Category Archives: Sliders

వినాయక వ్రతకథ.. చవితి రోజున చంద్రుడిని చూస్తే ఎందుకు అరిష్టం?

భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి నాడు పూజతో పాటు వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చవితి రోజున వ్రతకథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

కథా ప్రారంభం…
తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది.

అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు.. గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి.. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.


భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..

అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. పార్వతీ తనయుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.

స్థల పురాణం
కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

క్షేత్ర ప్రత్యేకత
అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్‌ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. దీంతో గ్రామంలో దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.

ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్‌ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష పెన్నులు సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.


ఇలా చేరుకోవచ్చు:
అయినవిల్లి రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12కిలోమీటర్లు దూరం ఉంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చేవారు రావులపాలెం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అమలాపురం నుంచి వచ్చేవారు ముక్తేశ్వరం చేరుకుని అక్కడి నుంచి ఆటోలో అయినవిల్లి చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాల ద్వారా వచ్చేవారు రాజమహేంద్రవరంలో దిగి అక్కడికి నుంచి రోడ్డుమార్గంలో అయినవిల్లి చేరుకోవచ్చు.


Don’t miss: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. అయితే కరోనాపై జనాల్లో ఇంకా భయం ఉండటంతో థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ప్రభావం కలెక్షన్లపై బాగా పడుతోంది. కొన్ని సినిమాలు ధైర్యంగా థియేటర్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటే, మరికొన్ని ఇప్పటికీ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే గత నెల రోజులతో పోలిస్తే ఈ వారం అటు థియేటర్‌తో ఓటీటీలోనూ సందడి రెట్టింపు కానుంది. వినాయకచవితిని పురస్కరించుకుని ఓటీటీ ద్వారా రీజల్ అవుతున్న సినిమాల వివరాలు మీకోసం..

10న నాని ‘టక్‌ జగదీష్‌’
నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్య పరిణామాల కారణంగా ఓటీటీ బాటపట్టింది. భూ కక్షలు లేని భూదేవిపురం కోసం ‘టక్‌ జగదీష్‌’ యువకుడు ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు.

ఆ ‘నెట్‌’లో పడితే ఇక అంతేనా?

రాహుల్‌ రామకృష్ణ, అవికా గోర్‌తో కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నెట్‌’. భార్గవ్‌ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో లక్ష్మణ్‌ అనే పాత్రలో రాహుల్‌ రామకృష్ణ కనిపించనున్నారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్‌’ చూడాల్సిందే.

మెడికల్‌ థ్రిల్లర్‌ ముంబై డైరీస్‌ 26/11
అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా మరో కొత్త సిరీస్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘ముంబై డైరీస్‌ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్‌ థ్రిల్లర్‌ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మోహిత్‌ రైనా, కొంకణ సేన్‌ శర్మ, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్‌ అడ్వాణీ, నిఖిల్‌ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది భాగాల్లో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్‌ ఫోర్స్‌ ఏవిధంగా పనిచేసిందన్న ఆసక్తికర అంశాలను థ్రిల్‌ కలిగించేలా సిరీస్‌ను తీర్చిదిద్దారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘తుగ్లక్‌ దర్బార్‌’

సెప్టెంబరు 9న ‘లాభం’ చిత్రంతో థియేటర్‌లో సందడి చేయనున్న విజయ్‌ సేతుపతి ఆ మరుసటి రోజే వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో అలరించనున్నారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ పొలిటికల్‌ మూవీ ‘తుగ్లక్‌ దర్బార్‌’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌ కథానాయికలు. దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్‌ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌ చేయనుంది. ఓ రాజకీయ నాయకుడ్ని అమితంగా ఇష్టపడే సింగారవేలన్‌ (విజయ్‌ సేతుపతి) అనే యువకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి అలరించనున్నారు.

