Category Archives: Sliders

ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!


‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

కోనసీమ ప్రకృతి పదం.. మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయలున్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమకు అమలాపురం పట్టణం ప్రధాన కేంద్రం కాగా.. రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట ప్రధాన ప్రాంతాలు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రావులపాలెంను కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.

అందాల సీమ
మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్ల తోరణాలు, అరటి గెలలు, కొబ్బరి తోటలు, మంచు తెరలు ఇలాంటి మనోహర దృశ్యాలన్నీ కోనసీమ వాసులకు సర్వసాధారణం. పుష్కలమైన ప్రకృతి వనరులు, కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం కోనసీమకే వన్నె తెస్తుంటాయి. కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారు.

కోనసీమ ప్రాంతం పురాతన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా భాసిల్లుతోంది. అతిథులకు మర్యాదలు చేయడంలో కోనసీమ వాసులకు కొట్టేవాళ్లే ఉండరు. అన్నిచోట్ల కొట్టి చంపితే.. కోనసీమ వాళ్ల తిండి పెట్టి చంపేస్తారన్న నానుడి ఉంది. సంక్రాంతి పండుగకు నిర్వహించే ముగ్గుల పోటీలు, కోనసీమలో జరిగే కోడిపందేలు, తీర్థాలు, జాతరలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.

పలకరింపులు భలే ఉంటాయ్
కోనసీమలో పలకరింపులు భలే వింతగా ఉన్నాయి. అక్కడ ఎదుటివారిని ఆయ్, అండి అంటూ ప్రత్యేక శైలిలో మర్యాదగా పిలుస్తుంటారు. ఈ తరహా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మనకు కనిపించదు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం.

ప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం
కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధ, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం ముఖ్యమైనవి. అవివాహితులు మురముళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటరు ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు.

కోనసీమ వంటలు ఆహా అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్‌కు కోనసీమ పెట్టింది పేరు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. గోదావరి నదిపై వంతెనలు నిర్మించక ముందు ప్రజా రవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే కొనసాగిస్తూనే ఉన్నారు. కోనసీమ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా ప్రసిద్ధి. గతంలో అనేక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి.

కోనసీమ చేరుకోవటం ఎలా ?
వాయు మార్గం: అమలాపురానికి సమీపంలోని ఉన్న అతిపెద్ద నగరం రాజమండ్రి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు అమలాపురానికి బస్సు సౌకర్యం ఉంది.


రైలు మార్గం: కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, గంగవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రైల్వే స్టేషన్‌లు కలవు. రైలు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవచ్చు.
బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుండి కోనసీమలోని ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.


‘ఆచార్య’ సెట్స్‌కి సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్.. వీడియో వైరల్

సోనూ సూద్.. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఆపద్భాందవుడిగా నిలిచిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకుని సోనూసూద్ చేసిన సాయంపై యావత్ భారతావని ప్రశంసలు కురిపించింది.

ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్‌పై వెళ్లారు. సోనూసూద్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఉద‌యాన్నే సెట్‌కి వెళ్లాల్సి రావడంతో ఆయన సైక్లింగ్ చేసుకుంటూ సెట్‌కి వెళ్లిపోయారు. భాగ్యనగర రోడ్డలపై ఆయన సైకిల్‌ తొక్కుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.


‘ప్లవ’ నామ సంవత్సరం.. ఉగాది రోజు ఇలా చేస్తే అన్నీ శుభాలే!

