటీలో ఉంటూ అప్పుడప్పుడూ ఊరికి వచ్చి వెళుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వీరేంద్ర నాయుడు(డానియల్ బాలాజీ) తండ్రి ఊర్లో గొడవలు పెడుతూ ఉంటాడు. ఓసారి అనుకోకుండా వీరేంద్ర నాయుడు తండ్రిని ఓ వ్యక్తి పంచాయతీలోనే చంపేస్తాడు. దాంతో వీరేంద్ర నాయుడు ఆది కేశవులు, అతని కుటుంబంపై పగ పెంచుకుంటాడు. అనుకోకుండా ఓ రోజు ఆది కేశవనాయుడు గుండెపోటుతో చనిపోతాడు. అప్పుడు బోసు తన అసలు రంగు చూపిస్తాడు. వీరేంద్రతో చేతులు కలిపి.. ఎమ్మార్వో సాయంతో ఆస్థిని తన పేరుపై ఉండేలా చూసుకుంటాడు. అంతే కాదు.. తన ఇంటి ఆడపడుచులకు ఆస్థి ఇవ్వనని అందరినీ ఇంటి నుంచి గెంటేస్తాడు. అసలు బోసు ఉన్నట్లుండి అలా ఎందుకు మారిపోయాడు? నిజం తెలుసుకున్న జగదీష్ అన్నను ఎలా దారిలోకి తెచ్చుకుంటాడు? వీరేంద్రతో చేతులు కలిపిన బోసుకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
గ్రామంలో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న కొడుకైన హీరో వాటిని ఎలా పరిష్కరించాడన్న కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మంచి పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్ పండినవేళ ఆయా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. విక్టరీ వెంకటేశ్ ఇలాంటి సబ్జెక్ట్‌తో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్‌లు అందుకున్నారు. ‘టక్ జగదీష్’ విషయంలో దర్శకుడు శివ నిర్వాణ కథానాయకుడి పాత్ర మినహా కొత్త కథ జోలికి పోలేదు. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలన్నీ గతంలో మనం చాలా సినిమాల్లో చూశాం. టక్ జగదీష్ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ ఫక్తు ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది.
ఆ తర్వాత జగపతిబాబు పాత్ర.. విలన్‌తో చేతులు కలపడం.. ఫ్యామిలీలో గొడవలు మొదలు ఇలా కథ నెక్ట్స్ స్టెప్ తీసుకుంటుంది. ఇక నాని.. పాత్రకు సంబంధించిన ఎమ్మార్వో అనే అసలు బ్యాక్ డ్రాప్‌ను బయట పెట్టడంతో ఇంటర్వెల్‌ను పూర్తి చేశారు. ఇక సెకండాఫ్‌లో ఎమ్మార్వోగా ఊల్లోకి రాగానే అన్నకు ఎదురు తిరగడం.. విలన్ భరతం పట్టడం వంటి సన్నివేశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఊరు, కుటుంబం బావుండాలనుకున్న తండ్రి మాటను నిలబెట్టడానికి అందరితో చెడ్డవాడిననిపించుకున్న హీరో..చివరకు తన కుటుంబాన్ని కాపాడుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఇందులోని చాలా సెంటిమెంట్ సన్నివేశాలు చూస్తుంటే కార్తి నటించిన ‘చినబాబు’ గుర్తుస్తొంటుంది.
ఎవరెలా చేశారంటే..
ఎలాంటి పాత్ర అయినా తనదైన నటన, హావభావాలతో ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలనని ‘టక్ జగదీష్’తో నాని మరోసారి నిరూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయనకు తిరుగులేదు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. అయితే, నాని నుంచి కోరుకునే చిలిపి కామెడీ ఇందులో లేదు. దర్శకుడు దాన్ని కూడా దృష్టి పెట్టుకుని ఉంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉంటుంది. రీతూవర్మ అందంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేసింది. నాని-రీతూల కెమిస్ట్రీ తెరపై బాగుంది. జగపతిబాబు సీనియార్టీ బోసు పాత్రకు బాగా పనికొచ్చింది. ఆ పాత్రలో ఉన్న రెండు రకాల వేరియేషన్స్ చక్కగా పలికించారు. ఐశ్వర్య రాజేశ్, డానియల్ బాలాజీ, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
Search
Latest Updates
- శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?
- రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
- నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట
- విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు
- ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?
- ‘కాంతార’ సర్ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
© Copyright 2020. All Rights Reserved