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు

Amazon Prime Video

  • లూలా రిచ్‌ (సెప్టెంబర్‌ 10)

Aha

  • ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ ( సెప్టెంబర్‌ 10)
  • మహాగణేశా ( సెప్టెంబర్‌ 10)

Disney Plus Hotstar

  • అమెరికన్‌ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్‌ 08)

Netflix

  • అన్‌టోల్డ్‌: బ్రేకింగ్‌ పాయింట్‌ (సెప్టెంబర్‌ 07)
  • ఇన్‌ టు ది నైట్‌ (సెప్టెంబర్‌ 08)
  • బ్లడ్‌ బ్రదర్స్‌ (సెప్టెంబర్‌ 09)
  • మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌ (సెప్టెంబర్‌ 10)
  • లూసిఫర్‌ (సెప్టెంబర్‌ 10)
  • కేట్‌ (సెప్టెంబర్‌ 10)

ZEE 5

  • డిక్కీ లూనా (సెప్టెంబర్‌ 10)
  • క్యా మేరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్‌ 10)

Voot

  • క్యాండీ (సెప్టెంబర్‌ 08)


Bigg Boss Telugu 5: వామ్మో.. నాగార్జునకు అంత రెమ్యునరేషనా?

తెలుగు ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ వినోదాన్ని పంచేందుకు బగ్‌బాస్ ఐదో సీజన్ మొదలైపోయింది. బిగ్‌బాస్‌ రియాలిటీ షోను రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్‌దే కీలకపాత్ర. అవసరమైన చోట కంటెస్టెంట్లను ఎంకరేజ్‌ చేస్తూ, అతి చేసిన చోట చురకలంటించడం, ఆడియన్స్‌ నాడికి తగ్గట్లుగా కంటెస్టెంట్లతో గేమ్స్‌ కూడా ఆడిస్తుంటాడు హోస్ట్. ఈ క్రమంలో ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే రీతిలో మాట్లాడుతూ వారిని అలరిస్తుంటాడు.

అందుకే బిగ్‌బాస్‌ మొదలవుతుందనగానే కంటెస్టెంట్ల కన్నా ముందు హోస్ట్‌ ఎవరన్నదానిపై ఎక్కువగా చర్చ నడుస్తుంది. తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్టింగ్ చేయగా.. మూడు, నాలుగు సీజన్లను కింగ్ నాగార్జున రసవత్తరంగా నిర్వహించారు. ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్టింగ్ చేస్తున్నారు. అయితే గత సీజన్ల కంటే ఈ సారి ఆయన పారితోషికాన్ని భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

106 రోజులపాటు కొనసాగనున్న ఐదో సీజన్‌కు నాగార్జున రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్‌ ఈసారి మాత్రం భారీ రేంజ్‌లో డబ్బులు డిమాండ్‌ చేస్తుండటం షాక్‌కు గురిచేస్తోంది. నాగార్జున హోస్టింగ్‌ను ప్రేక్షకులు ఇష్టపడటంతో ఐదో సీజన్‌ కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్న షో నిర్వాహకులు ఆయన ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఏకంగా రూ.12కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.



శ్రీ‌రామ న‌వ‌మి విశిష్ఠ‌త.. ఇలా చేస్తే అన్నీ శుభాలే


హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల స‌మ‌యంలో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భారతీయులందరూ పరమ పవిత్ర దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా అన్నిచోట్లా రమణీయంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

ఖ‌మ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరాముని క్షేత్రాల్లో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యం గల క్షేత్రం.. భద్రాచలం. శ్రీ రాముడు తన వనవాస జీవితాన్ని ఇక్కడే గడపడం ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోవ‌డంతో పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.

సీతారామ కల్యాణం జరిగిందీ, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. కోదండ రామ కల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంట.. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు.

ఇంట్లో పూజా విధానం
శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉద‌య‌మే లేచి, తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గానీ, సీతారాముల విగ్రహాలను గానీ పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు(నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయాని వెళ్లి సీతారాములను చూసి వారిని ధ్యానించుకొని ప్రసాదం స్వీకరించాలి. సీతారాముల కళ్యాణం చూసినా, జరిపించినా సర్వ శుభాలు కలుగుతాయి.