కొత్త సంవత్సరాది అనగానే లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవిత సారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇవే గుర్తొస్తాయి. అయితే తెలుగు ఏడాది ప్రారంభం కేవలం వాటితోనే పూర్తికాదు. ఉగాది రోజున చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. అంటే… యుగ+ఆది అని అర్థం. యుగము అంటే జత అనే అర్థం కూడా వస్తుంది. అలా ఉత్తరాయణం, దక్షిణాయనం జతగా కలిస్తే ఒక సంవత్సరంగా భావిస్తాం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని అంటారు. ఉ అంటే నక్షత్రమనీ, గ అంటే గమనమనీ… దాన్ని ఈ రోజు నుంచే లెక్కిస్తారని కూడా చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే… మొదటి సంవత్సరం, మొదటి రుతువు, మొదటి మాసం, మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాదికి ‘ప్లవ’ నామ సంవత్సరమని పేరు. ప్లవను ప్రతిభ, జ్ఞానానికి సంకేతంగా గుర్తిస్తారు.

అన్ని పండగల్లానే ఉగాది రోజున కూడా ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆ తరువాత ఉగాది పచ్చడి తినడంతోనే పండగ అయిపోదు. ఈ రోజున ప్రత్యేకంగా ఫలానా దేవుడిని పూజించాలని ఏ పురాణాల్లోనూ చెప్పలేదు కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేసి.. ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలి. అయితే సృష్టి ప్రారంభం అయ్యేది కూడా ఈ రోజునే కాబట్టి భూమిని పాలించే ప్రభువును దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అంటే పరమేశ్వరుడిని మించిన ప్రభువు ఉండడు కాబట్టి శివాలయానికి వెళ్లి లోకానికే తల్లదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుంటే మంచిదని చెబుతారు. లేదంటే లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం లభిస్తుందని అంటారు. ఆ తరువాత గో దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి.

సాధారణంగా ఉగాది పచ్చడి తయారీలో ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం, తీపి కలిపి ఆరు రుచులుంటాయి. ఈ షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఃఖాలకూ కష్టనష్టాలకూ సంకేతంగా భావిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే… ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజున మాత్రమే కాక శ్రీరామ నవమి వరకూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటన్నింటితోపాటూ పంచాంగ శ్రవణాన్ని కూడా ఉగాది పర్వదినంలో ఓ భాగంగా పరిగణిస్తారు. పంచాంగాన్ని వినడం వల్ల ఏడాది కాలంలో గ్రహాల కదలికలూ, శుభాశుభ ఫలితాలూ తెలుస్తాయి. వాటన్నింటినీ తెలుసుకోవడం వల్ల రాబోయే పరిస్థితుల్ని ముందే అర్థంచేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చనేది పంచాంగ శ్రవణం ప్రధాన ఉద్దేశం.

వసంత నవరాత్రుల ప్రారంభం
నవరాత్రులు అనగానే మనకు దుర్గమ్మను పూజించే శరన్నవరాత్రులు లేదా గణపతి నవరాత్రులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ రెండింటితో పాటూ చైత్ర మాసంలోనూ ప్రత్యేకంగా నవరాత్రుల్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. అవే వసంత నవరాత్రులు. ఈ సమయంలో శక్తిని కొలిచినా వీటిని విష్ణువుకు సంబంధించిన నవరాత్రులని పేరు. ఈ కాలంలో దుర్గను ఆరాధించడంతో పాటూ రాముడినీ, హనుమంతుడినీ కూడా ఆరాధిస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వసంత నవరాత్రులు ఉగాది నుంచి మొదలై శ్రీరామనవమి వరకూ కొనసాగుతాయి. నవరాత్రి ఆఖరు రోజున రాముడు జన్మించాడనీ దాన్నే శ్రీరామనవమిగా జరుపుకుంటామనీ పురాణాలు చెబుతున్నాయి.

ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎందుకు పూజించాలనే దానికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. సుదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడట. ఆ సమయంలో అమ్మవారు నవరాత్రుల పేరుతో తనకు పూజలు చేయమని కోరిందట. అలా ప్రారంభమైనవే ఈ నవరాత్రులని అంటారు. రామ లక్ష్మణులు కూడా వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, రామనామ జపాన్ని కూడా నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలా సర్వశుభాలనూ కలిగించే కొత్త ఏడాదిని అమ్మవారి అనుగహ్రంతో ఆనందంగా ప్రారంభించి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడమే ఉగాది పండగ ప్రధాన ఉద్దేశం.


దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో ‘వకీల్ సాబ్’ టీమ్

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది. మరోవైపు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా రావడంతో పవన్‌ కళ్యాణ్‌ కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దిల్‌రాజుకు కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు అందరిలోనే టెన్షన్ మొదలైంది.


ఖమ్మం: మహిళా కానిస్టేబుళ్లు ట్రిపుల్ రైడింగ్… కమిషనర్ సీరియస్, భారీగా ఫైన్


తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే స్కూటీ ఎక్కారు. పైగా హెల్మెట్ ధరించలేదు. రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై ఈ విధంగా వెళ్తుండగా కొందరు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫోటో వైరల్‌ కావడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం సామాన్యులకేనా.. పోలీసులకు వర్తించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఖమ్మం పోలీస్‌ కమిషనర్ విష్ణు ఎస్‌.వారియర్‌ వద్దకు వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రూ.3,300 జరిమానా విధించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


రవితేజ ‘ఖిలాడి’ టీజర్.. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహరాజ్

‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్.

ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ‘ఖిలాడి’ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహారాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్, యాక్షన్ కలయికలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఖిలాడి’ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తూనే తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.


‘వకీల్ సాబ్’లో ఆలోచింపజేసే పవర్‌ఫుల్ డైలాగ్స్

దేశంలో అడుక్కునే వాడికి అన్నం దొరుకుతుంది. కష్టపడే వాడికి నీడ దొరుకుతుంది. కానీ పేదవాడికి మాత్రం న్యాయం దొరకడం లేదు

★ ఆశకి, భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్లవి. వాళ్లు నన్ను పట్టించుకోకపోయినా నేను వాళ్లను పట్టించుకుంటాను.

★ ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలుచుకునే అవకాశం.

★ నాకు కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు.

★ రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా సంతోషంగానే ఉంటాడు. కానీ భక్తులే బాధపడతారు.

★ న్యాయం కోసం పోరాడేటప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది.

★ ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఆమె వేసుకునే దుస్తుల్లో, చేసే పనుల్లో, ఆమె ప్రవర్తన బట్టి అంచనా వేయడం తప్పు. వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండటం ప్రాథమిక హక్కు.

★ ఆడది అంటే బ్రాతూమ్‌లో ఉండే బొమ్మ కాదు. నిన్ను కనిపెంచిన అమ్మ కూడా. చీడ పురుగులు మగవాళ్ల తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ల మీద కొడితే ఎలా?

★ ఆశతో ఉన్నవాడే గెలుపు, ఓటములు గురించి ఆలోచిస్తాడు. ఆశయంతో ముందుకు వెళ్లే వాడికి కేవలం ప్రయాణం గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది.

★ నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా.. కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తతలొగ్గాల్సిందే.. నువ్వు గెలుపు కోసం వచ్చావ్.. నేను న్యాయం కోసం వచ్చా.

★ మన ఇంట్లో ఉండే గడియారంలో చిన్న ముల్లు కూడా అమ్మాయి క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుంది. రాత్రిపూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే.. బైకులు, కార్లు, ఆటోలు అన్నీ స్లో డౌన్ అవుతాయి. సైడ్ మిర్రర్లు కిందికి దిగుతాయి. జిరాఫీల్లా తలలు పొడుచుకొస్తాయి. చూపులు సూదులవుతాయి. అబ్బాయిలు బయటికొస్తే సరదా.. అమ్మాయిలు బయటికొస్తే మాత్రం తేడా

★ మద్యం తాగడం హానికరం… ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా. ఆడవాళ్లు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తాం?

★ అమ్మాయి జీన్స్ వేసుకోకూడదు. స్కర్ట్ వేసుకోకూడదు. వాళ్లకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకు ప్రమాదకంర కాదు. అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే.. అబ్బాయిలు టెంప్ట్ అయిపోతారు. అందుకే ఇలాంటి అమాయకులైన అబ్బాయిలను మనం కాపాడుకుందాం..