వడపప్పు, పానకమే ప్రసాదం
వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి. చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం. మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో సీతాలక్ష్మామాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్రహానికి పూజించాలి. వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి. అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తోంది.f

వడపప్పు స్నానానికి ముందుగా నానబెట్టుకోకూడదు. స్నానానంతరం మొదట వడపప్పు నానబెట్టుకొంటే, తక్కిన వంటలు పూజాదికాలు పూర్తయి, నైవేద్య సమయానికి నానుతుంది. ఆ రోజు ఏ వంట చేయాలనుకొన్నారో ఆ వంట పూర్తిచేసి అదికూడా నైవేద్యంగా పెట్టాలి. వీటితో పాటు ఏదైన ఒక ఫలం నివేదించాలి.


ఆత్మహత్య చేసుకుందామనుకుని.. కోటీశ్వరుడయ్యాడు

జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ అపార్ట్‌మెంట్ భవనం ఎక్కాడు. 26వ అంతస్తు నుండి దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతిరోజు రిస్కే. అతడే అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేవుడు జీవితం ఇచ్చింది జీవించడానికే అని గ్రహించి తన ఎదుగుదలకు కృషి చేశాడు. ఎన్నో స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. ఇది వినడానికి సినిమా స్టోరీలా అనిపించొచ్చు. కానీ సినిమాను తలదన్నే ఎన్నో ఎత్తుపల్లాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయనెవరో కాదు.. విఠల్ వెంకటేష్ కామత్. దేశవిదేశాల్లో ప్రఖ్యాతి చెందిన కామత్ హోటళ్లకు ఆయనే అధినేత.

భార‌తీయ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన కామ‌త్ ఇపుడు ప్రపంచం గ‌ర్వించ‌ద‌గిన హోట‌ల్స్ య‌జ‌మానిగా చిర‌స్మర‌ణీయ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు డ‌బ్బుల కోసం నానా ఇబ్బందులు ప‌డిన కామ‌త్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపిస్తోంది. హోటల్స్ ద్వారా రోజూ కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఒక‌ప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామ‌త్ హోట‌ల్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి త‌న బ్రాండ్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది.

డాక్ట‌ర్ విఠ‌ల్ కామ‌త్ కు 68 ఏళ్లు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ గా..మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా కామ‌త్ హోట‌ల్స్ గ్రూపున‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇండియాలో ఎన్నో హోట‌ల్స్ త‌మ‌కు పోటీగా ఉన్నా ..కామ‌త్ మాత్రం త‌న స్థానాన్ని కోల్పోలేదు. ముంబై కేంద్రంగా న‌డుస్తున్న ఈ సంస్థను ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించేలా చేశారు కామ‌త్. 169 కోట్ల ఆదాయం కేవ‌లం ఈ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతోంది. చేతిలో చిల్లి గ‌వ్వ లేని పరిస్థితిలో భార్య పుస్తెల‌తాడును అమ్మి హోటల్ వ్యాపారం ప్రారంభించిన కామ‌త్.. ఇవాళ గ్రూపును ప్రపంచంలోనే టాప్-10లో నిలబెట్టారు.

ఎంద‌రో భార‌తీయులు ..ఎన్నో విజ‌యాలు సొంతం చేసుకున్నారు. కానీ విఠ‌ల్ కామ‌త్‌‌ కథ మాత్రం ప్రత్యేక‌మైనది. ఇది మ‌న‌క‌ళ్ల ముందే జ‌రిగిన కథ‌. విఠ‌ల్ కామ‌త్ హోట‌ల్స్ య‌జ‌మానే కాకుండా మెంటార్‌, ఎంట్రప్రెన్యూర్‌, ట్రైన‌ర్, స‌క్సెస్ ఫుల్ బిజినెస్‌మెన్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. తొలినాళ్లలో ఒక్క గ‌దిలోనే సర్దుకుపోయి కష్టాలు పడి కామత్ ఇప్పుడు వేల కోట్ల విలువ కలిగే ఎన్నో భవనాలు కలిగి ఉన్నారు. ఎంత పైకెదిగినా ఆయన తన మూలాలు మరిచిపోలేదు. కామ‌త్ కుటుంబంలో ఎనిమిది మంది ఉండేవారు. తల్లిదండ్రులు, ముగ్గురు అన్నద‌మ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీళ్లంతా ఒకే గదిలో నివసంచేవారు. ఆ జ్ఞాప‌కాలు ఇప్పటికీ త‌న‌ను హెచ్చరిస్తూనే ఉంటాయని చెబుతుంటారు కామ‌త్.

‘సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. లేకపోతే లావైపోతాం’ అనే టైప్ కామత్. అందుకే ఆయన తన గ్రూపు ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 60లక్షల మొక్కలు నాటించారు. అటవీ సంరక్షణ కోసం 100 ఎకరాల కొండను ఔషధ మొక్కలుగా, చెట్లుగా మార్చారు. ముంబైలో మొట్టమొదటి సీతాకోకచిలుక ఉద్యానవనం, నవీ ముంబై అంతటా తోటలను నిర్మించిన ఘనత కూడా ఆయనదే. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన విఠ‌ల్ కామ‌త్ తన విజయాలను కోట్లాది మంది భార‌తీయుల‌కే కాదు ప్రపంచానికి కూడా ఒక పాఠంగా చూపించారు.


మైమరపించే మారేడుమిల్లి… ప్రకృతి అందాలకు ఫిదా కావాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్‌లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి.

హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సందర్శకులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మారేడుమిల్లి సందర్శనకు వెళ్లేవారు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు.

జలతరంగిణి జలపాతాలు
మారేడుమిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. మారేడుమిల్లి ప్రాంతం పరిధిలో అనేక చిన్న జలపాతాలతో పాటు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతాలు ఉన్నాయి. ప్రధాన రహదారికి ఈ ప్రదేశం కాస్త దగ్గరగా ఉంటుంది. బైక్‌లపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

రాజమండ్రి నుండి గోకవరం దాటిన తరువాత ఫోక్స్ పేట నుండి రక్షిత అటవీ ప్రాంతం మెుదలవుతుంది. దారి మద్యలో సీతపల్లి వద్ద వనదేవతగా కోలిచే బాపనమ్మ తల్లి దేవస్దానం వస్తుంది. ఆ చల్లని తల్లిని ప్రతి ఒక్కరూ దర్శిస్తారు. సీతపల్లి దాటి 5 కిలోమీటర్లు వెళ్తే సీతపల్లి వాగు, పాలవాగు కనిపిస్తాయి. అక్కడినుండి ముందుకు వెళితే రంపచోడవరం దగ్గరలో రంప జలపాతం వస్తుంది. వేసవిలో జలధార తక్కువగా ఉంటుంది.. కాబట్టి జులై, ఆగస్టు నెలలో వెళ్తే ఆ జలపాతం అందాలు ఆస్వాదించొచ్చు.

ఈ ప్రకృతి అందాల నడుమ సేద తీరడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. రంపచోడవరంకి 4 కి.మీ.ల దూరంలో శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం పురాతన శివాలయం ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారు ఈ ఆలయంలో పూజలు చేసేవారని చెబుతారు.

స్వర్ణధార – రంప జలపాతాలు
జలతరంగిణి జలపాతాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మర్రిచెట్ల మాదిరిగా పెద్దగా ఉంటాయి. దట్టమైన, లోతైన అటవీ మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవచ్చు. మార్గమధ్యంలో నెమళ్లను, ఇతర పక్షులను కూడా చూసే అవకాశం ఉంటుంది.

అలాగే మారేడుమిల్లి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి. రంప చోడవరం నుండి రంప జలపాతం వరకూ జీప్‌లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం. 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ జలపాతం వద్ద నీరు తియ్యని రుచితో ఉంటుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

కార్తీక వనం
కార్తీక వనం ప్రాంతం అరుదైన మొక్కలు, వృక్ష జాతులకు ప్రధాన ఆవాసం. సహజసిద్ధ ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఉసిరి, మారేడు, గూస్ బెర్రీ, బేల్ వంటి అనేక రకాల మొక్కల జాతులు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు ఇది ఒక బహిరంగ ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. దాదాపు 203 జాతుల ఔషధ మొక్కలను ఇక్కడ చూడవచ్చు. స్వచ్చమైన గాలి, వాతావరణం మధ్య ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు.