★ ఆడవాళ్లు మనకు ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి. హక్కుల గురించి అడిగితే… ఇలా బోనులో నిలబెట్టి వేశ్య అని ముద్ర వేసేస్తాం.


‘వకీల్‌ సాబ్’కు బ్లాక్‌బస్టర్ టాక్.. యూనిట్ సంబరాలు


‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ తొలి షోతోనే సెన్సేషనల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో యూనిట్‌ సంబరాల్లో మునిగిపోయింది. యూనానమస్ సూపర్ హిట్ రెస్పాన్స్ నేపథ్యంలో “వకీల్ సాబ్” చిత్ర బృందం హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా… నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోంది. లైఫ్‌లో ఎన్నో సక్సెస్ లు చూశాను. డిస్ట్రిబ్యూటర్‌గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను. అయితే ‘వకీల్ సాబ్’ సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోంది. ఉదయం 4.30 కూకట్ పల్లిలో ప్రీమియర్ షోస్ చూశాను. ఆ ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. నిర్మాతనని మర్చిపోయి ఫ్యాన్స్‌లాగే పేపర్స్ విసిరేశాను. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను. వకీల్ సాబ్ మీద మాసివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశాం. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అప్పటికే అమెరికా, దుబాయ్ షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. వకీల్ సాబ్ విజయం నాకు కొత్తగా అనిపించడానికి కారణం, నేను కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక కావొచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ కావొచ్చు. పవన్ గారితో పాటు ఈ సినిమా సక్సెస్ ఘనత దర్శకుడు శ్రీరామ్ వేణుకి ఇస్తాను. ఒక హీరోను ఇలా చూడాలి అనే ఆలోచనతో తను రాసుకున్న సీన్స్ కానీ, ప్రెజంటేషన్ గానీ సూపర్బ్. ప్రతి సీన్‌కు, ప్రతి డైలాగుకు ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్ అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు.

సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయనకు ముందుగా చెప్పలేదు, ఆ సంతోషంలో ఆయన ఇంటికి వెళ్లి పవన్ గారిని కలిసి సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. కళ్యాణ్ గారు చాలా సక్సెస్‌లు చూశారు కానీ వకీల్ సాబ్‌లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. వేణు, పవన్ గారు ప్రతి సీన్ ఎలా చేయాలో డిస్కషన్ చేసుకుని షూట్ చేశారు. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంట సేపు పవన్ గారితో మాట్లాడాం. నేను ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్లకు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ గమనించాను. టెర్రఫిక్ రెస్పాన్స్ ఉంది. ఏదో తెలియని అనుభూతికి లోనవుతున్నాను. ఇంతలో చాలా మంది మీడియా పర్సన్స్ ఫోన్ చేసి సినిమాను ప్రశంసిస్తూ మాట్లాడారు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ఎక్సీపిరియన్స్. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటూ చెబుతున్నారు. ఈ సినిమా ఎంత సునామీ సృష్టిస్తుందో ఇప్పుడో చెప్పలేం. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్ మాత్రం ట్రెమండస్‌గా ఉన్నాయి. ఏ సినిమా ఎంత డబ్బు తెస్తుందనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. మంచి సినిమా చేశాక డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. 18 ఇయర్స్ నుంచి మా సంస్థలో ఉన్న వేణు, నా డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంత విజయాన్ని ఇచ్చాడు. అందుకు అతన్ని సత్కరిస్తున్నాం’ అని అన్నారు.

దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ….ఓవర్సీస్‌తో పాటు అన్ని చోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు.. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్‌మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను.

పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను. సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోస పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్‌గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్’ అంటూ ఆయన ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ‌వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం యూనిట్ బాణాసంచా కాలుస్తూ వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.