జంగల్ స్టార్ క్యాంప్ సైట్
ఈ ప్రదేశానికి రామాయణానికి సంబంధం ఉందంటారు. ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు చెప్తారు. ఇక్కడ వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు , అడవులు ఇలా చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది.

మదనికుంజ్ విహార స్థల్
మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరో అద్భుతమైన విహార ప్రదేశం మదనికుంజ్-విహార స్థల్. ప్రకృతి ఒడిలో సేద తీరే పిక్నిక్ స్పాట్‌గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. పులులు, అడవి కోళ్లు, అడవి దున్నలు, నల్ల చిరుతలు, నెమళ్లతో పాటు విభిన్న రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి.

ఈ మజిలీలో మారేడుమిల్లిలో అక్కడి గిరిజనులు సహజసిద్ధంగా అడవిలో పెరిగిన కోళ్లతో చేసే బొంగు చికెన్ రుచి చూడండి. ఆ చికెన్ ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టాలని అనిపించదు. అక్కడ బస చేయడానికి ఏపీ టూరిజం హరితా రిసార్ట్స్, ప్రైవేట్ వ్యక్తులు నడిపే లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. దారిలో ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటక శాఖ వారు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుండి ప్రకృతి రమణీయతను తిలకించవచ్చు, రెండవ వ్యూ పాయింట్ చెరుకుంటే ఘాట్ రోడ్ ప్రయాణం పూర్తి అయినట్టే. అక్కడే సోకులేరు వాగు అద్బుతంగా ఉంటుంది.


ముఖ్య గమనిక: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌తో వెళ్ళాలనుకునేవారు ముందుగా మీ వాహనం కండీషన్ చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏదైనా రిపేరు వస్తే దగ్గర్లో మెకానిక్ దొరకని పరిస్దితి ఉంటుంది. ఈ మార్గంలో రాత్రి ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు. చీకటి పడేలోపు ఏదైనా ప్రదేశానికి చేరుకునేలా చూసుకోండి..


Hyderabad: భాగ్యనగరం అందాలు చూడతరమా…

హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ప్రత్యేకత గత నగరం. తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం.. హస్తకళలకు, పర్యాటకానికి ప్రసిద్ధి. నిజాం రాజుల రాచరికానికి ప్రతీకగా భాసిల్లిన భాగ్యనగరం.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ దూసుకుపోతోంది. పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో లేనిదంటూ ఏదీ లేదు.

దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌ను ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. అప్పట్లో భాగ్యనగరాన్ని ఏలిన 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తించబడ్డాడు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరొందిన కోహినూర్ వజ్రం కూడా హైదరాబాదులో బయటపడిందే. కొల్లూరు గనుల్లో లభ్యమైన ఈ డైమండ్ అప్పట్లో గోల్కొండ కోటకు తరలినట్లు చెబుతుంటారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచే ఈ నగరంలో ప్రఖ్యాతి కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

చార్మినార్:
హైదరాబాద్ యొక్క అతి ముఖ్యమైన సూచిక ‘చార్మినార్’. నాలుగు మినార్‌లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్ అని పిలుస్తారు. అయితే ఈ నిర్మాణంలో అడుగడుగునా చార్ దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ప్రసిద్ధి పొందింది. ఆర్కియాలజీ పరిశోధనల్లో చార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న నాలుగు మినార్‌ల ఎత్తులను నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా నాలుగుతో భాగించబడడం విశేషం.

1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు ఛార్మినార్ ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్‌ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ఈ చారిత్రక కట్టడం ఖ్యాతి కారణంగా దీని చుట్టు పక్కల ప్రదేశాలు చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు పొందాయి. వాహనాల కాలుష్యం కారణంగా ఈ కట్టడం రంగు మారుతుండడంతో దీని పరిరక్షణలో భాగంగా దీనికి 300 మీటర్ల వరకూ దూరం వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. ఈ ప్రదేశంలో కేవలం పాదాచారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కట్టడం హైదరాబాద్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గోల్కొండ కోట:
గోల్కొండ రాజ్యానికి 14-16 శతాబ్దాల మధ్య గోల్కొండ కోట రాజధానిగా ఉండేది. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోటను భారతదేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. ఈ కోట ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది చప్పట్ల ప్రదేశం. కోట ముఖద్వారం వద్ద ఉండే గోపురం కింద చప్పట్లు కొడితే ఆ శబ్ధం కోట పై భాగంలో కిలోమీటరు దూరం వరకూ వినిపిస్తుంది. ఆకస్మిక దాడుల నుంచి అప్రమత్తం కావడానికి పూర్వం దీనిని ఉపయోగించే వారు. ఈ కోటలోని వాతావరణం పర్యాటకులకు 12వ శతాబ్ధం నాటి కాలాన్ని పరిచయం చేస్తుంది. హైదరాబాద్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే గోల్కొండ కోట పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది.

చౌమహల్లా ప్యాలెస్:
18వ శతాబ్దం నాటికి చెందిన అద్భుతమైన చారిత్రక కట్టడం ‘చౌమహల్లా ప్యాలెస్’. హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేసిన ఐదో నిజాం పాలకుడు ఆసఫ్ జాహ్ వంశం యొక్క నివాస స్థలం ఇది. ఉన్నత స్థాయి సమావేశాలు, రాచరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి. పర్షియన్ భాషలో ‘చాహర్’ అంటే నాలుగు, అరబ్ భాషలో ‘మహాలత్’ అంటే సౌధం అని అర్ధం వస్తుంది. ఈ రెండు పదాల ద్వారా ఈ భవనానికి అప్పటి పాలకులు చౌమహల్లాగా నామకరణం చేసినట్లు తెలుస్తుంది. 14 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ లో చూపు తిప్పుకోనివ్వని ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. 2010లో యునెస్కో ఈ ప్యాలెస్‌ను సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. హైదరాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ ఉంది.

బిర్లా మందిర్:
హైదరాబాద్ పర్యాటకంలో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాల్లో ‘బిర్లా మందిర్’ ఒకటి. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలో ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది. 10 ఏళ్ల పాటూ కళాకారులు ఎంతో శ్రమకోర్చి తీర్చిదిద్దిన ఈ ఆలయంలో అడుగడుగునా వారి నైపుణ్యం, కష్టం కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఆలయంలో సుమారు 11 అడుగుల ఎత్తు ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒరియా శైలిలో ఉంటుంది. ఈ కొండపై నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుని విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబినీ పార్క్, అసెంబ్లీ ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం ఈ దేవాలయాన్ని నిర్మించడంతో దీన్ని బిర్లా మందిర్ అని పిలుస్తారు.

సాలార్ జంగ్ మ్యూజియం:
దేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియాల్లో ‘సాలార్ జంగ్ మ్యూజియం’ ఒకటి. ఈ మ్యూజియంలోని పురాతన వస్తువులు నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ III చేత సేకరించబడ్డాయి. పాలరాతి శిల్పాలు, ఏనుగు దంతాల కళాకృతులతో పాటు పర్షియా, ఈజిప్ట్, ఉత్తర అమెరికా, ఐరోపా, చైనా, బర్మా, నేపాల్, జపాన్ వంటి దేశాలకు సంబంధించిన లోహ కళాఖండాలు, తివాచీలు, సెరామిక్స్, బొమ్మలు, శిల్పాలు ఇక్కడ ప్రదర్శితమవుతాయి. దీంతో పాటు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన చిత్రాలు, మొఘలుల కాలం నాటి కత్తులు, బాకులు కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇటాలియన్ కళాకారుడు బెంజొని రూపొందించిన వీల్డ్ రెబెక్కా శిల్పం మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. మ్యూజియంలో అడుగుపెట్టిన పర్యాటకులు అక్కడి చారిత్రక సంపదను చూసి గొప్ప అనుభవానికి లోనవుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సందర్శకులకు అనుమతి ఇస్తారు.