‘వకీల్ సాబ్’ రివ్యూ.. పవర్‌స్టార్ విశ్వరూపం

చిత్రం: వకీల్‌ సాబ్‌,
నటీనటులు: పవన్‌కల్యాణ్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్‌, నరేశ్‌,
సంగీతం: తమన్‌,
నిర్మాత: దిల్‌రాజ్‌,
సమర్పణ: బోనీకపూర్‌,
రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్‌,
బ్యానర్‌: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్‌,
విడుదల: 09-04-2021

రేటింగ్: 3.5/5

తెలుగు హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ని పెంచాయే తప్ప… ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. రాజకీయాల్లో బిజీగా మారడంతో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. హిందీలో విజ‌య‌వంత‌మైన ‘పింక్’ సినిమా రీమేక్‌గా త‌న రీఎంట్రీ సినిమా ‘వ‌కీల్‌సాబ్‌’ని ప్రకటించ‌డంతో ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూశారు. ప్రచార చిత్రాలు సైతం సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి. మూడేళ్లుగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు(ఏప్రిల్ 9) థియేటర్లలో అడుగుపెట్టిన ‘వకీల్ సాబ్’ అంచనాలను అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం…

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు నివేదా థామస్ (పల్లవి), అంజలి (జరీనా), అనన్య (దివ్య నాయక్) నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఓరోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా క్యాబ్ సడెన్‌గా ఆగిపోతుంది. వీరిపై కన్నేసిన ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) కొడుకు వంశీ తన స్నేహితులతో కలిసి వాళ్లకు మాయమాటలు చెప్పి ఓ రిసార్ట్‌కి తీసుకెళ్తాడు. అక్కడ పల్లవికి వంశీ నుంచి చేదు అనుభవం ఎదురవుతుంది. తప్పించుకునే క్రమంలో వంశీని మందు సీసాతో కొట్టిన పల్లవి తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది.

ఎంపీ రాజేంద్ర తన పలుకుబడి ఉపయోగించి ఈ ముగ్గురు యువతులపై ఎదురు కేసు పెట్టిస్తాడు. ప్రాసిక్యూషన్ లాయర్ నంద (ప్రకాష్ రాజ్) సాయంతో వీళ్లని వ్యభిచారులుగా చిత్రీకరించి పల్లవిని జైలుకు పంపిస్తాడు.. అయితే పల్లవిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు జరీనా, అనన్య ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతుంది. ఆ సంద‌ర్భంలోనే స‌త్యదేవ్ అలియాస్ వకీల్‌సాబ్ (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) గురించి తెలుసుకుని ఆయ‌న సాయం కోరతారు. వాళ్ల ప‌రిస్థితిని చూసి రంగంలోకి దిగిన వకీల్ సాబ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? ఈ ముగ్గురు అమ్మాయిల్ని కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అసలు నిందితులను చట్టానికి ఎలా పట్టించాడు? అసలు వకీల్ సాబ్ నేపథ్యం ఏంటి? అన్నది థియేటర్లలో చూడాల్సిందే..

సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సంఘటనలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. అమ్మాయి న‌వ్వినా, ఒకరిని ట‌‌చ్ చేస్తూ మాట్లాడినా, ఒంట‌రిగా వెళ్లినా మ‌రో వంక‌తో చూసే ధోర‌ణి గురించి ఇందులో హీరో చెప్పిన విష‌యాలు ఆలోచ‌న రేకెత్తిస్తాయి. ఇలా జ‌ర‌గొద్దు… జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఓ బ‌ల‌మైన సందేశాన్నిస్తాయి. మ‌గువా… పాట‌తో సినిమా మొద‌ల‌వుతుంది. మూడు భిన్నమైన కుటుంబాల నుంచి అమ్మాయిలు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకోవ‌డం కోసం న‌గ‌రానికి చేరుకోవ‌డం, ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆస‌రాగా నిల‌వ‌డం వంటి స‌న్నివేశాల‌తో ఆ పాట సాగుతుంది. ముగ్గుర‌మ్మాయిల‌కి ఎదురైన సంఘట‌న‌ల త‌ర్వాత వ‌కీల్‌సాబ్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి క‌థ వేగం పుంజుకుంటుంది. స‌త్యదేవ్ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, పల్లవి కోసం కోర్టు వాదించే సన్నివేశాలు సినిమాకే హైలట్‌గా నిలిచాయి.