ఫలక్‌నుమా ప్యాలెస్:
రాజదర్పం ఉట్టిపడే.. ఫలక్‌నుమా ప్యాలస్‌ను నిజాం నవాబులు నిర్మించలేదు. సర్ వికారుల్ ఉమ్రా దీనికి అసలు నిర్మాత.. ఇతను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు స్వయానా బావ. ఆయన సంస్థానానికి ప్రధానమంత్రి కూడా. 1884 మార్చి 3న ఫలక్‌నూమా ప్యాలెస్‌కు శంకుస్థాపన చేశారు. ఇండో-అరేబియన్ నిర్మాణ శైలిలో దీన్ని డిజైన్ చేశారు. ఈ ప్యాలస్ నిర్మాణం కోసం ఇటలీ నుంచి పాలరాయిని, ఇంగ్లాండ్ నుంచి చెక్కను తెప్పించడం గమనార్హం. అయితే వికారుల్‌ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడంతో ఆరో నిజాం 1897లో ఆయనకు రూ.60వేలు చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నారని చెబుతుంటారు. ఆ తర్వాత అది ఏడో నిజాం మనవడు బర్కత్ అలీఖాన్ ముకరంజాకు దక్కింది. 2000వ సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా ఫలక్‌నూమా ప్యాలెస్‌ను 30 ఏళ్లపాటు తాజ్‌ గ్రూప్‌‌కి అప్పగించారు. దీన్ని హోటల్‌గా మార్పులు చేసి 2010 నుంచి తాజ్ ఫలక్‌నుమాగా మార్చారు.

హుస్సేన్ సాగర్‌:
హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఉన్న మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించారు. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ సరస్సు అప్పట్లో నగరానికి మంచినీటి అవసరాన్ని తీర్చేది. కాలక్రమేణా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు దీనిలో చేరడంతో ఇప్పుడు మురికికూపంగా మారింది. అయినప్పటికీ హుస్సేన్‌సాగర్ పరిసరాలు పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటాయి. హుస్సేన్‌సాగర్‌లో మధ్యలో స్థాపించిన బుద్ధ విగ్రహం ఆ ప్రాంతానికి మరింత ఆకర్షణ తీసుకొస్తుంది. దీనికి అనుబంధంగా నిర్మించిన నెక్లెస్‌ రోడ్ నగర అందాన్ని మరింత పెంచింది.

హైటెక్ సిటీ:
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం హైటెక్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు కొనసాగుతున్న సమయంలో 1998 న‌వంబ‌ర్ 22న సైబ‌ర్ ట‌వ‌ర్స్‌ను అప్పటి ప్రధానమంత్రి అట‌ల్ బిహారి వాజ్‌పేయి చేతుల మీదుగా ప్రారంభించారు. కేవలం 14 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న సైబర్ టవర్స్‌లో దేశ, విదేశాలకు చెందిన ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొలువుదీరాయి. అంత‌ర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ ఎదగడంతో హైటెక్ సిటీ పాత్ర ఎంతో ఉంది. దీని కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏర్పాటై సైబరాబాద్ అనే మరో ప్రాంతం ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సాప్ట్‌వేర్ రంగంలో బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ ఎదగడానికి హైటెక్‌ సిటీయే కారణం.

ఉస్మానియా యూనివర్శిటీ:
నాటి హైదరాబాద్‌ సంస్థానం, బ్రిటిష్‌ ఇండియాలో అతిపెద్ద సంస్థానం. 1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటిగా చెబుతారు. ఎందరికో చదువులను ప్రసాదించి.. ఉన్నత స్థానాల్లో నిలబెడుతున్న ఉస్మానియా యూనివర్శిటీని ఏడో నిజాం 1917లో స్థాపించారు.

కాచిగూడ రైల్వేస్టేషన్:
కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో నిజాం ప్రభువులే నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌కు స్థానిక కాచి కులస్తుల జ్ఞాపకార్థంగా ‘కాచిగూడ’గా నామకరణం చేశారు. నిజాం కుటుంబీకులంతా ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేసేవారు. శిల్పశైలి పరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అందమైన స్టేషన్లలో ఒకటిగా కాచిగూడ స్టేషన్ నిలుస్తుంది. బయటి నుంచి చూస్తే రాజా ప్రసాదంలా కనిపించే కాచిగూడ రైల్వేస్టేషన్ భాగ్యనగర ప్రధాన చిహ్నాలలో ఒకటి.

‘పగడాల’ రాజ్యం:

దేశంలో పగడాల వ్యాపారానికి పెట్టింది పేరు హైదరాబాద్. ఇక్కడ విక్రయించే పగడాలను శ్రీలంక, ఇరాక్, చైనాల నుంచి దిగుమతి చేసుకుంటారు. చార్మినార్‌ వద్ద పత్తర్‌గట్టీ, మెడివల్ బజార్లు నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే, వీటిని కొనుగోలు చేసే ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ప్లాస్టిక్ పగడాలు కూడా అమ్మేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి.

అత్తర్లకు అడ్డా:
ఆల్కహాల్ కలవని ‘అత్తర్ల’కు భాగ్యనగరం ప్రసిద్ధి. అవి కూడా పాతబస్తీలోనే కొనుగోలు చేయాలి. ముస్లింలు వినియోగించే ఈ అత్తర్లకు భలే డిమాండు ఉంటుంది. ఇక్కడి డిమాండును దృష్టిలో పెట్టుకునే 19వ శతాబ్దంలో చాలామంది ‘అత్తర్‌వాలా’లు గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు వీరు ఏర్పాటు చేసినవే.

బిర్యానీ గుమగుమలు:
హైదరాబాద్ పేరు వింటే ఠక్కున గుర్తుకొచ్చేది.. బిర్యాని. ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఏలిన నిజాములు ఆహార ప్రియులు. ఈ నేపథ్యంలో స్పేసీగా, టెస్టీగా.. అనేక రకాల వంటకాలను వారు రుచి చూసేవారు. ఇవన్నీ మొగళుల కాలంలో ఉనికిలోకి వచ్చినవే. ఇక హలీమ్.. గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. ఇక్కడి హలీమ్‌కు భారీగా డిమాండు ఉంటుంది. హైదరాబాదులోని ప్యారడైజ్, బావర్చి, షాదాబ్, పిస్తా హౌజ్ తదితర హోటళ్లు బిర్యానీ ఫేమస్.

కేబుల్ బ్రిడ్జి
ఇటీవలే దుర్గం చెరువు మీద నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగరానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌ సిటీ కనెక్టివిటీలో భాగంగా దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ రెండేళ్లు పాటు శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశంలోనే కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి‌గా ఈ నిర్మాణం రికార్డు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డుల కెక్కింది.

వినోదానికి అడ్డా:
హైదరాబాద్ నగరం వినోదానికి పెట్టింది పేరు. షాపింగ్ మాల్స్ నుంచి మల్టిప్లెక్స్‌ల వరకు రోజూ ఎక్కడ చూసినా రద్దీగానే ఉంటుంది. నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, పబ్లిక్ గార్డెన్స్, పంజాగుట్ట సెంట్రల్, ప్రసాద్ ఐమ్యాక్స్. సుజనా ఫోరం మాల్, ఇనార్బిట్ మాల్, దుర్గమ్మ చెరువు, శిల్పారామం, … ఒకటేమిటీ నగరంలో అనేక ప్రాంతాలు పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. అటు చరిత్ర.. ఇటు ఆధునికతను ప్రతిబింబిచేలా హైదరాబాద్‌ నగరం దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే ఆకర్షిస్తోంది.

హైదరాబాద్‌లో చుట్టుపక్కల తప్పక సందర్శించాల్సిన మరిన్ని ప్రదేశాలు
నెహ్రూ జూపార్క్
ఎన్టీఆర్ పార్క్
కుతుబ్‌షాహీ టూంబ్స్
దుర్గం చెరువు
రామోజీ ఫిల్మ్‌ సిటీ
జల విహార్
వండర్ లా
మౌంట్ ఒపెరా
స్నో వరల్డ్
శిల్పారామం
కేబీఆర్ పార్క్
మక్కా మసీద్
సంఘీ టెంపుల్
పెద్దమ్మ గుడి
చిలుకూరు బాలాజీ ఆలయం