ఫస్టాఫ్‌లో పవన్ అభిమానుల్ని అల‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌న్నివేశాలుండగా.. సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామా సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సత్యదేవ్, నందా వాద ప్రతివాదనలతో సన్నివేశాలను రక్తి కట్టించారు. హిందీ చిత్రం ‘పింక్‌’కి రీమేక్ అయినప్పటికీ దాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌కి త‌గ్గట్టుగా తీర్చిదిద్దిన విధానం, అభిమానుల్ని అల‌రించేలా వాణిజ్యాంశాల్ని జోడించిన తీరు మెచ్చుకుని తీరాల్సిందే. హీరో పాత్రను బలంగా ఎలివేట్ చేసినా కథ పక్కదారి పట్టకుండా దర్శకుడు శ్రద్ధ తీసుకున్నాడు.

చీడ పురుగు మ‌గ‌వాడి మెద‌డులో పెట్టుకుని… మందు ఆడ‌వాళ్ల మొహం మీద కొడ‌తాం అంటే ఎలా? అంటూ సాగే సంభాష‌ణ‌లు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొలిటిక‌ల్ ఇమేజ్‌కి తగినట్లుగా కూడా ఇందులో కొన్ని డైలాగులు జోడించారు. ‘ఆశ‌యం కోసం ప‌నిచేసేవాడికి గెలుపు ఓట‌ముల‌తో ప‌ని ఉండ‌దు’ అంటూ పవన్ రాజకీయ నేపథ్యాన్ని పవన్ టచ్ చేశారు. పొలిటిక‌ల్ ఇమేజ్ ఈ సినిమా విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌‌కి బాగా క‌లిసొచ్చింది.

వ‌కీల్‌సాబ్‌ పాత్రలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పూర్తిగా ఒదిగిపోయారు. కోర్టులో అమ్మాయిలకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. కోర్టు సన్నివేశాల్లో పవన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నివేదా, అంజ‌లి, అన‌న్య వారి పాత్రల్లో జీవించారు. నందా పాత్రలో ప్రకాశ్‌రాజ్ న‌ట‌న సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చింది. ద‌ర్శకుడు శ్రీరామ్ వేణు ముందు నుంచి చెప్పినట్లుగానే తన పనితనంగా అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్‌కి వెళ్లేదనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని మైనస్‌లున్నా పవన్‌ కళ్యాణ్ వాటన్నింటినీ కనిపించకుండా చేశారు. థమ‌న్ పాట‌లు, నేప‌థ్య సంగీతం, పి.ఎస్‌. వినోద్ కెమెరా ప‌నిత‌నం సినిమాకి అద‌న‌పు ఆకర్షణలుగా నిలిచాయి. నిర్మాణ పరంగా దిల్‌రాజు టేస్ట్ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. మొత్తం ‘వకీల్ సాబ్’ అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.


అక్కడ పవన్ ఆటిట్యూడ్ నచ్చింది: రేణుదేశాయ్

మూడేళ్లు వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’గా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9వ తేదీ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలై ఒక్క రోజులోనే రికార్డులు కొల్లగొట్టింది. తాజాగా ఈ ట్రైలర్ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన మనసులో మాట బయటపెట్టారు.

వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ చూడని పవర్ స్టార్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ నచ్చింది. అమ్మాయి తరపున వాళ్ళ కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన అదరగొట్టేశారు పేర్కొంది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుంది. మొదటి నుంచి చివరి వరకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది’ అంటూ రేణుదేశాయ్ కితాబిచ్చింది. ఆమె స్పందన చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా ఈ ‘వకీల్ సాబ్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తూనే తెలుస్తోంది. బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.